కవయిత్రుల నానీలు – స్త్రీ హృదయ సంవేదన

డా సి. భవానీదేవి
కవిత్వం నిత్యనూతనమైనది.  నిత్యపరిణామశీలం కూడా.  వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యం అనేక రుపాలను మార్చుకుంటూ దేశ కాల పరిస్థితులను బట్టి సమాజ హితానికి అక్షరవర్గ దర్శనం చేస్తున్నది.  గురజాడ ముత్యాల స్వరాల తర్వాత అంతగా ప్రాచుర్యం పొందిన కవితారూపం నానీలే!  నానీల రూపశిల్పి కూడా ఆశ్చర్యపడే విధంగా సీనియర్‌ కవయిత్రుల కవిత్వాన్ని ప్రభావితం చేయటంతో పాటు యువతను కవితామార్గం పట్టించిన ఈ వినూత్న కవితా రూపాన్ని అందుకున్న వారిలో కవయిత్రుల సంఖ్య చాలా ఉంది.  నానీల సంపుటులు ప్రచు రించిన కవయిత్రులు పదిహేడు మందిలో దాదాపు పధ్నాలుగు మంది ఇప్పటికే సాహితీ రంగంలో స్వరాన్ని సుస్థిరం చేసుకున్న వాళ్ళే!  వీరి నానీల్లో అపారమైన వస్తువైవిధ్యం, స్త్రీ అస్తిత్వ వేదన, ప్రపంచీకరణ ప్రభావం, ప్రాంతీయ అస్తిత్వ భావజాలం విస్పష్టంగా కన్పిస్తాయి.
1970 సం నాటికి రచన కవిత సుస్థిర రూపాన్ని సాధించుకుంది మొదలు కవితా రంగంలో స్త్రీల ప్రవేశం ఎక్కువగానే జరిగింది.  1975-85 సంల మధ్య కాలాన్ని అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా ప్రకటించిన నాటినుంచి బలమైన వచన కవితా ధోరణిగా స్త్రీ వాదం తెలుగు కవిత్వాన్ని పెనుమార్పుకు గురిచేసింది.  స్త్రీల స్వీయ అస్తిత్వ పోరాటం, ఆడపిల్ల పుట్టుకను నివసించే భావాలను వ్యతిరేకించటం, ఆడపిల్లలుగా వారిని తయారు చేయటంలో కుటుంబ పాత్ర, పెళ్ళి, కట్నం, భర్తల అధికారం, స్త్రీల సంతానోత్పత్తిలోని వేదనలు, ఆమె మనసు గాయాల పట్ల అవగాహన అంశాలుగా పలుకోణాల్లో రచన కవిత్వాన్ని కవయిత్రులు రచించారు.
నానీలు రూపుదిద్దుకున్నది మొదలు నానీల తొలి కవయిత్రి డా చిల్లర భవానీదేవి నుండి డా పెళ్ళకూరి జయప్రద వరకూ నానీలను సంపుటీకరించిన కవయిత్రుల రచనల్లోని స్త్రీ హృదయ సంవేదన నేటి పరిశీలనాంశం.  తొలి కవయిత్రి నానీలను ప్రముఖ స్త్రీ వాద పత్రిక ‘భూమిక’ తొలిసారిగా ప్రచురించటం గమనార్హం.
స్త్రీ పుట్టుక – బాల్యం – చదువు
నానీల రచనలో దాదాపు కవయిత్రులంతా స్త్రీ జీవితంలోని వివిధ కోణాలను స్పృశించారు.  సమాజంలో స్త్రీ హృదయ సంవేదన వివిధ దశల్లో ఎలా వ్యక్తమౌతుందో గమనిద్దాం.  ఆడ శిశువుల పుట్టుకను స్కానింగు ద్వారా నిరోధించటం, వాళ్ళు పుట్టాక అలక్ష్యంతో చంపేయటం వంటి అమానుష కృత్యాలు చాపకింద నీరులా చురుకుగా ప్రవహిస్తున్న నేటి సమాజంలో ఆడపిల్లల జననాల రేటు, పురుషుల జననాల రేటుకు సమానంగా లేక తగ్గిపోతున్నదని సర్వేలు నిరపిస్తున్నై.  మనల్ని మనమే చంపుకుంటున్న, లేదా చంపటానికి ప్రేరేపిస్తున్న ఈ వ్యవస్థలో ప్రాణం పోయల్సిన డాక్టర్లు వృత్తి ధర్మానికి విరుద్ధంగా కంకణం కట్టుకున్న ఈ అకృత్యం గురించి ‘భవాని నానీలు’ లో
”దేశంలో
ఆడపిల్లలే తప్పిపోతున్నారు
డాక్టర్లూ
మీ బాధ్యతకు జోహార్లు!”
బరువైపోతున్న బాల్యం గురించి చెప్తూ కందేపి రాణి ప్రసాద్‌ తన ‘నందివర్థనాలు’ సంపుటిలో పిల్లలు ఎదుర్కొంటున్న ఒంటరితనం గురించి తీవ్ర అసంతృప్తిని ఇలా వ్యక్తం చేశారు.
”స్కూల్లో/మాట్లాడనివ్వరు
మాట్లాడేందుకెవరూ
ఇంట్లో ఉండరు.”
ఇద్దరూ ఉద్యోగాలు చేసే తల్లిదండ్రుల ఇళ్ళలో పిల్లల పరిస్థితికి అద్దం పట్టిన నానీలు కందేపి రాణి ప్రసాద్‌ హృదయలను కదిలించే విధంగా రచించారు.  పిల్లల ఆటలు అటకెక్కి బాల్యం చేజారి పోతోందని ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు.
‘సూరీడు చెంపలు’ నానీల సంపుటి అందించిన యశశ్రీ రంగనాయకి ఆడపిల్లలు పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఉయ్యాలలోంచి మొదలయ్యే వివక్ష గురించి ఆ పాపే పసిగట్టినట్లు వర్ణించటం ఎంత విషాదం!
”ఉయ్యాల్లోనే
విప్పార్చి చూశాను
అమ్మా నాన్నల్లో
శుక్ల కృష్ణ పక్షాలు.”
మన సమాజంలో ఎంత తెలివైన వాళ్ళయినా ఆడపిల్లల్ని పెద్ద చదువులు చదివించటం పట్ల వ్యతిరేకత ఇంకా ఉంది.  దీనికి కారణం పెళ్ళి దగ్గర వచ్చే సమస్యలు.  ఎంత చదివించినా ఆమె వల్ల పుట్టింటికి ఆదాయం ఉండదనే భావన.  అందుకే ఆడపిల్లల ఆశలపై నీళ్ళు చల్లి అంతంత మాత్రం చదువులతో అత్త గారింటికి పంపేస్తారు.
”పెద్ద చదువు
పింగాణి కల
వంటింటి తాలింపు
వీడని వల” (సూరీడు చెంపలు – రంగనాయకి). రంగనాయకి గారి ఈ నానీలో పెద్దచదువును పింగాణి కలతో పోల్చటం చూస్తే ఆ కల ముక్కలై పోయేదే అని సూచిస్తుంది.
ఆధునిక విద్యావిధానంలో పిల్లలు కూలీల్లా బండెడు బరువుల్ని వెస్తూ స్కూళ్ళకు పోవటం గురించి అంతా బాధపడ్తనే ఉన్నారు.  అలవాటు పడిపోతున్నారు.  ఎన్నెన్ని విద్యాసంస్కరణలు జరిగినా పరిస్థితిలో మార్పులేదు.  అందుకే కోపూరి పుష్పాదేవి ‘పుష్పరాగాలు’ సంపుటిలో
”వస్తున్నారు చూడు
వాళ్ళు ముఠా కూలీలా?
కాదు
బడిపిల్లలు.”
ఇదే భావాన్ని ఝాన్సీ కె.వి. కుమారి అక్షర బిందువుల్లో బాల కార్మికుల రూపంలో ఇలా వర్ణించారు.
”వాడి బాల్యం
నీ కార్ఖానాలో నలిగింది
వాడికిక
జీవితం ఏం మిగిలింది?”
ఇక్కడ బాలల్లో అమ్మాయిలు కూడా ఉంటారు.  ఇది ఒక నిరంతర వేదన.
ఆడపిల్లని పెంచేటప్పుడే ఆమె నవువ, నడక, మాట, ఆట అన్నీ అదృశ్య లక్ష్మణ రేఖల ద్వారా అదుపు చేస్తారు.  వాళ్ళ ఆటలు అన్నాలాటలు, బొమ్మాలాటలకే పరిమితం.  అవి భవిష్యత్‌లో వారి జీవితానికి రిహార్సల్స్‌లా ఉంటాయి.
”నాడు బొటన వేళ్ళు
నేడు లేత కాళ్ళు
ద్రోణు డొస్తున్నాడు
బుదియ పారిపో ..”.
అంటూ ఝాన్సీ కె.వి. కుమారి లేత జీవితాల దోపిడీని అక్షరీకరించారు.
ప్రేమ – పెళ్ళి
కవయిత్రుల నానీల్లో ఆడపిల్లలు ప్రేమపేరిట వంచింపబడటాన్ని నిరసిస్తూ అవగాహన పెంపొందే కవిత్వాన్ని రచించారు.  టీనేజి ప్రేమలు, యసిడ్‌ ప్రేమలు, కత్తిపోట్ల ఉన్మాద ప్రేమలు, వంచన, ఆకర్షణ నింపుకునే ప్రేమలపట్ల సహజంగానే కవయిత్రులు స్పందించారు.  ఇవి సమాజ పోకడలు… దర్పణాలు… అవే నానీలైనాయి.  ఆడపిల్లల్ని అమ్ముకోవటాన్ని నిరసిస్త బండారు సుజాతా శేఖర్‌ ఇలా ఆక్రోశించారు.
”నేటి మహిళ
మేటి మహిళ
ఆడపిల్ల అమ్మకమా? 
సిగ్గు సిగ్గు ” (జొన్న కంకులు)
హైటెక్‌ సంస్కృతిలో ఆడపిల్లల మధ్య స్నేహమా… ఆకర్షణా… మూలాల్లోకి ఆలోచింప జేసే మరో నానీ… భవానీ దేవి రచించారు.
”నువ్వు మాట్లాడేది
స్నేహం గురించే
నీస్పర్శ మాత్రం
జెండర్‌ను గుర్తు చేస్తోంది.(భవాని నానీలు). స్త్రీ కోరుకునేది స్థిరమైన ప్రేమగానీ, ఆస్తినీ అందాన్నీ కాదు.  ఎన్‌. అరుణ ‘గుప్పెడు గింజలు’ సంపుటిలో
”నాకు ప్రేమ
కొంచమైనా చాలు
కానీ
స్థిరంగా మాత్రం ఉండాలి.- అంటూ స్త్రీ కోరుకునేది నిలిచి వెలిగే ప్రేమ అని నొక్కి వక్కాణించారు.
నేటి వివాహ వ్యవస్థ పట్ల చాలామందికి విశ్వాసం సన్నగిల్లి పోవటానికి కారణం పెళ్ళిళ్ళు ఆర్థిక లావాదేవీలతో ముడి పడటం….  ఈ వ్యాపార సంస్కృతిలో జరిగే పెళ్ళిళ్ళలో ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఇటు కూతురినీ, అటు డబ్బున పోగొట్టుకోవలసి రావటం దురదృష్టకరం.  ఆడపిల్ల పెరుగుతున్న కొద్దీ తాను ఈ ఇంటికి చెందననీ, మరో ఇంటికి వెళ్ళాలనే బాధ వెన్నాడుతూనే ఉంటుంది.  పుట్టి పెరిగిన ఇల్లు తన సోదరులదైనప్పుడు తనది మాత్రం ఎందుకు కాకుండా పోతోందో అర్థం కాని పరిస్థితి.  చదివి ఉద్యోగస్తురాలయిన స్త్రీ కట్నం మార్కెట్‌లో బంగారుబాతు.  పోగుల విజయశ్రీ ‘పూలగుత్తులు’ సంపుటిలో
”కట్నం తెచ్చేది
ఒకసారి బాపతు
ఉద్యోగయితే
బంగారు బాతు” – అనటంలోని వ్యంగ్యం ఇదే! డబ్బుతో ఆడపిల్లని తూచటమే దీనికి కారణం.  రూపం మార్చుకుంట కొత్త పోకడలు పోతున్నా సమస్య మూలాలు మారవు.  ‘గోరంత దీపం’ లో అనిసెట్టి రజిత
”గెలిస్తే బతుకుతుంది
ఓడితే చస్తుంది
పెళ్ళనే యుద్ధంలో
ఆడపిల్ల” – అంటారు.  పెళ్ళి యుద్ధం అయితే చావో బతుకో తెలీని లాటరే.  ఇలాంటి వేదనాత్మకమైన మరో అంశం ఏమిటంటే స్త్రీలు అనాదిగా ఎంతో పవిత్రంగా భావించే మంగళ సత్రమే ఆమె పాలిటి ఉరితాడు కావటం.  డా|| ఎమ్‌. విజయశ్రీ ‘ప్రాణం-ప్రభావం’ సంపుటిలో
”మా౦గల్యం
మంత్రించిన తాడు
దానితోనేగదా
ఉచ్చు బిగిస్తాడు”- అంటూ వివాహ తంతుని ఎద్దేవా చేస్తారు.  విలువ ఇవ్వలేనప్పుడు ఈ తంతులతో ఉపయెగమేముంది మరి.  రోజూవారీ జీవితంలో కూడా ఆడపిల్లలు అత్తింట గానుగెద్దుల్లా మారిపోతారు.  తోటి మనిషిగా కూడా గుర్తింపబడని పరిస్థితిలో ఆమె బందీగ మారిపోతుందంటారు నాంపల్లి సుజాత ‘నెమలీకలు’ లో.
”జన్మ ఖైదుకు
అర్థం తెలుసా’
పెళ్ళి చేసుకో
అదే తెలుస్తుంది” ప్రేమ పేరుతో దగాపడే స్త్రీల గురించి త్రివేణి ‘తూనీగలు’ ఎగరేశారు.
”గుచ్చుకున్నాకే
తెలిసింది
నవ్వే గులాబీకి
కన్పించని ముళ్ళుంటాయని”.
వంచింపబడినాకే పురుషుల నైజాలు స్త్రీలు తెల్సుకోవటం అనాది చరిత్రే!
స్త్రీల వైవాహిక జీవనం
పెళ్ళి తర్వాత స్త్రీ జీవితం పెను మార్పుకు లోనవుతున్నది.  ఆమె వలస జీవనవేదన ఇక్కడే ప్రారంభమౌతుంది.  పుట్టింటికే అతిథిగా వచ్చే ఆమె జీవన విషాదం గురించి డా|| సి. భవానీదేవి ఒక నానీ ఇలా అందించారు.
”వివాహమా!
ఎంతపని చేశావు
నన్ను పుట్టింటికి
అతిథిని చేశావు”(భవానీ నానీలు)
ఇది ప్రతి స్త్రీ జీవితంలోని అనుభవ వ్యధ.  ఒక స్త్రీ ఏ పురుషుడ్ని నమ్ముకుని అతనివెంట నడిచి వెళ్ళిందో అతడే వికటాట్ట హాసం చేస్తూ ఆమెను డబ్బుకోసం దహనం చేస్తుంటే          అమానుష దారుణకాండకు ఎందరికి శిక్షపడుతోంది.  దానికి సాక్షులెవ్వరు?
”ప్రతి వరకట్నం చావుకు
సాక్షులిద్దరే
కిరోసిన్‌ డబ్బా
అగ్గిపుల్ల…. ”(భవానీ నానీలు)
నోరులేని సాక్షులవి.  ఇంటి కోడలి కన్నీళ్ళ గురించి అనిసెట్టి రజిత దుయ్య పట్టారిలా…
”ఇంట్లో..
ఇంటిచుట్టూ నీళ్ళే
వానా వరదా కాదు
కొత్త కోడలి కన్నీళ్ళు” (గోరంత దీపాలు)

కన్నీళ్ళ వెతల కాపురంలో అగ్ని ప్రవేశం చేసిన అమ్మాయి మరణ వాఙ్మూలంలో కూడా భర్తల్ని కాపాడ తారెందుకో? ఏ బలహీనత, బెదిరింపో వారికా పరిస్థితి కల్పిస్తుంది.
”నీ చేతిలో
సజీవ దహనమౌతున్నా
తప్పంతా
తనదేనన్నది… పిచ్చిది…” (నాంపల్లి సుజాత.. నెమలీలు)
అప్పుడైనా తన మీద హింస జరిపిన వారిమీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోదు స్త్రీ.
డా|| పెళ్ళకూరి జయప్రద ఇటీవల ‘ఆలకించే అక్షరం’ అనే నానీల సంపుటి తెచ్చారు.  అందులోని ఒక నానీలో
ఆత్మహత్యకు
కారణాలు రెండు
ఉద్రిక్త క్షణం
నిరాశాగ్ని కణం.
ప్రముఖ సైకాలజిస్టులు కూడా అంగీకరించిన నిరాశాక్షణం ఆత్మహత్య.  ఆ ఒక క్షణం ఆ ఫిట్‌ ఆఫ్‌ యంగర్‌నుండి వాళ్ళని కాపాడగలిగితే ఇంక జీవితంలో ఆత్మహత్యకు పూనుకోలేరని చెప్తారు.  ఉద్రిక్త క్షణంలో నిరాశాన్ని కణం రగిలితే జీవితం ముగియక ఏమవుతుంది.  స్త్రీల జీవనంలో రోజూ పేపర్‌ వార్తలివే!
సంప్రదాయం, పాతివ్రత్యం పేర స్త్రీలని అణచివేసి సంకెళ్ళుగా వాటిని మార్చటం సమాజ విధానం. పూజలు, నోముల పేరిట ఆమె సంకెళ్ళ గలగలలు వినండి
”ముదితలా !
అమ్మొ అసాధ్యులు
పూజలు వ్రతాలు
సంకెళ్ళు వేయవోయ్‌” (ఝాన్సీ – అక్షర బిందువులు)
”గృహహింస చట్టం వచ్చినా నిజానికి దాని ప్రభావం కుటుంబాల్లో ఎంత? అందుకే ఝాన్సీ ఇలా వాపోయరు
గృహ హింస చట్టం?
చట్టాలెన్నో!
న్యాయం
నేతి బీరకాయలో నెయ్యే చెల్లీ ”(అక్షర బిందువులు)
స్త్రీల చాకిరీకి గుర్తింపు లేదు.  ఆమె శ్రమ జాతీయదాయంలో లెక్కకు రాదు.  నాంపల్లి సుజాత ‘నెమలీకలు’ లో
లెక్కకు రాదెందుకు
ఆడదాని రెక్కల కష్టం
ఎక్కడైనా
పక్కనేసుడే
అన్నారు.- ఇంటా బయటా విలువలేని శ్రమ ఆమెది.  ఉద్యోగినిగా కూడా కార్యాలయల్లో ఎంత శ్రమించినా తగిన గుర్తింపు రాకపోవటానికి ప్రధాన కారణం జెండర్‌.  స్త్రీల శ్రమ విలువను ఎవరూ చెల్లించలేరు.  ఆధునిక మహిళ ‘సపర్‌ ఉమెన్‌’ అయినా కరివేపాకే!
”కాలుమీద కాలేసుకుని
కాలాన్ని చప్పరిస్తున్నాడు
చాకిరీనై
చిక్కాగా” (రంగనాయకి – సూరీడు చెంపలు).
వాడు చప్పరించే కాలం ఆమె చాకిరీ – ఆమె ప్రాణం  అనే భావ ప్రతీకతో ఈ నానీ గుండెల్ని పిండేస్తుంది.
వృద్ధాప్యదశ
స్త్రీలు చాకిరీ వల్ల త్వరగా అలిసి పోతారు.  వృద్ధాప్య లక్షణాలు త్వరగా వచ్చేస్తాయి.డా|| వై.కృష్ణకుమారి వ్యంగ్యంగా..
”స్త్రీలు తొందరగా
వృద్ధులవుతున్నారెందుకు?
లేడీస్‌
ఫస్ట్‌ కదా!”
జీవన వైరాగ్యం కూడా స్త్రీలకే త్వరగా వస్తుంది.  ఆధునిక సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే మరో సమస్య ‘బీగము’ భర్తకి మరో భార్య ఉండడం.
”ఇద్దరు హీరోయిన్లు
టి.వి. సీరియల్లో
ఎంతోమందికి
జీవితంలో కూడా”
ఇది ఏ స్త్రీ భరించలేని వేదన.  స్త్రీకి మెనోపాజ్‌ సమస్యలు వచ్చినప్పుడు
”భార్య మారింది
అంటాడు మగాడు
ఋతు విరతిని
మర్చిపోయి”- అన్నారు  డా|| పెళ్ళ కూరి జయప్రద.  మర్చిపోవటమనే కన్నా పట్టనితనమే అన్పిస్తుంది.  స్త్రీల ఆర్థిక పరాధీనత చాలా సమస్యలకు వెతలకు మూలం అన్పిస్తుంది.  ఆమె భర్త ఆగడాన్ని లేదా ఇతర కుటుంబ సభ్యుల హింసను భరించటానికి ఇదే ప్రధాన బలహీనత.  భర్త ఒక వ్యవస్థ స్వరూపం.  వివాహ బంధం.  మేడిపండులా ఉండే ఆ భర్తను కోల్పోయిన స్త్రీల పరిస్థితిని నానీల కవయిత్రులు దృశ్యీకరించారు అక్షరాల్లో.
చిన్నప్పటినుంచే స్త్రీలు ధరించే బొట్టును భర్తకి ప్రతీకగా భావించటం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేశారు నా౦పల్లి సుజాత ‘నెమలీకలు’ సంపుటిలో
పుట్టుకనుండే
నుదుట సూర్యుడు
మధ్యలో అస్తమిస్తే ఎలా?
చనిపోయిన నాన్నను అమ్మ కళ్ళలో చూశారు ఈ కవయిత్రులు. నాన్నకోసం వెదుకుత డా|| ఎమ్‌. విజయశ్రీ నానీలో.
”నాన్న కోసం
ఎక్కడని వెతకను?
హమ్మ
అమ్మ కళ్ళల్లో దొరికాడు”
చనిపోయిన భర్తను కళ్ళల్లో దాచుకునే స్త్రీల కన్నీటి కథ ఇది.  ఆయన తన కిచ్చిన ఆస్తి జీవనదులేగా మరి!
కందేపి రాణిప్రసాద్‌ స్త్రీలకన్నీటి గురించి ఇలా అన్నారు
”స్త్రీల కళ్ళల్లో
కన్నీటి కాపురాలు
బహుశా
అందంగా ఉన్నాయని కాబోలు” (నంది వర్థనాలు)
అమ్మ
కవిత్వం అమ్మ గురించి కలవరిస్తూనే ఉంటుంది.  అమ్మ త్యాగం, సేవ, ప్రేమ తెల్చుకుంటూ తపిస్తూనే ఉంది.  నానీల కవయిత్రులు కూడ అమ్మ గురించి ఆవేదనా స్వరంతో ఆర్తిగా పలకరించారు.
”అమ్మను వర్ణించే
పద్యం ఉందా?
అమ్మే ఒక మహా
పద్యం కదా” – అన్నారు శారదా అశోక వర్ధన్‌ ‘శారద బాణీలు’ లో
 అవసరం తీరాక అమ్మని ఎలా చూస్తున్నాం.
”చీపురు కూడా
అమ్మ లాంటిదే
అవసరం తీరగానే
వాటి స్థానం మూలకే” (పూల గుత్తులు – విజయశ్రీ)- లాలించి జోలపాడిన తల్లి పిల్లలచే బయటకి నెట్టబడటాన్ని నానీల కవయిత్రులు తీవ్రంగా విమర్శించారు.  పసివాళ్ళుగా ఉన్నప్పుడు అమ్మకోసం ఆరాటం గురించి భవాని నానీ ఒకటి.
”పసితనంలో
అమ్మ ఎప్పుడూ నాదే
పెద్దయ్యక మాత్రం
వాడిది.”
అందరినీ పెంచిన తల్లిని వృద్ధాప్యంలో అంతా కలిసి చూడలేని స్వార్థ పూరిత వ్యవస్థ ఇది.  నవమాసాలు మొసి కనిపెంచిన తల్లి పేరు ఏ రికార్డుల్లోకి ఎక్కదు.
”తల్లినైనప్పుడల్లా
పునర్జన్మించా
వాళ్ళెదికాక
చాలామార్లు మరణించా” (జయప్రద – ఆలకించే అక్షరం)
”అమ్మ పరిస్థితి పట్ల ఆవేదన ఇది.
ఫ్యామిలీ ఫోటోకు
దుమ్ము పట్టింది
తుడిస్తే
అమ్మ ముఖమే మిగిలింది” (ఎన్‌. అరుణ – గుప్పెడు గింజలు)
కుటుంబ సంబంధాల్లో మిగిలేది అమ్మ ప్రేమ ఒక్కటేనన్న భావం.
ప్రతిఘటనా స్వరం
స్త్రీ జీవన దశలన్నింటిలో ఎదుర్కొనే సమస్యల్నీ వివక్షల్నీ ఎదుర్కోవాలని పిలుపిచ్చారు నానీల కవయిత్రులు.
”గాంధీ వారసురాల్ని కాదు
ఒక చెంప కొడితే
ఆ చెంపా ఈ చెంపా
వాయిస్తా.” (నెమలీకలు – నాంపల్లి సుజాత).
అంటూ సహనం పేరుతో అణగారి పోవటాన్ని సహించని శపధం చేశారు సుజాత.  పెళ్లి స్త్రీ పురుషులిద్దరికీ అవసరమ౦టూ హెచ్చరించారు శారదా అశోక వర్థన్‌.
”పెళ్ళి లేకపోతే
ఆడపిల్ల బతకలేదా?
మరయితే
మగాడి సంగతో?”  (శారద బాణీలు)
స్త్రీల కన్నీరు చిందితే భూమికి మంచిది కాదంట యశశ్రీ రంగనాయకి తీవ్రంగా స్పందించారు.
”నేల మూడొంతులుబ్ మా కన్నీరే
ఇంకా ఏడిపిస్తే
మ్యాప్‌నే ముంచేస్తా”  (సూరీడు చెంపలు)
అ౦టూ స్త్రీల కన్నీటిని అంతం చేయలన్నారు.  చురుకైన హెచ్చరికనిచ్చారు.
సమాజం
నానీల కవయిత్రులు సమాజం గురించి, దేశం గురించి, దిగ జారిపోతున్న నైతిక విలువల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
”ఈనాడందరికీ
పెద్ద జబ్బు …
అయచితంగా
రావాలి డబ్బు”
అంటారు పొన్నరు హైమవతీ శాస్త్రి. ‘తేనె చినుకులు’ సంపుటిలో ఉమ్మడి కుటుంబం పట్ల ఆసక్తిని ప్రకటించారు.
జీవితం
నానీల్లో జీవితానికి చాలా వ్యాఖ్యానాలున్నై.  వృధ్దాప్యం కమ్ముకొస్తున్న వేళ
”ఎన్నో సార్లు
పార్లరుకు వెళ్ళాను
ఏం లాభం
ముసలితనం గెలుస్తూనె ఉంది.”  (అక్షర స్వరాలు)
అంటారు డా|| వై. కృష్ణకువరి.  అద్భుత తాత్విక నేపధ్యాన్ని అందించిన నానీ అరుణది. 
”కిటికీ లోపల
నేను ఖైదనే
బయట
నీది మరీ పెద్ద జైలు” (గుప్పెడు గింజలు)
మర్చిపోతున్న మానవ సంబంధాల అడవిలో
”నాల్గర్రల్లో
వెదుకుతున్నాను
మరి ఏ అర్రలో
నేనున్నానో” (షెహనాజ్‌ ఫాతివ)
అంట అన్వేషణా స్వరాన్ని ప్రకటించారు షెహనాజ్‌.
”మా నాన్న
చెరుకు పండించేవాడు
అందుకే
అనుబంధాల్లో అంత తీపి”
అంట ‘అరుణ’ మర్చి పోతున్న అనుబంధాల పట్ల మమకారాన్ని రగిలించారు.
ముస్లిం స్త్రీల మనోభావాలను ప్రకటించిన షహనాజ్‌
”పరకాల జైలులో
బందీని
నిరపరాధిని
నాకెందుకీ శిక్ష?”- అని ప్రశ్నించారు.  ఇంత జీవితంలో మనలోకి మనం ప్రయణించే సందర్భం గురించి డా|| ఎమ్‌. విజయశ్రీ
”రోజూ
ఎందరినో కలుస్తుంటాను
నన్ను కలవటమే
కుదరటం లేదు.”
నిజమే! మనం జీవించటం లేదు.  బతుకుతున్నాం మరి!
”మృత్యువంటే
భయంలేదు నాకు
జీవితమే
నిర్జీవిని చేసింది.”- అంటూ నిర్జీవమై చైతన్యం లేకపోవటాన్ని ఆవేదనగా అందించారు షెహనాజ్‌ ఫాతిమ.
ముగింపు
ఇలా… నానీలు కవయిత్రుల కలాల్లో స్వీయ జీవన సంవేదనన, స్త్రీ హృదయ వ్యధలను శక్తివంతంగా పలికించి ప్రతి మనిషిని ఆలోచింప జేశాయి.  కవితా రూపం ఏదైనా కవిత్వం ఉంటే అందరినీ చేరుతుంది.  ఆ జీవన నేపధ్యం మనల్ని ఆలోచింప జేస్తుంది.  స్త్రీ హృదయ సంవేదనన విస్పష్టంగా విభిన్న కోణాలలో ప్రకటించి వినూత్న కవితా రూపమై దశాబ్దకాలంగా కవిత్వరంగంలో సంచలనం సృష్టిస్తున్న నానీలను సుసంపన్నం చేసిన నానీల కవయిత్రులందర్నీ అభినందిస్తున్నాను.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

One Response to కవయిత్రుల నానీలు – స్త్రీ హృదయ సంవేదన

  1. ప్రతిభా సంపన్నమైన కలాల నుండి వెలువడే నానీలు ఎంతో ప్రభావవంతంగా ఉంటున్నాయి. అలాంటి చక్కని నానీలపై చేసిన సమీక్ష ఇది. కుప్పలు తెప్పలుగా వస్తున్న నానీలలో కొన్ని ఒకవైపు ఆ ప్రక్రియను ఖూనీ చేస్తున్నా, మరోవైపు పైన పేర్కొన్న కవయిత్రులు ఊపిరి నింపుతుండడం అభినందనీయం. అంతే కాకుండా, “గోరంత దీపాలు”, “సూరీడి చెంపలు”, “తూనీగలు”, “నంది వర్ధనాలు” వంటి మకుటాలతో ఆ సంపుటాలకు వన్నె తెస్తుండడం మరింత అభినందనీయం. సమీక్షకురాలు, స్నేహమయి భవానీదేవి గారికి నా హార్దికాభినందనలు.
    – డా|| ఆచార్య ఫణీంద్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.