డాక్టర్‌ ఆనందీబాయి జోశి (స్త్రీ విద్యా విజయ దుందుభి!!!) – భండారు అచ్చమాంబ

(ఏప్రిల్‌ సంచిక తరువాత)

2. ఇక ఈ హిందూ దేశంలో అందుకు తగిన సౌకర్యములు లేవా అను రెండో ప్రశ్నకు జవాబు :- లేవని నిష్కర్షగా మనవి చేయుచున్నాను. కాని ఉన్న సౌకర్యాలు కూడా సులభ సాధ్యం కావని నా అభిప్రాయం. చెన్నపురి (చెన్నై)లో ఒక సర్వకళాశాలయు, అన్ని రాజధానులలోను మంత్రసాని తనము నేర్పించే తరగతులు ఉండటం నిజమే. అయినా అక్కడి బోధకులు (టీచర్లు) ప్రాచీనాచారాలలో ప్రవీణులవటం చేతను, కొంతవరకు సవిష్ణులగుట వలన అక్కడ ఇవ్వబడుతున్న విద్య అసంపూర్ణమయినదిగాను, లోపాలతో కూడినదిగాను ఉంది. ఇలా అనటం ద్వారా ఆ బోధకుల (టీచర్ల) తప్పులను ఎంచాలని మాత్రం కాదు. అది పురుషుల స్వభావమని మనవి చేసాను. వీరి బదులుగా ఆ స్థానాలను/లో స్త్రీలు అలంకరించువరకు/తీసుకునేవరకు (స్త్రీలు చేరేవరకు) ఇట్టి ఇబ్బందులకు మనం ఓర్చుకోవాలసి ఉంటుంది.

నేను క్రైస్తవురాలను కాను, బ్రాహ్మణమతావలంబినీకాను కాబట్టి హిందూ మతాభిమానము కలిగి అట్టి ధర్మాలను ఆచరిస్తూ ఈ దేశంలో ఎక్కడైనా పాఠశాలకు పోయి చదువుకొనుట నాబోటి స్త్రీకి కష్టం. ఇంగ్లీషు వారి దుస్తులు తొడుక్కుని తిరిగే మతాంతరులయినా ఇక్కడి ప్రజలు నన్ను జూసినట్లు ఊరికే ఎగాదిగా చూడరు. నగరాలలోను, బయటా నాలాంటి హిందూ యువకులకు కలుగుతున్న దురాక్షేపణలు, దుర్వదంతులు స్వదేశీయులైన క్రైస్తవ స్త్రీలకు ఏమాత్రం కలగటం లేదు. రైలుబండిలోకాని, వీధులవెంటకాని నేను ఒంటరిగా పోయినపుడల్లా ప్రజలు కొందరు నన్ను చేరి నా ముఖం వంక అట్టే చూస్తూ కొంటె ప్రశ్నలతో నన్ను వేధిస్తుండేవారు. ఈ పొడిమాటలకంటె కొన్ని ఉదాహరణల వలన నిజం మీ మనసులకు నాటేలా చెప్తాను వినండి.

కొన్ని సంవత్సరాల క్రిందట నేను బొంబాయి నగరంలో ఉన్నపుడు పాఠశాలకు పోతుండే దాన్ని. చేతిలో పుస్తకాలు పట్టుకుని నేను బడికి పోయేటపుడు కొందరు కిటికీలగుండ నన్ను చూస్తున్నవారు, మరి కొందరు బండ్లెక్కి పోతూ నన్ను చూసేవారూ, వీధులలో తిరుగుతుండే ఇంకొందరు పెద్ద పెట్టున నవ్వుతూ ”ఇదేమి వింత! కాళ్ళకు మేజోళ్ళు, బూట్లు తొడుక్కుని పాఠశాలకెళ్తున్న ఈ పిల్ల యెవ్వతి! దీని వలన కలి అప్పుడే ప్రజల మనసులను ఆవహించిన జాడలు కనిపిస్తున్నవి గదా!” అని నాకు వినబడేట్టుగా కోలాహలంగా అంటుండేవారు.

ఓ మాననీయ మణులారా! అలాంటి ప్రశ్నలు మిమ్మల్నడిగినపుడు మీ మనసు ఎలా కష్టపడేదో మీరే సులభంగా ఊహించి తెలుసుకోగలరు.

ఒకప్పుడు నేను కొంతకాలం పాఠశాలలో ఉండవలసి వచ్చి భోజనం నిమిత్తం రోజుకు రెండుసార్లు బంధువుల ఇంటికి పోవలసి వచ్చేది. నేనపుడు పోయి వచ్చినపుడల్లా వీధి వెంట వెళ్ళేవారు నా చుట్టూ చేరి కొందరు ఎగతాళి చేయడం ప్రారంభించారు. కొందరు కడుపుబ్బ నవ్వడం మొదలు పెట్టారు. తక్కిన గృహస్థులు గంభీరంగా తమ తమ పనుల్లో కూర్చుని నన్ను చూసి  పిచ్చి పాటలు పాడుతూ నా వైపు రాళ్ళు రువ్వటానికి ఎంత మాత్రం సిగ్గుపడేవారు కాదు. ఇక దుకాణాలవారు, బేరగాళ్ళు నన్ను వెక్కిరిస్తూ అసహ్యకరమైన సైగలు చేయసాగారు. అట్టి సమయంలో నా స్థితి ఎలా ఉండెనో, త్వరగా ఇల్లు చేరుకోడానికి నా మనసెలా త్వరపెట్టెనో దానిని ఊహించి మీరే తెలుసుకోండి.

బొంబాయి నగర వాసుల తీరు అలా ఉండగా బంగాళా (బెంగాల్‌) వారి రీతి ఇక చెప్పటానికీ వీలుగాకున్నది. ఇదంతా చాలా బాధ పడాల్సిన విషయం. గాలిపట్టులకెప్పుడైనా నేను వ్యాయామం కోసం పోయినపుడు ఇంగ్లీషువారయినా నన్నెప్పుడు కన్నెత్తి ఇంత నిబ్బరంగా చూడరు. కాని బెంగాల్‌ వారు తమ దర్పాన్ని వెల్లడిచేసి హాస్యాస్పదం చేస్తూ నన్ను చూసి ”నీ వెవరవు? నీ పేరేమి? నీ ఊరేమి? నీవెందుకెళ్తున్నావు?” అని అపరిచితులు అడగకూడని ప్రశ్నలనడిగి ఆగడం చేసారు. శ్రీరామపురంలో విద్యావంతులని పేరున్న కొందరు స్వదేశ క్రైస్తవులు వివాహితనో, వితంతువునో, దుష్ప్రవర్తనకలదాననో, కులభ్రష్టనో అని అనుమాన పడుతుండేవారు. ప్రియమైన ఓ సభాజనులారా! ఇలాంటి అవినయ ప్రచారాలు స్వదేశ క్రైస్తవులు చేయవచ్చునా? ఎంతమాత్రమూ చేయకూడదు. వీటిని మీకిలా విన్నవించటం మీరు ఈ లోపాలను సరిచేస్తారని, మీలోని కష్టాలనెప్పుడూ ఎరగని వారు వీటినన్నిటిని విన్న తర్వాత అమెరికా దేశానికి నేను పోడానికి ప్రయత్నించడం కేవలం వేడుకకోసం కాదని తెలుసుకుంటారనే కాని, మరో ఆలోచన కాదు.

3. నేను ఒంటరిగా విదేశానికి ఎందుకు పోవలననే మూడవ ప్రశ్నకు జవాబేమనగా – మొదట నేను, నా భర్త కలిసి వెళ్ళాలనే అనుకున్నాము. కాని స్థితిగతులనుబట్టి ఆ ఆలోచన మానుకోవలసి వచ్చింది. మా వద్ద ధనమా చాలినంత లేదు. ఋణమా, చేయటం మాకిష్టం లేదు. ఇదొక్కటే కారణం కాక, ఇంతకంటె ముఖ్యమైనవి అందరిని ఒప్పించదగినవి మరికొన్ని కలవు. అది ఏవనగా నా భర్తగారికి వయోవృద్ధురాలైన తల్లి, పనివారుగా ఉన్న తోబుట్టువులు, తమ్ముళ్ళు ఉన్నారు. వారందరికి సంరక్షకుడు నా భర్తగారే అవటంతో ఆయన నాతో కూడా వస్తే వారు దిక్కులేని వారై, వారి బ్రతుకు భగ్నమై, వారు తీరని దారిద్య్ర బాధలకు లోనవుతారు. నా ఒక్కదాని కోసం అంతమందిని మలమలమాడునట్లు చేయటం ఎంత అమానుషమైన పని! కాబట్టి నేను ఒంటరిగా వెళ్ళాలని నిశ్చయించుకున్నాను.

4. నేను ఇండియాకు (హిందూ దేశానికి) మరల వచ్చినపుడు నాకు బహిష్కారం కలగకపోవునా అన్నదానికి సమాధానం- అలాంటి భయం వలన నేను చలిస్తానని అనుకుంటు న్నారా? నేను దానికి ఆవగింజంతైనా భయపడను. ఇక్కడ ఏ విధంగా ఉన్నానో, అక్కడ కూడా అలాగే ఉండాలని నిశ్చయించుకున్నాను. కనుక నాకు బహిష్కారం ఎలా కలుగుతుంది? నా ఆచార వ్యవహారాలను కాని, ఆహార విహారాలను కాని, వేషభాషలను కాని మార్చుకోవాలని నేను ఎంతమాత్రం అనుకోలేదు. హిందూ యువతిగానే వెళ్ళి, మరల హిందూ మానవతిగానే వచ్చి, ఇక్కడ హిందూ సుందరులతోనే కలిసి ఉండాలని నిశ్చయించుకున్నాను. ఇప్పుడున్న దానికంటె భిన్నంగా ఉండక నా పూర్వులు ఎలా సామాన్యంగా జీవించారో నేనూ అలాగే ఉంటాను. ఇప్పటిలా నేను ప్రవర్తిస్తున్నప్పుడు నా దేశీయులు నన్ను బహిష్కరింప చూస్తారా? అలా అయితే అప్పుడెందుకు? ఇప్పుడే చేయరాదా? అందుకు వారికి సర్వ స్వాతంత్య్రం కలిగే ఉన్నారు. మా మహారాష్ట్ర కుటుంబం ఒక్కటైనా లేని ఈ బంగాళా దేశంలో ఈ స్థలంలో నేనిప్పుడు నివసిస్తున్నాను కదా! నేనిక్కడ నాదేశ ఆచార ధర్మాలను పాటించి ప్రవర్తిస్తున్నానో లేదో ఎవరికి తెలుసు? కాబట్టి ఎన్నడూ జరగకూడనవి జరిగినపుడు మానవ ప్రయత్నాలకు లోబడని వాటి గురించి చింతించక ఉండటమే ఉత్తమం.

5. నాకేదైనా ఇబ్బంది ఎదురైతే నేనేమి చేస్తాననే ప్రశ్నకు జవాబు ఏమనగా : కొందరు మనుషులు ప్రపంచంలో కనపడే దానికంటే అతి భయంకరంగా గ్రంథాలలో కనబడు దురవస్థలను, దుర్దశలను ఉదాహరణగా చూపించి భయాన్ని కల్పించాలని ప్రయత్నిస్తారు. కాని ఈ ఆపదలెంత భయంకరమో అంత అరుదుగా సంభవించేలా విధించబడి ఉన్నాయి. పురుషులుకాని, స్త్రీలు కాని ఏదైనా ఒక పని  చేయబోయినపుడు మొదలు మేలెంచుతారు కాని ఎప్పుడూ కీడెంచరు. ఒక్కొక్కప్పుడు తప్పక కీడులు మూడి మగవారిని కాని, ఆడవారిని కాని భూమిలోనికి అణగద్రొక్కిన యెడల మీకిప్పుడు వృథా చర్చలతో పనేంటి? అవి వచ్చినపుడు అనుభవించి తీరవలసిందేకాని ఆ ఆపదలు రాబోతున్నాయన్నపుడు ఉండే బాధ కంటె వాటిని అనుభవించేటపుడుండే బాధ తక్కువ అవటం జగమెరిగినదే. ఏ విధమయినవైనా ఈ లోకంలో శాశ్వతమైన సుఖాన్ని పొందగలమా అనే అనుమానాన్ని నివృత్తి చేసుకోడానికి ఈ ప్రపంచం మనకు ఎప్పుడూ అవకాశం కలగజేయదు. కాని పైకి కనబడుతున్న సాధనాల అంతరాలకు తగిన సౌఖ్యమును మనుషులెప్పుడూ పొందట్లేదని మాత్రం మనం చెప్పొచ్చు. ఆ సౌఖ్యమనేది కొంతమంది చేరి తమలో తాము నిభాయించుకోదగిన పదార్థం కాదు. అది మన మనసును బట్టి ఉంటుంది. దురవస్థలలోకెల్ల మరణమే గొప్పదని అంటున్నపుడు కొంతమంది దాని రాకకు ఎందుకు సంతోషిస్తారు? మరి కొందరు ఎందుకు దుఃఖిస్తారు? అంతెందుకు? మృత్యువు, దుర్దశ మంచివారికి, చెడ్డవారికి, పుణ్యాత్ములకూ, పాపాత్ములకూ, భాగ్యవంతులకూ, దరిద్రులకూ, దేశదిమ్మరులకూ, గృహస్థులకూ కూడా సమానంగానే వస్తుంది. ఆపత్సమయంలో అందరూ వివశులవటం, కక్ష-ఆవేశంతో ఎవ్వరూ ప్రతిభావంతులు కాకపోవడం సుప్రసిద్ధమే. రానున్న విపత్తును ఎంతటి మనిషైనా అడ్డగించలేడు. ఆపదకూడా ఎప్పుడూ మనని అనుసరించే ఉంది. కాబట్టి వాటి రాకకు ప్రతి మనిషి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఏదైనా ఒక

ఉత్కృష్టమైన పని యొక్క ఫలితం అనుకూలంగా ఉంటే దానిని శ్రద్ధతో నెరవేర్చిన వారి శ్రమని ఘనంగా ప్రశంసిస్తారు. లేక అది ప్రతికూలంగా ముగిసిందా ఆ పని చేసినవారి అవిజ్ఞతని నిందిస్తారు. ఈ విధంగానే అదృష్టం మారి, ఫలము విఫలమైతే లోకం అది అవివేకమని చాటడానికి సిద్ధంగా ఉంటుంది.

ఇంకా కొందరు కూపస్థ మండూకాలలాగా ఇంటిని అంటిపెట్టుకుని ఉండేవారే సుఖభోగులంటారు. కాని, వారికి సుఖభోగాలు ఎలా కలుగుతాయో తెలియదు. అది కోరినప్పుడు అనుభవించడానికి సిద్ధంగా అమర్చబడి ఉన్న పదార్థం కాదు గదా! కొందరికి కొత్తదనమంటే ఇష్టం ఎంత ఎక్కువగా ఉంటుందంటే సౌఖ్యమయినా ఎడతెగనిదిగా ఉంటే దానిలో రుచిలేదని వారు అప్పుడప్పుడు కష్టాలను కోరుకుంటుంటారు. విదేశానికి వెళ్ళడం చెడుపని కాదు. కొన్ని అంశాలను బట్టి ఒక్కచోటే నివసించడంకంటే మేలైన పనని చెప్పవచ్చు. దేశాటనం ద్వారా ఆ యా దేశాల యొక్క, ప్రజల యొక్క స్థితిగతులు బాగా అర్థం అవుతాయి. అలాంటి వానిని తెలుసుకోవడం పట్ల విముఖులమై ఉండగూడదు. అవిజ్ఞతను మనం బుద్ధిపూర్వకంగా అవలంబించడమనేది గొప్ప దోషాలలో ఒకటి. విదేశ యాత్రలను చేయడం ద్వారా మన బుద్ధి వికాసము, జ్ఞానాభివృద్ధి అవటమేకాక అంతరిస్తున్న కళాకౌశలములు జీవించడం కూడా కలుగుతుంది. అందరూ మంచిపనిని/ అవసరమైన దానిని  చేయవలసిందే. ప్రతి మనిషి తన సహజీవులకు చేతనయినంత

ఉపకారము చేయాల్సిన బాధ్యత కలిగి ఉన్నాడు. నరులై పుట్టిన వారందరూ ఇతరుల వలన తమకు కలిగిన ఉపకారమునకు ప్రత్యుపకారం చేసి ఋణ విముక్తులవ్వాలి. పరసీమలో మనకు దిక్కెవ్వరని అడుగుతారా? ఈ విషయమై గోల్డ్‌స్మిత్‌ అను ఇంగ్లీషు కవి చేసిన మహోపదేశమును మనం గమనించాలి. అదేంటంటే ”అంధుల బుద్ధి విశేషాన్ని అనుసరించడం నేర్చుకో. ఎందుకంటే వారెప్పుడూ తమ చేతి ఊతకర్రతో భూమిని తడిమి తెలుసుకోకుండా అడుగుపెట్టరు.” అలాగే నేను సర్వశక్తి సంపన్నుడైన నా పరమపితను నాకు ఊతకర్రగా చేసుకుంటాను. ఆయనే నా మార్గమును పరిశీలించి నన్ను ముందుకు నడిపించుకొని పోవును. దానికంటే మహోత్తరమైన చేతి ఊత నాకింకేమీ కనబడదు.

చిట్టచివరికి నా జాతి వారెవరూ చేయని పని నేనెందుకు చేయాలి? అనే దానికి నేను విన్నవించేదేంటంటే మనం ఒక్కరొక్కరం సంఘానికి చెల్లించాల్సిన ఋణాలు చాలా ఉన్నాయి. వీరీ పని చేసేఋణ విముక్తత కలుగుతుందని వేర్వేరుగా చెప్పటం కష్టం. ఒక పనితో ఒకరికి ఎప్పుడు మేలు కలుగుతుందో దాని వలన అందరికీ మేలు కలుగుతుందనే అనుకోవాలి. ప్రజలందరికీ శ్రేయస్కరమని చెప్పదగిన పనిని చేయడానికి మనలోని వారందరూ ప్రయత్నించాలి. మనుస్మృతితో ”చేయదగిన ధర్మాన్ని చేయక ఉపేక్షించువారు క్షమింపబడకూడని మహా పాతకులు” అని చెప్పబడింది. కావున నాతోటి స్త్రీలెవ్వరూ ఇదివరకు చేయని పనిని నేను కూడా చేయకూడదనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మృతజీవులని ప్రసిద్ధిగాంచిన మన పూర్వీకులకు ఇలాంటి ఊహలు ఎన్నడూ పుట్టి ఉండవు. ఏదీ, నా క్రైస్తవ మిత్రులు నేనడగబోవు ప్రశ్నకు ఏమి జవాబు ఇస్తారో చూద్దాం. ఓ నెచ్చెలులారా! మీ మత ధర్మాలను బట్టి ఏసుక్రీస్తు మీ అందరి కొరకు తన ప్రాణాల్ని బలిచ్చి ఉండకపోతే మీకు పాప విమోచనము కలుగుననుకుంటున్నారా! ఆయన అలా లోకోపకారం చేస్తుండగా వారికి కలిగిన ఘోరమైన దండనకి ఆ మహానుభావుడేమయినా జంకాడా? లేదు. ఆయన జంకినట్టు మీరెప్పుడూ ఒప్పుకోరని నేను నిశ్చయంగా చెప్పగలను. మా పూర్వపు రాజులలో కూడా శిబిమయూరధ్వజుడు మొదలగు వారు పరోపకారార్థం ప్రాణత్యాగం చేయడానికి వెనుకాడలేదు. మనకు విఘ్నమే కలుగునో, ఆపదలే సంభవించునో అని చేయవలసిన ధర్మమును చేయకపోవడం న్యాయం కాదు. మనం చేయవలసినంత ప్రయత్నం చేసి తీరాలి. దాని తర్వాత మనకు జయమయినా సరే అపజయమయినా సరే. మనుషులను మూడు తరగతులుగా విభజించారు. వారిలో అధములు విఘ్నాలు కలుగుతాయనే భయంతో ఏ పనికీ పూనుకోనివారు. మధ్యములు తాము ప్రారంభించిన పనికి మధ్యలో అంతరాయం కలిగినంతనే ఆ పనిని వదిలిపెట్టేసేవారు. ఉత్తములు ప్రారంభించిన దానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా, వాటన్నిటిని ప్రయత్నంతో సాధించి విజయం పొందుతారు.

కష్టాలు ఎంత ఎక్కువగా ఉంటే మనకు ధైర్యస్థైర్యాలు అంత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ప్రారంభించిన దానిని ఎప్పుడూ మానకూడదు. ఇక నా విన్నపము ముగిసింది. ఇంతసేపు ప్రసంగించుట వలన మిమ్మల్ని విసిగించానేమోనని భయపడుతున్నాను. అందుకు మీరు నన్ను క్షమింతురు గాక.”

ఈ ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఆనందీబాయి ఒక క్రైస్తవ గురువుల కుటుంబంతో అమెరికా వెళ్ళాలని నిశ్చయించుకుంది. ఒకానొక హిందూ బ్రాహ్మణ స్త్రీ అమెరికా వెళ్తుందని విని రావ్‌ సాహెబు దాంగేకర్‌ అనునతనికి ఎంతో విచారం కలిగింది. దాంతో అతడు అనేక ప్రయత్నాలు చేసి ఆమె అమెరికా ప్రయాణం ఆపాలని ప్రయత్నించి చూశాడు. కాని అతని ప్రయత్నాలేవీ ఫలించలేదు. దాంతో ఆ పూర్వాచార పరాయణుడు ఆనందీబాయి ఆప్తులకు వ్రాసి వారిచే అమెరికా పోవద్దని ఆనందీబాయికి అనేక ఉత్తరాలను వ్రాయించాడు. కాని వాటివలన ఆమె ప్రయాణం ఆగలేదు! రేపు ప్రయాణమనగా ఆనందీబాయి అక్కవద్దనుండి తమ్మునికి ప్రాణాంతకంగా ఉందని, నీవు తక్షణం బయలుదేరి రావాలని ఉత్తరం వచ్చింది. దానిని చూసి ఆనందీబాయి కొంచెమాలోచించగా ఆ ఉత్తరము నీ ప్రయాణం ఆపడానికి వ్రాసారని, నీ తమ్మునికి నిజంగా ప్రాణాంతకంగా ఉంటే నువ్వు పోయి చూసేవరకు ఉండడని, ఇందు వలన నీవు చేయబోవు మహత్కార్యము మానుట మంచిదికాదని ఆమె మనోదేవత ఆమెకు చెప్పి ఆమె నిశ్చయాన్ని తొలగకుండ చేసింది. ఆహా! దృఢ నిశ్చయమంటే ఇది కదా? చిన్న చిన్న కష్టాలు ఎదురైనంతనే భయపడి మనవాళ్ళు చేసేపనిని వదిలేస్తారు. కాని అట్టి వారు ఆనందీబాయి చరిత్ర చదివి దృఢనిశ్చయమును, సద్గుణమును నేర్చుకొనెదరుగాక.

తర్వాత 1883 వ సంవత్సరం ఏప్రియల్‌ 7 వ తేదీ ఆనందీబాయి కలకత్తా నగరం నుండి పాతాళ లోకానికెళ్ళేందుకు పొగఓడని ఎక్కింది. అప్పుడు ఆ దంపతులిద్దరికి కలిగిన వియోగ దుఃఖం ఇంతని చెప్పడం ఎవరితరం? అయినా వారు తమ సుఖాలను విడిచి స్వదేశ హితానికై కష్టాలననుభవించారు. వారి స్వదేశ భక్తిని ఎంత పొగిడినా తీరదు. దారిలో తోడుగా ఉన్న క్రైస్తవ స్త్రీలు ఆమెను తమ మతంకు త్రిప్పాలని ఎంతగానో బోధించారు. కాని దృఢనిశ్చయురాలైన ఆ అబల వారికి తగిన సమాధానాలనిచ్చి ఆ మతమును కాదనింది. దాని వలన ఆ యువతులు ఆమెను చాలా తిరస్కారంగా చూసారు. ఆమెకు శారీరక అస్వస్థతకు గురైనా అడగక,

ఉపవాసంలో ఉన్నా భోజనం చేయమనక, ఆమె తినదని తెలిసీ మాంసాహారం తింటావా అని ఆమెను పరిహాసమాడి ఎంతో బాధపెట్టారు. ఆనందీబాయి వారింత చేసినా వారిపై కోప్పడకుండా స్వదేశవియోగం, స్వజనవియోగం వలన కలిగిన దుఃఖాన్ని తానే ఆపుకుంటూ, దొరికితే ధాన్యాహారం తిని, దొరకనపుడు

ఉపవాసముండి కాలం గడుపుతూ స్టీమరుపై వెళ్తూ ఉంది. ఆహా! ఇలాంటి స్వదేశాభిమానం, స్వధర్మ అభిమానం కల స్త్రీ సర్వజనుల గౌరవాన్ని అందుకుంటుందనటంలో సందేహముంటుందా! కొంతరు క్రైస్తవ మతబోధకులు మొదట తాము ఎంతో ప్రేమ కలవారిగా కనబడి, తమ మతమును ఇతరులకు బోధిస్తారు. వారు తమ బోధలవలన తమ మతమును అవలంబించరని వారికి తెలియగానే అనేక రీతులతో వారిని అవమానిస్తారు. ధర్మ గురువులైన వారికి ఇది ఎంతమాత్రం తగని పని కాదు. తోటివారు తననలా చూసి సహాయమేమీ చేయకపోయినా ఆనందీబాయి తనకు పరమేశ్వరుడే సహాయకుడని నమ్మి ఉంది. పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే ఇంతటి దృఢ నిశ్చయము, ధైర్యము, భగవంతుని యందు నమ్మకం కలిగి ప్రవర్తించడం ఎంతైనా మెచ్చుకోవలసినది గదా?

ఇలా పొగ ఓడపై (స్టీమరుపై) ప్రయాణం చేస్తూ అనేక ద్వీపాలను దాటి జూన్‌ 18వ తేదీన ఆనందీబాయి అమెరికా చేరింది. అక్కడికి ఆనందీబాయి వస్తోందన్న వార్త విని అప్పటికే కార్పెంటర్‌ దొరసాని ఓడ దగ్గరకొచ్చి ఆనందీబాయికి ఎదురొచ్చింది. అప్పుడు వారిద్దరికి కలిగిన ఆనందం అంతా ఇంతని చెప్పడానికి లేదు. కార్పెంటర్‌ దొరసాని ఆనందీబాయి సద్గుణాలను నేటికీ మరవలేదు. ఇలాంటి స్త్రీలు ఎంతోమందిలో ఒక్కరుంటారని ఆమె అంటుంది.

ఆనందీబాయి అమెరికాలోని న్యూజెర్సీ పట్టణానికి వెళ్ళగా అక్కడ కార్పెంటరు దొరసాని గారి కుటుంబీకులందరూ ఆమెకు చాలా మర్యాదలు చేసారు. వీరింట్లో ఉండే ఆనందీబాయి తన చదువుకు అనుకూలంగా ఉండే స్థలం వెతుక్కుంది. అక్కడున్న నాలుగు నెలలు వృథా చేయక ఆనందీబాయి కుట్టుపని, అల్లికపని, జలతారు పని నేర్చుకుంది. తర్వాత ఆమె ఫిలడెల్ఫియా అనే మహా పట్టణంలో వైద్య విద్యను అభ్యసించడానికి సిద్ధమయింది.

కొందరు పురుషులుగాని, స్త్రీలు గాని తమ దేశాన్ని ఒదిలి పరదేశానికి వెళ్ళిన తర్వాత తమ దేశ ఆచారాలను ఒదిలి ఆ దేశ ఆచారాలనే స్వీకరిస్తారు. కాని మా చరిత్ర నాయిక అలాగాక పాతాళలోకానికి వెళ్ళినా తన దేశ ఆచారాలను మరవక ఆ దేశపు వారికి కూడా వాటిని నేర్పింది. ఆమె తన స్నేహితులకూ, కార్పెంటరు ఇంటి వారికీ మహారాష్ట్ర స్త్రీలలాగా జడలు వేసి, చీరలు కట్టిస్తూ

ఉండేది. తాను న్యూజెర్సీ పట్టణానికి వెళ్ళడానికి ముందు తన స్నేహితులందరికి మహారాష్ట్ర పద్ధతిననుసరించి విందు చేసింది. ఇందుకోసం తనే తమ దేశపు వంటకాలు వండి, భోజనంలో కూర్చోవడానికి పీటలు వేసి, తినడానికి విస్తర్లు, డొప్పలు కుట్టి మహారాష్ట్ర దేశాచార ప్రకారం సకల పదార్థాలు వడ్డించి విందుకు వచ్చిన యువతులకు మహారాష్ట్ర స్త్రీలలాగా చీరలు, గాజులు, కుంకుమ మొదలైనవి అలంకరించి, చేత్తో భోజనం చేసే విధానాన్ని వారికి తెలిపి తాను కూడా వారితో కూర్చుని భోజనం చేసింది.

తర్వాత ఆమెను తీసుకుని కార్పెంటరు దొరసాని ఫిలడెల్ఫియా పట్టణానికి వెళ్ళి అక్కడ ఆమెకు అనుకూలమైన ఇల్లు మొదలైనవి చూసిన తర్వాతే తిరిగి తన గ్రామానికి వచ్చింది. ఆనందీబాయి కూడా అక్కడ విద్యనభ్యసిస్తూ స్నేహితులతో కలిసి ఉంది. అక్కడ ఆమె నాలుగు సంవత్సరాలు విద్యాభ్యాసం చేసింది. ఆ సమయంలో ఆమెకు అనేక శారీరక మానసిక దుఃఖాలు కలిగి ఆమె దేహం నానాటికీ క్షీణించసాగింది. ఆమె చదువుకునే కాలంలో హిందూదేశం నుండి అనేకమంది స్త్రీవిద్యా శత్రువులు ఎంతో హేయమైన ఉత్తరాలు వ్రాసి ఆమెకు చాలా బాధని కలిగించారు. కొందరేమో ఆమె పరదేశానికి వెళ్ళి స్వధర్మమును వదిలేసిందని ఆమె భర్తకు చెప్పి ఆమెపై మనసు  విరిగిపోయేలా చేయాలని చూసారు. కాని వారి ప్రయత్నాలు ఎంత మాత్రం కొనసాగలేదు. ఇలా సత్కార్యాలకు ఎలా అయినా విఘ్నాలు కలిగించాలని అనుకునే ధర్మాచరణ పరాయణులు మనదేశంలో ఉన్నందుకు ఎంతో చింతించాల్సి ఉంది. అమెరికాలో ఉండగా ఆనందీబాయి అనేక

ఉపన్యాసాలనిచ్చి అక్కడి విద్వాంసులను మెప్పించింది.

భార్య వెళ్ళిన రెండు సంవత్సరాలకు గోపాలరావు గారు బయలుదేరి కాలినడకన అమెరికాకు వెళ్ళారు. ఆయన తన భార్య నడవడిని తెలుసుకోదలచి ఆమెకు తెలియచేయకుండానే అకస్మాత్తుగా అక్కడికి వెళ్ళారు. కాని ఆమె సత్ప్రవర్తన చూసిన గోపాలరావు తాను ఆమెను గూర్చి శంకించినందుకు పశ్చాత్తాప పడ్డారు. ఇలా గొప్ప విద్య నేర్చుకుని అమెరికా దేశానికి వెళ్ళి, మహా గౌరవం పొంది కూడా స్వచ్ఛమైన నడవడికతో ఉండి, ఎల్లప్పుడూ సంశయంతోనే ఉండే పతిని మెప్పించిన ఈ పతివ్రతా శిరోమణి ప్రాతఃస్మరణీయురాలు అనడంలో సందేహం లేదు.

నాలుగు సంవత్సరాలు చదివిన తర్వాత ఆనందీబాయి వైద్య విద్యలో ప్రవీణురాలని మెప్పు పొందింది. ఆ తర్వాత ఆ దంపతులిద్దరూ అక్కడ చూడదగ్గ స్థలాలను/ ప్రదేశాలను చూసి కార్పెంటరు దొరసాని వద్ద సెలవు తీసుకుని స్వదేశానికి వచ్చారు. ఆనందీబాయి అమెరికాలో ఉన్న కాలంలోనే కోలాపురం సర్కారు వారు ఆమెను తమ స్త్రీ వైద్యశాల అధికారిణిగా ఉండమని, నెలకు మూడువందల రూపాయల వేతనం ఇస్తామని, తర్వాత ఐదు వందల వరకు పెంచగలమని ఆమెకు తెలిపారు. కాబట్టి ఆమె అందుకు ఒప్పుకుంది. కాని దేశం యొక్క, స్త్రీల యొక్క దురదృష్టంవలన చదువుకునే కాలంలోనే ఆమెకు క్షయరోగం ప్రారంభమై క్రమంగా పెరుగుతోంది. రోగంతోనే ఆమె మన దేశానికి వచ్చింది. సముద్ర ప్రయాణం వలన ఆమె దేహం మరింత అస్వస్థతకు గురైంది. బొంబాయిలోనూ, పూనాలోనూ ఆమెకు ఔషదోపచారములు/ అనేక చికిత్సలు చేసి చూశారు. కాని ఫలం లేకపోయింది. చివరికి 1887 వ సంవత్సరంలో ఫిబ్రవరి 26 వ తేదీ రాత్రి పది గంటలకు తను జన్మించిన పూనాలోనే ఈ అద్వితీయమైన స్త్రీ పరలోకానికెళ్ళి పోయింది. మరణ కాలంలో ”నా చేతనయినంత వరకు నేను చేశాను” అని పలికి ఆమె ప్రాణాలు విడిచింది.

చూశారా! ఈ ధైర్యసాహసం! ఇలాంటి రత్నాలు ఎన్నో మనదేశంలో ఉన్నాయి. కాని ఆ రత్నాలకు సానబెట్టి ప్రకాశింప చేయడానికి గోపాలరావు లాంటి వారు లేనందున ఈ రత్నాలు కూడా రాళ్ళలాగే కనిపిస్తున్నాయి. ఆనందీబాయి సద్గుణాలకు, సద్విద్యకూ గోపాలరావ్‌ మూలకారణం అనడానికి ఎంతమాత్రం సందేహం లేదు. సాధారణంగా మొగపిల్లలూ, ఆడపిల్లలూ వారి చిన్నతనపు చేష్టలవలన ఎంతో చెడ్డవారని అనిపించుకుంటారు. పురుషులు విద్య నేర్చుకున్న తర్వాత తమ అజ్ఞానాన్ని కొంత వరకు విడిచి మంచివారవుతారు. మరి స్త్రీలు, విద్య నేర్పించేవారు లేక ఇంటి వద్ద తల్లి, అమ్మమ్మ మొదలగు వారిలాగే జ్ఞానవంతులు, సుగుణ సద్గుణములు కలవారవుతారు. ఆనందీబాయి చిన్నతనంలో చాలా చెడ్డదిగా కనిపించేదికాని విద్యాభ్యాసం అధికమయిన కొద్దీ ఆమె మనసు మారింది. ఆమె పరద్వీపంకు వెళ్ళి ఇలాంటి విద్యని నేర్చుకుని వచ్చినా గర్వం ఆమెను అంటలేదు. ఆమె ప్రవర్తన చూసిన, విన్నవారు స్త్రీ విద్యా ద్వేషులయినా కూడా తమ అభిప్రాయాన్ని మార్చుకుని స్త్రీ విద్యా అభిమానులవుతారనడంలో సందేహం లేదు. ఈమె చరిత్ర అమెరికాలోని వారు కూడా వ్రాసి ఎంతో పూజ్యభావంతో చదువుతున్నారు.

ఇలా ఈ ఉత్తమ సతి దేశ దేశాంతరాలలోను కీర్తి పొంది విద్య వల్ల స్త్రీలు బాగుపడతారేగాని చెడిపోరనీ, దుర్గుణాలకు విద్యకు విరోధమేకాని, విడలేని మైత్రి లేదనీ, స్వంత ప్రయత్నంతో నిలదొక్కుకుని, విద్య నేర్చిన స్త్రీలందరూ ధర్మాన్ని విడనాడతారనీ, పతిని పట్టించుకోరనీ, స్వతంత్రులు అవుతారనీ తమ ఇష్టానుసారం ఉంటారనీ కొందరు చెప్పిన మాటలు ద్వేషాన్ని పుట్టించే అబద్ధపు మాటలని స్పష్టపరచినందుకు ఆనందీబాయి జీవిత చరిత్రకు నేను ”స్త్రీ విద్యా విజయ దుందుభి” అని పేరు పెట్టాను.

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో