జైలులో అలారమ్‌ – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

ఒకసారి ఒక కేసులో నాకు కోర్టు బెయిల్‌ ఇవ్వలేదు. ఖత్రీ మెజిస్ట్రేట్‌గా ఉండేవారు. నేను బెయిల్‌కి పెట్టిన అప్లికేషన్‌ను తిరగ గొట్టారు. నాకు చాలా కోపం వచ్చింది. గూండాలకు, హంతకులకు జమానత్‌ ఇస్తారు కాని మాకు ఇవ్వరు అని బాగా కొట్లాడాను. నేను జైలులో ఉన్నాను అని కార్మికులకి తెలిసింది. వెంటనే పిల్లా – జెల్లాలను, కోళ్ళను తీసుకుని హజారీబాగ్‌కి వచ్చారు. ఎస్‌.డి.వో. కోర్టును చుట్టుముట్టారు. ఆ రోజుల్లో తాపేశ్వర్‌ ప్రసాద్‌ ఎస్‌.డి.వో. గా పనిచేసేవారు. ఆయనకు మా ఉద్యమాల పట్ల సహృదయత ఉంది. ఎస్‌.డి.వో. కోర్టు తరువాత కార్మికులు జైలుని ముట్టడించారు. జైల్లో అలారమ్‌ మోగింది. నేను అప్పుడే పడుకోవాలనుకుంటున్నాను. ఇంతలో అలారం వినగానే ఏమైందా అని ఆశ్చర్యపోయాను. పక్కన గదిలో మేరీ టేలర్‌ ఉంది. ఆమె కూడా ఈ అలారం ఎందుకు మోగింది అని అడిగింది. జైల్లో అలారం పెద్ద ఆపద వస్తేనే మోగుతుంది. ప్రాబ్లమ్‌ సాల్వ్‌ అయ్యేదాకా మోగుతూనే ఉంటుంది. జైలర్‌ నా దగ్గరికి వచ్చి నన్ను తనతో రమ్మన్నారు.

”ఇంత రాత్రప్పుడా?” నేను అడిగాను.

ఆయన సమాధానం చెప్పలేదు. ఆయన చేంబర్‌కి వెళ్ళాను. అక్కడ ఎస్‌.డి.వో. తో పాటు శ్రీకృష్ణ సింహ్‌ కూర్చుని ఉన్నారు. బెయిల్‌ కాగితాలపై నా సంతకం తీసుకోడానికి ఆయన వచ్చారు. నేను సంతకం చేయనన్నాను. తరువాత తప్పనిసరియై నా గ్యారంటీ మీద రాత్రి ఎనిమిది గంటలకు నన్ను విడుదల చేసారు.

ఎస్‌.డి.వో. నన్ను తన కారులో తీసుకు వచ్చారు. అక్కడ కార్మికులు ఉన్నారు – ”ఇదిగో మీ అమ్మగారిని తీసుకు వచ్చాను. మీరే సంబాళించండి” అని ఆయన అన్నారు.

ఆయన ద్వారా కార్మికులను కేదలా గనులకి ట్రక్కులతో పంపే ఏర్పాటు చేసాం. నన్ను ప్రభుత్వం విడుదల చేయకపోయినా శ్రామికులపై నాకెంతో నమ్మకం ఉంది. ఈ నమ్మకం వలనే మా

ఉద్యమం ఇంకా బలపడసాగింది.

లాఠీ – బల్లాల వలన కానప్పుడు…

కుజూలో కాంట్రాక్టర్లు నన్ను కొట్టాక శ్రామికులు ఎంతో నిరాశ చెందారు. కాంట్రాక్టర్ల ఉత్సాహం ద్విగుణీకృతం అయింది. నేను గాయపడ్డాక దాదాపు ఏడు వారాల కూలీ కేదలా శ్రామికులకు యాజమాన్యం వారు ఇవ్వలేదు. శ్రామికులు కేదలాలో హనుమాన్‌ చాలీసా, నవధా (తొమ్మిది రోజుల అఖండ పారాయణం) పారాయణం పెట్టించారు. రాత్రింబవళ్ళు ‘బజరంగ్‌ బలీకి జై’ ‘రమణికా గుప్తాకీ జై’ అని అనేవాళ్ళు. నా ఆరోగ్యం మెరుగవ్వాలని వాళ్ళు ప్రార్థించే వాళ్ళు. శ్రామికులు కూలీ అడగడానికి వెళ్తే యాజమాన్యం వాళ్ళు ఇట్లా అనే వాళ్ళు – ”వెళ్ళండి! వెళ్ళి రమణికా గుప్తాని అడగండి-” పాట్నా ఆసుపత్రికి కార్మికులు అందరు వచ్చారు. వాళ్ళు ఏడుస్తూ జరిగినదంతా చెప్పారు. నేను చాలా బాధ పడ్డాను. ఆసుపత్రి నుండి తిరిగి వచ్చాక చూస్తే శ్రామికులందరు కోపంతో ఊగిపోతున్నారు. కాంట్రాక్టర్లు గుండాలను పిలిచారు. నేను గనుల దాకా వెళ్తే కాంట్రాక్టర్లలో ఆందోళన పెరిగేది. కోపం కట్టలు తెంచుకునేది. అందరు పేమెంట్‌ కౌంటర్‌ని మూసివేసి పారిపోయేవాళ్ళు. ఒకటి రెండు సార్లు సరిగ్గా పేమెంట్‌ రోజే నేను వెళ్ళాను. కూలీ డబ్బులు తక్కువ ఇవ్వడం గమనించాను. మేం ముంషీ (గుమాస్తా) నుండి డబ్బులు లాక్కుని అందరికి నిర్ధారిత కూలీ ఇచ్చేసి ఆయన చేత సైన్‌ చేయించి పేమెంట్‌ షీట్‌ని మండూ పోలీస్‌ స్టేషన్‌లో నమోదు చేయించాము. నా మీద దొంగతనం ఆర్టికల్‌ 307 ప్రకారం ఎన్నో కేసులు పెట్టారు. అయినా మేం ఎవ్వరం భయపడలేదు. ముందడుగే వేసాం కాని ఒక్క అడుగు వెనక్కి వెయ్యలేదు. చాలా సంవత్సరాల తరువాత సాక్ష్యాలు లేనందున ఈ కేసులన్నీ రద్దయ్యాయి.

ఒక రోజు కేదలాలో గుండాలు లాఠీలు, బల్లాలు, గొడ్డళ్ళతో సహా రణరంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. కాంట్రాక్టర్ల మధ్య వాళ్ళల్లో వాళ్ళకు కూడా గొడవలు అవుతున్నాయి. నేను ఆసుపత్రిలో చేరాక శ్రామికులను భయపెట్టడానికి గోపాల్‌ ప్రసాద్‌ (వైస్‌ చాంస్‌లర్‌ మగధ విశ్వవిద్యాలయం, గయ) నంబరు 3 గనిపై కబ్జా చేయాలన్న ఉద్దేశ్యంతో అఖిలేష్‌ సింహ్‌ (మామూ బాబు, కాంట్రాక్టర్‌తో కలిసి జ్యోడేటిక్‌ కంపెనీని స్థాపించారు; మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పని చేసేవారు) ఔరంగాబాద్‌కి చెందిన బాబూ సత్యేంద్ర నారాయణ (వీరు తరువాత బీహారు ముఖ్యమంత్రి అయ్యారు) సలహా తీసుకుని గుండాలను కేదలాకి తీసుకు వచ్చారు. వాళ్ళు ప్రతీ రోజు లాఠీలను తిప్పుతూ శ్రామికులను భయపెట్టేవారు. గోపాల ప్రసాద్‌ ఉండే ప్రాంతంలో మా యూనియన్‌కి బలం ఉండేది. అక్కడ వేజెస్‌ షీట్‌లో శ్రామికులకు ముందుకన్నా కూలీ ఎక్కువగా ఇస్తున్నట్లు నమోదు అయింది. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవ పి.డి. అగ్రవాల్‌ కంపెనీ వాళ్ళకు పగ తీర్చుకోవడానికి ఉపయోగ పడ్డది. ఎందుకంటే ఆయనతో పాటు ఉండే కాంట్రాక్టర్లు మామూ బాబు తో కలిసి ఒక కొత్త కంపెనీ తెరిచారు. రిసీవర్‌ పెట్టడం వలన పి.డి. అగ్రవాల్‌ మైనింగ్‌ ఏరియాలోని చాలా భాగం పట్టాలలో నమోదయింది.

గోపాల్‌ ప్రసాద్‌ యూనియన్‌ చేసిన డిమాండ్‌ ప్రకారం కార్మికులకు వేతనాలు పెంచారు. అక్కడ ఉన్న గుండా టైప్‌ కాంట్రాక్టర్లను తొలగించి గనులను ప్రభుత్వ పరం చేసారు. తమ ప్రతీకారం తీర్చుకోడానికి పి.డి. అగ్రవాల్‌ గుమాస్తాలు నిరంజన సింహ్‌, ద్వారకాబాబు రకరకాల పుకార్లు పుట్టించారు. ఒకవైపు గుండాలను, మరోవైపు శ్రామికులను రెచ్చగొట్టారు. ప్లాన్‌ ప్రకారం మామూ బాబు గుండాలు గోపాల ప్రసాద్‌ గనులపై కబ్జా చేయాలని అనుకున్నారు. అక్కడి కార్మికులు బలంగా ఎదిరించారు. ఎందుకంటే మామూ బాబు చేసే అత్యాచారాల గురించి వారికి తెలుసు. ఈ గుండాలే ఈ సంఘటన జరిగిన ఒక రోజు ముందు పక్కా సెంటర్‌లోని శ్రామికులను లాఠీలు తిప్పుతూ బల్లాలను విసురుతూ భయపెట్టారు. పక్కా థోండా (కార్మిక నివాస స్థానాలు) లలో ఎక్కువగా జ్యోడేటిక్‌ కోల్‌కంపెనీ శ్రామికులు ఉన్నారు. వాళ్ళకి కాంట్రాక్టర్లు దాదాపు ఎనిమిది వారాల నుండి కూలీ డబ్బులు ఇవ్వలేరు. నేను గాయపడ్డాక వాళ్ళకి ఇంకా అవకాశం దొరికింది. గోపాల్‌ ప్రసాద్‌ గనుల పైన దాడి చేయడానికి సహకరిస్తే కూలీ డబ్బులు ముట్టచెబుతాం అని షరతు పెట్టారు. కార్మికులని భయపెట్టి ఒప్పించడానికి వాళ్ళ ధొండాలకి వెళ్ళారు. కాని వాళ్ళు ఒప్పుకోలేదు. గోపాల్‌ ప్రసాద్‌ గనుల పనులని ఆ విభాగం వాళ్ళే చూసుకుంటారు. అక్కడ మేం ఈ కాంట్రాక్టర్‌ వ్యవస్థని లేకుండా చేసాం. శ్రామికులు ఈ వ్యవస్థకి విరుద్ధంగా పోరాటం సాగిస్తున్నారు కనుక వాళ్ళు దాడి చేసే వాళ్ళని తిరగ గొట్టారు. శ్రామికులకు విరుద్ధంగా ఈ గనులపై హక్కు సంపాయించుకోలేకపోవడం వలన ఆ గుండాలు మధ్యాహ్నం విరామ సమయంలో లాఠీలు తిప్పారు. బల్లాలని ఆకాశంలో ఎగుర వేసారు. అప్పుడు ఇద్దరి మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభం అయింది.

వాళ్ళు బొగ్గులని విసిరివేసారు. రాళ్ళ వర్షం కురిపించారు. వీటి ముందు ఏ లాఠీలు, ఏ బల్లాలు నిలబడలేకపోయాయి. లాఠీలు  లేవంగానే వేల వేల చేతుల్లోంచి బొగ్గులు, రాళ్ళు టప టప రాలేవి. బల్లాలను, లాఠీలను దాటుకుంటూ గుండాల ముఖాలకు

రాళ్ళు-రప్పలు తిరిగేవి. వాళ్ళకి గాయాలయ్యేవి. దాదాపు ముప్పై ఆరు మంది గుండాలు రక్తసిక్తం అయ్యారు. ముగ్గురు కాంట్రాక్టర్లు చచ్చిపోయారు. హజారీబాగ్‌ ఆసుపత్రి సరిగ్గా మా ఆఫీసు ఎదురుకుండా ఉంది. అక్కడికి గాయపడ్డ వాళ్ళ మృతదేహాలు వేలు – వేలు ట్రక్కులలో వచ్చాయి. పట్టణం మొత్తం అట్టుడికి పోయినట్లుగా మారిపోయింది. నిజానికి ఆరోజు నేను అదృష్టవశాత్తూ కోర్టులో ఒక కేసు విషయంలో ఉండిపోయాను. లేకపోతే రైలీ గఢా కేసులో బర్డ్‌ కంపెనీ వాళ్ళు నామీద కేసులు పెట్టినట్లు ఈ కాంట్రాక్టర్లు పోలీసులతో చేతులు కలిపి నాపై కేసుని నమోదు చేసేవారు. కాని అట్లా జరగలేదు. అందరు మొదట ఆసుపత్రికి వస్తారు, తరువాత నా ఆఫీసుకు వస్తారు. ఒక విచిత్రమైన మనస్తత్వంతో కూడిన మధ్యవర్గం వాతావరణం వాళ్ళందరూ మమ్మల్ని హేళన చేస్తూ చూస్తూ ఉండేవారు. అసలు వాళ్ళ ఆ చూపులను భరించలేక పోయేవాళ్ళం. నేను బయట కుర్చీ వేసుకుని కూర్చునేదాన్ని. మేం వాళ్ళకి భయపడటం లేదు అని తెలిసేలా కార్యకర్తలతో, కార్మికులతో పెద్ద పెద్దగా మాట్లాడేదాన్ని. పెద్ద పెద్దగా అరిచి అడగాలనిపించేది- ”ఎనిమిది వారాలు కూలీ డబ్బులు ఇవ్వకపోతే ఎవరు కూలీ ఇప్పించిన పాపాన పోలేదు. ఇప్పుడు వాళ్ళు చనిపోయాక పరామర్శించడానికి తమాషా చూడడానికి వచ్చారా?”

శ్రామికులు తమని తాము రక్షించుకోడానికి దాడి చేసారు. బీదా-బిక్కీ రిక్షావాళ్ళు, కూలీ-నాలీ చేసేవాళ్ళు, కార్మికులు మా ఆఫీసు బయట నుండి వెళ్తున్నప్పుడు తలవంచి మాకు నమస్కారం చేసేవాళ్ళు. పోలీసులకి కాని గుండాలకి కాని కనిపిస్తే మమ్మల్ని సమర్థిస్తున్నారు అన్న ఉద్దేశ్యంతో వాళ్ళకి నిలువ నీడ లేకుండా చేసే ప్రమాదం ఉంది. వాళ్ళ కళ్ళల్లో నేను మెరుపుని చూసాను. నామీద వ్యక్తం అవుతున్న గౌరవాన్ని చూసాను.

ఆ రాత్రి నాకు పాట్నా నుండి ఫోను వచ్చింది – ”మిసెస్‌ గుప్తా! శ్రామికులు రేపు కేదలా నుండి హజారీబాగ్‌ వైపుకి వెళ్తున్నారు.  మీరు వెళ్ళి వాళ్ళని ఆపేయండి. లేకపోతే హజారీబాగ్‌లో అల్లర్లు రేగే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆ కాంట్రాక్టర్లందరు ఇక్కడే ఉంటారు.”

నేను అన్నాను – ”నేను ఏదో విధంగా కారులో వస్తాను. రేపు పదిగంటల వరకు అక్కడ ఉంటాను.”

మరునాడు నేను కేదలా వైపు వెళ్ళాను. ప్రొద్దున్న ఎనిమిది గంటలకు దాదాపు పదివేల మంది శ్రామికులు పరేజ్‌ని దాటి హజారీబాగ్‌కి వెళ్తున్నారు. కాని మధ్య మార్గంలో పాట్నా నుండి వచ్చిన డి.ఐ.జి నేనే చెప్పానని వాళ్ళకు నచ్చ చెప్పి వెనక్కి కేదలాకి పంపించి వేసారు. ఇది వినగానే నాకు బాధ కలిగింది. కోపమూ వచ్చింది. కార్మికులు పట్టుబట్టి బలవంతంగా తమని తాము అరెస్ట్‌ చేయించుకున్నారని నా అనుమానం. వాళ్ళందరు వాన్‌లలోకి ఎక్కారు. మహిళలు ఎక్కారు. కాని వాళ్ళని పోలీసులు బలవంతంగా దింపేసారు. శ్రామికులు ఇది సత్యాగ్రహం అని అనుకుని ట్రక్కులు ఎక్కారు. ఆరోజు దాదాపు 150 మంది దాకా కార్మికులు స్వయంగా అరెస్ట్‌ అయి జైలుకి వెళ్ళారు. వాళ్ళని బెయిల్‌ మీద విడిపించడానికి 6 సం||లు పట్టాయి. 12-13 సం||లలో కేసులు మాఫీ అయ్యాయి. అందరు విడుదల చేయబడ్డారు. కాని పరిస్థితులు అన్నీ తలకిందులయ్యాయి.

రైలీ గఢా ఉద్యమం

శ్రీ ఎస్‌.ఎమ్‌. జోషీ ఆమరణ నిరాహార దీక్ష

కేదలాలో కాంట్రాక్టర్లు, గూండాల హత్యల అనంతరం మేం శ్రామికులను బెయిల్‌ ఇప్పించి విడిపించాలని, కేసులు రద్దు చేయించాలన్న ప్రయత్నంలో ఉన్నాము. రైలీగఢాలో పర్మనెంట్‌ అయిన శ్రామికులు ఒక సభ చేసారు. మా యూనియన్‌ వైపు నుండి సైడింగ్‌లో ఉన్న కార్మికులను పర్మనెంట్‌ చేయాలని ఉద్యమం మొదలు పెట్టారు. అక్కడ గిద్దీకి చెందిన శివనాధ్‌ సింహ్‌ చౌహాన్‌, లాల్‌ సింహ్‌, బెనర్జీ బాయి, సౌందాకి చెందిన శ్రీనాగర్‌ మొదలైనవారు నేతృత్వాన్ని వహించారు. స్థానీయంగా ఓఝా, గంగాధర్‌మిశ్ర, పాండె, సీతారామ్‌ యాదవ్‌, ప్రేమదాస్‌, భత్తు, బాసోదేవ్‌, మున్నదేవి, ముండా మొ||లైన వారు నేతృత్వాన్ని వహించారు. మున్నదేవి ఎంత ధైర్యస్థురాలో అంత అందంగానూ ఉండేది. ఆమె మహమ్మదీయురాలు కాని ఒక హిందూ యువకుడిని పెళ్ళి చేసుకుంది. శ్రామికులందరిని ఒక్కరుగా చేయగల సామర్థ్యం ఆమెలో ఉంది. ఆ రోజుల్లో శ్రామికులలో ఇటువంటి పెళ్ళిళ్ళు జరిగేవి. కాని ఎవరూ పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. ఇక్కడి గనులు బర్డ్‌ కంపెనీ ఆధీనంలో ఉండేవి. ఇక్కడి యాజమాన్యం వారు ఇంటక్‌ని తప్ప మరే యూనియన్‌ని జొరనిచ్చే వాళ్ళు కాదు.

మొట్టమొదటి గేట్‌ మీటింగు :

మొట్టమొదట్లో రైలీగఢీ గేట్‌ లోపల మీటింగు పెడదామను కున్నాము. మొదట్లో మమ్మల్ని లోపలికి వెళ్ళనీయలేదు. మాతో పాటు రైలీగఢాకి చుట్టుపక్కల ఉన్న గనులలో పనిచేసే కార్మికులు వచ్చారు కాని రైలీగఢాలోని కార్మికులందరిని మేం సంఘటిత పరచలేక పోయాం. అక్కడ శ్రీ కమలా చరణ్‌ ఉపాధ్యాయ ఇంటక్‌ నేతగా పనిచేసే వారు. సర్‌దార్‌గా కూడా పనిచేసేవారు. కార్మికులకు వడ్డీ మీద డబ్బులు ఇచ్చేవారు. ఋణం ఇచ్చే సమయంలో కార్మికుల దగ్గర నుండి మెంబర్‌షిప్‌ డబ్బులు కూడా తీసుకునేవారు. కార్మికులలో ఆయన అంటే భయం ఉండేది. కార్మికులకి అవసరం అయినప్పుడు ఋణం ఇచ్చేవారు. వడ్డీ కూడా బాగా తీసుకునేవారు. 100 రూ||లకి 200 రూ||ల వడ్డీ వసూలు చేసేవారు. యాజమాన్యం వారు ఉపాధ్యాయ మాట వినేవారు. ఆయన సిఫారసు మీద కార్మికులకు సెలవులు కాని జాయినింగ్‌ విషయంలోకాని అంతో ఇంతో సహాయం చేసేవారు. అందువలన శ్రామికులలో ఆయన పట్ల భయ-భక్తులు ఉన్నాయి. కేదలాలో మా యూనియన్‌ కార్యకలాపాలు తెలుసుకొన్న రైలీగఢాలోని విలాస్‌పూర్‌ కార్మికులు గ్రామ పెద్దలైన మహతో, మాంఝీలు ఇంటక్‌ని ఎదిరించాలని సంకల్పించారు. మేం పక్కన ఉన్న గిద్దీ కోల్డ్‌ ఫీల్డ్‌ దగ్గర కూర్చుని రైలీగఢాలో మా యూనియన్‌ని తెరవాలని ఓ కమిటీని ఏర్పరుచుకున్నాము. కోల్డ్‌ఫీల్డ్‌లో యూనియన్‌ ఏర్పాటు చేయడానికి ఒక ఉద్దేశ్యం ఉంది. ఈ యూనియన్‌ వాళ్ళు వేరే కోల్‌-ఫీల్డ్‌లకి వెళ్ళి నేతల చేత సభలను ఏర్పాటు చేసి వాళ్ళ వర్ఛస్సును నిరూపించుకుంటారు. నేతలకు ప్రారంభంలో యూనియన్‌ తయారు చేయడానికి ఏదైనా కొంత ఆటంకం కలిగినా తరువాత కొంత బలం పుంజుకున్నాక మాత్రం వాళ్ళు స్పీచ్‌లు ఇవ్వాలి, లేకపోతే సరాసరి అవతలి వాళ్ళతో పోరాటానికి తలబడాలి.

కేదలా మర్డర్‌ కేసులు అయ్యాక చుట్టు పక్కల కోల్‌ ఫీల్డ్స్‌లో యాజమాన్యం వారు, పోలీసులు మేల్కొన్నారు. ఎన్‌.సి.డి. కోల్‌ఫీల్డ్స్‌లో మా పేరు ప్రతిష్ఠలు పెరగసాగాయి. అక్కడి వర్కర్స్‌ కాడర్‌ వాళ్ళు మాతోపాటు గనుల దగ్గర యూనియన్‌ని ఏర్పాటు చేయడం అపాయం అని తెలిసినా ఏర్పాటు చేయడం మొదలు పెట్టారు. రైలీ గఢాలో మీటింగుని పెడ్తున్నామని పిలుపు వచ్చినప్పటినుండి నాకు ఎన్నోసార్లు జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడప్పుడు జైలు నుండి విడుదల అయినప్పటికీ ఇంటికి వెళ్తున్న సమయంలో మధ్యదారిలోనే లేకపోతే రైలీగఢాలో మా మజిలీకి వెళ్ళే సమయంలో మధ్య మార్గంలోనే పోలీసులు నన్ను మళ్ళీ అరెస్ట్‌ చేసి తీసుకు వెళ్ళేవాళ్ళు. ”శాంతి భద్రతలకు ముప్పు” అని నెపం పెడుతూ నన్ను అరెస్ట్‌ చేసేవాళ్ళు. నన్ను ఈ విధంగా అరెస్ట్‌ చేసినప్పుడు కార్మికులకు ఇంకా కోపం వచ్చేది. ఇన్‌టక్‌ వ్యతిరేకంగా విరుచుకు పడేవాళ్ళు. కాంట్రాక్టర్లు, యాజమాన్యం వాళ్ళు చెప్పగానే మా పైన పోలీసులు కాని ఎస్‌.డి.వో. కాని తలిస్తే ఆర్టికల్‌ 113 కింద మమ్మల్ని జైల్లోకి పంపించేవాళ్ళు. నిజానికి కార్మికుల నుండి నన్ను దూరంగా ఉంచాలనే నన్ను అరెస్ట్‌ చేసేవాళ్ళు. నిజానికి ఇది వాళ్ళ రాజనీతి.

మేం వడ్డీ తీసుకోము :

రైలీగఢాలో ఇంటక్‌ని చీల్చడానికి ఒక పెద్ద అడుగు పడ్డది. సీతారామ్‌ యాదవ్‌ వడ్డీ వ్యాపారాన్ని వదిలేసి మా యూనియన్‌లో పనిచేసే ఉద్దేశ్యం ఉందని తెలిపారు. నేను కొన్ని షరతులు విధించాను. శ్రామికులు ఇచ్చే వడ్డీని రద్దు చేయాలి. ఏ కార్మికుడైతే అసలు ఇచ్చేస్తారో వడ్డీ తీసుకోకుండానే వాళ్ళని వదిలివేయాలి. ఇక ముందు వడ్డీ వ్యాపారం చేయకూడదు. నా మాటల ప్రభావం ఆయన మీద ఎంతో ఉంది. ఆయన నిక్కచ్చిగా చెప్పాడు – ”నేను వడ్డీ తీసుకుంటే కమలా చరణ్‌ ఉపాధ్యాయకి విరుద్ధంగా ఎట్లా పోరాటం జరపగలుగుతాను. అసలు ఆయన ముఖం ఎట్లా చూడగలుగుతాను. మీరందరు మా యూనియన్‌కి సహాయపడండి. బర్డ్‌ కంపెనీ అత్యాచారాలకు విరుద్ధంగా పోరాడండి”.

ఈ పిలుపు అందరిపై మంత్రంలా పని చేసింది. నిన్నటి వరకు ఏ వ్యక్తి అయితే కార్మికులను దోపిడీ చేసేవాడో ఈనాడు ఆ వ్యక్తి ఇచ్చిన పిలుపుకి, అతని త్యాగానికి అందరు అతనికి దాసోహం అన్నారు. అతని మాటకు విలువ పెరిగింది. భారతదేశంలో త్యాగానికి ఎంతో విలువ ఉంది. బహుశ అందువలనే ఈ భావాన్ని ఉపయోగించుకుని అన్నాన్ని-వస్త్రాలని త్యాగం చేసి ఆకలితో నగ్నంగా ఉంటూ సాధారణమైన వ్యక్తులకన్నా తాము గొప్ప అని చూపిస్తూ అందరు తమ వైపు భక్తిశ్రద్ధలను చూపేలా చేసుకుంటారు. సీతారామ్‌ స్వయంగా కంపెనీలో పర్మనెంట్‌ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. కాని అతడు అంతగా భయపడడు. సాధారణమైన వ్యక్తులు నిర్భయుడైన వ్యక్తి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ఏ పనైతే వాడు చేయలేడో ఎదుటి వ్యక్తి ఆ పని చేస్తుంటే వాడి ధైర్యం పట్ల ముగ్ధులవుతాడు. తన కలల ద్వారా తను ఆ వ్యక్తి లాగానే ప్రవర్తిస్తున్నానని ఎంతో సంతోషపడతాడు. ఒక్కొక్కసారి ధైర్యం ఎంతో చమత్కారమైన శక్తి అని కూడా భయపడతాడు. ఎప్పుడైతే పెద్ద సమూహం ఈ ధైర్యాన్ని ప్రదర్శిస్తుందో అపుడు తను కూడా ఆ సమూహం ద్వారా ధైర్యాన్ని ప్రదర్శిస్తాడు. అంతో ఇంతో పని కూడా చేస్తాడు. శ్రామికుల ఉద్యమాలలో వ్యక్తిగతమైన నిర్భయత్వానికి బహుశ ఇటువంటి సామూహిక ధైర్యం తోడ్పడటమే వారి సాఫల్యానికి కారణం అవుతుంది.

శ్రీ ఓఝా గారు చాలా ధైర్యస్థుడైన నేత. ఆయన ఎన్నోసార్లు అరెస్టు అయ్యేవారు. ఆయన ఎంతో కాలం జైలులో ఉన్నారు. గంగాధర్‌ మిశ్రా సోదరుడు వడ్డీ వ్యాపారి. యూనియన్‌ వలన ఆయన తన సోదరుడితో సంబంధం తెంపేసుకున్నాడు. కార్మికులకు కొంత తోడ్పడం మొదలు పెట్టాడు. ఆయన ఎప్పుడు ఏ దాపరికం లేకుండా స్పష్టంగా మాట్లాడేవాడు. ఆయనలో ఉన్న ఈ స్వభావం వలన శ్రామికులు ప్రభావితులయ్యారు. యాజమాన్యం వారు కూడా తలవంచేవారు. రణనీతిని, ప్రణాళికలను తయారు చేయడంలో పాండే గారు సిద్ధహస్తులు. తన తెలివిని ఉపయోగించి భవిష్యత్తు ప్రణాళికలను ఆయన తయారు చేసేవారు. ప్రేమ్‌చంద్‌, భత్తు ముండా శ్రామికులను ఏకం చేయడంలో మంచి సామర్ధ్యం చూపించేవారు. వీళ్ళందరు కొంతవరకు ముందడుగు వేసిన శ్రామికులు.

రెండో గేటు మీటింగు :

రెండోసారి రైలీగఢా లో మీటింగుకు పిలుపునిచ్చినపుడు మేము గేటు లోపలికి వెళ్ళడానికి పట్టుబట్టాము. లోపల మాకు అందరు సహకరిస్తారని మా నమ్మకం. బయట నుండి మాతోపాటు వందల మంది కార్మికులు వచ్చారు. ప్రణాళిక ప్రకారం లోపలి నుండి కూడా ఎందరో గేట్‌ని విరగగొట్టాలి అని నినాదాలు చేస్తున్నారు. పోలీసులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇంటక్‌ యాజమాన్యం వారు మమ్మల్ని అరెస్ట్‌ చేయమని బలవంతం చేస్తున్నారు. కాని ఇంతమందిలో మమ్మల్ని అరెస్టు చేయడానికి పోలీసులు జంకుతున్నారు. నేను గేటు బయట జీపు బానెట్‌పై నిల్చున్నాను. లోపల ఉన్న శ్రామికులు గార్డులను వెనక్కితోసి గేటు తెరిచేసారు. నా కారు లోపలికి వెళ్ళిపోయింది. పక్కన మైదానంలో శ్రామికులందరు ఒక స్టేజిని తయారు చేసారు. మైకు కూడా ఏర్పాటు చేసారు. గేటు తెరవబడగానే శ్రామికులలో సంతోషం పెల్లుబికింది. చూస్తూ చూస్తూ ఉండగానే మైదానం నిండి పోయింది. శ్రామికులు ఆయుధాలతో సహా వచ్చారు. ఎక్కడైనా గూండాలు గొడవలు చేస్తే వాళ్ళని ఎదుర్కోవచ్చు. మీటింగు జరిగింది. ప్రేమ్‌చంద్‌ భత్తు, పాండే, మున్న అందరు స్పీచ్‌లు ఇచ్చారు. అదివాసి మహిళలు కూడా చాలా బాగా మాట్లాడారు. అక్కడ చాయ్‌బాసికి చెందిన ‘హ’ భాష మాట్లాడే మహిళా శ్రామికులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరు క్యాజువల్‌ లేబర్‌. పర్మనెంట్‌ శ్రామికుల బంధువులు, ఒరిస్సా ఆదివాసీలు ఈ సైడింగ్‌ దగ్గర క్యాజువల్‌ శ్రామికులుగా పని చేసేవాళ్ళు. మీటింగులో ఈ సైడింగ్‌ శ్రామికులను పర్మనెంట్‌ చెయ్యాలన్న అంశాన్ని కేంద్రంగా పెట్టుకుని తక్కిన మా డిమాండ్స్‌లని వర్కర్లకి చదివి వినిపించాక యాజమాన్యం వారికి పంపించాము. పోలీసు స్టేషన్‌లో, ఎస్‌.డి.వో, లేబర్‌ ఆఫీసరు మొ||లైన వారికి ప్రతులకు పంపించాము.

రైలీగఢా సైడింగ్‌ వివాదం :

కేదలా మర్డర్‌ తరువాత ప్రభుత్వం కేదలా విషయంలో ఇచ్చిన తీర్పులను అమలులో పెట్టాలని ధన్‌బాద్‌ లేబర్‌ ఆఫీసరుకి రెస్‌పాన్‌సిబులిటీని అప్పగించారు. లేబర్‌ ఆఫీసర్‌ శ్రీదాస్‌ (ధన్‌బాద్‌) హజారీబాగుకి వచ్చినప్పుడు మేము రైలీగఢా సైడింగ్‌ శ్రామికులను పర్మనెంట్‌ చేసి, వాళ్ళ హాజరీ (ఎటెండెన్స్‌) తీసుకుని వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని వేజింగ్‌ షీట్‌ ప్రకారం వాళ్ళకి పేమెంట్‌ చేయాలని డిమాండ్‌ చేసాం. శ్రీదాసు డిసెంబరు 18న తారీఖు నిర్ణయించారు. రైలీగఢాలో ఉద్యమం మొదలయింది. శ్రామికులు తమ డిమాండ్ల విషయం తెలిపారు. చుట్టు పక్కల గ్రామాల నుండి సైడింగ్‌ దగ్గరికి అందరు చేరడం మొదలు పెట్టారు. ప్లాన్‌ ప్రకారం సగం వాగన్‌ నిండాక పని ఆపారు. యాజమాన్యాన్ని వ్యతిరేకించడానికి ఇది మా అమోఘమైన అస్త్రం. మేం ఇట్లా నినాదం చేసాము- ‘ఎప్పటి వరకైతే హాజరీ తీసుకోరో, ఐడెంటిటీ కార్డులు ఇవ్వరో అప్పటి వరకు వాగన్‌ పూర్తిగా లోడ్‌ కాదు. యాజమాన్యం వారికి వాగన్‌ డెమరేజ్‌ పడటం వలన వెంటనే లోడింగ్‌ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ రోజుల్లో వాగన్ల షార్టేజ్‌ వలన ఎంతో కష్టం మీద సైడింగ్‌ వాగన్‌ దొరికేది. సమయానికి లోడింగ్‌ కాకపోతే ప్రతి రోజు డెమరేజ్‌ వేల రూపాయలలో ఇవ్వాల్సి వస్తుంది.

కుజూలో విరిగిన నా చెయ్యి వాపు ఇంకా తగ్గలేదు. ప్రతి 15 రోజులకు డా. ముఖోపాధ్యాయ చేత చెక్‌అప్‌ చేయించుకోడానికి పాట్నా వెళ్ళాల్సి వచ్చేది.

నా చెయ్యి ఇంకా పూర్తిగా తిప్పడానికి రావడం లేదు. బీహారు ప్రభుత్వం వ్యతిరేకంగా ‘అవిశ్వాస తీర్మానం’ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. ఇది తప్పకుండా స్వీకృతం అవుతుందని మా నమ్మకం. ఆ రోజుల్లో కాంగ్రెస్‌కి చెందిన శ్రీ దారోగా రాయ్‌ ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆయన పదవి నుండి తొలగడం కద్‌పురీ రాయ్‌ ముఖ్యమంత్రి కావడం, ఆల్‌మోస్ట్‌ నిర్ణయం అయినట్లే. నేను 15 తారీఖు సాయంత్రం రైలీగఢాలో శ్రామికులకు నచ్చ చెబుతూ అన్నాను- లేబరు ఆఫీసరు ఎదురుకుండా సాక్ష్యం సరిగ్గా ఇవ్వాలి. భయపడవద్దు. లేబరు ఆఫీసరు న్యాయం చేస్తారు.

ఈ విధంగా వాళ్ళందరికి ధైర్యం చెప్పి రాత్రికి నేను రైలీగఢాకి వెళ్ళిపోయాను. హజారీబాగ్‌ నుండి పాట్నా వెళ్ళి చెయ్యి చెకప్‌ చేయించుకుని విధాన సభకి వెళ్ళాను. దారోగారాయ్‌ కారిడర్‌లో కనిపించగానే ఆయనకి రైలీగఢా సమస్య గురించి చెప్పి కల్పించుకుని సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేయమన్నాను. ఆయన అన్నారు- ”రమణిక గారూ! ఇవాళ ఎటూ మీరే ప్రభుత్వాన్ని ఫామ్‌ చేస్తారు. ఇప్పుడు నాకు చెప్పి మాత్రం ఏం లాభం…”

అంటూ ఆయన ఉదాశీనంగా తన చేంబర్‌కి వెళ్ళిపోయాడు. సాయంత్రం ప్రభుత్వం పడిపోయింది. నేను అదే రాత్రి హజారీబాగ్‌కి వెనక్కి వెళ్ళి పోయాను. ఎందుకంటే లేబర్‌ ఆఫీసర్‌ సెప్టెంబరు 18న రైలీగఢాకి వెళ్ళాలి. ఆయనతో నేను వెళ్ళాలి.                (ఇంకా ఉంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.