…ఆ ముట్టులేకుంటే మీరెక్కడుండేరు? – గోపరాజు సుధ, ఆర్‌. రమాజ్యోతి

ముట్టు ముట్టనియేరు, ముట్టరాదనియేరు, ఆ ముట్టులేకుంటే మీరెక్కడుండేరు? వందల, వేల విషయాలమీద లక్షల కవితలు, కథలూ, వ్యాసాలు నవలలు కోట్ల కొద్ది పేజీల రాతలున్నాయి. ప్రపంచంలో సగం ఉన్న స్త్రీలు తమ జీవితకాలంలో సగానికిపైగా నెల నెలా అనుభవించే బహిష్టుకి సంబంధించి మాత్రం పట్టుమని పదిపేజీల రాతలు లేవు. సాహిత్యంలోనే కాదు. నిత్య జీవితంలోను ఏ విధమైన ప్రాధాన్యతా దొరకని వస్తువు / అంశం.

ప్రతిరోజు ఎన్ని లక్షల మంది స్త్రీలు తమ ముట్టుని గుట్టుగా అనుభవిస్తున్నారో! తండ్రికి తెలియకూడదు. అన్న దమ్ములకి తెలియకూడదు. అతి రహస్యంగా వుండాలి. లేదా బట్ట బయలుగా ‘బయట’ వుండాలి. నిషేధాజ్ఞలు, విధి విధానాలు పన్నెండేళ్ళకే మొదలైతే ఏ యాభై ఏళ్ళో వచ్చేదాకా అయితే చాపా, చెంబు లేదా అతి రహస్యం. సెక్సువాలిటి గురించి అంతగా చర్చించిన తెలుగు  సాహిత్యం ఆడవాళ్ళు బహిష్టు అపుతారని, అష్టకష్టాలు పడతారని ఎందుకు చర్చించలేదు? అష్టకష్టాలేంటో చూద్దాం. మొదటిది ఒంటిమీద వున్న బట్టలమీద రక్తపు మరకలు కనపడేదాకా ఏం జరుగుతుందో తెలియదు. రెండు, గాయం ఎ్కడ అయిందో తెలియదు. మూడు, రక్తస్రావం దేనికి ఇంకించాలో తెలియదు. నాలుగు, ఇంకించడానికి వాడిన పదార్ధాన్ని ఏం చేయాలో తెలియదు. ఐదు, హఠాత్తుగా తమ కదలికల మీద అన్ని నిషేధాలెందుకో తెలియదు. ఆరు, వారి శరీరం ఎందుకు మారుతోందో తెలియదు. ఏడు, నెలకి ఐదు రోజులు బడి మానేస్తే చదువెట్ల సాగుతుందో తెలియదు. ఎనిమిది, ఈ ముట్లెందుకు వచ్చాయో నాకు అనే బాధ.

ఎవరన్నా దగ్గర కుర్చోబెట్టుకొని నీ శరీరం ఎదుగుతోందమ్మా, పునరుత్పత్తికి సిద్ధమవుతుంది ప్రకృతిలో అద్భుతమైన విషయం, భయపడక్కర్లేదు, బాధ పడక్కర్లేదు, సిగ్గు అసలే పడక్కర్లేదు అని చెప్పారా? శుభ్రమైన బట్ట వాడి రక్తస్రావాన్ని పీల్చేటట్టు చేయాలి. ఆ వాడిన బట్టని సబ్బుతో వుతికి ఎండలో ఆరేయాలి. పురుగు పుట్రా చేరని చోట, బాక్టీరియాలు ఫంగస్‌లు రాని చోట జాగ్రత్త పరచాలి. ఈ పని నువ్వు చేయడానికి తల్లీ, తండ్రీ, అన్నా, తమ్ముడు, కుటుంబము, సమాజము నీకు సహాయపడతాయి అని చెప్తున్నారా?

నాలుగే మాటల చుట్టూ తిరుగుతూ ఉంటుంది రహస్యం. భయం, సిగ్గు, అవమానం. రహస్యంగా ఉంచాల్సిన విషయమా? ఎందుకు? ఆడపిల్లలకి మాత్రమే పరిమితమనా? ఎందుకీ నిషేధాలు? ఇళ్ళల్లోకి రాకూడదు, పొలాల్లోకి రాకూడదు, గుళ్ళల్లోకి రాకూడదు? ఎందుకు? బహిష్టు కంటే పవిత్రమైన కార్యం మరొకటుందా? ముట్టు అపవిత్రమైనదయితే మానవ జాతి మనుగడంతా అపవిత్రత మీదే కదా ఆధారపడి వున్నది? బానిసా, బానిసకొక బానిసగా అసలే అడవాళ్ళు, అందులోనూ ముట్టయ్యారు, అంటే అంటయ్యారు.

బహిష్టు పట్ల మనకున్న నమ్మకాలు ఆడపిల్లలు, స్త్రీల బ్రతుకులని ఎంత అసహ్యంగా చేస్తున్నాయి. అసలేమి తెలియనితనం దగ్గరి నుంచి మొదలు పెట్టి, ముట్టు గుడ్డలకి కూడా కరువు నుంచి, పారేయడానికి కూడా చోటులేకపోవడం భౌతిక సమస్యలయితే, అంటరానితనం, ముట్టరానితనం మానవ హక్కులనే హరించివేస్తోంది. అవకాశాలని దూరం చేస్తుంది. అనారోగ్యాలని దగ్గర చేస్తోంది.

మనం మాట్లాడలేమా? తల్లులుగా, తండ్రులుగా, అన్నతమ్ములుగా, అక్కచెల్లెళ్లుగా బాధ్యత గల మనుషులుగా నిశ్శబ్దాన్ని బద్దలుకొట్టి, గుసగుసలు పక్కకు పెట్టి బహిష్టు గురించి బహిరంగంగా మాట్లాడదాం? ఆడవాళ్ళ జీవితాలకో అందమైన అనుభవం కావాలి. ముట్టు కాదు, మైల కాదు, బయట కాదు… అందమైన అనుభవం కావాలి.

ప్రపంచం గుర్తిస్తోంది. మే, 28 మెన్‌స్ట్య్రువల్‌ హైజీన్‌ మేనేజ్‌మెంట్‌ డే గా గత మూడు సంవత్సరాలుగా సెలబ్రేట్‌ చేసుకుంటోంది. కేవలం పరిశుభ్రత అంశంగా కాక అందమైన అనుభవంగా సెలబ్రేట్‌ చేసుకుందాం.

గుసగుసలా! ఇకపై సాగవ్‌

అధ్యాయం 01

పరిచయం

స్త్రీలు అనేక రకాల వివక్షతలకు గురవుతున్నారు. రాజకీయ అధికారం, నిర్ణయాధికారం లేకపోవడం, ఆరోగ్యం, విద్యా, ఆర్థికాధికారాల్లో వివక్షత, గృహ హింస లాంటి చాలా అంశాలను గుర్తించి వాటికి వ్యతిరేకంగా చాలా కాలం నుంచి చాలా మందిమి పని చేస్తూనే ఉన్నాము. ఈ వివక్షత విశ్వరూపం మాత్రం మనకింకా పూర్తిగా కనపడనే లేదు. ప్రాథమిక అవసరాలను గుర్తించేటప్పుడు స్త్రీల ప్రాథమిక అవసరాలను విడిగా గుర్తించకపోవడం వివక్షతలో వివక్షత. స్త్రీలు ప్రత్యేక శరీర నిర్మాణం కలిగి ఉంటారని, వారికి ప్రత్యేక అవసరాలు ఉంటాయనీ, వాటికి అనుగుణంగా ప్రాథమిక సౌకర్యాలను ఏర్పరచాలనే భావన ఇంతకాలమైనా బలంగా మన ఆలోచనలలో, సంస్కృతిలో, విధివిధానాలలో పాదుకొననే లేదు.

స్త్రీల హక్కులు, అభివృద్ధి, సమానత్వం, ఆరోగ్యం, సాధికారతలను కలిపి ప్రభావితం చేస్తున్న అంశం ఒకటి ఉన్నది. అది స్త్రీల శారీరక ధర్మం – స్త్రీలని ప్రత్యుత్పత్తికి సిద్ధం చేసేది. అది బహిష్టు, నెలసరి, బయట ఉండటం, ముట్టు, రుతుస్రావం, డేటు… వయసు, సామాజిక స్థాయి, కులము, ప్రాంతము పట్టి వేరు వేరు రకాలుగా పిలవబడే శారీరక ధర్మం. ఆడపిల్లలు పెద్దమనుషులు, రజస్వల, పుష్పవతి అయ్యేది, స్త్రీ శరీరం సంసిద్ధం కావటం జరిగేది మానవ జాతిని సుస్థిరంగా కొనసాగించడానికే. ఇలా చదువుతుంటె ఒక అద్భుతమైన పనిగా, ధర్మంగా వినిపించేది మన నిత్య జీవితంలో మాత్రం సిగ్గుపడాల్సింది, రహస్యంగా వుంచుకోవాల్సింది అవుతోంది.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో బహిష్టు పరిశుభ్రత అన్న విషయం పెద్దగా గుర్తింపు పొందని సమస్య. గత పది సంవత్సరాలు గానే ఈ విషయం అభివృద్ధి అంశాలలో చోటు చేసుకుంటున్నది. ఒక దశాబ్దం నుంచి మాత్రమే వివిధ అంతర్జాతీయ వేదికల మీద నెలసరి పరిశుభ్రత గురించి సాంస్క ృతిక, మతపరమైన ఆంక్షల మీద చర్చలు మొదలైనాయి. ఈ విషయాల మీద తగినన్ని అధ్యయనాలు జరగలేదు. బహిరంగ చర్చలూ జరగలేదు.

నెలసరి సమయంలో స్త్రీలు ఇంటికి పరిమితమవ్వాల్సి వస్తే, పుష్పవతులు అయ్యాక ఆడపిల్లలు బడి మానేయవలసి వస్తే స్త్రీల పరిస్థితి మెరుగుపడదు. సుస్థిరమైన సమన్యాయంకల అభివృద్ధి అసాధ్యమవుతుంది.

రుతుస్రావం ఎందుకు ఏర్పడుతుంది? బహిష్టు రక్తస్రావం సహజమైనది. స్త్రీలలో అండోత్పత్తి జరిగి, ఫలదీకరణ జరగకపోతే బహిష్టు వస్తుంది. ఈ రుతుస్రావమే లేకపోతే మానవ జాతి నశించి పోతుంది. స్త్రీలు పిల్లల్ని కనలేరు. శరీరం మూత్రం, మలం బైటకి పంపించినట్టే బహిష్టు రక్తాన్ని కూడా బైటకి పంపించి వేస్తుంది. దురదృష్టవశాత్తు రుతుస్రావాన్ని సహజమైనదిగా చూడటం లేదు. దీని చుట్టూ రకరకాల అపోహలు, పద్ధతులు, ఆచారాలు, నియంత్రణలు, పరిమితులు ఉన్నాయి. ఈ నమ్మకాలన్నీ కూడా స్త్రీలు బహిష్టు పరిశుభ్రతని పాటించడానికి సరైన అవకాశం యివ్వనివే. (అర్చనా పాట్కర్‌)

పది సంవత్సరాల వయసు నుంచి మొదలయి 50 సంవత్సరాల వయసు దాకా స్త్రీలకి బహిష్టులు ఉంటాయి. బహిష్టు సమయంలో 3-5 రోజుల వరకు స్త్రీల యోని నుంచి రక్తస్రావం అవుతుంది. ఈ రక్త స్రావాన్ని పీల్చడానికి స్త్రీలు యోని ప్రాంతంలో బట్టలను, ఇతర పీల్చే గుణం ఉన్న పదార్థాలను ధరించి రక్తస్రావం బైటకు వచ్చి, ఇబ్బంది కలగకుండా ఉండేటట్లు చూసుకుంటారు. రక్తాన్ని పీల్చుకోవడానికి సురక్షితమైన విధానాన్ని ఎంచుకోవాలి. ఈ బట్టను లేదా వేరే వాటిని తరచుగా, అంటే రక్తం పీల్చుకుని తడి అయ్యి ఎండిపోకముందే మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.

ఈ విషయమంతా ఒక మంత్రనగరి సరిహద్దు. దాని గురించి ఎవరూ మాట్లాడరు. ముఖ్యంగా మొగవాళ్ళు మాట్లాడరు. విధాన నిర్ణేతలు మాట్లాడరు. ఆడవాళ్ళు కూడా గుసగుసల్లోనే తప్ప పెద్దగా స్పష్టంగా మాట్లాడరు. సహజమైన, ప్రాకృతికమైన ఒక శారీరక ధర్మాన్ని సిగ్గుపడాల్సిందిగా, అసహ్యించుకోవాల్సినదిగా, అంటరానిదిగా, నిషేధంలాగా ముద్రవేసి చూడటం ఎలా జరుగుతోంది?

సాంప్రదాయకంగా స్త్రీలు తమ శరీరాల గురించి శరీర ధర్మాల గురించి మాట్లాడకూడదనీ, ముఖ్యంగా పునరుత్పత్తి అవయవాలు, ప్రక్రియ, అవసరాల గురించి బహిరంగంగా అసలే మాట్లాడకూడదు అని మన సంస్క ృతి మనకు బోధించింది. పునరుత్పత్తి ప్రక్రియలో ముఖ్య భాగమైన ఋతుక్రమం గురించి, బహిష్టు సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్త్రీలకు ఎటువంటి సౌకర్యాలు అవసరం అనే విషయాలు ఎప్పుడూ బహిరంగంగా చర్చలోకి వచ్చే విషయాలు కావు. ఎప్పుడైతే ఏ విషయమైనా బహిరంగంగా చర్చించడానికి అనుమతించబడలేదో ఆ విషయం తీవ్రమైన అసౌకర్యం కలిగిస్తుంది. అలాంటిదే స్త్రీల బహిష్టు గురించిన చర్చ.

ఇంతగా రహస్యంగా ఉండే అంశం స్త్రీల శారీరక మానసిక ఆరోగ్యాలను, అవకాశాలను ఎంతగా ప్రభావితం చేస్తోంది? ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది? ఏ అనారోగ్యాల పాలు చేస్తోంది? ఏ అవకాశాలను చేజారుస్తోంది? ఎన్ని అవమానాల పాలు చేస్తోంది? స్త్రీల ఆరోగ్యం గురించి, సౌకర్యాల గురించి చర్చ జరుగుతున్నప్పుడు, విధానాలు, ప్రభుత్వ పథకాలు అమలులోకి వస్తున్నప్పుడు ఈ విషయాలు చర్చించడం చాలా అవసరం. ఇప్పటికే అమలులో

ఉన్న ప్రభుత్వ విధానాలు, పథకాలు వాటి వల్ల జరగుతున్న మంచి, వాటిలో ఉన్న లోటుపాట్ల గురించి కూడా చర్చించాలి. ఈ ప్రభుత్వ విధానాలు, పథకాలు ప్రభావవంతంగా ఉన్నట్లయితే వాటిని

విస్త ృతంగా అమలు చేయాలి.

స్త్రీలకి రుతుస్రావ సమయంలో శారీరకంగా ఇబ్బంది

ఉంటుంది. రుతుస్రావం మొదలవడానికి ముందు శరీరంలో హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల శారీరక, మానసిక చికాకులు

ఉంటాయి. వీటికి తోడు ఆచారాల పేరిట స్త్రీలను తమ శారీర స్థితి గురించి మాట్లాడనీయక పోవడము, కనీస సౌకర్యాలు కలిగించక పోవడం వల్ల నెలసరిపట్ల స్త్రీలకి వ్యతిరేకత ఏర్పడుతోంది. ఈ వ్యతిరేకత పోయి ఆడపిల్లలు రుతుస్రావం గురించి మాట్లాడేటప్పుడు సానుకూలంగా మాట్లాడాలి అంటే అవగాహనా కార్యక్రమాలు ఇళ్ళల్లో, స్కూళ్ళలో, ఆసుపత్రులలో,  పని చేసే చోట జరగాలి.

బహిష్టు పరిశుభ్రత ఒకటే అంశానికి సంబంధించినది కాదు. దీనిలో అనేక అంశాలు ఇమిడి వున్నాయి. ఇది ఒక సహజ, ప్రాకృతిక, శారీరక విధి, అంతటితో ఆగిపోవడం లేదు. మహిళా వివక్షతకి దారితీస్తోంది. చదువు, పని అవకాశాలను దూరం చేస్తోంది. హక్కులని ఉల్లంఘిస్తోంది. సాంకేతిక పరిష్కారాలని సూచించే ముందు, అమలు చేసే ముందు సామాజిక, సాంస్క ృతిక అంశాలను అర్థం చేసుకుని వాటిలో మార్పుకోసం కృషిచేయాలి.

స్త్రీల ఆరోగ్య హక్కులకి బహిష్టు పరిశుభ్రతా పరిస్థితులకి చాలా దగ్గరి సంబంధం ఉందని తెలుసుకోవాలి. ప్రపంచ స్త్రీ జనాభాలో 52% మంది స్త్రీలు పునరుత్పత్తి వయసులో ఉన్నారు అందులో చాలా మందికి ప్రతినెలా బహిష్టు రక్తస్రావం అవుతుంది. ఇందులో అత్యధిక సంఖ్యాకులకి పరిశుభ్రమైన, భద్రమైన శానిటరీ పద్ధతులు అందుబాటులో లేవు. మార్చుకోడానికి, ఉతుక్కోడానికి సరైన చోట్లు (మరుగుదొడ్లు, స్నానాల గదులు) అందుబాటులో

ఉండవు.

అందుకని బహిష్టు పరిశుభ్రతా నిర్వహణ అంశాలను చర్చించాలన్నా, మెరుగైన పరిష్కారాలను రూపొందించాలన్నా దీనికి సంబంధించిన అన్ని విషయాలను అర్థం చేసుకోవాలి.

బహిష్టు పరిశుభ్రతని విస్తృత అభివృద్ధి లక్ష్యాలలో భాగం చేసి ఆలోచించాలి. ముఖ్యంగా మిలీనియం అభివృద్ధి లక్ష్యాలలో కొన్నిటి మీద బహిష్టు పరిశుభ్రత ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తోంది.

మిలీనియం అభివృద్ధి లక్ష్యాలని సాధించాలంటే మనం ముందు నెలసరి పరిశుభ్రతని సాధించాలి. స్త్రీల ఆరోగ్యం, చదువు, సాధికారతతో ముడిపడి వున్న మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు.

అభివృద్ధి లక్ష్యం 2 : అందరికీ ప్రాథమిక విద్య.

అభివృద్ధి లక్ష్యం 3 : జండర్‌ సమానత్వం, మహిళా సాధికారత సాధించడం.

అభివృద్ధి లక్ష్యం 5 : ప్రసూతి మరణాలు మూడు వంతులు తగ్గించాలి.

అభివృద్ధి లక్ష్యం 7 : పర్యావరణ సుస్థిరతని కాపాడటం.

అభివృద్ధి లక్ష్యం 10 : అందరికీ రక్షిత త్రాగునీరు, ప్రాథమిక పారిశుద్ధ్యం.

మిలీనియం అభివృద్ధి లక్ష్యాల గడువు 2015 తో ముగుస్తుంది. తదుపరి లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభమైనాయి. కొత్త లక్ష్యాలలో బహిష్టు పరిశుభ్రతకి తగిన ప్రాధాన్యతనివ్వాలి.

ఈ పుస్తకం రాయడానికి మా సొంత అధ్యయనంతోపాటు బహిష్టు పరిశుభ్రతకి ఆరోగ్యం, జండర్‌ సమానత్వం, చదువు, పని అవకాశాలకి ఉన్న సంబంధాన్ని గురించి చేసిన అధ్యయనాలు చదవడం మాకు ఉపయోగపడింది. ఈ అధ్యయనాలు మనదేశంలో, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ లాంటి దక్షిణాసియా దేశాల్లో జరిగాయి.

మొదటి అధ్యాయంలో సమస్యా స్వరూపాన్ని పరిచయం చేసాం. నెలసరి పరిశుభ్రత జీవితంలోని ఎన్ని పార్శ్వాలతో ముడిపడివున్నదో, ఎందుకు దీనిని ఒక సాంకేతిక అంశంగా తీసిపారేయలేమో రెండవ అధ్యాయంలో వివరించాం. ప్రభుత్వ ప్రభుత్వేతర కార్యక్రమాల గురించిన వివరాలు మూడవ అధ్యాయంలోను, నాల్గవ అధ్యాయంలో క్షేత్రస్థాయి పరిస్థితిని వివరంగా అర్థం చేసుకోవడానికి మారి సంస్థ (సుధ, రమాజ్యోతి) చేసిన అధ్యయనం పూర్తిపాఠాన్ని జత చేసాం. అయిదవ అధ్యాయంలో సమస్యకి పరిష్కారాలని సూచించాం.

అధ్యాయం 2

సమస్య విశ్వరూపం – తెలుసుకోవాల్సిన విషయాలు

నెలసరి పరిశుభ్రతని ఎవరి అవగాహనని పట్టి వారు, ఎవరు పని చేసే విధానాన్ని పట్టి వారు అర్థం చేసుకుంటున్నారు. ఇందులో ఇమిడివున్న అంశాలని, ప్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోతే కళ్ళు మూసుకుని ఏనుగుని వర్ణించినట్లు అవుతుంది. ఒకరికి తోక, మరొకరికి తొండం తగులుతుంది. కళ్ళు తెరిచి ఏనుగుని చూసినప్పుడే మొత్తం ఏనుగు కనిపించినట్టు నెలసరి పరిశుభ్రతా అంశాలని అర్థం చేసుకోవడానికి కళ్ళు తెరిచి చూడాలి.

బహిష్టు పరిశుభ్రత లేమిని ప్రభావితం చేస్తున్న జండర్‌ అసమానత్వం, సాంస్క ృతిక విధినిషేధాలు అర్థం చేసుకోవాలి. పరిశుభ్రతా లేమి వల్ల స్త్రీల ఆరోగ్యం, చదువు, పని అవకాశాలు ఏ విధంగా దెబ్బతింటున్నాయో తెలుసుకోవాలి. మౌళిక సదుపాయాల కల్పన, సామాజిక అవగాహన ఎంత అవసరమో తెలుసుకోవాలి. అప్పుడే బహిష్టు పరిశుభ్రతా అవసరం, చేయాల్సిన పనులు స్పష్టం అవుతాయి. ఈ విషయాలన్నింటినీ సాధ్యమయినంత సమగ్రంగా వివరించటానికి, ఒక సైద్ధాంతిక అవగాహన కోసమే ఈ అధ్యాయం ప్రయత్నం.

ఆడపిల్లల చదువు

పెద్ద మనుషులు అవ్వంగానే చదువు ఎందుకు మానేస్తున్నారు? ఆడపిల్లలు 11 సంవత్సరాల తరువాత చదువు మానేస్తున్నారని అందుకు ప్రధానమైన కారణం ఈ వయసులో వారు రజస్వల కావటమని చాలా అధ్యయనాల్లో తెలిసింది. ఆడపిల్లల చదువుకి పెద్దగా ప్రాధాన్యమివ్వని సంస్క ృతి, బాల్య వివాహాలు తప్పకుండా ఒక కారణం. అయితే చదువు కొనసాగించడానికి అభ్యంతరం లేని వాళ్ళు పాఠశాలల్లో పారిశుద్ధ్య సౌకర్యాలు, ముఖ్యంగా బహిష్టు పరిశుభ్రతా అవకాశాలు లేకపోవడం వల్ల బడి మానివేసే పిల్లల సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది.

శానిటరీ పాడ్‌ మార్చుకోడానికి అవసరమైన, సరైన టాయిలెట్స్‌, నీరు లేకపోతే వాళ్ళు క్లాసులో ప్రశాంతంగా కూర్చొని పాఠాలు వినలేరు. సౌకర్యాలు లేకపోవడం వల్ల వాళ్ళు బహిష్టు సమయంలో బడికి వెళ్ళకుండా ఉండటానికే ప్రయత్నిస్తారు (యూనిసెఫ్‌). మహిళా టీచర్లది కూడా ఇదే పరిస్థితి. 10-25% బోధనా సమయం తగ్గిపోతోంది (ప్రపంచ బ్యాంకు) పిల్లలు ఏదో విధంగా స్కూల్‌కి వెళ్ళినా అసౌకర్యం వల్ల పాఠాల మీద దృష్టి పెట్టలేరు, తమ బట్టల మీద ఏవైనా మరకలు వున్నయేమోనన్న భయానికి, నెలసరి సమయంలో ఆడపిల్లలు స్వేచ్ఛగా లేచి నిలబడటానికి, ముందు బెంచీల్లో కూర్చోడానికి, బ్లాక్‌ బోర్డు మీద రాయడానికి కూడా సంకోచిస్తారు. బహిష్టు రక్తస్రావపు వాసన వల్ల ఆడపిల్లలు దూరందూరంగా ఉంటారు.

పారిశుద్ధ్య సౌకర్యాలు లేని స్కూళ్ళలో ఆడపిల్లలకి భద్రత ఉండదు. పొద్దుట్నించి సాయంత్రం దాకా బహిష్టు సమయంలో పరిశుభ్రతా సౌకర్యాలు లేకుండా స్కూల్లో ఉండటం కష్టమే. సంస్క ృతిపరంగా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఉండే ఆడపిల్లల చదువు ఈ సౌకర్యాల లేమితో మరింత వెనకబడిపోతోంది.

విద్యలో మనం నిర్ణయించుకున్న మిలీనియం అభివృద్ధి లక్ష్యాలు సాధించాలంటే నెలసరి పరిశుభ్రతా అంశాల మీద మనం దృష్టిపెట్టక తప్పదు. ఎందుకంటే కౌమార బాలికలు చదువు మానేయడానికి ఉన్న ముఖ్యకారణాల్లో స్కూళ్లలో పరిశుభ్రతా సౌకర్యాలు లేకపోవడం ఒకటి. మిలీనియం అభివృద్ధి లక్ష్యాల్లో విద్యారంగంలో ప్రగతి సాధించినప్పటికి ఆడపిల్లల విషయంలో మాత్రం చాలా వెనకబడి ఉన్నాయి.

స్కూల్‌ కెళ్ళే ఆడపిల్లలు ఏం అడుగుతున్నారు? వెండి బంగారాలు అడుగుతున్నారా, కార్లు, టీవీలు అడుగుతున్నారా? నెలసరి సమయంలో మేము స్కూలు మానేసి, పాఠాలు పోగొట్టుకుని, క్లాస్‌లో వెనుకబడిపోయి, మార్కులు తగ్గిపోయి చదువు మానేయాల్సిన అవసరం లేకుండా స్కూల్లో భద్రమైన టాయిలెట్‌, నీటి సౌకర్యం ఉండేటట్లు చూడమని అడుగుతున్నారు! ఆపాటి మనం చేయలేమా? ఇది మానవ హక్కుల్లో భాగం కాదా?

ఆడపిల్లల సాధికారతకి చదువు చాలా ముఖ్యమని మనందరికి తెలిసిన విషయమే. ఆడపిల్లలు చదువును ఎక్కువ కాలం కొనసాగించినప్పుడు ప్రసూతి మరణాలు తగ్గటం, గర్భ నిరోధక పద్ధతుల వాడకం పెరగడం, ఇన్‌ఫెర్టిలిటీ రేట్‌ తగ్గడం జరుగుతోంది. పిల్లల ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల, వాక్సినేషన్లు పెరగడం, హెచ్‌.ఐ.వి. ఇన్‌ఫెక్షన్‌ రేటు తగ్గడం జరుగుతోంది. స్కూలింగ్‌ పెరగడం వల్ల ఆరోగ్య, ఆర్థిక ఉపయోగాలు వుంటున్నాయనేది అధ్యయనాల వల్ల తెలుస్తున్నది.

జండర్‌

స్త్రీ సాధికారతకి చదువు, పని, ఉద్యోగ అవకాశాలు, ఆరోగ్యం, స్వేచ్ఛాయుతమైన కదలికలు అవసరం. వీటన్నింటినీ కూడా పారిశుద్ధ్య సౌకర్యాలు ముఖ్యంగా నెలసరి పరిశుభ్రతా సౌకర్యాలు నియంత్రిస్తున్నాయి. స్త్రీల ఆరోగ్యం కోసం, భద్రత కోసం, ఆత్మగౌరవం కోసం వారికి పరిశుభ్రమైన పారిశుద్ధ్య సౌకర్యాలు కావాలి.

పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రతా నిర్వహణలో స్త్రీలే ప్రధాన పాత్ర పోషిస్తారు. ఇంటికి అవసరమైన నీళ్ళు, ఇంటి పారిశుద్ధ్యం, ఇంట్లో వాళ్ళ ఆరోగ్య అవసరాలు చూడటం స్త్రీల బాధ్యత. కానీ ఆ విషయాలకి అవసరమైన సదుపాయాలు ఏర్పరిచే నిర్ణయాలు చేయడంలో మాత్రం వారికి అధికారం ఉండదు.

ప్రపంచ పేదల్లో అత్యధిక శాతం స్త్రీలే. భూమి లేని పేదస్త్రీలకి అవసరమైన టాయిలెట్‌ నిర్మాణం అందుబాటులో లేకుండా పోతోంది. సొంత భూమే కాదు, ఉమ్మడి భూమి మీద కూడా స్త్రీలకి హక్కు ఉండదు. అందుకే వారికి అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణాలు జరగవు.

బహిరంగంగా మూత్ర విసర్జన, మల విసర్జన చేయాల్సి వస్తే స్త్రీలు, పురుషులకంటె వందరెట్లుఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. రోడ్డుపక్కన మూత్ర విసర్జన చేసే పురుషులని చూసినట్టుగా, మనం ఎక్కడైనా స్త్రీలని చూస్తున్నామా? స్త్రీలకి మూత్ర విసర్జన అవసరం లేక కాదు కదా! పురుషులలాగా బహిరంగ స్థలంలో, అన్ని టైముల్లోను, స్త్రీలు మూత్రం పోసుకోలేరు కదా! ఇక మలవిసర్జన అయితే మరింత కష్టం. మనుష సంచారం లేని ప్రదేశాలని వెతుక్కుంటూ, ఊరి బైటకి వెళ్ళాల్సి వస్తుంది.

నెలసరి పరిశుభ్రతని సమస్యగా గుర్తించకపోవడానికి, సరైన సౌకర్యాలు అభివృద్ధి చేయకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానమైనది, ఈ అంశం స్త్రీలకి సంబంధించిన విషయం అవటం. బహిరంగంగా చర్చించడం మీద సంస్కృతి పరమైన నిషేధాలు ఉండటం. మగవాళ్ళు కూడా దొడ్డికెళ్ళాలి కాబట్టి ఎప్పటికైనా మరుగుదొడ్లు కట్టటం గురించి మాట్లాడచ్చు కానీ, వాళ్ళకెప్పుడూ రుతుస్రావం జరగదు కాబట్టి బహిష్టు పరిశుభ్రత ఎప్పటికీ ‘జాతీయ సమస్య’ కాదు.

స్త్రీ లైంగిక, పునరుత్పత్తి హక్కుల గురించి మాట్లాడి నెలసరి గురించి మాట్లాడకుండా ఉండటం సరైనది కాదు. శరీర విధుల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నా కూడా నిర్లక్ష్యానికి గురైనవిధి నెలసరి ఒక్కటే.

పారిశుద్ధ్య, పరిశుభ్రతా సౌకర్యాలు జండర్‌ అవగాహనతో ఉండాలంటే ఏ కార్యక్రమాన్నయినా రూపొందిస్తున్నప్పుడు అందులో స్త్రీ భాగస్వామ్యం వుండాలి. స్త్రీల ప్రత్యేక అవసరాలేమిటి, వాటిని ఆ కార్యక్రమం నెరవేరుస్తోందా అన్న విషయాన్ని నిశితంగా పరిశీలించాలి. ఇంట్లో టాయిలెట్‌ డుతున్నప్పుడు సాంకేతిక అంశాలతోపాటు, స్త్రీలకి నెలసరి సమయంలో వాడుకోవడానికి అనుకూలంగా డిజైన్‌ ఉన్నదా లేదా అనే విషయాన్ని పరిశీలించాలి. ప్రభుత్వానికి సంబంధించి, ఏదైనా కంపెనీ లేదా సంస్థకి సంబంధించిన పారిశుద్ధ్య విధానాలలో జండర్‌కి సంబంధించిన ప్రత్యేక అంశాలు ఏమి ఉన్నాయి అని పరిశీలించాలి. పారిశుద్ధ్యానికి సంబంధించి సేకరించిన సమాచారంలో స్త్రీల, పురుషుల అభిప్రాయాలకి సమాన ప్రాధాన్యత ఉండాలి.

పరిస్థితులు అశావహంగా మారుతున్నాయి. పూర్తి నిశ్శబ్దంలో నుంచి గుసగుసలు వినిపిస్తున్నయ్యి. అవి చాలవు, పబ్లిక్‌ గాను, ప్రయివేటుగాను కూడా నిస్సంకోచంగా బహిష్టు పరిశుభ్రత గురించి మాట్లాడగలిగినప్పుడే స్త్రీల ఆరోగ్యం, ఆత్మగౌరవం నిలబడుతుంది. అందుకోసం మనవంతు కర్తవ్యం మనం నిర్వర్తిద్దాం.

ఒక పెద్ద నిషేధాంశం!

బహిష్టు పరిశుభ్రత మీద పని చేయడమంటే రుతుస్రావం మీద ఉన్న అపోహలని తొలగించడానికి ప్రయత్నించడం కూడా.

బహిష్టు సహజమైన విషయం. కాని ప్రపంచంలో అధిక భాగంలో ఇది ఒక మాట్లాడకూడని విషయం, దీని చుట్టూ లక్ష నిషేధాలు. అన్ని మతాలలోను స్త్రీలు రుతుస్రావ సమయంలో కలుషితం అవుతారు, మైలపడతారు. వాళ్ళు చాలా పనులు, ముఖ్యంగా దేవుడికి సంబంధించిన పనులు చేయడానికి అనర్హులు.

ఈ అభిప్రాయాలన్నీ కూడా స్త్రీలకి రుతుస్రావం ఉండటమంత పాతవి. వీటి వలన స్త్రీల మీద ఆంక్షలు చాలా పెరిగిపోతాయి. కదలికల మీద, అవకాశాల మీద నియంత్రణ ఏర్పడుతుంది. బైబిల్‌లో బహిష్టు సమయంలో స్త్రీల కలుషితత్వం, మైల గురించి స్పష్టంగా ఉన్నది. హిందువులలో నెలసరి అపవిత్రంగా భావిస్తారు. ఆ సమయంలో వాళ్ళు గుడికి వెళ్ళకూడదు, పూజలు చేయకూడదు, వంట చేయకూడదు, ఎవరినీ ముట్టుకోకూడదు, కుటుంబం నుంచి దూరంగా ఉండాలి. ముస్లింలలో బహిష్టులో వున్న స్త్రీలు ఖురానును ముట్టుకోకూడదు. మూడునుంచి ఏడు రోజుల పాటు ప్రార్థన చేయకూడదు, మసీదులోకి వెళ్ళకూడదు, ఉపవాసం ఉండకూడదు, లైంగిక సంబంధాలు నిషేధం.

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణమని ఆసియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాల్లో చాలా దేశాల్లో స్త్రీల ప్రత్యేక శారీరక విధులపట్ల భయం, అసహ్యం, వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ టైములో స్త్రీలని వేరు చేయడం ద్వారా వాళ్ళకి విశ్రాంతి కల్పిస్తామని కొన్ని సంస్కృతులలో ఒక వాదం వినిపిస్తుంది. అయితే ఈ విశ్రాంతి బహిష్కృత విశ్రాంతే తప్ప అన్ని సౌకర్యాలు ఉన్న విశ్రాంతి కాదు. నెలసరిలో ఉన్న స్త్రీలు కొన్ని పనులు చేయడానికి అనుమతించరు. ముఖ్యంగా నాట్లు, కోతలు. రోజుకూలి మీద ఆధారపడే స్త్రీలకి ఈ నమ్మకం చాలా నష్టం కలిగిస్తుంది.

స్టెఫనీ కైజర్‌ చేసిన అధ్యయనం ప్రకారం ”బహిష్టులో వుండగా స్త్రీల, బాలికల ప్రవర్తన, కదలికల మీద విపరీతమైన ఆంక్షలు వుంటాయి. మూడు నుంచి అయిదు రోజుల వరకు వేరు వేరు స్థాయిలలో (కులం, ప్రాంతం, మతం బట్టి) వీరిని ‘అంటరానివారు’గా చూస్తారు. వారిని ‘విడిగా’ ఉంచటం ద్వారా విశ్రాంతి కల్పిస్తారనే వాదన ఉన్నా అది అమలుకాదు. ‘విడిగా’ వున్న స్త్రీలకి విశ్రాంతికి, తగిన పోషకాహారానికి ఏ విధమైన ఏర్పాట్లు ఉండవు. ఇతర ‘బహిష్కృతులు’ ఏ విధమైన సౌకర్యాలు అనుభవిస్తారో వీరు అదే విధమైన సౌకర్యాలు అనుభవిస్తారు”.

కొన్ని దశాబ్దాల క్రితం దాకా కొన్ని కులాల వాళ్ళని గుళ్ళల్లోకి రానిచ్చేవారు కాదు. ఇప్పుడు కూడా స్త్రీలు తమ జీవితకాలంలో 3/4 సంవత్సరాలు గుడిలోకి వెళ్ళటానికి వీల్లేదు. వాళ్ళు ‘పవిత్ర’ (మత, కులపర)మైన వాటినీ ముట్టుకోకూడదు, కార్యక్రమాల్లో పాల్గొనకూడదు.

ఆంక్షలని, నిషేధాలను తొలగించడం ముఖ్యం. మతపరమైన ఆంక్షలని ఎదిరించడం, మార్చడం కష్టం కాని అసాధ్యం కాదు.

మానవ హక్కుల ఉల్లంఘన

బహిష్టు సమయంలో స్త్రీల పట్ల అమలవుతున్న ఆంక్షలు, నిషేధాలు మానవ హక్కుల ఉల్లంఘనే. నిషేధాలు, ఆంక్షలు అమలయ్యేది కొన్ని రోజుల కోసమే అయినా వాటి ప్రభావం మాత్రం ఆడవాళ్ళకి ఉండే అవకాశాల మీద తీవ్రప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. స్త్రీలు తమ జీవితకాలంలో దాదాపు నాలుగు సంవత్సరాలు బహిష్కృతులుగా బతకాల్సివస్తోంది.

ఆత్మ గౌరవం, శారీరక సమగ్రత, ఆరోగ్యం, గోప్యత, సమానత్వం మానవ హక్కులు. బహిష్టుల పట్ల ఉన్న నిషేధాలు స్త్రీల మీద అనేక ఆంక్షలను విధించి వారి గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి. పరిశుభ్రతా సౌకర్యాలు లేకపోవడం వల్ల వారిని పాఠశాలలకి, పనికి కూడా దూరం చేస్తున్నాయి. పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, మగ విద్యార్థులు, పురుష ఉపాధ్యాయుల నుంచి హేళనని ఎదుర్కోవడం వల్ల చదువు మానేయవలసి వస్తోంది. ఈ విధంగా ‘విద్యాహక్కు’ని కోల్పోతున్నారు.

యు.పి.ఎ (యూరోపు విదేశీ విధాన సలహాదారు) ప్రచురించిన ఒక అధ్యయనంలో నెలసరి పరిశుభ్రతా అంశాలు ఏ విధంగా స్త్రీల మానవ హక్కుల ఉల్లంఘనకి దారితీస్తున్నయో వివరించారు.

”ఆడపిల్లలకి, స్త్రీలకి అనుకూలం కాని స్కూలు సంస్కృతి, సదుపాయాలు (టాయిలెట్స్‌ మొదలైనవి), నెలసరి పరిశుభ్రతా అవసరాలు, శుభ్రమైన, ప్రత్యేకమైన పారిశుద్ధ్య సౌకర్యాలు లేకపోవడం మహిళా టీచర్ల, విద్యార్థినుల గోప్యతా హక్కును ఉల్లంఘిస్తోంది.”

శ్రీలంకకి చెందిన జ్యోతి సంఘేరా, బహిష్టు సమయంలో స్త్రీలపట్ల అమలయ్యే నియంత్రణలు, నిషేధాలవల్ల స్త్రీల మానవ హక్కులకి ఎలా విఘాతం కలుగుతోందో వివరించారు.

”ఒక మానవ సమూహం మీద ఒక ముద్రవేయడం వివక్షతకి పరాకాష్ట. ఈ ముద్ర వారిని బైటివారుగా, వేరుగా, వెలివేసిన వారుగా చూస్తుంది. పరిమితులు ఏర్పాటు చేస్తుంది. శిక్షిస్తుంది. చాలా సమాజాల్లో మాకు – స్త్రీలకి, బహిష్టు సమయంలో అనేక పరిమితుల్ని విధిస్తారు. మా కదిలికల మీద నిఘాపెడతారు, నియంత్రిస్తారు. స్త్రీల జీవిత కాలంలో ఒక భాగం వాళ్ళ కదలికల మీద పరిమితుల్ని విధించి, వాళ్ళని అంటరాని వారుగా చూసి వారి మానవ హక్కులని ఉల్లంఘిస్తున్నారు”.

బహిష్టు పరిశుభ్రతా ప్రభావం ఆడపిల్లలు, స్త్రీల మీద వారి సామాజిక, మానసిక ఆరోగ్యాల మీద దుష్పరిణామాలని చూపుతోందని అందరూ ఒప్పుకుంటున్నారని కాదు. రంధ్రాన్వేషణ చేసే వాళ్ళు తప్పకుండా ఉంటారు. ఈ రంధ్రాన్వేషణ ఇది వరకు చాలా విషయాలలో వాళ్ళు చేసే ఉంటారు. స్త్రీల గురించి మాట్లాడినప్పుడు మరిన్ని కొట్టివేతలు వస్తాయి. మా అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మలు బతకలేదా అనే ప్రశ్నలు వేస్తారు. మనం ఒకటే గుర్తించాలి, మౌనంగా బాధనీ, అసౌకర్యాన్ని అనుభవించడం, అమానవీయమైన పరిస్థితులలో బతకడం మానవ హక్కులకి భంగకరం. మనమెవ్వరమూ కూడా అలాంటి పరిస్థితులలో ఎవ్వరూ బతకాలని కోరుకోకూడదు.

ఆరోగ్యం

బహిష్టుకి సంబంధించి మానవ హక్కుల సంబంధిత సామాజిక అంశాలేకాక, ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. బహిష్టు సమయంలో రక్తస్రావం వలన బాక్టీరియా సులభంగా గర్భకోశంలోకి ప్రవేశించగలుగుతుంది. అపరిశుభ్రమైన బట్ట వాడటం, ఆ బట్టని యోనిలోపలికి పెట్టుకోవడం, ఇన్‌ఫెక్షన్లకి మరింత కారణమవుతాయి. మిలీనియం అభివృద్ధి లక్ష్యాలలో ఒకటి ప్రసూతి మరణాలు మూడు వంతులు తగ్గించాలని. కానీ బహిష్టు పరిశుభ్రతా సౌకర్యాలు మెరుగుపడకుండా, అపరిశుభ్రత వల్ల వస్తున్న ఇన్‌ఫెక్షన్లని నివారించకుండా ఇది సాధించలేము.

అనుసరించే పద్ధతి    ఆరోగ్య ప్రమాదం

1. అపరిశుభ్రమైన శానిటరీ ప్యాడ్స్‌ బాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షను     యోని ద్వారా లోపలికి వెళ్ళవచ్చు

2. తరచుగా ప్యాడ్స్‌ మార్చుకోకపోవడం    చర్మ సంబంధిత రోగాలు

3. అపరిశుభ్రమైన బట్టని యోనిలోపలికి (టాంపూన్‌) పెట్టుకోవడం    బాక్టీరియా గర్భాశయంలోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం.

4. రక్తస్రావం తక్కువ ఉన్నప్పుడు, ఎక్కువ పీల్చుకునే పదార్థాలు వాడటం    టాక్సిన్ల వల్ల వచ్చే షాకు

5. శానిటరీ ప్యాడ్‌ మార్చుకున్నాక చేతులు కడుక్కునే అవకాశం లేకపోవడం హెపటైటిస్‌ బి, త్రష్‌లాంటి ఇన్‌ఫెక్షన్లకి అవకాశం

అపరిశుభ్రత పద్ధతులకి ఒక ఉదాహరణ ఇది. బంగ్లాదేశ్‌ బట్టల మిల్లుల్లో పనిచేసే వారిలో 80% స్త్రీలు. వారు వాళ్ళ మిల్లులో దొరికే బట్టముక్కలనే బహిష్టు సమయంలో వాడుతున్నారు. వాటిలో రసాయనాలు చాలా ఎక్కువగా ఉంటాయి, ఇన్‌ఫెక్షన్స్‌ ఎక్కువగా వస్తాయి. 73% మంది స్త్రీలు నెలకి సగటున 6 పనిదినాలని కోల్పోతున్నారు. ఫ్యాక్టరీలలో పాడ్‌ మార్చుకోవడానికి గానీ, శుభ్రపరచుకోడానికి గాని తగిన సౌకర్యాలు వుండవు. రోజు కూలీలుగా పని చేసే స్త్రీలు ఆరు రోజులు పని పోగొట్టుకోవడమంటె వారి ఆర్థిక పరిస్థితికి ఎంత నష్టం?  శ్రామికశక్తి తగ్గటం వల్ల ఫ్యాక్టరీకి నష్టమే కదా! మన దేశంలో 90% మంది స్త్రీలు అసంఘటిత రంగంలోను 60% మంది స్వయం ఉపాధిలోను ఉన్నారు (అరుంధతీరాయ్‌). పారిశుధ్య సౌకర్యాలలో వీరి పరిస్థితి మరింత దుర్భరంగా ఉన్నది.

ఆరోగ్య సమస్యల్లో, ప్రధానమైనది ప్రత్యుత్పత్తి అవయవాలకి వచ్చే ఇన్‌ఫెక్షన్లు. తలసరి ఆదాయం తక్కువ ఉన్న దేశాల్లో స్త్రీలు దాదాపు 1400 రోజులు నెలసరి రక్తస్రావం కలిగి ఉంటారు. అంటె, అన్ని రోజులు వాళ్ళు పాటిస్తున్న పద్ధతులవల్ల అనారోగ్యాలకి దగ్గరగా ఉంటారు.

ప్రత్యుత్పత్తి అవయవాల ఇన్‌ఫెక్షన్స్‌ ప్రపంచ వ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థలకి పెద్ద సవాలు. తక్కువ ఆదాయం కల కుటుంబాలలో ఇది ఇంకా ఎక్కువ. ఈ ఇన్‌ఫెక్షన్లన్నీ కూడా నెలసరి సమయంలో రక్తస్రావాన్ని పీల్చుకోడానికి వాడుతున్న పదార్థాలు, బట్టలు అపరిశుభ్రంగా ఉండటం వల్లనే వస్తున్నాయి. ఇవి లైంగిక సంబంధాలవల్ల వచ్చేవికావు. కేవలం బహిష్టులో అపరిశుభ్రత వల్ల వస్తున్నాయి. ఇందులో బి.వి ఇన్‌ఫెక్షన్‌ వల్ల హెచ్‌.ఐ.వి. ఇన్‌ఫెక్షను, హెచ్‌.పి.వి. (క్యాన్సర్‌ కారకం), కడుపుతో ఉన్నప్పుడు వచ్చే సమస్యలు పెరుగుతున్నాయి.

జరిగిన పరిశోధన, అధ్యయనాలు అతి తక్కువే అయినా అన్నింటిలోను ప్రస్ఫుటంగా తెలిసింది మాత్రం ఆడ పిల్లలకి పెద్దమనిషి కావడం, బహిష్టు, పునరుత్పత్తి సంబంధిత ఆరోగ్యం గురించి అవగాహన అతి తక్కువ అని. అసౌకర్యం, నడుంనెప్పి, కడుపు ఉబ్బడం, కాళ్ళనెప్పులు, మనసు బాగుండకపోవడం, కోపం, దిగులు లాంటివి గుర్తింపు పొందని ఆరోగ్య సమస్యలు. వీటన్నిటికి కూడా మన ఆడవాళ్ళకి ప్రత్యేకమైన మందులు దొరకవు. అంటే వీటిని కనిపెట్టలేదని కాదు, మనకి అందుబాటులోకి తేవాలనే ప్రయత్నం జరగడం లేదు. పాటిస్తున్న బహిష్టు పరిశుభ్రతా పద్ధతులు, అందువల్ల కలిగే అనారోగ్యాలని వివరంగా చూస్తేగాని సమస్య తీవ్రత మనకి అర్థంకాదు.

స్త్రీల సమగ్ర ఆరోగ్య సేవల ప్రణాళిక రూపొందిస్తున్నప్పుడు బహిష్టు పరిశుభ్రతా నిర్వహణతోపాటు బహిష్టులు ఆగిపోయిన తరువాత వచ్చే శారీరక మానసిక ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకోవాలి.

మౌళిక సదుపాయాలు

స్నానాల గదులు, మరుగుదొడ్లు, నీటి సౌకర్యంలాంటి మౌలిక సౌకర్యాలు స్త్రీ బహిష్టు పరిశుభ్రత పద్ధతులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. స్త్రీలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడానికి మరుగు చాలా అవసరం. ఈ సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలి.

చాలా అభివృద్ధి కార్యక్రమాలలాగే టాయిలెట్ల నిర్మాణం కూడా జెండర్‌తో సంబంధం లేనిది అనుకుంటారు. వీధికి ఎదురుగా తలుపులున్న టాయిలెట్లని వాడటానికి స్త్రీలు భయపడతారని గ్రహించరు. శానిటరీ ప్యాడ్స్‌ని ఉపయోగించేందుకు టాయిలెట్స్‌ సౌకర్యవంతంగా ఉండవు. వాడిన ప్యాడ్స్‌ని (బట్ట) ఉతకడానికి, లేదా పారవేయడానికి సౌకర్యాలు ఉండవు.

పారిశుద్ధ్య సౌకర్యాలు, టాయిలెట్స్‌ లేకపోవడం వల్ల స్త్రీలు, ఆడపిల్లలు ఎక్కువ ఇబ్బంది పడతారు. మల, మూత్ర విసర్జనకు పురుషులకంటే స్త్రీలకే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. అలాంటిది నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్‌ని మార్చుకోవాలన్నా, శుభ్రపరచుకోవాలన్నా ఎంత ఇబ్బంది ఉంటుందో ఆలోచించండి. అందులోను బహిష్టు పట్ల ఉన్న సామాజిక కట్టుబాట్లు, మూఢ విశ్వాసాలు మరింత అసౌకర్యాన్ని కలగచేస్తాయి. ఒక్కసారి మనం మలవిసర్జనకే స్త్రీలు ఇబ్బంది పడుతున్నారో పరిశీలిస్తే నెలసరి సమయంలో శానిటరీ ప్యాడ్‌ మార్చుకోడానికి కావలసిన మరుగు, శుభ్రపరచుకోవడానికి అవసరమైన నీరు లేక వాళ్ళు మరెంత కష్టపడుతున్నారో అర్థమవుతుంది.

స్త్రీల అభద్రతకి, వారిపై అత్యాచారాలకి యిది దోహదం చేస్తుంది. బహిరంగ ప్రదేశాలలో, పారిశుద్ధ్యం లేని చోట్లల్లో, జబ్బులు వచ్చే అవకాశాలున్న చోట్లలో మలవిసర్జన చేయాల్సి వచ్చేది ఎక్కువగా స్త్రీలకే. పారిశుద్ధ్య సౌకర్యాలు లేకపోవడం వల్ల స్త్రీలు మల విసర్జన కోసం చీకటిపడే దాకా ఆగాల్సి వస్తుంది. ఇట్లా ఆపుకోవడం వల్ల రకరకాల ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. ఇలా ఆగడం కోసం నీళ్ళు తాగరు, తమ ఆహారపు అలవాట్లని మార్చుకుంటారు. ఆకుకూరలు, పప్పులు లాంటి పీచు ఉన్న పదార్థాలని తినరు. అందువల్ల పౌష్టికాహార లోపం ఏర్పడుతుంది.

వివక్షత, రాజకీయ సంకల్పం లేకపోవడం, చట్టపరమైన పద్ధతులు (హక్కు) లాంటివి లేకపోవడం వల్ల స్త్రీల పారిశుద్ధ్య అవసరాలు తీరడం లేదు. పారిశుద్ధ్య సౌకర్యాల రూపకల్పనలో స్త్రీలకి భాగస్వామ్యం లేకపోవడం, ఈ సౌకర్యాలకి స్త్రీ, పురుష భేదం ఉంటుందనే గుర్తింపు లేకపోవడం చాలా పెద్ద సమస్య.

బహిష్టు పరిశుభ్రతకి అనుసరిస్తున్న పద్ధతులు – వ్యర్థాల తొలగింపు

బహిష్టు పరిశుభ్రతకి ఉపయోగిస్తున్న పద్ధతులు స్త్రీల ఆరోగ్యానికి హానికరమైనట్టే, వ్యర్థాల తొలగింపు పద్ధతులు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి. తక్కువ ఖరీదుగల నాప్కిన్స్‌ని తయారు చేయడం, సోషల్‌ మార్కెటింగ్‌ ద్వారా సరఫరా చేయడంలో ప్రయత్నాలు అతి తక్కువగా జరిగాయి. తిరిగి వాడుకోగలిగిన వాటి గురించి మట్టిలో కలిసిపోయో వాటి గురించిన ఆలోచన కూడా తక్కువే జరిగింది. పరిశోధన, అభివృద్ధి అంతా వ్యాపార రంగంలోనే జరిగింది. ఈ రంగం పేదవారికి అందుబాటులో వుండే నాప్కిన్స్‌ని తయారు చేయలేకపోతోంది. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ శిక్షణలలో వాడిన బట్టని వుతకడానికి కాని, పర్యావరణ అనుకూల పద్ధతిలో పారేయడానికి గాని సంబంధించిన అంశాలే లేవు.

ఒక మామూలు స్త్రీ తన జీవిత కాలంలో 125 నుంచి 150 కిలోల బహిష్టు పరిశుభ్రతా నాప్కిన్స్‌ని వాడాల్సి వస్తుంది. ఇందులో చాలా భాగం గుంటల్లోకి పోతుంది. మిగిలినది మురుగునీటి పారుదల వాళ్ళు ఆలోచించాల్సిందిగా మారుతుంది. లెట్రిన్లలో పడవేస్తే, అవి గొట్టాలకి అడ్డం పడవచ్చు, డ్రైనేజిలో అవరోధాలు కలిగించవచ్చు, బహిరంగ ప్రదేశాలలో అయితే రక్తం వాసనకి జంతువులు చేరి మరింత కంగాళి సృష్టించవచ్చు. మౌలిక సదుపాయాలకల్పనా రంగాలైన నీరు, పారిశుద్ధ్యరంగాలు మానవ మలం తొలగింపు బాధ్యత తీసుకుంటాయి కానీ బహిష్టు వ్యర్థాల తొలగింపుకి మాత్రం వాళ్ళ దగ్గర ప్రత్యేక పద్ధతులు ఏమీ లేవు.

కేవలం వాడి పారేసే నాప్కిన్సే ఉపయోగిస్తే చెత్త పెరిగిపోతుంది. అదొక పర్యావరణ సమస్యగా మారుతుంది. ఇది ప్రస్తుతం ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్య. ఒక సమస్యకి పరిష్కారంగా మరొక సమస్యని సృష్టించుకోకూడదు. మన దేశ వనరులని దృష్టిలో పెట్టుకుని కొత్త సమస్యలుఉత్పన్నం కాని పద్ధతిలో పరిష్కారం గురించి ప్లాన్‌ చేయాలి. చెత్త తొలగింపు నిర్వహణ మనకి యిప్పటికే తలకిమించిన భారంగా ఉన్నది. వాడి పారేసిన నాప్కిన్స్‌ని సరయిన పద్ధతిలో గనక తొలగించకపోతే, అది మరొక పెద్ద పర్యావరణ సమస్యగా తయారవుతుంది. ఏ కార్యక్రమం అయినా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో బహిష్టు పరిశుభ్రతని ప్రోత్సహిస్తున్నప్పుడు, వ్యర్థాల తొలగింపు పద్ధతులని కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

బహిష్టు రక్తస్రావాన్ని పీల్చే పదార్థాలు, వాటిని ఉపయోగించే, పారవేసే, తిరిగివాడే పద్ధతులు వారి వారి పరిస్థితులని, అంగీకారాన్ని పట్టి ఉండాలి. తప్పనిసరిగా ఆ పద్ధతి పరిశుభ్రమైనది అయివుండాలి. పర్యావరణానికి హాని కలిగించని పద్ధతిలో శుభ్రపరిచి తిరిగి వాడుకోడానికి వీలైన పద్ధతులని పరిశుభ్రత కోసం అనుసరించవచ్చు. ఉదాహరణకి నూలు బట్ట.

ఇంట్లో బట్టతో తయారు చేసుకునే పాడ్‌ వల్ల ఖర్చు తక్కువ, కానీ వీటిని పరిశుభ్రమైన పద్ధతలో ఉతికి, ఎండలో ఆరబెట్టాలి. కానీ బహిష్టుల గురించే జ్ఞానం లేని పిల్లలు వాటిని శుభ్రపరుచుకునే పద్ధతుల గురించి ఎలా తెలుసుకుంటారు? బహిష్టు సమయంలో అంటరానితనాన్ని పాటిస్తూ, వాడిన బట్టని ఉతికి ఎవరికంటా పడకుండా ఆరబెట్టి, దాచి పెట్టాలి కదా!

బహిష్టు పరిశుభ్రతా వ్యర్థాలని ఏ విధంగా తొలగించాలి అనే విషయంలో మన దేశంలో కొన్ని మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమిళనాడులో యూనిసెఫ్‌ చవకగా తయారయ్యే కొలిమిలను ఏర్పాటు చేసింది. వీటిని కట్టెలతోను, కరెంటుతోను కూడా నడపవచ్చు. వీటిలో శానిటరీ నాప్‌కిన్స్‌ని పారవేయవచ్చు. మహారాష్ట్రలో బాలికల మరుగుదొడ్లకి ప్రత్యేకమైన గుంటలని ఏర్పాటు చేసారు. వాడిన నాప్కిన్స్‌ యిందులో పడేస్తే అవి కంపోస్టు అవుతాయి. ఉత్తరప్రదేశ్‌లో జల్లెడపట్టిన కలపపొట్టుని బట్టలో చుట్టి నాప్కిన్స్‌ని తయారు చేస్తున్నారు. ఈ పదార్థాలు తేలికగా మట్టిలో కలిసిపోతాయి. ఇవన్నీ కూడా ప్రయోగాత్మకంగా జరుగుతున్న మంచి ప్రయత్నాలు. స్థానికంగా శానిటరీ నాప్కిన్స్‌ని తయారు చేస్తే స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవడమే కాక, కొనసాగడానికి, వ్యర్థాలని తొలగించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.

శానిటరీ ప్యాడ్స్‌ చవకగా అందించడం, నాణ్యత కలిగిన, స్థానికంగా దొరికే వస్తువులతో తయారైన, పారవేయడంలో మనుషులకి, ప్రకృతికి హానికలిగించని పద్ధతిని ఏర్పరచుకోవడం తక్షణ అవసరం. అయితే సమస్యని శాశ్వతంగా పరిష్కరించడానికి మాత్రం అవగాహనతో సామాజిక మార్పురావాలి. ప్రతి కార్యాక్రమం ఆ దిశగా పని చేయాలి. సామాజిక ఆంక్షలు తొలగినప్పుడే, రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేనప్పుడే నిజమైన పరిశుభ్రత మొదలవుతుంది.

బహిష్టు, దాని సంబంధిత పరిశుభ్రతా బహిరంగంగా చర్చించగలిగితే సమస్య పరిష్కారం అవుతుంది. బహిష్టు గురించి, బహిష్టు పరిశుభ్రత గురించి కొన్ని కార్యక్రమాలలో సమాచారాన్ని యివ్వడం వల్ల పాటించే పద్ధతులలో చాలా మెరుగుదల కనిపించింది. తల్లుల నుంచి కానీ స్కూలు, లేదా ఇతరుల నుంచి కానీ సమాచారాన్ని తెలుసుకున్నవాళ్ళు, శిక్షణ పొందిన వాళ్ళు నెలసరి సమయంలో మెరుగ్గా ప్రవర్తిస్తారని, వాడిన ప్యాడ్స్‌ని పారవేయడంలో కూడా సరయిన పద్ధతిలో చేస్తారని తెలుస్తోంది.

ఒక్కసారి మాట్లాడితే నిశ్శబ్దం తలుపు తట్టినట్టవుతుంది. పదే పదే మాట్లాడితే నిశ్శబ్దం బీటలువారుతుంది. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటె నిశ్శబ్దం బద్దలవుతుంది. ప్రవర్తన మారాలి అంటే అవగాహన ఏర్పడాలి. సౌకర్యాలు వుండాలి. రెండూ ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేసుకుంటాయి.

అధ్యాయం 3

ప్రభుత్వ ప్రభుత్వేతర కార్యక్రమాలు – బహిష్టు పరిశుభ్రతారంగం

ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల కార్యక్రమాలు ప్రధానంగా మూడు రకాలుగా ఉన్నాయి. ఒకటి బహిష్టు గురించి వున్న నమ్మకాలు, ఆంక్షలు, నియంత్రణలు గురించి అధ్యయనం చేయడం. పరిశుభ్రతా పద్ధతులు బాలికల, స్త్రీల చదువు, పని, ఆరోగ్యం, సామాజికహోదా, సాధికారాతల మీద చూపిస్తున్న ప్రభావాన్ని అధ్యయనాల ద్వారా అర్థం చేసుకోవడం. రెండో అడుగు బాలికలకి, స్త్రీలకు బహిష్టు పరిశుభ్రత పట్ల అవగాహన కలిగించడం, అందుకు అవసరమైన ఐ.ఇ.సి మెటీరియల్స్‌ని తయారు చేయడం. అవగాహన కలిగించడానికి ప్రచార కార్యక్రమాలు చేపట్టటం. మూడవది – ఎక్కువగా జరుగుతున్న కార్యక్రమం, తక్కువ ధరలో లేదా ఉచితంగా శానిటరీ నాప్కిన్స్‌ని పాఠశాల విద్యార్థులకి, స్త్రీలకి సరఫరా చేయడం, వాడిన నాప్కిన్స్‌ని పారవేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడం.

అధ్యయనాలు

స్త్రీల ఆరోగ్యం మీద జరిగిన అధ్యయనాలు ఎక్కువ భాగం ప్రత్యుత్పత్తి వ్యవస్థ, లైంగిక వ్యాధులకే ప్రాధాన్యతనిచ్చాయి. బహిష్టు పరిశుభ్రత అనే విషయాన్ని ఈ మధ్య కాలంలోనే పట్టించుకోవడం మొదలైంది. ఈ అధ్యయనకారులు కూడా ఎక్కువ భాగం కౌమార దశలో ఉన్న ఆడపిల్లల మీదే దృష్టిపెడుతున్నారు.

ఈ అధ్యయనాలు, అదృష్టవశాత్తు, బహిష్టు శుభ్రతకు సంబంధించిన నిత్య జీవిత అవసరాలు, పరిష్కార మార్గాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి.

ఇప్పటిదాకా వచ్చిన అధ్యయనాలలో కనుగొన్న అంశాలను పరిశీలిస్తే సమస్య తీవ్రత అర్థమవుతుంది. మారియా ఫెర్నాండేజ్‌, ఇందిరా ఖురానా, రిచర్డ్‌ మహాపాత్ర 2008లో జరిపిన అధ్యయనంలో 41% మంది స్త్రీలు బహిష్టు మొదలవడానికి ముందు శారీరకంగా కానీ, మానసికంగా కానీ సంసిద్ధులు కాలేదని తెలిసింది.

దాస్‌గుప్త, సర్కార్‌ 2008, ధింగ్రే, కుమార్‌, కౌరు 2009లో జరిపిన అధ్యయనాలలో దక్షిణ భారతదేశంలో ప్రత్యుత్పత్తి ఆరోగ్యానికి విద్యారంగంలో అతి తక్కువ చోటుందని అభిప్రాయపడ్డారు.

ఎక్కువ మంది ఆడపిల్లలు బహిష్టు ప్రధానంగా రక్తస్రావం అవుతున్నప్పుడు బట్ట వాడటం గురించి, సంబరాల గురించి, నిషేధాలు గురించి, మొగవాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయం గురించే ఉంటాయని 2009లో వాటర్‌ఎయిడ్‌ సంస్థ చేసిన అధ్యయనం వ్యాఖ్యానించింది.

ఋతుక్రమ ఆరోగ్యం, బహిష్టు పరిశుభ్రత గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల పాటించే పద్ధతులు అపరిశుభ్రంగా ఉండటం దాని వల్ల స్త్రీలు అనారోగ్యం పాలవడం జరుగుతోందని 2010లో నెల్సన్‌ చేసిన అధ్యయనంలో వెల్లడయింది.

పారిశుద్ధ్యం మీద దక్షిణ ఆసియా దేశాల సమావేశం

ప్రభుత్వ విధానాలని ప్రతిఫలించే సాకోసాన్‌ సమావేశాల ప్రకటనలని చూసినట్లయితే ప్రభుత్వం తన అవగాహనని పెంచుకుంటోందని, వాష్‌ సంబంధిత అంశాలలో నెలసరి పరిశుభ్రత తప్పనిసరిగా చోటుచేసుకుంటోందనీ అనిపిస్తుంది. అయితే పౌరసమాజ సంస్థలు కూడా పాల్గొంటున్న ఈ సమావేశాలలో వినిపిస్తున్నంత, కనిపిస్తున్నంతగా నెలసరి పరిశుభ్రతా అంశాలు ప్రభుత్వ కార్యక్రమాలైన రాజీవ్‌ విద్యా మిషన్‌లో కానీ, నిర్మల భారత్‌ అభియాన్‌లో కానీ, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌లో కాని కనిపించడం లేదు. ఈ కార్యక్రమాలు నెలసరి పరిశుభ్రతా అంశాల మీద ప్రత్యక్ష ప్రభావాన్ని చూపించగల కార్యక్రమాలు.

సాకోసాన్‌ 3వ సమావేశం ఢిల్లీలో జరిగినప్పుడు చేసిన ప్రకటనలో జండర్‌ ఫ్రెండ్లీ పారిశుద్ధ్య విధానాన్ని కలిగి ఉంటామనీ, స్త్రీల ప్రత్యేక పరిశుభ్రతా అంశాలను (బహిష్టు పరిశుభ్రత) ప్రణాళికల్లోను, అమలు చేయడంలోను, పర్యవేక్షణ మరియు ఫలితాల మదింపులోను సమ్మిళితం చేస్తామని తెలిపారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రతా కార్యక్రమాలలో స్త్రీల పాత్రను పెంచుతామని కూడా అన్నారు.

నాల్గవ సమావేశ ప్రకటన బహిష్టు పరిశుభ్రతపై మరింత స్పష్టంగా కనిపించింది. పాఠశాలల్లో వాష్‌ సౌకర్యాలలో బాలబాలికలకి ప్రత్యేక మరుగుదొడ్లతోపాటు, బాలికల మరుగుదొడ్లలో నెలసరి పరిశుభ్రతకి ఏర్పాట్లు ఉండాలని అన్నారు. అధిక ప్రాధాన్యత గల అంశాలలో బహిష్టు పరిశుభ్రత కూడా కలిపి ప్రత్యేక సూచికలు తయారు చేయాలని అన్నారు.

అయిదవ సాకోసాన్‌ సమావేశంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో, ముఖ్యంగా స్కూళ్ళు, ఆసుపత్రులలో నెలసరి పరిశుభ్రతా సౌకర్యాలను ఏర్పరచాలనీ, వీటి రూపకల్పన, నిర్వహణ, నాణ్యతలను పర్యవేక్షించాలనీ తీర్మానం చేసారు.

ప్రచార ఉద్యమాలు

ప్రచార ఉద్యమాలు వివిధ దేశాలతో పాటు భారతదేశంలో కూడా జరగుతున్నాయి. తమిళనాడులో మాత్రం ఒక కార్యక్రమం నిరంతరంగా జరుగుతోంది.

నిర్మల భారత్‌ యాత్ర

భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ పారిశుద్ధ్య సౌకర్యాల కల్పన కోసం (బళ్ళో, ఇంట్లో) రూపొందించిన కార్యక్రమం నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ (ఎన్‌.బి.ఎ). ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్యము పరిశుభ్రతా అంశాల మీద అవగాహన కల్పించడం కోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలలో 6 పట్టణాలలో ‘నిర్మల్‌ భారత్‌ యాత్ర’ అనే పేరుతో ఒక క్యాంపెయిన్‌ నిర్వహించింది. ఇందులో అనేక స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నాయి. ముఖ్యంగా వాష్‌ యునైటెడ్‌, డబ్ల్యు.యస్‌.యస్‌.సి.సి., క్విక్‌శ్యాండ్‌ సంస్థలు కలిసి బహిష్టు పరిశుభ్రత అంశాల మీద ఒక లాబ్‌ని నిర్వహించారు. భారతదేశంలో మొదటిసారిగా బహిరంగంగా బహిష్టు పరిశుభ్రతని గురించి చర్చించడం జరిగింది ఈ యాత్రలోనే.

నిర్మల భారత్‌ యాత్రలో ముఖ్యభాగం ఆడపిల్లలతోటి, వాళ్ళ తల్లుల తోటి, తండ్రులతోటి, చెల్లెళ్లతోటి, అన్నదమ్ములతోటి, టీచర్లతోటి ఏవిధమైన ఇబ్బంది లేకుండా బహిష్టు పరిశుభ్రత గురించి మాట్లాడటం, నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టటమే ముఖ్యమైన వుద్దేశ్యం.

శానిటరీ డిగ్నిటీ క్యాంపెయిన్‌

నెలసరి పరిశుభ్రత అనేది స్త్రీల సమస్యగానే కాక విస్త ృత సామాజిక బాధ్యతగా గుర్తించాలి. ఈ బాధ్యత స్త్రీ పురుష సమానత్వానికి దారి తీయాలి అనే అవగాహనతో వాటర్‌ రీసర్చి కమీషన్‌ పరిశుభ్రతా గౌరవ ప్రచారం (శానిటరీ డిగ్నిటి క్యాంపెయిన్‌) నడిపింది. బహిష్టు పరిశుభ్రతని నీరు, పారిశుద్ధ్యం, వ్యర్థాల తొలగింపు, ఆరోగ్యం, సాంకేతికత, పరిశుభ్రతలని కలిపి విస్త ృత నేపథ్యంలో చర్చించాలి. ఆరోగ్యం, పరిశుభ్రతా అవగాహన చేతులు కడుక్కోవడంతో ఆగిపోకుండా నెలసరి పరిశుభ్రతని కూడా కలుపుకోవాలి.

విమన్‌ ఇన్వాల్వడ్‌ ఇన్‌ శానిటేషన్‌

తమిళనాడులోని భారతీదాసన్‌ యూనివర్సిటీ విమెన్స్‌ స్టడీస్‌ డిపార్టుమెంటు, సోషల్‌వర్క్‌ డిపార్టుమెంటు కలిసి, బహిష్టు పరిశుభ్రతా నిర్వహణ మీద ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ఎన్‌.ఎస్‌.ఎస్‌. శాఖతో కలసి నెలసరి పరిశుభ్రత మీద ప్రచారాన్ని నిర్వహిస్తోంది.

ఈ శాఖలలోని విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలలోని స్త్రీలకి నెలసరి పరిశుభ్రతా నిర్వహణ గురించి అవగాహన కలిగిస్తారు. పట్టణ ప్రాంతాల్లోని బస్తీల్లో కూడా ఈ కార్యక్రమం సాగింది. మహిళా కళాశాలలు, కో-ఎడ్యుకేషన్‌ కళాశాలలు, స్కూల్సులో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ప్రభుత్వ ఆరోగ్య, విద్యా, నీరు, పారిశుద్ధ్యము, గ్రామీణాభివృద్ధి శాఖలకి నెలసరి పరిశుభ్రత మీద అవగాహన కలిగించారు. నెలసరి మీద వున్న ఆంక్షలు, నియంత్రణలు, ఆరోగ్యకరమైన శానిటరీ ప్యాడ్స్‌ని వాడటం మీద దృష్టి పెట్టారు. విద్యా సంస్థలలో ముఖ్యంగా హాస్టళ్ళు ఉన్నచోట కొలిమిలు ఏర్పాటు చేయడాన్ని ప్రోత్సహించారు.

అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు

టోటల్‌ శానిటేషన్‌ క్యాంపెయిన్‌లో పాఠశాలల్లో ఆడపిల్లకి, మొగపిల్లకి వేరు వేరు టాయిలెట్‌ బ్లాకులు నిర్మించేందుకు వీలు కల్పించారు.

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాడిన నాప్కిన్స్‌ పారవేయడానికి డస్ట్‌బిన్స్‌, కాల్చి వేయడానికి  కొలిమిలు (తమిళనాడు) కూడా ఏర్పరచారు. తక్కువ ధరకీ, ఉచితంగాను కూడా శానిటరీ న్యాప్కిన్స్‌ అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

మహారాష్ట్ర, తమిళనాడుల్లో తక్కువ ధరకి నాప్కిన్స్‌ తయారు చేయడానికి స్వయం సహాయక బృందాలని ప్రోత్సహిస్తున్నారు. కొన్ని ఉన్నత పాఠశాలల్లో శానిటరీ నాప్కిన్స్‌ అమ్మే యంత్రాలను కూడా ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు.

తమిళనాడు రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధిశాఖ 341 మహిళా పబ్లిక్‌ టాయిలెట్‌ కాంప్లెక్సులలోను, 33 పాఠశాలల్లోను కొలిమిలు ఏర్పాటు చేసారు. వాడిన నాప్కిన్స్‌ కాల్చివేయడానికి ఇవి ఉపయోగపడతాయి. యూనిసెఫ్‌లాంటి సంస్థలు ఇతరులతో కలిసి ఐ.ఇ.సి. ట్రైనింగ్‌ మెటీరియల్స్‌ని తయారు చేసారు. తెలుగులో ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణాభివృద్ధి ఎకాడమీ పూర్తిస్థాయిలో శిక్షకుల శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తోంది.

2003-04 సంవత్సరంలో ప్రభుత్వం ప్రారంభించిన ఎన్‌.పి.ఇ.జి.ఇ.ఎల్‌. కార్యక్రమం 7, 8 తరగతులు చదివే బాలికల కొరకు ప్రత్యేకంగా విశ్రాంతి గదులు కట్టించడం, ఆటవస్తువులు, గ్రంధాలయాలు, అవగాహనా కార్యక్రమాలు, ఆరోగ్య సేవలు, కౌన్సిలింగ్‌ సేవలు, ఒకేషనల్‌ స్కిల్స్‌ మొదలైన కార్యక్రమాలు అమలు చేశారు. శానిటరీ నేప్‌కిన్స్‌ తయారు చేయడాన్ని కూడా బాలికలకు నేర్పించారు. 2012-13 సంవత్సరంలో పాఠశాలల్లో (యు.పి.ఎస్‌, హైస్కూల్‌) చదువుకుంటున్న 36,000 బాలికలకు ప్రతి నెలా నేప్‌కిన్లని అందించారు. కానీ ప్రస్తుతానికి ఈ విద్యా సంవత్సరం నుండి ఈ కార్యక్రమాలను నిలిపివేసారు.

భారత ప్రభుత్వం 2010 జూన్‌లో ఒక కొత్త స్కీముని ప్రవేశపెట్టింది. గ్రామాల్లోని కౌమార బాలికలకి తక్కువ రేటుకి శానిటరీ నాప్కిన్స్‌ని (ఆరు నాప్కిన్స్‌ ఆరు రూపాయలు) అందచేయడం ఆ స్కీము లక్ష్యం.

అధ్యాయం 4

క్షేత్రస్థాయి పరిస్థితి – ‘మారి’ చేసిన అధ్యయనం

బహిష్టు పరిశుభ్రత గురించిన అవగాహన, సౌకర్యాల గురించి జరిగిన అధ్యయనం ఇది. గ్రామీణ ప్రాంతాలలో ఆదివాసీ ప్రాంతాలలో ఆడపిల్లలకి, స్త్రీలకి ఎలాంటి అవగాహన వున్నది, వారికి బహిష్టుకి సంబంధించిన సమాచారం ఎక్కడి నుంచి వస్తున్నది, వారు ఏ విధమైన పరిశుభ్రతా పద్ధతులని పాటిస్తున్నారు, మెరుగైన పద్ధతుల కోసం ఏ విధమైన వసతులు కావాలి అనే అంశాలను ఈ అధ్యయనం పరిశీలించింది.

ఇది వరంగల్‌ జిల్లాలోని తాడ్వాయి, గూడూరు, శాయంపేట మండలాల్లోని వెయ్యి మంది బాలికలు, స్త్రీలతో జరిగింది. ఇందులో 10-16 ఏళ్ళ బాలికలు బడుల్లో, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళు, బడి మానేసినవాళ్ళు, 16 ఏళ్ళు పైబడిన స్త్రీల నుంచి సమాచారం సేకరించాం. సమాచారాన్ని వయసు, చదువు, కులం, పనిబట్టి విశ్లేషించాం. ఇవన్నీ కూడా వారు పాటించే పద్ధతులు, అవగాహన మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ప్రశ్నావళి, బృంద చర్చల ద్వారా ఈ మొత్తం సమాచారాన్ని సేకరించాం.

సమాచారం – అవగాహన :

బహిష్టు అనేది ఇప్పటికీ ఒక వ్యక్తిగత, రహస్య వ్యవహారంగానే చూడబడుతోంది. ఈ పరిస్థితిలో సమాచారం, అవగాహన చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. సమాచారం సంపూర్ణంగా ఉన్నదా లేదా అనే విషయంతోపాటు అది అనుకూల భావాలను ప్రేరేపిస్తుందా ప్రతికూల భావాలను ప్రేరేపిస్తుందా అనేది కూడా పరిశీలించాలి. సమాచారానికి సంబంధించిన అన్ని అంశాలను అర్థం చేసుకున్నప్పుడే సరైన కార్యక్రమాలను రూపొందించుకోగలుగుతాము.

బహిష్టు మొదలైన వయసు :

10-12 సంవత్సరాల మధ్య బహిష్టులు మొదలైన వారిలో 94 మందికి వారికి బహిష్టులు మొదలైనప్పుడు మాత్రమే దాని గురించి తెలిసింది. 13-15 సంవత్సరాల మధ్య పెద్దమనుషులైన వారిలో సగంకన్నా తక్కువ మందికి మాత్రమే ముందస్తు సమాచారం ఉన్నది. 15 సంవత్సరాల పైబడిన తరువాత పెద్దమనిషి అయినవారు 7% మంది ఉన్నారు. వాళ్ళకు మాత్రం ఋతుక్రమాన్ని గురించి ముందరే తెలిసింది. అంటే వయసు పెరిగిన కొద్దీ బాలికలలో సంసిద్ధత పెరుగుతుంది. కాని ఇంకా చిన్న వయసులోనే  ఆడపిల్లలను సంసిద్ధపరచాల్సిన అవసరం ఉన్నది.

బహిష్టు గురించి తెలుసుకున్న వయసు :

అందరిని కలిపి చూసినట్టయితే 10-12 సంవత్సరాల మధ్య ఎక్కువ మందికి ఋతుచక్రం గురించి తెలిసింది. 40% మందికి 13-15 సంవత్సరాల మధ్య తెలిసింది. పది సంవత్సరాల కంటె ముందే తెలిసినవాళ్ళు 9% ఉన్నారు. ఋతుక్రమం గురించి తెలుసుకున్న వయసు దళితులలో తక్కువగాను, ఇతర వెనకబడిన కులాలలో ఎక్కువగాను ఉన్నది.    16 సంవత్సరాల లోపు బాలికలలో చూసినప్పుడు 56% మంది బాలికలు వారు పెద్దమనుషులైనప్పుడే బహిష్టు గురించి తెలుసుకున్నారు. ఇది పట్టించుకోవాల్సిన విషయం.

ఈ గణాంకాల నుంచి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఆడపిల్లలకు తగినంత ముందుగానే (10 సంవత్సరాల నుంచే) విషయం వివరించి వారిని సంసిద్ధ పరచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందువల్ల వారికి బహిష్టు సమయంలో ప్రవర్తించాల్సిన పద్ధతి పట్ల సరైన అవగాహన ఏర్పడుతుంది.

సమాచార మార్గం

రెండింట మూడు వంతుల మంది ఋతుచక్రం గురించి తల్లుల నుంచే తెలుసుకున్నారు. ఇతర కులాల వారిలో ఈ శాతం కొంచెం ఎక్కువ దళితులలో కొంచెం తక్కువ. ఇతర సమాచార మార్గాలు కుటుంబ సభ్యులు (16%), స్నేహితులు (8%), అమ్మమ్మలు, నానమ్మలు (2%). వెనకబడిన తరగతుల వారిలోను, ఇతర వర్గాలలోను, కుటుంబ సభ్యులమీద, స్నేహితుల మీద ఆధారపడటం తక్కువగా ఉన్నది. ఈ సమాచారం కుటుంబ, సామాజిక సంబంధాలను ప్రతిబింబించవచ్చు. ఇతర కులాల వారిలో తొందరగా వేరు కుటుంబాలు ఏర్పడటం వల్ల, సమాచారం కోసం తల్లుల మీదే ఆధారపడటం ఎక్కువగా ఉండి ఉండచ్చు. అమ్మమ్మలు, నానమ్మలు ముఖ్య సమాచార మార్గంగా ఉన్నారు.

16 సంవత్సరాల లోపు వారిలో అమ్మమ్మలు, నానమ్మలు తల్లులతో సమానంగా పెద్ద సమాచార మార్గంగా ఉన్నారు. మిగిలిన వారిలో 15% మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు మార్గంగా ఉన్నారు.

పిల్లలకు పాఠశాలల్లో విషయం పట్ల అవగాహన పెంచడంతోపాటు సమాచారాన్ని ఒకతరం నుంచి ఇంకోతరానికి అందచేయడంలో తల్లులు, అమ్మమ్మలు, నానమ్మలు ముఖ్యపాత్ర వహిస్తున్నారు కనుక వాళ్ళకు కూడా అవగాహన కలిగించేందుకు ప్రయత్నం చేయాలి.

బహిష్టు గురించిన అవగాహన

సమాచారం తెలిసి ఉండటం ఒకమెట్టయితే అవగాహన కలిగి ఉండటం తరువాతిమెట్టు. ప్రత్యుత్పత్తి అవయవాలు, ఋతుచక్రం, బహిష్టు సమయంలో పరిశుభ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.

ఋతుస్రావం నెలనెలా అవుతుందనే అవగాహన 65% మందికి ఉన్నది. 32% మందికి ఈ రక్తస్రావం యోని నుంచి అవుతుందని తెలుసు. చాలా తక్కువ మందికి పరిశుభ్రత గురించి తెలుసు. వేరు వేరు సామాజిక వర్గాలలో ఈ అవగాహనలో మార్పేమీ లేదు. బృంద చర్చలలో మేము అర్థం చేసుకున్న విషయం, స్త్రీలకు ప్రాథమిక పరిజ్ఞానం మాత్రమే ఉన్నదని. ఆడపిల్లలకు సంబంధించి కూడా పరిస్థితి ఇదే విధంగా ఉన్నది. పరిశుభ్రత, జాగ్రత్తల గురించి కొంచెం మెరుగైన పరిస్థితి ఉన్నది. పాఠశాలలు కూడా జీవననైపుణ్యాలు పెంచి ఆడపిల్లల శారీరక ఎదుగుదల, అవసరాలు మీద శ్రద్ధ పెట్టటం లేదని అర్థం అవుతోంది.

బహిష్టుల పట్ల పురుషుల దృక్పథం

ఆదివాసి సమాజాల్లో ఋతుచక్రం స్త్రీల వ్యవహారంగా భావిస్తారు. పేరంటాలు చేయడం, ఇంట్లో మొగవాళ్ళకు తెలియచేయడం లాంటివి కూడా చేయరు. ఇతర కులాలలో పెద్దమనుషులైనప్పుడు కుటుంబంలోను, బంధువులలోను తెలియచేయడం, సంబురం ఉంటుంది.

ఎవ్వర్లోను కూడా ఇంట్లో మొగవాళ్ళకు నెల నెలా తెలియచేయడం ఉండదు. పెళ్ళయిన ఆడవాళ్ల విషయంలో వాళ్ళ భర్తలకు తెలియడానికి వేరుకారణాలు ఉన్నాయి. ఆడవాళ్ళు తమ తమ భర్తలు ఋతుస్రావ సమయంలో దురుసుగా ప్రవర్తిస్తారని ఫిర్యాదు చేయలేదు. ఇంటా బయట పని చేయకతప్పదని మాత్రమే చెప్పారు.

మొగపిల్లలకు సరైన సమాచారం లేకపోయినందువల్ల వాళ్ళు అనుమానాల్లో పడతారు. ఆడపిల్లలు ఇబ్బంది పడతారు. ఒక 18 సం|| అమ్మాయితో మేము చేసిన కేస్‌స్టడీలో ఈ విషయం చక్కగా వచ్చింది. ఆ అమ్మాయి మాటల్లో ”నేను 13 సంవత్సరాల వయసులో పెద్ద మనిషి అయ్యాను! ఫంక్షన్‌ చేసారు, నాకొక అన్న ఉన్నాడు. ప్రతినెల బహిష్టు సమయంలో నాకు కడుపునొప్పి వచ్చేది. ఒకసారి నాకు నెలసరిలో కడుపునెప్పి వచ్చింది. మా అమ్మ ఇంట్లో లేదు. మా అన్న భయపడిపోయి 108 సర్వీసుకు ఫోన్‌ చేసాడు. ఈలోపు మా అమ్మ వచ్చి భయపడనవసరం లేదనీ నేను పచ్చి మామిడికాయ తినడం వల్ల నెప్పి వచ్చిందనీ చెప్పింది. అప్పటి నుంచి మా అన్న నన్ను పచ్చిమామిడి కాయలు తినకుండా చూసుకుంటున్నాడు”.

ఈ కేసుని మనం పరిశీలిస్తే మనకు అర్థం అయ్యేది అన్నదమ్ములకు, తండ్రులకు, భర్తలకు ఋతుచక్రం మీద, బహిష్టుల మీద కనీస అవగాహన కల్పించకపోతే వాళ్ళు ఆడపిల్లలకు, స్త్రీలకు ఏ విధంగాను సహాయపడలేరు. ఈ పరిస్థితి స్త్రీలను మరిన్ని కష్టాలకు గురిచేస్తుంది.

మౌళిక సదుపాయాలు

స్నానాల గదులు, మరుగుదొడ్లు, నీటి సౌకర్యంలాంటి మౌళిక సౌకర్యాలు స్త్రీ బహిష్టు పరిశుభ్రత పద్ధతులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. స్త్రీలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడానికి మరుగు చాలా అవసరం. ఈ సౌకర్యాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలి. ఈ క్రింది విశ్లేషణ అధ్యయన ప్రాంతాలలో మౌళిక సౌకర్యాల పరిస్థితిని వివరిస్తుంది.

కేవలం 31% మంది స్త్రీలకు మాత్రమే ఇంటి వద్ద మరుగుదొడ్డి సౌకర్యం ఉన్నది. అందులో 21 శాతమే వాడుకోవడానికి పనికి వచ్చే పరిస్థితిలో ఉన్నది. ఇతర సామాజిక వర్గాలలో సగం మందికిపైగా మరుగుదొడ్లు ఉన్నాయి. వెనకబడిన సామాజిక వర్గాలలో 44% మందికి, ఆదివాసీలలో 25% మందికి, దళితులలో 20% మందికి మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి. 90% కుటుంబాలలో మరుగుదొడ్లు కుటుంబసభ్యులు అందరు వాడుతున్నారు. కొన్ని కుటుంబాలలో స్త్రీలో లేదా పురుషులో మాత్రమే మరుగుదొడ్లు వాడటం ఉన్నది.

స్నానాల గదుల విషయానికి వస్తే 94% మంది స్నానాల గదులు ఉన్నట్టే చెప్పారు. అందులో 33% మాత్రమే మంచిగా ఉన్నాయి. మిగిలినవారు తడికెలతో, పట్టాలతో, పరదాలతో, నడుందాకానో, భుజాలదాకానో వచ్చే స్నానాల మరుగుని (గది అనడం అన్యాయం) వాడుకోవాల్సి వస్తోంది. ఆదివాసీ కుటుంబాల్లో గోలాల పక్కన స్త్రీలు స్నానం చేయడం ఇంకా కొనసాగుతోంది. మొత్తం మీద సౌకర్యాల పరిస్థితి మాత్రం దారుణంగానే ఉన్నది. ఆర్థిక పరిస్థితే కాక మగవాళ్ళ మనస్తత్వం కూడా స్త్రీలకు సరైన పారిశుద్ధ్య సౌకర్యాలు లేకుండా చేస్తోంది. ఒక స్త్రీ ఈ పరిస్థితిని చక్కగా వివరించింది:

ఇంటి దగ్గర మరుగుదొడ్డి కట్టించమని, బైటకు పోతే చుట్టు అంతా మగవాళ్ళు ఉంటున్నారని అంటే, ”అందరూ పోతున్నారు కదా, మొగోల్లు నిన్నొక్కతినే చూస్తున్నారా” అన్నాడు నా భర్త అంది. ”కాలానికి కూడా మా మీద కోపం వచ్చినట్టుంది, వానలు కురవనప్పుడు చెరువులోకి పోయే వాళ్ళం, ఇప్పుడు వానలొచ్చి చెరువు నిండింది. భూములనిండా పంటలున్నాయి, మేం బైటకు పోవడానికి చోటే లేదు” అని ఇంకో ఆమె బాధ చెప్పుకుంది.

మొత్తం మీద మగవాళ్ళు మరుగుదొడ్లు, స్నానాల గదులు కట్టటం అవసరంగా భావించడం లేదు. అవి కేవలం స్త్రీల అవసరాలుగానే భావిస్తున్నారు. పత్తిపాక గ్రామాన్ని తీసుకుంటే ఆ ఊరిలో 315 కుటుంబాలు ఉన్నాయి, చాలా పక్కా ఇళ్ళు కూడా ఉన్నాయి. కాని కేవలం 15 ఇళ్ళకు మాత్రమే సరైన మరుగుదొడ్డి, స్నానాలగది ఉన్నాయి.

అయితే హాస్టళ్ళలో చదువు కుంటున్న ఆడపిల్లలు ఇళ్ళలో గట్టిగా మాట్లాడితే వాళ్ళ అవసరాల దృష్ట్యా పరిస్థితుల్లో కొంత మార్పు వస్తోంది. బహిష్టు పరిశుభ్రత ఎజెండాలో లేకపోయినా, సామాన్య పారిశుద్ధ్యం కోసం ఎన్‌.జి.ఒలు, ప్రభుత్వాలు పని చేస్తున్నందువల్ల కూడా కొంత మార్పు వస్తోంది.

పరిశుభ్రతా పద్ధతులు :

ఇంతకు ముందు చెప్పినట్టు నెలసరి సమయంలో రక్తస్రావాన్ని పీల్చడానికి రకరకాలు పదార్థాలు వాడతారు. శుభ్రమైన, సౌకర్యవంతమైన, బట్టనో, నాప్కిన్‌లనో వాడటంతోపాటు, తరచుగా వాటిని మార్చడం కూడా అవసరం.

వాడుతున్న రకాలు :

మూడువంతుల మంది నూలు బట్టను వాడుతున్నారు. శానిటరీ నాప్కిన్‌ లేదా ప్యాడ్‌ను వాడుతున్న వాళ్ళు 19% మంది ఉన్నారు. ఇందులో ఒసిలు, బిసిలు ఎక్కువ మంది ఉన్నారు. చాలా తీవ్రమైన పద్ధతి గోనెపట్టా వాడటం. ఈ పద్ధతి 5% మందే పాటిస్తున్నా అందులో యస్‌.టి.లు ఎక్కువ మంది ఉన్నారు. కొంతమంది యస్‌.సి.లు, బి.సి.లు కూడా ఉన్నారు. ఈ అధ్యయనంలో సేకరించిన సమాచారం వల్ల స్పష్టంగా తెలుస్తున్న అంశం మంచి పద్ధతిని అనుసరించడం మీద వయసు, వృత్తి ప్రభావం చూపిస్తున్నాయని.

30 సంవత్సరాలలోపు వాళ్ళల్లో నాల్గోవంతు మంది శానిటరీ నాప్కిన్స్‌ని వాడుతున్నారు. 30 సంవత్సరాలు పైబడిన వారిలో శానిటరీ నాప్కిన్స్‌ వాడటం తక్కువగా ఉన్నది. గోనె పట్టాలను వాడుతున్నవారు కూడా 30 సంవత్సరాలపై బడిన వారే.

ఉద్యోగస్తులైన స్త్రీలలో కూడా శానిటరీ నాప్కిన్స్‌ను వాడటం ఎక్కువే (59%) ఉన్నది. మొత్తం మీద శానిటరీ నాప్కిన్స్‌ వాడే వాళ్ళను చూస్తే వ్యవసాయం, కూలి చేసుకునే వారు అతి తక్కువ. నాప్కిన్స్‌ గ్రామాల్లో దొరకవు. పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉన్న ఉద్యోగస్తులను, 30 సంవత్సరాల లోపు వాళ్ళను గమనిస్తే వాళ్ళు గ్రామం బైటికివెళ్ళి నాప్కిన్స్‌ కొనుక్కునే పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది.

బృంద చర్చలలో తెలిసిన విషయం తల్లులు పాతబట్టవాడి, పిల్లల కోసం నాప్కిన్స్‌ను కొంటున్నారు. గ్రామాల్లో నాప్కిన్స్‌ దొరకవు కాబట్టి మండలాలకు వెళ్ళినప్పుడే కొనితెచ్చుకోవాలి. ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్ళడం వల్ల నాప్కిన్స్‌ వాడటం పెరిగింది. కానీ ఇంకా ఇప్పటికీ ఆడపిల్లలు మందుల షాపుకుగానీ, కిరాణా దుకాణానికి కాని వెళ్ళి చొరవగా నాప్కిన్స్‌ కొనుక్కునే పరిస్థితి లేదు. తల్లులు కాని ఇతర స్త్రీలు కాని వారి కోసం కొని తేవలసిందే. నాప్కిన్ల గురించి ప్రసవాలకు ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు కూడా తెలుసుకుంటున్నారు. కూతుళ్ళ దగ్గరి నుంచి తల్లులు తెలుసుకుంటున్నారు. నాప్కిన్స్‌ వాడటంలో ఉన్న సౌకర్యం ఉతకాల్సిన అవసరం లేదు, నడవడానికి, కూర్చోడానికి సౌకర్యంగా ఉంటుంది అని గ్రహించడం వల్ల స్త్రీలు నాప్కిన్స్‌ వాడటాన్ని ఇష్టపడుతున్నారు. ఇందు కోసం స్త్రీలు లోదుస్తుల్ని కూడా వాడుతున్నారు.

కొందరు తల్లులు నాప్కిన్స్‌ వాడటం అవసరంగా కంటె సౌకర్యంగా భావిస్తున్నారు. ఈ సౌకర్యాన్ని వాళ్ళ బిడ్డలు అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నారు. గత అయిదారు సంవత్సరాల నుంచి ఉపాధి హామీ పథకం కింద కొంతడబ్బు అందుబాటులోకి రావడం కూడా ఇందుకు కారణం కావచ్చు. చాలా మంది స్త్రీలు తమ కోసం మాత్రం 25/30 రూపాయలు ఖర్చుపెట్టుకోడానికి సిద్ధంగా లేరు. స్త్రీలుగా తమని తాము తక్కువగా చూసుకోవడం, ఆరోగ్యంతో ఉన్న ప్రత్యక్ష సంబంధాన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోవడం ఇందుకు కారణాలు.

స్త్రీలతో పోల్చినప్పుడు ఆడపిల్లల పరిస్థితి మెరుగ్గా ఉన్నది. వాళ్ళల్లో 66% మంది శానిటరీ నాప్కిన్స్‌ను ఉపయోగిస్తుండగా 34% మందే బట్టను వాడుతున్నారు. హాస్టళ్ళలో ఉన్న వాళ్ళకు, ఇంటి నుంచి పాఠశాలకు వెళుతున్న వాళ్ళకు, 16 సంవత్సరాలలోపు స్కూల్‌కు వెళ్ళని వాళ్ళకు మధ్య చెప్పుకోతగినంత తేడాలు ఉన్నాయి. హాస్టళ్ళలో ఉన్న పిల్లల పరిస్థితి అందరికంటె మెరుగ్గా ఉన్నది. నాప్‌కిన్స్‌ను ఉచితంగా సరఫరా చేయడం వల్ల కావచ్చు. స్కూల్‌కెళ్ళని వాళ్ళలో 4% మాత్రమే నాప్‌కిన్స్‌ను వాడుతున్నారు. అందుకు కారణం  అవగాహన లేకపోవడం, డబ్బు ఖర్చు చేయలేకపోవడం కావచ్చు.

రోజుకు నాప్‌కిన్స్‌ / బట్ట ఎన్నిసార్లు మార్చుకుంటారు

సుమారు 43% రోజుకు రెండుసార్లు మార్చుకుంటున్నారు. ఇది ఆరోగ్యవంతమైన అలవాటు కాదు. మూడుసార్లు మార్చుకునే వాళ్ళు 39% మంది, అంతకంటే ఎక్కువసార్లు మార్చుకునే వాళ్ళు 5% మంది ఉన్నారు. ఇది ఆరోగ్యకరమైన అలవాటు. బాధాకరమైన విషయం 13% మంది కేవలం రోజుకు ఒక్కసారే మార్చుకుంటున్నారు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నది. మార్చుకునే పద్ధతిని వయసుతో పోల్చిచూసినట్లయితే     రోజుకు మూడుసార్లు మార్చుకునేవారు 20 సంవత్సరాల లోపు వాళ్లు, రెండుసార్లు మార్చుకునే వాళ్ళల్లో సగం మంది 21-30 సంవత్సరాల వయసువాళ్ళు. రోజుకు రెండుసార్లు అంతకంటె తక్కువ మార్చుకునే వాళ్ళు కూలీలు లేదా చిల్లర వ్యాపారం చేసుకునేవాళ్ళు. వాళ్ళ పని ప్రాంతాలలో ఏవిధమై మరుగు సౌకర్యం లేక పోవడమే ఇందుకు కారణం.

మొత్తంగా చూసినట్లయితే 44% మంది ఆడపిల్లలు రోజుకు రెండుసార్లు మార్చుకుంటున్నారు, 36% మంది మూడుసార్లు, 15% మంది నాలుగుసార్లు, 4% మంది మాత్రం రోజుకు ఒక్కసారే మార్చుకుంటున్నారు. హాస్టళ్ళలో ఉన్న పిల్లలకు ఇంటి నుంచి స్కూళ్ళకు వస్తున్న పిల్లలకు మధ్య కొంత వ్యత్యాసం ఉన్నది.

హాస్టల్లో ఉన్న పిల్లల్లో అత్యధిక శాతం (64%) మంది 3 లేదా అంతకంటె ఎక్కువసార్లు మార్చుకుంటున్నారు. అదే వయసులో ఉన్న వాళ్ళల్లో ఇంటి నుంచి వచ్చేవారు ఎక్కువ మంది రెండుసార్లు, స్కూల్‌కు వెళ్ళని వాళ్ళల్లో ఒక్కసారే మార్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు. పిల్లలు ఎక్కడ ఉంటున్నారు అనేది వాళ్ళ పద్ధతిని ప్రభావితం చేస్తోంది. స్కూల్‌లో నాప్‌కిన్‌ మార్చుకునే సౌకర్యం లేకపోవడం ప్రధాన కారణం. మధ్యలో ఇంటికి వెళ్ళే వీలు ఉన్న వాళ్లు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటామని బృంద చర్చల్లో తెలియచేసారు. హాస్టళ్ళలో ఉన్న పిల్లల విషయంలో కూడా ఒక్క ప్యాకెట్‌ అనికాకుండా అవసరాన్ని పట్టి సరిపడ నాప్‌కిన్స్‌ సరఫరా చేయడం, ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం, సరయిన పర్యవేక్షణ ద్వారా పరిస్థితిని మరింత మెరుగుపరచవచ్చు.

బట్టను తిరిగి వాడటం :

పరిశుభ్రత విషయంలో మరొక ముఖ్యమైన అంశం, బట్టను వాడేటప్పుడు ఏ విధంగా శుభ్రపరుస్తారు, భద్రపరుస్తారు, ఎన్ని నెలలు వాడతారు అనేది.

దాదాపు 10% మంది బట్టను రెండు, మూడు నెలలు వాడతామని తెలిపారు. ఆరునెలలు లేదా బట్ట చినిగిపోయేదాకా వాడతామని 5% మంది చెప్పారు. ఈ రెండు కూడా 21-30 సంవత్సరాల వయసు ఉన్న వారు ఎక్కువగా అనుసరిస్తున్న పద్ధతి.

హాస్టళ్ళలో ఉండి బట్టను ఉపయోగిస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది బట్టను ఒకసారే వాడుతున్నారు. 10% మంది ఒక ఋతుచక్రానికి వాడుతున్నారు. అతికొద్ది మంది మాత్రమే ఒకనెల కంటే ఎక్కువ వాడుతున్నారు. పాఠశాలకు వెళ్ళని 16 సంవత్సరాలలోపు పిల్లల్లో మాత్రం అధిక శాతం బట్ట చిరిగిపోయేదాకా వాడుతున్నారు.

బట్టను పదే పదే వాడటం వల్ల, సరైన పద్ధతిలో శుభ్రపరచకపోవడం వల్ల, శుభ్రమైన చోట భద్రపరచకపోవడం వల్ల బట్టలలో సూక్ష్మక్రిములు చేరి అనారోగ్యానికి కారణం అవుతుంది. స్నానాల గదులు లేనిచోట బట్టను వేడి నీళ్ళల్లో, సబ్బుతో ఉతికి ఎండలో ఆరవేయడం సాధ్యమైన పనికాదు. బట్టను మళ్ళీ వాడటానికి చూర్లల్లో పెడతామని తెలిపారు.

వాడిన బట్టను లేదా నాప్‌కిన్‌ను పారవేసే పద్ధతి :

మొత్తం మీద 48% స్త్రీలు తాము ఉపయోగించిన బట్ట / నాప్‌కిన్‌ను కాల్చివేస్తామని తెలిపారు. గుంటలలో పారవేసే వాళ్ళు 16% మంది ఉన్నారు. ఈ రెండు పద్ధతులు కూడా ఆచరించతగినవే. వాడిన బట్టను సరయిన పద్ధతిలో పారవేయడానికి కొన్ని నమ్మకాలు కూడా తోడ్పడతాయి. తాము వాడి పారేసిన బట్టను ఎవరైనా తొక్కినట్టయితే పిల్లలు పుట్టరని గ్రామీణులు నమ్మడం వల్ల పారవేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు.

ఇతర పద్ధతులకు వస్తే 14% మంది తుప్పల్లో పారేస్తామని, 12% మంది డ్రైనేజ్‌/మురుగు కాలువలో పడేస్తామని చెప్పారు. కాల్చడం, గుంటలలో పడేయడం అనే పద్ధతులు 30 సంవత్సరాల పైబడిన వారిలోనే ఎక్కువగా ఉన్నాయి. వాడిన నాప్‌కిన్స్‌ / బట్టను డ్రైనేజ్‌ / మురుగుకాలువలో పడవేయడం వల్ల మురుగు నీటి పారుదలకు అడ్డంకి ఏర్పడుతుంది. పట్టణ ప్రాంతాలలో వాడి పారేసిన నాప్‌కిన్స్‌ డ్రైన్‌లకు అడ్డం పడుతున్నాయని ఇప్పటికే గమనించడం జరిగింది. ఈ పద్ధతిని పాటించడం నిరోధించాలి.

హాస్టళ్ళలో ఉన్న ఆడపిల్లలు చెత్తబుట్టల్లో పడేస్తున్నారు. అవి మొత్తం చెత్తతో కలిపి చెత్తకుప్పల్లోకి వెళ్ళిపోతాయి. ఇళ్ళ నుంచి స్కూల్‌కు వెళుతున్న వాళ్ళు, స్కూల్‌కు వెళ్ళని 16 ఏళ్ళ లోపు వాళ్ళు మురుగుకాలవల్లో పడవేస్తున్నారు. కాల్చడం కాని, పాతిపెట్టడం కానీ వీళ్ళల్లో లేదు. ఈ పద్ధతులు కూడా అనుసరించదగినవి కావు.

ఆడపిల్లలు నాప్‌కిన్స్‌ను పర్యావరణానికి, పారిశుద్ధ్యానికి నష్టం కలిగించని రీతిలో పారవేయగలిగిన పద్ధతులను ఆలోచించాలి.

నాప్‌కిన్స్‌ వాడకపోవడానికి కారణాలు :

నాప్‌కిన్స్‌ వాడకపోవడానికి రెండు ప్రధాన కారణాలు అందుబాటులో లేకపోవడం, కొనలేకపోవడం.

71% మంది కూలీ పని చేసేవాళ్ళు కొనలేకపోవడం వల్ల నాప్‌కిన్స్‌ వాడటం లేదని తెలియచేసారు. నాప్‌కిన్స్‌ వాడకపోవడానికి మరొక కారణం 21-30 సంవత్సరాల మధ్య వయసు వాళ్ళకు సౌకర్యవంతంగా ఉండకపోవడం. ఈ కారణాలన్నింటినీ ఇతర దృక్కోణాల నుంచి కూడా పరిశీలించాలి.

ఎనిమిది నాప్‌కిన్స్‌ ప్యాకెట్‌ 22 రూపాయలకు (ప్రాక్టర్‌ & గాంబిల్‌ వారివి) దొరుకుతుంది. అటువంటప్పుడు కొనలేం అనే వాదన పూర్తి సమర్ధనీయమైనదీ, అంగీరించదగినది కాదు. ఇక్కడ సమస్య స్త్రీల అవసరాలకు అది అత్యవసరమైనా కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం. ఇందుకు కారణం సమాజంలో స్త్రీల పరిస్థితే. స్త్రీలకు సౌకర్యాలు మెరుగుపడాలంటే, సమస్యను కేవలం సాంకేతికమైన దానిగానో, ఆర్థికమైన దానిగానో చూడకూడదు.

దక్షిణ భారతదేశంలో స్త్రీలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో, పెళ్ళిళ్ళు అయినాక చీరలు కట్టుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న నాప్‌కిన్స్‌కు లోదుస్తులు తప్పనిసరి, చాలా మంది ఆడవాళ్ళకు ఈ లోదుస్తులు అసౌకర్యంగా ఉంటాయి. నాప్‌కిన్స్‌ను అన్ని రకాల దుస్తులు ధరించే వారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా తయారుచేయాల్సిన అవసరం ఉన్నది.

నాప్‌కిన్స్‌ వాడకాన్ని ప్రోత్సహిస్తూనే, వాటిని పారవేయడానికి సురక్షిత మార్గాలు రూపొందించాలి. ఈ సమస్యను ఇప్పటికీ పెద్దదిగా గుర్తించడం జరగలేదు.

ఆరోగ్య సమస్యలు :

ఇప్పటిదాక జరిగిన విశ్లేషణ, చర్చ పట్టి స్పష్టంగా తెలుస్తున్నది స్త్రీలు బహిష్టు పరిశుభ్రత ఆశించదగిన స్థాయిలో లేదు. స్త్రీలు గుర్తించిన కొన్ని ఆరోగ్య సమస్యలలో కడుపు నొప్పి, అనారోగ్యం కంటే అసౌకర్యం సమస్య. స్త్రీలు తమ బహిష్టు పరిశుభ్రతకు ప్రత్యుత్పత్తి అవయవాలకు, మూత్రనాళాలకు వస్తున్న ఇన్‌ఫెక్షన్లకు ఉన్న సంబంధాన్ని గుర్తించడం లేదు. ఈ విషయం స్త్రీలకు, పురుషులకు కూడా తెలియచెప్పాలి.

బృంద చర్చలలో వెల్లడైన విషయాలలో మమ్మల్ని నిర్ఘాంతపరిచిన విషయం అధిక సంఖ్యలో స్త్రీలు చిన్న వయసులోనే గర్భసంచి తొలగించుకోవడం. ఈ ఆపరేషన్‌కు వారు చెప్పిన కారణాలు అధిక రక్తస్రావం లేదా కడుపునొప్పి. కారణాలను మరింత లోతుగా చూసినప్పుడు వారు అపరిశుభ్రమైన బట్టను వాడటం, ఆ బట్టను మళ్ళీ మళ్ళీ వాడినప్పుడు శుభ్రపరచడం, ఆరపెట్టడంలో పరిశుభ్రత పాటించకపోవడమూ చేసేవారని తెలిసింది. బహిష్టులో పరిశుభ్రమైన పద్ధతులను పాటించడం ద్వారా ఇన్‌ఫెక్షన్లనూ, తద్వారా ఆపరేషన్లనూ తగ్గించే అవకాశం ఉన్నది.

గర్భకోశాన్ని తీసివేయడమనేది చాలా మామూలు విషయం అయిపోయింది. ఈ ఆపరేషను వల్ల వచ్చే అనర్థాలను చర్చిండమే జరగడం లేదు. ఇద్దరో, ముగ్గురో పిల్లలు పుట్టిన తరువాత ఆడవాళ్ళు కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ బదులు, గర్భసంచిని తీసేసే ఆపరేషన్‌ చేయించుకుంటున్నారు. బహిష్టు తలనెప్పి నుంచి బైటపడటానికి ఇది మంచి అవకాశం అని కూడా భావిస్తున్నారు. తమ ఆరోగ్యాల మీద ఈ ఆపరేషన్‌ దుష్ప్రభావాన్ని స్త్రీలు గుర్తించలేకుండా ఉన్నారు.

ప్రస్తుత పద్ధతి నుంచి మార్పుకు సంసిద్ధత

ప్రస్తుతం ఉన్న పరిస్థితి, దానికి కారణాలు, దాని దుష్ఫలితాలు చర్చించిన తరువాతి ప్రశ్న మరి స్త్రీలు తమ పద్ధతిని ప్రధానంగా నాప్‌కిన్స్‌ వాడటానికి మార్చుకోడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రస్తుతం పాతబట్ట వాడుతున్న స్త్రీలలో 34% మంది నాప్‌కిన్స్‌ కనుక అందుబాటులో ఉండి, పారవేయడానికి, ఉపయోగించడానికి తగిన సౌకర్యాలు ఉండేటట్లయితే, ఉపయోగించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసారు. కులాల వారిగా చూస్తే దళితులు, ఇతర వెనకబడిన సామాజిక వర్గాల వారు ఎక్కువ సంసిద్ధతను వ్యక్తపరిచారు. వయసులో 20 సంవత్సరాలలోపు వారు, వ్యవసాయ పనులు చేసేవారు, కూలీలు ఎక్కువ సంసిద్ధతను వ్యక్తపరిచారు.

హాస్టళ్ళు, ఇళ్ళల్లో ఉండే విద్యార్థులు, బడికిపోని 16 సంవత్సరాల వాళ్ళు కూడా మారడానికి సిద్ధంగా ఉన్నారు.

మొత్తం మీద అవకాశాలను కల్పిస్తే చాలా మంది స్త్రీలు బహిష్టు పరిశుభ్రతా పద్ధతులని మార్చుకోడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

అధ్యయనం నేపథ్యంలో చేసిన కొన్ని నిర్దిష్టమైన సూచనలు సలహాలు

స్త్రీల నెలసరి పరిశుభ్రతా పరిస్థితులు మెరుగుపడాలంటే

1. పారిశుద్ధ్య సౌకర్యాలైన మరుగుదొడ్లు, స్నానాల గదులు, నీటి వసతి లేకపోవడం బహిష్టు పరిశుభ్రతకు ఆటంకాలుగా నిలుస్తున్నాయి. ఇళ్ళలోను, స్కూళ్ళలోను, స్త్రీలకు ఈ సౌకర్యాలు ఏర్పరచాలి. శానిటరీ నాప్‌కిన్స్‌ వాడకానికి అనువయిన సౌకర్యాలను ఏర్పరచాలి.

2. బహిష్టు పరిశుభ్రతా పద్ధతులను లేదా పరిశుభ్రత లేకపోవడాన్ని జండర్‌ వివక్షతగా గుర్తించి పని చేయాల్సిన అవసరం ఉన్నది. స్త్రీలు తమ అవసరాలను తామే చిన్న చూపుచూస్తారు. స్త్రీల ఈ దృక్పథంలో మార్పు తేవడానికి ప్రయత్నం జరగాలి. స్త్రీల అవసరాలు ప్రాధాన్యతా క్రమంలో చిట్టచివరికి నెట్టివేయబడతాయి. స్త్రీలు, ఆడపిల్లలు, మొగవాళ్ళు, కుటుంబ ఆర్థిక వ్యవస్థ బహిష్టు పారిశుద్ధ్య వసతులను సౌకర్యంగాకాక కనీస అవసరంగా చూడాలి.

3. బహిష్టు పారిశుద్ధ్యానికి జననావయవాలకు, మూత్రనాళాలకు వచ్చే ఇన్‌ఫెక్షన్లకు సంబంధం ఉన్నదని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. పాతబట్టను మళ్ళీమళ్ళీ వాడే వాళ్ళు ఈ అనారోగ్యాలకు గురవుతున్నారు. దీని ప్రభావం వల్ల అవాంఛిత గర్భకోశ తొలగింపు ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. స్త్రీలకు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించడం ద్వారానే వీటిని నిరోధించగలం.

4. వాడిన నాప్‌కిన్‌ లేదా బట్టను పారవేయడానికి సరైన సౌకర్యాలు ఏర్పరచకపోతే అది మరొక కొత్త అనారోగ్య కారకం అవుతుంది.

5. అధ్యయనాలలో ఎక్కువ మంది ఆడపిల్లలు 10-12 సంవత్సరాల మధ్య పెద్ద మనుషులు అవుతున్నారని తెలిసింది. వారికి అవసరమైన సమాచారం ఇవ్వడం, సంసిద్ధపరచడం ఈ వయసుకు ముందర నుంచే మొదలవ్వాలి.

6. ఋతుచక్రం గురించి, బహిష్టు గురించిన సమాచారంలో జననాంగాలు, పరిశుభ్రత గురించి వివరంగా తెలియచేయాలి.

7. ఇళ్ళ నుంచి స్కూళ్ళకు వెళుతున్న వాళ్ళు, స్కూలుకు వెళ్ళని వాళ్ళు ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించడం లేదు. మనముందున్న సవాలు పరిశుభ్రతా సందేశాన్ని అందరి దగ్గరకు ఏ విధంగా తీసుకు వెళతాము అన్నది. తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉన్నది.

8. చాలా మంది ఆడపిల్లలకు టీవీలలో వచ్చే ప్రకటనల ద్వారా శానిటరీ నాప్‌కిన్స్‌ గురించి తెలిసింది. ఇదే టీవీలను, ప్రకటనలను సమాచారం, అవగాహన కోసం కూడా ఉపయోగించాలి.

9. తల్లులు, అమ్మమ్మలు, నాయనమ్మలే అమ్మాయిలకు ప్రధానమైన సమాచార మార్గాలు. వారి నుంచే ప్రాథమిక సమాచారాన్ని పొందుతున్నారు. అయితే వీరెవ్వరికీ కూడా శాస్త్రీయమైన అవగాహన లేదు. చాలా మంది తల్లులకు ప్రసవాల కోసం ఆసుపత్రికి వెళ్ళినప్పుడో, తమ కూతుళ్ళు చెపితేనో శానిటరీ నాప్‌కిన్స్‌ గురించి తెలుస్తోంది. వీరికి శిక్షణ ఇవ్వడం ద్వారా తరువాతి తరానికి జీవితం ఆరోగ్యవంతం చేసే అవకాశం ఉన్నది.

10. పురుషులకు, మొగపిల్లలకు కూడా కనీస అవగాహన కల్పించాలి.

11. హాస్టళ్ళలో ఉన్న ఆడపిల్లల పరిస్థితి మిగిలిన వారి కంటె బాగుంది. ప్రభుత్వ హాస్టళ్ళలో వారికి శానిటరీ నాప్‌కిన్స్‌ సరఫరా చేయాలి. హాస్టళ్ళలో లేని వారి పరిస్థితి బాగుపరచడానికి స్కూల్‌కెళ్ళి చదువుకుంటున్న ఆడపిల్లలందరికి ఉచితంగా శానిటరీ నాప్‌కిన్స్‌ అందించాలి. శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తలు, ఆసక్తిగల ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహాయం తీసుకుని అవగాహన పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలి కౌమార బాలికలకు సరైన సమాచారం అందించాలి.

12. బహిరంగ మలవిసర్జన, హెచ్‌.ఐ.వి-ఎయిడ్స్‌లపై అవగాహనకు జరిగినట్టుగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం జరగాలి. బహిరంగంగా చర్చించే అవకాశం ఏర్పరచాలి.

13. స్త్రీలు బహిరంగంగా ఉపయోగించగలిగిన భాషను అభివృద్ధి చేయాలి.

14. పరిశుభ్రత నాప్‌కిన్‌ వాడటంలోనేకాక తరచు మార్చుకోవడంలో కూడా ఉంటుంది. ఈ అలవాటును ప్రోత్సహించాలి అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. స్కూళ్ళలోను, పనిస్థలాలలోను తగిన వసతులు ఏర్పరచాలి.

అధ్యాయం 5

సమస్య పరిష్కారానికి సూచనలు

బహిష్టు పరిశుభ్రతా సమస్యపట్ల సమగ్ర అవగాహనతో పరిష్కారం దిశగా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అనేక మంది కలిసి పని చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా విద్యాశాఖ, ఆరోగ్యశాఖ, మహిళా శిశు అభివృద్ధి శాఖ, ప్రజారోగ్య, ఇంజనీరింగ్‌ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ కలిసి పనిచేయాలి. ఇందులో ప్రచార కార్యక్రమాలు, మౌళిక వసతుల కల్పన, అవగాహన, శిక్షణా కార్యక్రమాలు ఉండాలి.

భారతప్రభుత్వము, పౌరసంస్థలు కూడా బహిష్టు పరిశుభ్రతా సమస్యని అర్థం చేసుకొని కొన్ని కార్యక్రమాలు మొదలు పెడుతున్నాయి. అయితే విషయం పట్ల సమగ్రమైన అవగాహన, ప్రణాళికా రూపకల్పన, పర్యవేక్షణా పద్ధతులు ఇంకా ఏర్పడాల్సి వున్నది. దృష్టి ఎక్కువగా నాప్కిన్స్‌ చవకగా తయారు చేసే పద్ధతులని ప్రోత్సహించడం, నాప్కిన్స్‌ని సరఫరా చేయడం పైనే ఉంది. అయితే దీనికి కూడా సమగ్రమైన సమాచారం, ప్రణాళిక లేవు. వాడకం పట్ల పర్యవేక్షణ కూడా లేదు. జరగాల్సింది చాలా వున్నది. ఆడ వాళ్ళు ఖర్చు లేకుండా నడిపేస్తున్న విషయాన్ని పెద్ద సమస్యగా చూడటానికి, పరిష్కరించడానికి డబ్బులు ఖర్చు పెట్టటానికి ప్రభుత్వాలు, సమాజాలు, కుటుంబాలు కూడా సిద్ధపడాలి.

1. బహిష్టు పరిశుభ్రతను ఒక బహుముఖ సమస్యగా గుర్తించడానికి ప్రజలను, విధాన నిర్ణేతలను, ప్రభుత్వ అధికారులను చైతన్య పరచాలి.

2. ఆలోచనల్లో మార్పు రావడానికి బహిష్టు పరిశుభ్రత ఒక నిషేధాంశంగా కాక సహజమైన అంశంగా ఆలోచించేందుకు అవసరమైన ప్రచార ఉద్యమాలు మొదలుపెట్టాలి.

3. బహిష్టు పరిశుభ్రత సౌకర్యాలు వాష్‌ (నీరు, పారిశుద్ధ్యము, పరిశుభ్రత) రంగంలో ప్రాధాన్యత పొందేలా చేయాలి. శుభ్రమైన, ప్రత్యేకమైన, భద్రతగల పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో వుండాలి, నీటి సౌకర్యం ఉండాలి.

4. పాఠశాల స్థాయిలో బాలికలకే కాక బాలురకి, మహిళా, పురుష టీచర్లకీ కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పాఠ్యాంశాలలో భాగంగా బోధించాలి.

5. బహిష్టు పరిశుభ్రతా లేమి ప్రజా ఆరోగ్య సమస్యగా గుర్తించి, నివారణకు కృషి చేయాలి.

6. అందరికీ ఒకే వస్తువులతో తయారు చేసిన నాప్కిన్స్‌ అని ఆలోచించకుండా, స్థానికంగా దొరికే, పరిశుభ్రమైన వస్తువులతో తయారు చేసే నాప్కిన్స్‌ స్థానిక సంస్కృతిలో భాగంగా వుండి, అంగీకరింపబడేవిగా వుండేటట్టు చూడాలి. అందుకు అవసరమైన పరిశోధనని ప్రోత్సహించాలి. నిధులు సమకూర్చాలి. కొనగలిగిన ధరలో శానిటరీ నాప్కిన్స్‌ని తయారు చేసి, స్థానిక మార్కెట్ల ద్వారాను, మహిళా సంఘాల ద్వారాను స్త్రీలకి అందుబాటులోకి తీసుకురావాలి.

7. మనుషులకి, పర్యావరణానికి హాని కలిగించని విధంగా బహిష్టు వ్యర్థాల తొలగింపు పద్ధతులను రూపొందించాలి.

8. మిలీనియం అభివృద్ధి లక్ష్యాల తరువాత రాబోతున్న లక్ష్యాలలో బహిష్టు పరిశుభ్రతని ఒక సూచికగా ప్రవేశపెట్టాలి. రాజకీయ నాయకుల చేత బహిష్టు పరిశుభ్రత గురించి మాట్లాడించడం తేలిక కాదు. కాని మనం దీన్ని 2015 అనంతర లక్ష్యాలలో గనక చేర్చగలిగితే, దీన్ని ఒక మాట్లాడాల్సిన విషయంగా చేయగలుగుతాం. ప్రభుత్వ కార్యక్రమాల రూపకల్పన, కొనసాగింపు, నిలిపివేత పారదర్శకంగా ఉండాలి.

9. అంతర్జాతీయ బహిష్టు పరిశుభ్రతా దినం ప్రకటించాలి, మార్చి ఎనిమిది అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో కూడా చేర్చాలి.

(భారత గ్రామ నవ నిర్మాణ సంస్థ – మారి, వరంగల్‌)

 

Share
This entry was posted in New Category Name and tagged . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో