మరక మంచిదేగా….. – పి. ప్రశాంతి

ఆ రాత్రి తనకింకా గుర్తు. పెద్దమ్మ కుట్టించిన మెంతిరంగు నైలాన్‌ స్కర్ట్‌, స్పన్‌ షర్ట్‌ వేసుకుని రోజంతా ఆటలాడి తిరిగొచ్చినా ఆ డ్రస్‌ బాగా నచ్చి రాత్రిక్కూడా మార్చుకోకుండానే పడుకుండి పోయింది. మొదటిసారేసుకున్న ఆ డ్రస్‌ అదే ఆఖరి సారవుతుందని తనకేం తెల్సు. మధ్యరాత్రిలో ఒళ్ళంతా బరువుగా, పొట్టలో సన్నటి సలుపుతో, నోరు తడారిపోతున్నట్లుండి మెలుకూ వచ్చేసింది. లేచి బాత్రూంకెళ్ళొచ్చి, నీళ్ళు తాగి మళ్ళీ పడుకున్నా శరీరమంతా ఒక రకమైన అసౌకర్యంగా ఉండడంతో పక్క మీద అటు తిరిగి, ఇటు తిరిగి తెల్లారెప్పుడో నిద్రపోయింది. ”స్కూల్‌ సెలవయినా ఇంత సేపా నిద్ర…. లే ఇక” అంటున్న అమ్మ మాటలకి ”ఊ…” అంటూ బద్ధకంగా లేచి టాయిలెట్‌కెళ్ళిన తనకి గుండె బేజారైనట్లయింది. డ్రాయరంతా ఎర్రగా తడిచిపోయింది. త్వరత్వరగా పనికానించుకొని యిడిచిన డ్రాయర్‌ని చేత్తో పట్టుకుని బయటకు వస్తూ ‘అమ్మా…’ అని పిలిచింది.

ఆ తర్వాత ఇక వేపాకులేసి మరిగించిన వేడి నీళ్ళలో పసుపేసి తలస్నానం చేయించడం, మెత్తటి పాత చీరని నలుచదరంగా చింపి న్యాప్కిన్‌లా తయారుచేసి, లంగా బొందు తీసిచ్చి, బట్టని ఎలా పెట్టుకోవాలో చూపించి, దాపుడు బట్టల్లోంచి లంగా, జాకెట్‌ తీసిచ్చి, బెడ్‌ రూంలోనే ఒక ప్రక్క చాపేసి, దాని మీద బొంత, దుప్పటి పరిచి నన్ను సుఖంగా కూర్చోబెట్టి, వేడి వేడి పులగం బెల్లం ముక్కతో పాటు కంచంలో పెట్టి తెచ్చి పక్కన కూర్చుని నాకు, చెల్లికి ఎన్నో విషయాలు చెప్పింది అమ్మ. ”ఈ విషయం అందరికీ పనిగట్టుకు చెప్పాల్సిన అవసరం లేదు, అమ్మమ్మాళ్ళకి, నానమ్మకి నాల్రోజులాగి చెప్పొచ్చు” అంటున్న అమ్మంటే గౌరవం, ఆరాధన రెట్టింపయ్యాయి.

రెండే గదుల ఇల్లవడంతో బైటైనపుడు ఇంట్లో మగవాళ్ళకి కనబడకుండా ప్రత్యేకం కట్టిన అరుగు మీదే రాత్రి, పగలు గడిపే మస్తానమ్మ… పెద్దిల్లున్నా ఇంటెనక ఉన్న ముట్టు గదిలోనే మూడు రోజులు బందీ అయ్యే పార్వతక్క… పెంపుడు కుక్క కోసం కట్టించిన గూడులాంటి దాంట్లో స్నానానికి కూడా నోచుకోకుండా సర్దుకుపోవల్సొచ్చే కామాక్షి… వీళ్ళంతా గుర్తొచ్చి తనని ఎంతో ఆప్యాయంగా చూసుకుం టున్న అమ్మంటే ఇష్టం వందరెట్లయింది.

మోకాళ్ళపైకుండే గౌన్లు, స్కర్ట్లు వేసుకుంటానని, నీకసలు భయంలేదు, కనీసం మెన్సెస్‌ అప్పుడున్నా పొడుగు గౌన్లో, లంగాలో వేసుకో అని ఒత్తిడి చేసే స్నేహితురాళ్ళ కోసం ఆ మూడు రోజులు మిడ్డీనో, లంగానో వేసుకునేది. రోజూ స్కూల్‌కి క్యారేజ్‌కి పట్టుకెళ్ళేది కాని మెన్సెస్‌ టైంలో మధ్యాహ్నం భోజనానికని ఇంటికే వెళ్ళేది.

ఇంటర్‌ చదువుకునే రోజుల్లో కిక్కిరిసిన సిటీ బస్సుల్లో పాతిక్కిలోమీటర్లు ప్రయాణం చేసి, బస్టాండ్‌ నుండి కిలోమీటర్‌ నడిచి కాలేజ్‌కెళ్ళి సరైన బాత్రూం లేని కాలేజిలో సాయంత్రం వరకుండి మళ్ళీ అంత దూరం నుండి ప్రయాసపడి ఇంటికొచ్చే సరికి ప్రాణం ఉగ్గబట్టుకుని ఉండాల్సొచ్చేది. కానీ పీరియడ్స్‌ టైంలో మాత్రం… అదో చావు… రోజు రోజూ చచ్చే చావు… బట్ట వాడటం వల్ల ఎంత ఒత్తుగా పెట్టుకున్నా ఏడెనిమిది గంటలపాటు ఉండాల్సొచ్చేసరికి, అదీ కూర్చోని లేచి కూర్చుని… బస్సుల్లో కుదుపులకు, సడన్‌ బ్రేక్‌లకు… అబ్బో… ఆ ప్రవాహం ఆపాలని ఉగ్గబట్టుకున్నా ఆగేది కాదు. కాసేపు ఆగినట్లే

ఉన్నా ఒకే సారి భళుక్కున అయిపోయేది. కూర్చుంటే బట్టలకు అంటుకుపోతుందేమో, సిగ్గు పోతుందని… నిలబడితే ఆ ఊపులకి మరింత అయి… కూర్చోలేక, నిల్చోలేక నానా చావుగా ఉండేది. కాలేజి ఎగ్గొట్టలేము. ఆ టైంలో వీణ వెంటుండటం ఎంతో ఊరటగా ఉండేది. ప్రతిసారి ఒకరికొకరం ప్రొటెక్షన్‌. ఒకసారైతే సాయంత్రం బస్సులో కాలేజి నుండి వస్తుంటే కొంతసేపటి తర్వాత తొడల దగ్గరంతా తడితడిగా అన్పించి, సీట్లోంచి లేవాలంటే భయం. అరగంట ఉగ్గబట్టుకుని దిగాల్సొచ్చినపుడు వీణ అడ్డుగా ఉండి ఏం లేదనప్పుడు కలిగిన రిలీఫ్‌… అనుభవించిన వాళ్ళకే తప్ప అర్థం కాదు. కానీ ఇంకోసారి… బట్టలు ఖరాబై చున్నీతో దాచుకుంటూ, వెనక వీణ అడ్డంగా ఉండి నడ్చుకొస్తుంటే ఒక పోకిరి ఇంటిదాకా వెంటపడ్డాడు. ఏంచేయాలి… అమ్మ దగ్గర ఏడిస్తే ‘ఇలా కాదు కానీ కేర్‌ ఫ్రీ తెప్పిస్తానుండు’ అని డాడీతో తెప్పిస్తే ప్యాకెట్‌ తెచ్చి ఇస్తూ ఓదార్పుగా డాడీ చూసిన చూపు, తల మీద వేసిన చెయ్యి నాకెంతో కాన్ఫిడెన్స్‌నిచ్చాయి.

డిగ్రీలో ఎన్‌.సి.సి పెరేడ్‌ అయినా, క్యాంప్‌ అయినా, పీజీలోనూ, తర్వాత ఉద్యోగంలో భాగంగా విపరీతంగా తిరిగినా న్యాప్కిన్స్‌ ఎప్పుడూ సహాయపడ్డాయి. కొన్ని సార్లు సరైన బాత్రూం, కావాల్సినన్ని నీళ్ళు లేకపోవడం వల్ల ఇబ్బంది పడ్డా, పీరియడ్స్‌ గురించి, రక్తస్రావం గురించి శరీరంలో జరిగే మార్పుల గురించి ఓపెన్‌గా మాట్లాట్టం మొదలుపెట్టాక, ఈ అంశాల గురించి, మగ పిల్లలు, పురుషుల పాత్ర బాధ్యతల గురించి వారితోనే మాట్లాడటం ప్రారంభిం చాక వస్తున్న మార్పుల్ని చూసి సంతోషమనిపించింది. వెంటనే, రెణ్ణెల్లు మెన్సెస్‌ రాలేదని ‘ఏ చెడుతిరుగుళ్ళు తిరిగావే’ అని ఏడుస్తూ… వాళ్ళమ్మ కొట్టిన దెబ్బలుతిన్న కుమారి గుర్తొచ్చింది. తలారా స్నానం చేసొచ్చి వరండాలో కూర్చుంటే ‘పెళ్ళై ఏడాది దాటింది. ఇంకా బైటుంటోంది’ అని బామ్మ దీర్ఘాలుతీస్తుంటే సిగ్గుతో చితికిపోయిన శ్యామ గుర్తొచ్చింది. 16 ఏళ్ళు వస్తున్నా పెద్ద మనిషి కాలేదని వాళ్ళ మేనత్త బలవంతంతో గుళ్లు గోపురాల చుట్టూ తిరిగొచ్చిన మాలతి గుర్తొచ్చింది. ఇంకా పల్లెల్లో ఈ అంశానికి సంబంధించి ఉన్న అపోహలు, సదుపాయాలు లేక ఆడపిల్లలు పడ్తున్న ఇబ్బందులు, శానిటరీ న్యాప్కిన్స్‌ వాడకంలో ఉన్న (అంగీకారం, అందుబాటు డిస్పోజల్‌ వంటి) కొన్ని లొసుగుల వల్ల మనం ఇంకా ప్రయాణించాల్సిన దూరం ఎంతో ఉందని నిట్టూర్చింది. ఈ విషయాలపైన ప్రభుత్వాధికారుల్ని, ప్రజా ప్రతినిధుల్ని ఎలా చైతన్యపర్చాలన్న ఆలోచనల్లో పడింది.

అప్పటిదాకా సినిమా రీళ్ళలా పరిగెడుతున్న ఆలోచనల ప్రవాహం ‘అవని మెచ్యూర్‌ అయ్యిందంట’ అనే ఫోన్‌ కాల్‌తో ఆగింది. అవనిని చాపమీద ‘అంటరానిదానిలా’ ఓ మూలన కూర్చోబెట్టారన్న వార్త శాంతిని డిస్టర్బ్‌ చేసింది. వెంటనే రామ్‌తో కలిసి వాళ్ళింటికెళ్ళింది. తన గదిలో బందీలా కూర్చున్న అవనిని దగ్గరకు తీసుకుంటుంటే అవని అమ్మమ్మ, నాన్నమ్మ, ఇతర బంధువులు గోలగోలగా అరవడం మొదలెట్టారు. అవని అన్న ఆకాశ్‌ మాత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ చెల్లి పక్క చేరిపోయాడు. హమ్మయ్య! ఈ తరం మగ పిల్లలన్నా కొంచెం సెన్సిటివిటీతో ఉన్నారని సంబరపడింది శాంతి.

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో