బహిష్టు అపవిత్రమైతే మరి నీ పుట్టుక….??

నాకు పదకొండు సంవత్సరాలు. ఒక రోజు క్లాసులో ఉన్నప్పుడు నా శరీరంలో ఏదో జరుగుతున్నట్టనిపించింది. ఏడో, ఎనిమిదో తరగతిలోనో ఉన్నాను. స్వరాజ్యమని సంస్క ృతం మాస్టారి కూతురు లంగా మీద వెనక ఎర్రటి రక్తం మరక చూసి నన్ను బయటకు లాక్కొచ్చి ఇంటికి వెళ్ళమని చెప్పింది. ఇంటికెళ్ళాకా మా అమ్మ నన్ను కొబ్బరాకు చాపమీద కూర్చోపెట్టి చిమ్మిలి తినిపించింది. ఆ తర్వాత లంగామీద ఓణీ వేసుకోవాలని చెప్పి, వోణీలు కొంది. వాటిని గుండెల మీద పరుచుకోవాలని, జాగ్రత్తగా వుండాలని చెప్పినప్పుడు నేను వోణీలు వేసుకోనని ఏడ్చాను. నాకు నిద్రలో వోణీ లేకుండా తిరుగుతున్నట్టు, వోణీ గాలికెగిరి పోతున్నట్టు కలలు వచ్చేవి. భయపడి చచ్చేదాన్ని. సడన్‌గా వోణీ కనబడకుండా అయ్యేది. బాగా ఏడ్చేదాన్ని. కలల్లో ఇలాంటి అనుభవాలు అందరు ఆడపిల్లలకి అనుభవమయ్యే ఉంటాయి.

ఆ తర్వాత నెల నెలా రుతుస్రావం. మెత్తటి చీరల్ని చింపి ఇచ్చేది మా అమ్మ. బాత్‌రూమ్‌లు లేవు. చెంబుల్తో సరుగుడు తోటల్లోకి వెళ్లాలి. అక్కడే బట్టతీసి బట్ట మార్చుకోవాలి. మహాయాతన. స్కూల్‌కి రఫ్‌గా వుండే బట్ట వాడినపుడు రాపిడికి తొడలు పుండ్లయ్యేవి. బాధ … దుఃఖం… ఉక్రోషం… ఎలా గడిచిపోయాయో ఆ భయంకరమైన రోజులు?

పెద్ద ఉమ్మడి కుటుంబం. ఎవరో ఒకరు బయట కూర్చొనేవారు. ఒక మడత మంచం, ఓ దుప్పటి ఇచ్చి పశువుల పాకలో

ఉండమనే వాళ్ళు. మా వంటగది పక్కనే పశువుల పాకలో ఓ పక్క పడుకోవాల్సి వచ్చేది. పగలంతా అక్కడే… ఏదో ఒక టైములో పిలిచి అన్నం పెట్టే వాళ్ళు. అంటరాని వాళ్ళాయే అప్పుడు. విసిరినట్టు కంచంలో అన్నం, కూరలు వేసేవాళ్ళు. గేదె పాల మజ్జిగ వుంటే వేసే

వాళ్ళు. ఆవు పాల మజ్జిగ అస్సలు వేసే వాళ్ళు కాదు. ఎంత కోపంగా వుండేదో నాకు.

మూడో రోజు స్నానాలు చెయ్యడం ఓ పెద్ద పని. చాప, దుప్పట్లు, బట్టలు అన్నీ తడిపి ఆరేయాలి. దాని మీద పసుపు నీళ్ళు చల్లేవాళ్ళు. కుంకుడు కాయల్తో తలస్నానం చేసి, పసుపు నీళ్ళు చల్లించుకుని ఇంట్లోకి రావాలి. ఆ మూడు రోజులు జరిగే తంతంతా తూచ తప్పక చెయ్యాలి. లేకపోతే ఉమ్మడి కుటుంబం మొత్తం తిట్టి పోస్తుంది.

ముట్టును చాలా అసహ్యించుకొనేదాన్ని. పశువులు పాకలోకి తోసెయ్యడం చాలా అవమానంగా, ఉక్రోషంగా వుండేది. మా అమ్మతో మాట్లాడేదాన్ని కానీ అమ్మ ఉమ్మడి కుటుంబం బందీ. నా లోపల ఒక ధిక్కారం తిరుగుబాటు చెలరేగుతూ వుండేది. ఆ ధిక్కార ప్రభావం… ఎవ్వరూ చూడకుండా అన్నింటినీ ముట్టుకోవడం, మనుషుల్ని, వస్తువుల్ని ముట్టుకోవడం మహానేరం. ఆరేసి వున్న బట్టల్ని, మడిచి పెట్టిన మడత మంచాల్ని ముట్టేసుకోవడం. మా ఇంటి పక్కనే మా పెద్దమ్మ ఉండేది. ఆమంటే అందరికీ చచ్చే భయం. ‘ముట్టును ఇంట్లో కలిపేసినా, వస్తువుల్ని ముట్టుకున్నా కళ్ళు పోతాయి. నరకానికి పోతారు’ అని భయపెట్టేది. నేను పని కట్టుకుని వాళ్ళ వస్తువుల్నే ముట్టుకునేదాన్ని. ఆరేసిన చీరల్ని తాకుతూ వెళ్ళేదాన్ని. ఎవ్వరూ చూడకుండా ఆ పనులు చేసేదాన్ని.

ఒకసారి మెన్సెస్‌ అయ్యాక ఇంట్లో చెప్పకుండా గుళ్ళో ఏదో పూజ జరుగుతుంటే గుడికెళ్ళిపోయాను. విగ్రహాల్ని తాకి మరీ దండం పెట్టుకున్నాను. నా కళ్ళు పేలిపోలేదు. నాకేమీ కాలేదు. మా పెద్దమ్మ తిట్లన్నీ ఒట్టిదే… ఏమీ కాదు… వచ్చే నెల నేను బయట కూర్చోను. పశువుల పాకలో అస్సలుండను… అసలు మెన్సెస్‌ వచ్చిందని అందరికీ ఎందుకు తెలియాలి. నేనెందుకు చెప్పాలి? చెప్పను గాక చెప్పను అని నిర్ణయించుకుని మా అమ్మకి చెప్పాను. ”నేను నెలనెలా బయట కూర్చోను. ఇంట్లో కొచ్చేస్తాను” అని. మా అమ్మ చాలా భయపడింది. అందరూ ఏమంటారో ముఖ్యంగా మా పెద్దమ్మ ఎలా తిడుతుందో అని భయపడింది. నేను చాలా మొండిఘటాన్ని. ఒక్కసారి నిర్ణయించుకుంటే దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఎవ్వరి మాటావినే తత్వం కాదు. దేన్నయినా ధిక్కరించడం మాత్రమే తెలుసు. నేను బయట కూర్చోవడం లేదని, ఇంట్లో కలిపేస్తుందని అందరికీ తెలిసిపోయింది. పెద్ద గొడవైంది. మా అమ్మని అందరూ తిట్టారు. మా పెద్దమ్మ మరింత తిట్టింది. మా అమ్మ బాధ పడింది కానీ నేను బెదరలేదు. నా నిర్ణయం మార్చుకోలేదు. మా పెద్దమ్మ వాటిమీదా, వీటిమీదా పెట్టి తిట్టేది. ఊళ్ళోవానలు కురవకపోతే నన్నే తిట్టేది. ”ఊళ్ళో పాపం పెరిగిపోయింది. ముట్లు ఇంట్లో కలిపేస్తే ఇంక వానలేం పడతాయ్‌. పంటలేం పండుతాయి. ఘోరకలి” అని తిట్టేది. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసి తిరిగేదాన్ని.

ఆ తర్వాత నేను వేసిన దారిలో మా కజిన్స్‌ అందరూ నడిచారు. బయటుంటే పశువుల పాకలో కూర్చోబెట్టే పద్ధతిని నేను అలా ఎదిరించి విజయం సాధించాను. ఇదంతా రాయడం వెనక బహిష్టు చుట్టూ వున్న భయానక, భీభత్స భావజాలం గురించి చెప్పాలనే. మనిషి పుట్టుకకు కారణమైన బహిష్టును, ఒక సహజ శారీరక ధర్మాన్ని సమాజం… పితృస్వామ్య సమాజం ఛీత్కరించిన వైనం ఎంత మూర్ఖమైందో, ఇప్పటికీ అదే భావజాలం పరివ్యాప్తంలో వుండడం ఎంత విషాదమో కదా! ఫలదీకరణ చెందితే గర్భం… ఫలదీకరణ చెందకపోతే బహిష్టు… ఈ చిన్న లాజిక్కును అర్థం చేసుకోకుండా బహిష్టు చుట్టూ అల్లిన భయంకర భావజాలం తరాలుగా స్త్రీలను గాయపరుస్తూనే వుంది. అవమానిస్తూనే వుంది. కించపరుస్తూనే వుంది. గడ్డకట్టిన లాంటి ఒక మౌనం బహిష్టు చుట్టూ బిగించడం వల్ల దాని గురించి మాట్లాడటమే నేరంగా పరిగణించడం వల్ల బహిష్టు సమయంలోని వేదనని, దుఃఖాన్ని స్రీలు మౌనంగానే భరిస్తున్నారు. ఆ  సమయంలో వాళ్ళెదుర్కొనే అనారోగ్యాలను, సరైన బట్టను ఉపయోగించక పోవడం వల్లే వచ్చే ఆరోగ్య సమస్యలను పట్టించుకునే దిక్కే లేదు. పునరుత్పత్తి అవయవ పరిశుభ్రత గురించి, భయాల గురించి, ఫోబియాల గురించి చర్చించే వేదికే లేదు. బహిష్టు చుట్టూ ఒక అసహ్యవలయం తిరుగుతుండడం వల్ల, పేరెత్తితే అసహ్యం, ఏహ్యభావం తన్నుకువచ్చేలా మెదళ్ళను కలుషితం చేయడం వల్ల… బహిష్టు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలాంటి బట్ట వాడాలి, ఎలా ఉతకాలి, ఎలా ఎప్పుడు బట్ట మార్చుకోవాలి… జననాంగాన్ని పరిశుభ్రంగా ఎలా వుంచుకోవాలి లాంటి అంశాల మీద చాలా కాలం వరకు చర్చలే లేవు. మాటలే లేవు. ఉన్నదంతా మౌనమే.

తెలుగు సాహిత్యంలోకి వెల్లువలా దూసుకొచ్చిన స్త్రీవాదం మొట్టమొదటిసారి బహిష్టులోని రాజకీయాల్ని పబ్లిక్‌గా, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడింది. కొండేపూడి నిర్మల, అబ్బూరి ఛాయాదేవి, కె. గీత, రెంటాల కల్పన, జూపాక సుభద్ర లాంటి స్త్రీవాద రచయిత్రులు ఈ అంశం మీద కథలు, కవిత్వం రాసారు. బహిష్టు సమయంలో స్త్రీల మీద అమలయ్యే ఆంక్షలు, హింస గురించి పెద్ద గొంతుతో మాట్లాడింది స్త్రీవాద సాహిత్యం. గోప్యంగా, గుంభనంగా వుంచాల్సిన ముట్టు గురించి బహిరంగ వేదికలపై మాట్లాడిన స్త్రీవాదులను దుర్భాషలాడిన సందర్భాలను చూసాం. ఛీ… ఛీ… అంటూ ఛీత్కరించిన అభ్యుదయ వాదుల రెండు నాల్కల ధోరణిని చూసాం. ఈ గుడిలో కెళ్ళొద్దు… ఆ పూజ చెయ్యొద్దు… శుభకార్యాల్లో కనబడొద్దు… పెళ్ళిళ్ళల్లో కనుచూపుమేరలో ఉండొద్దు లాంటి ఫత్వాలు ఆధునిక కాలంలో కూడా వినబడడమే అత్యంత విషాదకరం. ఆధునికులమని తమని తాము భుజాలు చరుచుకునే వాళ్ళు సైతం బహిష్టు పట్ల తీవ్ర వ్యతిరేకతతో వుండడం వెనక వున్నదంతా అజ్ఞానమే. శరీర ధర్మాల పట్ల అవగాహనా రాహిత్యమే.

మూఢత్వం అల్లుకున్న ముట్టు గురించి ఇటీవల అంతర్జాతీయ వేదికలమీద మాట్లాడటం ఓ మంచి పరిణామం. మే 28 వ తేదీని  ”అంతర్జాతీయ బహిష్టు శుభ్రతా దినంగా” ప్రకటించడం అంటేనే ఆ సమస్య ఎంత తీవ్రంగా వుందో అర్థమౌతుంది. ఈ తేదీని ఎంపిక చేసుకోడం వెనుక ఒక లాజిక్కుంది. ప్రతి 28 రోజులకి 5 రోజులపాటు ఉండే ఋతుచక్రాన్ని ప్రతి ఫలించేలా సంవత్సరంలో ఐదో నెలయిన మేలో 28వ తేదీని ‘అంతర్జాతీయ బహిష్టు శుభ్రతా దినం’గా ప్రకటించారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఈ అంశం మీద పనిచేస్తున్నాయి. స్త్రీలను, బాలికలను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపడుతున్నాయ్‌. బహిష్టు చుట్టూ బలంగా అల్లుకున్న మౌనాన్ని బద్దలుగొట్టే కార్యక్రమాలను చేపడుతున్నాయ్‌. ఈ ప్రచారోద్యమంలో పాల్గొనాలనే ఉద్దేశ్యంతో భూమిక ఈ సంచికలో అధికభాగం పేజీలను బహిష్టు శుభ్రత అంశం కోసం కేటాయించింది. ఈ విషయంలో మాకు సహకరించిన గోపరాజు సుధ, రమాజ్యోతి, శివకుమారిలకు ధన్యవాదాలు తెలుపుతూ, మా ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తారని నమ్ముతూ..

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో