భార్య – ఆచార్య విజయశ్రీ కుప్పా

అమ్మాయి పోస్ట్‌ నుంచి అమ్మగారిగా ప్రమోట్‌ అవడం జీవితంలో అతిముఖ్యమైన మలుపని అందరూ అంటుంటే అదేదో ముఖ్యమైనదంటున్నారు కదా నిజంగానే పై స్థాయికి ప్రమోట్‌ అవుతానేమో అనుకున్నాను. తీరా చూస్తే నేను అమ్మగారిని ఒక్క పనిమనిషికి మాత్రమే. ఇంట్లో పనిచేసే అమ్మాయిని నేను. బాల్కనీలోనో, పెరట్లోనో పనిచేసే అమ్మాయి ఇంకొక పని అమ్మాయి. అంతే తేడా! అంటే నేను కోడలి పోస్టులో వచ్చిన పనమ్మాయిని అని అర్థమైంది. కాకపోతే నెలజీతం తీసుకునే పనమ్మాయికి నాకు కూడా మరో ముఖ్యమైన తేడా ఏమిటంటే అది పార్ట్‌టైమ్‌ పెయిడ్‌ సర్వెంట్‌మెయిడ్‌, నేను లైఫ్‌టైమ్‌ ఫ్రీ గిఫ్టెడ్‌ ఎ.టి.ఎమ్‌.ని. అలాగని ఒక కార్డ్‌ పెట్టి నెంబరు నొక్కగానే డబ్బిచ్చే ఎ.టి.ఎమ్‌.ని అనుకునేరు. కాదు…కాదు… ఎ.టి.ఎమ్‌. అంటే ఆల్‌టైమ్‌ మేడమ్‌ని… ఎవరు పిలిచినా, ఎప్పుడు పిలిచినా కాదనలేని, వాదన చేయలేని బిగ్‌ మేడమ్‌ని! ఓకే!

నేను చదువుకున్న చదువంతా కేవలం ఉద్యోగంకి మాత్రమే సరిపోయేదవడంతో అమ్మగారి ప్రమోషన్‌ పొందాకా స్టార్టింగ్‌ ట్రబుల్స్‌ బానే వచ్చాయి. మరి నా చదువులో కాఫీ కలపటం నుంచీ పక్కలు దులిపి ఫాన్‌ వేయడం వరకూ ఏ చాప్టరులోనూ రాలేదు. జీవితాన్ని చదువుకోలేదంటారు అంటే ఇదే కాబోలు అనుకున్నాను. కానీ నాకో సందేహం అప్పట్లో మొదలై ఉప్పెనలా పొంగి ఇప్పటికీ కూడా పొంగులెత్తుతూ నన్ను ముంచెత్తుతోంది. అలా పొంగుతూ కణతలనంటుకుపోయిన తలనెప్పిలా నన్ను వదలకుండా అంటుకునే వుంది.

జీవితాన్ని చదువుకోటమేమిటి అదేమైనా లెక్కల బుక్కా? మరి మహాభారతమా… అలాగని ఏ లెక్కలకీ అందటం లేదు మరి! సినిమావాళ్ల తిక్కలకి లెక్క వుంటుంది కానీ నాకు తిక్కరేగినా ఎవరికీ లెక్కేలేదు. మరి జీవితాన్ని చదవటమంటే అదేమన్నా రామాయణమా… అబ్బే!! రాముడికి సీత మంచినీళ్లివ్వకపోతే కౌసల్య రియాక్షన్‌ వాల్మీకి ఎక్కడా రాయలేదు. నా జీవిత గ్రంథంలో ఒక్కసారి టిఫిన్‌ పెట్టి మంచినీళ్లు ఇవ్వడం మరిచిపోతే అదేమిటో పెద్దనేరమైనట్లు మొగుడికి టిఫిను పెట్టి మంచినీళ్లివ్వటం, స్నానానికి టవల్‌ చూసి ఇవ్వడం కూడా రాకపోతే ఎట్లాగమ్మా… మరీనూ!! విడ్డూరం అంటూ చైనావాల్‌ పొడుగంత దీర్ఘం తీసే మా అత్తగారు. టిఫిన్‌ నోట్లో పెట్టుకుంటూనే అర్థంకాని ఎమ్‌సెట్‌ ప్రశ్నలాంటి మా శ్రీవారి ఫేసూ… అంటే పెళ్లాం నీళ్లు పెట్టకుండా ఎట్లా టిఫిన్‌ తినాలా అన్న పరిశోధనాంశం తీసుకుని లైఫ్‌టైమ్‌ రీసెర్చి చేయటం లాంటిది.

మరి మహాభారతమా అంటే ఏదో కొంచెం అన్వయం కుదురుతుందేమో గానీ చీరపట్టిలాగే బావగార్లు లేరు మరీనూ కాకపోతే మావారి కాళ్ళు, నా చదువునీ కిందకి లాగుదామని చూస్తారు.. అంతవరకే… అందుకే జీవితాన్ని ఎలా చదవాలో అర్థంకాక ఊరుకున్నాను. అదీగాక నాకనిపించేది జీవితాన్ని చక్కగా మలుచుకుని ఆనందించాలిగానీ వెధవది సెమిస్టర్‌ పరీక్షలా ముందేసుకుని చదవటమేమిటీ అని!! సరే! నా చదువుకీ, జీవితానికి పొత్తుకుదిరే లోపలే నేను భార్య పదవి నుంచి అమ్మ పదవికి ప్రమోట్‌ అయినప్పటికీ అదేదో టూ ఇన్‌ వన్‌ ప్రోగ్రామర్‌గా సెట్‌ అయినట్లనిపించింది. ఇంక నేను చదువుకున్న చదువులో సరస్వతీదేవి నాకు గుడ్‌బై చెప్పి బ్రహ్మగారి దగ్గరకెళ్లిపోయింది. కొన్నాళ్లు నేను గైనకాలజిస్టులూ, పీడియాట్రిస్టుల దగ్గర జీవితం గడిపాను. తరువాత సరస్వతీ శిశుమందిరాల వేట దగ్గర నుంచి సెంట్రల్‌ స్కూల్స్‌ వరకూ అన్నీ చదవటం మొదలుపెట్టాను. ఈ లోపల ఎన్నెన్ని వింతలూ… విశేషాలు జరిగాయో ఇన్నీ అన్నీ కాదు. నేను సంసారంలో అష్టావధానం మెల్లిగా నేర్చుకుని శతావధానిగా స్థిరపడ్డాను. నా మెమరీ పవర్‌కి, స్పీడుకి గరికపాటివారు నాకేం అవార్డు ఇస్తారో కానీ… చాలా త్వరగా ఇంట్లో ఇల్లాలి స్థానాన్ని నూటికి నూరుపాళ్లు నిలబెట్టుకుని ఏ రివార్డు, అవార్డు లేకుండా భగవద్గీతకి అంకితమయ్యాను. మరి ”కర్మణ్యేవాధికారస్యే మాఫలేషు కదాచనా” అని కదా గోపాలురవారు సెలవిచ్చింది. మనం పోనీ గోపికలైనా పోయేది. పోయి పోయి కలియుగంలో స్త్రీ జాతిలో జన్మించాము. గోపికలకి మురళీగానామృతం ఉంది కాబట్టి వారు దివ్య ప్రేమలలో, రసశరీరాలతో అమృతులైనారు. మరి వాళ్లకి తిరిగి ఏ ఫలాలు అక్కరలేదు. బానేవుంది మనక్కూడా అలాంటిదేమైనా దొరుకుతుందా అంటే అబ్బే… ఆ ఛాన్స్‌ లేదు. మనం సంసారామృతాన్ని సేవిస్తూ మృతులవాల్సిందే. అప్పుడు కూడా పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదని మా నాయనమ్మ సానమీద గంథం చెక్క, చితిలో వేయటానికి తన ముక్కుపుడక (విల్లులో అదెవ్వరికీ రాయలేదు), తనకొచ్చే సొమ్ములో ప్రతినెలా కొంత ఆదా చేసిన సొమ్ము తన కర్మకాండలకి వాడమని చెబుతుండేది. నాయనమ్మలు స్త్రీ జాతికి మణిపూసలు. నిజం చెప్పొద్దూ ఆవిడ మాటలన్నీ వేదవాక్యాలే. ఈనాటికీ సంసారాల్లో నాయనమ్మలు నిత్యపారాయణలు కూడా. ఎందుకంటారా! ఆమె ఎదుట మాట్లాడిన విషయాలే వినేది, విలువిచ్చేది. చెప్పుడుమాటలు వినటం ఆమెకి తెలీదు. నా వెనక ఏమంటే నాకెందుకూ… నాతో బానే ఉన్నారు… మాట్లాడారు… చాలు అక్కడికి అంటూ సంబరపడి కోడళ్ల దగ్గర ఓ గౌరవం నిలబెట్టుకుంది. అందుకే ఇవన్నీ వల్లె వేసుకుంటూ నేను నా సంసారాన్ని ఈదుతున్నాను. ఇంతలో కేక! ”ఎవరో బెల్‌ కొడుతున్నారు చూడు…” నేను తలుపు దగ్గరకెళుతుంటేనే ఫోను మోగింది… మరో హెచ్చరిక ”ఆ ఫోను నీకే… ఈ టైములో నాకెవ్వరూ చేయరు…” బెల్లుకొట్టి తలుపు తోసుకొచ్చిన వాళ్లని, ఫోను చేసిన వాళ్లని సవ్యంగా రిసీవ్‌ చేసుకుని వచ్చానో లేదో ”రాత్రి కూర ఏం వండాలో కాస్త చూసుకో… మళ్లీ పిల్లలు స్కూల్‌ నుంచి వస్తే హడావిడి పడతావు” ఆదరణో, ఆదేశమో తెలీని అత్తగారి కొత్త ప్రేమ. వాకిలి తలుపేసి ఫ్రిజ్‌ తలుపు తీశాను. దాంట్లో కూరలు లేక ఫ్రిజ్‌ మంచుపొగలు చిమ్ముతోంది. మార్కెట్‌కెళ్లి కూరలు తెచ్చి కూర్చున్నాను.

”ఇదిగో వాడికేదిష్టమో చూసి తెచ్చావా? తీరా కంచం ముందు కూర్చుంటే కడుపు నిండలేదని అంటే ఉసూరుమంటుంది – పిచ్చి సన్నాసి”. అత్తగారి మాటల్లో మాతృత్వం బానే వుంది. మానవత్వమే లేదు… సరే ఏం చేస్తాం… మావారికిష్టమైన కూర ఇష్టమైన తీరులో వండాలని నిశ్చయించుకుని ఆవిడవంక నిదానంగా చూసాను. అతి సామాన్యమైన భావన అలవాటుగా ఆమె కళ్లలో కదులుతోంది. ఆ భావనకి తాత్పర్యం మగవాడికి కడుపునిండా భోజనం పెట్టాలి. అర్థాకలితో లేస్తే ఇంటికి మంచిదికాదు. ఈ భావన పెళ్ళైన నాటి నుంచీ చదువుతూనే వున్నాను కనుక మావారికి పొట్ట వినాయకుడికి కొంచెం తక్కువగాను, కడుపుతో ఉన్నవాళ్లకి ఈయన్ని చూసి కొంచెం మొహమాటం వేసేలానూ షేపు మారకుండా నేను మూడుపూటలా రుచిగా వండిపెడుతున్నాను. భోజ్యేషుమాతా అన్న శబ్దాలకి అర్థాన్ని నేను. కంచం ముందు కూర్చోగానే నా భర్త అడిగే మొదటి ప్రశ్న ”అమ్మకి జాగ్రత్తగా టిఫిన్‌ చేసావా… ఆవిడకి బి.పి. పెరిగితే కష్టం” మరి ఆ ప్రశ్నకి నాకు బి.పి. వస్తే… వచ్చి బాగా పెరిగితే… అహా…. ఆ ఆలోచన భర్త స్థానంలో ఉండగా వస్తే అతడు భర్త కాడు…. స్నేహితుడై పోవాలి. అయినా ఒకవేళ నిజంగా నాకు బి.పి. లొకేట్‌ అయినా ”నీకు బి.పి. ఏమిటి! నీతో వేగేవారికి, నిన్ను చూసిన వారికీ వచ్చే ప్రాబ్లమ్‌ అది” అంటూ ఛలోక్తితో ఒప్పించే ప్రయత్నం చేయడం, చమత్కారంతో తప్పించుకునే డైలాగ్‌ ప్రయోగం రెండూ కూడా నాకు అలవాటయిపోయాయి. సరే ఆయన తిన్న కంచంలోనే నేనూ తినాలనే కోరిక మా అత్తగారికి చాలా బలంగా వున్నా శుచి శుభ్రతలు వున్న ఇంట్లోంచి ఇక్కడికొచ్చి పడ్డ నాతో ఆ అలవాటు ఆవిడ చేయించ లేకపోయారు. వేరే కంచం పెట్టుకు తింటుంటే సన్నగా సణిగిన గొంతులో చిన్నపాటి ధ్వని వినిపించేది.

”పెట్టి పుట్టాలి మొగుడి కంచంలో తినటానికి” (ఇంతకీ ఆయన తినే కంచం బంగారు పువ్వు అద్దిన వెండికంచం. నా వెండికంచం ఎప్పుడూ బ్యాంక్‌ లాకర్‌లోనే కాపరం చేసేది) నాకు వెగటు పుట్టించే మాటలు విని మర్చిపోవటం నా అవధానంలో ఓ ప్రక్రియ. నిజానికి అవధానంలో అన్నీ గుర్తుపెట్టుకోవాలి. నాదొక వెరైటీ అవధానం!! నేను రోజు రోజుకీ ఇల్లాలిగా ఎదిగాననుకోటానికి ఒకరోజు ఒక మాంఛి సంఘటన జరిగింది.

ఆరోజు పొద్దుటే మా ఆడపడుచు పిల్లలతో సహా దిగింది. దానికి కారణం లేకపోలేదు. మా మావగారి ఆబ్దికం రెండు రోజుల్లో వుంది. అది ఆబ్దికమైనా కూడా మా ఇంట్లో మేము ఘనంగా జరుపుకుంటాము. దానికీ కారణముంది. అదేమిటంటే ఆనాటి రోజున అందరమూ మా మామగారికిష్టమైన జీడిపప్పు హల్వా, చామదుంప వేపుడూ, మాంఛి వర్రగా చేసిన పచ్చళ్లూ, గారెలూ, అల్లపచ్చడి, నువ్వులపొడితో సహా ఆరగించి మా అత్తగారికి ఘనంగా సంతాపం తెలియచేస్తాం. ఆ కార్యక్రమానికి ఇంచుమించుగా చీఫ్‌గెస్టు లెవల్లో మా ఆడపడుచు దిగింది. ”ఆడపిల్ల… దాని ప్రాణమంతా తండ్రిమీదే… ఆ మహానుభావుడి ప్రసాదం కోసం పడొచ్చింది… అంతదూరం నుంచీ…” అంటూ ఆమెకి మా అత్తగారు సానుభూతి గాఢంగా చూపింది. ఆ వాక్యాలు ఆమె మా ఇంట్లో మహారాణిలా ప్రవర్తించటానికి ఫౌండేషన్‌ క్రీములాంటివి. ఆబ్దికం రోజు తినే కూరలకి, పచ్చళ్లకీ రిపిటేషన్‌ లేకుండా ఈ మధ్యలో ఉన్న రెండు రోజులకీ మెనూ తయారు చెయ్యమని చెప్పి మా ఆడపడుచు స్నానానికెళ్లింది. ”అంతదూరం నుంచి పడొచ్చింది పుట్టింటి మెతుకులకోసం… అదున్న రెండ్రోజులూ కాస్త దానికి ఇష్టమైనవి చెయ్యవే…. రోజు వారి పప్పు, కూరేసి పెడితే నా ప్రాణం

ఉసూరుమంటుంది. ఈ పూటకి ఉల్లిగారెలు, గోంగూర పచ్చడీ, వెన్న తీసి వుంచు. పిచ్చిపిల్ల దూరాభారాలని చూడకుండా ప్రయాణం చేసొచ్చింది!!” నేను ఇంట్లో వంటమనిషిగా గృహప్రవేశం చేసింది మొదలు రోజూ ఏదో కారణాన స్పెషలు వంటలు తప్ప మామూలు వంట చేసింది చాలా తక్కువ. మామగారు పోయి చాలా ఏళ్లే అయినా ఆరోజే పోయినట్లు మా అత్తగారు కళ్లొత్తుకోటం ఆవిడని ఓదార్చే కార్యక్రమంలో వచ్చినవాళ్లు ఇంకో రెండు గారెలు వేసుకు తిని ఆమెని తృప్తి పరచటం చూసి నేను మొదట్లో నివ్వెరపోయేదాన్ని. మా పెదమామగారి పిల్లలు ‘ఇదిగో పిన్నీ! నువ్వలా బాధపడకు! ఇటు చూడు బాబయ్య ప్రసాదం… నేను ఇంకో రెండు గారెలు మళ్లీ వేయించుకుంటున్నా… ఇదిగో నవ్వాలి…’ అదేదో స్మైల్‌ ప్లీజ్‌ అని కెమెరామెన్‌ అన్నట్లుగా అంటూ మారు వడ్డన రూపంలో గారెలూ వడ్డించుకుంటూ మా అత్తగారి ప్రేమను పొందేవారు. ఇంకో విషయం చెప్పటం మరిచాను ఇవన్నీ చూసి మా పినమావగారి కోడలు ఆవపెరుగు పచ్చడిని గారెల్లో నలిచి తింటూ ”మనసా! మావగారి తద్దినమా!” అంటూ నవ్వేది. ఓ ఇలాంటి వాటికి కూడా మనసు పడతారా?? ఈ రెండు రోజులూ నాకు గిన్నెలూ, వంటలూ తప్ప మరో ప్రపంచం తెలీని నలభీమలోకాల్లో నేను విపరీతంగా విహరించి సొమ్మసిల్లి అంతర్యామీ… అలసితి సొలసితి…. అని పాడుకుంటూ పక్కమీదకి చేరగానే గండుపిల్లులు కాంపిటేషన్‌ పెట్టుకొని అరుస్తున్నట్లు అక్కతమ్ముళ్ళిద్దరూ గుర్రుపెట్టి నిద్రలో ఉండేవారు. నా జీవితానికి జతగా భర్త ఉన్నాడా లేక భార్య పోస్టులోని బానిస చాకిరీ వుందా అని ఆలోచించే ఓపిక లేక మా ఆడపడుచుని కాస్త జరిపి పడుకున్నాను. అప్పుడు ఆవిడ మా ఆయన పక్కన చూపించి పడుకుంటావా అని సైగ చేసినపుడు నా ప్రాణం సిగ్గుతో చచ్చిపోయింది. అదేమీ గమనించకుండా స్లీపింగ్‌ బ్యూటీలా ఆవిడ నర్మగర్భమందహాసంతో కాస్త మా ఆయన వేపు జరిగి తన పక్కన చోటిచ్చింది. ఆడపడుచు అర్ధమొగుడు కదా మరి, కాకపోతే నేను వారిద్దరి మధ్యా పడుకోకుండా ఒకటిన్నర మొగుళ్ల పక్కన పడుకున్నాను.

తెల్లారింది. ఏమే! రాత్రి నువ్వు నన్ను లేపాక నిద్ర లేదనుకో! అప్పుడు ప్లాన్‌ చేశానే. తద్దినం భోజనాలయ్యాకా ఏదైనా సినిమాకెడదాం, తమ్ముడితో టికెట్లు తెప్పించు… ”మళ్లీ ఎన్నాళ్లకొస్తుందో ఏమో! నోరు తెరిచి అడిగింది ఆడపిల్ల… అదేదో చూడరా నువ్వు…” అత్తగారి సణుగుడు. ”నేను ఈ చీర కట్టుకోనా

రేపు, నలుగురు వస్తారుగా” అంటూ నా చీరనే నాకు చూపిస్తున్న మా ఆడపడుచుని చూసి అనాలోచితంగా ”అది నా చీర!” అన్నాను. ”అబ్బ! బడాయి! తెలుసులేమ్మా, నీ అంత చదువుకోపోయినా ఈ మాత్రం తెలీదేమిటి, అయినా నా తమ్ముడి పెళ్లాం చీర మీద నాకు హక్కులేదా ఏంటి” అంటూ నేను ఫంక్షన్స్‌కి కట్టుకునే నల్ల జరీ బార్డరున్న గులాబిరంగు చీర తీసుకుని కట్టేసుకుంది. అక్కడితో ఆగిందా! ”నలుగురూ వచ్చినపుడు కాస్త బావుండాలిగా! ఫరవాలేదు! చూడు…” కుచ్చిళ్లు సవరిస్తూ అడిగింది. ఆ చీర నాకు అమ్మ పెట్టింది. నేను పుట్టింటి సొమ్ములని ఎవ్వరితో షేర్‌ చేసుకోలేను. ఒకలాంటి అసహ్యాన్ని, వేదనని అణుచుకుంటూ ”బానేవుంది” అని చెప్పి వెళ్లిపోయానక్కడ నుంచి. అసలు తద్దినం భోజనాలకి వేపుళ్లూ, స్వీట్లూ, ఆరోజు కట్టుకోవటానికి మంచి జరీ చీరలు ఇవన్నీ నేనెఱగను. మా ఇంట్లో ఆబ్దికాలంటే ఏదో పవిత్రతతో కూడిన గంభీర కార్యక్రమం… బ్రాహ్మల భోజనం, పిండాలు ఆవుకి పెట్టేదాకా మడి ఆచారాల పేరిట ఎవరినీ అటు రానిచ్చేవారు కాదు. మరి ఇదేమిటో ఇక్కడి తీరు. ఎప్పటికప్పుడు ఆవేదన మొదలై అసహ్యంగా మారి చివరికి సంసారం అంటే విరక్తి పుట్టడం… అంతలోనే పిల్లలని తలుచుకుని ఎక్కడలేని అనురక్తి పెరగడం… ఇలా… ఇలా… రోజులు… నెలలు… ఏళ్లు గడిచిపోతున్నాయి. పెళ్లి… పెళ్ళంటే… పందిళ్లు… సందళ్లు… తప్పెట్లు… తాళాలు… ముత్తైదుభోగాలు… అంటూ వచ్చే పాటని సన్నాయిలో వినటమే తప్ప నిజ జీవితంలో వీటికోసం వెదికి వెదికి చివరికి గిన్నెలు, వంటిల్లు, గారెలు వెదికి పట్టుకున్నాను. జీవితాన్ని చదవటం కాదు… జరపటం… ఒక పదవినుంచి మరో పదవికి, ఒక స్థితి నుంచి మరో పరిస్థితికి… ఒక బాధ్యత నుంచి మరిన్ని బాధ్యతలకి జరుగుతూనే ఉన్నా సంసారమంతా ఛేజింగ్‌ ట్రాఫిక్‌… నడిచీ నడిచీ నలిగిపోయినా బండి ఈడ్చి నడపాల్సిందే తప్ప రథసారథి పోస్టుకి రాజీనామా లేదు. చూస్తుండగానే నా పిల్లలు పెద్దవాళ్లై పెళ్ళీడుకొచ్చారు. అక్కడా అంతే!! నా పోస్టులో తేడా లేదు. అమ్మాయిగా పుట్టి అమ్మగారిగా, కోడలుగా, భార్యగా అంచలెంచలుగా బాధ్యతల మార్పిడిలో నాకు యాభై పైపడ్డాయి. కాకపోతే భార్యగా ఒకసారి మారాకా అది తిరుగులేని వన్‌గ్రామ్‌ గోల్డు లాంటి గ్యారంటీ మెరుపుతో, తరుగుపోని మరో మాటలో చెప్పాలంటే బంగారానికి తగ్గకుండా, ఇత్తడికి అందకుండా ఎప్పటికీ మిలమిలలాడేదని తెలిసింది. ఎదుగు బొదుగు లేని బంట్రోతు పోస్టులా నేనందులోనే వుండిపోయాను. బంట్రోతుకొక స్టూలు ఉంటుంది కూర్చోటానికి. బాధలే తెలియని నాకు నిలువెత్తు జీవితాన్ని ప్రసాదించి కూర్చునే తీరికలేకుండా చేశాడు దేవుడు. బాథ్యతలను వదిలించుకోలేని జీవితకాల సభ్యత్వంలో కోడలిగా మొదలుపెట్టిన జీవితంలోంచి అత్తగారినయ్యాను. అయినా సరే… మా పిల్లల న్యాయశాస్త్ర ప్రకారం రెండువైపులా నేను సమర్ధించుకునే బరువుల బాధ్యతల నడుమ వేలాడే జీవితం. నా స్వాభిమానాన్ని పుణికి పుచ్చుకున్న పిల్లలకి దేనికీ ఎవరిమీద ఆధారపడటం ఇష్టంలేక పోవటంతో పిల్లల డెలివరీలకి నేనే బాధ్యురాలినయ్యాను. ఇంకా ఎవర్‌గ్రీన్‌ భార్య పోస్టులో మావారి ప్రెస్టీజికి భంగం రాకుండా వియ్యపురాళ్లతో అనకుండా, అనిపించుకోకుండా కూతురికీ, కోడలికి నేనే తల్లినయి మనవళ్ళనెత్తాను.

అయినా సరే! మావారికి భార్య స్థానంలో ఈ పూటకీ నేనే కాఫీ కాచి ఇవ్వాలి. మరో అదృష్టం ఇక్కడ… ఆయనకి ఎవరు కాఫీ కలిపినా నచ్చదు. భార్య చేతి కాఫీతోనే వారికీ అరవై దాటాయి. మా అబ్బాయికి తండ్రి పోలిక రాలేదు. వాడి భార్య కాఫీ ఇస్తే నచ్చదు. వాడికీ నేనే ఇవ్వాలి. కాఫీలో వేసే పంచదారలా ఇదో తియ్యటి బంధం అనుకుని ఎడ్వటైజ్‌మెంట్‌లోలా తియ్యని వేడుక చేసుకుందాం అనుకుంటూ నేనే కాఫీ డిపార్ట్‌మెంట్‌ ఇన్‌చార్జిగా ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నా. మరి బంట్రోతు పోస్టు కదా కాఫీ కలపటానికి కూర్చోకుండా స్టవ్‌ముందు నుంచుని నేనే గత 30 ఏళ్లుగా కాఫీ డిపార్టుమెంటుని కాపాడుతున్నాను.

భార్య పోస్టు అనేది ఇంత లాంగ్‌టరమ్‌ కోర్సు అనుకోరు ఆడపిల్ల లెవరూ కానీ పెళ్లి పద్మవ్యూహం. వెనక్కి రావటం తెలిసినా తెలీకపోయినా బయటపడటమైతే అసంభవం. ఫోన్‌ చిన్న బెల్‌ ఇచ్చింది. మెసేజ్‌ వచ్చింది. ఫ్రెండ్స్‌ నుంచి… ఆడపిల్లలు చిలకల వంటివారట.

When she speaks,
Speaks without a break..
& everyone says,
“Please be quite”
When she is silent,
mother says,
“Are you not feeling well”
Father says,
“Why is the house so silent”
Brother says,
“Are you angry”
and when she is married, all say,
“The happiness of the house has left”
She is the real nonstop music
That’s a Girl..??
Because all the happiness starts from a girl??
????Woman has the most unique character like salt
Her presence is never remembered… but
Her absence makes all the things tasteless

అటువంటి వాళ్లు భార్యలుగా మారి జీవితంలో ఎవరూ పట్టించుకోని ఉప్పులాంటి వారట. కానీ వాళ్లు లేకపోతే ఏదీ రుచించదు. లక్షాధికారికి కూడా లవణమన్నమే అని కదా శతక కారులు చెప్పింది.

నాకున్న సందేహాలకి మరోటి జతకలిసి ఇలా అనిపించింది. కాళిదాసు శకుంతల తన చెలికత్తెతో ‘మాధవీలత ఆలంబనకోసం గున్నమామిడి చెట్టుని ఆశ్రయించింది చూశావా…’ అంటుంటే శకుంతలని చెలులు ఉడికిస్తారు, నువ్వు కూడా అంతేనంటూ మరి మామిడిచెట్టు పురుషుడైతే తీగలు స్త్రీలుగా అల్లుకుంటారు. ఆశ్రయం పొందుతారు మరి మన సంసారాల్లో మామిడి చెట్టే లేదేమిటి?

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో