వెళ్లిపోయిన వెన్నెల రచయిత్రి శివకౌముదీదేవి – అనిశెట్టి రజిత

జీవితంలో మనం ఊహించలేని విషాదం మృత్యువు. రావడం పోవడమేగా జీవితమంటే అని సరిపెట్టుకోలేని అగాధం మృత్యువు. మహా పాండిత్యంలో విలసిల్లిన ముదిగొండ శంకరశాస్త్రి గారి మనుమరాలైన శివకౌముదీదేవి తల్లిదండ్రులు జ్ఞానప్రసూనాంబ-వీరేశలింగం గార్లు. 1939 లో వరంగల్‌లో బాలుర కోసం సంస్క ృతాంధ్ర కళాశాలనూ 1962లో బాలికల కోసం శ్రీ దుర్గేశ్వర మహిళా కళాశాలనూ నెలకొల్పారు శంకరశాస్త్రి గారు. వీరిది ఆధ్యాత్మికత వెల్లివిరిసే కుటుంబం. శివకౌముది నాన్న ‘ఇస్కాన్‌’ వారు అప్పగించిన సంస్క ృతం భగవద్గీతను ప్రూఫ్‌ రీడింగ్‌, ఎడిటింగ్‌ చేసారు.

శివకౌముది 10 అక్టోబర్‌ 1969లో విజయవాడలో జన్మించి 2 జూన్‌ 2016లో తన 47వ ఏట వరంగల్‌లో శాశ్వత వీడ్కోలు తీసుకున్నది. కొందరు సమూహాల్లో కలిసిపోయి ఆ గోలల్లో ఉంటారు. కొందరు ఒంటరి లోయల్లో జీవిస్తారు. ఆయా పరిస్థితులు ఆయా దశల్ని కల్పిస్తాయి. కౌముది అటూ ఇటూగా ఉన్నది అనిపిస్తుంది. పన్నెండేళ్ళ క్రితం హన్మకొండలో కౌముదితో పరిచయం. అది స్నేహంగా మారింది. నేనూ, కొమర్రాజు రామలక్ష్మి, కౌముది మిత్రులం. తనకు కాత్యాయనీ విద్మహేతో కూడా మంచి పరిచయం. సాహిత్యం మా స్నేహానికి వారధి.

కౌముదికి సెలబ్రేషన్స్‌ అంటే ఇష్టం. గిఫ్ట్‌లు ఇవ్వడం పుచ్చుకోవడంలో సంతోషం ఉండేది. కొన్ని విషయాల్లో వితండ వాదనలు చేసేది. ఆమె స్వేచ్ఛా పిపాసి. కులాసాగా జీవించాలని కోరుకునేది. పుస్తకాలు బాగా చదివేది. రోజూ రెండు మూడు పుస్తకాల షాప్‌లు తిరిగేది. చెడ్డగా గానీ పరుషంగా గానీ, ఎవరినీ మాట్లాడటం రాదు ఆమెకు. కౌముదికి నుండి1994 – 2002 వరకు హైదరాబాద్‌లో, వరంగల్‌లో వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసింది. 1988 నుండి కథలు రాస్తూ 2014లో కథా సంపుటి ‘సంపెంగ పూదండ’ ప్రచురించింది.

ఆ పుస్తకాన్ని పాపయ్యపేటలో వాళ్ళింటి ఆవరణలో తనతో కలిపి కేవలం తొమ్మిది మంది మాత్రమే ఉన్న సమావేశంలో వాళ్ళ అమ్మగారితో ఆవిష్కరింపచేసింది. నన్ను పుస్తకం గురించి మాట్లాడమంటూ ”నా ప్రాణ స్నేహితురాలు రజిత పుస్తకం గురించి మాట్లాడుతుంది” అన్నప్పుడు నా హృదయం చెమ్మగిల్లింది. నాకు గత రెండేళ్ళుగా తను జబ్బు పడటం ప్రారంభమయిన దగ్గరనుంచీ ఫోన్‌ కాల్‌ చేయని రోజు లేదన్నట్లుగా గడిచింది. ఒక సమయం, సందర్భం, అవసరమంటూ లేకపోయినా నా కార్యక్రమాల వివరాలు వివరణాత్మకంగా అడిగి తెలుసుకునే ఆసక్తితోనో, తన గురించి తనకు తెలిసిన విషయాల గురించి చెప్పడానికో ఏ సమయంలోనైనా కాల్‌ చేసేది.

కౌముదికి డయాబెటిస్‌ వచ్చిన సంవత్సరం తరువాత గత తొమ్మిదేళ్ళుగా ఇంటికే పరిమితమైపోయింది. ఈ చివరి రెండేళ్ళలో మధుమేహం ఆమెను బాగా మోహించిందన్నట్లుగా అనారోగ్యపు ప్రమాదాల్లో పడేసింది. అనేకసార్లు ఆసుపత్రుల నుండి గండం గడిచి బయటికొచ్చింది. ఆమెను నేను చివరిసారిగా తను పోవడానికి కేవలం ఆరు రోజుల ముందు రాత్రివేళ చూసాను. అప్పటికి ఆరు రోజుల క్రితమే హాస్పిటలైజ్‌ అయి తిరిగొచ్చానని చెప్పింది. చాలా లైవ్‌లీగా మాట్లాడింది. వచ్చేస్తుంటే త్వరలో మళ్ళీ రండి అంది. కానీ చివరిసారి ఫోన్‌లోనైనా అల్విదా చెప్పకుండా సుదూర తీరాలకు వెళ్ళిపోయింది. ఇక ఆమె ఫోన్‌ రాదా… విసిగించదా… అనుకుంటే జీర్ణించుకోలేని దుఃఖం ఆవరిస్తున్నది.

కౌముది రచనలను కొన్నింటినైనా ప్రస్తావించుకోవాల్సిన సమయం ఇది. 1990లో ఆధునిక భావనలు జీవితాలను ప్రభావితం చేస్తూ ఒక పెనుమార్పు సమాజంలో రావడం ప్రారంభమయ్యింది. ఆ కుదుపు సాహిత్యంలో ప్రవేశించి ఊపందుకున్న వివిధ వాదాలు స్త్రీ పురుషుల్నీ, యువతీ యువకుల్నీ ఆకర్షించాయి. అటువైపు మళ్లించాయి. ఆ కాలంనాటి సరికొత్త భావాలూ, అభిప్రాయాలూ, స్వేచ్ఛాపిపాసతో కూడిన ప్రవర్తనలూ పరిణామాలూ కౌముది కథల్లో చోటు చేసుకున్నాయి. సామాజిక విలువల నేపథ్యంలో చర్చించాయి. వాటిల్లో సంపెంగపూదండ, ఋతుమోహం, హృదయానికి నచ్చే రంగుల కోసం, పొద్దు తిరుగుడు పువ్వు, నాలుగు స్తంభాల ఆట ఆ కోవకు చెందినవే.

మనిషికీ ప్రకృతికీ ఉన్న గాఢమైన సంబంధాన్ని భావుకత్వం పొంగి పొరలుతూ వర్ణించిన కథ ‘పున్నాగ చెట్టు’ కౌముదిలోని సున్నితమైన స్పందనలనూ, భావనలనూ ఆవిష్కరిస్తుంది. రచయిత్రి అంతశ్చేతనను జాగృతం చేసిన బాహ్యావరణలోని ప్రకృతిని గుర్తించిన విధానం చదువరుల గుండెలను పిండేస్తుంది. మనిషి మానసిక ప్రపంచాన్ని విస్త ృతం చేసే ప్రకృతితో ప్రేమలో పడటం సంఘజీవికి అరుదుగానైనా సహజమేననిపిస్తుంది. స్నేహం అనేది చెట్టుతోనైనా, పిట్టతోనైనా, వ్యక్తులతోనైనా బలీయంగా ఉంటే మనలో మధుర విషాదాల చక్రం తిరుగుతూ ఉంటుందనే వాస్తవాన్ని చిత్రించింది రచయిత్రి.

ఆధునికుల్లో ఎలాంటి ఇజాలు, ఆదర్శాలు ఉన్నా… మనిషి గిరిగీసుకుని కూర్చోవడం కుదరదనీ, కరుడుగట్టిన భావాలను ఆచరిస్తూ బతకడం సాధ్యంకాదని చెప్పే కథ ‘పూర్ణాత్‌ పూర్ణముదస్యతే’. జీవితానికి అన్నీ కావాలి – కుటుంబం, విద్య, జీవనాధారం, శాంతి, విశ్వాసం, ఆనందం, అన్నీ కలిపితేనే పూర్ణత్వం వస్తుందని చెప్తుంది. కథలోని మూడు ప్రధాన పాత్రలూ చివరికి ఈ అవగాహనకు వస్తాయి.

వర్గ సామాజిక దృక్పథంతో రాసిన ‘ఐస్‌’ అనే కథలో పెద్ద కంపెనీలూ, షాపింగ్‌ సెంటర్‌లూ, సంస్థలూ మనల్ని మర్యాదగా చేసే దోపిడీలను పట్టించుకోని మనం చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళ పట్ల జాగరూకతతో వ్యవహరిస్తుంటాం. ‘ఐస్‌’ వేసి జ్యూస్‌ చేసిచ్చేలాంటి చిన్న అమ్మకందార్లు మనలను అర్థరూపాయి, రూపాయి దగ్గర ఏదో దోపిడి చేసేస్తుంటారని అనుమానిస్తాం. మనం మోసపోతున్నామని భావించి తెలివిగా ఏదో ట్రిక్‌ ప్లే చేసి వాళ్ళనే మోసం చేయాలని ప్రయత్నిస్తాం. ఆలోచితంగానో, అనాలోచితంగానో అందరం రోజూ చేసేది అదే అయినా ఒక సందర్భాన్ని తీసుకొని ‘ఐస్‌’ కథను చర్చనీయంగా అల్లిన తీరు రచయిత్రి మెచ్యూరిటీకి నిదర్శనంగా నిలిచింది.

తెలంగాణలోని కరువు పరిస్థితుల్లో ఒక తునికాకు సేకరించే శ్రామికురాలు ఎల్లమ్మ తన ఊళ్ళోనే ఒక రాజకీయ పార్టీ అట్టహాసంగా పెట్టిన గంజి కేంద్రంలో పనిచేయాల్సి వస్తుంది. కానీ ఆకలితో మాడిపోతున్న ఎల్లమ్మకు గంజి దొరకదు. ప్రజలు అన్నము నుండే పుడుతున్నప్పుడు, అందరికీ అన్నం ఎందుకు దొరకదు? కొందరు ఆకలి చావులు ఎందుకు చావాల్సి వస్తున్నదనేది రచయిత్రి ఆవేదనతో కూడిన ప్రశ్న. గంజి కేంద్రాల్లో కూడా అమానవీయమైన రాజకీయాలను ఎత్తి చూపిస్తుంది ‘అన్నమ్‌’ అన్న కథలో..

కౌముదిలో అపారమైన అధ్యయనం వల్ల కలిగిన జ్ఞానం ఉన్నది. ఒక సందర్భాన్నీ ఒక అంశాన్నీ తీసుకొని కథను కూర్చే సామర్థ్యం మెండుగా కనిపిస్తుంది. తన ‘సంపెంగ పూదండ’ ఆవిష్కరణ రోజున నేను ”కౌముదీ… నీవు త్వరలోనే నీ రెండో కథా సంపుటిని ప్రచురించాలని” కోరాను… నవ్వింది. ఇప్పుడామె కథల్ని ప్రచురించే బాధ్యతను ‘ప్రరవే’ తెలంగాణ శాఖ తీసుకోవాలనుకుంటున్నది.

మా మిత్రురాలు మంచి కథా రచయిత్రి కౌముది హఠాత్తుగా అదృశ్యం కావడం జీర్ణించుకోలేకపోతున్నాము. కాలం ఇచ్చే నిర్ధాక్షిణ్యపు తీర్పులనూ, చేసే నిర్ణయాలనూ ఎదిరించలేని ఒట్టి మనుషులం… ఇగోల చట్రాల్లో బిగించుకొని, నైజాల రంగుల్లో తీరొక్క వేషాలు కడ్తున్నవాళ్ళం… తదనంతరం చేయగలిగిన పనిచేసి జ్ఞాపకాలను తడుముకుంటూ ఉండవలసిందే కదా… వెన్నెలలు వస్తుంటాయి పోతుంటాయి… వెళ్ళిపోయి తిరిగిరాని వెన్నెల గురించే మనకు తీరని వెలితి.

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో