తోరూ దత్తు – భండారు అచ్చమాంబ సరళీకరణ : పి. ప్రశాంతి

క. సుకృతాత్ములు రససిద్ధులు

సుకవీంద్రులు విజయనిధులుసుమ్ము తదీయా

ధిక కీర్తి శరీరంబులు

ప్రకట జరామరణ జన్మభయరపాతంబుల్‌.

పాశ్చాత్య విద్యలైన ఫ్రెంచ్‌ మొదలైన భాషలయందు అపార పాండిత్యం కలిగి, ఆయా భాషలలో కవిత్వం చెప్పి, గ్రంథాలు వ్రాసి ప్రసిద్ధికెక్కిన హిందూ పురుషులే అరుదుగా ఉండగా, అలాంటి స్త్రీలు ఉండటం అసంభవమే అని చెప్పవచ్చు. కాని, మనం అసంభవము అనుకున్న సంగతులే ఈశ్వరుని దివ్య ప్రభావం వలన సంభవములై మనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించుచున్నవి. ప్రస్తుత కథానాయిక అయిన తోరూదత్తు అను పేరు గల తరులతా దత్తు విషయం ఈ చిత్రాలలో ఒక చిత్రమై ఉంది. ఈమె తండ్రి పేరు బాబూ గోవింద చంద్ర దత్తు. దత్తుగారు క్రైస్తవ ధర్మమును స్వీకరించిన హిందువులు. ఈయన నివాస స్థలము హిందూ దేశమునకు ప్రస్తుత రాజధాని అయిన కలకత్తా నగరం. ఈ నగరం నందు ఆయన న్యాయాధికారిగా ఉండేవారు. స్త్రీ విద్య యందు ఈయనకు అధిక ప్రీతి ఉన్నందున తన చేతనయినంత వరకు స్త్రీ విద్యాభిóవృద్ధికి పాటుపడుతుండేవారు. ఆయన కోరికను తీర్చడానికి కాబోలు ఈశ్వరుడు అతనికి త్వరలోనే ఆడసంతానాన్ని ఇచ్చెను. అందులో అందరికన్నా చిన్న కూతురైన తరులత కలకత్తాలో 1856 సంవత్సరంలో జన్మించింది. ఈమె బాల్యమంతా ఆ నగరంలోనే గడిచిందని చెప్పవచ్చు. తరులత అందరికన్న చివరి కూతురవడంతో ఆమెను అందరూ ”తోరు” అని ముద్దు పేరు పెట్టి పిలుస్తుండేవారు.

తోరూదత్తు తండ్రి స్త్రీ విద్యాభిమాని అయినందున ఇతర బెంగాలీ స్త్రీలకు విద్యార్జనయందు కలిగే ఇబ్బందులేవీ లేకుండా విద్యనభ్యసించడానికి ఇతర బాలికలకు దొరకని సాధనాలెన్నో ఈమెకి బాల్యం నుండే లభించాయి. ఈమె తండ్రి అత్యుత్సాహంతో ఈమెకి, పెద్దకూతురైన ఆరూబాయికి విద్య చెప్పించాడు. పిదప కుమారుడైన ఆబాజీతోపాటు ఈ ఆడబిడ్డలకి కూడా ఇంగ్లీషు నేర్పించడానికి బాబు శివచంద్ర బెనర్జీ గారిని గురువుగా నియమించారు. గురువైన బెనర్జీ తోరు యొక్క బుద్ధి కుశలతని కనిపెట్టి విశేష శ్రద్ధతో నేర్పించగా ఆమె ఇంగ్లీషు విద్యలో అధిక ప్రీతి కలిగినదై చాలా త్వరగా విద్యార్జన చేస్తుండేది. ఇలా విద్యార్జన చేస్తుండగా కొద్ది కాలం లోనే ఆమెకు, ఆమె అక్కకు ఇంగ్లీషు భాషలోని మహాకావ్యాలయొక్క అర్థం స్వయంగా గ్రహించగలిగినంత శక్తి కలిగింది. ”ఘనత వహించిన మిల్టన్‌ కవివరుని గ్రంథాలను ఈ అక్క చెల్లెళ్ళు పఠన గ్రంథంగా జేసుకుని, తమతో సమానమైన ఈడుగల ఆంగ్లేయ బాలికలకంటే ఎక్కువగా అర్థాన్ని గ్రహించగలిగి, కవితా ప్రవాహాదులను చూసి అత్యద్భుతం పొందేవారు” అని ఒక చరిత్రకారుడు వీరిని గురించి వ్రాశాడు. ఈ జాన్‌ మిల్టన్‌ కవి ఇంగ్లీషు కవులలో బహు గొప్పవాడట. ఆయన గ్రంథాలు ప్రథమ శాస్త్ర పరీక్షకు, బట్ట పరీక్షకు, మరి ఇతరమైన గొప్ప గొప్ప పరీక్షలకును చదవాల్సిన గ్రంథాలుగా

ఉంచేవారట. గొప్ప గొప్ప విద్యార్థులకును ఈయన గ్రంథాలలోని అర్థం తెలియటం కష్టమట. వాటిలోని అంతరార్థం తెలియటం అంతకంటే దుర్లభమట. సంస్క ృతంలోని మాఘ, నైషధ కావ్యముల యొక్కయు, ఆంధ్రములోని వసుచరిత్ర యొక్కయు పాకము మీదనే ఈ కవి యొక్క కావ్యాలూ దిగినవట. ఇలాంటి ఈ కవియొక్క కావ్యాలలోని రహస్యాలను చిన్నతనంలోనే కనిపెట్టిన తరులతా దత్తు యొక్క బుద్ధి వైభవము దైవీకమనే చెప్పాల్సి ఉంటుంది.

1869 వ సంవత్సరంలో పుత్రమరణ దుఃఖీతుడైన గోవిందచంద్ర దత్తు గారు కూతుళ్ళే తనకు పుత్రులని అనుకుని వారి విద్యాభివృద్ధికై వారి ఐరోపాఖండంకు తీసుకుపోయారు. వారికి ఉన్నత విద్య నేర్పించదలచి ముందుగా ఆయన ఫ్రాన్స్‌ దేశానికి పోయి ‘నీసు’ నగరం నందు నివసించారు. అక్కడ ఆ సోదరీమణులిద్దరూ తమ బుద్ధిబలంతో విద్యార్థి వేతనాలను (స్కాలర్‌షిప్‌లను) సంపాదించుకుని, ఫ్రెంచ్‌ విద్వాంసులనాశ్రయించి ఫ్రెంచ్‌ భాష నేర్చుకున్నారు. కొన్ని రోజులు వీరు ఫ్రాన్స్‌ దేశానికి రాజధాని అయిన పారిస్‌ నగరంలో ఉన్నారు. అక్కడ ఫ్రెంచ్‌ విద్య చక్కగా నేర్చుకుని ఆ ముగ్గురు ఇటలీ దేశం చూసి లలితకళా విద్యలకు పుట్టినిల్లయిన ఇంగ్లండ్‌కు వెళ్ళారు. 1873 వ సంవత్సరం వరకు వారక్కడ ఉన్నారు. వారు ఆ కాలంలోనూ వ్యర్థంగా కాలం గడపక ఇంగ్లీషు, ఫ్రెంచ్‌ భాషలలో అసాధారణ ప్రావీణ్యం సంపాదించారు. వారు కేంబ్రిడ్జ్‌ పట్టణం (మన కాశీ పట్టణం వలెనే ఈ గ్రామం ఇంగ్లాండ్‌లో ఒక గొప్ప విద్యా పీఠం) లో ఉండి బ్రేగ్నిల్‌ దొరసాని గారు ఫ్రెంచ్‌ భాషలో ఇచ్చిన ఉపన్యాసాలకు తప్పకుండా వెళ్ళేవారు. తదనంతరం వారిరువురు సెంటులియో నార్ట్స్‌ పట్టణంనందు తమ ఫ్రెంచ్‌ విద్యను అభివృద్ధి పరచుకున్నారు. యూరప్‌ ఖండంనందున్న కాలంలో తోరుదత్తు తన రోజువారి ప్రవర్తనను రోజూ వ్రాయసాగింది. ఈ పుస్తకంలో ఆమె అనేక సంగతులను ఎంతో శ్రద్ధతో వ్రాస్తుండేది. రోజూ జరిగిన సంఘటనలను ఆ పుస్తకంలో అత్యంత శ్రద్ధతో సవివరంగా వ్రాసేది. అందులో ఆమె అనేక సంగతులను గురించి తన సొంత అభిప్రాయం వ్రాసింది. ఆ అభిప్రాయాలు ఎంతో రమ్యంగా ఉన్నవట.

ఆ చిన్న కుటుంబం ఫ్రాన్స్‌ దేశంకంటే ఇంగ్లీషు దేశంలోనే ఎక్కువ రోజులుండటం జరిగినా, తోరూదత్తుకు ఫ్రాన్స్‌ దేశం మీదనే విశేష గౌరవం కలిగి ఉండేది. జన్మభూమి అయిన హిందూ దేశంపై ఆమెకెంత ప్రీతి ఉండేదో అంత ప్రీతి ఫ్రాన్స్‌ దేశం మీద ఉండేది. 1869 వ సంవత్సరంలో ఫ్రాన్స్‌ దేశానికి, జర్మన్‌ దేశానికి జరిగిన ఘోర యుద్ధంలో ఫ్రాన్స్‌కు పరాభవం కలిగినప్పుడు చూడలేక తోరూదత్తు తన నిత్యప్రవర్తన గ్రంథంనందు ఇలా వ్రాసింది. ”నేను వెనుక దినచర్య వ్రాసి ఎన్నో రోజులు గడిచాయి. అయ్యో! ఈ అవకాశం నందు ఫ్రాన్స్‌ దేశంలో ఎన్నో మార్పులు జరిగాయి. పారిస్‌ నగరంలో మేమున్న కొంతకాలం ఆ పట్టణం ఎంతో రమణీయంగా ఉండేది. అక్కడి రాజమార్గములు అత్యంత రమ్యంగా ఉండేవి. ఆ దేశంలోని సైన్యం అత్యంత క్రమశిక్షణతో మలచబడింది.

(ఇక్కడ కొన్ని వాక్యాలు ప్రింట్‌లో స్పష్టంగా లేనందున వ్రాయలేకపోతున్నాము)

ఫ్రాన్స్‌ దేశీయులకు, జర్మన్‌ దేశీయులకు యుద్ధమా రంభమైన నాటినుండి కూడా నా మనసంతా ఫ్రాన్స్‌ దేశ విజయాన్నే కోరుతుండేది. చివరికి అలాకాక ఫ్రాన్స్‌ దేశానికి పరాభవం కలగటం చాలా బాధాకరం”. ఈ వాక్యాలతోనే ఆమెకు ఫ్రాన్స్‌ దేశంపైన గల గౌరవం వెల్లడవుతోంది. ఆ దేశంపై తనకు గల గౌరవంను తోరూదత్తు ఇంగ్లీషులో స్వయంగా ఒక పద్యకావ్యం రచించి వెలువరించింది.

1873 వ సంవత్సరంలో కూతుళ్ళను తీసుకుని గోవిందచంద్ర దత్తు గారు తిరిగి కలకత్తా వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత తోరూదత్తు ఇంగ్లీషు, ఫ్రెంచ్‌ భాషలలో ఎక్కువ పరిశ్రమ చేస్తూ తండ్రిగారి వద్ద సంస్క ృతం నేర్చుకోవడం ప్రారంభించింది. ఈ సమయంలోనే ఆమెకు పద్య గద్య కావ్యాలు వ్రాయడానికి గొప్ప స్ఫూర్తి కలిగింది. పైగా ఆమె తండ్రి కవిత్వం వ్రాయడానికి, కవిత్వ స్ఫూర్తిని పెంచుకోడానికి కుమార్తెను ఎప్పుడూ ప్రోత్సహిస్తుండేవారు. అందువలన తనకు కవిత్వ స్ఫూర్తి లభించి దృఢపడిందని తోరూదత్తు ఎప్పుడూ తండ్రి గారి పట్ల కృతజ్ఞురాలై ఉండేది. ఇలా కదా తండ్రి తన పుత్రీ పుత్రులను జ్ఞానవంతులుగా చేయాల్సిన విధి. ఇలా కదా పుత్రీ పుత్రులు తమ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞులై ఉండాల్సిన విధి.

ఇలా గోవిందచంద్రదత్తు తన కుమార్తెలకు విద్యాబుద్ధులు చెప్పించి, కొడుకులలాగే పెంచడం చూసి కొందరు ఆశ్చర్యపడతారేమోకాని అలా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు. పుత్రికలను పుత్రులలాగే చూడటమే శాస్త్ర ధర్మం. కన్యావివాహ సమయంలో తండ్రి ‘పుత్రవత్సా వితామయా’ – ‘పుత్రునివలె నాచే పెంచబడిన కన్య’ అని చెప్పటం అందరికీ తెలిసిందే కదా! అంతేకాక మునిశ్రేష్టుడైన మనువు పుత్రీపుత్రులు సమానమని స్పష్టంగా వ్రాసి ఉన్నాడు.

యధావాత్మా తథాపుత్రః పుత్రేణ దుహితా సమా.

”తనతో సమానుడు పుత్రుడు. పుత్రునితో సమానం కూతురు.”

శాస్త్రాలు ఇలా ఉద్ఘోషిస్తుండగా మన దేశంలో బాలికలను బాలురకంటే అతినీచంగా చూడటం చూసి ఎంతో బాధాకరంగా ఉండక మానదు. ఆడపిల్ల పుట్టిన నాటి నుండి తల్లిదండ్రులకు చాలా బాధాకరంగా ఉండకమానదు. ఆడపిల్ల పుట్టినప్పటినుండి తల్లిదండ్రులు ఎంతో బాధతో ఉంటారు. పెద్దగా ఎదుగుతున్న కొద్దీ పుత్రికలను పుత్రులలా చూడక ఎలాగొలా పెంచాలన్నట్లు పెంచుతారు. ఇలా అనటం వలన ఆడపిల్లలను దయతో పెంచేవారే ఈ దేశంలో లేరని నా ఉద్దేశ్యం కాదు. అలాంటి సజ్జనులు కూడా ఉన్నారు. కాని ఈ దేశంలోని ఆడపిల్లలలో నూటికి తొంభైతొమ్మిది మంది బాలికలు నేను చెప్పినట్లు అత్యంత అలక్ష్యంతో పెంచబడుతున్నారనడానికి సందేహం లేదు. ఆంధ్ర మహారాష్ట్ర దేశాల బాలికల స్థితి అంత శోచనీయంగా లేదు. కాని, బెంగాల్‌ పశ్చిమోత్తర పరగణాలు మొదలైన దేశాలలో ఆడపిల్లలు పుట్టటం కుటుంబానికి ఒక గొప్ప కష్టం ప్రాప్తించటమే అని అనుకుంటారు. ఇలా మన దేశంలో బాలికలకు అత్యంత దురవస్థ ప్రాప్తించడానికి కారణం స్త్రీలు అన్ని విషయాలలో పురుషులకంటె తక్కువ వారని మనదేశంలో కల వాడుకే. ఈ వాడుకకు కారణం స్త్రీలు అజ్ఞాన దశ. కాబట్టి, స్త్రీ విద్యాభివృద్ధి అయితేకాని, బాలికలకు ఈ అవస్థ తప్పదు. కనుక దేశాభిమానులగు సోదర సోదరీమణులారా! మీరు దత్తు గారి లాగే మీ కొడుకులను, కూతుళ్ళను సమాన ఇష్టంతో చూస్తూ బాలికలకూ బాలురవలె ఇంగ్లీషు ఫ్రెంచ్‌లు చెప్పించకపోయినా మీ మాతృభాష అయినా చెప్పించి దేశక్షేమానికి తోడవుతారని నమ్ముతున్నాను.

బంగాల్‌ స్త్రీ పరాయభాషలో ఉత్తమ కవిత్వం చెప్పి ప్రసిద్ధి చెందుతుందని ఆ సమయంలో ఎవ్వరూ కలలోనైనా అనుకుని

ఉండరు. అలా అవుతుందని చెప్పినా ఎవ్వరూ నమ్మేవారు కాదు. మన దేశపు స్త్రీలు అనేక శతాబ్దాల నుండి అజ్ఞానాంధకారంనకు పుట్టినిల్లు చేయబడినందున హిందూ దేశంలోని ఒక అబల ఈ పద్యాలు వ్రాసిందని ఎవ్వరూ అనుకోలేదు. తోరూదత్తు ప్రథమంగా ఒక ఫ్రెంచ్‌ కవిని గూర్చి ఒక వ్యాసం వ్రాసి ఒక మాస పత్రికలో ప్రసిద్ధి పొందింది. ఆ పత్రికలో ఆమె ఫ్రెంచ్‌ భాషలోని అనేక పద్యాలను ఇంగ్లీషులోకి అనువదించి అచ్చు వేయిస్తుండేది. ఆ కాలంలో ఆ పత్రికను చదివిన వారికి ఆమె వ్రాసిన వ్యాసాలు, పద్యాలు ఎంతో ఆనందం కలిగిస్తుండేవి.

ఇంతలో 1874 వ సంవత్సరంలో ఈమె అక్కగారు ఆరూబాయి క్షయ రోగంతో పరలోక వాసి అయింది. ఆరూబాయి కవిత్వ కల్పనల్లో చెల్లెలికంటె తక్కువ నేర్పరియైనా బెంగాలీ, ఇంగ్లీషు, ఫ్రెంచ్‌ భాషలలో పాండిత్యంలో తోరుతో సమానంగా ఉండేది. ఈమె

సహజంగా ఎంతో శాంతంగా ఉండేది. ఈమెకు ఏకాంతవాసంలో ఉండటమే ఎక్కువ ఇష్టంగా ఉండేది. ఆరూబాయికి తన పేరు ప్రసిద్ధమవటం ఎంతమాత్రం ఇష్టం లేదు. కాని ఆమె తన చెల్లెలి కవిత్వ స్ఫూర్తిని చూసి సంతోషిస్తుండేది. ఈమె చిత్రపటాలు వేయటంలో చాలా ప్రవీణురాలిగా ఉండేది. ఈ అక్కచెల్లెళ్ళిద్దరిలో తోరూదత్తు గ్రంథాలు వ్రాసేలా, ఆరూబాయి ఆ గ్రంథాలకు అనుకూలమైన బొమ్మలు వేయాలని నిర్ణయించుకున్నారు. కాని అదంతా ఆరూబాయి మరణంతో ఆగిపోయింది. ఈ అక్కచెల్లెళ్ళిద్దరూ సంగీతంలో అసమాన ప్రజ్ఞ కలిగి అనేక వాద్యాలను ఎంతో నేర్పుతో వాయించేవారు. వీరు తమ విద్యాభ్యాసాన్ని చేస్తూ సాధారణ కుటుంబపు స్త్రీలలాగే తమ ఇంటి పనులను చక్కపెట్టుకునేవారు. ఆడది చదివి చెడిందన్న మూర్ఖపు లోకోక్తి అబద్ధమని, ‘చదవక మగవాడు చెడెన’ న్న లోకోక్తి లాగే ‘చదవక ఆడది చెడె’నన్న లోకోక్తీ నిజమని ఈ అక్కచెల్లెళ్ళు ఉదాహరణ పూర్వకంగా నిరూపించారనడానికి సందేహం లేదు.

తోరూదత్తు అన్ని పనులలో చురుకుదనం చూపిస్తుండేది. ఆమెకు ప్రతిపనిలో కల బుద్ధికుశలత చూసి ఆమె తండ్రి చాలా ఆశ్చర్యపడుతుండేవారు. ఆమె జ్ఞాపకశక్తి అద్భుతం. ఆమె రచించిన పద్యాలన్నీ ఆమెకు కంఠస్తంగా ఉండేవట. సంస్క ృతం, బంగాలీ, ఇంగ్లీషు, ఫ్రెంచ్‌ భాషలలోని మహా కవీశ్వరుల పద్యాలు అనేకం ఆమెకు కరతలామలకంగా ఉండేవట. ఆమె తాను చదివిన గ్రంథముల నన్నింటిని తిరిగి ఒకసారి మననం చేస్తుండేది. ఒకానొక్కచోట తనకు అర్థం తెలియకపోతే మళ్ళీ మళ్ళీ చదివి దానిలోని అర్థాన్ని కనుక్కునిగాని ముందుకు చదివేది కాదు. ఇలా ఆమె ఆత్మోన్నతినందు ఎంతో తత్పరురాలై ఉండేది. తోరూదత్తు తన అక్క గతించిన తర్వాత కూడా ధైర్యం విడవక తన ప్రయత్నాన్ని మానలేదు. ఈమె రచించిన ‘పద్యసముదాయమ’ని మొదటి గ్రంథం 1876లో వెలువడింది. దీనిలో ఫ్రెంచ్‌ కవీశ్వరుల కావ్యాలనుండి ఇంగ్లీషు భాషకు అనువదించబడిన పద్యరూపంలో ఉన్న చిన్న చిన్న కథలున్నాయి.

దానిలో పీఠిక స్థానంలో ఒక పద్యం వ్రాసి ఈ గ్రంథం తన తల్లికి అంకితమిచ్చినట్లుగా చెప్పింది. దీని ద్వారా ఈమె మాతృభక్తి వెల్లడవుతోంది. ఈ గ్రంథం మొట్టమొదట బంగాళా దేశంలోని భవానీ పురం నందు అచ్చువేయబడింది. కాగితాలు చాలా పల్చగా, అచ్చు అంటీఅంటనట్లుగానూ ఈ పుస్తకం గుజనీ పుస్తకంగా అచ్చువేయబడింది. లోకంలో బైటి సౌందర్యం చూసి భ్రమించే అలవాటు ఉంది. కాబట్టి, అది మంచి గ్రంథమే అయినా దాని బయటి రూపం చూపులకు ఇంపుగా లేనందున దానిలోని పద్యరత్నములను చదువుటకు ఆ కాలంనందు ఎవరికీ బుద్ధి పుట్టకపోయింది. అందువలననే ఈ కవయిత్రి పుస్తకం మన దేశంలో ఆ కాలంనందు మెప్పుపొందలేకపోయింది. ఇలా బయటి డాంబికానికే భ్రమపడేవారు అనేకమంది ఉన్నా, ఈ జగత్తులో సత్యశోధకులు, సద్గుణ పరీక్షకులు నూటికి కోటికైనా ఒక్కరు కనపడకపోరు. ఇలాంటి రసికులు ఉండటం వలననే కవిత్వం వంటి విద్యలు వృద్ధి చెందుతున్నాయి. తోరూ భాగ్యం వలన ఇటువంటి రసికుడొకడు ఇంగ్లీషు దేశంలో

ఉండేవాడు. దైవవశాత్తుగ ఈ పుస్తకం ఆయన చేతబడటం సంభవించింది. ఈ గుణగ్రహణ ప్రావీణుని పేరు ప్రొఫెసర్‌ ఎడ్మండ్‌ గ్యాస్‌. ఆ పుస్తకం చదివి అతడు ఇంగ్లీషు దేశంలోని ”ఎగ్జామినర్‌” అనే వార్తపత్రికలో దానిని ఇలా ప్రశంసించాడు. ”ప్రొ. మింటో దొరగారు ‘ఎగ్జామినర్‌’ అను వార్తా పత్రికాధిపతిగా ఉన్న సమ యంలో ఒక దినం నేను వారి కార్యాలయంకు పోవటం జరిగింది. అపుడాయన తన వద్దకు అభిప్రాయం కోసం వచ్చిన పైన హిందూస్థానం ముద్రగల ఒక పుస్తకం నా చేతికిచ్చాడు. ఆ పుస్తకం చూడటానికి అసహ్యంగా కనిపిస్తూండేది. అది భవానీపురంలోని సప్తాహిక సంవాదం అనే ముద్రాక్షరశాలయందు ముద్రింపబడింది. ఇది రెండు వందల పుటలు (పేజీలు) గల పుస్తకం. దీనిలో ఉపోద్ఘాతం మొదలైనవి ఏమాత్రం లేవు. దానిని చూడటంలోనే చిత్తు కాగితాల బుట్టలో పారవేయా లనిపిస్తుంది. దానిలోని సగం అంటీఅంటనట్లున్న అక్షరాలను చూసి దానిలో ఉత్తమ కవిత్వం ఉండవచ్చని అనిపించకపోవడంలో వింతలేదు. కాని పుస్తకం తీసి దానిలోని పద్యం ఒకటి చదివిన వెంటనే నాకు కలిగిన ఆనందాశ్చర్యాలు వర్ణింప శక్యం కాదు.” తోరూదత్తు రచించిన గ్రంథాలన్నింటిలో ఇది ప్రథమ ప్రయత్నమే అయినందున ఈ కావ్యము తర్వాత ఆమెతో రచింపబడిన కావ్యములంత రసవంతమైనవిగా ఉండకపోవటం సహజం. అయినా అలాంటి గ్రంథమే పాశ్చాత్య పండితులచే కొనియాడబడినప్పుడు ఆమెచే రచింపబడిన ఇతర కావ్యాలు ఎంత రసవంతమైనవ య్యుండునో చదువరులే ఊహించుకోగలరు.

తోరూదత్తుకు గల ఇంగ్లీషు, ఫ్రెంచ్‌ భాషాజ్ఞానం ఈమెకంటే అధిక వయస్కులైన ఇంగ్లీషు, ఫ్రెంచ్‌ స్త్రీలలోనూ కనబడటం దుర్లభం. ఈ రెండు భాషలూ తోరూదత్తుకు పరభాషలే అయినా వాటిలో ఆమె స్వంతభాషలాగే కవిత్వం వ్రాయటం చూసి లోకులు ఆశ్చర్య పడుతుండేవారు. ఈమె కవిత్వంలో విశేష భాగం భాషాంతరీభూతమైనా (అనువాదాలే అయినా) దానిలో కవిత్వానికి కావలసిన లక్షణాన్నీ అనగా శబ్దశౌష్ఠవము, అర్థగాంభీర్యము, రసపుష్టి మొదలైన గుణాలు ఉన్నందున చదివేవారికి ఆమె కావ్యాలు భాషానువాదాలుగా అనిపించక స్వతంత్ర రచనగానే అనిపిస్తుండేది. తోరూదత్తు ‘ప్రాచీన హిందూస్థానంలోని పాటలు’ అను కావ్యమొకటి రచించింది. ఆ కావ్యమునకు ప్రొ|| గ్యాస్‌ దొరగారు ఒక పీఠిక వ్రాసారు. అందులో అతడు ”పందొమ్మిదో శతాబ్దంలోని కవుల చరిత్రను వ్రాసేటపుడు తోరూదత్తు చరిత్రను వ్రాయవలసి

ఉంటుంది” అని వ్రాశాడు. ఆంగ్లేయునిచే ఇట్టి స్తుతిని పొందిన ఆ నారీరత్నమును స్తుతించుటకు నేనెంతదానను.

ప్రథమ గ్రంథం అచ్చుపడిన కొద్ది రోజులకే తోరూబాయికి వ్యాధి సంభవించింది. అందువలన ఆమె తండ్రి బలవంతంచేత సంస్క ృత అధ్యయనాన్ని మహాకష్టంతో వదిలేసింది. రోగం మధ్య మధ్యలో తగ్గినట్లే కనిపించినా రోజు రోజుకీ ఆమె సత్తువ తగ్గుతోంది. ఆమెకు బలం తగ్గిన కొద్దీ కవిత్వ ధోరణి అధికమయ్యింది. తాను ఈ ప్రపంచంలో ఉండటం కొద్ది రోజులే అని అనిపించిన కొద్దీ కావ్యాలు వ్రాసి అజరామరణ కీర్తి సంపాదించాలన్న ఇచ్ఛ ఆమెకు ఎక్కువగా కలుగుతుండేది. ఆ సమయంలో క్లారీసాబదేవర అను ఫ్రెంచ్‌ స్త్రీచే రచించబడిన గ్రంథమొకటి ఈమె చదవటం తటస్థించింది. దానిని ఇంగ్లీషు భాషలోకి అనువదించాలని ఆమెకు దృఢమైన ఇచ్ఛ కలిగింది. అంతట ఆమె అనువదించడానికి అనుమతి ఇమ్మని పుస్తక రచయిత్రికి ఉత్తరం వ్రాసింది. అందుకు ఆమె అనుమతి ఇచ్చింది. అప్పటినుండి వారికి అత్యంత స్నేహం కలిగినందున తోరూ ఆ గ్రంథకర్తకి (రచయిత్రికి) కృతజ్ఞతా పూర్వకంగా తన చిత్రపటాన్ని, సంస్క ృతం నుండి తాను ఫ్రెంచ్‌లోనికి అనువదించిన సరస పద్యాలను పంపింది. ఆ పద్యాలను ఆ దొరసాని ఎంతో మెచ్చుకుందట! కాని ఈ దేశం యొక్క, ప్రత్యేకించి ఈ దేశంలోని స్త్రీల యొక్క దౌర్భాగ్యవశాత్తు విద్యావతియైన తోరూదత్తు ఫ్రెంచ్‌ రచయిత్రి యొక్క గ్రంథాన్ని అనువదించక ముందే 1877 వ సంవత్సరములో అశాశ్వతమైన ప్రపంచాన్ని వదిలి శాశ్వతమైన పరలోకానికి పోయింది. ఈమె చివరి సమయంలో చెప్పిన వాక్యములవలన ఆమె యొక్క అసలైన అంతర్గత భావన తెలియవస్తుంది. ఆ సమయంలోని స్థితిని ఆమె తండ్రి ఇలా వ్రాసారు. ”ఆమె తన చివరి రోజులు సమీపిస్తుండగా తనకు మందిచ్చు డాక్టరుతో ఇలా చెప్పింది. శారీరక బాధను నేను భరించలేకున్నాను. కాని నా ఆత్మకు కష్టం ఏమాత్రం లేదు. పరమేశ్వరుని యందు నాకు దృఢమైన నమ్మకం ఉంది” ఈ వాక్యంను చదివితే ఆమెకు గల దైవభక్తి తెలుస్తోంది.

కొడుకు, కూతురు మరణించడంతో అప్పటికే దుఃఖంలో ఉన్న గోవిందచంద్రుడు తరులతా మరణంతో అత్యంత విహ్యలుడయ్యాడు. దుఃఖం కొంచెం తగ్గాక గోవిందచంద్ర దత్తు గారు తన ప్రియ పుత్రిక విధ్యాభ్యాసం చేసే గదిలో సరిగ్గా చూడగా అతనికి తోరూబాయి వ్రాసిన కాగితాలు కొన్ని దొరికాయి. దానితో అతడు తోరు వ్రాసిన గ్రంథాలన్నీ అచ్చు వేయించాలని నిశ్చయించుకున్నాడు. మొదటిగా తోరూబాయి వ్రాసిన గ్రంథం రెండవ ముద్రణలో దళసరి కాగితాల్తో సుందరమైన అక్షరాలతో అచ్చువేయబడింది. దానిలో ఒక చిన్న ఉపోద్ఘాతము తోరూదత్తు చరిత్ర, ఆతోరూరుల చిత్రపటాలను చేర్చారు. కావున పూర్వం పల్చని కాగితంపై అసహ్యంగా అనిపించిన గ్రంథమే ఇప్పుడు ఎంతోమంది చదువరులకు అత్యంత పూజ్యనీయమైంది. దత్తు గారికి దొరికిన కాగితాలలో మన పురాణ కథలననుసరించి, వేదాంత కథలననుసరించి, హూణ భాషలో రచించిన కొన్ని చిన్న చిన్న కావ్యాలున్నాయి. తొమ్మిది కావ్యరత్నాల మాల గ్రుచ్ఛాలని తోరూ దత్తు సంకల్పించుకుంది. కాని వాటిలో ఏడు కావ్యాలే వ్రాయబడ్డాయి. మిగిలిన రెండు కావ్యాల కొరకు విష్ణు పురాణం నుండి కొన్ని కథలను భాషానువాదం చేయాలని నిశ్చయించింది. సంకల్పం ప్రకారం ఆమె అదివరకే ‘కలకత్తా రివ్యూ’, ‘బెంగాలీ మ్యాగజీన్‌’ అను మాస పత్రికలలో కొన్ని కావ్యాలను ప్రచురించింది. ఈ తొమ్మిది కావ్యాలు ఒక పుస్తకంగా అచ్చువేయబడ్డాయి.

చావు ముందర తోరూదత్తు ”కుమారి డార్వెర్‌ అను ఫ్రెంచ్‌ స్త్రీ ఆత్మ కథ” అను ఒక కథను వ్రాయాలని అనుకుంది. పరదేశీయులను గూర్చి ఇలాంటి కథలు వ్రాయాలంటే వారి ఆచార విచారాలను, వారి దేశ చరిత్ర మొదలైనవి బాగా తెలిసి ఉండాలి. తోరూదత్తు ఆ దేశంలో ఉన్న కొద్ది కాలంలోనే ఈ సంగతులనన్నింటిని తెలుసుకొంది. ఈ కల్పనా కథా గ్రంథంతో

ఉత్తమమైనదని చెప్పడానికి లేదు. కాని తోరూదత్తు జీవించి ఈ గ్రంథాన్ని మరల దిద్ది అచ్చువేయించి ఉండుంటే ఇంతకన్నా బాగా ఉండవచ్చని చెప్పడానికి సందేహం లేదు. ఈ గ్రంథాన్ని బాడెర్‌ అను ఒక ఫ్రెంచ్‌ స్త్రీ దిద్ది ఉపోద్ఘాతం వ్రాసి ప్రచురించింది. కవయిత్రి అని, గ్రంథ కర్త (రచయిత్రి) అని ఎంతో ఖ్యాతి పొందిన తరులత అల్పకాలంలోనే వాడిపోవడం ఈ దేశం యొక్క దౌర్భాగ్యమే అని చెప్పాలి. అయినా ఒక కవి-

చ. మనుజుని జీవితంపు పరిమాణము నేడల చేతగాక చే

సిన ఘన కార్య సంచయము చేత గణింపగ జెల్లా నెప్పుడున్‌.

అని చెప్పినందున ఘన కావ్య నిర్మాణమును ఘన కార్య సంచయ ముతో తోరూదత్తు ‘జీవితంపు బరిమాణము’ అత్యల్పమయ్యినా ఆమె దీర్ఘాయుష్మతే – మృత జీవియే – అని చెప్పవచ్చును.

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.