పొక్కిలైన మనసు… మత్తడిబడ్డ దుఃఖం – అనిశెట్టి రజిత

ఆమె కన్నీటి నిప్పుకణికలు రాల్చే అగ్నిశిఖ. ఆమె కవితలుగా తడి ఆరని దుఃఖాన్ని కురిసే హిమపాతం. ఆమె స్నేహ పుష్పాలతో సహజీవనం చేసే భావోద్విగ్న ఆకాశ పుష్పాలను కొలిచే ఆర్ద్ర హృదయిని. మానవ హననాలను నిరసించే ఒక పోలవరం నిర్వాసిత, బాధిత. ఒక ముజఫర్‌నగర్‌ తీరని దుఃఖం. ఆయుధాక్షరమైన ధిక్కారం. ఆమె భండారు విజయ.

‘ఆమె’ ను ఆవిష్కరిస్తూ రాసిన కవితలు జీవన సుడిగుండాలను ఛేదించుకొని వచ్చేందుకు స్త్రీ పడే అనేక వేదనల, ఆరాటాల సమాహారం… ఆ గొంతుకలోంచి రక్త స్వరాలు దూసుకొస్తాయి. అపూర్వ త్యాగాలను ప్రస్తుతిస్తాయి… అమ్మ పేగుబంధాన్ని వెక్కిళ్ళు పెట్టే ఏడుపు పాటగా శృతి చేస్తాయి.

అందుకే ఆమె కవిత్వ సంపుటి ‘తడి ఆరని దుఃఖం’ అయ్యింది.. మనిషి-సమాజం- సంబంధాల డొల్లతనాన్ని డొక్క చీల్చి చూపిస్తుంది.

‘విశాల ప్రపంచంవైపు’ అనే కవితలో వేసే అడుగుల్లో ‘మానవ సంబంధాలన్నీ రెక్కలు విప్పిన పక్షులై ఏ చెట్టుపై వాలుతాయో! గాలి వాటానికి ఎటు ఎగిరిపోతాయో!” అంటూ ”విరిగిపోయిన, ఓడిపోయిన అనుబంధాలకు ఆశల లేపనాలు పూస్తూ ఒంటరిగా మిగిలిపోయిన ఆమని.. ఆమె..” అనాదిగా సృష్టికి ప్రాణప్రతిష్ట చేస్తున్న స్త్రీ నిర్మాణాత్మక దృక్పథాన్ని చిత్రిస్తుంది.

‘నిరంతరాన్వేషి’ అయిన స్త్రీ ‘జీవన కోలాహలంలో తొణికిసలాడే తడిలా… ఆమె / విత్తు నుండి మొలిచే మొక్కలా… ప్రశాంతంగా.. ఆమె / ఎదుగుదలే… ధ్యేయంగా… ఆమె. ఈ విశాల ప్రపంచం దినదినం ఎంతగా కుంచించుకుపోతున్నా, సంకుచితత్వం వ్యాపిస్తున్నా, ఎప్పుడూ మొలిచే మొక్కలా… ఎదుగదలను కాంక్షిస్తూ నిరంతరాన్వేషికురాలై విస్తరిస్తూంటుంది స్త్రీ ఆశయం అని చెప్తుంది.

‘ఆమె’ను నిర్వచిస్తూ ఆమె అస్తిత్వ పోరాటాలను ఆవాహన చేస్తూ… ఆమెను అవమానిస్తూ అణిచివేస్తున్న మనువాద

సంస్క ృతిని… తన పురోగమనానికై… పెకిలించక తప్పదు/ మరో అడుగు ముందుకు వేయక తప్పదు” అంటుంది.

ఈ భూమ్మీద నిర్భీతితో జీవించడాన్ని అడ్డుకుంటున్న అనేక మౌఢ్యాలను నిరసిస్తూ ”ఆంక్షల పంజరాలను/ తునాతునకలుగా చేస్తున్నాం!” అని ప్రశ్నిస్తూ, నిలదీస్తూ ”ఆకాశంలో సగమైన మేము ఈ భువిపై నిర్భయంగా జీవించాలనుకుంటున్నాం.” అని స్పష్టం చేస్తుంది.

ఈ భూమ్మీద అంతటా ఆడవాళ్ళపై అత్యాచారాలు జరుగుతున్నాయి. నగర జీవితంతో అల్లుకుపోయిన కవయిత్రి క్రూరమైన అత్యాచారాలను ‘రండి నిషేధిద్దాం’ అని పిలుస్తుంది. నేర స్వభావం రాజ్యం నుండి రౌడీమూకలదాకా వ్యాపించిన హీన సమాజంలో మంచిగా చెప్తే వినేదెవరు? అసలు మంచిని పాటించేదెవరు? మనం కాపాడుకోవలసిన విలువలు, సున్నితత్వాలు ఎన్నో ఉన్నాయి.. అన్నీ కాలరాయబడుతున్నాయి.

అందుకే తానే ప్రకృతికాంతగా మారి ”నన్ను గుప్పిట బంధించాలని చూడకు/ అదృశ్యరూపంలో ఉన్న అనంతమయిని/ పుష్పవికాసాన్నే కాదు/ విశ్వప్రళయాన్నీ చూస్తావు” అంటుంది ”నేను అనంతమయిని” అన్న కవితలో..

‘ధిక్కారం’లో ”ఇక నీ ఆటలు సాగనివ్వం/ నీ తోకను ముడువకుంటే/ నీ పీకను వధ్యశిలపై పెట్టు/ నరకటానికి సిద్ధంగా ఉన్నాం/ ఖబడ్దార్‌! మృగాధిపత్యమా” అని హెచ్చరిక చేస్తుంది.

అత్యాచారానికి ఒళ్లంతా ముళ్లే అనేది నిజం… అందుకే వాడు మృగత్వంతో స్త్రీ శరీరాన్ని గాయంగా చేస్తాడు. అందుకే ఆవేదన ఆవేశమై పెల్లుబికి ”మానని గాయలను చేస్తున్న మీ పుట్టుకను/ నియంత్రించేందుకు సిద్ధమవుతోంది/ తనను తాను రక్షించుకునేందుకు/ జన్మించకుండానే మీ తలలకు ఉరివేయటానికి/ ఆమె తన మాతృత్వాన్నే త్యాగం చేయబోతోంది/ పొత్తిళ్లల్లో పెంచవల్సిన అమ్మతనానికి/ మీరిచ్చిన భయంకర తిరస్క ృతికి తగిన శాస్తిగా” అని విసిరేస్తుంది.

ఒక జాతి గాని, వర్గం కానీ మరొక జాతిపై చేసే హత్యాచారాలకు తగిన శాస్తిగా ఆ జాతిని సమూలంగా నిర్మూలించే ప్రతిచర్యలు కానేకాదని మనం నమ్మేవాళ్లం… అయినా అంత తీవ్రంగా ఆలోచించడానికి కారణం నేరస్థులు చేసే దారుణ హత్యాకాండల వల్లనే… విసిగివేసారి మరో మార్గం తోచకనే… కానీ ఈ వైరం రేపటి రోజున ఎక్కడిదాకా పోతుందో… జండర్‌ యుద్దమై మృత్యుఘోషకు దారి తీస్తుందా అనిపిస్తుంది నేటి పరిస్థితులను చూస్తుంటే. భండారు విజయ స్త్రీగా చాలా సహన శీలి. లెక్కలేనన్ని ఆటుపోట్లు ఎదర్కొని రాటుదేలిన వ్యక్తి. సామాజిక కార్యకర్తగా అనేక కార్యక్రమాలు, ఉద్యమాల్లో మమేకమై తన జీవిత సార్థకతను రచించుకుంటున్న మిలిటెంట్‌ స్వభావంతో

ఉన్నది. అందుకే సమాజంలో ఏ బాధకైనా తను దుఃఖిస్తుంది. ఎవరి నొప్పైనా తనను బాధిస్తుంది… తన ఆగ్రహం ధర్మాగ్రహమై వెల్లువెత్తుతుంది.

సామాజిక కార్యకర్తగా యావత్‌ ప్రపంచపు గాయాలను తాకుతూ- తానే ఒక ముజఫర్‌ నగరై… తానే ఒక పోలవరమె

మాట్లాడుతుంది. బతుకు వేదనంతా ఏకరువు పెడ్తుంది… మనిషికీ మనిషికీ ఉన్న మానవ సంబంధాలనూ… మట్టికీ- మనిషికీ ఉన్న జన్మబంధాలను నిర్దాక్షిణ్యంగా కుళ్ళబొడిచి, పెకలించి శవప్రాయం చేయవద్దని వేడుకుంటుంది… గర్హిస్తుంది.

కపట రాజకీయ పన్నాగాలను… అభివృద్ధి మోసాలను, దళారుల దోపిడీలను బాధితుల పక్షాన నిలబడి ఎండగడ్తుంది. ”మరణించిన శవాల సాక్షిగా/ మళ్లీ మళ్ళీ! జన్మిస్తాం!..” ”మీ ఆధిపత్య పునాదులను మొదలంటా నరికేస్తాం!” అని నినదిస్తుంది.

మనిషి తననుగాక మరింకెవరినైనా… దేనినైనా ప్రేమించాలనుకుంటే ముందు తనను తాను ఒదులుకోవాలని చెప్తుంది. ఎందుకంటే ”నిన్ను నీవు వదులుకోని రోజు/ ఎవరిని ప్రేమించలేవు/ బతికున్న శవంగానే మిగిలిపోతావు” అని ‘నిన్ను నీవు వదులుకున్న రోజు’ కవితలో సూచిస్తుంది…

స్వప్రేమలు స్వార్థంతో ముడిపడి ఉంటాయి. అవి బంధించుకొని తమలోతాము కరుడుగట్టుక పోతుంటాయి… ప్రేమ విశాలమైన మానవీయ భావన. దాన్ని ఎంత విస్తరిస్తే అంత ఆనందం… ఎంత పంచితే అంత ఆరోగ్యం చేకూరుతుంది… అదే విజయమని చెప్పదల్చుకున్నది.

జీవన పోరాట యోధత్వాన్ని ఉన్నతీకరిస్తూ ‘మేలిమిబంగారం’ అనే కవిత ప్రతి ఓటమిలోనూ గెలుపును ఆస్వాదిస్తూ రేపటి ఉదయానికి ఆహ్వానం పలికితేనే జీవితం సాగిపోతుంటుందనీ… జీవితం నల్లేరు మీద నడక కాదు పోరాటాల గొలుసు గమనమని చెప్తూ మళ్ళీ మళ్ళీ జీవితాల్లో మలిగిపోయే వెలుగుల్ని మలి వెలుగులుగా దీప్తించుకునే మార్గం ఇదేనంటుంది.

ఒక స్త్రీని దోపిడి చేయడానికి.. వొదిలించుకోడానికి ఆధునిక పురుష పుంగవుడు ఏ విధమైన నైచ్యాలకు పాల్పడుతూ హింసిస్తాడో సంపూర్ణంగా చిత్రించిన కవిత ‘తస్మాత్‌ జాగ్రత్త!’ కానీ ఆ మానవ మృగాళ్ళ నుండి తప్పించుకొని ఆ ‘మరణ శాసనాలను’ తెగ నరుక్కుంటూ జయాన్ని ఆహ్వానించాలనీ అంటుంది.

ఆమె ప్రపంచం ఇంటి ఖైదులో కాదు… ఊపిరాడని సంసారాల ఊబిల్లో కాదు. కనికరం లేని కుటుంబ కుహరాల్లో జీవిత ఖైదీగా కఠిన శిక్షలు అనుభవిస్తూ కాదు.. సువివాల ప్రపంచంలోన అని ఎలుగెత్తి చెప్తుంది.

‘జ్యోతి సింగ్‌పాండే’ మీద దేశరాజధాని ఢిల్లీలో జరిగిన పాశవిక మారణకాండను ‘ఆఖరి మగాడు’ అన్న కవితలో ఇదంతా చూస్తూ భరిస్తూ మేము ఊరుకోము, మనుస్మ ృతుల అగ్నికీలల్లో కాలము.. కదంతొక్కుతాం” అంటూ ”ఈ యుద్ధంలో సమిధలై/ ఆఖరి మొగాళ్లుగా.. నిలుస్తారో… మీ ఇష్టం! / ఆడవాళ్ళు పువ్వులే కాదు… అగ్నిశిఖలని మరువకండి!” అని తేటతెల్లం చేస్తుంది.

సమాజం, కుటుంబం స్త్రీ దేహానికి ఎన్నో నిఘాలు పెడ్తుంది.. అవన్నీ నియంత్రాలకే దారితీస్తాయి- స్త్రీకి రెక్కలు మొలవకుండా ఎప్పటికప్పుడు రెక్కల్ని కత్తిరించే పన్నాగం అది. దాన్ని ఉద్దేశించి ”నా దేహానికి ఎన్ని సీసీ కెమెరాలు పెట్టినా/ నా మనసును ఒక్క కెమెరాకూడా బంధించలేదని/ ఇంకా మీరెప్పుడు తెలుసుకుంటారు?” అని అడుగుతుంది. ఒక విధంగా స్త్రీ మీద కంట్రోళ్లను అమలుపరిచే వ్యవస్థను ఎద్దేవా చేస్తుంది.

వరంగల్‌ పట్టణంలో కొద్దిరోజుల క్రితం న్యాయపోరాటం చేస్తున్న యువతి సారిక తన ముగ్గురు పిల్లలతో సజీవ దహనానికి గురికాబడింది- దాన్ని ”సారిక చచ్చిపోయిందా!?” అన్న కవితలో భండారు విజయ చర్చించింది.

ఇంకా దశ దిశలా వ్యాపిస్తున్న స్త్రీ చైతన్యాల్నీ, శ్రమైక జీవనంలో పగలూ తానై, రేయీ తానై మిగిలిపోయే సఫాయి కార్మికురాలి శ్రమ వడపోతనీ చీకటి పొరలను చీల్చుతూ… తానే వెలుగై పరుచుకునిపోయే అమ్మతనాన్ని, తండ్రుల శాడిజాన్ని మౌనంగా భరిస్తూ నిష్క్రమించిన అమ్మల బలిదానాల్నీ లాంటి కవితలతో పాటుగా నిన్నా మొన్నా దేశంలో జరిగిన ఆహారపు అలవాట్లపై అసహన ప్రయోగాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విషాదగాయమై ఆత్మాహుతి చేసుకున్న రోహిత్‌ తల్లి హృదయపు విషాద గాలివానల్ని గేయంగా ‘నేను అమ్మను కన్నా’ అంటూ దృశ్యీకరించిన కవితలూ ఉన్నాయి…

ఇవి కాకుండా ‘తెలంగాణా’ ఉద్యమంలో నిండా చేరి పనిచేసిన కవయిత్రి ‘తెలంగాణ’ ఆవిర్భావాన్ని స్వాగతిస్తూ కవిత, తెలంగాణా స్వపరిపాలనా పతాకం సర్వాయి పాపారాయునిపై కవిత, మంచం పట్టిన స్నేహితురాలిపై ‘అంపశయ్యపై స్నేహం’ అన్న కవిత ఉన్నాయి.

అనుకోని ప్రమాదాల్లో బ్రెయిన్‌డెడ్‌ అయిన 12 ఏళ్ల సాయికృష్ణ (విశాఖపట్నం) తల్లిదండ్రులు, తాతా అమ్మమ్మలు ఆ బాలుని అవయవాలు అవసరార్థులకు దానం చేసి చాటిన మానవత్వాన్ని గూర్చిన ‘ఆకాశ పుష్పం’, ‘జోహార్లు! సాయికృష్ణ’ అన్న కవితలూ ఈ ‘తడి ఆరని దుఃఖం’ లో ఉన్నాయి.

లోకం ఉన్నదంతా తడి ఆరని దుఃఖమేనా… ఈ దుఃఖం ఈ విధంగానే ఉండిపోవాలా… ఉండిపోతుందా అంటే ఈ ఆరని తడి లోంచే చైతన్య జ్వాలలు ఎగసి ఆ దుఃఖాన్ని… దుఃఖకారణాన్ని… దుఃఖ కారకులనూ దహించివేస్తాయన్న బహిరంగ రహస్య సందేశం వినిపిస్తుంది.

దుఃఖంలేని సమాజాన్ని కాంక్షిస్తున్న వాళ్ళంతా దుర్భరమైన ఆవేదనల నుండి గూడు కట్టుకున్న దుఃఖాన్ని ఛిద్రం చేస్తూ ఎగిసిపడుతున్న భావావేశాల లావా ప్రవాహాన్ని అర్థం చేసుకుని 1984లో ‘దీపిక’ అనే చిరు పొత్తం ముద్రించిన 32 ఏళ్ల… సుదీర్ఘ విరామం తరవాత కొత్త చేతనతో, కొత్త ఒరవడితో, కొత్త జీవనమార్గంలోని వాస్తవికతను అక్షరీకరిస్తూ వచన కవితా రూపంలో మన ముందు ‘తడి ఆరని దుఃఖా’లుగా ఆరబోస్తున్నది కవయిత్రి.

తనలో గూడుకట్టుకున్న వేదననూ, ఆవేశాన్నీ బయిటికి తీసే సోర్స్‌గా వచన కవిత్వాన్ని ఎన్నుకున్నది విజయ. తన భావ వ్యక్తీకరణ ఒత్తిడిలో కవిత్వాన్ని వచనం ఎక్కువగా డామినేట్‌ చేయడం కనిపిస్తుంది… కారణం అది ఏదో రాయాలని రాసిన విషయాలూ… కవిత్వమూ కాదిది… తనలో కిక్కిరిసిన భావనలకు ‘అవుట్‌లెట్‌’ గా తన భావాలను సమాజంతో పంచుకోవాలన్న ఉధృతిలో వెలువడినవని అనుకుంటాను… ‘పొక్కిలైన మనసు మత్తడిబడ్డ దుఃఖమైతే’ అదే ఈ ‘తడి ఆరని దుఃఖం’ సంపుటి.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో