కసాయి కొడుకు – కన్నపేగు (కథల పోటీకి వచ్చిన వాటిల్లోంచి సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ) – తమ్మెర రాధిక

గుళ్ళో జనం తొడతొక్కిగా తిరుగుతున్నారు. పెళ్ళివారు తిరుగుతున్నారు, గుడికొచ్చే భక్తులూ తిరగుతున్నారు. చిన్న సైజు తిరునాళ్ళలాగా వుందక్కడ. గుడి వెనకాతల వున్న హాల్లో వంటవాళ్ల కేకల హోరుకు అక్కడే వంకాయల మూట ప్రక్కన పడుకున్న సత్యం లేచి చుట్టూ చూసాడు.

గ్యాసు పొయ్యి మీద రకరకాల వంటకాలు ఘుమ ఘుమలతో పొగలు కక్కుతున్నాయి. సేమ్యా పాయసం తియ్యటి వాసన వెదజల్లుతోంది. పనస పొట్టు కూర తెడ్డుతో కలుపుతోంటే వగరూ, ఆవ వాసనతో ఆకలి పుట్టిస్తోంది. మామిడి కాయలు తురిమి మిరియం చేస్తున్నట్టున్నారు. ఇంగువ వాసనతో నోట్లో నీరు అదేపనిగా ఊరుతోంది. పెద్ద డేకిసా గిన్నెలో పోపు పోసిన పెరుగులో వడలు మునిగి ఆకలి ఉవ్వెత్తునలేవడం గమనించాడు సత్యం. పులుపూ ఖారం వాసన వేస్తూ కళ్లపండువగా వుంది. గాడి పొయ్యి వద్ద అన్నం వుడుకు మగ్గుతుండటం చూసాక తన కడుపులో ఆకలి ఉవ్వెత్తున లేవడం గమనించాడు సత్యం. ”ఏరా సత్తీ నిద్రమత్తు తగ్గలేదురా ఇంకా? మేస్త్రీ వస్తే నీ గతి వుత్తదే… లే…లేచి పొయ్యి దగ్గరికి రా!”

జ్ఞానం హేళనగా నవ్వాడు సత్యాన్ని చూసి. అసలప్పటిదాకా పొయ్యి దగ్గరుండి బాదుషాలు చేసే ఇవతలికి వచ్చాడు తను, ఎందుకంటే త్వరగా తన వాటా పని తెముల్సుకుని చప్పున హాస్పిటలుకు వెళ్ళి రావాలన్న ఆలోచనతో.

”అమ్మ దగ్గరికి వెళ్ళొస్తా… భోజనం పెట్టి చిటికెలో వచ్చేస్తా. మేస్త్రీ ఇటుకేసి వస్తే కాస్త మేనేజ్‌ చెయ్యి.” అన్నాడు సత్యం. కరుకుగా చూసాడు జ్ఞానం.

”బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడ వేరా?” రెట్టించాడు సత్యం.

”ఒరే ఈ ఇంటాళ్ళ సంగత్తెలీదురా నీకు…. తోరణం కట్టారంటే రెండొందల మందికి తక్కువ రారు గదా చుట్టాలు. టయానికి మాట్లాడుకున్నవన్నీ అందియ్యకపోతే తరువాత జరిగే వాటికి నేను పూచీ పడలేను… ఆఁ….”

విదిలించుకు పోతూ అన్నాడు జ్ఞానం.

సత్యం గాడిపొయ్యి దగ్గరికి వచ్చాడు. సాంబారు ఒక పొయ్యి మీదా, వంకాయ అల్లం కలిపిన కూర ఒక పొయ్యి మీదా కుతకుతా మంటున్నాయి. అరగంట క్రితం తను చేసిన బాదుషాలు పంచదార పాకం పీల్చుకొని బేసిన్లల్లో నిగనిగా మంటు సోయగాలు పోతున్నాయి. వడ్డనకు రెడీ అయ్యి. అన్నం గుండీ వైపు చూసాడు. గంజి పట్టా అన్నం మీద వేసి మూత వెయ్యడం మూలాన కుమ్ములో పెట్టినట్టు కమ్మటి వాసనతో ఉమ్మగిల్లి వుంది అన్నం. ఏదయితే అదే అయ్యిందని సీసా రేకు గిన్నెలో అన్నం తెడ్డుతో అన్నం పెట్టుకుని, ఉడికే ఉడికే వంకాయ కూర వేసుకుని, స్టీలు జగ్గులో సాంబారు పోసుకుని పైనుంచి అరిటాకు కప్పుకుని బైటికొచ్చాడు సత్యం.

సత్యం తల్లికి ఈ మధ్యన వంట్లో బాగోలేక హాస్పిటల్లో చేర్పించాడావిడని. పదో తరగతి రెండు సార్లు తప్పాక చదువు మీదకు మనసు పోకపోతే తల్లే తనకు తెలిసిన వంట మాస్టర్‌ దగ్గర చేర్పించింది. ఆమెకు సంపాయించే భర్త చనిపోవడం మూలాన తెలిసిన వాళ్ళతో కలిసి వంటల పనికే పోతుండేది. ఇద్దరి సంపాదనతో ఏవో సంసారం నడిచిపోతోందిలే అనుకునే లోపు

ఉపద్రవం వచ్చి పడిందీ మధ్యన. ఏడూరి మాసికాలకు కార్తికేయ పురం వెళ్ళిన సీతమ్మకు గంజి గుంటలో పడి కొంచెం ఒళ్ళు కాలింది. దాంతో ఆమెను విజయవాడ హాస్పిటల్లో చేర్పించాడు. సత్యం దాచుకున్న కొద్దిపాటి డబ్బు ఆమె వైద్యానికి ఖర్చు అవుతోంది.

ఇంకో నాలుగు రోజుల్లో డిస్‌చార్జ్‌ చేస్తామన్నారు డాక్టర్లు. సత్యం కూడా లోకల్‌ కార్యక్రమాలే చేస్తానని ఏకాంబరాన్ని బ్రతిమిలాడుకోవడం మూలాన్న తల్లిని చూసుకోవడానికీ, ఆవిడ తిండి తిప్పలు కనిపెట్టుకోవడానికి అతనిక్కాస్త వెసులుబాటు దొరికింది.

పాండురంగడి క్షేత్రం ప్రక్కనే కళ్యాణి హాస్పిటల్‌ కావడం మూలాన్న భోజనం తీసుకొని తల్లి దగ్గరికొచ్చాడు. తల్లిని లేపి కూర్చోబెట్టి అన్నం కూరా కంచంలో పెట్టి పక్క మంచం ఆవిడకేసి చూసాడు. ”నా వాటా కూడా తెచ్చే వుంటావు గామాలు నాయినా కాస్త పెట్టవూ” అంది. సత్యం ఆవిడ కంచంలో కూడా కాస్త అన్నం కూరా పెట్టిచ్చాడు తినమన్నట్టు సైగ చేసి.

”రోజూ నాలుక్కు చవులూరించేలా తెస్తావు నాయనా భోజనం… నీ చెయ్యి మహారుచులు పాకాలు తెలిసిందే!” అందావిడ ఆప్యాయంగా.

”అయ్యో దాందేవుంది లెండి… పది మందికి వండిన వంటలోంచేగా నేను తెచ్చేది మీ కోసమే వండుతే కష్టమనుకోవచ్చు గానీ. పాకవంటే గుర్తొచ్చింది నేనే బాదుషాలు చేసానీవాళ… మీ యిద్దరికీ చెరో రెండు తెద్దామంటే మా మేస్త్రీ చండశాసనుడు చావగొడ్తాడు… ఇంకోసారి తెస్తాన్లేండి…” అన్నాడు ఆవిడకు సాంబారు పోస్తూ.

”రోగాలు రోగాలే తిండి పుష్టి తిండి పుష్టే మనకు. వెనకట తిన్న అలవాటు కదూ! వారం రోజులై నిన్నిబ్బంది పెడుతున్నాను భోజనం కోసరం. ఎక్కడెక్కడ కష్టపడుతున్నావో, చూస్తేనా చిన్నపిల్లాడివి… నీ మెడకు మీ అమ్మే కాక నేనూ పడ్డాను. ఇవ్వాళో రేపో మావాడొస్తాడు…”

అభిమానంతో ఎర్రగా కందిపోయిన ఆమె మొహం చూసి-

”మీ కొడుకైతే అలాగే అంటారా? నాలుగు మెతుకుల కోసమే ఇంత చదువుతున్నారు..”

నవ్వుతాలుగా ఎత్తగొట్టేసాడు సత్యం.

”మా యిళ్ళల్లో వెనకట ఒకసారి కాశీ సమారాధన చేసార్లే నాన్నా… అప్పట్లో కాశీకి నడిచి వెళ్ళొచ్చారు మా మేనత్త, మా బామ్మాను. అబ్బో ఏవి సమారాధన అదీ… పదూళ్ళల్లో చెప్పుకున్నార్లే. వచ్చి కూర్చున్న బ్రాహ్మడికల్లా పట్టు పంచెలూ, వెండి కుంకుంభరిణెలూ, దోసెడు దోసెడు రూపాయలూ… పట్టుకెళ్ళే వారుట…” ఆయాసంతో కాస్త ఆగిందావిడ.

”పెట్టి పుట్టారారోజుల్లో వాళ్ళు… ఇంతోటి సంభావన్లు మా తాతలు కూడా ఎరగరమ్మా” అంది సీతమ్మ.

”ఇంతకీ మీరెక్కడండీ వుండేదీ?” ఆసక్తిగా అడిగాడు సత్యం.

”మాది ఇక్కడే నాయనా… నా పేరు సోవమ్మ అంటారు. మీ అమ్మ చెప్పే వుండాల్లే.”

అందావిడ మూతి తుడుచుకుంటూ. సీతమ్మ బాత్రూంకు వెళ్ళింది.

”వారం రోజులుగా చూస్తున్నాను, మీ వాళ్ళు…” ఆర్ధోక్తితో ఆగిపోయాడు సత్యం.

”ఈ వూరే అని చెప్పాగా… ఏ వేళప్పుడో వచ్చి చూస్తుంటారు. ఈ అస్తమా చావనీకా బ్రతకనీకా ఊపేస్తోంది బాబూ… కాస్త తింటే ఎక్కువా… తినకపోతే తక్కువా… ఇప్పుడంటే ఇలా వున్నాం గానీ మా వారు వెనకట భరద్వాజ విందులు చేసే మహారాజుల దగ్గర తిని హరాయించుకున్న ఘటం అనుకో.”

ఆవిడ మాటలు మధ్యలోనే అడ్డుకుంటూ-

”ఆయన ఏరీ, ఎక్కడున్నారూ?” ఆసక్తిగా అడిగాడు సత్యం.

”మా ఖర్మలు బాగుండలేదు నాయనా ఇంతకూ. ఆయనకు పక్షవాతం… ప్రస్తుతం ఇంటి దగ్గరే… మంచం పట్టారు… అన్నీ మంచంలోనే… కోడలి దయా ఆయన ప్రాప్తం. నాకీ మధ్యనే ఇదిగో దగ్గూ ఆయాసం ఎక్కువైతే పది రోజులుగా ఇక్కడే వుంటున్నా. నా కొడుక్కి తెలిసిన డాక్టరవడం మూలాన వాడిక్కాస్త వెసులుబాటుగా వుందంట…”

”మరి ఆయనెప్పుడూ…. మీకు తిండీ తిప్పలు…”

”ఆ గోలెందుకులే…. రేపెప్పుడైనా కాస్త దోసావ తీసుకొస్తావూ! నోరు చవిచచ్చి పోయింది… ఏవీ అనుకోకూ…”

”ఛ… ఛ… దోసావకేం భాగ్యం లెండి” లోలోపల ఆవిడ కోరికకు కాస్త భీతిల్లినా బింకంగానే భరోసా ఇచ్చాడు.

”వెనకటికి రాంభొట్ల వీరయ్య శాస్త్రి గారనీ బ్రాహ్మడుండే వాడు… ఆయన్ని బ్రాహ్మణార్థం పిలిస్తే వచ్చి తిండి తినే వాడు గదా అదో ఉగ్ర ప్రకృతి.”

ఆయాసంతో కాస్త ఆగింది సోవమ్మ గారు.

”చెప్పండి…. చెప్పండి…” అన్నాడు సత్యం తల్లి మంచంపైన సర్దుకు కూర్చుంటూ.

”మా చెల్లెలు పెళ్ళిలో విందు భోజనం రడీ అని బ్రాహ్మలందరికీ మా నాన్నగారు కబుర్లు పెట్టారు. వచ్చిన వాళ్ళంతా స్వస్తి చెబుతూ పంక్తులు పంక్తులు సర్దుకు కూర్చున్నారు. వడ్డన మొదలయ్యాక రాంభొట్ల గారు తిన్నారూ… బంతిలో వడ్డనకు ఏవొస్తే అవి ఆయన గారి విస్తట్లో వెయ్యడం గాదూ గుమ్మరించాల్సిందే!”

”ఆఁ….”

”అబ్బో… వడ్డించే వారి ఉరుకులు పరుగులు.. పంచలు సర్దుకుంటూ, నడుముకు తుండ్లు బిగించుకుంటూ, ఒకర్ని ఒకరు తొలగ దోసుకుంటూ వడ్డియ్యడం ఆ సంకుల సమరం చూడవలసిందే గానీ చెప్తే తీరేది గాదు.. వడ్డన ఎలా వుండేదనుకున్నావూ? పప్పు గుండీలతో… కూరలు డేకిసా గిన్నెలతో, అప్పడాలూ వడియాలూ బుట్టలతో, పచ్చళ్ళూ అవీ దాకలతో, గారెలూ లడ్డూలూ వెదురు బుట్టలతో తెచ్చేవారు.

బూరెల్లోకి నెయ్యి తెస్తే ‘పరమాయికి నెయ్యిష్టం అలాగ ఒంపెయ్యండీ, ఒరే కిష్టా ఇంకో రెండు చెంబులు నెయ్యి అందుకో రాంభొట్ల మావకి ఒంపుదువూ.. బూర్లు గుమ్మరించెయ్యండిరా విస్తట్లో, నెయ్యి బూరే నదీ ప్రవాహంలా వుండాలి మరి’ అంటూ వడ్డనగాళ్ళని వెనకాల్నించి కేకలేసేవారు. అప్పట్లో వాళ్ళ తిండి భోగం అలా వుండేది. ఇప్పుడు మా వారు తిండికి మొగం వాచినట్టుగా అయిపోయారు. రోగం కూడా అలాంటిదేలే… తింటే కోడలు చెయ్యి వేసి ముట్టొద్దూ…”

సోవమ్మ గారి భర్తే రాంభొట్లని గ్రహించి నిట్టూర్చాడు సత్యం. ఆవిడ కనుకొసల్నించి ధారాపాతంగా కన్నీళ్ళు దుముకుతున్నాయి. సీతమ్మ ఆవిడ్ని ఓదారుస్తుంటే మళ్ళీ సాయంకాలం వస్తానని చెబుతూ తల్లికి మందులు ఇచ్చి లేచాడు సత్యం. ఈరోజు లేటయ్యింది మేస్త్రీ ఏం తిడతాడోనన్న భయం అతన్లో పాకిపోయింది. నాలుగు నాళ్ళుగా యిద్దరికీ ఉప్పూ నిప్పుగా వుంది. పని మధ్యలో ఎక్కడికీ కదలొద్దనేది మేస్త్రీల హుకుం. ఒక్క ఘడియ సేపు వెళ్ళి తల్లికి అన్నం పెట్టుకొస్తానని సత్యం. ఏకాంబరానికి సత్యం మొండితనం చూస్తే ఒళ్ళు మండుతోంది. యిద్దరి మధ్యా కనపడని యుద్ధ మేఘమొకటి అల్లుకు పోయిందని జ్ఞానానికి అనుమానం. ఎంతో మంది అతిథులు విస్తళ్ళల్లో పారేసినంత లేదు తన తల్లికి తీసుకుపోయే అన్నం. హాస్పటల్‌ నుండి డిస్‌చార్జి అయ్యే నాల్రోజులు కొద్దిగా అన్నం తీసుకుపోతానని దీనంగా వేడుకున్నాడతన్ని సత్యం. ఆ విధంగా అన్నం తీసుకుపోయే పద్ధతి దొంగతనం అనిపించు కుంటుందనీ ఇంటి వాళ్ళు చూస్తే తప్పు పట్టి పన్లోంచి తీసేస్తారనీ గిరాకీలు రావనీ మేస్త్రీ కోపం, వీల్లేదని గట్టిగా చెప్పాడు.

భోజనాల సమయం అవడం చూసి పరుగులాంటి నడకతో సందు గొందు దాటి గుడి వెనకాల హాల్లోకి వచ్చి పడ్డాడెలాగో సత్యం. అన్నం గుండీల దగ్గర నిలబడి వడ్డనకు పురమాయిస్తున్న మేస్త్రీ ఏకాంబరాన్ని చూసే సరికి గుండెలు జారి పోయాయి సత్యానికి.

”వొద్దన్న చోటికి వెళ్ళొస్తున్నావు అంతేనా? వప్పుకున్న పని ఎవరు చెయ్యాలనుకున్నావు? వడ్డన టయానికి అవతలబడితే ఇక్కడ పనేం గావాలా? మళ్ళీ ఎసరు వెయ్యాలన్నారు నీ బాబేస్తాడా?” సత్యాన్ని చూస్తానే గర్జించాడు.

”అమ్మకు కాస్తంత అన్నం పెట్టి వస్తున్నాను”

కాళ్ళల్లోంచి వస్తున్న వణుకును ఆపుకుంటూ అన్నాడు సత్యం.

”ఎవడబ్బ సొమ్మని పెట్టొచ్చావురా? నీ కూలీ డబ్బుల్తో కొని పెట్టరా, పదిళ్ళ కూడు తింటానికి నీ అమ్మకు సిగ్గుండఖ్ఖర్లా?” ఛీత్కరించాడు ఏకాంబరం.

”మీరిచ్చే కూలీ డబ్బులు అమ్మ మందులకు బొటాబొటిగా సరిపోతున్నాయి. ఇంక బైట నుంచేం కొనుక్కొచ్చేది భోజనం? అందుకే మిమ్మల్నడిగేగా తీసుకపోతుందీ?”

లోలోపల రగులుకు పోతున్నా పైకి ప్రశాంతంగా అన్నాడు.

”ఛీ… సిగ్గులేని జన్మ… ఫో… పోయి ఎసట్లో బియ్యం వెయ్యి. పెళ్ళి వాళ్ళకు అన్నం సరిపోలేదుట.”

ఏకాంబరం విసవిసా వెళ్ళిపోయాడు పందిట్లోంచి.

మసిగుడ్డ నడుముకు బిగించి బియ్యం గుండీ తూము దగ్గరికి తీసుకుపోయాడు సత్యం బియ్యం కడగడానికి.

”రావాలి రావాలీ వంకాయ కుర్మా బక్కెట్లో వెయ్యండీ… బైట జనం ఎదురు చూస్తున్నారు.”

వడ్డన మొదలైంది కావొచ్చు అరుపులు కేకలు… ఒకరి మాట ఒకరికి వినపడటమే లేదు.

”ఏకాంబరం బిర్యానీ ఎన్ని వేసావ్‌? పందిట్లో వాళ్ళకు సరిపోయే లాగా లేదంటున్నారయ్యా!”

”పనసపొట్టు కూర మరికాస్త రానియ్యాలి ఇవతలికీ.”

సత్యం వంటింట్లో ఆ కేకలు వింటూ ఎసట్లో బియ్యం వేసాడు. ఎసరు మరుగుతున్నట్టుగానే అతని ఆలోచనలు కూడా మరుగుతూనే ఉన్నాయి.

మేస్త్రీ ఇచ్చే రోజు కూలీ తల్లి మందులకే సరిపోతున్నాయి. కానీ వళ్ళు నయమయ్యి డాక్టర్లు తీసుకుపొమ్మంటే మటుకు ఎంత లేదన్నా రెండు మూడు వేలు కట్టాలి. తల్లికి రోజూ భోజనమంటే మేస్త్రీ దగ్గర తిట్లు తినో తన్నులు తినో పెట్టి వస్తున్నాడు. మూడు వేలు ఎక్కడి నుండి తేవాలీ? ఎవరి దగ్గర తల తాకట్టుపెట్టాలో అర్థం కావడం లేదు.

పందిట్లోనే ఏకాంబరం ఎవరితోనో అంటున్న మాటలు హఠాత్తుగా సత్యం చెవిలో పడ్డాయి.

”లేబర్‌ని పనిలో పెట్టుకుంటే ఒక్కడూ సవ్యంగా పని చేసి చావడం లేదు. కూలీ డబ్బులతో సంసారం గడవడం లేదంటూ తాకట్టు పెడుతున్నారు వెధవలు.”

సత్యం మనసు చివుక్కుమన్నా గత్యంతరం లేక ఊరుకున్నాడు. తల్లి కింత గంజి కాచి పొయ్యలేక పోతున్నానని మనసులో బాధగా వున్నా దొంగచాటుగానో, బాహాటంగానో నాలుగు మెతుకులు పెడుతున్నాననే తృప్తి మాత్రం వుంది.

”లాభం లేదన్నా పాత నా కొడుకుల్ని తీసేసి కొత్త వాళ్ళని పన్లోకి తీసుకోవాల్సిందే!”

బెండకాయ వేపుడులోకి వేయించిన పల్లీలు పోస్తున్న సత్యం చెయ్యి ఒణికి చేతిలోని బేసిను అమాంతం మూకుట్లో పడింది.

”తిండి దండగ వెధవలు… ఛీ… ఇంటాయన నీ పనితనం చూస్తే నా పన్లు పోతాయి వెధవా.”

ఏకాంబరం కసిగా సత్యాన్ని అవతలికి నెట్టేసాడు. ఆ తోపుకు ముందుకు మూకుట్లో పడిపోయే వాడల్లా పందిరి గుంజ పట్టుకుని నిలబడి పొయ్యిలో పడకుండా ఆగాడు.

కళ్ళు తుడుచుకుంటూ పల్లీలు వేయించడం చూసి –

”ఏడుపొకటి!” తిట్టాడు మేస్త్రీ.

”ఏడుపు కాద్సార్‌… పొగకు కళ్ళు నీళ్ళు కారుతున్నాయి.” అతనెదురుగా లేకుండా పక్కకు తప్పుకున్నాడు సత్యం.

భోజనాల సందడి తగ్గింది. పందిట్లో అతిధులు పల్చబడ్డారు. ఇంటి పెద్దలు పందిట్లో నిలబడి ఏవేం పదార్ధాలు మిగిలాయీ, ఏవేం తగిలాయీ అని ఏకాంబరంతో మాట్లాడుతున్నారు. చీకటి పడింది. తల్లి భోంచేసే సమయం దాటుతోంది. అసలు ప్రొద్దున్న ప్రక్క మంచం సోవమ్మగారికి కూడా ఆయాసం ఎక్కువగా వుందని విన్నాడు వస్తూ. ఆవిడ ఎలా వుందో ఆకలి అంటూ ఎదురు చూస్తోందో ఏవిటో? సత్యం మనసు గిజాటు పడుతోంది. పందిట్లోకి చీకటి నీడలు పూర్తిగా వచ్చేసాయి. గాడి పొయ్యి బూడిద వేడి గాలికి అప్పుడప్పుడూ చెదిరి నిప్పురవ్వ కనపడుతోంది. దూరంగా చూస్తే చీకటి కమ్ముకు పోయింది. సత్యం చిన్న క్యారీ బ్యాగ్‌ వెతుక్కుని దాన్లో అన్నం పెట్టుకుని ప్లాస్టీకు కప్పుల్లో మావిడి కాయ పప్పూ, కాస్త పెరుగూ కట్టిపెట్టుకుని హాస్పిటల్‌కి వెళ్దామని బైలుదేరాడు. వచ్చిన చుట్టాలు వెళ్ళే సందడిలో ఇంటాయన గుడి ముందుకు రావడం, సత్యాన్ని అతని చేతిలోని కవర్నీ చూడ్డం ఒకేసారి జరిగింది.

”వాడు వంటోడు కదూ!” అతను ఎవరితోనో అంటున్న మాటలు సత్యాన్ని అవాక్కు చేసాయి.

”ఏవిటో పట్టుకెడుతున్నాడు ఇట్రమ్మను”. ఎవరో లాక్కొచ్చి అతని ముందు నిలబెట్టారు. సత్యం భయంతో బిక్కచచ్చిపోయాడు.

”ఏంట్రా అదీ కవర్‌ చూపించూ!” అతను దబాయించాడు.

చూపించాలా వద్దా అన్న సంశయంలో పడ్డాడు సత్యం.

”నిన్న లడ్డూలో వేద్దామని చూస్తే రెండు కేజీల జీడిపప్పు ప్యాకెట్స్‌ మాయమయ్యాయి. వంటోడికి నేనే ఇచ్చా మరి రాలేదంటాడు.” ఒకతను పదం అందుకున్నాడు.

”నిజమే నండోయ్‌ మంచినూనె ప్యాకెట్లూ ఎండు ద్రాక్షా ఇలాంటి వన్నీ వాళ్ళను ఇంటికి మొయ్యడానికి ఈ పనాళ్ళు బాగా పనికొస్తారు. అసలిలాగ ఎత్తుకు పోవడానికే వీళ్ళని పెట్టుకుంటారు గావును.”

”అసలు ఏకాంబరం గుంపే ఇటువంటిది.”

”కవర్‌ విప్పడేం? నిలువు గుడ్లేసుకు చూస్తున్నాడు నాలుగు తగిలించక.”

”పిలవండి మేస్త్రీని” ఇంటాయన మాటలకు ఎవరో పందిట్లోకి పరిగెత్తారు ఏకాంబరం కోసం. తలా ఓ మాట విసుర్తున్నారు.. వినోదం పాలు ఎక్కువా, విచారణ పాలు తక్కువా మేళవిస్తున్నారు జనం.

నడుముకు చుట్టుకున్న తుండు విప్పి భుజాన వేసుకుంటూ ఖంగారు ఖంగారుగా వస్తున్నాడు ఏకాంబరం.

”వీడు మీ వంట బ్యాచ్‌లోని వాడేనా? ఇంటాయన అధికారిక ప్రశ్నకు సత్యం వేపు చూస్తూ నీరు గారి పోయాడు మేస్త్రీ.

”కవర్లో ఏదో తీసుకుపోతుంటే చూసి ఆపాను. ఏంటని అడుగుతుంటే నీళ్ళు నవులుతున్నాడు.. ఏంటో అడుగు వాణ్ణి.”

”ఏంట్రా అదీ!” కవర్లో ఏముందో తెలిసినా నలుగుర్లో తెలియనట్టే అడిగాడు ఏకాంబరం.

”మా అమ్మకు భోజనమండీ!” ఒణుకుతున్న కంఠంతో చెప్పాడు సత్యం.

కవర్‌ సత్యం చేతుల్లోంచి గుంజుకుని చించాడు విసురుగా. అందులోని అన్నం చెల్లాచెదురుగా క్రింద పడి నేలంతా పరుచుకుంది.

”ఛీ…. ఛీ…. చివరకు అన్నం దొంగతనం చేసేందుకు కూడా రెడీ అయ్యింది ఏకాంబరం బ్యాచ్‌… మిమ్మల్ని ఏమని లాభం లేదు. ఇలాంటి వాళ్ళని పిలిచి నా పరువు పోతుంది.” ఇంటి పెద్ద ఛీత్కారంతో నిలువునా నీరయినాడు ఏకాంబరం. ఒళ్ళు తెలియని కోపంతో పశువులా మారాడు. పిడి గుద్దులు… తన్నులతో సత్యం వీపూ మొహం రక్తసిక్తం చేసాడు. కాళ్ళతో తంతుంటే ఎవరో వచ్చి యిద్దర్నీ విడిపించారు.

”చాతనయితే నాలుగిళ్ళు అడుక్కుని పెట్టరా నీ అమ్మకు… ఇలా పని చేసే దగ్గర దొంగతనంగా ఎత్తుకుపోయి ఎన్నాళ్ళు సాత్తావు ముసల్దాన్ని. నీ మూలంగా నా పని కూడా పోతుందని నిన్ను పన్లో పెట్టుకున్న నాడే అనుకున్నాను. నా కొడకా… పెందరాడి చావన్నా రాదేంరా నీ తల్లికి” అంటూ ఉగ్రంగా ఊగిపోయాడు ఏకాంబరం.

లి లి లి లి

సత్యం రక్తంతో తడిసిన చొక్కా విప్పి వళ్ళు తుడుచుకుని లేచి నెమ్మదిగా హాస్పిటల్‌ బాట పట్టాడు. వార్డులో డాక్టర్ల సందడి చూసి ఎవరన్నా పెద్ద డాక్టరు వస్తున్నాడేమోనని ఒక్కక్షణం తలుపు దగ్గరే నిలబడ్డాడు. వార్డుబాయ్‌ దగ్గరికి రమ్మన్నట్టుగా సైగ చేస్తే అదిరే గుండెతో మంచం దగ్గరికొచ్చి నిలబడ్డాడు.

సోవమ్మ గారి మీద పూర్తిగా దుప్పటి కప్పుతున్నాడు డాక్టరు! వాతావరణంలోని మార్పు వల్ల ఆయాసం ఎక్కువై చనిపోయిందని చెబుతున్నాడు. తల్లి ఏడుస్తుండటం చూసి ఆమె దగ్గరికి చేరుకున్నాడు సత్యం.

”నాయనా సత్యం సోవమ్మ గారు పోయిందిరా! ఆకలీ… అన్నం… అన్నం అని కలవరించిందిరా! నీ కోసం చాలా సేపు ఎదిరి చూసింది.. సత్యం నాలుగు మెతుకులు తెస్తాడు నా ఆకలి తీరుతుంది అని బాధపడింది.” అంది బొంగురు గొంతుకతో.

”ఊరుకో అమ్మా ఏం చేస్తాం చెప్పు. ఈ పది రోజులు అంటే ఏవో నాలుగు మెతుకులు పెట్టాం గానీ, అసలు వాళ్ళ వాళ్ళెవరూ లేరా? కనీసం ఆవిడ మీద చింతాకంత సానుభూతి చూపే వాళ్ళు కరువయినట్టున్నారు.” అన్నాడు సత్యం బాధగా.

”సత్యం నాకో రహస్యం ఈరోజే తెలిసిందిరా! సోవమ్మ గారెవరనుకున్నావూ! మీ మేస్త్రీ ఏకాంబరం లేడూ… ఆవిడ కొడుకే అతగాడు.”

ఆ మాటకు సత్యం మనస్సు చేత్తో దేవేసినట్టు అయిపోయింది.

”ఆవిడ వొబ్బిడి నిదానమూ, ఆరిందాతనమూ కొడుకు క్రింద ఎందుకూ పనికి రాకుండా అయిపోయింది. పెద్ద తనంలో మొగుడికింత పెట్టుకోలేకా, తనింత తినాలేకా అలో లక్ష్మణా అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది. వీడి బుద్ధి బుగ్గికానూ కన్నతల్లిని ఆ మాత్రం చూసుకోలేడూ… తల్లికి అన్నం పెట్టడానికి నీలిగి చచ్చినాడు ఇప్పుడు ఘటశ్రాద్ధం పెడతాట్ట! ఇప్పుడే వచ్చి డాక్టరుతో మాట్టాడుతున్నాడు నవరసాలు మరీ వొలికిస్తూ.. అబ్బబ్బా అప్రతిష్టా భోజనం అయిపోయాక వాడుంటే ఏమిటీ లేకపోతే ఏవిటి?”

సీతమ్మ ఆవేశం పెరుగుతుంటే భుజం తట్టాడు సత్యం ఆగమన్నట్టు, ఎదురుగా డాక్టరు గారి గదిలోంచి కళ్ళు తుడుచు కుంటూ ఏకాంబరం బైటికొస్తూ కనిపించాడు.

”మేస్త్రి గారు మాట…” ఆ మాటన్న సత్యాన్ని అక్కడ చూసి ఏకాంబరం కనుబొమ్మలు పైకి లేచాయి.

”మేస్త్రి గారూ నేను దొంగననీ అందర్లో నింద మోపి మీరు గొప్ప వారయి పోయారు. సంతోషమే. వీరగంధం పూసుకొని ఇప్పుడు డాక్టరు దగ్గరికి వచ్చారు. కన్నతల్లి ఇక్కడ ఎలా వుందీ? తింటోందా తినట్లేదా అని వాకబు చేసారా? మిమ్మల్ని అడక్కుండా తీసుకు వచ్చే అన్నంలోనే మా అమ్మకు పెట్టాక కొంత మీ అమ్మకూ పెట్టాను. కానీ ఈ రోజు భోజనం తేవడం ఆలస్యం అయి నేను రాలేకపోతే అన్నం అన్నం అని కలవరించిందంట…”

”అంటే నేను మా అమ్మని చూళ్ళేదని ఫిర్యాదా?” హూంకరించబోయాడు.

”ఆగబ్బాయి అంత పౌరుషం పోవాకు… సంపాయిస్తున్నావు గడ్డి తిన్నట్టు తినీ, కుడితి తాగినట్టు తాగీ ఏం లాభం? తల్లి ఆఖరి చూపుకు నోచుకోక, నాలుగు మెతుకులు పెట్టకా ఎన్నేళ్ళు నిండితే మటుకు ఏం లాభం? ఒరేయ్‌ సత్యం ఇహ నించీ కూలీకైనా వెళ్ళు గానీ ఇతగాడి క్రింద పని మానెయ్యి…. గుప్పెడు మెతుకుల కాస్కారం లేక ఆవిడ చనిపోయింది. తల్లిని ఆఖరి దశలో చూడని అలాంటి వాడి దగ్గర మనకు పనిలేదు. విన్నావా? ప్రాణం నిలపడానికి చెప్పి మరీ అన్నం తీసుకు వస్తేనే దొంగ అని ప్రచారం చేసాడే… రేపు హంతకుడనీ, తిరుగుబోతనీ వాయించేగల్డు… ఇష్టం లేని వాడికి దూరంగా వుంటేనే మేలు…”

వాళ్ళ చూపులూ మాటలూ తప్పించుకుంటూ తల్లి శవం వైపుకు తిరిగాడు ఏకాంబరం కృంగిపోయిన హృదయంతో.

దెబ్బలతో ఒళ్ళు మొద్దు బారినా అమ్మని డిస్‌చార్జీ చేయించుకోవాలన్న ఆరాటంతో డాక్టరు గారి గదివైపు అడుగులు వేశాడు సత్యం. మేస్త్రీని జయించిన మనసుతో.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.