కవయిత్రుల వంటిల్లు – పాలపర్తి జ్యోతిష్మతి

సృష్టిలోని ప్రతిప్రాణికి ప్రాథమిక అవసరం ఆహారం. ఆహారం లేకపోతే ప్రాణికోటికి మనుగడ లేదు.

మానవుడు తన తెలివితేటలని ఉపయోగించి అనేక పరికరాలను, పదార్థాలను తయారు చేసుకుని జీవితాన్ని సుఖమయంగా, సౌకర్యవంతంగా మలుచుకుని, మిగిలిన ప్రాణులనుండి తనను తాను ప్రత్యేకంగా నిలబెట్టుకున్నాడు. ఈ ప్రత్యేకత ఆహారం విషయంలో కూడా ప్రతిఫలించింది, ప్రతిఫలిస్తోంది.

సృష్ట్యాదిలో ఆకులు, అలములు, కందమూలాలు, పచ్చిమాంసం తిని క్షుద్బాధను తీర్చుకున్న మనిషి, తరువాత వాటిని కాల్చి, ఉడకబెట్టి తినడం నేర్చుకుని, క్రమంగా అనేక రుచులను, రుచికరమైన పదార్థాలను ఆవిష్కరించుకున్నాడు. బ్రతకడానికి తినడం కాక తినడానికే బతుకుతూ, ఆకలి తీర్చుకోడానికి కాక జిహ్వచాపల్యాన్ని సంతృప్తిపరచుకోడానికి వంట వండుకునే స్థాయికి చేరుకున్నాడు.

ఆడ, మగ మధ్య జరిగిన శ్రమవిభజనలో గృహనిర్వహణ బాధ్యతలు స్త్రీల పరమయ్యాయి. పర్యవసానంగా ఇంట్లోని వారందరి అభిరుచులకు అనుగుణంగా రుచికరమైన పదార్థాలను వండి పెట్టడం గృహిణి బాధ్యతగా స్థిరపడిపోయి వదిలించుకోలేని గుదిబండగా తయారయింది.

ఒక పెళ్ళికాని యువకుడు వంట చేసుకుంటుండగా అతని స్నేహితుడు అతని గదికి వచ్చాడు. ఈ యువకుడు స్నేహితుడి చేతిలో ఒక కూర ముక్కని పెట్టి ‘రుచి చూడండి’ అన్నాడు. ఆ స్నేహితుడు చేతిలోని కూరముక్కను తిని ‘చాలా బాగుంది, మీ కాబోయే భార్య చాలా అదృష్టవంతురాలు’ అన్నాడు. అప్పుడా యువకుడు ‘ఆఁ..! పెళ్ళయ్యాక నేనెందుకు చేస్తాను?’ అని రోష పడ్డాడు.

‘ఆడవాళ్ళకు వంటపని పుట్టుకతో వచ్చిన హక్కు, బాధ్యత, కర్తవ్యం, జీవిత సాఫల్యం. చేతకాకపోయినా నేర్చుకుని తీరాలి. అదేపని మగవాళ్ళకు చేతనైనా చెయ్యడానికి నామోషి పడవలసిన విషయం’ అన్న భావన మనసుల్లో గాఢంగా పాతుకుపోయింది. కాని ఇవాళ్టి అభివృద్ధి చెందిన సమాజంలో పెద్ద చదువులు చదివి క్లిష్టతరమైన ఉద్యోగ బాధ్యతలను సునాయాసంగా నిర్వహిస్తున్న ఆధునిక మహిళలు వంటపని వారికి మాత్రమే సంబంధించిన విషయం అన్న భావనపట్ల నిరసనను ప్రకటిస్తున్నారు.

కొత్తగా పెళ్ళయిన ఒక అమ్మాయి భర్త గురించి తల్లికి చేసే ఫిర్యాదు ‘ఆదివారం వచ్చిందంటే చాలు, కనిపించిన వాళ్ళందరినీ భోజనానికి పిలుచుకొస్తాడు’ అని. అతను భోజనానికి వచ్చిన స్నేహితులతో కలిసి బాతాఖానీ కొడుతూ బయట కూర్చుని ఉంటాడు. ఆ అమ్మాయి వాళ్ళందరికి రకరకాల రుచులతో భోజనపదార్థాలు తయారుచేస్తూ వంటింట్లో మగ్గిపోతుంది.

తిండి తినకుండా ఉండవలసి వచ్చినా ఇబ్బందిలేదు కానీ ఈ వంటింటి ఖైదు తప్పితేచాలు అని స్త్రీలు భావించడంకూడా కద్దు. భర్త ఉదయమే టిఫిన్‌ చేసి ఊరికెళితే, ఆ టిఫినే కొంచెం ఎక్కువగా వండుకుని మధ్యాహ్నం భోజనం బదులు అది తినేసి ‘అమ్మయ్య. ఇవాళ్టికి వంటబాధ తప్పింది’ అనుకుని సంబర పడుతోంది ఒకావిడ. సాయంత్రం అంట్లుతోమడానికి వచ్చిన పనిమనిషి ‘అయ్యగారు లేరు కదాని వంట చేసుకోలేదా?’ అంటూ ఆవిణ్ణి కోప్పడింది. ‘వంటింటి చెరనుంచి ఒక్కరోజైనా విముక్తి లభించిందని నేను సంతోషిస్తుంటే పనిమనిషికూడా వంటచెయ్యలేదని నన్ను దండించేదైపోయింది’ అంటూ వాపోయిందావిడ.

సంగీతము, నృత్యము మొదలైన అనేక కళలతోబాటు పాకశాస్త్రంకూడా ఒక కళే. సంగీతమో, నృత్యమో, ఇంకో కళో తెలిసిన అమ్మాయిలు స్త్రీ జనాభాలో చాలా తక్కువ శాతమే ఉంటారు. ఆడపిల్లకి పాటలు పాడటం రాకపోయినా, నాట్యం చెయ్యడం రాకపోయినా ఎవరూ పట్టించుకోరు. ఆడపిల్లలు మాత్రమే చెయ్యదగినవిగా భావించబడే కుట్లు, అల్లికలు, ముగ్గులు వెయ్యడం వంటి విద్యలు తెలియవని అన్నా ఎవరికీ ఏమాత్రం ఎబ్బెట్టుగా అనిపించదు. ఆ రాకపోవడాన్ని లేక తెలియకపోవడాన్ని చాలా సహజంగా తీసుకుంటారు. కానీ వంటచెయ్యడం రాదు అంటే ‘ఆడదానివికదా? వంట చెయ్యడంకూడా రాదా?’ అంటూ సంస్కారహీనంగా మాట్లాడతారు.

స్త్రీ వంటింటి బాధ్యత కేంద్రబిందువుగా విమలగారు ‘వంటిల్లు’ పేరుతో ఒక విశిష్టమైన కవితని రాశారు. ఆ కవితను విశ్లేషించుకునేముందు కొందరు కవయిత్రులు తమ కవితల్లో వంటపనిగురించి, వంటింటిగురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు తెలుసుకుందాం.

నిత్యజీవితంలో చేసే ప్రతిపనినీ వంటింటికి సంబంధించిన ప్రతీకలతో పోలుస్తూ స్త్రీ వంటపనితో ఎంతగా మమేకమైపోతుందో తెలియజేసే కవితాఖండికను చూద్దాం.

రుబ్బుడు పొత్రంలా తల తిరుగుతూనే ఉన్నా

ఆలోచనల పప్పు మెదగదు

ఇంగువ వాసనలో మునిగి తేలే ముక్కు

ఊపిరి పీల్చుకోవటం మర్చిపోతుంది

కలల అలల తుంపరలు హృదయపు పెనంపై

చుయ్యి మంటూనే ఉంటాయి

రోకటి బండకింద పచ్చడి పచ్చడవుతూనే ఉంటాయి

అంటారు ఓల్గా ‘గృహలక్ష్మి’ అనే కవితలో.

పెళ్ళికాకముందు భావుకత్వం నిండిన ఊహల్లో విహరించిన ఒక అమ్మాయికి ఇప్పుడు వంటగదే ప్రకృతి సర్వస్వం అయిన తీరును ‘ద్విపాత్రాభినయం’ అనే కవితలో మందరపు హైమవతి వర్ణిస్తారు.

గాస్‌ పొయ్యి మంటల్లోనే నీలాల గగనాన్ని చూస్తాను

కుక్కర్‌ విజిల్స్‌లోనే మనోజ్ఞ సంగీతం వింటాను

పతిదేవుని టేబిల్‌పై కాఫీకప్పుగా, మీల్స్‌ కారియర్‌గా

పిల్లల లంచ్‌బాక్సులుగా బహుపాత్రాభినయం పోటీలో

నా చేతులకెప్పుడూ ఫస్ట్‌ప్రైజే

అంటూ తన గోడు చెప్పుకుంటుంది ఆ ఇల్లాలు.

‘ఇస్త్రీమడత నలక్కుండా తిరిగొస్తుంది ఎంత అదృష్టం’ అన్న ఇరుగుపొరుగుల అసూయపూరిత వ్యాఖ్యానాలకు గురవుతూ, పొద్దుట్నుంచి నాలుగిళ్ళు తిరిగొచ్చిన న్యూస్‌పేపర్‌లా ఇల్లు చేరేటప్పటికి అంట్ల గిన్నెలు విరహగీతాలు ఆలపిస్తుంటాయి అంటూ ఉద్యోగస్తురాలైన ఆ ఇల్లాలి అంతరంగ మథనాన్ని ఆవిష్కరిస్తున్నారు ఈ కవితలో కవయిత్రి.

వంటింటికి బందీ అయి, కలల రాకుమారుడు విమానంలో వచ్చి తనను ఆ బందిఖానానుంచి విముక్తురాలిని చేస్తాడని ఎదురుచూస్తూ కాలం గడుపుతున్న ఒక అమ్మాయి ఆలోచనల్ని ‘వంటింటి అమ్మాయి’ అనే కవితలో మన ముందుంచుతారు కన్నడ కవయిత్రి వైదేహి.

రకరకాల పదార్థాలున్నట్లే వంటింటికి రకరకాల అర్థాలున్నై

కాని ఆ అమ్మాయికి మాత్రం అన్ని ఇళ్ళు ఆ వంటిల్లే

అట్టే మాట్లాడితే అదే వల్లకాడు కూడా

ప్రతి జీవికీ కడుపొకటి ఉన్నట్లే ఆమెకు వంటిల్లుంది

ఎవరీ సిద్ధాంతాలు వండారోగానీ

తలుపుల్లేవు, కిటికీల్లేవు, పొగగొట్టాలూ లేవు

చివరికి ఒక చిన్న కన్నమైనా…. లేదు

అంటూ ఆ అమ్మాయికి – తద్వారా స్త్రీలందరికి వంటింటికి అంకితమై ఉండిపోవలసిన తప్పించుకోలేని, తప్పనిసరి పరిస్థితిని వర్ణిస్తారు వైదేహి.

మరో కన్నడ కవయిత్రి ప్రతిభ నందకుమార్‌ ‘ఇల్లాలి పాట’ అనే కవితలో

ఎప్పుడూ నవ్వులు చిందిస్తూ ప్రెషర్‌పానులో నేతి తాలింపులు వేసి

రెండేరెండు నిమిషాల్లో పిల్లలకు తిండి పెట్టినదానా

నీ నవ్వుల కిచ్చిందెంత?

అని ప్రశ్నిస్తూ చిరునవ్వుతో ఇల్లాలు చేసే వంటింటి సేవలకు విలువలేదు అన్న విషయాన్ని నర్మగర్భంగా తెలియచేస్తున్నారు.

షడ్రుచుల సమ్మేళనమైన ఆహారపదార్థాలను వండే మనిషికి ఆ పనిగానీ, ఆ వంటకాలుగానీ ఎంత రసహీనంగా ఉంటాయో –

నిత్యం పిండివంటల వాసనలతో మొహంమొత్తిన ఇంద్రియాలు

పచ్చడిమెతుకులనే కోరుకుంటున్నాయి

అన్న వాక్యాలద్వారా తెలియజేస్తారు పాలపర్తి జ్యోతిష్మతి ‘వంటావిడ’ అనే కవితలో.

ఈ కవితలన్నీ స్త్రీలకు సంబంధించిన అనేకానేక సమస్యలతోబాటు ‘వంట’ని కూడా స్పృశించినవి. ఇక విమలగారి కవిత దగ్గరికి వస్తే – ఈ కవిత రచనాకాలం 1980వ దశకం. ఈ రచన వెలువడిన కాలంలో పెద్ద దుమారాన్ని లేపింది. తీవ్రమైన విమర్శకు గురయ్యింది. ‘ఆడవాళ్ళు వంటపనిని మాకొద్దనడ మేమిటి?’ అన్న ప్రశ్న ఆ కాలపు పురుషపుంగవుల్ని కుదిపేసింది.

ఆనాటికీ, ఈనాటికీ సమాజంలో, ఆలోచనా విధానాల్లో విపరీతమైన మార్పు ఏమీ లేనప్పటికీ ఎంతోకొంత పరివర్తన ఉంది కాబట్టి ఈ కవితను చదివి అర్థం చేసుకునేటప్పుడు ఆకాలాన్నికూడా దృష్టిలో ఉంచుకోవాలి.

ఈ కవితలో ఒక అమ్మాయి తన తల్లినీ, తననీ – తన తల్లి వంటింటినీ, తన వంటింటినీ పోల్చి చూపిస్తూ ఉంటుంది.

ఎంత అద్భుతమైందీ వంటగది!

రుచులు రుచులుగా పరిమళాన్ని వెదజల్లుతూ

తెరిచిన తినుబండారాల దుకాణంలా ఎంత నోరూరిస్తుందో!

అంటూ మొదలవుతుందీ కవిత.

‘వంటగది ఎవరికి అద్భుతమైంది?’ అంటే వంటకాలను తింటూ రుచులను ఆస్వాదించే వాళ్ళకు.

ఎంత తేలికో – గరిట తిప్పితే చాలు వంట సిద్ధం అంటారంతా!

తినేందుకు తప్పా ఇటుకేసి రారు ఎవ్వరూ –

అన్న వాక్యాలతో ఈ విషయాన్ని తెలియజేస్తారు. తినేవాళ్ళకు అద్భుతంగా కనిపించే వంటిల్లు వండే వాళ్ళకు ఎట్లా అనిపిస్తుంది?

మన రక్తం పీల్చేసి, మన ఆశల్నీ, కలల్నీ కాజేసి

కొద్ది కొద్దిగా జీవితాంతం పీక్కుతింటున్న రాకాసిగద్ద ఈ వంటిల్లు

అంటూ వండే వాళ్ళకు వంటిల్లేంటో చెప్తారు విమల.

ఆడపిల్లకు చిన్నతనంనుంచీ వంటింటిపట్ల వ్యామోహం ఉంటుందట. వంటింట్లోనే స్త్రీలయిన అమ్మ, అమ్మమ్మ ఈ అమ్మాయికి బాల్యపు ఛాయలు వదిలిపెడుతుండగా ఇక్కడే ‘వంటింటితనాన్ని’ నేర్పి, స్త్రీగా తీర్చిదిద్దారట. వంటింటితనాన్ని నేర్పడం, స్త్రీగా తీర్చిదిద్దడం అంటే వంటింటి సంస్కృతి, వంటింటి ముచ్చట్లు అలవాటు చేసి వంటలక్కలుగా తయారుచేయడమే! స్త్రీకి, వంటకు, వంటింటికి ఉన్న అవినాభావ, అనివార్య సంబంధాన్ని ఎంత సహజంగా చెప్పారో కదా!

అమ్మ వంటిల్లు అలికి ముగ్గులు దిద్దిన పొయ్యితో, తడి కట్టెల పొగ మేఘాలమధ్య వేలాడుతూ ఉంటే, ఈ అమ్మాయి అదృష్టవశాత్తూ గ్యాసు, గ్రైండరు, సింకులు, టైల్సు ఉన్న వంటింట్లో పడిందట. అమ్మ వంటిల్లు వసారాలో చల్లచిలికే చప్పుడుతోనో, అంట్లగిన్నెల చప్పుడుతోనో మేల్కొంటే, ఈ అమ్మాయి వంటిల్లు కుక్కరు కూతతోనో, గ్రైండరు మోతతోనో మేల్కొంటుందట.

‘వంటింటి సామ్రాజ్యానికి అమ్మే రాణి అయినా వంటింటి గిన్నెలన్నింటిపైనా నాన్న పేరే ఉంటుంది. అమ్మలా గారెలు, అరిసెలు కాక కేకులు, పుడ్డింగులు చేస్తున్నా నా వంటింటి గిన్నెలమీద కూడా పేర్లు నా భర్తవే’ అని చెప్తూ వంటిల్లు, వంటలు ఆధునికీకరణ చెందిన నాటికీ, నేటికీ వంటింట్లో కూడా పురుషాధిక్యతే చలామణి అవుతున్న తీరును ఆ అమ్మాయిచేత చెప్పిస్తారు కవయిత్రి.

ఈ వంటింటిని తగలెయ్య

ఎంత అమానుషమైందీ వంటగది!

అన్న కవితా వాక్యాల్లో అగ్నికీలలకు ఆహుతైపోతున్న అబలల ఆర్తనాదాలు వినిపించడం లేదూ?

గిన్నెలు, డబ్బాలు, బస్తాలతో రకరకాల శవాలు నిండిన శ్మశానంలా ఉంటుందట వంటిట్లు. ఏడ్చిఏడ్చి కళ్ళు ఎక్కడో కారిపోయి, తోమితోమి చేతులు అరిగిపోయిన అమ్మ భయంభయంగా, నిశ్శబ్దంగా, నిరాశగా ఒక ప్రేతంలా తేలుతూ

ఉంటుందట వంటింట్లో. ఈ అమ్మాయి పరిస్థితి మెరుగ్గా ఏమీ లేదు. కడిగి, కడిగి, వండీ, వండీ, వడ్డిస్తూ, ఎంగిళ్ళెత్తేసుకుంటూ… వంటింటి గురించే కలలు కంటూ, మల్లెపువ్వుల్లోనూ పోపువాసనలనే ఆఘ్రాణిస్తూ బతుకీడుస్తోంది.

ఈ సందర్భంలో శవాలు, శ్మశానం, ప్రేతం వంటి పదాలు వాడటం కొందరికి అభ్యంతరకరంగా అనిపించవచ్చు. ఆ పదాలను పదాలుగా చూస్తే జుగుప్సాకరంగానే ఉంటాయి. కానీ ఆ పదాలు వాడటం వెనుక ఉన్న వేదనని తెలుసుకోగలిగితే వాటి కవిత్వ విలువ అర్థమవుతుంది.

శారీరకంగా అనారోగ్యంతో బాధపడుతున్నా, మానసికంగా ఉత్సాహంలేని స్థితిలోనైనా అమ్మకి వంటపని తప్పదు. తలదువ్వుకునే ఓపికలేక, మంచిచీర కట్టుకునే శ్రద్ధలేక, రేగిన జుట్టుతో, నలిగిన దుస్తులతో కళ్ళనిండా నీరసం నింపుకుని ఈసురోమంటూ వంటింట్లో పనులు చక్కబెట్టుకుంటున్న అమ్మ ప్రేతంలాకాక ప్రబంధనాయికలా ఉంటుందా? అటువంటి అమ్మకు వంటిల్లు శ్మశానంలా, గిన్నెలు, డబ్బాలు, బస్తాలు శవాల్లాకాక వంటిల్లొక నందనవనంలా, అందులోని వస్తువులు ఆ నందనవనం సౌందర్యాన్ని ఇనుమడింపజేసే అలంకరణ సామగ్రిలా కనిపిస్తాయా?

ఒక్కోసారి అమ్మ బందీ అయిన పులిలా వంటగదిలో అశాంతిగా తిరుగుతూ ఉంటుందట. పులి ఎంత శక్తికలిగిన జంతువైనా బోనులో బంధించినప్పుడు దానిశక్తి దాన్ని బోనులోంచి బయట పడెయ్యలేదు. ఆ నిస్సహాయత కోపంగా పరిణమించి పులి ఆ ఇరుకిరుకు బోనులోనే రౌద్రంగా మసలుతూ ఉంటుంది. అలాగే అమ్మ ఎంత తెలివైనదైనా, శక్తిసామర్థ్యాలు కలిగినదైనా వంటింట్లో బందీ అయిపోయి తెలివితేటలు నిరుపయోగంగా సమసిపోవడంవల్ల కలిగే ఉక్రోషంలోంచి పుట్టిన అశాంతి అమ్మని నిలకడగా

ఉండనివ్వదు. అటువంటప్పుడు పులి బోనులో తిరిగినట్టు అమ్మ వంటిల్లనే బోనులో పచార్లుచేస్తూ తన భావోద్వేగాలను అణచి వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఆమె మండుతున్న పొయ్యిలాకూడా ఉంటుందట. కానీ ఈ అమ్మాయి ఈ విషయంలో అమ్మలాకాక తన కోపాన్నీ ‘వంటిళ్ళను ధ్వంసం చేద్దాం రండి’ అని పిలుపునివ్వడం ద్వారా తీర్చుకుంటోంది.

కవిత చివరలోని

వేరు వేరు స్వంత పొయిలను

పునాదులతోసహా తవ్విపోద్దాం రండి!

అనడంద్వారా కవయిత్రి స్త్రీలకు ఒక తెలివిడిని కలుగజేస్తున్నారు. వంటపని బరువును మోస్తూ తామెంత శ్రమదోపిడికి గురవుతున్నారో తెలుసుకోలేక స్త్రీలు వంటింటి పెత్తనంకోసం పోటీపడి పరస్పర స్పర్ధను పెంచుకుంటున్నారు. వంటింటి పెత్తనం గొప్ప సంపదగా భావించి, దాన్ని పోటీపడి ఇంకొకరిదగ్గరనుంచి లాక్కోవాలనుకునే ఆలోచనను కూకటివేళ్ళతో పీకిపారేద్దాం అని ఉద్బోధిస్తున్నారు కవయిత్రి.

మళ్ళీ మన పాపలు ఈ వంటరి వంటిళ్ళలోకి అడుగిడ బోతున్నారు

మన పిల్లలకోసం

వంటరి వంటగదులను కూల్చేందుకు రండి

అని పిలుపునిస్తూ ముగించారు ఈ కవితను విమల.

‘మన పాపలు ఈ వంటరి వంటిళ్ళలోకి అడుగిడబో తున్నారు’ అని హెచ్చరిస్తున్నారు. మన అమ్మమ్మలు, అమ్మలు, మనము మోసిన, చేసిన వంటింటి చాకిరి తిరిగి మన కూతుళ్ళమీద పడబోతోంది. దాన్ని తప్పిద్దాం, రండి అని పిలుస్తున్నారు. అయితే ఈ తప్పించడం ఎట్లా? మనం మన ఆడపిల్లల్ని, మగపిల్లల్ని సమానంగా పెంచుదాం. అన్ని హక్కులు, బాధ్యతలతోపాటు వంటింటి బాధ్యతను కూడా సమానంగా పంచుదాం. మనం మన కొడుకులను వంటింటికి దూరంగాకాక వంటింటి శ్రమలో భాగస్వాములను చేద్దాం అన్న హితోపదేశం ఈ పిలుపులో ఉంది.

ఆహారం ప్రాణులకు ప్రాథమిక అవసరం అని మొదటే చెప్పుకున్నాం కదా! మరి ప్రాణాధరమైన ఆహారాన్ని తయారుచేసే వంటగదులను కూల్చేస్తే మానవజాతి మనుగడ ఎట్లా?…

‘వంటరి వంటగదులను కూల్చేందుకు రండి’ అన్న పిలుపు వంటగదులను కూల్చేందుకు సమస్త స్త్రీజాతికి ఇచ్చిన పిలుపు కాదు. ఇక్కడ కూల్చేది వంటగదులను కాదు, వంటరి వంటగదులను. కూల్చవలసింది వంటగదులలోని వంటరితనాన్ని. వంటింట్లో తయారైన ఆహారాన్ని తినే వాళ్ళందరూ ఆ ఆహారాన్ని తయారుచేసే శ్రమలోకూడా భాగం పంచుకోండి. అందరం కలిసి వంటింటి బాధ్యతను సమానంగా స్వీకరిద్దాం అని మగవాళ్ళకు ఇచ్చే పిలుపు ఈ వాక్యం.

మారవలసింది కేవలం పనిచేసే చేతులు కాదు, ఆలోచనా విధానం, భావజాలం.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.