వెంటాడుతున్న వాస్తవాలు

హిమజ
ప్రియమైన మిత్రా!
ఎలా వున్నావు. భూమిక ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర సామాజికయాత్ర నుంచి తిరిగి వచ్చాం.

వచ్చి పదిరోజులు దాటుతున్నా గంగవరం, వాకపల్లి జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే వున్నాయి. సమస్యల్ని చదవడం వేరు. ఛానళ్ళలో చూడటం వేరు. ప్రత్యక్షంగా బాధితుల వేదనల్తో మమేకమై పొయ్యం. అందుకేనేమొ ఇంత వేదన.
గంగవరం మత్స్యకారులు సముద్రాన్ని నమ్ముకొని బతికేవాళ్ళు. సముద్రాన్ని అమ్మగా భావించేవాళ్ళు. ప్రైవేటు పోర్టు కోసం ఏకంగా వూరిని వూరినే నిర్వాసితుల్ని చేస్తే వాళ్ళేం చేయాలి? ‘మా సముద్రం పోయింది’ అంటున్నారంటే సముద్రంవారి జీవనంలో ఎంతగా ఇమిడిపోయింది? నిజానికి సముద్రం ఎక్కడికి పోయింది? జీవనోపాధికి సముద్రం పైకి వేటకెళ్ళడం నిషేధించబడింది. చేపలతో బరువెక్కిపోయి, కుటుంబావసరాలు తీర్చిన జాలరి వలలు, తాళ్ళు ఓ మూలన మూటగా పడిపోయి మూగగా ఏడుస్తున్నాయి. స్వేచ్ఛగా సముద్రం పైకి వేటకెళ్ళి జీవనభృతి సంపాదించుకునే గ్రామీణులు రేపు ప్రైవేటు పోర్టు ఏర్పడితే అందులో కార్మికులుగా, కూలీలుగా మారిపోతారు. ఏదో చిన్నపాటి ఉద్యోగమిస్తే ఆ ఒక్కడు మాత్రం బతుకుతాడు. పోర్టు సిద్ధం అయిన తరువాత – బాగా చదువుకున్న ఇంజనీర్లకు, టెక్నీషియన్లకు మాత్రమే పని దొరుకుతుంది. చిరుఉద్యోగాలు మాత్రమే గ్రామస్థులకి మిగులుతాయి. అది కూడా అందరికీ సరిపడా దొరకకపోవచ్చు. అదే వారి జీవనోపాధి వారికుంటే ముందు, వెనుకతరాలు కూడా బతికేందుకు అవకాశముంటుంది. అభివృద్ధి మంత్రం పఠిస్త ప్రైవేటు వ్యక్తుల కోసం, సంస్థల కోసం ప్రభుత్వాలు వేల ఎకరాలు భూమి సేకరిస్తున్నాయి గానీ బాధిత నిర్వాసితులకు పునరావాసాన్ని చూపించడంలో విఫలమవుతున్నాయి. గంగవరం గ్రామానికి, సముద్రానికి మధ్య వెలిసిన పొడవాటి గోడ, వారి జీవించే హక్కును పరిహసిస్తున్నట్టుగా కన్పించింది. అంతవరకూ అన్నం పెట్టి, అన్నీ ఇచ్చిన సముద్రం – ఈనాడు వారికి ఏమీ కానిదయింది. రాజ్యం హైజాక్‌ చేసిన సముద్రజలాల్లో మత్స్యకారుల కన్నీళ్ళు కలిసిపోతున్నాయి.
దీన్ని ఎదుర్కోవడానికి వారికి తోచిన అన్ని రీతుల్లోన పోరాడారు. గంగవరం గ్రామ మహిళల్తో మాట్లాడుతుంటే, చదువుకి, అవగాహనకి సంబంధం లేదనిపించింది. వాళ్ళ సమస్య పట్ల వాళ్ళు చాలా స్పష్టంగా వున్నారు. అంతెత్తు ఇసుక దిబ్బలపైకి ఎగిరి పోర్టులోకి దూసుకెళ్ళారు. కొన్నిరోజులు అక్కడే వంటావార్పు, స్నానపానాదులు చేసారు. పోర్టు అధికారుల్ని హడలగొట్టారు. ఈ క్రమంలో ఎందరో స్త్రీలు అరెస్టయ్యరు. ఉద్యమం బలహీనపడేలా కొందరు గ్రామస్థులు లోపాయికారీగా అధికారులతో కుమ్మక్కయ్యరు. అయినా ఆ స్త్రీలు వెనక్కి వెళ్ళలేదు. ‘మా సముద్రం మాకిస్తే చాలు’ అన్న డిమా౦డ్‌తో సాగుతున్నారు. కళ్ళముందు సముద్రం కన్పిస్తూ, దానిపైన వారికెలాంటి హక్కుల లేకుండాపోతున్నాయంటే, వాళ్ళకి ఎలా వుంటుంది. ”వాటర్‌, వాటర్‌ ఎవ్రీవేర్‌, నార్‌ ఎనీ డ్రాప్‌ టు డ్రివ్‌” చరణాలు మనకి గుర్తుకు రాకుండా ఎలా వుంటుంది?
పక్కనే వున్న దిబ్బపాలెం సంగతో – అదైతే నిజంగా మట్టిదిబ్బలపాలెమే. కూల్చేసినవన్నీ పక్కా ఇళ్లే. అనేక ఇళ్ళు, బడి, కమ్యూనిటీహాలు, ఓ ప్రింటింగ్‌ ప్రెస్సు కూడా. అన్నీ యుద్ధంలో నేలకొరిగిన సైనికుల్లా కన్పించాయి. ప్రైవేటు పోర్టుకు స్థలం సమకూర్చుకునే క్రమంలో ఈ దురాక్రమణ జరిగింది. ఇల్లంటే ఒక జీవితకాలపు నిశ్చింత. కొన్ని తరాలవారికి నీడనిచ్చే గొడుగు. అలాంటి ఇళ్ళని వారి జీవితకాలంలోనే కూల్చేయడం ఎంత దారుణం. బతుకుతెరువు కోల్పోయి, నిరాశ్రయులైపోయిన రెండు గ్రామాల ప్రజల్లో సహజంగానే సామరస్యత పోయింది. పోర్టులో దొరకబొయ్యే అరకొర ఉద్యోగాలైనా దక్కించుకోవాలనే పోటీ వాళ్ళలో మొదలైంది. ఏదైనా కళ్ళతో చూసింది అది వేరు. బతుకుపోరాటంలో ఎంతో ముందున్న గంగవరం స్త్రీలని అభినందిస్తూ, బరువెక్కిన మనసుల్తో వెనక్కి మళ్ళాం.
మిత్రా! నీకు ఇంకా ఇంకా చాలా చెప్పాలి. వేడుకైనా, వేదనైనా నీతో పంచుకోకుండా ఎలా. జరుగుతున్న సామాజిక అక్రమాల పట్ల, ఆక్రందనల పట్ల అవగాహన మనకి ఎంతో అవసరం కూడా.
తిరుగు ప్రయణంలో విశాఖ జైలులో మహిళా ఖైదీలతో కొంతసేపు మాట్లాడాం. ఒక్కొక్కరిని కదిలిస్తే ఒక్కో వ్యధ. ఒక మహిళా ఖైదీ భర్త ఎయిడ్స్‌తో బాధపడుత చనిపోయే ముందర ఆ చావుకి కారణం తన భార్యేనని రాసిపెట్టిపోయడు. భర్తవల్ల ఎయిడ్స్‌ సంక్రమించి, జైలుపాలై, పిల్లలు అనాథలైపోయిన గాథ ఆమెది. మరిదితో అక్రమ సంబంధం అంటగట్టి అయినవాళ్ళు జైలుపాలు చేస్తే ఇంటిదగ్గర కడుపుతో వున్న కూతురు ఏమైపోయిందో అని తల్లడిల్లే ఓ తల్లి. కుటుంబహింసని తట్టుకోలేక అత్తని, భర్తని పచ్చడిబండతో కొట్టి చంపిన ఓ స్త్రీ – వారి చావు ఆమెకి విముక్తి అయింది. జైలుకి వచ్చినందుకు బాధపడుతున్నట్టో, పశ్చాత్తాపపడుతున్నట్టో కన్పించలేదు ఆమె. జైలు గదులు ఆమెకి స్వేచ్ఛాప్రపంచంలా అనిపించాయి.
మరునాడు వాకపల్లి వెళ్తుంటే గుండె దడదడలాడింది. వాళ్ళని ఏమని అడుగుతాం. మానుతున్న గాయం రేపిన వాళ్ళమవుతామా – అసలు ఆ ఆదివాసీ స్త్రీల మనసులకైన గాయం మానేదేనా! స్వచ్ఛమైన ప్రకృతి వాతావరణం – చుట్టూ కొండలు చిన్నచిన్న గుట్టలు, రాళ్ళు, తుప్పలు వీటిని దాటుకుంటూ ఒక చిన్నమిట్ట మీద వున్న అత్యాచార బాధిత మహిళల దగ్గరికి చేరుకున్నాం. వాళ్ళని మేం ప్రశ్నలతో ఇబ్బంది పెట్టదల్చుకోలేదు. ఏం జరిగిందో వాళ్ళనే చెప్పమని కోరాం. పోలీసులు తమపై జరిపిన వికృత అత్యాచారహేల గురించి ఒక్కొక్కరు చెబుతుంటే మాకు కన్నీళ్ళు ఆగలేదు. అడవిబిడ్డలు వాళ్ళు. స్వచ్ఛంగా నిజాయితీగా బతికేవాళ్ళు. తేగలు తవ్వుకొని తిని బతికేవాళ్ళు. కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఆ కొండ కోన ప్రాంతమంతా కలియదిరిగేవాళ్ళు. అసలా కొండ కూడా దాటి ఎరుగనివాళ్ళు. పోడు వ్యవసాయం చేసుకుని బతికే ఆదివాసీ కుటుంబ స్త్రీలు. ఆదివాసీ సంస్కృతిలో అబద్ధం ఆడడం అనేది వుండదు. అలాంటిది తమ అస్తిత్వాన్ని తామే కించపరుచుకుంటూ, తమపై అత్యాచారం జరిగిందంటూ ఎవరైనా చెబుతారా! ఆ పదకొండు మంది మహిళలు చెబుతుంటే బాధ్యతాయుత అధికారులెవరూ నమ్మలేదు. ‘భూమి చెబుతుంటే ఆకాశం నమ్మడం లేదు’ అన్న వారి అభివ్యక్తికి మేమంతా కదిలిపోయి కన్నీరైపోయం.
ఇది సిగ్గుమాట. మాకు అబద్ధం చెప్ప పనిలేదు. అంటూ ధైర్యంగా తమపై జరిగిన అఘయిత్యాన్ని నిర్భయంగా వెల్లడించినందుకు వాళ్ళని ఇళ్ళలోనికి రాకుండా వెలివేసారు. పుట్టింటివారూ నిరాదరించారు. జరిగిన సంఘటనకి తగిన క్రతువు, శుద్ధిలాంటి కార్యక్రమం జరిపించాకే వాళ్ళని కుటుంబాల్లో కలుపుకున్నారు. అయినా ఈనాటికీ వారు సంతకి వెళ్ళడానికి సాహసించలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా ”పోలీసోడి….” అంటూ తిరస్కారపు మాటలకు గురవుతున్నారు. పచ్చటి పైరుని పశువులు తొక్కి భీభత్సం చేస్తే పైరుదా తప్పు? విద్రోహాలు లైంగికపరమైనవైనా, సామాజికమైనా, మతపరమైనవైనా కల్లోలాలకు గురయ్యేది, అణచివేతకు బలయ్యేది మాత్రం స్త్రీలే కదా. ఈ కొండదాటి ఎరుగని ఆ అమాయకులు రాజధాని నగరానికి వచ్చి వారిపై పోలీసులు జరిపిన అత్యాచారాన్ని చెప్పుకుంటే వారికి దొరికిన న్యాయం? ప్రభుత్వం, పోలీసు అధికారులు వారి కన్నీళ్ళని పట్టించుకోకుండా పలుచన చేసి ఇదంతా మావోయిస్టుల ఎత్తుగడగా కొట్టిపడేసారు. అత్యాచారాన్ని మించిన అవహేళన ఇది. మా అందరి గొంతుల్లోనూ గురగురలాడే దుఃఖంతో మిమ్మల్ని మేము నమ్ముతున్నాము. ఇక్కడిదాకా రాలేకపోయినా మీ పట్ల సహానుభూతి చెందే ఎందరో స్త్రీలు మీ అక్కలు చెల్లెళ్ళలాంటివారు మరెందరో వున్నారు. మీ గురించిన వాస్తవాలను అక్షరాల ద్వారా అందరికీ తెలియచేస్తాం. దుఃఖపడొద్దు. సామాజికంగా మీరే గెలిచారు అని వాళ్ళని ఓదార్చే ప్రయత్నం చేసాము. వాళ్ళకి మేం చెప్పిన అనునయ వాక్యాలు మేం వాళ్ళకి చేసిన ప్రమాణాలుగా నాకు అన్పిస్తుంది. అందుకే నీకింత వివరంగా చెప్పడం. మేము కళ్ళతో చూసిన తెలుసుకున్న విషయాల్ని మనసుతో నీకు వివరిస్తున్నా. బరువెక్కిన మనసులతో వెనుదిరిగిన మాకు, కొంతదూరం మాతోపాటు నడచివచ్చి వీడ్కోలు పలికారు ఆ అమాయక ఆదివాసీ స్త్రీలు.
మా ప్రయణంలో మూడో రోజు, జిందాల్‌ బాక్సైట్‌ తవ్వకాల వల్ల దానికి తీవ్రంగా వ్యతిరేక ఉద్యమం నడిపిన ప్రాంతమైన ఎస్‌.కోటకి వెళ్ళాము. పచ్చని పంటపొలాలని, కొబ్బరి, అరటి, జీడిమామిడి తోటల్ని నరికి బాక్సైట్‌ తవ్వకాలు జరపడానికి ప్రభుత్వం నిశ్చయించింది. అందుకుగాను జిందాల్‌ అనే కార్పోరేట్‌ కంపెనీకి వేలాది ఎకరాల భూమిని కట్టబెట్టాలని చూస్తున్నది. దీనివల్ల వేల ఎకరాల పంటభూములు ధ్వంసమవుతాయి. అటవీ సంపద మీదే ఆధారపడిన అడవిబిడ్డలు జీవనాధారం కోల్పోతారు. విశాఖ, విజయనగరం జిల్లాల పర్యావరణానికి, ప్రజల తాగునీటి అవసరాలకి గండి పడుతుంది. దాన్ని ప్రతిఘటించడానికి గ్రామ పరిసర గ్రామీణ బాధితులంతా కలిసి బాక్సైట్‌ తవ్వకాల వ్యతిరేక కమిటీగా ఏర్పడ్డారు. ఈ ఉద్యమంలో మహిళలదే ప్రముఖ పాత్ర. కాకి దేముడమ్మ, పార్వతి ఈ పోరాటంలో చురుకుగా పనిచేస్తున్నారంటే తక్కువే అవుతుంది. సమస్య పట్ల సరైన అవగాహన, స్పష్టత వాళ్ళలో పుష్కలంగా వున్నాయి. భర్తనుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ ఒక నిక్కచ్చి ఉద్యమకర్తగా, వక్తగా, పోరాటపటిమ వున్న నాయకురాలిగా ఆమె తన్ను తాను మలచుకుంది. దేముడమ్మ, పార్వతి మాట్లాడుతుంటే చప్పట్లతో ప్రశంసించకుండా ఉండలేకపోయం. కాలాలు ఏవైనా భూమికోసం, భుక్తికోసమే కదా పోరాటాలన్నీ – తమ పొలాన్ని ఆక్రమించిన జిందాల్‌ కంపెనీ బోర్డుని ధ్వంసం చేసి తమ స్వంత బోర్డుని పాతుకున్న దేముడమ్మ ఒక గిరిజన మహిళాచైతన్యం.
ఇంత మంచి సామాజిక యాత్రను రూపొందించి, ఎంతో శ్రమించి, ఎన్నో ఏర్పాట్లు చేసి మా యాత్రను సఫలం చేయించిన సత్యవతి గారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపకుండా ఎలా? ఆమె స్నేహశీలత ఎంతగానో ఆకట్టుకుంటుంది. వ్యక్తిగతంగా ఇలాంటి యాత్రలు చేయలేం. ఈ సామూహిక సామాజిక యాత్ర రూపకల్పన సత్యవతి గారి శక్తి సామర్ధ్యాలకి నిదర్శనం.
ఇవన్నీ వింటుంటే నీక్కూడా ఈసారి మాతో రావాలని అన్పిస్తుంది కద మిత్రా! ఈసారి తప్పకుండా వద్దువుగానీ – ఈ యాత్రలో కలసి నడిచిన సీనియర్‌ రచయిత్రులు అబ్బూరి ఛాయదేవి, పి. సత్యవతి, శాంతసుందరి, జానకీబాల, ఘంటశాల నిర్మల, కొండేపూడి నిర్మల, మిగిలిన రచయిత్రులందరినీ గుర్తుచేసుకుంటూట, మరొక్కసారి ‘భూమిక’కు జేజేలు పలుకుతూ…

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో