అపరంజి – అనురాధ నాదెళ్ళ

……. ఆమెని అందరూ ఆడపిల్లంటారు,

ఆమె ఆడపిల్ల కాదు….

ఆమెని అపరంజి అందాం!

తన ఉనికితో, ప్రేమతో, మమతతో,

దయతో, ఓర్పుతో, చిరునవ్వుతో…

అమ్మానాన్నల మనసులనే కాదు

ప్రపంచాన్నంతా వెలిగించే అపరంజి!

 

‘చలా’న్ని చదివే అమ్మ…

అపరంజికి చదువు మాత్రమే

‘జీవితాదర్శ’మని నిత్యమూ చెప్పింది,

నిజం!

అమ్మ నిజంగానే ఒక్కోసారి చిత్రంగా ప్రవర్తిస్తుంది!

పెరట్లో జామపండుని తింటూ

అల్లరి చేస్తున్న చిలుకలని

చూసేందుకేముందంది!

క్రొత్తగా చిగురేసిన మందార మొగ్గని

ఆనక చూడచ్చంది!

వర్షపు చినుకులమధ్య అదాటున

డాబా మీదుగా వాలే ఇంద్రధనుస్సును

మళ్ళీ చూద్దామంది!

వాటన్నింటికీ ముందుముందు బోలెడు సమయముందంది!

ఇన్నేళ్ళూ మరి అమ్మ ఏమి నేర్పింది అంటే…

ఎందరిలాగానో

అమ్మ పాత్రలో నిజాయితీతో ఒదిగి

అపరంజి బాల్యాన్ని క్రమశిక్షీకరించింది!

అది మాత్రం ముఖ్యం కాదా?

నిజమే!

అపరంజికి చదువు నషా

బాగానే ఎక్కింది!

పెద్ద చదువు, పెద్ద కాలేజీ,

క్రొత్త స్నేహాలు, క్రొత్త వాతావరణం….

ఆనందంతో కేరింతలు కొడుతూ అపరంజి!

అమ్మతో కలిసి పుస్తకాలు, బట్టలు,

చిరుతిళ్ళు, పచ్చళ్ళు అన్నీ సర్ది సిద్ధం చేసేసింది!

దిగులు కళ్ళ అమ్మని చూసి

‘నన్ను అత్తారింటికి పంపుతున్నాననుకుంటున్నావా?’ అంటూ వేళాకోళం చేసింది.

పంచుకున్న గదినీ, మంచాన్నీ,

అల్మరనీ, ఆటబొమ్మల్నీ

చెల్లికి అచ్చంగా ఇచ్చేసింది!

నట్టింట్లో ఉయ్యాల బల్లమీద

ఊగే హక్కునీ పూర్తిగా ఇచ్చేసింది!

పాత పేచీలు మర్చిపోయి

చెల్లెల్ని మరీ హత్తుకుంది!

వంటింట్లో అమ్మ వెనుక చేరి

‘కారప్పూస డబ్బా దొర్లించి,

నీ పగటిపూట నిద్రని భంగం చెయ్యనులే’

అంటూ భరోసా ఇచ్చింది.

ఇంతాచేసి రాత్రి అమ్మ పక్కమీదికి చేరి,

‘ఆకలేస్తే ఎంత తినాలో నాకెలా తెలుస్తుందీ’ అంటూ

అమాయకంగా అడిగేసింది!

తెల్లవారి ప్రయాణమైన వేళ

అమ్మ గుమ్మం వెనుకే ఉండిపోయిందెందుకో అనుకుంటూ,

నాన్న చేతిని మరింత భద్రంగా పట్టుకుంది.

గుమ్మం దిగుతూ

మొదటి విడత పరీక్షలైపోతే ఇంటికి రావచ్చని

తనకు తానే ధైర్యం చెప్పుకుంది!

దారిపొడవునా గుండెలో

ఏదో గుబులుగుబులుగా ఉందని మాత్రం అనుకుంది!

”కాలేజీ బావుంది, స్నేహితులు బావున్నారు,

లెక్చరర్లు భలే చెబుతున్నారు,

ల్యాబ్‌, లైబ్రరీలు ఎంతబావున్నాయో!

నా గదీ, నా టేబుల్‌, నా బెడ్‌ అన్నీ నా ఒక్కదానికే!”

ఇన్ని కబుర్లు అప్పుడోటి, అప్పుడోటి

ఫోన్‌లో చెబుతూనే ఉంది, కానీ….

చెప్పనిదేదైనా కూడా ఉందేమో!!

ఉండే ఉంటుంది, చెప్పలేకపోయి ఉంటుంది!

అవును, చెప్పలేకపోయే ఉంటుంది.

అందుకేకదా అకస్మాత్తుగా

అపరంజి మాయమైపోయిందని

కాలేజీనుంచి కబురొచ్చింది!

వూళ్ళో ఎదురుచూస్తున్న అమ్మ, నాన్న, చెల్లి,

ఇంటి గుమ్మం, నట్టింట్లో ఉయ్యాల, పెరట్లో మందారం

అందరూ, అన్నీ

ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు…

ఏమైంది అపరంజి?

ఇప్పుడే వచ్చేస్తానంటూ వెళ్ళింది………..,

తన హాస్టల్‌ గది ఎంతో బావుందని చెప్పి,

అదాటున ఆ ఫ్యానుకెందుకు ముడేసుకుంది?

అసలు నిశ్శబ్దంగా ఉండడం

అపరంజికి నిముషమైనా చేతకాదే!

చదువుకుంటాననే పెద్ద ఆశయాన్ని

ఆ మనసులోంచి ఎవరు, ఎందుకు త్రుంచేసేరు?

పట్టించుకోనక్కర్లేని ఏ ఆకతాయి మాటలో,

పరాభవించేలాటి ఏ వెకిలిచేష్టలో

ఏదో, ఇంకేదో……

ఆ సుతిమెత్తని మనసుని మెలిపెట్టి ఉంటుంది!

తనకు తోడుగా ఉండే ఆత్మ గౌరవానికి

గాయమేదో అయే ఉంటుంది!

అపరంజి ఒక్క క్షణం ఆలోచించలేదు,

భయపెట్టిన వాస్తవాన్ని

నిలబడి ఎదిరించలేదు!

నిర్ణయం మాత్రం తీసేసుకుంది!

ఆ వయసుకు సహజమైన

ఆత్మవిశ్వాసాన్ని అంతలోనే మరిచిపోయింది.

అమ్మ తినిపించిన గోరుముద్దలు

అసలే మర్చిపోయింది!

ప్రాణంలా ప్రేమించే అమ్మకి, నాన్నకి,

పాఠం చెప్పే టీచరుకి కూడా

సమస్య చెప్పుకోలేదు!

చెప్పుకోవాలన్న ఆలోచనని

నేర్పని పెంపకాలు, చదువులు ఎందుకు?

అమ్మలంతా పాపాయిల్ని

అపరంజిలా పెంచుతున్నారు,

అడిగినవన్నీ ఇస్తున్నారు,

అడగనివీ ఇస్తామంటున్నారు!

కానీ, గడపదాటి, కాలు బయట పెట్టేటపుడు

సమస్య వస్తే ఎదుర్కోగల ధైర్యాన్నీ,

పంచుకోగలిగే స్వతంత్రాన్నీ ఇస్తున్నారా?

ఇస్తే,……….నిత్యం మన మధ్య నుంచి

అపరంజిలు అదృశ్యమెలా అవుతున్నారు?

ఆలోచించి చెప్పండి! ప్లీజ్‌…

ప్రపంచానికి సూర్యోదయాల్ని పంచే

లేత జీవితాల మీద

బలవంతపు మరణ శాసనాల్ని రాస్తున్నదెవరు?

(చదువుకుందుకు ఇల్లు వదిలి మళ్ళీ ఇంటికి చేరని అమ్మాయిల స్మృతికి…………………..)

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

One Response to అపరంజి – అనురాధ నాదెళ్ళ

  1. sreedevi says:

    ఎంతొ సున్నితంగా ,వల్లు గగుర్పొదిచెల ఉంది ఈ కవిథ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో