సామ్రాజ్యవాద అంతర్గత సంక్షోభ చిహ్నమే ‘బ్రెగ్జిట్‌’ – పి.ప్రసాదు

ఒకనాటి రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యవాదం నేడు అస్తిరత, అభద్రత, అస్తిత్వ సమస్యలను ఎదుర్కొంటోంది. మార్క్స్‌, ఎంగెల్స్‌ల కాలంలో బ్రిటన్‌ పారిశ్రామిక దేశంగా ఉన్నత స్థాయికి ఎదిగింది. అందుకే అది ఆనాడు ‘ప్రపంచ వర్క్‌ షాప్‌’గా కూడా పేరొందింది. అలాంటి బ్రిటన్‌ తన ప్రపంచ స్థాయి కీర్తి కిరీటాన్ని రెండో ప్రపంచ యుద్ధం ద్వారా కోల్పోయింది. అది ఆ తర్వాత అమెరికాతో జూనియర్‌ భాగస్వామిగా మారిపోయింది. అది తన ప్రపంచాధిపత్య స్థానాన్ని కోల్పోయినా, కనీసం యూరప్‌ ఆధిపత్య స్థానాన్నైనా మిగుల్చుకుంటుందన్న భావన ఉండేది. ఇప్పుడు అది కూడా మిగలలేదు. అలాంటి యూరప్‌ కూటమిలో కూడా అస్థిరత, అభద్రత, అస్థిత్వం అనే సమస్యలు బ్రిటన్‌ను వెంటాడుతున్నాయి. చివరకు ఈయూ కూటమి నుండి కూడా వైదొలగాలన్నంత వరకు వెళ్ళింది. 23.6.2016న బ్రిటిష్‌ ప్రజలు ‘బ్రెగ్జిట్‌’కు అనుకూలంగా ఇచ్చిన తీర్పుతో అదే విషయం వెల్లడైంది.

సుమారు రెండున్నర దశాబ్దాల క్రితం యూరోపియన్‌ యూనియన్‌ స్థాపనకై ప్రయత్నాలు జరిగాయి. అంతకుముందున్న యూరోపియన్‌ ఎకనామిక్‌ యూనియన్‌ (ఈఈసీ)ను యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)గా మార్చాలన్న ప్రయత్నాలవి. అందుకోసం హడావిడిగా మాస్ట్రిచ్‌ ఒప్పందం జరిగింది. ఆనాడు మాస్ట్రిచ్‌ ఒప్పందం గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంత భారీ ప్రచారం జరిగిందో ఈనాడు ‘బ్రెగ్జిట్‌’ గురించి కూడా అంతే భారీ ప్రచారం జరిగింది. కానీ ఈ రెండు విఖ్యాత సంఘటనలు పరస్పర విరుద్ధమైనవి.

ఆనాటి మాస్ట్రిచ్‌ ఒప్పందం అనేక యూరప్‌ దేశాలు ఒకే కూటమిగా ఉండే ఏర్పాటు కోసం కుదుర్చుకున్నది. ఈనాటి బ్రెగ్జిట్‌ ఫలితం నాటి కూటమి నుంచి ఒకే ఒక్క దేశం విడిపోవడానికి ఉద్దేశించింది. స్థూలంగా చెప్పాలంటే పెట్టుబడిదారీ దేశాల మధ్య మాస్ట్రిచ్‌ ఒప్పందం ‘విలీన’ పరిణామం కాగా బ్రెగ్జిట్‌ వాటి మధ్య ‘అలీన’ పరిణామం. నాటి పరిణామం ఏకధ్రువ ప్రపంచంలో జరిగింది. నేటి పరిణామం బహుళ ధ్రువ ప్రపంచంలో జరిగింది. అది ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అంటూ వేరువేరు పెట్టుబడిదారి దేశాలు భావించి కుదుర్చుకున్న ఒప్పందం. ‘విడిపోతే కలదు సుఖం’ అంటూ అవే శక్తులు విడిపోవడానికి నిదర్శనమిది. శ్రమ శక్తిని దేశ దేశాల్లో కొల్లగొట్టడానికి సరిహద్దులను చెరిపివేసే ముందు, తమ పెట్టుబడుల మధ్య కూడా సరిహద్దులుండనక్కర లేదని భావించి కుదుర్చుకున్న ఒప్పందమిది. మూడో ప్రపంచ దేశాల సరిహద్దులను చెరపడంలో తమ మధ్య సరిహద్దులుండి తీరాలని భావిస్తున్న ధోరణితో ఈనాటి బ్రెగ్జిట్‌ తీర్పు వెలువడింది. కూలిన బెర్లిన్‌ గోడ ఆనాటి ఒప్పందానికి స్ఫూర్తినిచ్చింది. శరణార్ధుల వెల్లువను నియంత్రించడానికి నిర్మిస్తున్న ముళ్ళకంచెల వ్యవస్థ ఈనాటి బ్రెగ్జిట్‌ తీర్పుకు స్ఫూర్తినిచ్చింది.

యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ)లో సభ్య దేశంగా కొనసాగడాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవలి సంవత్సరాలలో బ్రిటీష్‌ పౌరులలో నిరసన గళం పెరుగుతూ వచ్చింది. నిజానికి అది ఒక్క బ్రిటన్‌కే పరిమితం కాదు. (ఇంగ్లీషు భాషా ప్రాంతాన్ని ఇంగ్లాండు అంటారు. ఇంగ్లాండు, వేల్స్‌లను కలిపి బ్రిటన్‌ అంటారు. బ్రిటన్‌, స్కాట్లాండులను కలిపి గ్రేట్‌ బ్రిటన్‌ అంటారు. గ్రేట్‌ బ్రిటన్‌తో పాటు ఉత్తర ఐర్లాండు, జిబ్రాల్టర్‌లను కలిపి యునైటెడ్‌ కింగ్‌డమ్‌-యూకే-అని పిలుస్తారు. ఒకవేళ ఈ వ్యాసంలో నేను బ్రిటన్‌ లేదా ఇంగ్లాండు అనే పర్యాయ పదాలను అలవాటు ప్రాయంగా ఉపయోగించవచ్చు. కానీ సాంకేతికంగా యూకేగా పాఠకులు భావించగోరతాను). మరికొన్ని సభ్యదేశాలలో కూడా ఇలాంటి నిరసన వాణి పెరుగుతూ వస్తున్నది. సుమారు మూడేళ్ళ క్రితం రెఫరెండం ద్వారా మరియు సాధారణ ఎన్నికల ఫలితాల ద్వారా గ్రీసు దేశ ప్రజలు కూడా ఈయూ కూటమికి వ్యతిరేకమైన తీర్పునిచ్చారు. అయితే ఆ తర్వాత అది ఈయూ కూటమి చేత నిరంకుశంగా అణచివేతకు గురైంది. పైగా గ్రీసు ప్రజలకు ‘గుణపాఠం’ చెప్పి తిరిగి లేవకుండా చేసింది. అయినా అదొక నిరసన ధోరణిగా వెల్లడవుతూనే ఉంది. ఈసారి గ్రీసు వంటి బలహీనమైన సభ్య రాజ్యం నుంచి కాకుండా, ఈయూ కూటమిలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న బ్రిటన్‌ నుంచి నిరసన వెల్లడైంది. 23-6-2016 న వెలువడ్డ రెఫరెండం ఫలితం దీన్నే వెల్లడించింది.

బ్రిటన్‌లో జరిగిన తాజా రెఫరెండం వెనుక సుదీర్ఘ చరిత్ర ఉంది. అది ఆకాశంలో నుంచి హఠాత్తుగా రాలిపడ్డ ‘రెఫరెండం’ కాదు. ఆరేళ్ళ క్రితం జరిగిన సాధారణ ఎన్నికల నాటికే అదో నిరసన గళంగా ఉనికిలో ఉంది. అప్పుడే ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారంలో దాన్ని కూడా ప్రస్తావించక తప్పలేదు. ఈయూ నుంచి బ్రిటిష్‌ వైదొలిగే లక్ష్యంతో ఏర్పడిన యూకే ఇండిపెండెంట్‌ పార్టీ (యూకేడీ)తో 2010 ఎన్నికల్లో కామెరూన్‌కు చెందిన కన్సర్వేటివ్‌ పార్టీ ఎన్నికల పొతు

కుదుర్చుకుంది. అయితే ఆ తర్వాత ఈయూ కూటమి విధి విధానాలను మరింత ప్రజాస్వామ్యయుతంగా మారుస్తామన్న హామీలిచ్చి చేతులు దులుపుకున్నాయి. తద్వారా ‘ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం)’ను చేపట్టకుండా నివారించగలిగాయి. తిరిగి గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలలో అలా దాటవేత ప్రధాన పార్టీలకు సాధ్యం కాలేదు. అందుకు కారణం బ్రిటీష్‌ పౌర సమాజంలో పెరుగుతున్న నిరసన భావమే. కన్సర్వేటివ్‌ పార్టీ నేత కామెరూన్‌ (మాజీ ప్రధాని) తో సహా ఉభయ పార్టీల నాయకత్వాలు రెండోసారి దాటవేయలేకపోయాయి. తాను ప్రధానిగా ఎన్నికైతే ఈయూ కూటమిలో బ్రిటన్‌ కొనసాగే అంశంమీద రెఫరెండం నిర్వహిస్తానని కన్సర్వేటివ్‌ పార్టీ నేత కామెరూన్‌ ఆనాటి ఎన్నికల్లో నిర్దుష్ట హామీ ఇచ్చారు. ఫలితంగా ఈయూ కూటమి నుంచి బ్రిటన్‌ బైటికి రావాలని కోరుకుంటున్న ప్రజల ఓట్లను కామెరూన్‌ పార్టీ పొందింది. తద్వారా గెలుపొందిన ఆయన ఎన్నికల్లోని తన మాటకు కట్టుబడి 2016 ఫిబ్రవరిలోనే రెఫరెండం ప్రకటన చేశారు. సుమారు నాలుగు నెలల ప్రచారం సాధారణ ఎన్నికల ప్రచారాన్ని మరిపించింది. 1992 తర్వాత అన్ని సాధారణ ఎన్నికల కంటే మించి 72 శాతం పోలింగ్‌ జరిగింది. పైగా భారీ వర్షం మధ్య కూడా ఓటర్లు బారులు తీరినట్లు వార్తలు వెలువడ్డాయి. దీన్ని బట్టి ఈయూ కూటమికి అనుకూల, వ్యతిరేక వర్గాల ప్రజల మధ్య విభజన తీవ్రస్థాయిలో ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.

రెఫరెండం ద్వారా వెల్లడైన ఫలితాలు ఈయూ కూటమి నుంచి వైదొలగడానికే ఆధిక్యతను వెల్లడించాయి. అయితే అవి అనుకూల ప్రజలకంటే వ్యతిరేక ప్రజల సంఖ్య దాదాపు 13 లక్షలతో సామాజికంగా సుమారు నాలుగు శాతం మాత్రమే ఎక్కువగా ఉంది. వ్యతిరేకంగా 1,74,10,742 ఓట్లు లభిస్తే, అనుకూలంగా 1,61,41,241 ఓట్లు లభించాయి. అయితే ఈ ఆధిక్యతను ఇలా సాంకేతిక అంశంగా లెక్కించకూడదు. ప్రధాన మంత్రితో సహా ఉభయ ప్రధాన పార్టీల నాయకత్వాలు ఈయూ కూటమిలో బ్రిటన్‌ కొనసాగాలని కోరుకున్నాయి. ప్రధాన కార్పొరేట్‌ కంపెనీలు, వర్గాలు కూడా అదే బాటలో నడిచాయి. పైగా స్కాట్లండ్‌ ఉత్తర ఐర్లాండ్‌ ప్రజల ధోరణి కూడా అదే! లండన్‌ వాణిజ్య వర్గాలదీ అదే దారి, ప్రధాన మీడియా స్రవంతిదీ అదే దారి, అయినా బ్రెగ్జిట్‌కు ఆధిక్యత లభించింది. ఈ కోణం నుంచి సాపేక్షిక దృష్టిలో పరిశీలించినపుడు బ్రెగ్జిట్‌ ఫలితం యొక్క ప్రాధాన్యత బోధపడు తుంది. ఇందుకు దారి తీసిన పరిస్థితులేంటి?

మొన్నటి ఓటింగ్‌లో 18 నుంచి 24 ఏళ్ళ మధ్య గల బ్రిటీష్‌ యువతలో 76 శాతం మంది ఈయూ కూటమికి అనుకూలంగా ఓటు వేశారు. 25 నుంచి 49 ఏళ్ళ మధ్య గల ప్రజలలో 56 శాతం మంది ఐక్యతకే ఓటు వేశారు. అదే విధంగా 50 ఏళ్ళ వయసులోపు ప్రజలలో దాదాపు మూడింట రెండు వంతుల మంది ఐక్యతకే అనుకూలంగా ఓటు వేశారు. అయినా విడిపోవడానికి ఆధిక్యత ఎలా లభించింది? యువతకంటే 50 నుంచి 64 మధ్య వయసుగల వృద్ధులు రెండు రెట్లు ఎక్కువగానూ, 55 కంటే పై బడ్డ వృద్ధులు మూడు రెట్లు ఎక్కువగానూ, 65 కంటే పై బడ్డ వృద్ధులు మూడు రెట్లు ఎక్కువగానూ విడిపోవడానికి అనుకూలంగా ఓటు వేశారు.

మరో కోణం కూడా ఉంది. కార్మిక వర్గం నివసించే పారిశ్రామిక వాడలు, ప్రాంతాలలో బ్రెగ్జిట్‌కు అత్యధిక ఓట్లు పడ్డాయి. ఉత్తర ఇంగ్లాడు, మిడ్‌ ల్యాండ్స్‌ అందుకొక నిదర్శనం. ముఖ్యంగా సుందర్‌ ల్యాండ్‌, న్యూక్యాపిల్‌లలో అత్యధిక శాతం పోలయ్యాయి. కోస్తా పట్నం బోస్టన్‌లో 77 శాతం ఓట్లు బ్రెగ్జిట్‌కు పోలయ్యాయి. తూర్పు యూరప్‌ దేశాల నుంచి పొట్ట చేతపట్టుకుని వచ్చిన వలస కూలీల సంఖ్య బోస్టన్‌ టౌన్‌లో ఎక్కువగా ఉంది. వారికి ఓటు హక్కు లేదు. కానీ వాళ్ళు చౌక కూలీలు కావడంతో స్థానిక కార్మికుల జీతాల తగ్గుదల లేదా నిరుద్యోగానికి గురవుతున్నారు. ఫలితంగానే స్థానికుల నిరసన బ్రెగ్జిట్‌కు అనుకూలంగా మారిందన్న విశ్లేషణలున్నాయి.

అమెరికా ఏకధ్రువ అగ్రరాజ్యంగా ఏర్పడ్డ కాలంలో యూరప్‌ ఖండం అస్తిత్వం చిక్కుల్లో పడింది. ఒకవైపు అమెరికా సాగించిన దురాక్రమణ యుద్ధాలలో భాగస్వామ్యం వహిస్తూనే, మరోవైపు అమెరికాకు వ్యతిరేక వాణిజ్య యుద్ధాలను కూడా యూరప్‌ దేశాలు ప్రచ్ఛన్నంగా కొనసాగిస్తూ వచ్చాయి. 1990వ దశకంలో బీఫ్‌ వార్‌, బనానావార్‌, స్టీల్‌ వార్‌ వంటి వాణిజ్య యుద్ధాలు క్రమంగా అమెరికా, ఈయూ కూటమి మధ్య వైరుధ్యాలను పెంచుతూ పోయాయి. బ్రెజిల్‌, వెనెజులా, అర్జెంటీనా, చిలీ, బొలీవియా వంటి దేశాల్లో అమెరికా వ్యతిరేక ప్రభుత్వాల ఏర్పాటు కూడా ఈయూ కూటమికి బలాన్నిచ్చింది. ప్రపంచ వాణిజ్యంలో డాలర్‌ వర్సెస్‌ యూరో అన్న భావన పెరిగింది. నాటోకు బదులుగా ఈయూ కూటమి ఆధిపత్యంలో స్వతంత్ర సైన్యం ఏర్పాటు ప్రతిపాదన వరకూ వెళ్ళింది. ఈ ప్రక్రియలో ఈయూ కూటమికి జర్మనీ, ఫ్రాన్స్‌లు చోదక పాత్ర వహిస్తూ వచ్చాయి. ఒకవైపు ఆంగ్లో అమెరికన్‌ కూటమిలో అమెరికాతో వ్యూహాత్మక జూనియర్‌ భాగస్వామిగా, మరోవైపు అమెరికాకి సమాంతర శక్తిగా ఎదుగుతున్న ఈయూ కూటమి సభ్య రాజ్యంగా ఏకకాలంలో కొనసాగాల్సి రావడం బ్రిటన్‌కు ఇబ్బందికరమైంది. ఈ నేపథ్య పరిస్థితుల నుంచే బ్రెగ్జిట్‌ ఫలితాలను పరిశీలించవలసి ఉంది.

ఒకవైపు పోర్చుగల్‌, ఐర్లాండ్‌, గ్రీస్‌, స్పెయిన్‌ (పిగ్స్‌ దేశాలు) వంటి రుణగ్రస్థ దేశాలమీద ఈయూ కూటమి జులుం చెలాయిస్తోంది. ఈ రుణగ్రస్థ దేశాలు కూడా ఈయూ కూటమి సభ్య దేశాలే. అదే కూటమిలోని రుణదాత దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి సంపన్న రాజ్యాల నిరంకుశత్వం పెరుగుతూ ఉంది. క్రమేణా ఈయూ కూటమి కళ్ళెం జర్మనీ చేతుల్లోకి వెళ్తోంది. బెర్లిన్‌ గోడ

పతనానంతరం ఉభయ జర్మనీల విలీనంతో జర్మనీ ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందింది. గత రెండు ప్రపంచ యుద్ధాలలో జర్మనీతో యుద్ధం చేసిన గత నేపథ్యం బ్రిటన్‌కు ఉంది. బ్రిటీష్‌ పౌర సమాజంలో జర్మనీ పట్ల సాంప్రదాయ వ్యతిరేకాభిప్రాయం ఉంది. ఈ కారణంగానే పాత తరం వృద్ధులలో బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటింగ్‌ ఎక్కువ శాతం జరిగి ఉండొచ్చన్న వార్తలు వెలువడుతున్నాయి. అయితే ‘బ్రిటీష్‌ పెట్టుబడి’ కూడా ఈయూ కూటమిలో అస్తిత్వ సమస్యను ఎదుర్కొంటోంది. బ్రిటీష్‌ పెట్టుబడిలో ఒక ప్రధాన భాగం ఈయూ కూటమిలో లాభాలు గడిస్తుండగా, మరో భాగానికి అవకాశాలు రావడంలేదు. ముఖ్యంగా జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాల పెట్టుబడులకు అధికావకాశాలు ఈయూ కూటమిలో లభిస్తుండడంతో, బ్రిటీష్‌ పెట్టుబడిలో ఒక భాగం వెనుక సీటులోకి జారిపోతున్నది. ఇలాంటి అవకాశాలు చేజారుతున్న ఒక విభాగం పెట్టుబడి కూడా బ్రిటీష్‌ పౌర సమాజంలోని అసంతృప్తిని ప్రోత్సహిస్తోంది. ఒకనాటి రవి అస్తమించని తన సామ్రాజ్య వైభవాన్ని పునరుద్ధరించుకుందామంటూ అది ప్రజలలో జాతీయోన్మాదాన్ని రెచ్చగొడుతోంది. జర్మనీ, ఫ్రాన్స్‌ల కంటే హీన స్థానాన్ని తమ బ్రిటన్‌కు కల్పిస్తున్న ఈయూ కూటమిలో ఎందుకు కొనసాగాలని ప్రశ్నిస్తోంది. విడిపోయి స్వతంత్ర దేశంగా తమ ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దుకోవాలని భావించింది. ఈ నేపథ్యం నుంచి బ్రెగ్జిట్‌ ఫలితాలను పరిశీలించాలి.

పీత బాధ పీతదైతే, చేప బాధ చేపదట. పెట్టుబడి బాధ పెట్టుబడిది కాగా శ్రమ శక్తి బాధ శ్రమ శక్తిది అయింది. నిజానికి బ్రిటన్‌ పారిశ్రామిక పెట్టుబడిదారీ దేశంగా తన అగ్రస్థానాన్ని ఇంతకు ముందే కోల్పోయింది. అక్కడ పారిశ్రామిక పెట్టుబడి భాగం తగ్గి, చట్టా వ్యాపార ద్రవ్య పెట్టుబడి బాగా పెరిగిపోయింది. పారిశ్రామిక ఉత్పాదక రంగం తగ్గినా, సేవారంగం బాగా పెరిగింది. వివిధ కార్మిక వృత్తులు ముందుకొచ్చాయి. ఈయూ కూటమి నిబంధనల ప్రకారం శరణార్ధులైన విదేశీ వలస కూలీలను అన్ని సభ్య దేశాలూ అనుమతించాలి. ఇది వ్యవస్థీకృత యూరప్‌ పెట్టుబడులకు లాభదాయకమైనది. కారు చౌకగా శ్రామికుల లభ్యత వల్ల ఆయా కార్పొరేట్‌, పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు వలస కూలీల నియామకాలను చేపడుతున్నాయి. ఈయూ కూటమిలో సభ్య రాజ్యంగా చేరే నాటికి బ్రిటన్‌లో విదేశీ వలస కార్మికుల సంఖ్య 38 లక్షలు ఉండేది. 2014 నాటికి 85 లక్షలకు పెరిగింది. నేడు ఆ సంఖ్య సుమారు కోటికి చేరింది. అదే సమయంలో ఎక్కువ జీతాలు పొందే స్థానిక కార్మికుల ఉద్యోగ భద్రత దెబ్బతింది. పైగా నిరుద్యోగం పెరిగింది. అందుకే పేద, నిరుపేద శ్రామిక వర్గాలు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఉన్నారు.

బ్రెగ్జిట్‌ ఫలితం అనంతరం ప్రధాని కామెరూన్‌ రాజీనామా ఇచ్చేశారు. అదే కన్సర్వేటివ్‌ పార్టీ బ్రెగ్జిట్‌కు అనుకూలురైన పార్టీ నేతను ఒకరిని తన స్థానంలో కొత్త ప్రధానిగా ఎన్నుకోవాలని ప్రతిపాదించారు. బ్రెగ్జిట్‌కు అనుకూలురు నూతన ప్రధానిగా పదవీ స్వీకారం తర్వాత ఈయూ కూటమి నుంచి విడిపోయే ప్రక్రియను చేపడతారని కూడా కామెరూన్‌ ప్రకటించారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు రెండేళ్ళ కాలం పట్టవచ్చు. ఈ నేపధ్యంలో నూతన ప్రధానిగా థెరిస్సా మే ఎన్నికయ్యారు.

గతంలో గ్రీసు ప్రజలిచ్చిన తీర్పును ఈయూ కూటమి బ్లాక్‌ మెయిల్‌ విధానంలో వమ్ము చేసింది. నేడు కూడా అలాంటి బ్లాక్‌మెయిల్‌ విధానాన్ని అవి చేపట్టవచ్చు. రెఫరెండం ప్రచార సమయంలో బ్రెక్జిట్‌ గెలుపొందితే బ్రిటీష్‌ ప్రజలు నష్టపోవాల్సి వస్తుందన్న బెదిరింపులు వివిధ రూపాల్లో సాగాయి. బ్రెగ్జిట్‌ ఫలితం వెలువడ్డాక బ్రిటీష్‌ స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. ఒక్క అమెరికా డాలరు తప్ప మిగిలిన ప్రధాన దేశాల కరెన్సీలన్నింటి మారకపు విలువలు పడిపోయాయి. అన్నింటికంటే బ్రిటీష్‌ కరెన్సీ విలువ ఎక్కువ పతనమైంది. ముఖ్యంగా డాలరుకు బ్రిటీష్‌ పౌండు మారక విలువ 31 ఏళ్ళ కనిష్ట స్థాయికి పడిపోయింది. మూడు దశాబ్దాలుగా నిర్మించుకున్న విలువ పేక మేడలాగా పతనం చెందింది. మరోవైపు ‘యూనిటీవాద’ కంపెనీలు, కార్పొరేట్‌ శక్తులు మరో రెఫరెండం జరిపించాలని ప్రజలను రోడ్డుమీదికి తెచ్చాయి. ఇప్పుడిచ్చిన తీర్పును కాలరాయ చూస్తున్నాయి. ఇంకోవైపు స్కాట్లాండ్‌, ఉత్తర ఐర్లాండుల స్వాతంత్రోద్యమాలను ప్రేరేపిస్తున్నాయి. తిరిగి వాటి బూచితో సమైక్య దేశానికి ముప్పు ఏర్పడిందన్న భయాన్ని పౌర సమాజంలో సృష్టించే ప్రయత్నం వ్యూహాత్మకంగా కొనసాగుతోంది. అంతేకాకుండా ఈయూ కూటమి ఉంచి వేరుపడితే ప్రజలు ఫలానా సౌకర్యాలను కోల్పోతారంటూ మీడియా ద్వారా ఒక పథకం ప్రకారం ప్రచారం సాగుతోంది. ఇదంతా బ్లాక్‌మెయిల్‌ విధానమే.

2016లో అమెరికా జి.డి.పి. 19.96 ట్రిలియన్‌ డాలర్లుంది. ఈయూ కూటమి జి.డి.పి. 18.50 ట్రిలియన్‌ డాలర్లు ఉంది. అమెరికా జనాభా 30 కోట్లకు పైగా ఉంది. ఈయూ కూటమి జనాభా 50 కోట్లు దాటింది. ఒక్క అమెరికా ఆర్థిక వ్యవస్థ 28 యూరప్‌ దేశాల ఆర్థిక వ్యవస్థ కంటే మించి ఉంది. కానీ మరో కోణం నుంచి చూస్తే, ఈయూ కూటమి ఏర్పడ్డ ఫలితంగా ప్రపంచ వాణిజ్యంలో యూరోకు కూడా ప్రాధాన్యత పెరిగింది. ఫలితంగా అది తన ఉమ్మడి ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరచుకుని అమెరికా ఆర్థిక వ్యవస్థతో దాదాపు సరిసమాన స్థాయికి పెంచుకోగలిగింది. బ్రెగ్జిట్‌ ఫలితం వల్ల ఒకవేళ బ్రిటన్‌ విడిపోయిందనుకుందాం. ఉమ్మడి జి.డి.పి. 18.50 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 2016 లోని బ్రిటన్‌ జి.డి.పి. 3.15 ట్రిలియన్‌ డాలర్ల మొత్తం తగ్గిపోతుంది. అంటే కేవలం 15 ట్రిలియన్‌ డాలర్ల

ఆర్థిక వ్యవస్థగా ఈయూ కూటమి మిగిలిపోవాల్సి వస్తుంది. అమెరికాతో పోటీపడే ప్రచ్ఛన్న లక్ష్యం గల ఈయూ కూటమి ఆశలూ, అంచనాలూ దెబ్బతీయవచ్చు.

బ్రిటన్‌లో బ్రెగ్జిట్‌ ఫలితం ఫ్రాన్స్‌, స్పెయిన్‌, స్వీడన్‌ వంటి దేశాలలో కూడా అలాంటి రెఫరెండంలకు అవకాశాలనిస్తున్నది. ముఖ్యంగా ఈయూ కూటమిలో జర్మనీ ఆధిపత్యం చాలా సభ్య దేశాలకి అస్థిత్వ సమస్యను సృష్టిస్తోంది. ఆయా సభ్య దేశాలకు చెందిన కార్పొరేట్‌ సంస్థల లాభాలకు జర్మనీ కార్పొరేట్‌ సంస్థలు ఏ మేరకు ఆటంకంగా ఉన్నాయో, ఆ మేరకు అవి అసంతృప్తికి గురవుతున్నాయి. ఆ మేరకు ఆయా దేశాలలో కూడా రెఫరెండం డిమాండ్లు ముందుకొచ్చే అవకాశాలుంటాయి.

గతంలో గ్రీసు దేశంతో నేటి బ్రిటన్‌ను పోల్చలేం. గ్రీసు బడుగు దేశం. బ్రిటన్‌ అలాంటిది కాదు. ఈయూ కూటమిలో రెండవ అతిపెద్ద జి.డి.పి. గల దేశంగా బ్రిటన్‌కు ప్రత్యేక స్థానముంది. బెదిరిస్తే బెదిరిపోయేంత పరిస్థితి బ్రిటన్‌కు లేదు. 130 కోట్ల జనాభా గల భారతదేశం జి.డి.పి. (రెండు ట్రిలియన్‌ డాలర్లు) కంటే, ఆరేడు కోట్ల జనాభా గల బ్రిటన్‌ జి.డి.పి. (3.15 ట్రిలియన్‌ డాలర్లు) ఒకటిన్నర రెట్లకంటే ఒకింత ఎక్కువగానే ఉంది. బ్రిటన్‌ భౌగోళికంగా, జనాభా రీత్యా చిన్న దేశమే కావచ్చు. కానీ అది సంపన్న రాజ్యం. పైగా ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యావకాశాలున్న దేశం. అందుకే గ్రీస్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేసినంత తేలికగా బ్రిటన్‌ను చేయలేరు. ఒకవేళ బ్రెగ్జిట్‌తో ఈయూ కూటమి దేశాలు ‘ప్రజాస్వామిక’ సంస్కరణలను చేపట్టడం ద్వారా జర్మనీ ఆధిపత్యాన్ని కొంతవరకు నిలువరించవచ్చు. అసమ్మతిని ప్రదర్శిస్తున్న బ్రిటీష్‌ పెట్టుబడిలోని ఒక విభాగాన్ని సంతృప్తి పరచవచ్చు. అప్పుడు బ్రెగ్జిట్‌ తీర్పునకు కాలదోషం పట్టవచ్చు. లేదా స్కాటిష్‌, ఐరిష్‌ వేర్పాటు ఉద్యమాల భయంతో బ్రిటన్‌ను సమైక్య దేశంగా ఉంచాలన్న జాతీయోన్మాదంతో కూడా బ్రెగ్జిట్‌కు స్వస్తి చెప్పవచ్చు. ఇవేవీ జరక్కపోతే, నియో నాజీయిస్టు పంథాను కూడా చేపట్టవచ్చు. మొన్నటి ప్రచారంలో నాజీ భావజాలంతో బ్రెగ్జిట్‌ అనుకూల శక్తుల ప్రచారం సాగిందన్న వార్తలున్నాయి. మొన్నటి రెఫరెండమ్‌ ప్రచారంలో సుమారు 800 జాత్యహంకార హింసాత్మక సంఘటనలు జరగడం గమనార్హం. సంక్షోభాల నుంచి తలెత్తే అస్థిరత, అభద్రత, అస్తిత్వం వంటి సందర్భాలే నాజీయిజం పెరుగుదలకు ప్రాతిపదిక అవుతుంది. పేదరికం, నిరుద్యోగాలే నాజీయిస్టు శక్తులకు అస్త్రాలుగా మారతాయి. ప్రస్తుతం బ్రిటన్‌ ఎదుట ఈ రెండు మార్గాలున్నాయి. ఎటు పయనిస్తుందో భవిష్యత్తుకే వదలాలి. ఏది ఏమైనా బ్లాక్‌ మెయిల్‌ చర్యలతో మాత్రం గ్రీసు వలె బ్రిటన్‌ బ్రెగ్జిట్‌కు స్వస్తి పలకకపోవచ్చు.

బ్రెగ్జిట్‌ ఫలితాలు బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థకే పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను కుదిపివేశాయి. ఈయూ సభ్య దేశాలతోపాటు చైనా, జపాన్‌ మార్కెట్లు కూడా దెబ్బతిన్నాయి. భారత్‌ ఆర్థిక వ్యవస్థ చెక్కుచెదరదని మోడీ నుంచి రఘురామ్‌ రాజన్‌ వరకు భరోసా ఇచ్చారు. ఒక్క ఫలితాల రోజే ఒక లక్షా 80 వేల కోట్ల రూపాయల సట్టా వ్యాపార సంపద ఆవిరైపోయింది. బ్రిటన్‌లో వందలాది భారతీయ కంపెనీలున్నాయి. ఈ రెండు దేశాల మధ్య 14 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం ఉంది. అందుకే నష్టాలు నివారించలేనివి.

ఏది ఏమైనా ఒకటి వాస్తవం. పెట్టుబడిదారీ వ్యవస్థ అంతర్గత సంక్షోభానికి నిదర్శనమిది. సరిగ్గా వందేళ్ళ క్రితం ‘సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశ’ అనే గ్రంథాన్ని లెనిన్‌ రచించారు. ఈ గ్రంథానికి 2.7.2016వ తేదీకి సరిగ్గా నూరేళ్ళు పూర్తయింది. అందులో లెనిన్‌ సామ్రాజ్యవాదం మీద విశ్లేషణ చేసిన నేపథ్యం నుంచి ఈనాటి పరిణామాలను పరిశీలించాలి. పేద, నిరుపేద దేశాల ఆర్థిక వ్యవస్థలను బందిపోటు ముఠాలుగా ఏర్పడి ఉమ్మడిగా కొల్లగొట్టే లక్ష్యంతో ఈయూ కూటమి ఏర్పడింది. నూరేళ్ళ క్రితమే మహా యూరప్‌ సంయుక్త కూటమి ప్రతిపాదన గురించి లెనిన్‌ చేసిన భాష్యమిది. ఇరాక్‌, ఆఫ్ఘనిస్థాన్‌, లిబియా, సిరియా వంటి దేశాలను వీళ్ళు దురాక్రమించడం లేదా దండయాత్రలు జరపడం తెలిసిందే. తమ స్వంత యూరప్‌లోని స్వతంత్య్ర దేశం యుగోస్లేవియాను కూడా మిగలనివ్వలేదు. దాన్ని ఆరు దేశాలుగా ముక్కలు చేసిన దుష్టచరిత్ర అమెరికా, యూరప్‌ కూటమిలకు ఉంది. అయితే దురాక్రమించ బడ్డ దేశాల ప్రజల వీరోచిత సాయుధ ప్రతిఘటనలు ఇలాంటి బందిపోటు ముఠాల అంచనాలకు పరిమితులను విధిస్తున్నాయి. ఫలితంగా వాళ్ళ ముందస్తు అంచనాల ప్రకారం అవి ముందుకు పోలేకపోతున్నాయి. దీంతో బందిపోటు ముఠాల మధ్య పంపిణీలో అంతఃకలహాలు పెరుగుతున్నాయి. ఫలితంగానే ఈయూ కూటమి సభ్య రాజ్యాల మధ్య వైరుధ్యాలు పెరుగుతున్నాయి. గ్రీసుది మనుగడకై ఆరాటం! బ్రిటన్‌ది ఆధిపత్యంకై ఆరాటం. రెండూ ఒకటి కాదు. బ్రిటీష్‌ ‘అసమ్మతి పెట్టుబడి’ లక్ష్యం వేరు! బ్రిటీష్‌ పేద ప్రజల ఆకాంక్ష వేరు. ఇందులో ఎవరు ఎవరిని శాసిస్తారో భావి చరిత్రే తేల్చాలి. రేపటి చరిత్ర గమనంకై వేచి చూద్దాం!

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.