జైళ్ళ సంస్కరణ – ఒక ఆవశ్యకత – పి.ఎ. దేవి

ప్రపంచ వ్యాప్తంగా జైలు జనాభా 2/3 వంతులు పెరిగింది. దక్షిణాసియా దేశాల్లో 87శాతం పెరిగింది. ఇదింకా వేగంగా పెరిగే సూచనలు ఉన్నాయి.

జైలులోకి చేరినవారంతా నేరస్థులా? వారే రకమైన నేరాలు చేసి జైలుకి వచ్చారు? వారిలో శిక్షలు పడినవారు ఎంతమంది? విచారణలో ఉన్నవారు ఎంతమంది? కేసులు నడుస్తున్నవారు ఎంతమంది? వీరిలో అత్యధికులు పేదలు, నిరక్షరాస్యులు, వెనుకబడిన, దళిత, ఆదివాసీలుగా ఎందుకున్నారు? శతాబ్దాలుగా వెలివేతకు, అణచివేతకు గురయినవారు నేరాలకు పాల్పడుతున్నారా?

ఇవన్నీ సభ్యసమాజం అడగాల్సిన ప్రశ్నలు. కానీ జైలు అనగానే ఉలిక్కిపడతారు ‘మర్యాదస్తులు’. జైలుకి వెళ్ళారు అనగానే వారిని సమాజం వెలివేస్తుంది. అయితే డబ్బు, అధికారం చేతిలో ఉన్నవారు జైలుకి వెళ్ళారనే వాస్తవం తెలిసినా వారిపట్ల మర్యాదగానే వ్యవహరిస్తుంది. నేరాలు చేసి చట్టాన్ని ఉల్లంఘించిన ఈ జైలు పక్షుల గురించి అసలు మాట్లాడవలసిన అవసరం ఏముంది? వారు నేరం చేశారు కనుక అనుభవిస్తున్నారు, అనుభవించాల్సిందే అనే నైతిక శిష్టవాదులున్నారు. అసలు నేరం చేశాక వారిని జైల్లో పెట్టి మేపడం ఏమిటి? కాలో, చెయ్యో, తలకాయో తీసేస్తే నేరాలూ తగ్గుతాయి, ఖర్చులూ ఉండవు అని వాదించే ‘దయామయులూ’ ఉన్నారు. నేరం లేకుండా చేయాలంటే నేర కారణంతో పనిలేదు, నేరాలన్నింటికీ కఠినాతి కఠిన శిక్షలు వేయాలి అనే బుద్ధి జీవులున్నారు.

సరే ఎవరేమన్నా సామాజిక శాస్త్రం ప్రకారం సమాజం మారుతున్న కొద్దీ ‘ఏది నేరం’ అనేది కూడా మారుతుంది. స్త్రీని చంపడం నిష్కృతి లేని నేరం అన్న సమాజం స్త్రీని భర్త చంపొచ్చు, భర్తతోపాటు స్త్రీని చితిమీద వేసి కాల్చి చంపేయొచ్చు అనే సమాజానికి మారింది. మళ్ళీ అలా చంపితే ఆ చంపిన వారు హంతకులవుతారంది ఆధునిక చట్టం. చట్టం మాటెలా ఉన్నా స్త్రీలని ఎలా అయినా, ఎక్కడైనా చంపడం మగవాడి హక్కని లోలోన నమ్ముతున్న సమాజం మనది.

అదలా ఉంచితే ఆధునిక చట్టాల ప్రకారం నేరం నిరూపించ బడిన సందర్భంలో ఆయా నేరాల తీవ్రతని, స్వభావాన్ని బట్టి వివిధ దేశాల్లో ఆయా దేశాల చట్టాల ప్రకారం వివిధ రకాల శిక్షలు అమలు చేస్తున్నారు. క్రైస్తవంలో పాపము-పశ్చాత్తాపము అనే దాని ఆధారంగా జైలు ఏర్పడింది. నేరంలేని సమాజం నుండి నేరాల తీవ్రత సమాజాన్ని శాసించే దశకి చేరాక అందర్నీ చంపేయడం లేదా అంగాలు తొలగించడం వంటి శిక్షలు నేరాలను తగ్గించవని నిరూపితమయ్యాక నేరస్థులకు సంస్క రించబడే అవకాశం ఇవ్వడానికి ఏర్పడినవే జైళ్ళు. ఒంటరితనంలో స్వేచ్ఛను కోల్పోయి, చేసిన నేరం గురించి ఆలోచించి బాధపడడంద్వారా శిక్షను అనుభవించి, మారి, తిరిగి సమాజంలో కలవడం అనేది జైలు పరమార్థం. కనుకనే జైలులో ఆహారం, వసతి, కనీస సదుపాయాలు ఉండాలి. అంటే స్వేచ్ఛను కోల్పోవడం, సమాజం నుండి దూరం చేయడమే మనిషికి శిక్ష. జైలులో చిత్ర హింసలు పెట్టడం, తిండి లేకుండా మాడ్చడం, లైంగిక హింస, కనీస సదుపాయాలు లేక జబ్బు పడడం వంటివి శిక్షలో భాగం కాదు. నేరానికి మూలం సమాజంలో ఉంది కనుక ఆ మూలాన్ని తొలగిం చలేని సమాజం నేరం చేసిన వారికి బాగుపడే అవకాశం ఇస్తుంది. ఆ కాలంలో వారి సంరక్షణా బాధ్యతను సమాజం అంటే ప్రభుత్వం చూడాలి. కానీ మన జైళ్ళు ఎలా ఉంటున్నాయి? ఏం ఫలితాలు సాధిస్తున్నాయి?

జైళ్ళన్నీ వాటి శక్తికి మించి నిండిపోతున్నాయి. అంటే వంద మందికి మాత్రమే వసతి కల్పించగల జైలులో వందల మందిని కుక్కుతున్నారు. నేరాలు పెరిగినంత వేగంగా జైలు వసతి పెరగడం లేదు. భారతదేశపు జైళ్ళలో ఉండాల్సిన దానికన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువగా నిండి ఉన్నాయి. కొన్ని జైళ్ళలో రెండు రెట్లు అధికంగా కూడా ఉన్నారు. జైలు గదులు, మరుగు దొడ్లు, బట్టలు మొదలైన వాటిని సరైన నిష్పత్తిలో పెంచడం లేదు. జైలు గార్డుల పరిస్థితి ఖైదీల కంటే భిన్నంగా ఉండదు. సరైన శిక్షణ లేకుండా అతి తక్కువ జీతాలతో ఎక్కువ పనిగంటలు పనిచేసే జైలు గార్డులు అతి కొద్దికాలంలోనే యాంత్రికంగా తయారవుతారు. మానవత్వంతో వ్యవహరించాలనే సున్నితత్వం ఉండదు. దానికి తోడు పనిష్మెంట్‌ ఇవ్వాలనుకునే పోలీసులకు జైలు డ్యూటీలు వేస్తారు. ఆ నిస్పృహ, కక్ష కూడా ఇక్కడ పనిచేస్తుంది. నేరస్థులు కాబట్టి వారిని మునుషులుగా చూడనక్కర్లేదనే భావన కూడా వీరిలో బలంగా ఉంటుంది. ఇక అవినీతి చెప్పనవసరం లేదు.

శిక్ష పడిన వారిలో అధికులు మొదటిసారి చేసినవారే ఎక్కువ. వాదించడానికి లాయర్లకు డబ్బు ఇవ్వలేని వారు, పోలీసులకు తేలికగా చిక్కి ప్రశ్నించలేని నిస్సహాయులు కూడా అధికమే. వీరు జైలుకి చేరాక అక్కడ రకరకాల హింసలు ఉంటాయి. అసలు బర్బరత తప్ప ఏ చట్టం పనిచేయని ప్రదేశాలు జైళ్ళు. వేధింపులు, హింస, లైంగిక హింస, అవినీతి సర్వసాధారణం. సరైన గాలి వెలుతురు, పరిశుభ్రత, మెసిలేందుకు కనీసపు జాగా (అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జైలులో ప్రతి వ్యక్తికి కనీసం 4 చదరపు మీటర్ల జాగా ఉండాలి) లేకపోవడం అతి మామూలు. రోగాల బారిన పడడం జైలు జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. 90 శాతం క్షయ, 60 శాతం ఎయిడ్స్‌ అంటుకుంటున్నాయి. దానికి వైద్యం చేయించడం చాలా అరుదు. అంటే మామూలు నేరానికి కూడా జైలు పరిస్థితుల వల్ల మరలా శిక్షగా మారుతుందన్న మాట.

జైలులో నేరస్థ ముఠాలు, వాటిమధ్య కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి. జైలు సిబ్బంది ఏదో ఒక ముఠాతో ఉంటారు. ఈ ముఠాలు వాటి వాటి శక్తిని బట్టి సదుపాయాలు అదనంగా పొందుతాయి. ఈ ముఠాల బారినుంచి తప్పించుకోవడానికి సాధారణ ఖైదీలకు సాధ్యం కాదు. లొంగిపోవడం, భరించడం, ఫిర్యాదు చేయకుండా ఉండడం తప్ప వారికి మరో దారి లేదు. మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతూనే ఉంటుంది. సిగరెట్లు, బీడీలే కాదు డబ్బు ఉంటే సెల్‌ఫోన్లు కూడా లభిస్తాయి. ఇక్కడ వివిధ ముఠాలు వారి వారి ముఠాల్లోకి కొత్తవారిని రిక్రూట్‌ చేసుకుంటారు. వారికి ప్రాథమిక శిక్షణ ఇచ్చుకుంటారు. వ్యభిచార ముఠాలు ఇక్కడ రిక్రూట్‌ చేసుకుంటాయి. తరచుగా వచ్చిపోయే చిల్లర నేరస్థులు సమాచార వస్తు వాహకులుగా ఉపయోగపడతారు.

జైలు సిబ్బంది తమ అవసరాలకు ఖైదీలను గూఢచారు లుగా వాడుకుంటారు. వారెవరో కరడుగట్టిన నేరస్థులకు తెలిస్తే వారి పని అంతే. జైలులో మరణాలు మామూలే. రోగాల వల్ల, కొట్లాటల వల్ల, గాయాల వల్లనే కాక ఆత్మహత్యలు కూడా జరుగుతుంటాయి. ఈ మరణాలపై పెద్ద గొడవ ఏమీ జరగదు. షరా మామూలు విచారణతో ఫైలు మూత పడుతుంది. నేరస్థుల చావుకి కూడా పెద్ద తతంగమా అనే ధోరణి ఇక్కడ ఆమెదయోగ్యం. దీనికి తోడు జైలు సిబ్బంది ఖైదీలపై కాల్పులు జరపడం వల్ల కూడా మరణాలు సంభవించడం అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది.

అమెరికాతో సహా అత్యధిక నేరాలు జరిగే దేశాలు జైళ్ళను ప్రైవేటీకరించాయి. కార్పొరేట్‌ రంగం ‘జైళ్ళ’ పరిశ్రమలో భారీగా ప్రవేశించింది. దాంతో అతి తక్కువ ఖర్చుతో జైళ్ళ నిర్వహణ అనే అంశం అందరికీ నచ్చింది. అంటే ఖైదీలను అమానుష పరిస్థితుల్లో ఉంచడం అన్నమాట. ప్రైవేటు సిపాయిల కాపలాతో ఇవి నడుస్తాయి. ప్రభుత్వ వ్యయం తగ్గుతుంది. టెండర్లు పిలిచి కాంట్రాక్టుకి ఇచ్చేస్తారు.

ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే జైళ్ళే నేరస్థుల ఉత్పత్తి కేంద్రాలుగా తయారవుతున్నాయని పలు హక్కుల సంఘాలు ఆందోళన పడుతుంటే ఇప్పుడు ప్రైవేటు జైళ్ళు వచ్చాయి. ఇవి మన దేశంలో కూడా రావచ్చు. ఇప్పటికే అమెరికాలో కొన్ని ప్రైవేటు జైళ్ళు నరకకూపాలుగా మారడంతో ఖైదీలు తిరగబడితే వారిపై కాల్పులు, భారీ ప్రాణ నష్టం జరిగింది. జైళ్ళలో ఖైదీల తిరుగుబాట్లు తరచుగా జరుగుతున్నాయి. అయితే వాటిని పాశవికంగా అణచివేస్తున్నారు.

అంటే న్యాయ దృక్పథం ప్రకారం చేసిన నేరానికి శిక్ష అను భవిస్తూ సంస్కరించబడి బైటికి రావాల్సిన వ్యక్తులు కరడు గట్టిన నేరస్థులుగా మారడానికి జైలు పరిస్థితులు కారణమవు తున్నాయన్న మాట.

కాబట్టి న్యాయం చేయడం అంటే ఏమిటి? శిక్ష వేయడంవల్ల ఏమి ఆశిస్తున్నాం? ఏం ఫలితం వస్తోంది? అనే అంశాల పై లోతుగా ఆలోచించవలసిన అవసరం ఏర్పడింది. జైలు వ్యవస్థను ఆధునికీకరిం చడమూ, మానవీకరించడమూ ఒకే కాలంలో జరగాలి. జైలును సంస్కరించకుండా ఖైదీలను సంస్కరించలేం.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.