చూపులందు ‘మగచూపు’ వేరయా – ల.లి.త

“There is always shame in the creation of an object for the public gaze”
– Rachel Cusk.

చూపులు వెంటాడతాయి… చూపులు తడుముతాయి… చూపులు గుచ్చుకుంటాయి…మగచూపుల తాకిడి… వయసు వచ్చినప్పటినుంచి ఇంటి బైట అడుగుపెట్టిన ప్రతి ఆడపిల్లకీ తప్పదు. ఆ చూపులు ఆరాధిస్తున్నట్లు కనిపిస్తే గర్వంగా, వొట్టి కామం కనిపిస్తే అసహ్యంగా అనిపించడం కూడా జెట్‌ స్పీడ్‌లో జరిగిపోతూ

ఉంటుంది. ఏ రకం చూపులెలాంటి వొంకరలు పోతున్నాయో అప్రయత్నంగా తెలిసిపోతుంది ఆడవాళ్ళకి. చూపులు ముసుగులు వేసుకున్నా కొంచెంసేపట్లోనే ఆ ముసుగుల వెనుక ఏ భావముందో చెప్పగలరు. మగచూపుని గుర్తుపట్టే ప్రాథమిక జ్ఞానం వయసుతోపాటే వృక్షంలా పెరుగుతుంది.

సినిమాలు తీసేవాళ్ళూ, రాసేవాళ్ళూ, వాటిలో నటించేవాళ్ళూ మూడొంతుల మంది మగవాళ్ళే అయినపుడు వాళ్ళు ఆడవాళ్ళను చూడగానే కళ్ళతో చేసే స్కానింగ్‌ సినిమాల్లోకి రావడం కూడా అసంకల్పిత చర్యే. అది డబ్బుల కోసం సినిమావాళ్ళు చేసే సంకల్పిత చర్య కూడా. ఎలా చూస్తామో అలాగే రాస్తాం, అలాగే తీస్తాం. అసలు సినిమా అనేదే ఒక voyeuristic tool. మనుషులను ఎలా కావాలంటే అలా, ఏ పరిస్థితిలో కావాలంటే ఆ పరిస్థితిలో చూపిస్తుంది. ఇతరుల జీవితాల్లోకీ, ఇళ్ళలోకీ, పడగ్గదుల్లోకీ తిరిగి చూపించడానికి కావలసినంత స్వేచ్ఛ ఉంది మూవీ కెమెరాకి. సినిమా చూడడంలోని సామూహిక వాయరిజంలోని దృష్టి కోణంకూడా మగవాళ్ళదే. స్త్రీల శరీరాలను ఇష్టమొచ్చినంత మేర చూపించే అవకాశముండడంతో పురుషాధిక్య సమాజంలో సినిమా మేల్‌గేజ్‌నే ధరిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించని ఆడవాళ్ళు ఉండరు కానీ, దాన్ని ఎలా ఎదుర్కోవాలో వారికి అర్ధంకాదు. ”స్త్రీలను సినిమాల్లో అసభ్యంగా చూపిస్తున్నారని” గోలపెట్టేది ఇందుకే. కానీ ”ఇది సభ్యత, ఇది అసభ్యత” అని గిరులు గీయలేనిది కళాభిరుచి. ఇదే అదనుగా చాలామంది చేతుల్లో మూవీ కెమెరా చెలరేగిపోతూ ఉంటుంది.

లారాముల్వే స్త్రీ వాది, చిత్ర విమర్శకులు కూడా. 1875లో ఆమె ‘మేల్‌ గేజ్‌’ అనే మాటను తొలిసారిగా వాడుతూ సినిమాల్లో మేల్‌గేజ్‌ గురించి సిద్ధాంతీకరించింది. సినిమాల్లో, వ్యాపార ప్రకటనల్లో, టీవీలలో కనిపించే మేల్‌గేజ్‌ స్వరూపాన్ని వివరించింది. ఇది రెండు రకాలు: ఒకటి సినిమాలోని పాత్రల చూపు, రెండోది సినిమా చూస్తున్న ప్రేక్షకుల చూపు. ఎక్కడైనా చూసేది మగవాళ్ళు, చూడబడేది

ఆడవాళ్ళు. సినిమాలోని పాత్రల చూపుని, బయట ఉన్న ప్రేక్షకుల చూపుని ఏకం చేసేది టెక్నాలజీ. అంటే సినిమాటోగ్రఫీ. ఒక సీన్‌లో అమ్మాయి నడుస్తూ వెళ్తోంది. హీరో ఆమెను చూస్తుంటాడు. కెమెరా హీరో చూపుని అనుసరిస్తూ వెళ్తుంది.

అమ్మాయిని హీరో ఎక్కడ, ఎలా చూస్తాడో ప్రేక్షకులను కూడా అక్కడ అలాగే చూసేలా చేస్తుంది. సినిమా కథను నడిపేది హీరోనే. అతనిలోనూ, చూసేవాళ్ళలోనూ శృంగారపరమైన ఉత్సుకత రేపే రూపంతో హీరోయిన్‌ కనిపించాలన్నది సినిమా ముఖ్య సూత్రం. సినిమాటోగ్రాఫర్‌ బలమైన విజువల్స్‌తో ఈ రూల్‌ను పాటిస్తాడు. మేకప్‌ ఆర్టిస్టులు, కాస్ట్యూమ్‌ డిజైనర్లు హీరోయిన్లను అందంగా ప్యాక్‌ చేస్తారు. ఇదే అలవాటు వ్యాపార ప్రకటనల్లోనూ కనిపిస్తుంది.

లారా చెప్పిన ‘మేల్‌ గేజ్‌’ కి క్లాసిక్‌ ఉదాహరణగా చాలామందికి గుర్తొచ్చేవి జేమ్స్‌బాండ్‌ సినిమాలు. 1962నే వచ్చిన ‘డాక్టర్‌ నో’ సినిమాలో ఉర్సులా ఏండ్రెస్‌ సముద్రంలో నుంచి రావడాన్ని కెమెరా, బాండ్‌గా వేసిన సీన్‌ కానరీ మరియు ప్రేక్షకులు తదేకమైన మగచూపుతోనే చూస్తారు. అలాంటి దృశ్యాన్నే 40 ఏళ్ళ తర్వాత 2002లో వచ్చిన ‘డై ఎనదర్‌ డే’ హేలీబెర్రీతో మరోసారి తీసినప్పుడు మగచూపు ఆమెను మరీ ఎక్కువగా తడుముతుంది. ఆడవాళ్ళ ఇమేజ్‌ అంటే మగవాళ్ళను రెచ్చగొట్టేలా ఉండాలని చెబుతున్నట్లుగా ఈ జేమ్స్‌బాండ్‌ సినిమాలు ఉంటాయి.

సినిమాల్లో స్త్రీలు రెండు రకాలుగా ఉంటారని చెప్తుంది లారా. లైంగికంగా చురుగ్గా ఉండేవాళ్ళు ఒకరకం, బొత్తిగా బలహీనులు రెండో రకం. ఆమె హాలీవుడ్‌ గురించే చెప్పినా మన సినిమాల్లో కూడా ఇవే మూసలు కనిపిస్తూ ఉంటాయి. మొదటి రకం ఆడవాళ్ళను అప్పట్లో వ్యాంప్‌లనేవారు. ఇప్పుడు ఐటమ్‌ సాంగ్‌ గర్ల్స్‌ అంటున్నారు. వాళ్ళు శృంగారం కోసమే కనపడుతూ ఉంటారు. రెండో రకం కథ నడకకి అడ్డం పడుతూ కన్నీరు కార్చే సచ్చీలురైన కలకంఠులు. అమ్మ, ఇంట్లోనే ఉండే భార్య, చెల్లెళ్ళ మూసలివి. వీళ్ళు కరుణరస ప్రదాయినులు. ఈ రెండు రకాలూ కాకుండా సగం శృంగారం, సగం పొగరు లేదా మంచితనంతో హీరోయిన్‌ రూపాన్ని తయారుచేస్తారు. ఈ ఫార్ములాలు పెట్టుకుని వందల సినిమాలు వచ్చాయి.

మన సినిమాల్లోకి మొదట్లో స్త్రీలు అడుగుపెట్టడమే అరుదు, అపురూపం. సినిమా వేషాల కోసం వచ్చిన వారి కను ముక్కు తీరు, వాచకం బాగుంటే వేషాలిచ్చేవారు. ఇప్పటి అందం కొలతల్లో ఇమడని భారీ శరీరాలతో ఉన్న హీరోయిన్ల మీద కెమెరా తన ప్రతాపం అంతగా చూపించలేదనే చెప్పాలి. బిగుతైన జాకెట్లు, పలుచటి పైటలు

వేసుకునేవారు కానీ వారి అభినయం మీద, ముఖాలమీదే అందరి దృష్టి ఉండేది. తర్వాత ’60ల నుండి బిగుతు ప్యాంట్లు, బిగుతు చొక్కాలలో ఉన్న స్త్రీల శరీరాలమీద కెమెరా క్లోజప్‌ షాట్లతో తన అజమాయిషీ మొదలెట్టింది. జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్‌ స్మితల శరీరాలమీద మేల్‌గేజ్‌ విశృంఖలంగా పాకింది. ’70 నుంచి ’90 దశకాల్లో వచ్చిన సినిమాల్లో ముఖ్యంగా మళయాళం సాఫ్ట్‌ పోర్న్‌ సినిమాల్లో శృంగారం పేరుతో ఆడవాళ్ళ శరీరాలను ప్రదర్శనకు పెట్టారు.

సినిమా చూసేటపుడు స్త్రీలు కూడా మేల్‌గేజ్‌తోనే చూస్తారని చెప్తారు లారా. హీరోయిన్ల ఒంటితో తమ ఒంటినీ, బట్టలనూ పోల్చుకుని ఆడవాళ్ళు కూడా మగవాళ్ళ కళ్ళలోంచే తమను తాము చూసుకుంటారు. మహిళా దర్శకులు కూడా ఎంత చేటు మేల్‌ గేజ్‌తో సినిమాలు తీశారో భానుమతి, విజయనిర్మలల సినిమాలను చూస్తే తెలుస్తుంది. వాళ్ళ సినిమాల్లో రేప్‌ సీన్లు మగ దర్శకులు తీసే విధానానికి ఏ మాత్రం తీసిపోకుండా నిర్దాక్షిణ్యంగా ఉంటాయి.

కళాత్మక సినిమాలు తీస్తున్నానంటూ కెమెరాలోనుంచి స్త్రీల శరీరాలను మర్యాదలన్నీ అతిక్రమించి తడిమేశాడు రాజ్‌కపూర్‌. ఈయన సినిమాల్లో హీరో (అంటే తనే) హీరోయిన్‌ కళ్ళలోకే తప్ప ఇంకెక్కడా చూడడు.మూడు రకాల మేల్‌ గేజ్‌లలో రెండో రకాన్ని వదిలిపెట్టి హీరోచేత అమాయకపు ముఖం పెట్టించి ఆ మేరకు కెమెరాతో ఆడవాళ్ళమీద మరింత దౌర్జన్యం చేస్తారు. చిన్న దుస్తులలో తిరుగుతూ మోడల్స్‌లా నడిచే పల్లెటూరి అమ్మాయిల వేషాల్లో ఆడవాళ్ళను చూసి లొట్టలు వేసుకున్న సెన్సార్‌ మెంబర్లు రాజ్‌ కపూర్‌ mammary obsessionని కళాత్మక అభివ్యక్తిగా కొలిచారేమో అనిపిస్తుంది.

‘జ్యోతి’ లాంటి మంచి సినిమాలు తీసిన రాఘవేంద్రరావు ఒక్కసారిగా తీసుకున్న చారిత్రాత్మక యూ టర్న్‌ గురించి చెప్పుకోవాలి. ఆడవాళ్ళ శరీర భాగాలను ముక్కలుగా కోసి పళ్ళు, ఫలాల్లా కళ్ళముందర పళ్ళెంలో పెట్టి అందించాడు. రాఘవేంద్రరావు టెక్నిక్‌నే చాలామంది అనుసరిస్తూ పోయారు. పోర్న్‌ స్టార్‌ సన్నీ లియోన్‌కి కూడా మన హీరోయిన్లలాగే బట్టలు కట్టి సినిమాల్లో చూపిస్తుంటే సంతోషంగా మగవాళ్ళు చూస్తున్నారంటే ఇలాంటి titillation టెక్నిక్‌కి దేశంలో ఉన్న ఆకర్షణ ఎంతటిదో తెలుస్తుంది. ”వేదం” లాంటి కొంచెం భిన్నంగా ఉండే సినిమాల్లో కూడా ”ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ” పాటలోనూ, ఇంకా చాలా దృశ్యాల్లోనూ అనుష్కమీద వాడిన కెమెరా యాంగిల్స్‌ సెక్స్‌ వర్కర్‌ పాత్రే కదా అన్న సాకుతో molest చేస్తాయి. పాటల చిత్రీకరణలో హీరోయిన్‌ బొడ్డు, పిరుదులు, రొమ్ముల క్లోజప్‌లు, ఆమె నడుము పట్టుకుని వేలాడే హీరోలూ తెలుగు సినిమాల్లో కోకొల్లలు.

బలమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీల కథలను తీర్చిదిద్దిన దర్శకులు కూడా ఉన్నారు కదా! వాళ్ళ సినిమాల్లో కూడా మేల్‌ గేజ్‌ లేకుండా ఉండదు. మహిళా ప్రాధాన్య సినిమాల్లో కూడా ఎక్కడో ఒకచోట కెమెరా దాని పని అది చేస్తూనే ఉంటుంది. స్త్రీల సమస్యలపై మంచి సినిమాలు తీసిన బాలచందర్‌ కూడా చాలాచోట్ల చూపులు తప్పాడు. ‘అంతులేని కథ’లో కెమెరా జయప్రదతో ప్రేమలో పడిపోయి వదల్లేకుండా అయిపోవడాన్ని గమనించడం కష్టమేమీ కాదు. అలాగే ‘మరో చరిత్ర’ కూడా. ‘చక్ర’ సినిమాలో స్మితా పాటిల్‌ స్నానాన్ని చూపిస్తూ అప్రయత్నంగా కెమెరా కొంచెం మోహంలో పడిపోయిందనిపిస్తుంది. అందం, బలమైన వ్యక్తిత్వం ఉన్న హీరోయిన్‌ అంటే సినిమాటో గ్రాఫర్లలోను, దర్శకుల్లోనూ మోహం, ప్రేమ అనేది కలగడం చాలా సహజం.

దాన్ని అదుపుచేసి సినిమాని స్క్రిప్టుకి తగ్గట్లు తీసినప్పుడే గొప్ప సినిమాలు వస్తాయి. కానీ సినిమా ఆడాలంటే మేల్‌ గేజ్‌ను పూర్తిగా వదిలేసే ప్రయోగాలు చేయకూడదని పాపులర్‌ అయిన దర్శకులందరికీ తెలుసు. హీరోయిన్‌ అంటే కచ్చితంగా అందంగా ఉండాల్సిందే.

హాలీవుడ్‌లో బలం, ధైర్యం ఉండి యుద్ధాలు చేసే స్త్రీలుగా Uma Thurman (Kill Bill), Angelina Jolie (Lara Croft etc.), Sigoumey Weaver (Aliaen) ల ఇమేజ్‌లు నిలుస్తాయి. అయినా వాళ్ళలోని ఆకర్షణని దర్శకుల మేల్‌ గేజ్‌ కొంతైనా ఎత్తి చూపిస్తూనే వచ్చింది. స్త్రీ శరీరాన్ని ఇష్టమొచ్చినట్లు చూపించే అవకాశం ఉన్నా ఆ పని చేయకుండా అణచివేతలోని బాధని, అన్యాయాన్ని తీవ్రంగా చూపించిన ‘బాండిట్‌ క్వీన్‌’ని మేల్‌ గేజ్‌ కు చాలావరకు మినహాయింపనే చెప్పుకోవచ్చు. బాండిట్‌ క్వీన్‌ తీసిన శేఖర్‌ కపూరే మిస్టర్‌ ఇండియాలో శ్రీదేవి మీద పూర్తిగా మగచూపును ఎక్కుపెడితే డబ్బుల వర్షం కురిపించారు.

సినిమా కళతో చాలా ప్రయోగాలు చేసిన యూరోపియన్‌ సినిమాల్లో మేల్‌ గేజ్‌ అన్వయింపు సులభం కాదు. పాత్ర స్వభావం ఏంటన్నదే వాళ్ళ దృష్టి. నగ్నత్వం ఎంతగా ఉన్నా దానిలో రెచ్చగొట్టే కోణం ఉండదు. నగ్నత్వం దానంతట అదే అసభ్యత అయిపోదు. చిత్రీకరించిన పద్ధతిని బట్టి అది ఆ సన్నివేశానికి అవసరమా లేక titillation కోసమేనా అన్నది ఎవరికైనా అర్థమవుతుంది.

ఉదాహరణకి Jean Lue Godard సినిమాల్లో స్త్రీ అంటే ఒక వ్యక్తిత్వమే. దానికితోడు ‘బ్రెట్టియన్‌ ఏలియనేషన్‌’ టెక్నిక్‌ కూడా వాడి, అరాచకాన్ని, అన్యాయాన్ని బట్టలు విప్పి చూపిస్తారు. Godard సినిమాలో పాత్రలకంటే ఆ పరిస్థితులే మనకు భయానకంగా గుర్తుండ ిపోతాయి. కొరియన్‌, చైనీస్‌, జపనీస్‌ సినిమాల్లో ఎవరి కల్చర్‌కు వాళ్ళు మేల్‌ గేజ్‌ను కలిపి తీసినవి, మేల్‌గేజ్‌ను వదిలేసి తీసినవి కూడా గమనించవచ్చు. తరాల సంస్కృతికి మేల్‌ డామినేషన్‌ని, ఆధునికత్వాన్నీ కలిపితే వచ్చే మగచూపులోంచి రకరకాల సినిమాలు, వ్యాపార ప్రకటనలు తయారవుతున్నాయి.

మేల్‌ గేజ్‌ ఉండకూడదని మడికట్టుకుంటే శృంగారాన్నీ, మోహాన్నీ సినిమాలో ఎలా చిత్రించాలన్నది ప్రశ్న. మంచి ఈస్థటిక్‌ సెన్స్‌ ఉన్న దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు శృంగార దృశ్యాలు తీసేటపుడు ఆ పాత్రల మనస్తత్వాలను దృష్టిలో పెట్టుకుంటారు. వాళ్ళు కథలో ఏ సామాజిక వర్గానికి చెందినవారన్నది కూడా గుర్తిస్తూ శృంగారాన్ని చిత్రీకరిస్తారు. కథనిబట్టి అది మొరటుగా ఉండొచ్చు, సున్నితంగా ఉండొచ్చు, హింసాత్మకంగానైనా ఉండొచ్చు కానీ స్త్రీలని మాంసఖండాలుగా చూపించేలా మాత్రం ఉండదు. మన సినిమాలో ఆడవాళ్ళని వస్తువులుగా చూపించవద్దని అనుకునేవాళ్ళు శృంగార సన్నివేశాల జోలికే పెద్దగా పోకుండా సినిమా లాగించేస్తారు. Titillation లేకుండా శృంగారాన్ని చక్కగా తీసేవాళ్ళు తక్కువ. సెక్స్‌ని సహజంగా చిత్రీకరించడంలో ఇప్పుడొస్తున్న మల్టీప్లెక్స్‌ హిందీ సినిమా, కెమెరా తడుములాటకి దూరంగా కొంత ముందుకు వెళ్ళింది. మిగతా పాపులర్‌ సినిమాల్లో మేల్‌ డామినేషన్‌ ఎలాగూ తప్పదు కానీ, మన వారసత్వ సంపద, అదే.. మన తెలుగు హీరోలు…వాళ్ళ సినిమాల్లోలా వ్యక్తిత్వంలేని ఆడవాళ్ళను మేకప్‌ కిట్స్‌తో సహా దొరికే బార్బీ డాల్స్‌లా చూపించకుండా ఉంటే మేల్‌గేజ్‌ మేలనుకోవాలి ప్రస్తుతానికి.

మేల్‌ గేజ్‌ని ఎదుర్కోవాలంటే విజువల్‌ మీడియాలో ఫిమేల్‌ గేజ్‌ని తీసుకురావాలని కొంతమంది చెప్తారు. ఫిమేల్‌ గేజ్‌ చెయ్యాల్సిన పని, మేల్‌ గేజ్‌ కున్న వాయరిస్టిక్‌ లక్షణాన్ని అందిపుచ్చుకుని దానిలాగే తెరను ఆక్రమించడం కాదనీ, మగచూపుకున్న అధికారాన్ని తగ్గించడానికి కృషి చేయాలంటే వేరే రకాలుగా కూడా దృశ్యాలను చూపించడం నేర్చుకోవాలనీ అంటోంది Lorraine Gamman. అంటే తెరమీది స్పేస్‌ని స్త్రీ పురుషులిద్దరూ పంచుకోవాలని చెప్తోంది. సినిమాటోగ్రాఫర్లలో స్త్రీలు చాలా తక్కువ. సరైన దర్శకులతో పోటీ పడగల సమర్థత ఉండి, స్త్రీవాది కూడా అయిన సినిమాటోగ్రాఫర్‌ ఎవరైనా, అలవాటైన మేల్‌ గేజ్‌ని వదిలించుకుని, ప్రయత్నపూర్వకంగా తనవైన కెమెరా యాంగిల్స్‌ చూపిస్తూ సినిమా తీయగలిగిననాడు ఆడచూపును కూడా నిర్వచించవచ్చేమో.

యాభై ఏళ్ళ కిందటైతే వెకిలిచూపులు ఎదురైతే చీరకొంగు భుజాలచుట్టూ నిండుగా కప్పుకుని తప్పుచేసినట్లుగా తలదించుకునేవాళ్ళు భద్ర మహిళలు. ఇప్పుడు బహిరంగ స్థలాల్లో మగవాళ్ళతో ఇంచుమించు సమాన సంఖ్యలో తిరగ్గలగడంవల్ల వచ్చిన ధైర్యంతో తలెత్తి లెక్కలేనట్లు మామూలుగా, హాయిగా తిరుగుతున్నారు. ఆడవాళ్ళ బాడీ లాంగ్వేజ్‌ ఎక్కడున్నా ఏ ఇబ్బందీ లేనట్టుగా మారిపోయింది. స్త్రీ వాదం, ఉద్యోగాలు, ఆత్మవిశ్వాసం స్త్రీలను నిటారుగా నిలబెట్టేవరకు తెచ్చాయి. ఇదెంతో బాగుంది. కానీ మధ్యలో అన్నింటికీ నేనున్నానంటూ సర్వవ్యాప్తి మార్కెట్‌ చొరబడిపోయి ఉన్న స్వరూపాలను మార్చి గందరగోళం చేస్తోంది! ‘నీ శరీరాన్ని అందంగా వీటితో అలంకరించు, ఒంటిని తీర్చిదిద్దుకుని చక్కగా స్వేచ్ఛగా ప్రదర్శించు, నీ స్వేచ్ఛకు ఆకాశమే హద్దు’ అని ఫె˜యిర్‌ అండ్‌ లవ్లీ లాంటి వేలకొద్దీ వస్తువులతో చుట్టుముట్టి అన్‌ఫెయిర్‌ ఆటలాడుతోంది. అసలే అలంకార ప్రియులేమో, మార్కెట్‌ దెబ్బను సగటు అర్భకపు ఆడ ప్రాణాలు ఎలా తట్టుకోగలవు? వంటిని కుదించి, పెంచి, రంగులద్ది ప్రకటనలు ఎలా ఆదేశిస్తున్నాయో అలాగే తయారవడానికి పరుగు పెడుతుంటాయి.

నువ్వు నీలాగే ఉండమంటూ ఆ ‘నువ్వు’ ఎలా ఉండాలో చెప్తున్నారు.

సైజ్‌ జీరోలుగా చాలామంది అన్నపానీయాలు మానేసి రోగగ్రస్థులయ్యాక అమెరికన్‌ ఫ్యాషన్‌ దివా ‘కిమ్‌ కర్దషియాన్‌’ ఈ మధ్య కొత్త ట్రెండ్‌ని తీసుకువచ్చింది. ఆమె తన పిరుదులను సర్జరీతో పెద్దవిగా చేసుకుని అందమంటే ఇదేనంది. దాంతో ‘బూటీ’ అని ఆడా మగా అందరూ ముద్దుగా పిలుచుకునే పెద్ద పిరుదులమీదే ధ్యాసైపోయింది కొంతమంది ఆడపిల్లలకి. అవి పెద్దగా లేకపోతే బెంగ. రేప్పొద్దున ఇంకే ఫ్యాషన్‌ సీతాకోకచిలుకో లేదా పిరుదులను సాఫుచేసే మిషన్లని తయారు చేసేవాళ్ళో ముందుకు వచ్చి ఫ్లాట్‌ హిప్స్‌ లేకపోతే బతుకు వ్యర్థమని ప్రచారం చేస్తే ఆడపిల్లలకి కొత్త బెంగలు పుట్టుకొస్తాయి. మరోపక్క ‘నా ఒళ్ళు నా ఇష్టం’ అనే సినిమా తారలు స్త్రీ స్వేచ్ఛకి అర్ధం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందంకోసం ముక్కులు, మూతులతో సహా శరీరభాగాలను కోయించుకుని, క్రీములు పూసుకుని మార్కెట్‌ గేజ్‌కు తగ్గట్లు తయారై ‘నా శరీరం నా ఇష్టం’ అని చెప్పడం ఎంత తెలివితక్కువ తనమో గమనించలేనంత మత్తులో మునిగి ఉన్నారు. మన శరీరాలను తీర్చిదిద్దుకోవడంలో ఇప్పుడు మన ఇష్టం ఏమీ లేదని, కాస్మెటిక్‌ సర్జన్లు, బిలియన్ల డాలర్ల కాస్మెటిక్‌ వ్యాపారం చేసేవాళ్ళు, బట్టల వ్యాపారులు కలిసి పిల్లలతో సహా అందరిమీదా మత్తుమంది జల్లుతున్నారని ఎవరికెవరు చెప్పగలరు.

పిట్టల పోరు పిల్లి తీర్చినట్లు ఈ మేల్‌ గేజ్‌, ఫిమేల్‌ గేజ్‌ గొడవని ‘మార్కెట్‌ గేజ్‌’ పరిష్కరించింది. ఇప్పుడు అన్నింటికంటే అదే బలమైనదని ఒప్పుకోవాలి. ఆడా, మగా అందర్లోనూ నిద్దరోతున్న ‘exhibitionism’ని తట్టిలేపి, దువ్వి ముద్దుచేస్తూ వేల వెరయిటీల వస్తువులు అమ్ముకుంటోంది. అదీ మార్కెట్‌ చూపు. సిక్స్‌ పాక్‌ ఛాతీలు ప్రదర్శించే ఫ్యాషన్‌ వచ్చాక మగ శరీరాన్ని కూడా ఖండాలుగా ప్రదర్శన చేశారు. అందరూ ఇప్పుడు ఉదారంగా, హక్కుగా, ఇష్టంగా తమ అందచందాలను ప్రదర్శిస్తున్నామని అనుకుంటున్నారు. ముందు మనని మనం ప్రేమించుకున్నాక ఆ ప్రేమను అందరికీ చూపించుకోవాలి. ఒకరు చేతిలో మొబైల్‌ ఫోన్‌ని ఎత్తి పట్టుకుంటే ఐదారుగురు దానివైపే చూసే చూపు ట్రెండీ సెల్ఫీ గేజ్‌. ఎవరిని వాళ్ళు ఎప్పుడూ చూసుకుంటూ (narcissistic) అందరికీ తమని చూపెట్టుకుంటూ (exhibitionistic) ఉండేలా మార్కెట్‌ తన కనుసన్నల్లో జనాన్ని ఉంచుకుంటోంది. మార్కెట్‌ గేజ్‌ని ఎప్పటికైనా దాటగలిగితేనే కదా మన చూపుల్లో వేరే పోకడలు కూడా ఉండొచ్చని మనకి తెలియవచ్చేది.

 (సారంగ వెబ్ మాగజైన్ సౌజన్యంతో)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో