గూడు – కథా సంపుటి – జి. సరిత

సోమంచి శ్రీదేవి గారు యస్‌. శ్రీదేవి అనే పేరుతోను, సాహితి అనే కలం పేరు తోను కథలు వ్రాసారు. శ్రీదేవి గారి కథలు గూడు, గుండెలోతు, సింధూరి అనే పేరుతో పుస్తకాలుగా అచ్చయ్యాయి. నీలి నక్షత్రం అనే నవలను వ్రాసారు. గూడు అనే కథా సంకలనంలో వచ్చిన కథలను పరిచయం చేస్తున్నాను. శ్రీదేవి గారు వరంగల్‌ పోస్ట్‌ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నారు. గూడు అనే కథా సంపుటిలో 24 కథలున్నాయి.

రచయిత్రి రచనా నైపుణ్యం, రచనా శిల్పం ప్రతి కథలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అనేక సామాజిక అంశాలను కథావస్తువుగా స్వీకరించిన విధం రచయిత్రి ప్రతిభకు తార్కాణం. రచయిత్రిగా శ్రీదేవిగారిని ఉన్నత స్థానంలో నిలబెట్టే కథలు ఖైదీ, పాతకాలపు మనిషి.

ఓ తండ్రికి కూతురిగా, ఇద్దరన్నదమ్ములకి తోబుట్టువుగా పుట్టి, అత్తిల్లు మెట్టి, అత్తమామలు, మరుదులు, ఆడపడుచుల్తో మమేకమై, నలుగురు పిల్లల తల్లినై వుండి కూడా ఎవరికీ ఏమీ కాకుండా మిగిలిపోయానని, తనకంటూ గమ్యం లేదనే భ్రాంతిలో పడి వార్ధక్యంలో కన్నపిల్లల దగ్గర ఉండలేక తన స్నేహితురాలు నిర్వహిస్తున్న ఓల్డేజిహోమ్‌కు చేరి స్నేహితురాలి ఓదార్పును పొంది ఆమె ప్రోత్సాహంతో తన జీవితానికి ఒక గమ్యాన్ని నిర్దేశించుకొని, జీవిత చరమాంకాన్ని ఆనందమయం చేసుకోవాలని తపన పడే స్త్రీ కథ గూడు. ఇదే తరహాలో సాగే మరిన్ని కథలు విముక్తి, నినువినా, పునరావాసం.

వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత లేదని తెలుసుకొని తల్లితండ్రుల కోసం, సమాజం కోసం పెళ్ళి అనే బంధంలో చిక్కుకుపోయి బాధ్యతలన్నీ తీరేవరకు దానికి కట్టుబడి ఉండి జీవిత చరమాంకంలో బంధనాల నుండి బయట పడాలని కోరుకొనే స్త్రీ కథ విముక్తి.

బాధ్యతలన్నీ తీరాక కూడా ఇల్లే ప్రపంచం అని పిల్లలకు భయపడి బ్రతకడం కన్న భార్యాభర్తలిద్దరు జీవిత చరమాంకంలో యధేచ్ఛగా సుఖజీవనం సాగించవచ్చని తెలిపే కథ నినువినా.

భర్త చావుతో బ్రతుకే ముగిసిపోయిందని భావించిన యశోదమ్మ భర్త చావుతో కొత్త మలుపు మొదలైందని భావించిన అనసూయ ఇద్దరూ కలిసి తమ జీవితానికి గమ్యాన్ని నిర్దేశించుకొని జీవిత చరమాంకాన్ని ఆనందమయం చేసుకోవడానికి ప్రయత్నించిన కథ పునరావాసం.

మనిషి సృష్టించిన డబ్బు మనిషి జీవితాల్ని శాసించే స్థాయికి చేరిన తరుణంలో మానవ సంబంధాలు ఎలా ఉన్నాయో తెలిపే కథలు పాతకాలపు మనిషి, ముల్లు, నాకొద్దీ అభ్యుదయం, బంగారు పంజరం, నాని నాకిక్కడ చోటు లేదు అనే కథలు.

ఆప్యాయతలు, అనురాగం ముఖ్యమని తోబుట్టువులు, మేనత్తను ఆదరించి సంపాదనంతా వారికే ఖర్చుపెట్టి తనకంటూ ఏమీ మిగల్చలేదని భావించిన కొడుకు తన తండ్రిని పాతకాలపు మనిషని భావించాడు. ఏ డబ్బయితే లేక తను బాల్యంలో కష్టాలు పడ్డాడని భావించి ప్రతిక్షణాన్ని డబ్బుగా మార్చి, ఆ డబ్బుతోనే ఆనందంగా బ్రతుకుతున్నామనే భ్రమలో ఉన్న తిలక్‌ తన కొడుక్కు వచ్చిన జబ్బు ఏ డబ్బుతో నయం కాదని ఆప్యాయతలు, అనురాగాలే పిల్లవాడి జబ్బుకు మందులు అని పాతకాలపు మనిషి అని భావించిన తన తండ్రి చేసిన హితబోధవల్ల కళ్ళు తెరిచి వాస్తవాన్ని గ్రహించిన ఓ వ్యక్తి కథ పాతకాలపు మనిషి.

తండ్రి మరణానికి ముందు అక్క పెళ్ళి చేసుకోవాలనుకున్న వ్యక్తి తండ్రి మరణం తర్వాత డబ్బు లేని స్థితిలో తనకు తాళి కట్టడం ఆమె మనస్సుకు ముల్లులా తోచింది ముల్లు అనే కథలో.

కూతురి సంపాదనతో బ్రతికిన కుటుంబం (తల్లితండ్రులు) సరైన సమయంలో ఆమెకంటూ పెళ్ళి చేసి జీవితాన్ని ఇవ్వకపోతే, లేటు వయసులో తన సంపాదన చూసి ఇదివరకే పెళ్ళి అయినా కాలేదని అబద్ధమాడి ఆమెను పెళ్ళి చేసుకోవాలని ఒక వ్యక్తి పథకం వేస్తే ఆ మోసాన్ని గ్రహించి కట్నంతో భర్తను కొనుక్కొని తన మనసును తాకట్టుపెట్టుకోలేనని, ఇక తన జీవితానికి పెళ్ళే వద్దనుకొని ఆశ్రమంలో చేరిన ఒక యువతి కథ నాకొద్దీ అభ్యుదయం.

పెద్ద చదువులు చదివితే పెద్ద ఉద్యోగం తెచ్చుకొని బాగా సంపాదించవచ్చని చిన్నతనం నుండే కూతురికి నూరిపోసిన తల్లి, తల్లి మాటలు విని డాక్టరై బాగా సంపాదించి, చివరికి తల్లి జబ్బున పడితే కనీసం చూడడానికి రాలేని కూతురి కథ బంగారు పంజరం.

బాగా సంపాదించి, ఆ సంపాదనను అనుభవించడానికి పిల్లలు లేక బాధపడుతున్న తన అన్నకు తన కొడుకును దత్తత చేసి తద్వారా తన అన్న ఆస్తిని అనుభవించాలనుకున్న చెల్లెలు చివరకు డబ్బుకు, తన కొడుక్కి ఎలా దూరమైందో తెలియజేసే కథ నాని.

ప్రేమించి పెళ్ళి చేసుకొని తమను కాదని వెళ్ళిపోయిన కూతురు, అల్లుడు ఉద్యోగాలు చేస్తూ, రెండు చేతులా సంపాదిస్తూ ఆ డబ్బు తెచ్చిన యంత్రాల మధ్య యాంత్రిక జీవనం గడుపుతుంటే ఆ యాంత్రిక జీవితాన్ని భరించలేక, వారి మధ్య ఉండలేక ఆప్యాయతలు, అనురాగాలు కలబోసిన పల్లె వాతావరణమే చక్కటి వాతావరణమని పల్లెకు చేరుకున్న ఓ తల్లి కథ నాకిక్కడ చోటు లేదు.

పెళ్ళికి కట్నం సంపాదించుకోవడం కోసం ఉద్యోగం అనే బందీఖానాలో ప్రవేశించి భర్తను కొనుక్కొని, బిడ్డను కని తన జీతంతో ముగ్గురు ఆడపడుచుల పెళ్ళిళ్ళు చేసి ఇకనైనా ప్రశాంత జీవనం గడుపుదామని ఉద్యోగానికి రాజీనామా చేసి హాయిగా ఇంట్లోనే ఉండి పాపను చూసుకోవాలని అనుకుంటుంది కాని తాను ఇంట్లో ఉంటానని తెలిసి అత్తమామలు వేస్తున్న పథకాలు విన్న తర్వాత ఉద్యోగం మానేసి ఇంట్లో ఉన్నా ఇల్లు అనే బందీఖానాలో బందీగా మారాల్సిందేనని తాను కోరుకున్న సుఖం దక్కదని తెలిసి ఉద్యోగంతో వచ్చే జీతంతోనైనా తన పాప బంగారు భవిష్యత్తు అందించాలనే ఉద్దేశ్యంతో మళ్ళీ ఉద్యోగం అనే బందీఖానాలో బందీగా వెళ్ళడానికే నిర్ణయించుకున్న పేరు లేని ఒక బందీ కథ బందీ.

తన కొడుకు వ్యాధితో చనిపోతే తన వంశం నిర్వంశం అవుతుందని భావించి, తన కొడుకు బ్రతికుండగానే వంశాంకురం కోసం పేదింటి పిల్లను కొడుక్కిచ్చి పెళ్ళిచేసి ఆ అమ్మాయికి అన్యాయం చేస్తే, విదేశీయుడైన సంస్కారంతో ముందుకొచ్చి ఆ పిల్లకు మరొక జీవితాన్ని ప్రసాదించిన కథ ఆ ఉత్తరం.

మతం అనే మందు మనుషుల మధ్య ఎన్ని అడ్డుగీతలు గీస్తుందో ఎంతటి విధ్వంసాన్ని సృష్టించుతుందో తెలిపే కథ ఖైదీ.

శారీరక సౌందర్యం కన్నా మానసిక సౌందర్యమే గొప్పదని, ప్రేమ అనేది సినిమాల్లో మాత్రమే బహిరంగంగా ప్రకటింపబడుతుందని వాస్తవంలో అది మానవ జీవితాల్లో అంతర్వాహినిగా ఉంటూ బంధాలని బలపరుస్తుందని తెలియజేసే కథ అర్హత.

భార్యాభర్తలుగా కలిసి బ్రతకలేని క్లిష్టపరిస్థితులలో కలిసుండి, ద్వేషాలతో బ్రతికేకన్నా విడిపోయి ఎవరి జీవితం వారు బ్రతకడం కూడా మంచిదేనని తెలియజేసే కథ ఒకప్పటి స్నేహితులు.

భర్త నుండి విడిపోయి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న తనకు ప్రేమతో మరొక వ్యక్తి జీవితాన్ని అందించినా అందుకోకుండా ఆడదాన్ననే ఆత్మన్యూనతతో సమాజానికి భయపడుతూ బ్రతికే సుమతి కథ వంకరగీత.

భర్త మరణించి ఒంటరితనంతో, నిస్సహాయత తోటి కొట్టుకుపోతున్న రోజుల్లో పరాయి స్త్రీ భర్త తోడుగా నిలిస్తే, ప్రలోభపడి, అతని భార్య మాటలతో తేరుకొని జీవితాంతం ఒంటరితనంతోనే సహజీవనం చేయాలనే నిర్ణయం తీసుకొన్న ఒక అభాగ్యురాలి కథ తుఫాను వెలిసింది.

పెళ్ళికి కావలసింది వరకట్నాలు కావని, పెళ్ళంటే రెండు శరీరాల కలయిక కాదని, రెండు మనసుల కలయిక అని జీవితాంతం ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటామని, ఒకరి గౌరవాన్ని ఒకరు కాపాడుకుంటామని ఒకరి మనోభావాలు ఒకరు అర్థం చేసుకుంటామని, ఒకరి స్వేచ్ఛను ఒకరు కాపాడుకుంటామని భార్యాభర్తలు చేసుకొనే ఒప్పందం పెళ్ళి అని తెలియజేసే కథలు హలో మనోరమా, గెలుపెవరిది, ఒప్పందం, సారీడియర్‌, ఇమేజ్‌, ఉరి కథలు.

వాస్తవిక జీవిత సంఘటనలను అక్షరబద్ధం చేసి కథలుగా మలిచిన శ్రీదేవి గారి గూడు కథల సంపుటి అందరూ చదవవలసిన పుస్తకం.

Share
This entry was posted in పుస్తక పరిచయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో