చిత్రకూటమి యాత్ర ఓ రకంగా సాహసయాత్రే..?!- వి.శాంతి ప్రబోధ

అద్భుతమైన అందాలొలికే లోయలూ..ఎత్తైన కొండలూ.. సెలయేళ్ళు.. జలపాతాలూ.. వాటి హోరూ.. ఎటు చూసినా పచ్చపచ్చని రంగులు వివిధ షేడ్స్‌తో… కనులకి, మనసుకి ఆనందం, ఆహ్లాదం పంచుతూ..     ఎక్కడికో లాక్కుపోయే స్వచ్ఛమైన గాలి.. వాటిని అరకొర వసతుల మధ్య తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న అడవి మల్లెలు…

వారే.. ఈ నేలపై విరబూసిన ప్రకృతి బిడ్డలు.. ఆదివాసీలు.. మూలవాసులు..నవనాగరికతకు దూరంగా ప్రకృతి సహజంగా బతికే అడవి తల్లి బిడ్డలు. కరెన్సీ రెపరెపలు.. అలవికాని సంపదకోసం రెపరెపలు తెలియని జీవులు.. ప్రకృతి తల్లి ఒడిలో సంపన్నంగా బతికే వాళ్ళే నేటి విధ్వంసక అభివృద్ధికి తొలి నిర్వాసితులు.

పెట్టుబడిదారీ సామ్రాజ్య కాంక్షకు బలవుతున్న ఆదివాసీలు, మూలవాసుల బతుకుల్లో పచ్చదనం దూరమై చాలా ఏళ్ళయిపోయింది. వాళ్ళ జీవితాలు మండిపోతున్నాయి. ఎండిపోతున్నాయి. ప్రకృతి వినిపించే సంగీతపు స్థానంలో ఇనుపబూట్ల  చప్పుళ్ళు, తుపాకీ గుళ్ళ శబ్దం చొచ్చుకు వచ్చేసింది.

స్వేచ్ఛగా చెట్టూ పుట్టా, కొండా కోనా తిరిగే వాళ్ళ కాళ్ళ చుట్టూ ఆంక్షల ఇనుప గజ్జెలు చుట్టుకుని ఉన్నాయి. కొండా కోనల్లో నిక్షిప్తమై ఉన్న అంతులేని ఖనిజ సంపదపై కొందరి కన్ను. వాటిని కొల్లగొట్టి సొంతం చేసుకునేందుకు కదిపే పావులు.. అభివృద్ధి ముసుగులో జరిగిపోతున్న విపత్తు.. విధ్వంసం అయిపోతున్న జీవితాలు.. అడవిబిడ్డలకు వెన్నుదన్నుగా నిలిచి మానవీయ సహాయం అందించే శక్తులూ.. ఫలితం. నిర్విరామంగా.. నిర్బంధం.. కేసులు.. కుట్రలు..

ప్రజాస్వామ్య, ప్రజాతంత్ర దేశంలో తరతరాలుగా తమదని నమ్ముకుని బతుకుతున్న వారిని మాయోపాయాలతో జల్‌ జంగల్‌ జమీన్‌ నుండి తరిమేస్తుంటే.. మనుగడే ప్రశ్నార్థకమై బిక్కుబిక్కుమంటున్న బతుకులు వాళ్ళవి.. కనీసం వాళ్ళ దగ్గరకు వెళ్ళి నాలుగు మాటలు మాట్లాడలేని పరిస్థితి, పలుకరించి ధైర్యం చెప్పలేని దుస్థితి నేడక్కడ దాపురించింది. కనిపించని యుద్ధమేఘం కమ్మేసిన కారు మబ్బుల్లో వాళ్ళు.. ఇదంతా ఎక్కడో అనుకునేరు. మన పొరుగునే.. ఛత్తీస్‌గఢ్‌లోనే.. దండకారణ్య ప్రాంతంలోనే.. అలాంటి అప్రకటిత యుద్ధ వాతావరణంలో అద్భుతమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ సాగింది చిత్రకూటమి యాత్ర.

ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన బిడ్డలతోపాటు వారు నివసించే సుందర ప్రదేశాలను చూసేందుకు, వారి సామాజిక, రాజకీయార్థిక పరిస్థితులను అవగాహన చేసుకునేందుకు బయలుదేరింది చిత్రకూటమి.

చిత్రకూటమి అంటే…?
తన బలం తన రచయిత్రులే అని గర్వంగా చెప్పుకునే ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏపీ కార్యదర్శి కె.ఎన్‌.మల్లీశ్వరి మదిలోంచి పుట్టుకొచ్చిన చిత్రమైన ఆలోచనకి సై అన్న మిత్రుల కార్యాచరణే చిత్రకూటమి. గత మే నెలలో నవతరంతో యువతరం కార్యక్రమం అనంతరం ఇంకా ఏదో చేయాలన్న తపనలోంచి
ఉద్భవించిన ఆలోచనకి, సంస్కృతి గ్లోబల్‌ స్కూల్‌కు చెందిన నిశాంత్‌, మహిళా చేతనకు చెందిన సామాజిక కార్యకర్త కత్తి పద్మ, తెలుగు రీడర్స్‌ క్లబ్‌ నిర్వాహకుడు అనిల్‌ బత్తుల, 10 టీవీ అక్షరం కార్యక్రమ జర్నలిస్టు కిరణ్‌ చర్ల ఒక బృందంగా  కార్యక్రమం రూపొందించారు. ఆ తర్వాత డా.మాటూరి శ్రీనివాస్‌, నారాయణ వేణు గార్లు ఈ బృందానికి తమ సహాయ సహకారాలందిస్తే తెరవెనుక చందు శ్రీనివాస్‌, సూర్రెడ్డి గార్లు పనిచేశారు. దాదాపు వారి మూడు నెలల నిరంతర శ్రమ ఫలితం చిత్రకూటమి యాత్ర.

నిజానికి ఈ యాత్ర తలపెట్టింది 30 మందితో. అనూహ్యంగా ఎంతోమంది తమనూ ఈ యాత్రలో భాగస్వాములను చేసుకోమని కోరడంతో ఆ సంఖ్య 65కు చేరింది. అయినా ఇంకా చాలామంది తమకు అవకాశం లేదే అని బాధపడడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 20 మంది పిల్లలు, 45 మంది జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రచయితలతోపాటు విశాఖ తీరం నుంచి చిత్రకూట్‌ జలపాతాల వరకు ఆగస్టు 13-15 తేదీలలో చిత్రకూటమి యాత్ర జరిగింది.

యాత్ర అనుకున్న వెంటనే చిత్రకూటమి వాట్సాప్‌ గ్రూప్‌ చేశారు. మల్లీశ్వరి, కత్తి పద్మ, నిశాంత్‌, డా.మాటూరి శ్రీనివాస్‌లతో కూడిన బృందం ముందుగా విశాఖ నుండి జలపాతాల వరకు వెళ్ళి అవసరమైన ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో జగదల్పూర్‌లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్త బేలా భాటియాను, కొందరు జర్నలిస్టు మిత్రులను, ఆదివాసీలను కలిసి కార్యక్రమం రూపొందించారు.

ఎవరికి వాళ్ళు చిత్రకూటమి యాత్ర కోసం ఆతృతతో ఎదురుచూపులు కదా.. చిత్రకూటమి వాట్సాప్‌ గ్రూప్‌లో మమ్మల్ని ఊరిస్తూ మల్లీశ్వరి, కత్తి పద్మల పోస్టులకు తోడు నారాయణ వేణుగారి పోస్టులు, ఫోటోలు, సమాచారం… 13వ తేదీ త్వరగా వచ్చేస్తే బాగుండుననితొందపెట్టే మా మనస్సు… వేర్వేరు ప్రాంతాలు, వృత్తులలో ఉన్నవారిని కలిపింది అంతర్లీనంగా ఉన్న వారి అభిరుచి. అంతా ఒకచోట కలవడం, కలిసి మూడు రోజులు గడపడం సామాన్య విషయం కాదు కదా..

ఈ యాత్రకు హైదరాబాద్‌ బృందంలో నేను, జి.ఎస్‌.రామ్మోహన్‌ నాంపల్లిలో గోదావరి ట్రెయన్‌ ఎక్కాం. అనిల్‌ బత్తుల, కిరణ్‌ చర్ల, స్వేచ్ఛ వొట్కార్‌, రమా సరస్వతి, చందు తులసి, దేవేందర్‌లు సికింద్రాబాద్‌లో ఎక్కారు. 5.45కి రైలు అయితే నాలుగు గంటలకే వచ్చేయండని తమ్ముడు అనిల్‌ తొందర. ఖాజీపేటలో కాత్యాయనీ విద్మహే గారితో పాటు మరో నలుగురు మిత్రులు జతకలిశారు. కాత్యాయనీ విద్మహే వస్తూ వస్తూ నాలుగు రకాల స్నాక్స్‌ తెచ్చారు. ఇంకేముంది అందరి దృష్టి వాటిపైనే. ఆవిడేమో మూడు రోజులూ 70 మందీ తినడం కోసం బందోబస్తుగా ప్యాక్‌ చేయించి తెచ్చారు. కాస్త అల్లరి తర్వాత అనిల్‌ వాటిని ఓపెన్‌ చేశాడు. పల్లీలు, నువ్వులు, బెల్లంతో చేసిన లడ్డూలు, సకినాలు, చెక్కలు తిన్నాం. అందరికంటే ముందు తిన్న ఆనందం. మధ్య మధ్యలో మిగతా సభ్యుల రాకపోకల వివరాలు తెలుసుకుంటూ నిర్వాహకుల్లో ఒకడైన అనిల్‌.. పాటలు, కబుర్లు, చర్చలు అల్లరి అల్లరిగా.. చివరికి ఇరుగు పొరుగు బెర్తుల వాళ్ళ ఆగ్రహం చూసి మౌనంగా నిద్రకు ఉపక్రమించాం. కానీ నిద్రపడితేగా.. తెల్లవారుజామున అనకాపల్లిలో దిగేసి సంస్కృతీ గ్లోబల్‌ స్కూల్‌ దగ్గర కాలకృత్యాలు ముగించుకుని వెంటనే యాత్ర మొదలుపెట్టాలనేది మా ప్లాన్‌. కానీ ట్రెయిన్‌ గంట లేటు. మేం దిగేటప్పటికే ఒంగోలు నుంచి వచ్చిన రాజ్యలక్ష్మి, మహ్మద్‌ ఖాసిం, సమీర్‌, విజయవాడ నుంచి వచ్చిన అనిల్‌ డానీ మాకు స్వాగతం పలికారు. సంస్కృతీ వాళ్ళు పంపిన బస్సు సిద్ధంగా ఉంది. శాంతివనం మంచికంటి గారి కోసం కాసేపు వెయిటింగ్‌. ఈలోగా జి.ఎస్‌.రామ్మోహన్‌, చందు తులసి వేపపుల్లలు ఇచ్చారు. వాటితో దంతధావనం.. ఓ నలభై నిమిషాల ప్రయాణం.

మేం చేరేటప్పటికే అందరూ సిద్ధమై బస్సు ఎక్కుతున్నారు. కత్తి పద్మ అందరినీ త్వరపెట్టి సమయానికి బస్సు ఎక్కేలా చేయడంలో సిద్ధహస్తురాలు కావడంతో మేమూ త్వరగా బయలుదేరి విజయనగరం జిల్లా బొండపల్లి ఉన్నత పాఠశాలకు చేరుకున్నాం. అక్కడే వివిన మూర్తి, వి.రామలక్ష్మి, దగ్గుమాటి పద్మాకర్‌, ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు, విష్ణుప్రియగార్లు బృందంలో చేరారు.

సాహిత్య కార్యశాల

మా యాత్రలో మొదటి కార్యక్రమం విజయనగరం జిల్లా బొండపల్లి ఉన్నత పాఠశాలలో సాహిత్య కార్యశాల నిర్వహణ. ఆ రోజు రెండో శనివారం. బడికి సెలవు అయినా పై తరగతుల పిల్లలంతా అక్కడే ఎంతో ఉత్సాహంగా మాకు స్వాగతం పలికారు. మల్లీశ్వరి నిర్వహణలో ప్రారంభ సభ జరిగింది.

ముందుగానే నిర్ణయించిన గ్రూప్‌ల ప్రకారం కవులు, రచయితలతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో పాటు సంస్కృతీ గ్లోబల్‌ స్కూల్‌ పిల్లలు కూడా కలిసి సాహిత్యం గురించి, వారు చదివిన పుస్తకాల గురించి, నచ్చిన పుస్తకం గురించి పిచ్చాపాటీ ముచ్చట్లు.. నెమ్మదిగా కథా రచనలోకి వచ్చింది మా గ్రూపు. ప్రతి గ్రూప్‌కి ఒక ప్రముఖ పుస్తకం పేరు పెట్టారు. మా గ్రూప్‌ పేరు అగ్నిధార. మా గ్రూప్‌కి నేను, వివిన మూర్తిగారు మెంటార్స్‌.. మాకు ఆరుగురు పిల్లల్ని కేటాయించారు. పిల్లలు తమ చుట్టూ ఉన్న, తాము చూస్తున్న సమాజంలోంచి, సంఘటనల్లోంచి కథలుగా మలిచారు. ఒక్కొక్కరూ కాలం దాటని మూడు కథలు రాశారు ఆ కొద్ది సేపట్లోనే. సాంఘిక సంక్షేమ పాఠశాలలో ఉండి చదువుకుంటున్న జ్యోతి రాసిన మూడు కథలూ వేటికవి ఎన్నదగినవే. వాళ్ళు రాసినవి చూసి కొన్ని మెళకువలు చెప్పాం మేం. నిజానికి అది స్వల్ప సమయం. అంతకంటే ఎక్కువ చెప్పడం కష్టమే. మాలాగే మిగతా గ్రూపుల్లోనూ.. తర్వాత అందరూ సమావేశమై తమ అభిప్రాయాలు, అనుభవాలు పంచుకున్నారు.

ఆ పిల్లలని ఆ విధంగా ప్రోత్సహిస్తే మంచి కథకులు, కవులను తెలుగు సమాజం అందుకోగలదన్న నమ్మకం మాలో.. సాహిత్యపు సాన్నిహిత్యం తాలూకు సువాసనలు వెదజల్లుతున్న వాళ్ళకి బొండపల్లి హైస్కూల్‌లో పనిచేసే తెలుగు ఉపాధ్యాయులు జి.ఎస్‌.చలం గారు, శంకర్‌ గార్ల ప్రోత్సాహం స్పష్టంగా కనిపించింది.

భోజనానంతరం మళ్ళీ మా యాత్ర ఆరంభం. ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ల చెట్టూ చేమల్నీ పలుకరిస్తూ  ఆ పచ్చదనంలో పరవశించి పోతూ, స్వచ్ఛమైన కొండగాలుల్ని గుండెనిండా నింపుకుంటూ, మాతోపాటే కొండా కోనల మీదుగా పయనించే మేఘమాలికల్ని, అవి చిలకరించే వర్షపు చినుకుల్ని కెమెరాల్లో బంధిస్తూ.. కబుర్లు, పాటలు, చిరుతిళ్ళతో అర్థరాత్రి దాటిన తర్వాత గమ్యం చేరాం. మార్గమధ్యలో సుంకి చెక్‌పోస్ట్‌ దగ్గర, కోరాపుట్‌లో రాత్రి భోజనం తీసుకోవడం కోసం చిన్న విరామం.. విద్యుత్‌ దీపాలతో కాస్త అనువుగా ఉన్న చోట బస్సు ఆపుకుని రాత్రి భోజనాలు..

జలపాతాల్లో తడిసి ముద్దై
తీర్థ ఘర్‌ జలపాతం: కాంగర్‌ నదిపై ఉన్న అద్భుతమైన జలపాతం ఇది. దాదాపు 299 అడుగుల ఎత్తుపై నుండి పట్టుకుచ్చులా పరచుకుని ఎగసిపడే జలపాతపు సొగసు చూసి తరించాల్సిందే. దూరం నుండి కనిపించకుండా, వినిపించే సవ్వడి వడివడిగా రా రమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా..  నీళ్ళలోకి దిగొద్దు అనుకున్న వాళ్ళు కూడా ఆగలేకపోయారు. సంస్కృతి స్కూల్‌ పిల్లలు తప్ప అంతా జలపాతపు హోరులో.. ముద్దై.. అందరిలోను మధురమైన అనుభూతిని మిగిల్చింది.

జగదల్పూర్‌కి దాదాపు 35 కి.మీ. దూరంలో ఉంది ఈ జలపాతం. కుటుంసార్‌ గుహలు కూడా అక్కడికి దగ్గర్లోనే ఉంటాయని చెప్పారు నిర్వాహకులు. కానీ వెళితో ఆ రోజంతా అక్కడే అయిపోతుంది, ముందుగా అనుకున్న కార్యక్రమాలు చేయలేమని ముందుకు సాగిపోయాం.

చిత్రకూట్‌ జలపాతం: ఇండియన్‌ నయాగరాగా పిలిచే చిత్రకూట్‌ జలపాతం ఇంద్రావతి నదిపై ఉంది. ఆ జలపాతం ముందు కూర్చొని ఎంతసేపు చూసినా కదలనివ్వదు. సాయంత్రం వేళలో జలపాతపు నీటి తుంపర్లపై ఎండపడి వచ్చే ఇంద్రధనుస్సు కోసం ఎదురు చూశాం. కానీ మాకది కన్పించలేదు. మాలో కొందరు కిందకు వెళ్ళి ఆ నీటిని తాకి వచ్చారు.

బస్తర్‌ జిల్లాలో జగదల్‌పూర్‌కి పశ్చిమ దిశలో 38 కి.మీ. దూరంలో ఉంది ఇది. 95 అడుగుల ఎత్తు నుండి నీళ్ళు పడుతూ ఉంటాయి. ఎడమ నుంచి కుడికి 980 అడుగుల దూరం ఉంటుంది ఈ జలపాతం. టూరిజం డిపార్ట్‌మెంట్‌ వారితోపాటు స్థానికుల ఛాయ్‌ హోటళ్ళు, ఆదివాసీలు రూపొందించిన హస్త కళలు, వాటర్‌ స్పోర్ట్స్‌ ఉన్నాయి.       ఈ రెండు జలపాతాలూ కాంగర్‌ నేషనల్‌ పార్క్‌లోనే ఉన్నాయి. ఈ పార్కులో అరుదైన పక్షులు, మూలికలు ఉన్నాయట.

జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలతో మాటామంతీ:
అనుకున్న సమయానికి దేశబంధు దినపత్రిక సంపాదకుడు, జర్నలిస్ట్‌ దేవశరణ్‌ తివారీ, బాలల హక్కుల కోసం ఉద్యమిస్తూ, శిక్షార్త్‌తో కలిసి పనిచేస్తున్న సామాజిక కార్యకర్త, బచ్పన్‌ బచావో వ్యవస్థాపక సభ్యుడు ఆశిష్‌, అతని భార్య విచ్చేశారు. వాళ్ళతో కొంతమంది మాటామంతీ కలిపితే, మరికొంతమంది బేలా భాటియాను కలవాలన్నది మా ప్లాన్‌. కానీ అనివార్య కారణాలతో బేలా అప్పటికప్పుడు వేరే ప్రాంతానికి ప్రయాణమయ్యారని తెలిసి చాలా నిరాశపడ్డాం. అక్కడ ఉన్న ప్రత్యేక సామాజిక పరిస్థితుల వల్ల ఆదివాసీలను వారి గూడేలలో కలవలేకపోయాం. మనం చేస్తున్నది ఒక రకంగా సాహస యాత్ర అని, పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు అనుకున్న కార్యక్రమంలో మార్పులు, చేర్పులు జరగవచ్చని నిర్వాహకులు ముందే చెప్పి ఉండడంతో అందుకు సిద్ధమై ఉన్నాం.

సమావేశంలో జర్నలిస్ట్‌ తివారి చెప్పిన విషయాలు మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం, అసమ్మతిని వ్యక్తం చేసే హక్కు కోసం రాజ్యం నుండి ఆదివాసీలెదుర్కొంటున్న నిర్బంధం ఎప్పుడో పూర్తిస్థాయిలో విస్ఫోటనంగా మారుతుందేమోననిపించిందా క్షణం. ఏమో?!

కేంబ్రిడ్జిలో డాక్టరేట్‌ చేసిన సామాజిక కార్యకర్త బేలా భాటియా ఛత్తీస్‌గఢ్‌ గిరిజనుల హక్కుల కోసం కృషి చేస్తున్నారు. పోలీసు బలగాలు ఆదివాసీ మహిళలపై జరిపిన లైంగిక అత్యాచారాల తర్వాత ఆ మహిళలు నేరస్థులపై కేసులు పెట్టేలా బేలా ప్రోత్సహించారు. అప్పడినుంచి కత్తికట్టిన పోలీసుల ప్రోద్భలంతో వారి కనుసన్నల్లో నడిచే సామాజిక ఏక్‌తా మంచ్‌, సల్వా జుడుం వంటి సంస్థలు ఆమెను వేధిస్తున్నాయనీ, బస్తర్‌ విడిచి పొమ్మని హుకుం జారీ చేస్తున్నాయనీ తెలిసి విస్తుపోయాం.

బస్తర్‌ ఏరియాలో సోనీ సోరిపై యాసిడ్‌ దాడి గురించి ముందే విని ఉన్నాం. ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకురాలైన సోనీ సోరి ఆదివాసీ మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలకు సంబంధించిన ఘటనపై ఇతర మహిళా సంఘాలతో, బేలా భాటియా వంటి సామాజిక కార్యకర్తలతో కలిసి నిజనిర్థారణ చేసింది. ఆ నిజ నిర్థారణ ఆధారంగా మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని చట్టబద్ధంగా శిక్షింప చేయాలన్న ప్రయత్నం ఆమెది. ఇలాంటి సంఘటనలకు చెక్‌ పెట్టే ఉద్దేశమున్న రాజ్యం ఆ మహిళలను మావోయిస్టుగాను, వారి సానుభూతి పరులుగాను ముద్ర వేసి అక్రమ కేసులు బనాయించడం, ఏళ్ళ తరబడి జైళ్ళలో మగ్గేలా చేయడం జరుగుతోందక్కడ. పోలీసు దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా, ఆదివాసులకు మద్దతుగా నిలిచిన బేలా భాటియా, సోనిసోరి, జర్నలిస్ట్‌ మాలినీ సుబ్రహ్మణ్యం, లీగల్‌ ఎయిడ్‌ అందిస్తున్న మహిళా లాయర్లను బెదిరించడం, భయభ్రాంతులకు గురయ్యేలా ప్రవర్తించడం, ప్రయత్నించడం వంటి విషయాలు తెలుసుకున్న తర్వాత మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా.. లేక ఆ భ్రమలో బతుకుతున్నామా అనే సందేహం కలిగింది. పోలీసు రాజ్యంలో చట్టం, రాజ్యాంగం మట్టి కలిసి పోయాయా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఏదేమైనా తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటూనే ఆదివాసీ మహిళలకు అండగా నిలిచిన బేలా భాటియా వంటి సామాజిక కార్యకర్తలను, మాలినీ సుబ్రహ్మణ్యం వంటి జర్నలిస్టులను, సోని సోరి వంటి నేతలను, మహిళా లాయర్లు, మహిళా సంఘాల నాయకులను మనసులోనే అభినందించుకున్నాం. మాలినీ సుబ్రహ్మణ్యం వంటి వారు చివరికి రాజ్యం చేసే బెదిరింపులకు బలై ఆ ప్రాంతం వదల తప్పలేదు.

రాజ్య నిర్బంధం మెల్లమెల్లగా పెరిగిపోతూ ఉన్నదక్కడ. బస్తర్‌ కేంద్రంగా పనిచేసే జర్నలిస్టులను పిలిచి పోలీసులు ప్రశ్నించడం నిత్యకృత్యమైపోయిందని, తప్పుడు అరెస్టులు కూడా నిజమైన ముప్పుగానే మారుతున్నాయనీ జర్నలిస్టు తివారీ మాటల అర్థం అవగతం అవుతున్న కొద్దీ తెలియని గుబులు.

రాజ్యం, మావోయిజంల మధ్య బాలల బాల్యం ఎలా  నలిగిపోయిందో వివరించారు సామాజిక కార్యకర్త ‘బచ్పన్‌ బచావో’ వ్యవస్థాపకుడు ఆశిష్‌. పిల్లలతో కళకళ్ళాడాల్సిన బడులు సీఆర్పీఎఫ్‌ జవాన్లతో నిండిపోవడం, పిల్లలు బడికి దూరమై  బిక్కుబిక్కుమంటూ ఉండడం గురించి చెప్పారు. అనంతరం మా బృందంలోని పిల్లలు, పెద్దలు కూడా మా ముందున్న జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలని చాలా ప్రశ్నలు వేసి సందేహ నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నించారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఆదివాసీల సామాజిక స్థితిగతులు మా బృందాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేశాయి.

ఆదివాసీల ఆటపాటల్లో

వాగుల్లో వంకల్లో.. కొండల్లో కోనల్లో.. నాగరిక సమాజానికి దూరంగా ఉండే ఆదివాసీలు ఆదిమ సంస్కృతికి వారసులు. మేం చిత్రకూట్‌ నుండి వెళ్ళేసరికి గౌర్‌ తెగకు చెందిన ఆదివాసీలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని చూడగానే ఆదిలాబాద్‌ జిల్లాలో కనిపించే గోండులే  గుర్తొచ్చారు. వారి ముఖకవళికలు అదే విధంగా అనిపించాయి.

గౌర్‌ ఆదివాసీల నృత్యం ప్రత్యేకమైనదని వారి నాయకుడు మంగళ్‌ చెప్పారు. బస్తర్‌ జిల్లాలోని గౌర్‌ తెగవారు డోల్‌ బాజా నృత్యం చేస్తారు. ఇది మామూలుగా వారి వివాహ సమయంలో చేసే ప్రధాన నృత్యం. స్త్రీ పురుషులిద్దరూ చేస్తారు. ఆ నృత్యం చేయడానికి మా ముందుకొచ్చారు ఆ బృందం. వెదురుతో చేసిన బూర, డప్పు, డోలు వాద్య పరికరాలతో చేసే చప్పుళ్ళకు అనుగుణంగా లయబద్ధంగా  అడుగులు వేస్తూ మగవాళ్ళు ముందుకు వచ్చారు, ఆ వెనుకే మహిళలు వచ్చి కలిశారు. ఆడవారి కుడిచేతిలో ‘తిరుదుడి’ అనే వాద్య పరికరం ఉంది. డప్పు శబ్దానికి అనుగుణంగా వారి చేతిలోని తీరుదుడితో శబ్దం చేస్తూ.. నృత్యం చేస్తూ గుండ్రంగా కదులుతారు. ఆ కదలడం, అడుగులు వేయడం రకరకాలుగా నెమ్మదిగా.. ఒక్కోసారి వేగంగా.. డప్పు శబ్దాన్ని బట్టి లయబద్ధంగా… పాట ఉండదు. ఆ శబ్దాలకు అనుగుణంగానే నృత్యం ఉంటుంది. మగవారి తలలపై గేదె కొమ్ములతో చేసిన కిరీటాలు, చూడ్డానికి గేదె తలపై కుచ్చులా నిలువుగా నిల్చున్న పక్షుల ఈకలు. ఆ కిరీటం నుండి మొహంపైకి వేలాడే గవ్వలు. చాలా గమ్మత్తుగా, మెడలో పూసలను నల్లటి దారానికి  గుచ్చిన దండలూ.. రెండు భుజాల మీదుగా ముందుకు వేసుకున్న పొడవాటి వాద్య పరికరం.

మహిళలు తెల్లటి చీరలో సంప్రదాయ కట్టుతో అలంకరణలో.. వారి నృత్యంలో మా బృందం కూడా చేరింది. వారి అడుగుతో అడుగు కలిపింది. ఆ తర్వాత మారియా తెగకు చెందిన ఆడపిల్లలు చాలా వేగంగా  ఉన్న స్టెప్పులతో చేసిన నృత్యం అబ్బురపరచింది.

రాత్రి భోజనాల అనంతరం సంస్కృతి గ్లోబల్‌ పాఠశాల పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు మా మనసుల్ని అప్పటికి కొద్దిగా తేలికపరిచాయనుకున్నాం. కానీ అక్కడి సామాజిక పరిస్థితుల గురించిన ఆలోచన మమ్మల్ని వెంటాడుతూనే ఉంది.

మర్నాడు ఉదయమే బయలుదేరాం. మార్గమధ్యలో కాట్పాడ్‌ మార్కెట్‌లో ఆగుదామన్నా, సిమిలిగుడా  సంతలోనో, మరో సంతలోనో ఆగి గిరిజనులతో కొంతసేపు గడుపుదామనుకున్న మా ప్లాన్‌కి భంగం కలిగిస్తూ వర్ష.ం. కానీ దారంతా అద్భుతమైన సోయగంతో అలరిస్తున్న ఆ వర్షపు ఛాయల్లోనే రోడ్డు పక్కన ఉన్న చిన్న షెల్టర్‌లో ఆగి భోజనాలు. భోజనాల గురించి చెప్పుకునేటప్పుడు మాకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా మంచి భోజనం అందించిన రైల్వే కేటరింగ్‌ కాంట్రాక్టర్‌ అప్పారావు గారికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే.

విశాఖ సముద్ర తీరం చేరగానే జరిగిన ముగింపు సభతో మా యాత్ర ముగిసింది. సామాజిక పరిస్థితుల దృష్ట్యా చూస్తే మాది సాహస యాత్రే అనిపించింది. ఒకప్పుడు ఆంక్షలు లేని స్వేచ్ఛా జీవితం గడిపిన ఆదివాసీల ఉనికి పారిశ్రామీకరణ, ఆధునికీకరణ, అభివృద్ధీకరణలతో ప్రశ్నార్థకమౌతున్న స్థితి. కష్టాల కడలిలో కొట్టుకుపోతూ అనేక ఆంక్షల నడుమ చేసే జీవన పోరాటం తాలూకు ఆలోచనలు తీర్థఘడ్‌ జలపాతంలా ఎగిసిపడుతూ.. మాలో తెలియని స్ఫూర్తిని నింపిన భావనలతో పాటు అడవి మల్లెల సువాసనలు.. పరవశింపచేసే లోయల ఒంపు సొంపుల ఆందాలూ.. ఆత్మీయంగా పలకరిస్తూ సాగిపోయే పిల్ల గాలులూ.. జలపాతపు సవ్వడులూ.. ఇంకా మా ముందు కదలాడుతూ, కెమెరాలోనూ, మదిలోనూ బంధించిన వందలాది క్లిక్‌లను మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ.. చిత్రకూట్‌ జలపాతంలా ఉత్సాహంతో ఉరకలు వేస్తూ మరో యాత్ర కోసం సిద్ధమవుతూ.. చివుర్లు తొడిగిన పచ్చని స్నేహ సంబంధాల్ని, మానవ సంబంధాల్ని చిక్కబరుచుకుంటూ.. ప్రపంచాన్ని తెలుసుకుంటూ..

”మొత్తం చిత్రకూటమి యాత్రలో అత్యంత ఆసక్తి కలిగించిన విషయం సోషల్‌ యాక్టివిస్టులు, జర్నలిస్టులతో సంభాషణ. చాలా చల్లని వాతావరణంలో వాడి వేడి చర్చలు. వారు చెప్పిన విషయాలు మమ్మల్ని ఎంతో విస్మయపరిచాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 30 వేల మంది, అనధికారిక లెక్కల ప్రకారం లక్షమంది బాలలు బడికి దూరమయ్యారని తెలపడం. ఆ పిల్లలపై పడుతున్న ఒత్తిడి.. యుద్ధ నేపథ్యం, గన్నులు, చంపుకోవడాలు, రక్తపు మరకలతో తడిసిన బాల్యం.. నక్సలైట్లు, సల్వాజుడుం, పోలీసు యంత్రాంగం మధ్య నలిగిపోతున్న బాల్యం చాలా బాధాకరం.” – జస్వంత్‌, 10వ తరగతి విద్యార్థి, సంస్కృతి గ్లోబల్‌ పాఠశాల.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

3 Responses to చిత్రకూటమి యాత్ర ఓ రకంగా సాహసయాత్రే..?!- వి.శాంతి ప్రబోధ

  1. సాదనాల వేంకట స్వామి నాయుడు says:

    పర్యటను దృశ్యమానం చేశారు . అభినందనలు

  2. సాదనాల వేంకట స్వామి నాయుడు says:

    పర్యటను దృశ్యమానం చేశారు . అభినందనలు . సాదనాల వేంకట స్వామి నాయుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>