మణిపూర్‌ మహిళా పోరాటం- పింగళి చైతన్య

పన్నెండేళ్ళ క్రితం ఆ దేహాల మీద సిజేరియన్‌ కోతలు చూశాను..
ఇప్పుడు గుండె కోతలు చూశాను..
మణిపూర్‌ రాష్ట్రంలోని ఇంఫాల్‌ జిల్లాలో నివసిస్తున్న మణిపురి యువతి తంగ్జోమ్‌ మనోరమ యింటిలోకి 2004 జులై 10-11 మధ్య అర్థరాత్రి అస్సాం రైఫిల్స్‌కు చెందిన సాయుధ సైనికుల బృందం ప్రవేశించింది. ఆమె నోరును నొక్కిపెట్టి హింసిస్తూ ఆమెను వాహనంలో కూలేసి లాక్కొని పోయారు. మరుసటి రోజు ఆమె అర్ధనగ్నంగా శవమై తేలింది. అమె లైంగిక దాడికి గురి అయినదని స్పష్టంగా అర్థం అయ్యింది. మనోరమ హత్యకు నిరసనగా పదకొండు మంది మహిళలు పూర్తిగా వివస్త్రలై నగ్నంగా ప్రదర్శన నిర్వహించి సంచలనం సృష్టించారు. ”సైనికులారా మమ్మల్ని కూడా రేప్‌ చేయండి” అని రాసి ఉన్న బ్యానర్‌ ప్రదర్శిస్తూ అస్సాం రైఫిల్స్‌ కార్యాలయం ముందు వారు నగ్న ప్రదర్శన చేశారు. అయినప్పటికీ తోలు మందం ప్రభుత్వాలు ఒక్క అంగుళం కూడా కదిలిన పాపాన పోలేదు. అఫ్స్పా చట్టం సాకు చూపి సైనికులపై విచారణ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరాకరించాయి.

నేటి జులైకి ఈ ప్రదర్శన జరిగి పన్నెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ పన్నెండు సంవత్సరాలలో ఈశాన్య రాష్ట్రాలలో పరిస్థితులు ఇంకా అధ్వాన్నంగా మారాయి. ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను భారత ప్రభుత్వం తుపాకులతో అణచివేస్తోంది. స్త్రీలపై లైంగిక దాడులు పెచ్చరిల్లి పోయాయి. 2004 జులై 13న నగ్న నిరసన ప్రదర్శన చేసిన మహిళలు ఇప్పటికీ ఉద్యమిస్తున్నారు. ఆ నాటి మహిళలలో ఇబెంహాల్‌ లెయిమా, మమన్‌ లెయిమా, జీబన్‌ మాలా లెయిమాలను పింగళి చైతన్య కలిశారు. ఇంఫాల్‌లో ఆమె అనుభవాలు…

*****

ఇటువంటి పోరాటాన్ని ఎలా వర్ణించాలో… ఏ పదం ఉపయోగించాలో తెలీట్లేదు. 2004లో ”ఇండియన్‌ ఆర్మీ రేప్‌ అజ్‌” అని బ్యానర్‌ పట్టుకుని కాంగ్లా కోటని ఆక్రమించిన అస్సాం రైఫిల్స్‌ ముందు నిలబడి… పోరాడిన ఆ ధీర వనితల్ని కలవడానికి ఇంఫాల్‌ వెళ్ళాను. కళ్ళు ఏం చూశాయో చెప్పడానికి… మాటలు విఫలమవు తాయి. గుండె బరువు దించుకోవడానికి… అక్షరాలు సాయానికి రావు. ఏదో యుద్ధాన్ని దగ్గర నుండి చూసినట్లుంది. సరిగ్గా మేం ఇంఫాల్‌ వెళ్ళే సరికి… అక్కడ ప్రజలందరూ సమ్మె చేస్తున్నారు. తారిణి బబిత అనే యువతిని ఇండియన్‌ ఆర్మీ కాల్చింది. మరో ఇద్దరు కాలేజీకి వెళ్తున్న కుర్రాళ్ళని ఏ కారణం లేకుండా  జవాన్లు చితక్కొట్టారు. గతంలో ఆర్మీ చేసిన మరో హత్య కేసులో ఆ రోజే ఒక జవాను కోర్టులో నేరం అంగీకరించాడు.

వీటన్నిటివల్లా  ప్రజలూ, ఆర్మీ ఇరు వర్గాలు ఆవేశంగా ఉన్నారు. ప్రజలు ఎక్కడికక్కడ టెంట్లు వేసి ధర్నా చేస్తున్నారు. అక్కడ నిరసన చేసే పద్ధతి ఇక్కడి పరిస్థితులకు చాలా  భిన్నంగా ఉంటుంది. ప్రజలంతా ఒకే చోట కాకుండా… ఎవరి ఇంటి దగ్గరున్న రోడ్డు మీద వాళ్ళు చేస్తారు. ఒక వరుసలో రోడ్డుకి అడ్డంగా  కూర్చుంటారు. వాళ్ళకి ఒక అర కిలోమీటరు దూరంలో మరి కొంతమంది కూర్చుంటారు. వాళ్ళకి దూరంలో  ఇంకొంతమంది… అలా  వరుసలు, వరుసలుగా,  అన్ని చిన్న చిన్న గల్లీలతో సహా, అన్ని రోడ్లమీదా నిరసనకి కూర్చుంటారు ప్రజలు. ఆర్మీ వాళ్ళు మొదటి వరుసలో ఉన్న వాళ్ళమీద దాడి మొదలు పెట్టగానే రాయి తీసుకుని కంచం మీదో, కరంటు స్తంభం మీదో కొడుతూ… వెనుక కూర్చున్న వాళ్ళని హెచ్చరిస్తారు ఉద్యమకారులు. ఆ శబ్ద సంకేతం రాగానే… తర్వాత వరుసలో కూర్చున్న వాళ్ళు రాళ్ళు, మైకులు తీసుకుని అప్రమత్తమవుతారు. చంటిపిల్లలుంటే.. ఇళ్ళలో దిగబెట్టి, ఆర్మీతో యుద్ధానికి సిద్ధమవుతారు. మొదటి వరసలో ఉన్నవాళ్ళ మీద రబ్బరు బుల్లెట్లో, టియర్‌ గ్యాసో, లాఠీ ఛార్జో చేసి.. ఆర్మీ వాళ్ళు ముందుకు సాగుతారు. ఆర్మీ అలా ముందుకు సాగగానే, వెనకే అంబులెన్స్‌ గాయపడిన వాళ్ళని ఎక్కించుకుని తీసుకెళ్తుంది. దాదాపుగా అర కిలోమీటరు దూరంలో కూర్చున్న తర్వాత వరస నిరసన కారుల దగ్గరికి ఆర్మీ హెచ్చరిస్తూ నడుస్తుంది. ఆ నిరసన కారులు కూడా ముందుకు రావద్దని, తమది న్యాయమైన డిమాండని, ఇంఫాల్‌ని వదిలి ఆర్మీ వెళ్ళిపోవాలని మైకుల్లో అరుస్తూ ఉంటారు. వాళ్ళని ఆర్మీ చేరుకోగానే .. మామూలు కథే. రబ్బరు బుల్లెట్లు, లాఠీఛార్జీలు, గాయాల పాలయ్యే మణిపురిలు. కానీ… చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే… ఇక్కడ నిరసన చేసేది అత్యధిక శాతం ఆడవాళ్ళే. తొమ్మిది మంది స్త్రీలు ఉంటే ఒక పురుషుడు ఉంటాడు…నిరసనల్లో. అన్ని వయసుల స్త్రీలు ధర్నాల్లో ఉంటారు. మణిపూర్‌లో ఎక్కువగా వాన పడుతుంటుంది కాబట్టి.. ఇది దీర్ఘకాలిక పోరాటం అని వాళ్ళకు ముందే తెలుసు కాబట్టి..

వాళ్ళు ఎక్కడికక్కడ పర్మనెంటు షెడ్డులు వేసుకున్నారు.. టెంట్ల బదులు! ఇక దీన్నిబట్టి అక్కడి పరిస్థితిని ఊహించుకోండి.

మేం ఆర్మీ రాక ముందే పశ్చిమ ఇంఫాల్‌లోని ఉరిపోక్‌ అనే ప్రాంతాన్ని చేరుకున్నాం. 2004లో జులై 14న కాంగ్లా కోట ముందు నగ్నంగా  నిరసన తెలియ చేసిన 11 మంది స్త్రీలలో… ముగ్గురు ఆ ప్రాంతంలో ధర్నా చేస్తున్నారు. వాళ్ళ పేర్లు ఆంగోమ్‌ జీబన్‌మాలా  లెయిమా, సైబమ్‌ మామన్‌ లెయిమా, మీతమ్‌ ఇబెంహాల్‌ లెయిమా. వాళ్ళని కలవడానికి.. చాలా వరసల నిరసనకారులను దాటుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. మమ్మల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళనిచ్చేందుకు అక్కడి ప్రజలు ఒప్పుకోలేదు. ‘మీకేం పని?’ అని అడిగారు. నేను రచయిత అని, ప్రెస్‌ అని చెప్పాను. ప్రెస్‌ కార్డు చూపించమన్నారు. నా దగ్గర లేదు. చేతిలో నేను రాసిన పుస్తకాలను చూపించి, మణిపూర్‌ మహిళల పోరాటం గురించి రాద్దామనుకుంటున్నాను అని చెప్పాను. మాతో పాటుగా వచ్చిన ఒనిల్‌ అనే మానవ హక్కుల కార్యకర్త వాళ్ళని ఒప్పించి మమ్మల్ని ఆ మహిళల దాకా తీసుకొచ్చాడు. ఇలా చాలా  వరసల నిరసనకారులను ఒప్పించి..మేం వెళ్ళేసరికి ఆ ముగ్గురు స్త్రీలు కొన్ని బ్యానర్లు పట్టుకుని ఒక షెడ్డులో కూర్చున్నారు. వాళ్ళతో ఎలా  మాట్లాడాలో, ఏం అడగాలో నాకు తెలియట్లా. ఎందుకో నాకు చాలా సిగ్గేసింది వాళ్ళముందు తలెత్తుకోడానికి. ‘ఏదో ఒకటి చెప్పండమ్మా.. మీరేం చెబితే అదే రాసుకుంటాను’ అని చెప్పాను. ‘నువ్వు అడిగితే మేం సమాధానం చెబుతాం’ అని వాళ్ళన్నారు.

ఏదో ఒక ప్రశ్నతో మొదలుపెట్టాలి కాబట్టి జులై 2004 నాటి పోరాటానికి కారణం ఏమిటి? అని అడిగాను.

ఇబెంహాల్‌ సమాధానం ఇచ్చారు. ”జులై 11వ తేదీ ముందు రోజు రాత్రి మనోరమ అనే యువతిని 17వ అస్సాం రైఫిల్స్‌ ఆర్మీ అరెస్టు చేయడానికి ఇంటికి వచ్చారు. ఆ ఇంటి వరండాలోనే.. ఆమె కుటుంబ సభ్యుల ఎదురుగానే, మనోరమ కళ్ళకి గంతలు కట్టి అరగంట పాటు జాలీ, దయా లేకుండా చావబాదారు. అక్కడే ఆ వరండాలోనే లైంగికంగా కూడా హింసించారు. ఆ తర్వాత అరెస్టు నెపంతో మనోరమని తీసుకెళ్ళిపోయారు. 11వ తేదీన ఆమె శవం… సగం సగం బట్టలతో, ఒంటిమీద బుల్లెట్‌ గాయాలతో, తొడలమీద కత్తి గాట్లతో రోడ్డుమీద పడి కనిపించింది. మమ్మల్నేం చేయమంటారు? ఎన్నిసార్లు ఇలా ఎంతమంది అమ్మాయిలకు జరిగిందో తెల్సా? 15 ఏళ్ళ వయసు పిల్లల్నుండీ….” అని చెప్పి ఆమె ఏడవడం మొదలుపెట్టింది.

ఆ టెంటులో ఆ చుట్టుపక్కల కూర్చున్న అమ్మాయిలు ఆమె భుజాలను పట్టుకుని ఓదార్చుతూ ఉన్నారు. వాళ్ళ మొహాల్లోకి చూసే ధైర్యం లేదు నాకు. ఇబెంహాల్‌ నా గడ్డం పట్టుకుని… ”చూడు, ఈ అమ్మాయిల్లో ఎవరినైనా సరే రేప్‌ చేయొచ్చు… చూడు..వీళ్ళని చూడు..” అంటూ అందర్నీ చూపిస్తోంది. నేనూ ఏడ్చాను. ఇంతలో గట్టిగట్టిగా కంచాన్ని కొడుతున్నట్లు శబ్దం వినిపించింది. నాకు అర్థం కాలేదు. ఏమయింది అని అడిగాను. ”వాళ్ళు వస్తున్నారు. ఈ రోడ్డున మనకంటే ముందు దీక్షలో కూర్చున్న వాళ్ళని కొట్టేశారన్నమాట” అని చెప్పిందో మహిళ.

నేను వెంటనే టెంటు నుండి రోడ్డుమీదకి వెళ్ళి చూశాను. ఆర్మీ జట్లు జట్లుగా  నడుచుకుంటూ వస్తోంది. మేం కూర్చున్న టెంటులో నుండి కొందరు, చుట్టుపక్కల ఇళ్ళలోనుండి కొందరు టీనేజ్‌ అమ్మాయిలు, అబ్బాయిలు…ఆర్మీకి ఎదురెళ్ళి టెంటు వరకు రానివ్వకుండా నిలబడ్డారు. ఏవో నినాదాలు ఇస్తున్నారు. నేను, నా సహచరుడు నిలబడి చూస్తున్నాం. ఇంతలో తొంగమ్‌ సునీత అనే అమ్మాయి నన్ను టెంటు లోపలికి గుంజుకుని వచ్చి…”తక్కువ టైం ఉంది. ఇంటర్వ్యూ త్వరగా చేసేయండి” అంది. ఆమే నాకు అనువాదంలో సహాయపడుతోంది. నేను తిరిగి టెంటులోకి వచ్చి..ఆ ముగ్గురు స్త్రీల ముందూ కూర్చున్నా. వాళ్ళకేమనిపించిందో కానీ.. నన్ను చూసి, నా భుజం తడుతూ నవ్వారు.

‘వారంలో రెండు రోజులిదే పరిస్థితి. మేమే సమ్మె చేస్తాం. లేకపోతే వాళ్ళే 144 సెక్షన్‌ విధిస్తారు. అంతా బంద్‌. ఇలాగే బతుకుతుంటాం. నిన్న బబిత అనే అమ్మాయిని కాల్చారు. ఆమె చేసిన నేరం ఏంటి? ఇద్దరు కాలేజీ కుర్రాళ్ళని ఆర్మీ జవాన్లు నడిరోడ్డున కొడుతుంటే.. ఎందుకు కొడుతున్నారు? అని అడిగింది. ఆ మాత్రం దానికే ఆమె ఒక మిలిటెంట్‌ అని ముద్ర వేసి షూట్‌ చేశారు. ఆమె ఇద్దరు పిల్లల తల్లి. గృహిణి. అమ్మో, నాన్నో, అసలు ఇద్దరూ కూడా లేని పిల్లలు ఎంత మంది తెల్సా? దేవుడు తీసుకెళ్ళిపోయాడా? కాదు వీళ్ళే చంపారు. వీళ్ళే ఆ పిల్లలకి అమ్మానాన్నల ప్రేమని లేకుండా చేస్తున్నారు..’ అని చెప్పింది జీబన్‌మాలా లైమా.

వాళ్ళు మాట్లాడుతుంటే.. నాకేం ప్రశ్నలు అడగాలో తెలీట్లేదు. ఆర్మీ ఫైరింగ్‌ చేస్తామని హెచ్చరించింది. వెంటనే.. మైక్‌ పట్టుకుని ఒకమ్మాయి ఆవేశంగా మాట్లాడడం మొదలుపెట్టింది. అందరూ ఎమోషనల్‌గా ఛార్జ్‌ అయి ఉన్నారు. టెంట్‌లో కూర్చున్న ఆ ముగ్గురు స్త్రీల చుట్టూ ఆరుగురు కాపలాగా ఉండి.. మిగిలిన వాళ్ళంతా రోడ్డుమీద నిలబడ్డారు. మా అబ్బాయిని ఎత్తుకుని నా సహచరుడు, నేను కూడా  రోడ్డు మీదకెళ్ళి చూడడం మొదలుపెట్టాం. ఆర్మీ ముందుకు వచ్చేస్తోంది. వాళ్ళను అడ్డుకునే ప్రయత్నంలో కొందరు అమ్మాయిలు రాళ్ళు వేశారు. రాళ్ళకి బదులుగా రబ్బరు బుల్లెట్లు వచ్చాయి. టియర్‌ గ్యాస్‌ ప్రయోగించడం మొదలుపెట్టారు. అరుపులు.. దెబ్బలు తగిలి రక్తం కారుతున్న వాళ్ళని టెంటులోకి మోసుకుని తీసుకొస్తున్నారు. మా అబ్బాయి ఆ వాతావరణం చూసి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. వాడిని ఒక మణిపురి మహిళ ఎత్తుకుని, టెంటు వెనక్కు తీసుకెళ్ళి, ఒక షాపు తెరిపించి, లేస్‌ ప్యాకెట్‌ ఇప్పించి.. వాడిని అక్కడే కూర్చోబెట్టింది. నేను ఏడుస్తున్న మావాడ్ని, ఆర్మీని మార్చిమార్చి చూస్తున్నాను.

ఎవరో ఒకరు నన్ను చూసి.. ‘రాత్రి పడుకోలేడు, భయపడతాడు. కంగారుపడకు, మా పిల్లల్ని రప్పించమని కబురుపెట్టాను. మీ వాడికి తోడు ఉంటారులే. పిల్లలకి పిల్లలు జత’ అంది. నేను వద్దన్నాను. అనవసరంగా వాళ్ళని రప్పించడం దేనికి, వాళ్ళు కూడా భయపడతారు అన్నాను. ఆమె అలాంటి పరిస్థితుల్లో కూడా గట్టిగా నవ్వింది. ఆ చుట్టూ ఉన్నవాళ్ళు మమ్మల్నే చూశారు. ఏదో అడిగారు ఆమెని. ఆమె నవ్వుతూ.. ‘మా పిల్లలకి ఇవన్నీ అలవాటే. తుపాకీ అంచున నొప్పులు పడుతున్న అమ్మలకి పుట్టిన పిల్లలే ఎక్కువమంది’ అంది.

నేను మళ్ళీ టెంటులోకి వెళ్ళాను. ఆ ముగ్గురు స్త్రీల ముందు కూర్చున్నాను. ఇబెంహాల్‌ చెయ్యి పట్టుకుని ”ఆఫ్‌స్పా చట్టాన్ని ఎత్తేస్తారమ్మా. కచ్చితంగా జరుగుతుంది” అని చెప్పా. ”మేం బతికుండగా చూస్తామా?” అని మమన్‌ లెయిమా అడిగింది. నేను మౌనంగా  కూర్చున్నాను.

”ఆ రోజున కాంగ్లా గేటు ముందర నిలబడి బట్టలు తీసి పారేశాం. చెప్పు… ఏ స్త్రీ అయినా చేయగలదా ఆ పని? ఎందుకు చేశాం? బట్టలుండి ఉపయోగం ఏంటి? ప్రతి రోజూ మణిపూర్‌లో ఎక్కడో అక్కడ ఒక ఆడపిల్ల చిరిగిన బట్టలతో శవమై రోడ్డున తేలుతోంది. ఏం ఉపయోగం బట్టలతో… మేం అదే చెప్పాం… పదకొండు మంది ఉన్నాం ఆ రోజు. మమ్మల్ని రేప్‌ చేయండి, ఎంతమంది జవాన్లు కావాలంటే అంతమంది.. మేం బతికి

ఉన్నన్నాళ్ళూ మమ్మల్ని వాడుకోండి. కానీ.. మా పిల్లల్ని వదిలేయండి. మా అమ్మాయిల మానం చెడగొట్టొద్దు. మా అబ్బాయిలను బుల్లెట్లకు బలి చెయ్యొద్దు అని ఏడ్చాం. వాళ్ళేం అన్నారు? మా సీ.ఎం. ఏం అన్నాడు? మాది మొండితనం అన్నారు. ఇలా కల్లోలాలు సృష్టించడంవల్లే ఆఫ్‌స్పా వచ్చింది, నేను సెంటర్‌తో మాట్లాడతా, మీరు పోరాటం ఆపండి అన్నారు. ఏం చేశారు? పన్నెండేళ్ళయింది. ఏమన్నా మార్పు ఉందా? మేం మనుషులం కాదా? అని ఆవేశంగా అరిచింది సైబమ్‌ మమన్‌ లెయిమా.

మీ పోరాటం తర్వాత పరిస్థితుల్లో  కాస్త కూడా మార్పు రాలేదా? అని అడిగాను.

‘వచ్చింది. ఒకే ఒక్క మార్పు. మేము పవిత్రంగా, దేవతల నిలయంగా భావించే కాంగ్లా కోట నుంచి అస్సాం రైఫిల్స్‌ను పంపించేసింది కేంద్రం. దాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. అంతకు మించి ఏం జరగలేదు. ఢిల్లీలో నిర్భయకి జరిగింది… ఇక్కడ  ప్రతి నెలా ఎవరో ఒకరికి జరుగుతూనే ఉంటుంది. కానీ… వాటిని ఎవరన్నా పట్టించుకున్నారా? జాతీయ స్థాయి వార్త ఎప్పుడైనా అయ్యిందా? 15 ఏళ్ళుగా  ఇరోమ్‌ షర్మిల నిరాహార దీక్ష చేస్తోంది. ఎవ్వరికైనా పట్టిందా? మణిపూర్‌కి మోడీ వచ్చాడు. కనీసం ఇరోమ్‌ షర్మిలని కలవలేదు. అసలు మాకేం విలువ ఉంది? మేం చేసిన నేరం ఏంటి? ఎందుకు మమ్మల్ని మనుషులుగా  చూడరు? పన్నెండేళ్ళయింది. ఏం మారలేదు.. నిర్భయ ఘటన అప్పుడు దేశమంతా అల్లకల్లోలం చేసి నిర్భయ చట్టం తెచ్చారు. మరి మా కోసం ఎవరన్నా అడిగారా?” అని నన్నే నిలదీసినట్లు అడిగింది ఆవిడ.

”2004లో మీరు చేసిన పోరాటానికి కూడా ప్రజలు బాగా కదిలిపోయారు. అప్పటికి సోషల్‌ మీడియా ఇంతగా లేకపోబట్టి ప్రచారం కాలేదు. మా తెలుగు భాషలో పత్రికల వాళ్ళు చాలామంది మీ గురించి రాశారు. కవితలు వచ్చాయి. ఖండనలు వచ్చాయి. నేను కూడా రాశాను…” అని నా దగ్గరున్న పీడీఎఫ్‌ ప్రతిని చూపించాను. వాళ్ళ ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. నేను చూపించిన పీడీఎఫ్‌లో వాళ్ళ ఫోటో ఉండబట్టి వాళ్ళ గురించి రాశామని వాళ్ళకి అర్థమైంది. మన భాష అర్థం కాకపోయినా.. ఏం రాశానో అక్షరం అక్షరం చదివి వినిపించుకున్నారు. ఇంకా చాలా మందే రాశారు అని శివసాగర్‌ కవిత చెప్పాను. ఏమన్నా
ఉంటే పేపర్‌ కటింగ్స్‌ పంపమని అడ్రస్‌ కూడా  ఇచ్చారు. ఇంతలో ఆర్మీ ఉద్యమకారులని దాటుకుని టెంటుదాకా రానే వచ్చింది. వాళ్ళకీ, వీళ్ళకీ మాటల యుద్ధం జరుగుతోంది. ఆర్మీ వాళ్ళు మమ్మల్ని చూసి, వీళ్ళెవరు? అని అడిగారు. అప్పటిదాకా మాతో అంత ప్రేమగా మాట్లాడి, బాబుకి బంద్‌ టైంలో కూడా లేస్‌ కొనిచ్చినవాళ్ళు… ఒక్కసారి ‘మాకు తెలియదు’ అని ఇంగ్లీషులో చెప్పారు. మాకేం అర్థం కాలేదు. నేను వాళ్ళని అయోమయంగా చూశాను.

‘టూరిస్టులు. బంద్‌ అని తెలీక రోడ్డు మీదకి వచ్చారంట. ఎటు వెళ్ళాలో తెలియక ఇక్కడ ఆగారు’ అని మా వైపు చూసి. సైగ చేశారు. అక్కడ ఉన్న జర్నలిస్టులు కూడా, ‘మీరు ఇక్కడ ఉండడం సేఫ్‌ కాదు, వెళ్ళిపోండి’ అని గట్టిగా చెప్పారు. మేం మొండిగా నిలబడ్డాం. ”ఏం జరుగుతుందో చూస్తాం. మీరుండలా, మేమూ అలాగే ఉంటాం” అని చెప్పాం. వాళ్ళలో ఒకడు చేతికి తగిలిన దెబ్బ చూపించి, ఇదే దెబ్బ మీ బాబుకి తగలొచ్చు. వెళ్ళిపోండి అని చెప్పారు. ఆర్మీ వాళ్ళు మా దగ్గరికి వచ్చి, వార్నింగ్‌ ఇచ్చారు. మేం ఆ స్త్రీల వైపు చూస్తే, ‘వెళ్ళిపోండి.. ఎవరు చెప్పారు మణిపూర్‌కి వెళ్ళమని. ఇక్కడ మీరు పీల్చే గాలి.. ఎందరో పిల్లల.. ఆఖరి శ్వాస’ అని మా మీద గట్టిగా అరిచి, వెళ్ళిపోండిి బాబు ఉన్నాడు అన్నట్టు సైగ చేసింది.

మేము మౌనంగా మా హోటల్‌వైపు నడిచాం. దారిలో టియర్‌ గ్యాస్‌, రబ్బరు బుల్లెట్ల ఆనవాళ్ళు, రక్తం మరకలు… ఆ మర్నాడు పేపర్‌లో … రక్తం ఓడుతున్న కుర్రాళ్ళ ఫోటోలు…
– మాతృక (జులై 2016) సౌజన్యంతో…

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.