హెచ్ఐవి/ ఎయిడ్స్- మహిళలపై కుటుంబ హింస

గోరుచుట్టులా బాధపెడుతున్న కుటుంబహింసతో సతమతమవుతున్న మహిళలకు హెచ్ఐవి సోకడం నిజంగా రోకటిపోటే. సాధారణంగా మహిళలకున్న సమస్యలకు తోడు హెచ్ఐవి/ ఎయిడ్స్ వల్ల కుటుంబహింస మరింతగా పెరుగుతున్నది. ‘పెళ్ళి’కి ముందే హెచ్ఐవి వుందని తెలిసి కూడా అవతలి అమ్మాయితో పెళ్ళికి సిద్ధపడే క్రూరులున్న సమాజంలో చాలామంది మహిళలు వారి భర్తల ద్వారా హెచ్ఐవి/ ఎయిడ్స్ బారిన పడుతున్నారు. తమ భర్తల నుండి హెచ్ఐవి తీసుకుని, మళ్ళీ వారికే సేవలు చేస్తూ బ్రతుకుతున్నారు. తల్లినుండి పిల్లలకు హెచ్ఐవి రాకుండా నివారించవచ్చనే అవగాహన లేని సందర్భంలో పాజిటివ్ పిల్లలకు జన్మనిస్తున్నారు. ఇలాంటివారు ఒకవైపు భర్తతో, మరోవైపు పిల్లలతో, ఇంకా తమ ఆరోగ్య సమస్యలతో క్షణం తీరిక లేకుండా, మానసికంగా కృంగిపోతున్నారు.

పెళ్ళయిన తర్వాత కూడా హెచ్ఐవి వచ్చిన మగవాళ్ళు ఆ విషయం దాచి భార్యకు హెచ్ఐవి ఇవ్వడం జరుగుతోంది. హెచ్ఐవి వుందని తెలిసి భార్యకు ఇవ్వడం అన్యాయం కదా అంటే “నీకు హెచ్ఐవి లేకపోతే నువ్వు నేను పోయిన తర్వాత ఇంకొకడిని పెళ్ళి చేసుకుంటావు, ఆ అవకాశం నీకు ఎందుకివ్వాలి” అంటూ కండోమ్ లేకుండా సెక్స్ కు బలవంతం చేసే మగవాళ్ళున్నారు. బయట పనిచేసే స్త్రీలు అయితే “నాకు హెచ్ఐవి వుందని బయట ఎవడితోనో తిరిగొస్తున్నావా” అంటూ వారిని అనుమానించడం, హెచ్ఐవి వుందని తెలిసి పనిమానేసి, ఆడవాళ్ళను సంపాదించి ఇమ్మని వేధించడం వంటివి సాధారణంగా జరిగిపోతున్నాయి.

ఆ కుటుంబంలో అత్త మంచిదయితే సరి, లేకపోతే నా కొడుక్కు ఈ మాయదారి జబ్బు నీవల్లనే వచ్చిందని తిట్టడం, కొట్టడం, నీ మొగుడేం సంపాదించడం లేదు, నువ్వు ఇంట్లో పనిచెయ్యి అంటూ పనిమనిషిలాగా చూడ్డం జరుగుతోంది.

హెచ్ఐవితో భర్త చనిపోయిన తర్వాత, అప్పటివరకూ తల్లిదండ్రులు పెట్టిన నగలు, డబ్బులన్నీ భర్త వైద్యం కోసం ఖర్చుచేసి, చేతిలో ఏమీలేక భర్త కుటుంబంపై ఆధారపడిన మహిళలకు నిరాదరణ ఎదురవుతున్నది. ఇంట్లోంచి బయటకు తరిమేయడం, బిడ్డ వుంటే, ఈ బిడ్డ మా కొడుక్కి పుట్టలేదనడం, మా కొడుకు పోయినాడు, నీకూ మాకూ సంబంధం లేదు, అని వారిని వదిలించుకోవడం జరుగుతున్నది. 20- 25 ఏళ్ళకే పెళ్ళిళ్ళు కావడం, భర్త చనిపోవడం అన్నీ జరిగిపోతున్నాయి. ఇంట్లో మామ, మరుదులు లైంగికంగా వేధించడం జరుగుతున్నది.

ఇక్కడ ఆస్తి సమస్య ముఖ్యమైంది. కొడుకు చనిపోయిన తర్వాత కోడలికి ఆస్తి ఇవ్వకుండా వేధించడం జరుగుతున్నది. ఆస్తి అడిగితే చంపుతామని బెదిరించడం, ఇంటినుండి తరిమేయడం, కొట్టడం వంటివి భర్త కుటుంబం నుండి ఎదురవుతున్నవి. అవగాహన ఉన్నవాళ్ళు కోర్టుకు వెళ్ళి కొట్లాడుతున్నారు, కానీ ఏ అండాలేనివాళ్ళు ఆస్తిని వదులుకోవలసి వస్తున్నది, రోడ్డున పడవలసి వుంటుంది.

ఇదంతా ఒక ఎత్తయితే భర్త కుటుంబంలోని అత్త, మామ, మరుదులు, ఆడపడుచులు వీరిపై చూపే వివక్ష, సూటిపోటి మాటలు హెచ్ఐవితో జీవిస్తున్న మహిళల్ని మరింత బాధకు గురిచేస్తున్నాయి. అక్కున చేర్చుకుని ఆదరించాల్సిన కుటుంబసభ్యులే ఆమె చేసిన వంటను తినకపోవడం, అందరూ వాడే బాత్రూములను ఉపయోగించవద్దని ఆంక్షలు పెట్టడం, దూరంగా వుంచడం జరుగుతున్నది. కొడుకు హెచ్ఐవి/ ఎయిడ్స్ తో మంచంలో వుంటే సపర్యలు చేసే అత్తలు, కోడలు మంచం పడితే పట్టించుకోకుండా ఇంటి బయట పెట్టేస్తున్నారు. కొన్ని హెచ్ఐవి బాధిత కుటుంబాల్లో యజమాని ఆరోగ్యం కోసం వున్న ఆస్తినంతా కరగదీసుకున్న భార్యలు చివరికి అతను మరణించినపుడు కుటుంబంలో బిడ్డను, అత్తను పనిచేసి పోషించవలసి వస్తున్నది. కొన్నిసార్లు భర్త చేసిన అప్పును తీర్చవలసి వుంటుంది. అప్పటివరకు బయట ప్రపంచం చూడని మహిళలు ఒక్కసారిగా కుటుంబ బాధ్యతలు తలకెత్తుకుని, నిరాశా నిస్ప్పుహలతో బ్రతుకీడుస్తున్నారు. తమ పిల్లలకోసం బ్రతుకుపోరాటం సాగిస్తున్నారు. కొన్ని కుటుంబాలలో కొడుకు చనిపోయినపుడు బిడ్డను మాత్రం అత్త మామ వుంచుకుని, కోడల్ని ఇంటినుండి తరిమేస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో ఆ మహిళల గుండెకోత నిర్వచించలేనిదిగా వుంటోంది.

హెచ్ఐవి బాధిత కుటుంబాలలోని మహిళలు భర్త ద్వారాగాని, భర్త కుటుంబం ద్వారాగానీ ఎదుర్కునే హింసను గ్రామపెద్దలకు ఫిర్యాదు చేస్తారు. అటువంటి సందర్భాల్లో, ఆ మహిళలు ఎదుర్కునే హింస కళ్ళకు కట్టినట్టు కన్పిస్తున్నా సంప్రదాయం పేరుతో గ్రామపెద్దలు, పోలీసులు భర్త కుటుంబం పక్షం వహిస్తారు. హెచ్ఐవి ఉన్న భర్తతోనే సంసారం చేయాలని, భర్త చనిపోయిన సందర్భాల్లో కొడుకును పోగొట్టుకున్న భర్త తల్లివైపే న్యాయం వుంటుందని, ఆస్తిపాస్తులు ఆమెకే చెందాలని ఈ పంచాయితీల్లో తీర్మానించేస్తారు. దీంతో బాధిత మహిళకి కుటుంబ హింసనుండి బయటపడడానికి ఉన్న అన్ని దారులూ మూసుకుపోతాయి.

కుటుంబ హింసను ఎదుర్కొంటున్న మహిళల డిమాండ్స్: –

– కుటుంబంలో ఆడవాళ్ళపై మగవాళ్ళు హింసను గుర్తించడానికి, నివారించడానికి ఒక నిఘావ్యవస్థ ఏర్పాటు చేయాలి.
– కుటుంబహింస కేసులను విచారించే గ్రామపెద్దలు, పోలీసులు సాంప్రదాయాల పేరుతో బాధిత మహిళలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చే ధోరణి మానుకోవాలి.
– బాల్య వివాహాలను ఖండించాలి. లైంగికంగా పరిణితిలేని వయస్సులో పెళ్ళిళ్ళు చేయడం వల్ల ప్రాణాంతక వ్యాధులకు, లైంగిక హింసల బారిన బాలికలు పడే అవకాశం వుంది.
– పెళ్ళికి ముందు స్త్రీలకి లైంగిక ఆరోగ్యం పట్ల, హెచ్ఐవి పట్ల అవగాహన వుండాలి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.