సరసవాణి – భండారు అచ్చమాంబ; సరళీకరణ: పి. ప్రశాంతి

ఈ పండితురాలు తన భర్తయైన మండన మిశ్రుడు శంకరాచార్యుల వారితో వాదనచేసి ఓడిపోగా తాను ఆచార్యులతో వాదించింది. ఈమెకు గల అసమాన పాండిత్యాన్ని, సౌందర్యాన్ని చూసి లోకులు ఈమెను సరస్వతి అవతారమని అనుకునేవారు. అందువలన వారు ఆమెను ‘ఉభయ భారతి’ అని పిలుస్తుండేవారు. ఈమె ఆదిశంకరులవారి సమకాలీనురాలయినందున శంకరులవారి కాల నిర్ణయమే ఈమె కాల నిర్ణయమని వేరే చెప్పనక్కర్లేదు. ఆది శంకరుల వారు క్రీ.శ. 7వ శతాబ్దంనందు ఉండేవారని కొందరు, 8వ శతాబ్దానికి చెందినవారని కొందరు, 9వ శతాబ్దం వారని మరికొందరు చెప్తున్నారు. కానీ కొన్ని ఆధారాల వలన ఆదిశంకరుల వారు క్రీ.శ. 8వ శతాబ్దం చివర్లోను, 9వ శతాబ్దం ప్రారంభంలోను, ఉన్నట్లుగా అనేకమంది పండితులు నిర్ణయించి ఉన్నారు.

శోణనది తీరమునందు ఉండే విష్ణుశర్మ అనే బ్రాహ్మణునికి సరసవాణి ఒక్కతే కూతురు. అందువలన అతడామెను చాలా గారాబంగా పెంచుతుండేవాడు. తల్లిదండ్రులు ఆమెకు సకల విద్యలను నేర్పించారు. సాంఖ్య, పాతంజలి, వైశేషిక, న్యాయ, మీమాంస, వేదాంతం అనబడే ఆరు శాస్త్రాలను, వ్యాకరణం వంటి షడంగములను, కావ్య నాటకాలు, ఇతర విద్యలన్నీ ఆమె నేర్చుకుంది. ఇందువలన లోకులు ఆమెను చూసి అద్భుతపడుతుండేవారు.

ఇలా విద్యాగుణ సంపన్నయైన ఆ చిన్నది వివాహ వయసుకొచ్చింది. అప్పుడామె గుణవంతుడు, సురూపవంతుడైన ‘విశ్వరూప’ అనే మారుపేరు గల మండన మిశ్రుని ఖ్యాతిని బ్రాహ్మణుల నుండి విని ఉన్నది. మండన మిశ్రుడు కూడా సరసవాణి యొక్క సద్గుణాలను విని ఉన్నాడు. అందువలన వారిద్దరికి ఒకరినొకరు చూడాలన్న అభిలాష కలిగింది. కానీ వారు తమ తల్లిదండ్రులకు ఆ సంగతి చెప్పడానికి సిగ్గుపడి తమలో తామే కృశిస్తున్నారు.

ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తమ పిల్లలు ఇలా కృశించడానికి కారణం ఏమయ్యుంటుందా అని వారి జననీజనకులు ఆలోచించి, ఏదో ఒకరోజు దాని కారణం చెప్పక తప్పదని వారిని వారి తల్లిదండ్రులు బలవంతపరచగా నిజమైన కారణాన్ని చెప్పారు.

ఇంతట హిమమిత్రుడు సరసవాణి తండ్రి వద్దకు కన్య గురించి విచారించుటకు బ్రాహ్మణులను పంపాడు. వారికి విష్ణుశర్మ తగిన మర్యాదలు చేసి వారి రాకకు కారణమడగగా, వారును తాము వచ్చిన సంగతి అతనికి తెలిపి పిల్లను మండనునకిమ్మని అడిగారు. అందుకతడు తన భార్యనడిగి నిశ్చయించి చెప్పెదనని వారితో చెప్పి ఆమెనడుగగా ఆ యువతి ఇలా అంది.-

”ధనము, కులము, శీలము కలవానికి పిల్లను ఇవ్వాలని శాస్త్రాల యందును, వ్యవహారమునందును ప్రసిద్ధియే కదా? ఈ పిల్లడు దూరాన ఉండేవాడు. ఇతని కులశీలాలు  మనకి తెలియవు. కనుక దీని గురించి ఏమి చెప్పగలను”. అందుకతడు మండన మిశ్రుని విద్యాప్రభావంను పొగిడి ధనముకన్నా విద్యయే శ్రేష్ఠమని చెప్పాడు. అంతలో ఆ దంపతులిద్దరూ కుమార్తెకు ఆ సంగతి తెలిపి ఆమె మనోభావాన్ని తెలుసుకోదలచి ఆమె దగ్గరకెళ్ళి ఆ సంగతి తెలియచేసి నీ అభిప్రాయమేంటని అడిగారు. వారా వార్త చెప్పిన వెంటనే ఆ బాలకు అపరిమిత సంతోషం కలిగి ఆ సంతోషానికి ఆమె మనసులో ఇమడడానికి చోటు చాలక రోమాంచ రూపంలో బైటపడింది. దానివలననే ఆమె అభిప్రాయంను వారు అర్థం చేసుకుని ఆ వచ్చిన బ్రాహ్మణులకు తోడు తామొక బ్రాహ్మణుని వరుని చూడడానికి, లగ్నం నిశ్చయం చేయడానికి పంపారు. నాటికి పద్నాల్గవ రోజున దశమినాడు శుభచంద్రయుక్తమైన ముహూర్తం అని వ్రాసి గణితంలో ప్రవీణురాలైన సరసవాణి తమ బ్రాహ్మణుని చేతికిచ్చింది.

అంతట ఆ బ్రాహ్మణులు ముగ్గురూ కొన్ని రోజులకు మండనుని గ్రామం చేరి అతని తండ్రికి శుభలేఖను అందించారు. ఆయన దానిని చదువుకుని సంతోషించి శుభదినం నాడు బంధువర్గంతో తరలిపోయి కుమారుని వివాహం చేసారు.

కూతురు అత్తవారింటికి వెళ్ళేటపుడు సరసవాణి తల్లిదండ్రులు ఆమెకు ఇలా బోధించారు. ”ప్రియకుమారీ! నేటినుండి నీకు అపూర్వమైన దశ ప్రారంభమైంది. ఈ సుస్థితికి యోగ్యమైనట్లుగా నీవు ప్రవర్తించు. బాల్యంలోని ఆటలు వదిలిపెట్టు. ఎందుకంటే ఆ నీ ఆటలు మాకు సంతోషదాయకమైనట్లు ఇతరులకు కాజాలవు. స్త్రీలు వివాహానికన్నా ముందు తల్లిదండ్రుల ఆజ్ఞల్లో ఉండాలి. తదనంతరం వారికి పతియే గతి. కనుక నీవు పతి ఆజ్ఞల్లో ఉండు. ఇందువలన నీకు రెండుచోట్లా కీర్తి కలుగుతుంది. పతికంటే ముందే ఇందువలన నీకు రెండుచోట్లా కీర్తి కలుగుతుంది. పతికంటే ముందే లేచి స్నానం చెయ్యి. అతడు భోజనం చేయనిది నీవు భోజనం చేయకు. పతి గ్రామాంతరం వెళ్ళినపుడు అలంకారాలను ధరించకు. ఇలా అరుంధతి వంటి పతివ్రతలు నడిచినట్లు నడుచుటయే నీకు భూషణం. పతి కోపగించినపుడు మారుమాటాడకు. ఆయన కోపమంతటినీ ఓర్చుకో. ఇలా చేసినట్లయితే అతడు నీపై కోపాన్ని వదిలి ప్రేమిస్తాడు. శాంతికి సాటి ఏదీ లేదు సుమా. పతి ఇంటిలో లేనపుడు అతిథులెవరయినా వచ్చిన యెడల వారిని తిన్నగా  సన్మానించి ఆదరించి పంపాలి. అలా చేయని పక్షాన వారిలో ఎవరయినా  మహాత్ములు ఉన్నట్లయితే కులదాహమవుతుంది. అత్తమామలను తల్లిదండ్రులుగా చూడు. బావమరుదులను అన్నదమ్ములవలె చూడు. వీరికి  కోపం వచ్చిన యెడల నీకు నీ భర్తకు ఎంత అన్యోన్య ప్రేమ ఉన్నా మీలో భేదం పుట్టించగలరు.”        ఇలా వారు కూతురికి బుద్ధులు చెప్పి ఆమెను అత్తవారింటికి పంపారు. ఆ భార్యాభర్తలు తమ నగరానికి వెళ్ళి గృహస్థాశ్రమాన్ని చక్కగా గడుపుతుండేవారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన పిదప ఈ దంపతుల విద్యాప్రావీణ్యము లోకమంతటికీ వెల్లడైనందున శంకరాచార్యులవారు వీరితో వాదించి గెలుపొందాలని తలచి ఆ గ్రామానికి వెళ్ళి నీళ్ళు తీసుకుపోతున్న యువతులను మండనమిశ్రుని ఇల్లెక్కడని అడగగా వారిలా చెప్పారు.-

”ఎవరి ద్వారమునందు పంజరంలో ఉంచబడిన ఆడ చిలుక వేదము స్వత: ప్రమాణమా పరత: ప్రమాణమా అని చర్చించుచుండునో ఆ ఇల్లే మండనమిశ్రునిదని తెలుసుకొనుము”.

”పూర్వకృత కర్మ వలన మనమిప్పుడు చేసే పనులకు ఫలము కలుగునా లేక పురుష ప్రయత్నము వలన ఫలము కలుగునా అని ఏ ద్వారంలో పంజరంలోని శుక యువతులు/చిలుకలు వాదించుచుండునో అదే ఇల్లు  మండన పండితునిది అనుకొనుము”.

”జగత్తు నిత్యమా అనిత్యమా అని ఆడ రామచిలుక ఏ గృహం యొక్క సింహద్వారమందు ముచ్చటించుచుండునో ఆ గృహమే మండనునిది అనుకొనుము”.

వారలా చెప్పగా  శంకరులవారు అక్కడికి వెళ్ళి మండను నితో వాదభిక్ష తీసుకున్నారు. తర్వాత సమస్త విద్యాశారద అయిన సరసవాణిని సభకు అధిపతిగా చేసి వారు వాదవివాదమునకు

ఉద్యుక్తులయ్యారు.

ఇలా కొన్నిరోజులు వాదం జరిగిన పిదప మండనుడు వాదములో ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడతనిని అనుగ్రహించి శంకరులు అతనికి సన్యాసం ఇవ్వదలచగా సరసవాణి శంకరులతో ఇలా అంది:

”ఓ యతి శ్రేష్ఠా! నీ ఉద్దేశము నాకు తెలిసింది. నీవు నా పతిని గెలిచావు కనుక అతనిని నీ శిష్యునిగా తీసుకొనుట సరైనదే. కానీ నీవింకా అతనిని సంపూర్ణంగా ఓడించలేదు. అతని అర్థశరీరిణి అయిన నన్ను గెలిచినపుడు కదా మీ గెలుపు పూర్తవుతుంది. మీరు గొప్ప పురుషులయినప్పటికీ మీతో వాదం చేయాలని నాకు చాలా ఉత్కంఠ ఉంది.”

శంకరులు-”వాదవివాదమునందు ఉత్కంఠ కలదని నీవు చెప్పావు కానీ నీతో వాదం జరగదు, గొప్పవారు స్త్రీలతో వాదం చేయరు.”

సరసవాణి – ”స్వమతాన్ని స్థాపించదలచేవారు, తమ మతాన్ని ఖండించేవారు పురుషులైనా, స్త్రీలైనా వారితో వాదం చేసి వారిని పరాజితులను చేయుట అత్యంత ఆవశ్యకం. ఇందువలనే పూర్వం యాజ్ఞవల్కుల వారు గార్గితోను, జనకుడు అబలయైన సులభతోను వాదం చేశారు. వారు యశోనిధులు/గొప్పవారు కాకపోయారా?”

ఇలా సరసవాణి చెప్పిన యుక్తివాదం వలనను, పూర్వపు ఉదాహరణల వలనను కుంఠితులైన శంకరులవారు  సభయందు ఆమెతో వాదం చేయడానికి ఒప్పుకున్నారు.

పరస్పరం గెలవాలన్న ఉత్సాహంతోను, తమ బుద్ధిచాతుర్యం వలనను రచించిన శబ్దమనే అమృతంతో వినేవారిని విస్మయపరచేలా ఆ సరసవాణి శంకరులకు అత్యద్భుతంగా వాదం జరిగింది.

ఇలా అహోరాత్రులు పదిహేడు రోజుల వరకు అసమాన విద్యావంతులైన సరసవాణి, శంకరులకు ఘోరమైన వాదం జరిగి చివరకు సరసవాణి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక శంకరులు ఆమెని ఆరు నెలల వ్యవధి అడిగి వెళ్ళి మరికొంత విద్యనభ్యసించి మరల వచ్చి ఆమెకు సమాధానం చెప్పారు. ఆ తర్వాత మండనమిశ్రుడు సన్యసించగా సరసవాణి మరణించింది.

ఈ సరసవాణి చరిత్ర వలన ఆమె కాలంలోని హిందూ యువతులు గొప్ప విద్యని అభ్యసించేవారని, వారు గొప్ప పండితులతో సైతం వాదవివాదములు చేస్తుండేవారని తెలుస్తోంది. ఆ కాలంలో నోరులేని పసిపాపలకు తల్లిదండ్రులు తమ సమ్మతితో వివాహం చేసే ఆచారం లేక, కన్యావరులు (బాల బాలిలు) యుక్తవయస్కులైన తర్వాత వారి అనుమతిని అనుసరించే వివాహాలు జరుగుచుండేవని స్పష్టంగా తెలుస్తోంది. అప్పటి సంఘస్థితిని బట్టి చూడగా అప్పటి స్త్రీలు అత్యంత ఉచ్ఛస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆ కాలమునందు అలాంటి ఉచ్ఛపదవియందున్న హిందూ స్త్రీలు ప్రస్తుతం అత్యంత హీనస్థితికి వచ్చి తమ దుర్దశను కూడా తెలుసుకోలేనంత అజ్ఞానవంతులవడం ఎంతో దు:ఖకరం. పూర్వకాలంలోని స్త్రీలకు, ఈ కాలంలోని స్త్రీలకు గల తేడా సతీహితబోధినీ పత్రికలో చెప్పిన దానిని ఇక్కడ ఉదహరించి ఈ చరితము (కథ)ను ముగిస్తాను.

”ఈ భరతఖండమునందు ఇప్పుడున్న స్త్రీల స్థితికి పూర్వకాలంలోని స్త్రీల స్థితికి చాలా వ్యత్యాసం ఉంది. పూర్వకాలంలోని యువతులు విద్యలయందును, కళలలోను పాండిత్యం కలిగినవారై పురుషులకు ఉపదేశం చేయదగినంత మంచి దశలో ఉంటూ వచ్చారు. వేదంనందు వర్ణింపబడిన గార్గి, మైత్రేయి మొదలైనవారినే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చును, ఆ కాలంనందలి స్త్రీలు వేదవేదార్థాలు తెలిసిన వారని చెప్పడానికి శకుంతల మొదలైన వారిని ఉదాహరణగా చెప్పవచ్చు. యజ్ఞాదుల యందును, వివాహాల యందును స్త్రీలు పఠించాల్సిన మంత్రాలుండడమే మన పూర్వులు స్త్రీలు భాషాపాండిత్యం కలిగినవారై తెలుసుకొని ఉండాలని ఉద్దేశించినట్లు స్పష్టమవుతోంది. ఆ కాలంలో స్త్రీలు పురుషులలాగే గౌరవింపబడేవారు కానీ ఇప్పటిలా గదులలో మూసిపెట్టబడలేదు. వారికి అలాంటి స్వాతంత్య్రాలు పూర్వకాలంలో కలిగి ఉండేవని చూపడానికి, సీత మొదలగు క్షత్రియ స్త్రీలు సైతం భర్తలతో వచ్చి సభలలో సింహాసనముల మీద కూర్చుంటూ వచ్చిన వార్తను సూచించుటకన్నా విశేషమేమీ చెప్పనక్కరలేదు. ఇవి, అవి అని వేరుగా చెప్పనేల? ఆ కాలంలోని స్త్రీలకుండాల్సిన స్వాతంత్య్రాలన్నిటినీ వారు కలిగి ఉన్నారనడానికి సందేహం లేదు. వారికి అప్పుడున్న విద్యాప్రభావాన్ని బట్టి వారు అట్టి గౌరవాలకును, స్వాతంత్య్రాలకును అర్హురాండ్రయి ఉన్నారు. మన పూర్వులు గృహిణి ధర్మాలను వివరిస్తూ భర్తకు భార్య మంత్రిలా ఆలోచన చెప్పాలని, తల్లివలె ఉపచారం చేయాలని, గురువులా హితోపదేశం చేయాలని, వైద్యునిలా శరీరారోగ్యాన్ని కాపాడాలని చెప్పారు.

ఇటువంటి పనులను సరిగ్గా నిర్వహించగలగడానికి స్త్రీలు ఎంతటి విద్యావంతులుగా ఉండాలో చెప్పడంకంటే ఎవరికి వారు ఊహించుకోవడమే  సులభంగా ఉంటుంది. జ్ఞానమూలమైన విద్యా నిక్షేపం ఏ కారణం చేతనో క్రమక్రమంగా మన దేశపు స్త్రీలను విడిచిపోయింది. ఆ విద్యాధనంతోనే వారికి గల సమస్త లాభాలు, సమస్త  స్వాతంత్య్రాలు క్రమక్రమంగా నశిస్తూ వచ్చాయి. చివరకు స్త్రీలకు విద్య కావాలా అని సంశయపడేంత దురవస్థ మన దేశానికిప్పుడు పట్టింది. స్త్రీలు విద్యలేనివారవడంతో మూఢత్వంలో మునిగి ఉండి సంసారభారాన్ని చక్కగా నిర్వహించడంలో మునుపటిలా పురుషులకు సహాయకారులు కాలేకపోతున్నారు. అందుచేత పురుషులకు స్రీలయందు పూర్వకాలంలో ఉండేటి గౌరవమంతా తగ్గిపోయింది. ఏ విషయమునందైనా స్త్రీల ఆలోచన అడుగుటయే అనర్థదాయకమని సామాన్యంగా పురుషులు ఇప్పుడు భావిస్తున్నారు. అందుచేత పురుషులు చాలామంది స్త్రీలయొక్క అభిప్రాయం కానీ, అంగీకారం కానీ పొందకుండానే వారి వివాహమనే మిషతో అంగహీనులకు, వృద్ధులకు కూడా కట్టబెడుతున్నారు.  మానవ దేహానికి అలంకారమైన విద్యాభూషణం వారికి లేకుండా చేసి లోహపు నగలను మాత్రం పెట్టి తమ వేడుక కోసం వారిని తోలుబొమ్మలలాగే చేస్తున్నారు. వారిని గృహ యజమానులుగా చూడక తమ సేవల నిమిత్తం దాసులుగా చేస్తున్నారు. పురుషులు స్త్రీ విషయంలో చేసిన ఇట్టి అన్యాయం వలన స్త్రీలను మూఢురాళ్ళుగా చేసి చెడగొట్టడమే కాక తాము కూడా వారితోపాటుగా మూర్ఖశిరోమణులై చెడిపోతున్నారు. అందువలన పురుషుల్లో కూడా నిజమైన ఈశ్వర భక్తి, సత్ప్రవర్తన పోయి మూఢభక్తి, నీతిరాహిత్యం వర్థిల్లుతున్నాయి. దానిని బట్టి నిజమైన సౌఖ్యము, సంతోషము లేక చాలామందికి భూతల స్వర్గంగా ఉండాల్సిన గృహం మహారణ్యంలా అవుతోంది. ఏ ఇంట చూసినా ఐకమత్యానికి బదులు కలహాలు, మనస్తాపాలు పెరుగుతున్నాయి. ఈ స్థితి అంతా కూడా పురుషుల లోపం వలనను, స్వప్రయోజన పరత్వము వలనను కలుగుచున్నదే కానీ స్త్రీల దోషం వలన అనేది అణుమాత్రం కాదు. ఏ కాలంనందును, ఏ దేశంనందును తమ స్త్రీలను మంచి దశకు తీసుకురాక తాము బాగుపడిన పురుషులు లేరు. తాము బాగుపడదలచిన పక్షాన ముందుగా తమ స్త్రీలను బాగుచేయాలి. స్త్రీల బాగే పురుషుల బాగు, స్త్రీల మంచే పురుషుల మంచి. కాబట్టి పురుషులు తమ యోగక్షేమాభివృద్ధి నిమిత్తం మూఢురాండ్రయిన ఇప్పటి స్త్రీలను మునుపటి ఉత్తమ దశకు మరల తీసుకుని రావడానికి ప్రయత్నించాలి. స్త్రీల నిమిత్తం అక్కడక్కడా ఉత్తమ పురుషులు చేస్తున్న ప్రయత్నాలకు మూఢత్వ పిశాచావేశంచేత స్త్రీలే ప్రతిబంధక కారణం అవుతున్నారు. ఇంటివద్ద స్త్రీల సహాయం ఉన్నా కానీ కులాచార, మతాచార విఫయాలలో పూర్వాచరాలకు విరుద్ధాలైన నూతన సదాచారాలను నెలకొల్పుట పురుషులకు సాధ్యంకాదు. కాబట్టి పురుషులు తమ స్త్రీలను మూఢదశలో ఉంచి దేశానికి ఏదో మహోపకారం చేస్తామన్న దురహంకారం విడిచిపెట్టి వారి తోడ్పాటును పొందుతూ సత్కార్యాలను చేయచూడాలి. స్త్రీల సహాయం ఉన్నప్పుడే పురుషులకు విజయం కలిగి లోకానికి నిజమైన ఉపకారం కలుగును. సద్విషయాలలో స్త్రీల తోడ్పాటును పొందదలచిన పక్షాన ముందుగా వారిని ఆశ్రయించి ఉన్న మూఢతా పిశాచాన్ని తొలగేట్లుగా వారిని విద్యావంతులుగాను, వివేకరాండ్రగాను చేసి మనకు సరియైన తోడ్పాటు చేయడానికి వారిని శక్తివంతులను చేయాలి.”

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో