బహిరంగ వేదికలపై మణిపూర్‌ ముఖచిత్రాన్ని ఆవిష్కరించబోతున్న ఇరోమ్‌ షర్మిల – కె.సత్యవతి & పి. ప్రశాంతి

ఇరోమ్‌ షర్మిల…. పోరాటానికి ప్రతిరూపం. పదహారు సంవత్సరాలు ఒకే లక్ష్యంతో తన పోరాటాన్ని కొనసాగించిన వజ్ర సంకల్పురాలు. బలమైన భారత ప్రభుత్వాన్ని తన నిరాహార దీక్షతో గడగడలాడించింది. మణిపూర్‌ నుంచి వచ్చి హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమై AFSPA కి వ్యతిరేకంగా నిరాహార దీక్ష మొదలు పెట్టినపుడు … ఆమెకి విపరీతమైన మీడియా కవరేజి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమెను బలవంతంగా ఇంఫాల్‌కు తరలించింది. మణిపూర్‌ లాంటి మారుమూల ప్రాంతంలో ఆమె నిరాహార దీక్ష చేసినా ఫర్వాలేదు… ఎక్కువ రోజులు కొనసాగదు అనుకుని వుండొచ్చు కానీ, ఇరోమ్‌ షర్మిల ఇంఫాల్‌లోని ఒక ఆసుపత్రిలో పదహారు సంవత్సరాలు ఉక్కు సంకల్పంతో తన దీక్ష కొనసాగించింది.

ఆగష్టు 9, 2016న తన దీక్షను ముగిస్తున్నానని ప్రకటించి, బెయిల్‌ మీద విడుదలైంది. షర్మిల నిరాహర దీక్షను మొదలుపెట్టినపుడు ఆమె వయస్సు 28 సంవత్సరాలు. అతి సాధారణ రైతు కుటుంబంలో పుట్టింది. డాక్టరు చదవాలనుకుంది. తను చదవలేనని వదిలేసింది. తర్వాత జర్నలిజమ్‌లో డిప్లొమా తీసుకుంది. కొంత కాలం స్టెనోగ్రఫీ నేర్చుకుంది. ఇవేవీ ఆమెకు తృప్తినీయలేదు. నా జీవిత లక్ష్యం ఏమిటి? నేను ఏం చెయ్యాలనుకుంటున్నాను? ఈ జీవితానికి అర్థం, లక్ష్యం ఏమిటి? అనే వెతుకులాట కొనసాగిస్తూనే స్త్రీల హక్కులకు సంబంధించిన సమావేశాలకు హాజరవ్వసాగింది. ఏన్నో ప్రశ్నలు ఎదురౌతుండేవి. ”హయ్యేన్‌ లాన్‌పో” అనే పత్రికకు వ్యాసాలు రాస్తుండేది.

2002 నవంబరు 2వ తేదీన మాలొమ్‌ ఊచకోత జరిగినపుడు, షర్మిల్‌ ‘హ్యూమన్‌ రైట్స్‌ అలర్ట్‌’ అనే సంస్థలో వాలంటీర్‌గా పనిచేస్తూ, హింసకు గురైన బాధితులకు సహకరిస్తూండేది. పది మంది సామాన్య ప్రజల్ని అస్సామ్‌ రైఫిల్స్‌ హత్యచేసిన వార్త విన్న షర్మిల మ్రాన్పడిపోయింది. దుఃఖంతో విచలిత అయ్యింది. శాంతి సమావేశాల నిర్వహణని మించిన తీవ్రచర్య ఏదైనా చెయ్యాలని భావించి నిరాహార దీక్ష మొదలు పెట్టాలనుకుంది. ఆ రోజు గురువారం. గురువారం ఆమె ఉపవాసముంటుంది. ఆనాటి

ఉపవాసాన్ని విరమించకుండా 16 సంవత్సరాలు కొనసాగించింది షర్మిల. మణిపూర్‌లోను, ఈశాన్య రాష్ట్రాల్లోను రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న హింస, అణిచివేత, స్త్రీలపై లైంగిక అత్యాచారాలు ఇప్పట్లో ఆగిపోయే పరిస్థితి లేదు. మిలటరీకి విపరితాధికారాలు కట్టబెట్టిన AFSPA చట్టాన్ని తొలగించే అవకాశమూ లేదు.

బెయిల్‌ మీద విడుదలైన షర్మిల AFSPA ను తొలగించాలనే పోరాటాన్ని కొనసాగిస్తానని, రాజకీయాల్లోకి వస్తానని, ముఖ్యమంత్రి అవ్వడమే తన ప్రస్తుత లక్ష్యమని ప్రకటించింది. భారత దేశమంతా పర్యటిస్తానని, ఈశాన్య రాష్ట్రాలు, ముఖ్యంగా మణిపూర్‌ రాష్ట్రంలో ఉన్న అసాధారణ పరిస్థితుల గురించి ప్రచారం చేస్తానని షర్మిల విలేఖరులతో చెప్పింది. అతి త్వరలో, ఆమె శారీరకంగా కొంత కోలుకున్నాక తన పర్యటనని మొదలుపెట్టాలని భావిస్తోంది.

సైన్యానికి విపరీతాధికారాలు కట్టబెట్టిన AFSPA చట్టాన్ని 1958లో కేంద్ర ప్రభుత్వం చేసింది. మణిపూర్‌ని భారతదేశంలో విలీనం చేసాక, అక్కడ మొదలైన తిరుగుబాటు ఉద్యమాలను అణిచివేసే ఉద్దేశ్యంతో వచ్చిన AFSPA చట్టం సైన్యానికి విపరీతమైన అధికారాలు కట్ట బెట్టింది. ఈ చట్టం మణిపూర్‌ రాష్ట్రమంతటా అమలులో ఉంది. దీని ప్రకారం ఎలాంటి చిన్న అనుమానం కలిగినా అనుమానితులను నిర్బంధించవచ్చు. ఎలాంటి వారంటూ లేకుండా ఇళ్ళను, వ్యక్తులను సోదాలు చెయ్యొచ్చు. అరెస్టు చెయ్యొచ్చు. ఆఖరికి కాల్చి చంపొచ్చు. ఇదే చట్టం కాశ్మీరులో కూడా అమలులో ఉంది.

ఈ చట్టం అమలులోకి వచ్చిన నాటి నుండి మణిపూర్‌ స్థితి ఏంటి? ఎలాంటి అసాధారణ పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి? ఎంత మంది పౌరులను సైన్యం కేవలం ‘అనుమానం’ పేరుతో హింసలకు గురిచేసి చంపింది, చంపుతోంది… మానవ హక్కులు లేని మణిపూర్‌ గురించి, మారణహోమం నిత్యకృత్యమైన మణిపూర్‌ గురించి మొట్టమొదటిసారి ఇరోమ్‌ షర్మిల భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో గళం విప్పబోతోంది. మణిపూర్‌ వాస్తవ ముఖచిత్రాన్ని మన ముందు ఆవిష్కరించబోతోంది.

ఇరోమ్‌ షర్మిలకు మనసారా ఆహ్వానం పలుకుదాం. భారతదేశ స్త్రీల ప్రస్తుత స్థితిగతుల్ని, పెచ్చరిల్లుతున్న హింసల పర్వాలను, షర్మిల ఉద్యమంతో పెనవేసి ఆమెతో కలిసి నడుద్దాం. ఒక స్ఫూర్తిదాయకమైన, చైతన్యవంతమైన స్త్రీల ఉద్యమ నేపధ్యం లేని ప్రస్తుత తరుణంలో షర్మిల ప్రారంభించబోయే ఉద్యమం మనందరికీ స్ఫూర్తిదాయకమవ్వాలి. హింసలేని సమాజం కోసం భారత స్త్రీల ఉద్యమం, షర్మిలతో కదం కదం కలిపి నడవాలని ఆశిద్దాం.

స్త్రీలపై అన్ని రకాల హింసలకి వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతో వున్న ఈనాటి నేపథ్యంలో ఇరోమ్‌ షర్మిల బహిరంగ వేదికల మీద రాజ్యహింస గురించి మాట్లాడబోతున్నది. రాజ్యహింసకి తోడు గృహహింస, బహిరంగ హింస, పనిచేసే చోట హింస… వెరసి స్త్రీలెదుర్కొంటున్న సమస్త హింసల గురించి మాట్లాడదాం…. షర్మిలతో కలిసి…. ఆమె గళంతో కలగలిసి…

కె.సత్యవతి & పి. ప్రశాంతి

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో