భూమి పలికితే ఆకాశమ్ నమ్మదా?

డా. శిలాలోలిత
‘స్త్రీలు బలహీనులు. స్త్రీకి శక్తిలేదు. మానసికంగా శారీరకంగా కూడా అంతే.’ ఇలాంటి పడికట్టు పదాలను మనం ఎంతో కాలంనుంచి వింటూనే వస్తున్నాం. కాదంటున్నాం. సహేతుక చర్చలు చేస్తున్నాం. దృష్టికోణం మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూనే వున్నాం. ఐనా, తమకుతాము నిర్మించుకొన్న మూసల్లోంచి కొందరింకా బయటపడడానికి సిద్ధంగా లేరు. ఒక ఝాన్సీలక్ష్మీ బాయి, ఒక రుద్రమదేవి, ఇలా ‘ఒక, ఒక’లనే ఉదహరిస్తూ అప్పుడెప్పుడో ఉన్నారు ఇప్పుడు లేరింకా అని అలవోగ్గా అనేస్తుంటారు. అలాంటి వాళ్లందరికీ జవాబు నేను చూసిన స్త్రీలు అన్పించింది. ఉద్యమాలనేవి సిద్ధాంత అవగాహన వల్లనే రావు. చదువు నేర్పిన తెలివే కారణం కాదు. పీడన నుంచి ఒత్తిడి నుంచి ఉద్భవించే అప్రయత్న ఉద్యమాలివి. తెలుగు రచయిత్రులమందరం కలిసి యాత్రకు బయలుదేరాం. నిజంగా ఇది ఎంతో… జ్ఞానవంతమైనదిగా రూపొందింది. నేను చూసిన కొందరు స్త్రీలు ఒక్కొక్కళ్ళూ ఒక్కో జీవితాన్ని పరిచారు. ముడుతలు పడ్డ దేహంతో, బక్కచిక్కిన ప్రాణాలతో, ఆకలిని, ఆవేశాన్ని, నిస్సహాయతని కళ్ళనిండా నింపుకుని కన్పించారు. వాళ్ళ ఊరిచుట్టూ గోడకట్టేశారు. గుండెల మీద కట్టినట్టున్నాది అంటుందొకామె. మాకీ వృత్తి తప్ప ఏదీ రాదు. ఉద్యోగాలిస్తామంటారు గానీ, చదువుకున్నోళ్ళు లేరు. ఒకళ్ళిద్దరున్నా వాళ్ళకు యిస్తారని నమ్మకం లేదు. మాలో కూడా బలహీనమైన మనస్సున్నవాళ్ళు కొందరున్నారు. తాగుడుకి బానిసలై, మాటమీద నిలబడనివాళ్ళని ఏరి, మా మీదకే ఉసికొల్పుతున్నారు. డబ్బులు ఇవ్వకుండానే ఇచ్చినట్లు ఏలిముద్ర లేయించుకుంటున్నారు. న్యాయానికి రోజులు కావు. పుట్టిన ప్రెతి మనిషీ చావాల్సిందే. జనం కోసం చావడమే గొప్ప తృప్తి.
దిబ్బపాలెం అంతా దిబ్బలా తయారైంది. పక్కా ఇళ్ళన్నీ నేలమట్టమయ్యయి. ఆ శిథిలాలను చూడగానే గుజరాత్‌ మారణకాండ గుర్తొచ్చింది. అక్కడ కూడా అంతే. చెట్టూ, చేమల్లానే నిస్సహాయస్థితిలో, మనుషుల్ని కోల్పోయిన ఇళ్ళున్నాయి. చూసిన అన్ని ప్రాంతాల్లోన స్త్రీల నాయకత్వమే ఎక్కువ. ధైర్యంగా నిలబడటమే కాక ప్రశ్నించే వైఖరిలో ఎంతో తార్కికత కనబడింది.
మధ్యవర్తుల, దళారీల మొసాలవల్ల తీవ్రంగా నష్టపోయారు వారంతా. గంగవరం పోర్టు రావడం వల్ల బతకడానికి అడవుల్లేకుండా పోయి, జీవనాధార వనరులన్నీ పోతున్నాయి. వారి మాటలు సముద్రఘోష కంటే ఎక్కువగా వున్నాయి. మా సముద్రం పోయింది. మా బతుకు కూలిపోయింది. ‘చావో రేవో’ ఏదో ఒకటి తేలాలి.
విశాఖ సెంట్రల్‌ జైల్లోని స్త్రీల జీవితాలను విన్నపుడు ఒక్కొక్కళ్ళది ఒక్కో వ్యధ. వంటమనిషిని, అయ్యగారు బలవంతం చేయబోతే ఒప్పుకోలేదు. పని మానేశాను. ఆయనే అమ్మగార్ని చంపేసి, డబ్బున్నాది కదా నామీద కేసెట్టి ఇక్కడికొచ్చేట్లు చేశారు.
అత్తాకోడళ్ళ మధ్య గొడవొచ్చింది. ఎక్కడ అత్త తనని చంపేస్తదోనన్న భయంతో కర్రెట్టి గట్టిగా కొట్టేసరికి చనిపోయింది. ఏడాది కొడుకుని తీసుకొని జైలుకొచ్చింది. కొడుకూ, తన కలిసి కోడల్ని చంపేసిందొకావిడ. ఇద్దరికీ శిక్ష పడింది. అప్పుడప్పుడ జైల్లోనే మాట్లాడుకుంటామిద్దరం అని చెప్పిందామె. రాజకీయంగా ఎవరెవరికో సాయం జేత్తన్నామని పట్టుకొచ్చారు. మాకేం తెలీదు అని కొందరు. ఇలా, ఒకో కందిరీగ తుట్టను కదిలిస్తే ఎలా భయెద్విగ్నంగా నాదాన్ని విన్పిస్తాయె అలా మాటలహోరు.
ఇక, వాకపల్లి దుఃఖం సరేసరి. ఒక సామూహిక దుఃఖాన్ని చశామక్కడ. కొండల్లో కోనల్లో రాళ్ళతోవమీద ఎంతో ప్రయాసపడి చేరుకున్నాం. వాళ్ళనలా ప్రశ్నించడమూ నేరమని పించింది. దుఃఖపుతెరను చీల్చుకుంటూ ఆనాటి రోజుని ప్రశ్నిస్తూ మాటల ప్రవాహం మొదలైంది. చెట్లు గాలి వీచడం మానేశాయి. మేకపిల్లలు నిశ్శబ్ద చిత్రాలైనాయి. 11 మంది స్త్రీలపైన పైశాచిక చర్యలు జరిపారు. అందరి కళ్ళు చెమర్చడం మొదలైంది. సున్నిత మనస్కులైనందున కన్నీటవాన ఆ భమి తల్లుల మీద కురవడం మొదలైంది. వాళ్ళకు శిక్షపడేంత వరకూ ఊరుకొనేది లేదు మా ఆత్మరక్షణ కోసం మేము సిద్ధంగానే వున్నాం.
పుట్టినంక చావక తప్పదు కదా! మా ఇంటిలో వాళ్ళు మమ్మల్ని అర్ధం చేసుకున్నారు. మేం బాగానే వున్నాం. వాళ్ళు చేసిన పనికి మేము బంధువులను, ఇరుగు పొరుగులను ఎందుకు కోల్పోవాలి. వాళ్ళకు శిక్షపడేంత వరకూ మా మనసు అగ్గిలా రాజుకొనే వుంటుంది. అన్నీ ప్రశ్నలే. అన్నింటికీ జవాబులు లేవు. అరకు అందాలు కానీ, బొర్రాకేవ్స్‌ గానీ ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు. బతుకంతా ఎర్రమట్టిని పులుముకున్న వాకపల్లీ, గంగవరం స్త్రీల జీవనగుహల్లోకి వెళ్ళి వచ్చాక, ప్రాపంచిక విషయలు ఎంత అల్పమైనవో తెలిసొచ్చింది.
ఇక, జిందాల్‌ కంపెనీ ఆక్రమించుకున్న ప్రాంతానికి వెళ్ళాం. మా అందరికీ దీపశిఖల్లాంటి, విద్యుత్‌కిరణాల్లాంటి ఇద్దరు స్త్రీలు కన్పించారు – దేవుడమ్మ, పార్వతి. ఇక్కడా అదే ఆక్రమణ ధోరణి, అమానవీయ హింసలే. పోలవరం, గంగవరం, పోలేపల్లి పేరేదైతేనేం అన్నింటా ఒకే హింసానేపథ్యం.
ఆమె రెండవ తరగతి వరకే చదువుకొంది. సన్నగా బక్కపల్చగా వుంది. కాని కళ్ళుమాత్రం నిప్పురవ్వల్లా అన్పించాయి. ఆమె వాక్సుద్ధి అమొఘం. మాట్లాడుతోంది మాట్లాడుతోంది ఒక ప్రవాహమై మమ్మల్ని ముంచేసింది. భూమిని ఇచ్చేది లేదు అన్నమాటకే కట్టుబడి వుంది. శాశ్వత న్యాయం జరిగేవరకూ ఉద్యమం ఆపేది లేదన్నది. చాలా స్పష్టంగా, నిజాయితీగా ఉన్న విషయాల్ని ప్రకటించే నేర్పు, లాజికల్‌గా చర్చించే నైపుణ్యం ఆమెకున్నాయి. భర్త షరా మామూలే. తాగటం హింసించే భర్తే, ఉద్యమం కొనసాగించొద్దని అతని ద్వారా, పెద్దలు, పరిపాలకులు చెప్పించే యత్నం. ఆమె అతడి హింసను భరించింది. తనను నమ్ముకున్న జనాన్ని విడిచిపెట్టలేదు. ప్రతిమనిషీ చనిపోక తప్పదు. నా వల్ల ఎందరికో మేలు జరుగుతుందంటే నేను చావడానికైనా సిద్ధం. ఆ చావు నాది కాదు. ప్రజలది. అనే నాయకత్వ లక్షణాలను ఆమె జీవితావసరాలే ఆమెకు నేర్పాయి. పచ్చటి పొలాలు, ఎవరిమీదా ఆధారపడకుండా పండించి బతుకుతున్న మాపై ఈ బాక్సైట్‌ గనులు పడితే ఈ ప్రకృతంతా ఏమై పోవాలి? వాతావరణం కలుషితమైపోదా? అరకువేలిలో గిరిజనుల మ్యూజియమ్‌ పెట్టి, వాళ్ళ సంస్కృతి అంటూ 30 రూపాయల ఎంట్రన్స్‌ టికెట్టు పెట్టి చూపించడం ఏ తరహా పద్ధతి? మమ్మల్ని జైల్లో పెట్టారు. మేమొచ్చే సరికి బలహీనులు, భయస్థులను కొందర్ని కూడేసుకొని, బెదిరించి పట్టాలు రాయించుకున్నారు. డబ్బులివ్వడంలో అనేక అన్యాయలు జరిగాయి. మాతో స్థిరంగా వున్నవాళ్ళు కొందరే మిగిలారు. ఆకలి, అవసరాలు కాలం మనిషిని బలహీనతకు గురిచేస్తాయి కదా!
ఒకసారి పెద్ద సభ నిర్వహిస్తున్న సందర్భంలో దేవుడమ్మ అధ్యక్షురాలు. ఆ సభకు రానివ్వకుండా ఇంట్లో భర్తను కాపలాపెట్టి హింసించమన్నారు. కార్యకర్తలు ఎంత ప్రయత్నించినా ఆమెను ఇంట్లోంచి తీసుకురాలేకపోయారు. అప్పుడు ‘పార్వతి’ని అధ్యక్షురాలిని చేసి సభను జరిపారు. ఇంత కౌటుంబిక హింసను అనుభవిస్తూనే, ఉద్యమం ఆపని ఆమె ధీరత్వానికి నమస్కరించాను.
‘ప్రభుత్వస్థలమిది’, లేదా ‘ఫలానావారిస్థలమిది’ అనే బోర్డులు చూశామింతవరకూ – అక్కడో విచిత్రమైన బోర్డు చూశాం. వారి పొలంలో (జీడిమామిడి తోటంతా జైల్లో వున్నప్పుడు నాశనం చేశారు) ఆమె తానే స్వయంగా ఒక బోర్డు నాటింది. ‘ఫలానా సర్వేనెంబరు గల స్థలం నాది. దీనిపై సర్వహక్కులు నావే. వ్యతిరేకించిన వారు శిక్షార్హులగుదురు’ అని. నిజంగా ఆమె ధైర్యానికి హాట్సాఫ్‌.
మనచుట్టూ మన మధ్యనే అలుపెరుగని జీవనపోరాటాన్ని చేస్తున్న స్త్రీలున్నారు. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని గౌరవిస్తూ, ఆత్మగౌరవ పోరాటాలను చేస్తున్నందుకుగాను వినమ్రంగా గుండె పాదాలతో మొక్కుతూ, సామాజిక న్యాయకంకణధారులైన వాళ్ళని కీర్తిస్తూ, పులకరించిన ఉద్వేగ తరంగాల మధ్య వేనోళ్ళ కొనియాడుతూ, ఆ నీటి చెలమలను స్మరించుకుంటున్నాను.

నన్ను నేను పునర్‌నిర్వచించుకున్న యాత్ర
ఎన్‌. గీత
భూమిక నిర్వహించే యాత్రలంటే నేను చాలా ఉత్సాహంగా బయలుదేరతాను. ఇంతకు ముందు పాపికొండల యాత్రలో పొందిన పరవశం ఇంకా నాలో సజీవంగానే వుంది. ఈ సారి వైజాగ్‌ వెళ్ళాలని ప్లాన్‌ చేస్తున్నామని సత్య చెప్పగానే బోలెడంత సంతోషమైంది. విశాఖ బీచ్‌, భీమ్లి, రుషికొండ, తొట్లకొండ, అరకు, పాడేరు. ఓహో! అద్భుతం అనుకున్నాను. ప్రయాణం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసాను. పదిహేడు సాయంత్రం నలభైమందిమి గోల గోలగా రైలెక్కేం. ఆటలు, పాటలు, అంత్యాక్షరీలు. కొంతమంది పేకాటలు కూడా. అల్లరి నవ్వులు. ఈ ట్రిప్‌ అంతా ఇలా సంతోషంగానే గడిచిపోతుంది అనుకున్నాన్నేను.
మర్నాడు కనీసం సముద్ర కెరటాల వేపైనా చూడకుండా గంగవరం, దిబ్బపాలెం వెళ్ళిపోయా౦. అక్కడి స్త్రీలు చెప్పిన విషయాలు, వారి భయంకర పరిస్థితులు, దిబ్బలైన ఇళ్ళు, ఎత్తైన పోర్టుగోడ, వైర్‌ ఫెన్సింగ్‌ చూసాక నాకు దిమ్మ తిరిగినట్లయింది. దు:ఖంతో గొంతు పూడుకుపోయింది. అదే మూడ్‌తో విశాఖ సెంట్రల్‌ జైలుకెళ్ళాం. అక్కడ మరింత వ్యధాభరిత జీవితాలు. వాళ్ళ దు:ఖ గాధల్ని వినలేకపోయాను. చిన్న చిన్న తప్పులకు సైతం పెద్ద శిక్షలు. పిల్లలెక్కడున్నారో తెలియక రోదించే ఒక ఖైదీ. నా ముఖంలో ఎపుడ ఉండే నవ్వు మాయమైపోయింది. నన్ను విపరీతంగా ప్రభావితం చేసింది వాకపల్లి ప్రయాణం. ఆ స్త్రీల రోదనలు. వాళ్ళ న్యాయమైన ప్రశ్నలు. వాళ్ళ అమాయక ముఖాలు. వాళ్ళ కన్నీళ్ళు ఈ రోజుకీ నన్ను వెంటాడుతున్నాయి. కడుపులోంచి తన్ను కొచ్చిన దు:ఖం దారి మధ్యలో భళ్ళున వాంతయింది. ఆ రాత్రి దు:ఖంతో సత్య మంచం మీద ఎగిరెగిరి పడడం, ఇద్దరం ఒకరినొకరం ఓదార్చుకోవడం నేనెప్పటికీ మర్చిపోలేను.
నేను రచయిత్రిని కాను. కాని ఇంతమంది రచయిత్రులతో కలిసి ప్రయాణం చేయడం నా అదృష్టం. ఒక్కప్పటి గృహిణి స్థాయి నుండి నన్ను నేను పునర్‌నిర్వహించుకుంటూ, మారుతూ, సమాజంతోను, స్త్రీల అంశాలతోను నన్ను నేను జోడించుకుంటూ ఎదుగుతున్నాను. నా ఎదుగుదల వెనుక వున్నది భూమిక, భూమికను నడుపుతున్న సత్య. నన్ను నేను మరింత మానవీయంగా తీర్చిదిద్దుకోవడానికి నాకు ఉత్తరాంధ్ర యాత్ర ఎంతో ఉపకరించి
యాత్రానుభవం
మహిళల్ని కించపరిచిన ప్రశ్నకి నా సమాధానం
రోష్నీ
రచయిత్రుల సామాజికయాత్రలో చివరి అంకంగా విజయనగరంలో జరిగిన సభ గురించి రాయలనిపించింది సాహితీమిత్రులు మాపై ఎంతో గౌరవంతో, ఆదరణతో చక్కటి సభ నిర్వహించారు. చాగంటి తులసి గారు దానికి అధ్యక్షత వహించడం, ఈ సందర్భంగా నేను ఆవిడను కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రముఖ జర్నలిస్టు శ్రీ జి.యస్‌. భార్గవగార్ని ఢిల్లీలో కలిసినప్పుడల్లా చాగంటి తులసి గార్ని కలిసావా అని అడిగేవారు. ఆవిడ రాసిన పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆఖరికి ఆవిడ గురించి వచ్చిన వ్యాసాలు నాకు పోస్టులో పంపించారు. ఆయన అంతగా అభిమానించే తులసిగార్ని ఇంతవరకూ కలవకపోవడం అనే లోటు ఈ సామాజికయాత్ర తీర్చింది.
అంతేకాదు ఈ సభలో రచయిత్రుల కథాసంకలనం హిందీ అనువాదం ‘అపనా సంఘర్ష్‌’ను ఆవిష్కరించడం ఒక తియ్యటి సర్ ప్ర్ జ్జ్ . తియ్యదనాన్ని మాకు పంచిన మా ఎడిటర్‌ కె. సత్యవతికి ‘రొంబ’ తాక్యూ .
ఇవన్ని అయ్యాక సామాజికయాత్రలో పాల్గొన్న రచయిత్రులు తమ యాత్ర అనుభవాలను వివరించారు. వాకపల్లి, గంగవరం, యస్‌.కోట – అంతా విషాదం. రచయిత్రులు ఒక్కొక్కరూ చెప్తుంటే కన్నీళ్లు వచ్చాయి. సభ ముగిసే సమయానికి బరువెక్కిన గుండెల్తో లేవబోతుండగా ఒకాయన (పేరు తెలీదు) సమయం, సందర్భం లేకుండా ‘భూమిక’లో సర్రొగేట్‌ మదర్‌ గురించి ప్రకటన ఎందుకు వేసారు? – అని సత్యవతిని అడిగారు. అది ప్రచార ప్రకటన దానిని చర్చించడానికి ఇది వేదిక కాదు అని సత్యవతి గారు జవాబిచ్చారు. ఆయన వెంటనే ”వ్యభిచారాన్ని చట్టబద్ధం చేస్తే, దాని గురించి కూడ ప్రచార ప్రకటన మీ భూమికలో వేస్తారా?” అన్నారు. ఈ నీచమైన ప్రశ్నను సభ ముగిసిన హడావుడిలో చాలామంది పట్టించుకోలేదు. దానికి సమాధానం చెప్పే సమయం లేదు. మాకు ట్రెయిన్‌ టైము అయిపోయింది. విజయనగరం స్టేషనుకొచ్చేసాం. కాని ఈ ప్రశ్న మనస్సును తొలుస్తానే ఉంది. తిరుగుప్రయాణం పూర్తయింది. ఈ ప్రశ్న తొలుస్తానే ఉంది. ఉద్యోగం రొటీన్‌లో పడిపోయాను. అయినా చికాకు వదల్లేదు. స్త్రీలను కించపరచడమే కాకుండా భూమిక పత్రికను కూడా కించపరచే విధంగా అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసిన అవసరం ఉందని భావించి ఇది రాస్తున్నాను. ఇటువంటి మూర్ఖత్వాన్ని పోనీలే అని వదిలేయకూడదు.
పై ప్రశ్నలు స్త్రీలను కించపరచేవిగా ఉన్నాయని ఎందుకన్నానంటే –
ముందుగా ‘సర్రొగేట్‌ తల్లుల’ అవసరం ఎందుకొచ్చిందో తెలుసుకోవాలి. కొంతమంది స్త్రీలలో గర్భసంచి లోపాల వల్లో, మరే ఇతరమైన ఆరోగ్య కారణాల వల్లో పిల్లల్ని గర్భంలో మొసి, కనే అవకాశం ఉండదు. అటువంటి వారు ఏ అనాథ పిల్లలనో తెచ్చుకుని పెంచుకుంటే ఎంతో మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు పిల్లలు లేని కొరత తీరుతుంది. ఒక అనాథ జీవితాన్ని తీర్చిదిద్దిన వాళ్ళవుతారు. కాని మనలో అంతటి వివేకం సామాజికస్పృహ ఎక్కడివి? పైగా మన రక్తం మన వంశం అనే సెంటిమెంట్లను ముందుకు తీసుకొస్తారు. వీటికున్న ప్రాధాన్యతను వంకబెట్టుకొని (గర్భసంచి లోపం లేని) రెండో భార్యను తెచ్చుకోడానికి ఉత్సాహపడిపోయే మహాపురుషులూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో ‘సర్రొగేట్‌ మదర్‌’ అవసరం కలిగింది. ఇప్పుడే కొత్తగా వచ్చిన ప్రక్రియ. దీని గురించి చాలా చర్చ జరిగింది. ఇంకా జరుగుతోంది. చాల సిన్మాలు కూడ వచ్చాయి. ప్రశ్నించిన ఆ ఫలానాయన కూడ ఏదైనా చర్చను నిర్వహిస్తే చర్చకు మేమూ సిద్ధమే. కాని ప్రక్రియను వెంటనే వ్యభిచారంతో పోల్చిచూడటం క్షమించరానిది. మూర్ఖత్వానికి పరాకాష్ట.
ఎందుకంటే స్త్రీ ఏ సామాజిక కారణాలు – పరిస్థితుల్లో వ్యభిచారవృత్తిలో దిగుతారో ఒక్కసారి ఆలోచించారా? ఏ స్త్రీ రోజుకో మగాడితోనో లేక ఒకడికంటే ఎక్కువ మందితోనో పడుకుని ఎంజాయ్‌ చేయలనుకుంటుంది? (క్షమించండి. ఇంత పచ్చిగా రాస్తున్నందుకు. వేసిన ప్రశ్న అలాంటిది. గుండె మండుతోంది.) చిన్న ఉదాహరణ : వ్యభిచార వృత్తిలో కోస్తాంధ్ర స్త్రీలు తరచు కనిపిస్తున్నారని పేపర్లలో అప్పుడప్పడూ వార్తలు వస్తున్నాయి. ఎందుకో ఆలోచించారా? కోస్తాలో గతంలో రొయ్యలచెరువుల ‘బమ్‌’ వచ్చింది. ఫారిన్‌ కస్టమర్లకు రొయ్యల భోజనం పెట్టడానికి మన పంటచేలన్నీ రొయ్యల చెరువులుగా మారిపోయాయి. పచ్చటి తివాచీ పరచినట్లుండే కోస్తా అంతా చెరువులమయంగా మారిపోయింది. వేలాది కుటుంబాలు తమ జీవనోపాధిని కోల్పోయారు. మగవాళ్లు తాగుడుకు బానిసలు కావడమొ మరో పని దొరకక నిరాశతో మిగిలిపోవడమొ జరిగింది. అటువంటి పరిస్థితుల్లో కుటుంబ బాధ్యత స్త్రీపై పడింది. ఆమెకి విద్య లేదు. ఏదైనా వృత్తిలో నైపుణ్యం లేదు. ఈ దైన్యంలో స్త్రీలు తమను తాము చంపుకుని కుటుంబాన్ని బతికించడం కోసం ఈ వృత్తిలో దిగడం జరిగింది. ఇది ఒక కారణమయితే ప్రేమ, సినిమా పిచ్చిలో పడి మొసపోయి వ్యభిచార గృహాలు చేరినవారు మరికొంతమంది. గ్లోబలైజేషన్‌ నేపథ్యంలో ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. వీరి గురించి కొంచెం మానవత్వం ఉన్న మనుషులుగా ఆలోచించి చూడండి. వీరికి ప్రభుత్వం చట్టభద్రత కల్పించి వారి హక్కుల్ని, ఆరోగ్యాన్ని కాపాడగలిగితే సంతోషమే. ఈ విషయం కూడ చర్చల్లో చాల నలిగింది. చర్చ ఇంకా జరుగుతూనే ఉంది. ఈ వృత్తిలో ఉన్న స్త్రీలు కూడ కొన్నిచోట్ల పోరాటం చేస్తున్నారు. కొన్ని దేశాల్లో చట్టూ భద్రత కల్పించారు. సరే ఫలానా వ్యక్తిగారికి చర్చ అవసరం అనుకుంటే, చర్చకు మేమూ సిద్ధమే. కాని దయచేసి ఈ వృత్తిలో ఉన్న స్త్రీల ఆత్మగౌరవాన్ని మరింత కుళ్లబొడవకండని నా మనవి. ఇకపోతే ఈ వృత్తిని గురించిన ప్రకటనలు పత్రికల్లో వేయల్సిన అవసరం ఉందో లేదో మన పురుషపుంగవులకే బాగా తెలుసని నేననుకుంటున్నాను.
చివరాకరిగా మా యాత్రలెప్పుడూ విహారయాత్రల్లా ఉండలేదు. అసలు ఇంతమంది రచయిత్రులు ఒకచోట కలవడమే గొప్ప విషయం. అన్ని యాత్రల్లోను వివిధ అంశాల గురించి చర్చించడం, భవిష్యత్తులో చేయల్సిన పనులను ప్లాన్‌ చేసుకోడం జరిగింది. మా కథల హిందీ అనువాదం మా పాపికొండల యాత్రలో జరిగిన చర్చల ఫలితం. ఈ ఫలితం హిందీ పాఠకులకు చేరి మన స్త్రీవాద సాహిత్యానికి ఆదరణ కలిగించి మంచి సత్ఫలితాలనిస్తుందని ఆశిస్తున్నాను. సరే ఇప్పటి యాత్రలో దేశాన్ని కుదిపేసిన సంఘటనాస్థలాలకు వెళ్ళడం జరిగింది. అక్కడ వివిధ ప్రాంతాల్లో తమ జీవనోపాధి అయిన నేలతల్లిని, సముద్రాన్ని కోల్పోయినా ఇంకా పోరాటపటిమనే చూపిస్తున్న అద్భుతమైన మహిళలను ప్రత్యక్షంగా కలవడం జరిగింది. వారు మాట్లాడుతుంటే వారికున్న అవగాహన స్పూర్తి నన్ను ఆశ్చర్యపరిచాయి.
ఈ యత్రలో విషాదంతో గుండెలు బరువెక్కినా, ఒక కొత్త పోరాట స్పూర్తితో, కొత్త ఉత్సాహంతో, ఏదో చేయలన్న ఆరాటంతో తిరిగొచ్చిన నేను ఈ ప్రయణ పోరాటం. విజయంగా ఉదయిస్తుందని ఆశిస్తూ…

దీదీ, నువ్వెళ్ళిపోయాక
రేణుక అయెల
దీదీ నువ్వెళ్ళిపోయాక
నివురు కప్పిన గతం మళ్ళీ రాజుకుంది
స్మృతులన్నీ అలలై ఒంటిని ఢీకొడితే
మనస్సు ఉద్వేగపరుస్తూ
చీకటి రాత్రిని పట్టపగలే
కళ్ళముందుంచాయి
జీవం లేని శరీరాల మీద
సజీవంగా కదలి
గుండెలోతుల్లో దుఃఖం ఎగదన్నీ
రెప్పల్లో నిలిచి కరుడుకట్టింది
పచ్చటి ఆకుపొదల్లో
సంపెంగలమై కదలిపోయేవాళ్ళం
ముళ్ళపొదల మీద వాలిన
చీరచెంగులా చీలికలమయ్యము
ఆవపూల చేనుమీద
అలసందల ఆకుల అద్దాలలో
సోకులు దిద్దుకొనే జానపదం
నెత్తుటి చారలో చిక్కుకుంది.
అర్ధరాత్రి శరీరాలని కబళించి
ముక్కలు చేసీ…
ఆనవాళ్ళను గుడిచేయమంటే
రూపాయల సంచులు తెచ్చీ
ఆడతనాన్ని అమ్మమంటే
రాజుకొన్న దేహం
నిప్పుల నెగడై ఎగబాకింది.
పసుపునీళ్ళతో శుద్ధి చేసుకొన్నా…
ప్రతీ మగవాడు
వాడు ముట్టుకొన్నది
నువ్వేనా…?
వెలివేసినట్లు
దూరంగా జరుగుతుంటే
ఇంతకన్నా నడిబజారులో అమ్మీ
వేలం వేసినా బాగుండేది.
శరీరాన్ని అమ్ముకొన్న తృప్తి మిగిలేది.
మా కన్నీటి చుక్కలు
మీ రెప్పలపై దోచి
లోకానికి చూపించండీ
గడపదాటి మీరు వెళ్ళిపోతుంటే
న్యాయనికో రూపం తెస్తారని
నమ్మకం…
మేము ఓడిపోలేదన్న నిజం
మీ అక్షరాలలో దాక్కున్నాయి
మీ మనసులో దాచుకున్న
మా చిత్రాలు
లోకానికి చూపించండి.
రంగువెలసిన మొఖాలపై
వెలుతురులు పులిమీ
మళ్ళీ మా గడపలకి
పసుపుతోరణాలు పంపించండీ.

యాత్రానుభవం

వాకపల్లిలో శోకమల్లెలు
పంతం సుజాత
తలకోన తలపుల్లో ఇంకా తలమునకలవుతూనే ఉన్నాను. నా హేండ్‌బేగ్‌తో కోతులు ఆడిన ‘కోతికొమ్మచ్చి’ గుర్తుచేసుకుని నవ్వుకుంటూనే ఉన్నాను. ఎంతో సాహసంగా లోయలోకి దిగి నా వస్తువులు వెతికి తెచ్చిన యువకుడిని, గట్టున నిలబడి ఆదుర్దాగా చూసిన అతని భార్య భయాన్ని, అతని ‘సహాయగుణాన్ని’ అందరికీ చెబుతూనే ఉన్నాను. అప్పుడే సంవత్సరం అయిపోయింది.
వైజాగ్‌ యాత్ర అనగానే ఆనందంగా బయలుదేరాం. ఈసారి అంతా సాహసంగా జరిగిన సాహితీయాత్ర.
గంగవరం ప్రజల కష్టాలకి కళ్ళుచెమర్చినా… ”మా సముద్రం పోయింది” అన్న మాటలు గుండెల్ని పిండేశాయి. ప్రకృతి విలయతాండవాన్ని మించిన వినాశనం దిబ్బపాలెంలో చూసాం. ఒక ఊరు నామరూపాలు లేకుండా పోయిన వైనం మనసుల్ని కలచివేసింది.
విశాఖ సెంట్రల్‌ జైలులో మహిళా ఖైదీల గాథలు మరింత భారంగా విన్నాం. ఇంటి దగ్గర పిల్లల గురించి వారి ఆరాటం, ప్రతి స్త్రీ కళ్ళు చెమర్చే విధంగా ఉంది.
జీవితంలో మర్చిపోలేని ప్రయాణం వాకపల్లి. కొండల, గుట్టల దాటి ఆయాసపడుతూ అక్కడికి చేరుకునేసరికి అక్కడ అమాయక గిరిజనులు, ప్రకృతి అంత స్వచ్ఛమైన వాళ్ళు మా కోసం ఎదురుచస్తూ కనిపించారు. అక్కడ స్త్రీలపై జరిగిన దారుణం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. ఆ స్త్రీలు మాట్లాడే ప్రతిమాట తూటాలాగా తగులుతుంటే మా దగ్గర సమాధానమే కరువైపోయింది. తోబుట్టువులతో చెప్పుకోవడానికే సిగ్గుపడే విషయన్ని ప్రపంచానికి వివరించి చెప్పాల్సిన ఖర్మ మాకెందుకొచ్చిందని కుమిలిపోతున్నారు. అయినవాళ్ళందరూ దరంగా జరిగిపోయరు. పుట్టింటివారు, తోడబుట్టినవారు కూడా తమని వెలివేసారు. వారపుసంతలకి వెళ్ళలేక, పొరుగువారికి ముఖం చూపలేక నరకం చస్తున్నాం. మేం ఏం తప్పు చేసాం అని ఆ మహిళలు నిలదీస్తుంటే, ఓదార్పుగా భుజం తట్టి ధైర్యం చెప్పాం. మాకు అన్యాయం జరిగిందని ‘భూమిలాంటి మేము చెబుతుంటే ఆకాశం లాంటి సమాజం ఎందుకు నమ్మడం లేదు” అన్న ‘వాకపల్లిలో శోకమల్లెల’ ప్రశ్న మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. తర్వాత అరకు అందాలు కనువిందు చేస్తున్నా, మనసులో ఓమూల ఆ దిగులు ఉంటూనే ఉంది.
చాపరాయి వాటర్‌ఫాల్స్‌ దగ్గర ‘ప్రతిమ’ ఖండిత పుస్తకావిష్కరణ, తిరుగు ప్రయణంలో విజయనగరంలో సాహితీమిత్రుల మీటింగు, వైజాగ్‌లో ఏర్పాట్లకు ‘మల్లీశ్వరి’ సహకారం, జయగారు స్వయంగా చేసుకొచ్చిన అల్పాహార విందు, టూర్‌లో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సత్యవతి గారు తీసుకున్న శ్రద్ధ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాపరాయి వాటర్‌ఫాల్స్‌ అంత ధారాళంగా మినరల్‌ వాటర్‌ బాటిల్స్‌ సప్లయ్‌ చేసి, ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూసిన భూమిక ఆఫీస్‌ స్టాఫ్‌ సేవలు మాత్రం ప్రత్యేకంగా చెప్పి తీరాలి.
వారి టీం వర్క్‌ని మెచ్చుకోకుండా ఉండలేం. సత్యవతిగారి ఆర్గనైజేషన్‌ గురించి ప్రత్యేకంగా చెబుదాం అంటే ఒక భయం పట్టుకుంది. ఆవిడ అరకు నుండి వస్తూ వస్తూ ఓ వెదురుబెత్తం తెచ్చినట్టు గుర్తు. ఇంక ఆపకపోతే జాగ్రత్త అంటూ బెత్తం జళిపిస్తారేమొనని చిన్న అనుమానం. అయినా చెప్పేస్తాను. ఇంత మంచి అనుభవాన్ని మిగిల్చిన సత్యవతి గారికి వేల కృతజ్ఞతలు.

సభ్య సమాజానికో బహిరంగ లేఖ
సీతామహాలక్ష్మి
నాగరిక సమాజంలోని మర్యాదస్తులైన పెద్దలందరికీ సమస్కరిస్తూ ఒక అభాగిని.
మీరందరూ బాగున్నారా? అడవి తల్లినీ, నేలతల్లినీ, సంద్రాన్నీ, గాలీ, నీర, నిప్పు అన్నిటినీ నమ్ముకు బతుకుతున్న వాళ్ళం. కావాలని అడిగితే మాకున్న ఈ సంపదల్లో మీకందరికీ వాటా ఇవ్వగల గొప్ప మనసున్నవాళ్ళం. కాని ఇదేందయ్య? మా బతుకుల్ని లాక్కుని మాకేవీ లేకుండా సేస్తన్నారు? సంద్రం మా అమ్మ. అడివి మా అమ్మ. అమ్మ నుంచి బిడ్డల్ని దూరం సెయ్యొద్దయ్య! కంట తడి యిలువా, కడుపుకోత యిలువా తెలియనోడు మణిసి కాదు. పెద్ద పెద్ద సదువులు సదివినోల్లకు పెద్ద మనసుండాల. అది సంద్రవల్లే పొంగి అందర్ని సల్లంగ సూడాల. దేవుడిచ్చిన సంద్రాన్ని మాక్కాకుండా సెయ్యలని గోడ కట్టారే! ఆ ఏటి ఒడ్డునే వంటావార్పుతో మీ కడుపులు నింపిన మడుసులమయ్య ఆకాశమంతెత్తు సంద్రంతో చిన్న కార్డుముక్క, నెలబత్తెవూ సమానమా.
అమ్మా ఆకలవుతుందంటే అమ్మెప్పుడ నిజమా నాకు అవుపట్టం లేదే! అనలేదు. బువ్వెట్టి కడుపు నింపింది. కాలు నెప్పవుతుందే అంటే నాకు అవుపట్టం లేదు గనక నొప్పిలేదనలేదు సల్లంగ సేత్తో రాసింది. కల్ల ముందు మబ్బుతెర కూరుకుపోతుంటే నిద్దరోవడమే గాని ఆ నిద్దరెందుకొత్తోందనే పరీచ్చలెరగనోళ్ళం. పొద్దు పొడవంగనే సూరీడూ రాతిరేల సెందురుడూ కాపు కాసినట్టు కావిలుంటే పైరు గాలితో వూసులాడుకుంటూ సుక్కల్ని లెక్కెట్టుకుంటూ బతికేటోల్లం. కొండ అయ్యల్లే కాపుగా నిలబడితే ఏరు తల్లల్లే సుట్టూ కమ్ముకుంటంటే మద్దిన పొదరిల్లులాంటి సిన్న పల్లి మాది. ఎవరో ఎవరి కోసమొ ఎతుకుతూ పోతూ మయాన మా పల్లినీ, మమ్మల్నీ మజిలీగా చేసుకుంటే అది మా తప్పా? పూలసెట్టుని పసరం దున్నేసినట్టు ఆడు మమ్మల్ని దున్నేయడం తప్పా? ఆ పసరాన్ని దూరం తోలి పూలసెట్టుని మల్లి నిలబెట్టమనడం మాత్రం తప్పవుద్దా? మాతో కలిసి బతికే పావు మమ్మల్ని కాటేద్దనిపిత్తే కొట్టి సంపేత్తామే! మా బతుకుల్ని కాటేసినోణ్ణి సంపటానికి సాచ్చీకం సూపాల్నా? ఏందయ్య యీ సదివినోళ్ళ న్నాయం.
అడవులన్నీ సర్కారువి గనుక చెట్టు కొట్టగూడదు. నీరంతా సర్కారుది గనుక ముట్టగూడదు. అవి లేక బతుకు గడవదు. కళ్ళు లేని చట్టానికి డబ్బుల వాసన పసిగట్టటం మాత్రం తెలుసు. అందుకే డబ్బులు విరజిమ్మి తప్పులు అలవాటైన వాళ్ళందరూ బయట దొరలై తిరుగుతుంటే బతకలేని మేం తిండి కోసమే ఇక్కడుండిపోతాం. మేమిలా జైలు గోడల మధ్య బ్రతకడంలో మీ పాత్రేమీ లేదంటారా?
ఈ ప్రశ్నలకు మనమిప్పుడు సమాధానం చెప్పగలిగే స్థితిలో లేము. కాని ఒక్కోసారి ఆగి ఈ ప్రశ్నలను అర్థం చేసుకోండి. ప్రశ్నల్నీ, అడిగిన వాళ్ళ పరిస్థితుల్నీ, ఆలోచనల్నీ పంచుకోండి. పెరిగిన వ్యాపార సంస్కృతిలో గ్లోబలైజేషన్‌తో ముందుకెడుతున్న అభివృద్ధిపధగాములారా! 21వ శతాబ్దంలోకి దూసుకెళ్ళే మేధావులారా! వెనుకవారికి చేయూతనిచ్చి నిలబెట్టడం మరిచిపోకండి. వాళ్ళను తీసుకుంటూ, తొక్కుకుంటూ పరుగులు తీయకండి. విశ్వశాంతినీ సర్వజనీన, సర్వకాలీన మౌలిక విలువల్ని పరిపూర్ణ మానవత్వాన్ని వసుధైక కుటుంబానికి పునాదులుగా నిలబెట్టండి. మనిషిని నిండుమనిషిగా బ్రతికించడం మాత్రమే చట్టంగా ఉన్న న్యాయస్థానం కోసం పెట్టుకున్న అర్జీ ఇది. మీరా న్యాయస్థానాన్ని చూడగలిగితే ఆ చోటికి ఈ లేఖని అందజేయండి.

గౌరవనీయురాలైన సత్యవతిగారికి,
నమస్కారములు. మొదటగా మీకు, ప్రతిమక్కకు నా కృతజ్ఞతలు. రచయితను కాకపోయినా మీతో వచ్చేదానికి అవకాశమిచ్చారు.
ఈ విహారం నాకు వెరైటీగా అనిపించింది. మామూలుగా టూర్‌ అంటే హాపీగా, జాలీగా మంచి అందమైన, చారిత్రాత్మకమైన, క్రొత్త, పాత ప్రదేశాలు చూడటమే అనుకునేవాళ్ళం. కానీ విశాఖ ప్రయణం మాత్రం నవరసాలు కలబోసిన కథలాగుంది.
ఎందుకంటే మన ట్రిప్‌లో అందం, ఆనందం, ఆహ్లాదం, సాహసం, దుఃఖం, ఆగ్రహం (వాకపల్లి, గంగవరం బాధితుల పరిస్థితికి కారకులైన వారిపై) వున్నాయి. విశాఖలో సముద్రంలో సూర్యోదయం చూడగానే సగం ఆనందం వచ్చేసింది. అలుపెరుగని, సెలవడగని నిరంతరం పనిచేసే కార్మికుడిలా వున్న సముద్రం దగ్గరగా ఒక రాత్రి గడపడమన్నది ఓ మధురానుభూతి. మీ మాటపై అంతమందికి అల్పాహారం ఏర్పాటుచేసిన జయగారికి వందనములు.
గంగవరం, దిబ్బలపాలెం పోర్ట్‌ బాధితులు, మహిళా ఖైదీల అంతర్మథనాలు, వాకపల్లి మహిళల మనోవేదన మా మనసులను కలచివేసింది. కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లుగా అనిపించింది. వాకపల్లి ప్రయణం మాకొక సాహసం. అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించిన విషయమేమిటంటే అబ్బూరి ఛాయదేవిగారు, శాంతసుందరి గారు రావటం. అబ్బూరి ఛాయదేవి గారు హీరోయిన్‌ ఆఫ్‌ ది ట్రిప్‌ అయ్యరు. ఒకవైపు ఆ ప్రాంతం అందాలు, మమ్ములను చూడండి అంటూ ఆస్వాదిస్తున్నాయి. అటూ ఇటూ చూశామంటే పళ్ళురాలే ప్రమాదం పొంచివుండటం ఒకవైపు. వాకపల్లి బాధితుల మనోవేదన తీరి వారు తిరిగి మామూలు జీవితం గడపగల పరిస్థితులు రావాలని మనస్ఫర్తిగా కోరుత వెనుదిరిగాము.
అరకు గురించి అనుభూతి, భావం వుంది కానీ మాటలు సరిగా అందటం లేదు. అయితే సెలయేరు దగ్గర గడిపిన క్షణం, పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆ వెలితిని కాస్త కవర్‌ చేశాయి. విశాఖ, విజయనగరంలలో సాహిత్య ప్రియులు రచయిత్రుల కోసం చేసిన ఏర్పాట్లు చాలా మెచ్చుకోదగినవి. విశాఖ జైలులో వారు చూపిన ఆదరణ, అభిమానం, భోజనం ఏర్పాట్లు ఇవన్నీ మీ వల్లే సాధ్యమైంది. లేకపోతే మాకు అటువంటి సెక్యూరిటీ ప్రదేశంలో ఆ గౌరవం దక్కటం చాలా కష్టం.
మొత్తం మీద మల్లీశ్వరి గారి కృషి వల్ల మీరు చేసిన ఏర్పాట్లవల్ల ఏ మాత్రం బాదరబందీ లేకుండ మేము టూర్‌ చెయ్యగలిగాము. ఈ టూర్‌ విజయవంతమైందని చెప్పవచ్చును. వినోదంతో పాటు రచయిత్రులకు వాస్తవ విషయలను అధ్యయనం చేయటానికి సహాయపడింది. సేకరించిన విషయలతో, అనుభవాలతో వారు సమస్యలను ప్రజలకు తెలిపే సృజనాత్మక రచనలు చేయగలరు.
కృతజ్ఞతలతో
వనజాక్షి

యాత్రానుభవం
స్నేహ సూత్రం
శివలక్ష్మి

హాయ్‌, నందితా!
ఉభయకుశలోపరి. నీ ఉత్తరం చేరింది. భూమిక నిర్వహించిన రచయిత్రుల కేంప్‌ విశేషాలతో రాద్దామని నేనే ప్రత్యుత్తరం రాయడం కొంచెం ఆలశ్యం చేశాను.
ఈసారి అక్టోబరు 18, 19, 20 తేదీల్లో మూడురోజులపాటు కేంప్‌ జరిగింది. గడియరం ముళ్ళ వెంట పరుగులెత్తే యంత్రిక జీవితం నుంచి కాస్తంత ఆటవిడుపు ఆనందం లభిస్తుందనుకున్నాం. కానీ వెళ్లిన ప్రతిచోటా మహిళలూ – ముంచెత్తుతున్న సమస్యలతో బుద్ధికి బలమైన భోజనం దొరికింది. వినోదంతో పాటు, సామాజికాంశాల పట్ల మన అవగాహననీ, బాధ్యతనీ పెంపొందించుకోవాలని సత్య ముందే తెలియజేసింది. అందరి సహకారంతో కార్యక్రమమంతా టైట్‌ రోప్‌ వాకింగ్‌ లాగా ఎక్కడా ఒక్క నిమిషం కూడా వృథా కాకుండా పకడ్బందీగా నడిచింది. అందుకు సత్యని ఎంతైనా అభినందించాలి.
అక్టోబరు 18 ఉదయం ఒకే సముద్రతీరం కింద ఉన్న రెండు గ్రామాల కెళ్ళాం. పోర్టు నిర్మాణం చేపట్టి ప్రభుత్వం మళ్ళీ రెండోసారి ఆ గ్రామస్తుల్ని నిర్వాసితుల్ని చెయ్యడానికి సిద్దమౌతోంది. వాళ్ళందర సముద్రాన్నానుకున్న కొండలు వాళ్ళ జీవనాధారమని చెప్పారు. కొందరు మత్స్యకారులు చేపలు పట్టి జీవిస్తారు. మహిళలూ, యువకులూ కట్టెలు కొట్టుకొస్తారు. సముద్రపుటొడ్డునున్న యేర్ల, సంపదల పోయాయని మొత్తుకున్నారు. మహిళలు చాలాసార్లు ”మా సముద్రం పోయింది” అని ఆవేదన చెందారు.
రాజ్యాంగంలోని అధికరణం 19లో రాసుకున్నట్లు పౌరులందరికీ ఈ దేశంలో ఎక్కడైనా, ఏప్రాంతంలోనైనా నివసించే హక్కుంది అనే చైతన్యంతో ”మా సముద్రం, మా సెలయేర్లు, మా భమి, మా నీరు, మా నివాసాలు, ఇక్కడ నుంచి కదిపే హక్కెవరికీ లేదు” అని నిలదీస్తున్న మహిళల్లో ఉన్న పోరాటపటిమ, ఉద్యోగాలొస్తాయన్న ఆశతో మారిపోతున్న పురుషుల్లో కనిపించలేదు. పురుషులు కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఆశించడం ద్వారా పెత్తనాన్నీ, ఆధిక్యాన్నీ కోరుకుంటుంటే – స్త్రీలు మాత్రం ఇంటిల్లిపాదీ శ్రమ చేయడానికనువైన పరిస్థితుల్నీ, స్థిరత్వాన్నీ వాంఛించడాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి – నందితా, ఆ మహిళల చొరవ నాకు భవిష్యత్తు మీద ఆశల్ని రేపింది.
తర్వాత దిబ్బపాలెంలో శిథిలమైన ఇళ్ళు చూశాం. అక్కడక్కడా ప్యాకేజీలకు లొంగని ఇళ్ళవాళ్ళున్నారు. సుమారు 150 కుటుంబాలున్న ఇళ్ళను ధ్వంసం చేశారు. ఒక రోజున ఆ ఇళ్ళు మనుషుల సందడితో ఎంత కళకళ లాడాయె! వాటికి ఇంటివాళ్ళ అభిరుచుల్ని బట్టి అందమైన రూపం ఉండేది. జీవంతో పిల్లా పాపల్తో, చెట్లు, పూలతో మిస మిస లాడేవి. ఇప్పుడు అవి వట్టి ఇటుకల గుట్టలు. అదేరోజు సాయంత్రం విశాఖ సెంట్రల్‌ జైల్లో ఉన్న మహిళా ఖైదీలను కలిశాం. ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ. ఆ కథనాలన్నీ గుండెల్ని కలచివేశాయి. ఏమీ చెయ్యలేని నిస్సహాయత ఆవరించిందందర్నీ. అత్తకోడల్ని, కోడలు అత్తని కొట్టడం, వదినా ఆడబిడ్డల వైరాలు చూడడానికి ”ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులు” అన్నట్లు పైకి అనిపించినా దీని మూలాలు మాత్రం పురుషులు నిర్మించిన అత్యాచార సమాజంలోనే ఉన్నాయి.
19వ తేదీన మా ప్రయణం వాకపల్లికి సాగింది. నందితా, కాస్త లేటైనా సరే ఇప్పటికైనా వాకపల్లి గిరిజన మహిళల్ని కలుసుకోగలగడం నాకైతే ఒక అద్భుతంగానే ఉంది. మేము రొప్పుకుంటూ, రోజుకుంటూ, ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకుని ఎంతో ప్రయాసపడుతూ రాళ్ళగుట్టలమీద నుంచి 3 మైళ్ళు దిగుతూ, ఎక్కుతూ చాలా ఉద్విగ్నంగా ఫీలయ్యం. చుట్టూ ప్రకృతి రమణీయంగా ఊరిస్తూ ఉంది. చూశామొ, కాళ్ళు ఎటో జారిపోయి కీళ్ళు విరిగిపోతాయి. మాలో కొంతమంది పడిపోయరు కూడా. కానీ, అక్కడుండే చిన్నారి బాలికలు నెత్తిమీద నీళ్ళ బిందెలతో చిటికెలో ఎక్కి దిగేస్తున్నారు. శారీరకంగా మా బేలతనం అక్కడే తెలిసిపోయింది. ఇక వాళ్ళని కదిలిస్తే ప్రతి విషయంలోనూ వాళ్ళ సాహసం నిర్భయత్వం, నిజాయితీలు మమ్మల్ని తలవంచుకునేలా చేశాయి. ”భూమి పల్కుతున్నది – ఆకాశం ఎందుకు నమ్ముకోదు?” – అని సిత్తాయి విసిరిన సవాలుకి అందరూ అవాక్కైపోయరు. లక్షలాది రూపాయల్ని అడవిలో కుళ్ళిన ఆకుల్ని తీసిపారేసినట్లు తోసేయగలిగిన ఆ యువతులు – మహిళాలోకానికి ఆదర్శమైన నిలువెత్తు వ్యక్తిత్వాలు. వాళ్ళు తమ దుఃఖానుభవాల్ని స్పష్టంగా వివరిస్తుంటే మేము కన్నీటి సంద్రాలమైపోయం. శరీరాలు వేరుగాని మనందరి నాడుల్లో ప్రవహించే రక్తం ఒకటేనని మా మమేకత్వాన్ని సుస్పష్టంగా ప్రకటించగల భాష రాక మూగవేదనతో బెంబేలు పడిపోయం.
నందితా, స్త్రీ స్వాతంత్య్రం గురించి పాలకులు ఒకవైపు నుంచి బ్రహ్మాండమైన ఉపన్యాసాలిస్తూ – రెండోవైపు నుంచి గిరిజనులు ఆరాధించే భూమినుంచి, అడవి సంపదల నుంచి వారిని తప్పించటానికి వాళ్ళ స్త్రీలమీద దాడులు చేయించడం ఎంత అమానుషం? మనుషత్వాన్ని గుర్తించమని ఆర్ద్రంగా మహిళలందర్నీ పిలుస్తున్నారు వాళ్ళు.
20వ తేదీన ”బాక్సైట్‌ తవ్వకాల వ్యతిరేక పోరాట కమిటీ” కన్వీనర్‌ కాకి దేముడమ్మ, ఆమె స్నేహితురాలు పార్వతి అనే ఇద్దరు సాహసవనితల్ని కలుసుకున్నాం. బాక్సైట్‌ తవ్వకాల కోసం, జిందాల్‌ రిఫైనరీల కోసం భూములు కావాలి. జిందాల్‌ కంపెనీకి ప్రభుత్వ సహకారం ఉంది. వేలాది ఎకరాల పచ్చని పంటపొలాలు, అధిక దిగుబడినిచ్చే కొబ్బరి, అరటి, జీడితోటలను కోల్పోతున్న ప్రజల పక్షాన పోరాడుతున్నారు. మనం ఏమిటి? మన బతుకులేమిటి? మన శత్రువెవరు? దేనికోసం పోరాడాలి?” అనే విషయల పట్ల ఆమెకున్న స్పష్టత చూసి అంద రూఅబ్బురపడిపోయరు. ”మనిషి భయపడితే భయపడుతూనే ఉంటాడు. ”చావోరేవో” ఎప్పుడైనా చావాల్సిందేగా” అనే అవగాహనతో పోలీసుల్ని అదరగొడుతుంది. గ్రామగ్రామానికి వెళ్ళి యజమాన్యానికి సంబంధించిన బిల్డింగ్‌ గ్లాసుల్ని బద్దలు గొడుతూ, పైపులు నరికేస్తూ, టైర్ల గాలి తీస్తూ – ”మా భూముల్లో దొంగల్లా దూరి మామీద కేసులు పెట్టడమేమిటి?” అని ఆగ్రహంతో ప్రశ్నిస్తుంది. ఆ అమ్మాయిని చూస్తే నాకు మన లోపం కొట్టొచ్చినట్లు కనపడింది. తను మాట్లాడుతున్నప్పుడు వీపుమీద ఎవరో కొరడా ఝళిపించినట్లైంది.
అరకులోయ ప్రకృతి సాక్షిగా ప్రతిమ ”ఖండిత” పుస్తకావిష్కరణ జరిగింది. మూడురోజులూ ఒక గొప్ప సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది. సత్యవతి, ఘంటసాల, కొండేపూడి నిర్మలలు, విష్ణు, రోష్ని, వరంగల్‌ రమ ఇంకొందరు సురభి నాటక కంపెనీ కళాకారుల్లాగా గానం, నటన, ఆశు డైలాగులు అన్నీ వాళ్ళే నిర్వహించారు. మా అనుభవంలో కొచ్చిన సంఘటనల్ని అప్పటికప్పుడే చిన్నచిన్న నాటికల ద్వారా అభినయించారు. గానానికి అందరూ కోరస్‌ అందించారు. టీమ్‌లీడర్స్‌ లక్ష్మి, కల్పన, గీత, శిలాలోలిత, హేమంత, ప్రసన్న సినిమాని ఆద్యంతం రక్తి కట్టించారు. ఫోటోగ్రఫీ, ఆర్ట్‌ డైరెక్షన్‌ బాధ్యతలు దివ్య దివ్యంగా నిర్వహించింది. నందితా, డైరెక్టర్‌ ఎవరో నువ్వు చెప్పాలి.
– నీ విశ్వతి
లష్కర్‌ నుండి విశాఖ వరకు…
కల్పన
42 మంది ప్రముఖ రచయిత్రులతో కలిసి వెళ్ళిన నా అనుభవం నిజంగా నేను చెప్పలేనిది, వివరించలేనిది. ఈ సారి జరిగిన ప్రయణంలో నేను వెళ్ళటానికి అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సారి మేము వెళ్ళిన స్థలాలు ఆహ్లాదభరితంగానే కాకుండా సామాజిక దృక్పధంతో నిండి వుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.