ఇంకేటుంది… గట్టున పడ్డ సేప తీరే! కదిలిస్తే కన్నీరౌతున్న పోలవరం నిర్వాసితులు – యం.విష్ణుప్రియ

జులై నెలలో ఒక రోజు కాత్మాయనీ విద్మహే గారు ఫోన్‌ చేసి పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో రెండు రోజుల రచయిత్రుల సమావేశం తర్వాత పోలవరం ముంపు ప్రాంతాల నిర్వాసితుల వద్దకు వెళ్దామన్నారు. పోలవరం అనగానే భూమిక సత్యవతి ఏర్పాటు చేసిన ప్రయాణం గుర్తొచ్చింది. పోలవరం ప్రాజెక్టు వస్తుందట. ఇక మళ్ళీ మళ్ళీ పాపికొండలు వెళ్ళడానికి వీలుకాదు. ఒకసారి గోదాట్లో పడవ ప్రయాణం చేసొద్దాం, కుదిరితో కొద్దిమంది గిరిజనులతో మాట్లాడుదామని అప్పట్లో (2008) వెళ్ళిన రచయిత్రుల టీంలో నేనూ ఉన్నాను. పేరంటాల పల్లెలో గిరిజనులను కలిసినపుడు ప్రాజెక్టు వచ్చేనా, పొయ్యేనా, మేం ఈ కొండల్నొదలం అని గట్టిగా చెప్పారు. చూస్తుండగానే ఎనిమిదేళ్ళు గడిచిపోయాయి. మధ్యలో ఇంకోసారి పాపికొండల ప్రయాణం చేసినా అది పూర్తి ప్రయాణంగానే సాగింది.

పోలవరం ప్రాజెక్టులో ఎవరెంత భాగం తింటున్నారన్న వార్తలు, రాజకీయంగా పుట్టినప్పటి నుంచీ ఉన్న పార్టీలను వదిలి, పోలవరం కాంట్రాక్టులు దక్కించుకోవడానికి అధికార పార్టీలోకి గెంతిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదాను సైతం పణంగా పెట్టి పోలవరం ఎస్టిమేట్లను ఎక్కువ చేసిన వార్తలు పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు తెచ్చిన ఘనత మాదంటే మాదని ఒకరంటే పని వేగవంతం చేసినవాడ్ని నేనే అని ఇంకొకరు దాన్ని స్వంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలవరం ముంపు ప్రాంతాల ప్రజల గురించీ, తమ సర్వస్వాన్నీ ఇతరుల కోసం త్యాగం చేసిన వారి గురించీ, నిలువ నీడ కోల్పోయిన వారి గురించీ, జీవనోపాధి కోల్పోయిన వారి గురించీ, ఛిద్రమైన గిరిజనుల కుటుంబాల గురించీ, ప్రాణాలు కోల్పోయిన వారి గురించీ, అడవికీ, గోదారికీ దూరమై తల్లడిల్లుతున్న వారి గురించీ ఏ నాయకుడూ మాట్లాడడం లేదు.

పోలవరం ప్రాజెక్టు మనకు అవసరమా? ఇంత భారీ ప్రాజెక్టువల్ల భవిష్యత్తులో ప్రమాదం జరిగితే వచ్చే నష్టమేంటి లాంటి ప్రశ్నలు వేసుకునే రోజులు కావివి. పై చర్చలు నడుస్తుండగానే ప్రాజెక్టు కోసం రకరకాల మార్గాల్లో అడవి పల్లెల నుంచి గిరిజనులను మైదాన ప్రాంతాలకు తరలించడం మొదలుపెట్టింది ప్రభుత్వం. ప్రజలను, ప్రజా సంఘాల నినాదాలనూ, నిరసనలనూ ఏ మాత్రం ఖాతరు చేయలేదు. పోలవరం ప్రాజెక్టు ఆపమనే డిమాండ్‌ చేసిన వాళ్ళకు ఇప్పుడు పోలవరం కడితే కట్టారు, కనీసం ముంపు ప్రాంతాల వారికి, నిర్వాసితులకు తగిన సౌకర్యం కల్పించాలని, అప్పుడు ఇచ్చిన హామీలయినా అమలు పరచాలని బొంగురు పోయిన గొంతుతో అడగడమే ఇవాళ్టి విషాదం.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొన్ని ముంపు గ్రామాలను సందర్శించడానికి 29.9.2016న ప్రజాస్వామిక రచయితుల వేదిక (ప్ర.ర.వే.) తరపున 25 మందిమి వెళ్ళాం.

”తెలుగు మహిళా రచయిత్రల అనుభవాలు – ప్రభావాలు”

జాతీయ సదస్సు జరిగిన పెనుగొండ నుంచి బస్సులో ఉదయం 8.30 కు బయల్దేరాం. రెండు గంటల ప్రయాణం తర్వాత పోలవరం గ్రామం చేరాం. పోలవరం ఆ చుట్టుపక్కల గ్రామాలకు పెద్ద సెంటరు.

పోలవరం నుంచి ప్రాజెక్టు వైపుగా మూడు కిలోమీటర్లు వెళ్ళి కొత్త దేవరగొంది గ్రామం చేరుకున్నాం. అక్కడ బొంగరం వెంకటలక్ష్మిని కలిశాం. ఆమె నిర్వాసితుల తరఫున పనిచేస్తున్న కార్యకర్త. మాకు గైడ్‌గా వ్యవహరించింది. ముంపు గ్రామాలుగా గుర్తించిన గ్రామాల్లో ఖాళీ చేయించిన గ్రామాలు ఏడు. దేవరగొంది, రామయ్యపేట, తోటగొంది, మామిడిగొంది, చేగొండపల్లి, సింగనపల్లి, పైడిపాక. దేవరగొంది గ్రామస్థులు అందరికంటే ముందు (పరిహారం అందుకుని) అడవి నుంచిదూరం చేయబడిన వారు. మూడేళ్ళ క్రితం ఏర్పడిన కాలనీ పేరు కొత్త దేవరగొంది. ఆర్డీఓ, ఎమ్మార్వో, పోలీసులు వచ్చి పాత గ్రామం నుంచి గిరిజనులను ఖాళీ చేయించారు. అక్కడ ఉన్న అందరూ ఎస్టీ కులాలకు చెందినవారే. 90 శాతం క్రైస్తవ మతంలోకి మారినవారే.

‘దొరోలకొత్త’ కులానికి చెందిన ఒక యువకుడు మాట్లాడుతూ ‘ఇళ్ళు కట్టుకోవడానికి కొంచెం డబ్బులిచ్చింది ప్రభుత్వం, కానీ చేసుకోవడానికి పని మాత్రం ఇవ్వలేదు’ అని వాపోయాడు.

పాతూరులో ఉన్నపుడు అడవిలోకి ఎడ్లతో వెళ్ళి పుల్లలు తెచ్చుకునేవారు. రోజుకు 200 రూపాయలు కనీసంగా వచ్చేవి. అక్కడ బోర్లు లేవు. కానీ వర్షంతో పంటలు పండేవి. ఇక్కడ పంటలకోసం పనికిరాని నేలను ఇచ్చారు. అక్కడ వరి, పత్తి, మొక్కజొన్న వేసేవారు. ఇప్పుడు మినుములు వేశారు. వర్షాభావంవల్ల బోర్లలో నీళ్ళు లేవు.

ఇక్కడ ఉన్న 108 కుటుంబాలకు మూడు చర్చిలు ఉన్నాయి. నలుగురు పాస్టర్లు ఉన్నారు. ”పాతూరులో ఉండేటపుడు మే నెలలో అందరం కలిసి భూమి పండుగ చేసేవాళ్ళం. వేట కోసేవాళ్ళం. ఇప్పుడు ఆ పండుగలన్నీ మానేశారు” అని మరో యువకుడు చెప్పాడు.

దేవరగొంది గ్రామస్థులకు అక్కడికి పది కి.మీ. దూరంలో ఉన్న గుంజవరం అనే ఊరిలో పొలాలు ఇచ్చారు. అంతదూరం వెళ్ళి వ్యవసాయం చేసుకోలేక, దాన్ని సంవత్సరానికి నాలుగైదు వేలకు ఇతరులకు కౌలుకిచ్చేశారు.

కోయకులానికి చెందిన 5వ తరగతి చదువుకున్న తెల్లాం శారద మాట్లాడుతూ ”గవర్నమెంటంతా ఒకటైతే, కూలోళ్ళం ఏం చేత్తాం. ఇక్కడికొచ్చి మూడేళ్ళవుతోంది. ఇప్పటిదాకా పని కల్పించలేదు. మేమంతా ఏం కావాలి? ఇక్కడికి రాక మునుపు మీకది చేస్తాం ఇది చేస్తాం అన్న వాళ్ళెవరూ ఇప్పుడు మా దగ్గరకు రాక ఆమడ దూరమెళ్ళిపోయారు అంది. రాత్రికి రాత్రి ప్రొక్లెయినర్‌తో వచ్చి వాళ్ళే ఇళ్ళు కూల్చేసి, సామాన్లు లారీలో వాళ్ళే సర్దేశారు. పాతింటికి పరిహారం 40 వేలు, కొత్తిల్లు కట్టుకోవడానికి 60 వేలు ఇచ్చారు. ఎట్టా సరిపోద్ది? అని ప్రశ్నించింది. ఫ్యామిలీ ప్యాకేజి అడుగుతున్నాం. మేం పాతోళ్ళమి. ముందే వొచ్చేసినందుకు మాకు తక్కువిచ్చారు. ఇప్పుడు ఎక్కువిస్తున్నారు. అలా కాకుండా కుటుంబానికి పది లక్షలివ్వాలి. కానీ మా డిమాండ్‌ను ఎవరికాళ్ళు పట్టించుకోకుండా, యినబడనట్లే ఉన్నారు” అని వాపోయింది.

కొత్త రామయ్యపేటకు చెందిన మిరియాల చక్రం (45 సంవత్సరాలు) చెబుతూ ”మా ఇంట్లో అన్నం పొయ్యి మీద ఉడుకుతుండగానే అన్ని సామాన్లను ఆళ్ళే తీసుకెళ్ళి లారీలో పెట్టేశారండీ. ఈ లోపు ఉడికిన అన్నం గిన్నీ పెట్టేశారండీ. కొత్తూరుకెళ్ళి తినమన్నారండీ. నవ్వాలో, ఏడవాలో అర్థం కాలేదండీ” అంది.

”మా నాగేశ్వర్రావు పురుగుల మందు తాగేస్తానని డబ్బా అట్టుకుని గోడమ్మిట బండికడ్డం కూచున్నాడండీ. పిల్లల్నట్టుకుని మేమేం జెయ్యాల్రా అని ఆడ్ని లాగేశాం. అడివినొదిలేసి నేనెట్టా బతికేది అని నేల కూలబడిపోయాడు. ఏడ్చేవాళ్ళనూ, అరిచేవాళ్ళనూ, అడ్డం బడినోళ్ళనూ అందర్నీ ఎత్తి లారీల్లో సామాన్లతోపాటు కుదేసి తీసుకొచ్చేశారండీ” అని వాపోయింది బుల్లెమ్మ.

రామయ్యపేట గ్రామస్థులకు ఎకరాకు లక్షా 80 వేల రూపాయలు ఇచ్చారు. ఊరు మారి కొత్త రామయ్యపేట వచ్చేసరికి చాలా మంది డబ్బులు ఖర్చయిపోయాయి. మునుపు పదెకరాల రైతు ఇప్పుడు కూలీ అయ్యాడు. ఇక్కడ వాళ్ళను పనులకు పిలిచేవాళ్ళు లేరు. ఈ ఊర్లో వెలమలు, జాలర్లు ఎక్కువ. సంవత్సరానికి వంద రోజుల ఉపాధి హామీ పథకం కూలీ కింద రోజుకు రూ. 100 లేదా రూ.150 కోసం ఎదురు చూస్తుంటారు. కొత్తూరులో ఇళ్ళన్నీ ఎత్తులో కట్టించారు. మెట్లు పెట్టలేదు. ఇళ్ళకు గుమ్మాలున్నాయి. కానీ తలుపులు లేవు. కాంట్రాక్టరు పెట్టలేదు. మైదానంలో తలుపుల్లేని ఇళ్ళలో ఎలా బతుకుతున్నారంటే 70 ఏళ్ళ బుల్లెమ్మ మాట్లాడుతూ ”మా కత సరేనమ్మా. వారం క్రితం కొత్తగా పెళ్ళయిన జంట ఇబ్బంది ఏం జెప్పమంటారు? ఆళ్ళని మా ఇంట్లో ఉంచుకోలేక తలుపులు పెట్టించుకున్నోళ్ళ ఇంటికి పంపాము” అని చెప్పింది. ”ఏముందిక్కడ! మమ్మల్ని తీసుకొచ్చి అడవిలో పడేశారు” అని నిర్లిప్తంగా అన్న మిరియాల సుబ్బాయమ్మ మాటలు ఒక్క క్షణం అర్థం కాలేదు మాకు.

ఇదే గ్రామంలో జాలర్ల ఇళ్ళవైపుగా నడుస్తుంటే రోజూ గోదారిలో తిరుగాడే పుట్టి నేలమీద కనిపించింది. ఏంటిలా అని విస్తుపోతూ జాలరి యువకులను పలకరించాం. ”గోదారి నుంచి మమ్మల్ని లాక్కొచ్చేశారు కదండీ” అన్నారు టపీమని. ”అక్కడ గోదారి ఇంటి పక్కనే పారేదండీ ఇక్కడ గోదారే లేదండీ. గోదారికెళ్ళాలంటే ఆరు కిలోమీటర్లు ఎల్లాలండీ” అని నిరాశగా చెప్పారు. ఇప్పుడు సంపాదన ఎలా ఉంటోందని అడిగితే ‘నీటిలో చేప చెప్పలేం కదండీ. ఓ రేత్రి గోదారి మీదుంటే నూటాభై అలా వస్తదండీ’ అన్నారు. మరి గోదార్నే నమ్ముకునే బదులు వేరే పనులకెళ్ళవచ్చు కదా అని అడిగాం. ”వేరే పనులయినా ఎక్కడ దొరుకుతున్నాయండీ, అయినా జాలర్లం గోదారి తప్ప మరేటీ మాకు తెలీదండీ” అని తేల్చేశారు. ‘స్లాబులున్న ఇళ్ళల్లో ఉంటం బానే ఉందండీ కానీ అక్కడున్న శోభ ఇక్కడ ఉండదు కదండీ’ అని వాపోయారు.

కొత్త రామయ్యపేటలో మందిరం దగ్గర భోంచేసి పోలవరం ప్రాజెక్టు ఏరియాలోకి వెళ్ళాం. సన్నగా చినుకులు మొదలయ్యాయి. పచ్చటి కొండల సుందర దృశ్యంలోకి బస్సు ప్రయాణం సాగింది. వర్షపు జల్లుల మధ్య ఆ కొండలను అబ్బురంగా చూస్తూ వెళ్తున్నాం. అకస్మాత్తుగా కొండలు మాయమై చెట్లన్నీ కొట్టేసి, కొండల్ని పిండి చేసి రాళ్ళుగా మార్చిన గుట్టలు కనబడసాగాయి. అలా నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్ళామో లేదో అల్లంతదూరాన ప్రొక్లయినర్లు, లారీలు, జీపులు నిలబెట్టి ప్రాజెక్టు పనులు చేయిస్తున్న దృశ్యం కనబడింది. మర్నాడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పర్యటన ఉండడం వలన పోలీసుల హడావుడి ఉంది. ఈ వాహనాలున్న ప్రదేశాలు దాటుతుండగా ఎడమవైపు ఉన్న లోయలో ఇసుక గుట్టలు గుట్టలుగా (ఒక 400 లారీల ఇసుక) పోసి ఉంది. వెంకటలక్ష్మి ఆ లోయను చూపిస్తూ ఇదే మా దేవరగొంది అని సంతోషంగా చెప్పింది. వాళ్ళ పాత ఊరిని చూసినపుడు ఆమె మొహంలో ఎంత ఆనందమో! ‘ఇక్కడ సొరంగం (స్పిల్‌ వే) కడతరంటండీ. అందుకే ఆ ఇసుక గుట్టలు’ అని వివరించింది. అదిగదిగో ఆ తాటిచెట్ల వరస కిందే మా పొలం అని చూపించింది.

శతాబ్దాలుగా అక్కడున్న గిరిజనుల కోసం దశాబ్దాలుగా కూడా ఏ విధమైన అభివృద్ధి పనులూ చేయని ప్రభుత్వం ఇప్పుడు రోజుల్లో రోడ్లను వేస్తోంది. రోడ్లకు అటూ ఇటూ ఉన్న తాటిచెట్లను ప్రొక్లెయినర్లతో క్షణాల్లో కూల్చేసి పెద్ద లారీలు, హిటాచీ వాహనాలు తిరగడానికి వీలుగా వెడల్పు చేస్తున్నారు. మేం వెళ్ళే దారి పొడవునా అడవిలో నుంచి కొట్టేసిన చెట్ల మానులను తరలిస్తూ ట్రాక్టర్లు మైదాన ప్రాంతాలకు వెళ్తూ ఎదురుపడ్డాయి.

మాదాపురం, కొండ్రుకోట, కొత్తూరు, సింగనపల్లి ఊర్లమీదుగా ఒక సెంటరుకు చేరుకున్నాం. అక్కడికి వెళ్ళేసరికి వర్షం పెద్దదయింది. అక్కడ్నుంచీ ఒకటిన్నర రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లవరం, గాజులగొంది వెళ్ళాలనుకున్నాం. బస్సు వెళ్ళడానికి రోడ్డు అనుకూలంగా లేకపోవడంతో వెళ్ళలేకపోయాం. ఇక నేరుగా వాడపల్లికి చేరాం. వాడపల్లి పంచాయతీ కేంద్రం గోదావరి ఒడ్డునే ఉంది. ఈ గ్రామంలో ప్రజలు ఇంకా పొలాలను సాగు చేసుకుంటున్నారు. ఇక్కడ ఎక్కువగా వరి, మొక్కజొన్న పండిస్తున్నారు. కోయ, కొండరెడ్డి కులస్థులు ఎక్కువ. జాలరి కుటుంబాలూ ఉన్నాయి. గ్రామంలో చాలామంది క్రైస్తవ మతానికి మారినవాళ్ళే.

ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. ఇక కదలక తప్పదు. ఇక్కడ్నుంచీ బయల్దేరక చేయగలిగిందేమీ లేదు అని గ్రామస్థులు అనుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నారు.

వాడపల్లి గ్రామంలో ఇళ్ళు చాలా అందంగా ఉన్నాయి. ప్రతి ఇంటిముందు పూల మొక్కలు, కాయగూరల మొక్కలు ఉన్నాయి. మల్లె, కనకాంబరం, సన్నజాజి, బీర, సొర, దొండ, ఇంటిముందు దడికి అల్లించిన కూరగాయల పాదులు అందంగా తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి. బస్సు దిగగానే గోదావరి కనిపించినవైపు ఉరికాం. ఇంకో సంవత్సరానికి వస్తే ఈ దృశ్యమంతా మాయమవుతుందన్న భావనే చాలా భారంగా ఉంది. ఎండలో ఎన్ని నీళ్ళు తాగినా దాహం తీరనట్లు, అందరూ తనివి తీరనట్లుగా ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు.

ఊరిచివరే గోదావరి పక్కనే ఉన్న జాలర్ల ఇంటికి వెళ్ళాం. ఇంటిపెద్ద నూకరాజు గోదావరిని చూస్తూ నిర్వేదంగా కూర్చున్నాడు. ఆయన భార్య నూకరత్నమ్మ మాతో మాట్లాడింది. ‘చేపల కోసం ఆడవాళ్ళం కూడా గోదారిమీదకెళతాం. రాత్రంతా గోదారిలోనే ఉంటాం, తెల్లారాక ఇంటికొస్తాం’ అని చెప్పింది. వారి కొడుకు హరిబాబు మాట్లాడుతూ ‘ముంపు గ్రామాల్లో జాలర్లందరం కలిసి (పల్లీయులు, వాడీయులు, బెస్తవాళ్ళు, గూళ్ళడ్పీలు, జాలర్లు) 200-250 కుటుంబాలుంటాయండీ. మాకు పొలాలు గట్రా కావాలని ఆశ లేదండీ. ఇక్కడ్నుంచీ ఎళ్ళక తప్పదు గదండీ. ఏదో గోదారొడ్డునే ఉండానికి ఇమ్మంటున్నామండీ. అలా ఇవ్వడం కుదరదంటున్నారండీ. గోదారి లేకుండా మేమేం చేయగలమండీ. చేపని నీటిలోంచి తీసి బైటేసినట్టేనండీ….” అని కన్నీటి పొరతో అన్నాడు. మేము మాట్లాడుతుండగానే అపుడే బడినుంచి వచ్చిన చిన్న పిల్లలు ఇవన్నీ అర్థంకాక మమ్మల్ని చూస్తూ నిలబడిపోయారు. వాళ్ళతో కలిసి ఫోటోలు తీసుకుంటే బోలెడు సంబరపడిపోయారు. ఈ గోదారి నది ఒడ్డున ఇళ్ళూ, పూలమొక్కలూ, అడవీ… అంతా వాళ్ళకు చిన్ననాటి జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలేది కదా ఇక అనిపించింది.

నష్టపరిహారం సంగతేంటి?

మొదటి విడతలో తరలిన వాళ్ళలో ఎస్టీలకు భూమికి బదులుగా భూమి, ఇంటి కోసం 5 సెంట్లు, ఇల్లు కట్టుకోవడానికి 60 వేలు, పాత ఊర్లో ఉన్న ఇంటికి విలువ వేసి 40 వేల డబ్బు

ఇచ్చారు. ఇతర కులస్తులకు ఎకరాకు ఒక లక్షా ఎనభై వేలు ఇచ్చారు, పొలంకి బదులు పొలం ఇచ్చిన వారికి పంట పండని భూమి ఇచ్చారు. రాళ్ళున్న నేలను సాగు చేసుకోవడానికి ఏ మాత్రం ఆర్థిక సాయం చేయకపోగా, ఆ భూమిని కూడా ఉన్న ఇంటికి పది కి.మీ. దూరంలో ఇచ్చారు. భూమి నుంచి మనిషిని విడదీశారు. తన భూమిమీద నిల్చుని మాట్లాడితే గిరిజనులకు వచ్చే శక్తిని బలహీనపరిచారు. తమ సర్వస్వాన్నీ ఇతరుల కోసం త్యాగం చేసిన గిరిజనులను, ప్రభుత్వం ఆర్థించే స్థితికి తీసుకొచ్చింది. సాధారణంగా గిరిజనులు ఐక్యతగా ఉంటారు. ఇప్పుడు తమకన్నా పక్కవారు ముందే పరిహారాన్ని అందేసుకుని ఎ్కడ ఎక్కువ లాభపడతారో, తమకది కూడా లభించదేమో అనే ఆందోళనకు గురయ్యేలా చేసింది ప్రభుత్వం. ఒకే కుటుంబంలో అన్నదమ్ములలో ఒకరికి తెలియకుండా ఒకరితో రహస్య లావాదేవీలు జరిపేవారు ప్రభుత్వ అధికారులు. దీంతో ఒకరిపట్ల ఒకరికి అపనమ్మకాలు ఏర్పడి కుటుంబ సంబంధాలు దెబ్బతిన్నాయి.

గతంలో వారి జీవితాల్లో డబ్బుకు ప్రాధాన్యత ఉండేది కాదు. కరువొచ్చినా అడవిమీద ఆధారపడి బతికేవారు. ఇప్పుడు మైదాన ప్రాంతంలో ప్రతిదానికీ డబ్బు కావాలి. పళ్ళు తోముకునే పందుంపుల్ల కోసం, ఇల్లు చిమ్మే చీపురు కోసం కూడా డబ్బులివ్వాల్సి వస్తుందేంటని విస్తుపోతున్నారు. రోజూ పని దొరక్క అవస్థ పడుతున్నారు. చాలామంది నిరాశగా, నిస్తేజంగా ఉన్నారు. ఇందులో 35-40 ఏళ్ళ వయసు వారు కూడా ఉన్నారు. చేయడానికి పనీ దొరకట్లేదు, కొత్తచోటు కాబట్టి గుర్తింపూ లేదు. ఏడేళ్ళ ముందు ఏ మాత్రం ప్రతిఘటించకుండా తక్కు వ నష్ట పరిహారం పుచ్చుకుని వచ్చిన వాళ్ళు తాము నష్టపోయామన్న భావనలో ఉన్నారు. ఏజెన్సీ ఏరియాలో నిర్వాసితులైన వారందరిదీ ఒకే సమస్య కాదు. జాలర్లది వేరే సమస్య. వాళ్ళు పుట్టినప్పటినుంచీ గోదావరి మీదకెళ్ళి రేయింబవళ్ళూ చేపలు పట్టడమే పని. వేరే ఏ పనీ రాదు. వారికి గోదావరి ఒడ్డున స్థలాలిస్తే చాలంటున్నారు.

ఇతర ప్రాంతాల వారికోసం నిర్వాసితులుగా మిగిలిన ఈ ముంపు ప్రాంతాల ప్రజల పట్ల ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించింది. తరలింపులోనే కాదు తర్వాత సౌకర్యాలను కల్పించడంలో కూడా. త్యాగాలు చేసిన వారిపట్ల ఎంత ప్రేమగా, బాధ్యతగా ఉండాలి. ‘ఏరు దాటకముందు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా ఉంది. పరిహారం తీసుకోనంత వరకు ప్రభుత్వ అధికారులంతా అక్కరగా పలకరించారని, ఒకసారి అడవిని, గూడేలను వదిలి మైదాన ప్రాంతాలకు మారగానే ప్రభుత్వ అధికారులు మొహం కూడా చూడట్లేదని అనేకమంది వాపోయారు.

రాజధాని పరిసర ప్రాంతాల్లో లాండ్‌ పూలింగ్‌ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన/స్తున్న తీరునీ, పోలవరం ముంపు ప్రాంతాల్లో వారిని తరలించే తీరుని గమనిస్తే ప్రభుత్వ వివక్ష అర్థమవుతుంది. ఎక్కడ మోసం చేయొచ్చు, ఎక్కడ బెదిరించొచ్చు, ఎక్కడ నొక్కేయొచ్చు చూసి తదనుగుణంగా జీఓలు తెస్తుందీ ప్రభుత్వం. ప్రాంతాలవారీగా కాకుండా భూములు కోల్పోయిన అందరికీ ప్రభుత్వం ఒకే విధానాన్ని పాటించాలి. ముంపు ప్రాంతాలుగా ప్రకటించిన అన్ని ప్రాంతాలకూ (ముందే తరలించిన వారికి కూడా) భూసేకరణ చట్టం 2013 ప్రకారం పరిహారం ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతం నుంచీ మైదాన ప్రాంతానికి వచ్చినందున భవిష్యత్తులో ప్రత్యేక హోదాను కోల్పోయే అవకాశం ఉంది. అలా కాకుండా ఉండడానికి, ముంపు ప్రాంతాల వారికి ఏజెన్సీ ప్రాంతంలో మూడు సెంట్లున్న స్థలం ఇచ్చారు. (ఉదా: కొత్త దేవరగొంది గ్రామంలో వారికి అక్కడికి పది కి.మీ. దూరంలో ఉన్న గుంజవరం దగ్గర పొలాలు ఇచ్చారు. అక్కడికి దగ్గర్లోని వారికి అటవీ ప్రాంతంలో నివాస స్థలాలు ఇచ్చారు. అక్కడ ఇళ్ళను ప్రభుత్వమే కట్టించాలని వారు కోరుతున్నారు.

నిర్వాసితులు కోరుకుంటున్నవి: చదువుకున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి, చదువు రానివారికి ఉపాధి కల్పించాలి, అసలు భూమిలేని నిరుపేదలకు ఎకరా భూమి ఇవ్వాలి. మహిళల పేరుమీద పట్టా ఇవ్వాలి. ఏజెన్సీ ప్రాంతంలో ఇళ్ళు కట్టివ్వాలి. ఐదెకరాలకు మించి ఎవరికీ ఇవ్వలేదు. మిగిలిన (సెంట్ల) భూమికి పరిహారం ఇవ్వాలి. కుటుంబ ప్యాకేజీ ఇవ్వాలి. అన్నింటికంటే ముఖ్యంగా మైదాన ప్రాంత మగవారి చేతిలో మోసపోయిన గిరిజన మహిళల పిల్లలకు తల్లి కులం వర్తించేలా కులధృవీకరణ పత్రాలు ఇవ్వాలి. ఒంటరి స్త్రీలకు, వితంతువులకు ప్రాముఖ్యం ఉండేలా ఉపాధి పథకాలు ఉండాలి. ఉద్యోగాల్లో నిర్వాసితులకు ప్రాముఖ్యత ఇవ్వాలి. గుంజవరంలో ఇచ్చిన పొలాలను సాగుకు తయారు చేయడానికి ఎకరాకు సంవత్సరానికి పదివేల చొప్పున కనీసం అయిదారేండ్లు ఇవ్వాలి.

కొత్త దేవరగొంది ప్రజల ఇబ్బందులు చూసి పాత దేవరగొంది గ్రామానికి పైనున్న నెక్కపుకోట, ఉడతపల్లి గ్రామాల వారు ససేమిరా కొండ దిగము, అడవినొదిలి రామంటున్నారు. గోదారి దేవరగొందిని ముంచేస్తే మేం మరింత కొండెక్కి పైనే

ఉంటాం అంటున్నారు.

గమనిక:ఈ వ్యాసం రాసే సమయానికి పైడిపాక గ్రామస్థులు తమకు న్యాయం జరగాలని తిరిగి వాళ్ళ ఊరెళ్ళి పాకలు వేసుకుని అన్నం వండుకోవడం మొదలుపెట్టారు. ఇక ప్రభుత్వం దిగిరాక తప్పదు. వీరి డిమాండ్లూ తీర్చక తప్పదు. గిరిజనులకే మా మద్దతు.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో