అడవి పిలిచింది – సుజాత బెడదకోట

నేను మట్టి కావడం కంటే బూడిద కావడానికే ఇష్టపడతాను. కుళ్ళి కృశించి, నశించడానికి బదులు నాలోని ప్రతి అణువూ భగభగ మండే మంటల్లో ఆహుతవాలనుకుంటాను! మందకొడిగా ఒక శాశ్వతమైన గ్రహంగా ఉండడం కంటే దేదీప్యమానంగా వెలిగి పతనమయ్యే అద్భుతమైన ఉల్కగా మారాలనుకుంటాను! మనిషన్న వాడు జీవించాలి, బతుకీడ్చడం కాదు – జాక్‌ లండన్‌”

ఈ మాటలు చదువుతుంటే రక్తం పరుగులు పెడుతుంది! ఇలా బతకడం ఎంతమందికి సాధ్యం అవుతుంది? జాక్‌ లండన్‌ అలాగే బతికాడు. జీవితంలోని ప్రతి క్షణాన్ని అద్భుతమైన అనుభవంగా మార్చుకుంటూ, వాటిని పోగు చేసుకుంటూ మంటలా మండుతూ వెలుగుతూ బతికాడు!

జీవితాన్ని ఒక మహోధృత తరంగంలా జీవించి ప్రతి క్షణాన్నీ అనుభూతి చెంది, ఇక చివరి క్షణాల్లో ”అప్పుడలా చేసుంటే బాగుండేది, ఆ నెల్లో అలా చేయకుండా ఉండుంటే బాగుండేది” అని పశ్చాత్తాపాలు, నెమరేసుకోడాలూ లేకుండా బతికినన్నాళ్ళు జీవించడం మాత్రమే తెల్సిన వ్యక్తులు లోకంలో ఎంతమంది ఉంటారో గానీ సరిగ్గా అలాంటి మనిషే జాక్‌ లండన్‌. ఆయన బోల్డు పుస్తకాలు రాశాడని అందరికీ తెల్సిందే!

వాటిలో అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ”కాల్‌ ఆఫ్‌ ది వైల్డ్‌”. దీన్ని మొదటిసారి నేను పీకాక్‌ క్లాసిక్స్‌ వాళ్ళు వేసిన ”అడవి పిలిచింది”గా చదివాను. అది చదివాక వైట్‌ ఫాంగ్‌, సీ ఉల్ఫ్‌ (ఇలా కుక్కలు, తోడేళ్ళ మీద పుస్తకాలు రాసినందుకే ఆయన్ని ఆక్స్‌ స్నేహితుడు ”ఉల్ఫ్‌ మాన్‌” అని పిలిచేవాడట), ుశీ పబఱశ్రీస a టఱతీవ ఇంకా ూ్‌aతీ =శీఙవతీ చదివాను. వైట్‌ ఫాంగ్‌, సీ ఉల్ఫ్‌ కూడా వైల్డ్‌ లైఫ్‌కి సంబంధించే సాగుతాయి, కాల్‌ ఆఫ్‌ ది వైల్డ్‌ లాగే. టు బిల్డ్‌ ఎ ఫైర్‌ మొత్తం పూర్తిచేసి కానీ కదిలే పుస్తకం కాదు. నిజానికి అతి మామూలు సంఘటనల్ని కూడా ఉత్కంఠ రేకెత్తించేలా జాక్‌ లండన్‌ మాజిక్‌ చేయగలడు. ఆ కథలోకి మనల్ని తీసుకుపోయి అక్కడ పారేస్తాడు. ఇహ మన ఖర్మ! తర్వాత వెనక్కి రావాలంటే దారి మనమే వెదుక్కోవాలి.

జాక్‌ లండన్‌ తెలుగు పుస్తకంతో నాకు పరిచయమైనా, మిగతా పుస్తకాలు కూడా చదివించాడు. ఈ ”అడవి పిలిచింది” చదువుతుంటే మనల్ని పిచ్చిగా ప్రేమించి, మనమీద అంతటి మమకారం పెంచుకుని మనకోసం ప్రాణాలైనా ఇవ్వగలిగేంత ప్రేమను పంచే బక్‌ లాంటి కుక్కను, మన జోలికి ఎవరైనా వస్తే వాళ్ళ రక్తం కళ్ళజూసే బక్‌ లాంటి కుక్కను… పెంచుకోవాలనే కోరిక బలీయంగా కలుగుతుంది ఎవరికైనా! విశ్వాసం, ప్రేమ చూపడం ఒక్కటే బక్‌ లక్షణం కాదు. సాహసం, జీవితం మీద ప్రేమ, ఉత్సాహం ఇవన్నీ దాని ప్రత్యేక లక్షణాలు. ఇది తోడేలు జాతికి చెందిన బలిష్టమైన కుక్క.

విధివశాత్తు రాజాలాంటి విలాసమైన బతుకులోంచి అతి హీనమైన బతుకులోకి జారిపడ్డ దగాపడిన కుక్క ఇది.

అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసించే ఒక జడ్జి గారింట్లో సకల రాజభోగాలననుభవిస్తూ పెరిగే బక్‌ అనే ఈ కుక్కే ఈ నవల్లో హీరో. జాక్‌ లండన్‌ ఇతర నవలల్లాగే మెదలుపెట్టాక ఏకబిగిన చదివించే ఈ నవల్లో బక్‌ జీవితం మొత్తం ఆవిష్కృతమవుతుంది.

”బక్‌ పత్రికలు చూడదు” అంటూ నవల ప్రారంభమ వుతుంది. ఒక గొప్ప ప్రారంభం ఇది.

విలాసవంతమైన జీవితం, దానివల్ల ఆయాచితంగా వచ్చిపడ్డ దర్పంతో బక్‌ రాజఠీవితో జడ్జిగారింట్లో ఉంటుంది. ఎంతో గంభీరంగా, గర్వంగా బతుకుతున్న బక్‌ ఏదో జడ్జిగారి మనవళ్ళు కాబట్టి వాళ్ళని తన జూలుతో ఆడుకోనిస్తుంది కానీ పత్రికలు చూడకపోవడం వల్ల తనకు రాబోతున్న కష్టం అది గ్రహించలేకపోతుంది.

ఆ సమయంలో అలాస్కా ప్రాంతంలో బంగారు గనుల్లో బోల్డంత బంగారం దొరుకుతోందనీ, అందువల్ల జనం అంతా కట్టలు కట్టుకుని అక్కడికి పోతున్నారనీ, మంచు తప్ప మరేమీ లేని ఆ ప్రాంతంలో ప్రయాణించడానికి స్లెడ్జ్‌ బళ్ళు కావాలనీ, వాటిని ఈడ్చడానికి మంచుని తట్టుకునే జూలు కలిగిన బలమైన కుక్కలు అవసరమనీ పత్రికల్లో వచ్చుండొచ్చు, వస్తుండొచ్చు గానీ పత్రికలు చూడకపోవడం వల్ల మనిషికి ఆ పచ్చని లోహంమీద ఉన్న

ప్రేమానురాగాలు దానికి తెలీవు. అంతేకాక జడ్జి ముల్లర్‌ ఇంట్లో పనిచేసే మాన్యూల్‌కి ఉన్న చైనా లాటరీ జూదం వ్యసనం గురించి దానికేమీ అవగాహన లేదు. ఇవన్నీ బక్‌ పత్రికలు చూడకపోవడం వల్ల దానికి తెలీవు కాబట్టి మాన్యూల్‌ గాడు తనని ఒక పరాయి మనిషికి అమ్మబోతున్నాడని గ్రహించలేకపోయింది. వాడిని నమ్మి వాడితో ఎప్పట్లాగే వెళ్ళి, వేరే వాడికి అమ్ముడైపోతుంది.

మాన్యూల్‌ తన మెడ పట్టీని అపరిచితుడికి అప్పగిస్తుంటే కూడా ఆ పరాయి వాడు మాన్యూల్‌కి తెలిసిన వాడే కదాని కాస్త గుర్రుమన్నా ఆమోదిస్తుంది. వాడు గోనెసంచిలో మూటగట్టి తీసుకుపోతుంటే ”ఏదో జరిగింది” అని తప్ప ఏం జరిగిందో దాని కుక్క బుర్రకి తట్టదు, ఎన్నడూ ఆలోచించాల్సిన అవసరమే రాని బుర్రాయె.

అలా తీసుకుబోబడ్డ బక్‌ తన జీవితంలో ఎన్నడూ ఎదురు చూడని భయంకరమైన జీవితాన్ని చూస్తుంది. ఒక బోనులో పడేసి బొత్తిగా బక్‌ అంటే మర్యాద లేకుండా ప్రవర్తిస్తూ రైల్లో తీసుకుపోతారు.

అక్కడినుంచి అది చాలామంది చేతులు మారి, సుదీర్ఘ ప్రయాణాలు చేసి దానికి జీవితంలో ”దుడ్డుకర్ర న్యాయాన్ని” పరిచయం చేసిన ఎర్ర స్వెటర్‌ వ్యక్తి చేతికి వస్తుంది. ఈ మధ్యలో ఎదురైన ప్రతి మనిషిపైనా చంపాలన్నంత కోపంతో తిరగబడి కరిచి రక్తం కళ్ళచూస్తుంది బక్‌. రచయిత మాటల్లో చెప్పాలంటే, ”బందీ అయిన రాజుగారికి” వచ్చే కోపాన్ని చూపిస్తుంది. చివరికి బక్‌ ఎర్ర స్వెటర్‌ వాడి చేతిలో పడ్డాక వాడు ”మాట వినడం, వినయంగా

ఉండడం” అనేవి ఎలా సాధ్యపడతాయో దానికి దుడ్డుకర్రతో రుచి చూపిస్తాడు.

తన దర్పాన్నీ, శౌర్యాన్నీ, బలాన్నీ మాత్రమే నమ్ముతూ వాటిని ప్రదర్శించాలని చూసిన బక్‌కి ఎర్ర స్వెటర్‌ వాడి దుడ్డు కర్ర మాడు పగలగొట్టి ఒక్క కుదుపు ఇస్తుంది. బక్‌ శరీరమే కాక, అభిమానం కూడా దెబ్బతిన్న మొదటి దెబ్బ అది. దెబ్బతిన్న బక్‌ అంత బాధని మొదటిసారి చవి చూసినా, తిరిగి వాడిమీద తిరగబడాలనే చూసి పన్నెండుసార్లు అతడిమీద దాడికి ప్రయత్నించి, పదమూడోసారి కొట్టిన అతి బలమైనన దెబ్బకి తలవంచి శక్తి చచ్చి నిస్సహాయురాలై పోతుంది.

వాడంటాడు ”ఏం బిడ్డా బక్‌? మన సంఘర్షణ అయిపోయింది. నీ స్థానం నువ్వు తెలుసుకుంటే మంచిది. నాది నెనెరుగుదును. ఇంతటితో పోనివ్వడం మంచిది”

బక్‌కి తన స్థానమేంటో తెలిసి వస్తుంది. మొదటిసారి తాను ఓడిపోయిందని గ్రహించింది గానీ లొంగిపోదల్చదు. అక్కడినుంచీ బక్‌ ”ఎదురు తిరిగితే”, తన తిరుగుబాటు న్యాయమైనదైనా సరే, దెబ్బలు తినక తప్పదని అర్థం చేసుకుంటుంది. ఎర్ర స్వెటర్‌ వాడినుంచి చేతులు మారి కెనడా దేశపు అధికారిక ఉత్తరాల బట్వాడా కోసం ఫ్రాన్సోయ్‌, పెరాల్ట్‌ అనే ఇద్దరు వ్యక్తుల వద్దకు చేరుతుంది బక్‌. నిత్యం కష్టమే, నిత్యమూ శ్రమే. కానీ బతకాలంటే వాటికి తల వంచాలి.

ఇక్కడినుంచీ బక్‌కి అసలైన జీవితం మొదలవుతుంది. జీవితం మామూలుగా నడిచి పోవాలంటే ఎన్ని జిత్తులు చేయాలో, ఎన్ని కుట్రలు చేయాలో, ఎలా చేయాలో, ఎలా చేస్తారో అన్నీ తెలుస్తాయి. బతకడం కోసం అది అన్నీ నేర్చుకుంటుంది. మంచంటే తెలీని బక్‌కి మంచులో మైళ్ళకొద్దీ స్లెడ్జ్‌ బండి లాగడం, మంచులో గుంట తవ్వుకుని పడుకోవడం అన్నీ అలవాటు అవుతాయి. జీవితం లాగిపెట్టి తన్ని మరీ నేర్పిస్తుంది. ఒకరి నాయకత్వం కింద పనిచేయడమూ… పని సరిగా చేయలేనపుడు నోర్మూసుకుని భరించడమూ… ఇవన్నీ బక్‌ అంగీకరిస్తుంది.

ఎస్కిమో కుక్కలు వచ్చి పడితే వాటిని ఎదుర్కోవడమూ, తోటి కుక్కలు మోసం చేస్తే బుద్ధి చెప్పడమూ అలవాటు చేసుకుంటుంది. దాని జీవితం సినిమాల్లో మాదిరిగా క్షణాల్లో సింహాసనం మీది నుంచి పాతాళం లోకి జారిపడ్డట్టు అయినా, బక్‌ దాన్నుంచి తేరుకుని దొరికిన జీవితాన్ని అంగీకరిస్తుంది.

పనిచేయడానికే తనను అక్కడికి తెచ్చారని అర్థం చేసుకుని బతుకు తెరువు కోసమన్నట్లుగా అది త్వరగానే పని నేర్చుకుని స్లెడ్జ్‌ బళ్ళను లాఘవంగా లాగుతుంది.

కలలోనైనా ఊహించని కష్ట జీవితం!

ఉత్తరాల బట్వాడా పనులు చూసే ఫ్రాన్సోయ్‌, పెరాల్ట్‌ లు బక్‌ ఒళ్ళు దాచుకోదని బాగా మెచ్చుకుంటారు.

కష్ట జీవితం అలవాటయ్యాక బక్‌లోని సున్నితత్వమూ, పెంపుడు జంతువుకు ఉండే నాగరికతా, మొహంలో ప్రశాంతతా అన్నీ ఒక్కొక్కటే మాయమైపోతాయి. అది జీవితంమీద పగబట్టినట్టు ప్రవర్తిస్తుంది. తనపై ఆధిపత్యాన్ని చూపబోయే స్పిట్జ్‌ కుక్క రక్తం కళ్ళజూస్తుంది. మోసం, దొంగతనం నేర్చుకుంటుంది. అదను చూసి దాడిచేసే విద్య నేరుస్తుంది. నిజానికి ఇవన్నీ అక్కడ బతకాలంటే

ఉండాల్సిన కనీస అర్హతలనుకోవచ్చు. అది రాక్షసిలాగా మారినా, ఆ రాక్షసత్వాన్ని కప్పి పైకి మామూలుగా కనిపించే యుక్తిని కూడా నేర్చుకుంటుంది.

కొన్నాళ్ళు గడిచాక, ఉత్తరాల బట్వాడా పని పూర్తయ్యాక అది మరొకరి చేతిలో పడి అక్కడి నుంచి అదృష్టవశాత్తు జాన్‌ టారంటన్‌్‌ (జీశీష్ట్రఅ ుష్ట్రశీతీఅ్‌శీఅ) ఆశ్రయాన చేరుతుంది. అతడు దాన్ని చావగొడ్తున్న వాడిని బెదిరించి బక్‌ని కాపాడతాడు. టారంటన్‌్‌ని చూస్తుంటే జాక్‌ లండనే తన పాత్రను పెట్టాడేమో అనిపిస్తుంది. అతని వద్దకు చేరాక నిరంతర శ్రమ కారణంగా డస్సిపోయిన బక్‌ తనకు అనుకోకుండా లభించిన ఈ అవకాశానికి ఆశ్చర్యపోతూనే కొంతకాలంపాటు తిండి, మంచి విశ్రాంతి, ప్రకృతి విహారం.. వీటితో కోలుకుని, పోయిన తన శక్తిని కూడగట్టుకుంటుంది. ఈ బ్రేక్‌లో దానికి ముందెన్నడూ లేని అనుభవం, అవధులు లేని ప్రేమ జాన్‌ టారంటన్‌తో ఏర్పడుతుంది. జడ్జి మిల్లర్‌ ఇంట్లో రాజభోగాలు వెలగబెట్టినపుడు పది కుక్కల్లో బక్‌ ఒక ప్రత్యేక ఠీవితో ఉండడం, దాన్ని పనివాళ్ళు జాగ్రత్తగా చూసుకోవడం తప్ప ఇలాంటి ప్రేమను పంచిన వాళ్ళెవరూ లేరు. అది అతన్ని ఎంతగా ప్రేమించిందంటే జాన్‌ దాన్ని ముద్దు చేస్తుంటే దాని గుండె వేగం పెరిగిపోతుంది. పిచ్చి మమకారం పెంచుకుంటుంది.

అలాగని అది మిగతా కుక్కల్లాగా ఎగబడి ఆ ప్రేమను చూపించదు. పైకి పెద్దగా తేలకుండానే, మూగగా ఆరాధిస్తుంది. ప్రేమలో బెట్టుసరిగా ఉంటుంది. తన మమకారాన్ని జాన్‌ గ్రహిస్తున్నాడని తెలుసు! కానీ ఎగబడితే కొంత చులకనైపోతానని బెట్టు.. దటీజ్‌ బక్‌!

జాన్‌ని అంటిపెట్టుకుని అహర్నిశలూ ఉంటూ, అతన్ని కాపాడ్డం తన విధిగా భావిస్తుంది. రెండుసార్లు అతన్ని ప్రమాదాల నుంచి కాపాడి ప్రాణదానం చేస్తుంది. అతన్ని పందెంలో గెలిపించడానికి స్లెడ్జి బండితో సహా వెయ్యి పౌండ్లు బరువు లాగుతుంది. జాన్‌ కోసం ప్రాణమిస్తుంది.

అయితే జడ్జి మిల్లర్‌ ఇంట్లోంచి కిడ్నాప్‌ అయింది లగాయతూ బక్‌కి దొరికింది స్వేచ్ఛ మాత్రమే కాదు, దానిలోని ఆటవిక శక్తులేవో నెమ్మది నెమ్మదిగా జూలు విదిల్చి నిద్ర లేస్తాయి. అందుకే అది స్లెడ్జ్‌ బళ్ళు లాగే మిగతా కుక్కల దగ్గర అతి సులువుగా, వేగంగా కుయుక్తులు, కుట్రలు నేర్చుకుంటుంది. చివరికి అది మిగతా కుక్కలకన్నా శక్తివంతంగా తయారై వాటన్నిటిమీదా ఆధిపత్యం సంపాదిస్తుంది. ఇవన్నీ చేస్తున్నపుడే దాన్లోని ఏదో ఒక ప్రవృత్తి దాన్ని కొంత ఉద్వేగానికి గురిచేస్తూ, ఎక్కడికో వెళ్ళిపోవాలన్న భావోద్రేకాన్ని కల్గిస్తూ ఉంటుంది.

తెల్లని మంచులోంచి పచ్చని అడవుల్లోకి వచ్చి పడ్డాక, టారంటన్‌ వద్ద ఉంటున్నపుడు ఈ ప్రవృత్తి మరింతగా ప్రకోపిస్తుంది. ఏ గత జన్మ జ్ఞాపకాలో వేధిస్తుంటాయి. ప్రకృతినుంచి ఏవో పిలుపులు అందుతుంటాయి. ఆ పిలుపులు విన్నప్పుడు వెర్రి ఆవేశం దాన్ని ఆవహిస్తుంది. అది వినగానే బక్‌ అడవిలోకి పోయి తిరిగి తిరిగి తను కూడా మొరిగి, అడవి పాట పాడి వస్తుంది.

ఒక అర్థరాత్రి నాడు అడవి నుంచి వినిపించిన పిలుపునకు స్పందించిన బక్‌ అడవిలోకి పరుగుతీసి ఆ పిలుపు ఎక్కడి నుంచి వస్తుందీ తెలుసుకుంటుంది. ఆ తోడేలుని తన బంధువుగా గుర్తించినట్టుగా, బక్‌ దాంతో పోట్లాడక స్నేహం చేస్తుంది. దానితోపాటు అడవిలో పిచ్చిగా తిరిగి ఆడుతుంటే, దానికి గత జన్మ గుర్తొచ్చినంత పనవుతుంది. ఈ తోడేళ్ళ స్నేహం కోసమే తాను వచ్చినట్లు అనుభూతి చెందుతుంది. ఇలాంటి ఉద్రేకంలోనూ అది టారంటన్‌్‌ని మర్చిపోక వెనక్కి తిరిగొస్తుంది. బక్‌కి ఈ అడవి పిలుపు, అది సాగించే వేటా ఇవన్నీ ఎక్కడో ఇంతకు ముందు తనకు జరిగినవే, తనకు అనుభవంలోకి వచ్చినవే అని తోస్తుంది (దేజా వు అన్నమాట)! దాన్ని తన తోడేలు జాతి రక్తంలో నుంచి మరుగుతున్న జ్ఞాపకాల మంటగా అది గుర్తించలేదు గానీ అనుభవానికి తోస్తుంది.

ఈ క్రమంలో అది రాక్షసంగా ఆటవిక తత్వాన్ని అలవర్చుకుంటుంది. ఎలుగుబంట్లను కూడా వేటాడుతుంది. డజన్లకొద్దీ తోడేళ్ళను అవలీలగా ఎదుర్కొని రక్తం కళ్ళజూస్తుంది. ఒక గొప్ప అతిశయమూ, దానివల్ల సమకూరిన ఆటవిక సౌందర్యం వల్ల బక్‌ సౌందర్యం, ఠీవి ఇనుమడిస్తాయి. ముట్టెమీదా, కళ్ళపైనా ఉన్న నల్లని మచ్చలతో అది దాదాపు ఒక బలమైన తోడేలువలే కనిపిస్తుంది. పొంచు వేయడం, నిశ్శబ్దంగా పాములా పాకి దెబ్బకొట్టడం.. ఇలాంటివన్నీ బక్‌ నేర్చుకుని గొప్ప జీవశక్తితో అత్యంత శక్తివంతమైన ఆటవిక మృగంగా రూపొందుతుంది.

ఈ సమయంలోనే టారంటన్‌ బృందం బంగారు గనుల నుంచి చాలా బంగారాన్ని సాధిస్తారు. ఒక దుర్దినాన బక్‌ ఒక దుప్పిని మహోత్సాహంతో వేటాడుతూ ఉన్నపుడు ఈహాట్‌ తెగకు చెందిన రెడ్‌ ఇండియన్లు టారంటన్‌ శిబిరంమీద పడి అందర్నీ చంపి బంగారం దోచుకుంటారు. అందర్నీ చంపాక వాళ్ళు ఆనందంతో నృత్యం చేస్తున్న సమయంలో బక్‌ అక్కడికి వచ్చి జరిగిన ఘోరాన్ని గుర్తించి, వీరావేశంతో విధ్వంసం సృష్టించి కనబడ్డ వాళ్ళందర్నీ చంపి పారేస్తుంది. అదొక కుక్క అని కూడా గ్రహించే టైము వారికి ఇవ్వదు. భయంతో వాళ్ళంతా కకావికలైపోతారు. ఒక పెద్ద భూతం వచ్చి పడిందనుకుంటారు.

జాన్‌ టారంటన్‌ నీళ్ళ మడుగు వరకూ పరిగెత్తి అక్కడ చనిపోయాడని బక్‌ అర్థం చేసుకుంటుంది. ఆ సంఘటన జరిగినపుడు బక్‌ అక్కడ ఉండుంటే అంత ఘోరం జరిగేది కాదు. టారంటన్‌ మరిక లేడనే విషయాన్ని అర్థం చేసుకుంటున్న కొద్దీ దాని కడుపులో, గుండెలో దు:ఖంతో ఒక డొల్లతనం ఏర్పడుతుంది. ఆ ఖాళీ మరిక ఎన్నటికీ పూడేది కాదు. అది బాధను దిగమింగుతుంది. కానీ పగను కాదు.

బక్‌ వెళ్ళి తోడేళ్ళ గుంపులో చేరి వాటన్నిటిమీదా ఆధిపత్యం సంపాదిస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి అడవి తోడేళ్ళ సంతానంలో ముట్టెమీదా, నెత్తిమీదా కపిల వర్ణపు మచ్చలు గల వాటిని ఈహాట్లు గుర్తిస్తారు. వాళ్ళకు ఆ దెయ్యం కుక్క అంటే దడ. ఆ తర్వాత అది వాళ్ళ శిబిరాల్ని కూడా ధ్వంసం చేస్తుంది. శిబిరాల్లోంచి వెళ్ళిన వేటగాళ్ళు తిరిగి శిబిరం చేరకుండా దొరికిన వాళ్ళను దొరికినట్టు చంపేస్తుంది. వాళ్ళ శవాల పక్కన బక్‌ కాలి గుర్తులు! వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ వేటాడి చంపుతుంది.

ఇంత రాక్షసిగా మారిన బక్‌ ప్రతి వేసవిలోనూ ఆ లోయలోకి వచ్చి అక్కడ బంగారం నేలలోకి ఇంకిపోయి గడ్డి మొలిచిన ఆ ప్రాంతాల్లో ఎవర్నో గుర్తు చేసుకుని సుదీర్ఘంగా ఏడ్చి వెళ్ళిపోతుంది.

నవల ఆది, మధ్యం, అంతం మొత్తం బక్‌దే. జాక్‌ లండన్‌ ఎంతటి ఉద్వేగ భరిత శైలిలో రాశాడో, అది ఏ మాత్రం లుప్తం కాకుండా దీన్ని కొడవటి గంటి కుటుంబరావు అనువదించారు. నవల మొత్తం బక్‌ విశ్వరూపాన్ని, దాని జీవన వైవిధ్యాన్ని, భావోద్వేగాలని అత్యద్భుతంగా చిత్రీకరించారు.

అసలు బక్‌ని ఒక మనిషి పాయింటాఫ్‌ వ్యూలో అర్థం చేసుకోవాలనిపిస్తుంది. ఈ మాట డోనాల్డ్‌ ఫైజర్‌ అనే సాహిత్య

కారుడు కూడా నొక్కి వక్కాణిస్తాడు. బక్‌ అనుభవించి, మనం చదివేదంతా మానవ జీవితంలో ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులే. పరిస్థితులకు అనుగుణంగా దర్జా వెలగబెట్టడమూ, హీన దశలో గతి లేక లొంగి ఉండాల్సి రావడమూ, తర్వాత ఆటవికంగా ప్రవర్తించాల్సి వచ్చి, ఆధిపత్యం చూపించే అవకాశం వచ్చినపుడు దాన్ని అందిపుచ్చుకునే స్వభావమూ… ఇది మొత్తం అట్టర్‌ హ్యూమన్‌ నేచర్‌. బక్‌ తన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తూ ఈ మధ్య అదేదో సినిమాలో చెప్పినట్టు ఎక్కడ తగ్గాలో, అక్కడ తగ్గి ప్రవర్తిస్తుంది. చిత్రంగా నవల మొదటిసారి చదువుతున్నపుడు నాకు సీతారామారావు గుర్తొచ్చాడు. అతను కూడా డబ్బు చేతిలో ఉన్నపుడు తనను తాను మహారాజుగా భావించుకుంటూ దర్పంగా ఉంటాడు. బోల్డు కబుర్లు చెబుతాడు. బక్‌ నుంచి సీతారామారావులు చాలా నేర్చుకోవాలి. పరిస్థితి చేజారగానే చతికిలబడి డిప్రెషన్‌లోకి పోయి తనను తాను చంపుకుంటాడు. బక్‌ అలా చేయదు. తుఫాన్‌ వచ్చినపుడు గడ్డి పోచలా వంగి, అది పోగానే తలెత్తుతుంది. ఈ క్రమంలో అది తన స్వాభిమానాన్ని, సహజ విశ్వాస స్వభావాన్ని, అంతకు మించి అనువంశికంగా ప్రాప్తించిన ఆటవికత్వాన్ని

ఏ మాత్రమూ వదులుకోదు. సమయం కోసం వేచి చూస్తుందంతే.

ఎర్ర స్వెటర్‌ వాడు పరిచయం చేసిన దుడ్డు కర్ర న్యాయాన్ని అది చిటికెలో గ్రహించి ఆ పాఠాన్ని చివరివరకూ గుర్తు పెట్టుకుంటుంది. అధికారం చేతిలో ఉన్నవాడిదే రాజ్యం. వాడి చేతిలో కర్ర ఉన్నంత వరకూ, మనకు ప్రాణం మీద ఆశ

ఉన్నంతవరకూ దుడ్డుకర్రను గౌరవించక తప్పదు. ఈ పాఠాన్ని మనుషులు అందరూ నేర్చుకోలేరు. నేర్చుకున్నా మానవ సహజమైన ఉద్వేగాలతో అనువుగాని చోట సామెతలా ప్రవర్తించి భంగపడుతుంటాం మనం. అది సహజం కూడానూ. కానీ గెలవాలంటే వేచి చూడక తప్పదని, నెగ్గాలంటే తగ్గక తప్పదని బక్‌ నిరూపిస్తుంది. అలాగే బక్‌ తన శ్రామిక జీవితంలో కొన్ని జీవిత సత్యాలు నేర్చుకుంటుంది. బలమున్న వాడిదే రాజ్యం అనే ఎర్ర స్వెటర్‌ వాడి పాఠమే దీనికి కూడా మూలం. ప్రాణాలు నిలబెట్టుకుని తీరాల్సిన పరిస్థితిలో మోసం తప్పదు. తీరీ తీరని ఆకలి తీరాలన్నా దొంగతనం చేయక తప్పదు. బక్‌లో ఉత్తమ లక్షణం అదే. నేర్చుకున్న పాఠాలను మర్చేపోదు. తనకు పోటీగా తయారైన స్పిట్జ్‌ అనే కుక్క దాష్టీకాన్ని అది చాలా రోజులు భరిస్తుంది. దాని నాయకత్వంలో పనిచేస్తుంది. గాయపడుతుంది. మొదట్లో చాలా సహనం వహిస్తుంది. కాలక్రమేణా అది దాని సహజ ఆటవిక ప్రవృత్తిని స్వీకరించాక, స్పిట్జో తానో తేలిపోవాల్సి వచ్చిన రోజు ఉగ్రరూపం ధరించి దాని అంతు చూసేస్తుంది. ఎవరో ఒకరు గెలవాల్సిన రేసులో ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధమై ప్రాణాలు తీయడానికి తెగబడుతుంది. తెగబడకపోతే స్పిట్జ్‌ ఆ ఛాన్స్‌ తీసుకుంటుంది మరి!

బ్రాహ్మణీకంలో చలం ఒక మాటంటాడు. ”ఔన్నత్యంలో ఉన్నన్నాళ్ళూ, మనుషులు తమ స్వభావంలోనూ ఔన్నత్యం

ఉందనుకుంటారు” అని. బక్‌ కూడా జడ్జిగారింట్లో ఉన్నన్నాళ్ళూ తానొక రాజ వంశానికి చెందిన దాన్నని ఊహించుకుంటూ దర్పం చూపిస్తుంది. కానీ వాస్తవం మరో లోకంలో పడేసి ఈడ్చి తన్నేసరికి ముందు నిర్ఘాంతపోయినా త్వరలోనే తేరుకుని జీవితంతో రాజీ పడుతుంది. ఒళ్ళు దాచుకోక పని చేస్తుంది. అలా దాచుకునే ఇతర స్లెడ్జ్‌ కుక్కల్ని సహించదు. అడవిలోకి వచ్చాక, సహజ గుణం ప్రకారం ఆహారం కోసం మాత్రమే వేటాడుతుంది, వినోదం కోసం కాదు. ఇలా ఎక్కడికక్కడ బక్‌ నీళ్ళు పోసి అది పోసిన పాత్రను బట్టి తన స్వరూపాన్ని మార్చుకున్నట్టు ప్రకృతికి అనుగుణంగా, జీవితానికి అనుగుణంగా అడ్జస్ట్‌ అవుతూ, ఎలా జీవించాలో సహజంగా చెప్తుంది మనకి. ”నాగరికత నుంచి తిరిగి ప్రకృతికి ప్రయాణం” అనే కాన్సెప్ట్‌ అమెరికా సాహిత్యంలో ఒక ప్రత్యేక ప్రక్రియగా చెప్పవచ్చు. మార్క్‌ ట్వైన్‌ హకెల్‌ బరీ ఫిన్‌ కూడా ఈ కోవకు చెందినదే.

బక్‌ స్వామి భక్తి కూడా విశేషం. టారంటన్‌ జోలికి ఎవడు వచ్చినా రక్తం కళ్ళజూస్తుంది. వాళ్ళిద్దరి బంధాన్ని, మమకారాన్ని జాక్‌ లండన్‌ చాలా ప్రత్యేకించి వివరిస్తాడు. టారంటన్‌ దాని తల మొరటుగా పట్టుకుని ఊపుతూ దాన్ని నానా తిట్లు తిడతాడు. అవన్నీ ముద్దు మాటలని దానికి తెలుసు. అతనలా ప్రేమ చూపిస్తుంటే ఆనందంతో దాని గుండె బయటికి వచ్చేస్తుందన్నంత గాఢంగా దాన్ని అనుభవిస్తుంది. అంత ఉద్రేకం!

పైగా బక్‌.. హచి లాంటిదో (అదీ గొప్పదే), మరోటో కాదు. అది ఎక్కడైనా సరే సంరక్షణ బాధ్యత తీసుకునే రకం. తనను ప్రేమించిన వారిని అంతకంటే పిచ్చిగా ప్రేమించే రకం.

దాని వేటను రచయిత ఎంత ఉద్వేగ భరితంగానో వర్ణిస్తాడు. గడ్డగట్టిన మంచుమీద తేలికపాటి అడుగులతో పారిపోయే ఒక నీటి కుందేలును అది వేటాడే తీరు అద్భుతం. అది ఎంతటి

ఉన్నతమైన వఅ్‌ష్ట్రబరఱaరఎ తో వేటాడుతుందో రచయిత కళ్ళకు కడతాడు.

”జీవితపు అత్యున్నత స్థాయిని అందుకుని, మళ్ళీ అలాంటి దశ జీవితంలో రాదేమో అన్నప్పుడు గొప్ప ఆవేశం కలుగుతుంది. జీవితపు ఉచ్ఛ దశలో కలిగే ఈ ఆవేశం అదేం చిత్రమో జీవితాన్నే విస్మరింపచేస్తుంది. తాను జీవించి ఉన్నట్టు కూడా తెలియనివ్వని ఈ ఆవేశం కళాకారుడికి అనుభవమైనపుడు ఒక మహా జ్వాలతో పైకి లేస్తాడు. సైనికుడికి ఈ ఆవేశం వచ్చినపుడు యుద్ధోన్మాదానికి వశుడై ప్రాణాలకు తెగించి పోరాడతాడు. బక్‌ సరిగ్గా ఇప్పుడు అలాంటి ఆవేశానికే చిక్కింది. జీవితోద్వేగం దాన్ని ఆవహించింది. దాని నరనరానా ఆనందం ఉబుకుతున్నది” ఒక కుక్క వేట దృశ్యం ఇది!

ప్రకృతి గురించి, వైల్డ్‌ లైఫ్‌ గురించి తీరిగ్గా ఆలోచించే సమయం, తీరిక మనకు ఉంచకపోవచ్చు గానీ, దాంతో మమేకమై తిరిగితే, గడిపితే ఎన్నెన్ని రహస్యాలు ఆవిష్కృతమవుతాయో! ఎన్ని జంతు హృదయాలు మనతో మాట్లాడతాయో! పశువులు మనుషులకంటే నయమని ఎంతగా అర్థమవుతుందో! అన్‌ కండిషనల్‌గా ప్రేమించగలిగేది జంతువులు మాత్రమేనని అందరమూ ఒప్పేసుకుంటామేమో!

జాక్‌ లండన్‌ అలా, విచ్చలవిడి నగ్న ప్రకృతిలో, జంతువులని చూస్తూ, చెట్లతో, సముద్రంతో మాట్లాడుతూ బతికాడు, గడిపాడు. ఈ నవల, ఇంకా మరికొన్ని అతని నవలలు అలా పుట్టినవే! తోడేళ్ళనీ, కుక్కలనీ, ఎస్కిమోలనీ, రెడ్‌ ఇండియన్లనీ గమనిస్తూ, చదువుతూ మంచు గుట్టలు పేరుకునే స్థలాల్లో తిరిగాడు. అక్కడ గుడారం వేసుకుని పుస్తకాలు చదువుతూ గడిపాడు. అతని జీవితంలో తిండి, నిద్ర, డబ్బు వంటి వాటికి ఎలాంటి ప్రాముఖ్యం లేదు. అవన్నీ తాత్కాలిక అవసరాలంతే. సాహసం, గొప్ప ప్రేమ, తీవ్రమైన పాషన్‌, వ్యామోహం, ప్రయాణం, ప్రకృతి, సముద్రం, అడవి.. ఇవన్నీ కలిస్తే జాక్‌ లండన్‌ జీవితం. ఆయన ఇదంటూ ఒక వృత్తిని ఎంచుకోలేదు. ఓడ కూలి, ‘చాకలి’ ముత్యపు చిప్పల్ని దొంగిలించడం, చిన్నా చితకా కూలి పనులు చేశాడు. అట్లాంటిక్‌ మంత్లీలో రాతలు రాశాడు. చిన్నతనంలోనే సాహసాలూ, సముద్ర యాత్రలూ, అన్వేషణలూ… వర్ణించే పుస్తకాలు చదివి జీవితం అంటే సాహసం, రొమాంటిసిజం అని నిర్వచించేసుకున్నాడు. ఆ నిర్వచనం ప్రకారమే బతికాడు. తెప్ప కట్టుకుని శాన్‌ ఫ్రాన్సిస్కోలో సముద్రంలో పడి తిరిగేవాడు. చిల్లర నేరస్తులంతా స్నేహితులు. దొంగతనాలు మొహం మొత్తాక దొంగల్ని పట్టుకునే ఉజ్జోగం కూడా చేశాడు. రెండూ ఎలా ఉంటాయో చూద్దామని ”కిక్‌” కోసం చేసిన పన్లే!

సాహసాన్ని మనసు తీరా అనుభవించేందుకు అప్పట్లో (1896-1899) అలాస్కా ప్రాంతంలో జరిగిన బంగారం అన్వేషణకి బయలుదేరాడాయన. జీవితానుభవాన్ని పొందిన సమయమది. నిI్‌ షaర ఱఅ ్‌ష్ట్రవ ఖశ్రీశీఅసఱసవ, I టశీబఅస ఎవరవశ్రీటకు అంటాడు. మంచు తప్ప ఏమీ లేనిచోట ఒక ఏడాది పాటు నివసించాడు. ఎండ మొహం చూడకపోవడంవల్ల స్కర్వీ రోగం వచ్చి, బంగారం అన్వేషణ మొదలయ్యే సమయానికి ఆ స్థలం వదిలి తిరిగి కాలిఫోర్నియా రావాల్సి వచ్చింది కూడా. నిజానికి లండన్‌ అన్వేషణ బంగారం కోసం కాదు కాబట్టి అతనికి పోయిందేమీ లేదు, ఆరోగ్యం తప్ప. ఈ అలాస్కా జీవితంలోనే అతనికి ఈ నవలకు కావలసిన ముడి సరుకు దొరికింది. స్లెడ్జ్‌ బళ్ళు లాగే ఎన్నో కుక్కల్ని చూసి వాటిలోంచే ఆయన బక్‌ని సృష్టించాడు.

అతనికొక ఉద్రేకపూరితమైన జీవితం కావాలెప్పుడూ. బంగారం అన్వేషణలో జబ్బు పడి వచ్చాక ఆ అనుభవాల డైరీతోనే పూర్తిస్థాయి రచయితగా మారాడు. అందుకే అతని ప్రతి రచనా చదువర్లను కూడా ఉద్వేగం అంచున నడిపిస్తుంది.

ఈ నవల చదివాక అనిపిస్తుంది, ”లండన్‌ నిజంగానే బక్‌ అనే కుక్కని ఊహించుకుని ఎక్కడో ఒక చోట బక్‌ నిజంగానే ఉందని నమ్మి ఉంటాడా?” అని.

ఈ నవలను 1959లో కొడవటిగంటి కుటుంబరావు గారు ‘ప్రకృతి పిలుపు’ అనే పేరుతో అనువదించగా విజయవాడలోని దేశీ

కవితా మండలి వాళ్ళు ప్రచురించారు. చాలా రోజులకు అది అందుబాటులో లేకుండా పోయింది. మంచి పుస్తకాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే ‘పీకాక్‌ క్లాసిక్స్‌’ ఈ పుస్తకాన్ని మళ్ళీ 2003లో ”అడవి పిలిచింది” పేరుతో అందుబాటులోకి తెచ్చింది. కాపీ రైట్‌ సమస్యవల్ల కుటుంబరావు గారి అనువాదాన్నే గాంధీ కొంత సంక్షిప్తం చేసి ప్రచురించారు. ఇది 2003 నుంచి పదిసార్లు ముద్రణకు వచ్చింది. మొదటి ప్రచురణలో ఇది కొడవటిగంటి కుటుంబరావు గారి అనువాదానికి సంక్షిప్తం అనే విషయం ముందుమాటలో ప్రస్తావించారు. (గాంధీగార్ని కనుక్కున్నాను) కానీ తర్వాత తర్వాత ప్రచురణల్లో ఈ విషయం లేకపోవడం వల్ల ఈ మధ్య కాలంలో కుటుంబరావు గారి అనువాదం అందరికీ అందుబాటులోకి వచ్చేదాకా నేను అది గాంధీగారు చేసిన అననువాదమనే అనుకున్నాను. ఒరిజినల్‌ నవలను సంక్షిప్తం చేసి గాంధీ అనువదించారని భావించాను.

పైగా ”కొ.కు. గారు అనువదిస్తే అచ్చం ఇలాగే ఉండేది. ఎంత సజీవమైన భాషను వాడారో” అనుకున్నాను కూడా. ఒకచోట కుక్క ధర మాట్లాడే విషయంలో ”నూరుకు ఠోలీ తక్కువైతే వీలుకాదు పొమ్మన్నాడు” అనే వాక్యంలో ”ఠోలీ” అనే మాట విని అసలు ఎన్నాళ్ళయిందో అనిపించింది.

పీకాక్‌ క్లాసిక్స్‌కి ఈ విషయంలో ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా చాలదు. జాక్‌ లండన్‌ అనేవాడొకడున్నాడని, జీవితాన్ని అత్యద్భుతంగా దాని దారిన దాన్ని నదిలో వదిలేసిన పడవలా పోనిస్తూ, ఆయన అనుభవాలన్నీ నవలలుగా లోకానికి అందించాడని నాకు పీకాక్‌ క్లాసిక్స్‌ ద్వారానే తెల్సిందని చెప్పడానికి ఇష్టపడుతు న్నాను. ప్రఖ్యాత రచయిత నాకు అప్పటివరకూ పరిచయం కాలేదని చెప్పడానికి సిగ్గు పడడంలేదు.

”పీకాక్‌” ప్రచురణల గాంధీ

కొన్ని పుస్తకాల ప్రభావం బలంగా ఉంటుంది. రచయిత మీద మమకారమో, ప్రేమో, హద్దులు దాటిన అభిమానమో పెంచుకునేలా చేస్తుంది. శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్ళినపుడు ఆ అగాథ జలాల్లో బోటుమీద తిరుగుతూ ”జాక్‌ లండన్‌ తిరిగిన ఈ నీళ్ళలోనే నేను కూడా షైర్లు కొడుతున్నా” అనుకుని సంతోషపడ్డాను. కట్టుకుంటున్నపుడే తగలబడి శిధిలాలుగా మిగిలిన అతని ఇల్లు ఒక సజీవ జ్ఞాపకం.

ఉద్వేగపుటలల్లో సాహసాల దారిలో లాక్కుపోయే ఈ నవల ఇంగ్లీష్‌లో ఉచితంగానే డౌన్లోడ్‌ చేసుకోవచ్చు. తెలుగు వెర్షన్‌ కుటుంబరావు గారిది కూడా నెట్‌లో ఉంది. వెదికి కనుక్కొని చదవండి..

ప్రకృతితో బతకాలి… ప్రకృతిలో బతకాలి..! ప్రకృతితో మమేకమై బతకాలి..!!

ప్రకృతి ఆహ్వానిస్తే తప్పక బయలుదేరాలి..! ఇదే జాక్‌ లండన్‌ జీవితం, రచనలూ…!!

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో