మనసిచ్చినవాడి నుండీ….- అయ్యగారి సీతారత్నం

బాల్కనీలో ఈజీ ఛైర్‌లో వాలి దీర్ఘంగా ఆలోచిస్తోంది ఉజ్వల. పక్కన టీ కప్పు ఇందాక సెగలు కక్కింది. కానీ ఇప్పుడు తెట్టు కట్టడం మొదలుపెట్టింది. కూతురు రమ్య ఆ రోజే వచ్చిన బాబాయి కృష్ణతో మాట్లాడుతోంది. ఆ మాటలు చెవిన పడుతున్నాయి.    నీకు కాస్త పెద్ద ర్యాంకు వచ్చింది. మంచి ర్యాంక్‌ వస్తుందేమోననుకున్నా అన్నాడు కృష్ణ

‘బాబాయ్‌! మా ఇంటి సంగతి తెలుసు కదా! మమ్మీ, డాడీల దెబ్బలాటల మధ్య నాకు కాబట్టి ఆ ర్యాంక్‌ అయినా వచ్చింది’ అని ధైర్యంగా తన తప్పేమీ కాదని చెప్పింది. ‘మమ్మీకి చెప్పాను. బంగారం అమ్మేసి ప్రైవేటు కాలేజీలో చేర్పించమని’ అంది.

‘బాబాయ్‌ మమ్మీతో అర్జంట్‌గా మాట్లాడు. మొండిది. వారంబట్టీ  అందరూ చెబ్తున్నా వినడంలేదు. అందుకనే బామ్మ నీకు కబురు పెట్టింది’

‘ఊరుకో, పిల్లలచేత చెప్పించుకోవలసి వచ్చింది మీ అమ్మకి…’ అంది బామ్మ శాంతమ్మ మొహమాటంగా.

‘విడాకులకి సంతకం పెడితే ఏవయిపోతుంది…’ అంది తుషార.

‘నువ్వు అవతలకి వెళ్ళు… బాబాయి మాట్లాడతాడు.’

‘డాడీ డబ్బు తెచ్చినన్నాళ్ళు సుఖపడ్డాం. ఇప్పుడు కాస్త సహాయం చెయ్యాలి…’

‘ఊరుకో నువ్వు… అమ్మకి తెలీదా?’

‘తెలీదు.. తెలీదు.. లాస్టియర్‌ డాడీ డైమండ్‌ సెట్‌ కొంటానంటే వద్దని గోలపెట్టి మానేసింది. బంగారం, ఆభరణాలు డెడ్‌ కేపిటల్‌ అట. అది ఉంటే ఇప్పుడు అమ్మితే హాయిగా మా చదువులు అయిపోయేవి కదా… విన్నదా? చాదస్తం మనిషి’.

గబుక్కున లేచి వచ్చి ‘అవునే మీ బాబు ఇలా ముంచేస్తాడని నాకేం తెలుసు. ఆడవాళ్ళందరూ మొగుళ్ళని నమ్మలేకే బంగారాన్ని నమ్ముతున్నారు. నేను మొగుడ్ని నమ్మాను. అదే నా తప్పు….’ అని తలబాదుకుంటున్న ఉజ్వలను శాంతమ్మ దగ్గరికి తీసుకుంది.

సారీ మమ్మీ… అంటూ తుషార కళ్ళనీళ్ళతో వచ్చి బెదురుగా నిల్చుంది. ప్చ్‌! అని కళ్ళు తుడుచుకున్న ఉజ్వల స్థిరంగా విడాకులే కదా కావాలి… ఇలా తే! సంతకం పెడతానంది

కాగితాలు ఇస్తూ బయట ఫైనాన్స్‌ వాళ్ళు నీ జీతానికి అటాచ్‌మెంట్‌ ఇచ్చేస్తారేమోనని భయం. అదీకాక అప్పలస్వామి దగ్గర అన్నయ్య పది రూపాయల వడ్డీకి డబ్బు తీసుకున్నాడు. అతను కాలేజికి వచ్చి జీతం రోజు గొడవ చేస్తాడని… అన్నయ్య భయం అన్నాడు కృష్ణ

ఏదోలే నా ఖర్మకి ఎవర్ని అంటాను అంది దిగులుగా.

‘లేదొదినా, గల్ఫ్‌కి ఇద్దరం ప్రయత్నిస్తున్నాం. వెళ్ళిపోతాం…’

మధ్యాహ్నం కృష్ణ, భర్త ఉదయ్‌ హైదరాబాద్‌ వెళ్ళిపోతున్నారు. శాంతమ్మ కూడా బయల్దేరింది.

‘నీకు నేను కూడా భారమెందుకని వెళ్తున్నా. ఒక్క ఆరు నెలల్లో అన్నీ సర్దుకుంటాయి. కంగారు పడకు’ అంది శాంతమ్మ. పిల్లలు కూడా వాళ్ళతో వెళ్ళిపోయారు.

వీథి తలుపేసి వచ్చి బాల్కనీ ఈజీ ఛెయిర్‌లో  నిస్సత్తువగా  కూర్చుంది ఉజ్వల. ఎదురుగా గంభీరంగా కొండ. అసలు ఆ కొండ, దానిమీద పచ్చదనం, మెత్తని మబ్బులు, ఎగిరే పక్షులు… వాటిని చూస్తూ టీ తాగడం ఒక గొప్ప అనుభూతి ఉజ్వలకి. కానీ ఆ క్షణం కొండ, మబ్బు, పక్షి… ఏదీ అందంగా కనిపించడంలేదు. అప్పటికే టీ కప్పుపైన తెట్టుకట్టి, ఆ తెట్టుమీద ఒక ఈగ.. ఆ టీని చూస్తే అసహ్యం వేసి తీసుకువెళ్ళి సింక్‌లో పోసి కప్పు కడిగి పెట్టి మళ్ళీ కుర్చీలో వాలింది. అసలు తనకి ఎందుకు ఇన్ని కష్టాలు చుట్టుముట్టాయనుకుంటూ… గతంలోకి జారిపోయింది.

……….

‘ఉజ్జీ, ఉజ్జీ… ఎక్కడున్నావ్‌?’ అంటూ హడావుడిగా వచ్చాడు ఉదయ్‌.

‘అంత కేకలెందుకు. స్నానం చేస్తోంది’ అని చెప్పింది తల్లి శాంతమ్మ

‘మా స్నేహితుడు శుభాష్‌ పెళ్ళికి వెళ్ళాలి. టైమ్‌ అయిపోతోంది. ముహూర్తం 7.30కి. అంతా భోజనాలు చేశాక వెళ్తే బాగుండదు’ అన్నాడు విసుగ్గా.

‘శుభాష్‌ అంటే అమలాపురం అబ్బాయేనా?’

‘ఆ.. వాడే. నిన్ను కూడా తీసుకురమ్మన్నాడు.’

‘నేనెందుకూ, ఇద్దరూ స్కూటర్‌మీద వెళ్ళి వచ్చేయండి. మీ పిల్లలు ట్యూషన్‌ నుండీ వచ్చేలోపు..’ అంటుండగా

ఉజ్వల తయారయి వచ్చింది.

కంచిపట్టు చీర… సంపెంగ పువ్వు రంగుకి కుంకుమ రంగు పెద్ద జరీ అంచు. పొందికగా కట్టిందేమో చాలా అందంగా చూపరుల దృష్టి పడేటట్టుగా ఉంది. మెడలో నల్లపూసల హారం. చేతినిండా కుంకుమ రంగు గాజులతో ఎవరికైనా ఆమె పెళ్ళికి వెళ్తోందని ఇట్టే తెలుస్తుంది.

‘ఇంద, మల్లెపూలు..’ అని ఆప్యాయంగా అందించింది శాంతమ్మ.

‘పట్టుచీరేంటి. ఇప్పుడంతా వర్క్‌ శారీస్‌ కడుతున్నారు. మేరేజ్‌ డేకి కొన్నది కట్టుకోవచ్చుగా’ అన్నాడు ఉదయ్‌.

‘మహాలక్ష్మిలా నిండుగా ఉంది. ఏం మార్చక్కర్లేదు. మందితో పోవాలన్న ఉబలాటమెందుకు. మనకి నచ్చింది, నప్పింది కట్టుకోవాలి…’ తేల్చేసింది శాంతమ్మ.

నిజమేనన్నట్లు ఊరుకుంది ఉజ్వల.

‘పిల్లలు ట్యూషన్‌ నుండి వచ్చారంటే వెంటబడతారు. త్వరగా వెళ్ళండి…’ అంది శాంతమ్మ.

‘సర్లెండి.. నా మాట వింటారేంటి?’ అని బయలుదేరాడు ఉదయ్‌.

……….

పెళ్ళికి వెళ్ళి వచ్చిన దగ్గర్నుండీ ఆ కబుర్లే చెబ్తున్నాడు ఉదయ్‌. పెళ్ళిలో తనతో బి.టెక్‌. చేసిన స్నేహితులని కలిశాడు. ఆ నలుగురూ శాంతమ్మకి తెలుసు. అందరి గురించి అడిగింది.

‘అమ్మా! మల్లేశ్వరరావు, సురేష్‌, శుభాష్‌ కూడా  నిన్ను అడిగారు. నువ్వు చేసిన గోంగూర పచ్చడి వాళ్ళు మరచిపోలేదు. మల్లేశ్వరరావు బిజినెస్‌ చేస్తున్నాడు. సురేష్‌, శుభాష్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు. బాగా సంపాదించారు. అంతా కార్లలోనే తిరుగుతున్నారు. నేనొక్కడ్నే స్కూటర్‌ మీద వెళ్ళాను…’ అన్నాడు బాధగా.

‘పెళ్ళిళ్ళు అయ్యాయా…’

‘ఆ అంతా బాగున్నారు. సురేష్‌కి ఒక్కడే బాబు. మిగతావాళ్ళకి పాప, బాబు. ఏ లోటూ లేదు. శుభాష్‌ అయితే 20 లక్షల విలువైన కారులో వచ్చాడు తెలుసా? కారు లేకుండా ఎవరూ లేరు. నేనే….’ మళ్ళీ అన్నాడు.

‘పోన్లే, ఎన్నిసార్లు చెబుతావు. మనకి అవసరమేముంది. దగ్గరే ఆఫీస్‌. ఇంతకీ వాళ్ళావిడలు ఏం చేస్తున్నారు?’

‘ఏవీ చెయ్యరు. చక్కగా ఇల్లు చూసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటున్నారు. బోల్డు డబ్బు. అవసరమేముందిలే.’

‘డబ్బు కోసమేనా ఏంటి? ఏదో మంచి వ్యాపకం ఉండాలి కదా! నాలుగు గోడల మధ్యా ఉంటే ఎలా?’

‘ఈ రోజు ప్రపంచమంతా బెడ్‌ రూంలోనే ఉండి నెట్‌ వాడతారు’

‘కానీ, అత్తయ్యా! వాళ్ళకి ఏ వ్యాపకం లేదు. నాకు ఆ ధోరణే నచ్చలేదు. నెట్‌ వాడతారు. చీరలు, నగలు, చెప్పులు, హ్యాండ్‌బ్యాగ్‌లు .. షాపింగ్‌కి మాత్రమేనని వాళ్ళ మాటలను బట్టి చెప్పొచ్చు’

‘డబ్బుంటే పిల్లా పాపలతో ఉండక ఉద్యోగాలెందుకు’

‘వాళ్ళ శక్తిని ఉపయోగించడానికి వాళ్ళ అస్తిత్వానికి, తృప్తికీ.. సామాజిక బాధ్యత ఉండాలిగా. కేవలం కుటుంబానికి పరిమితమైతే ఎలా?’ అంది ఉజ్వల.

దృక్కోణాలలో మార్పు రాకుండా కాలానికి ఎదురీదలేక ఇంటి చాకిరీలాగే ఉద్యోగ చాకిరీ చేయించి డబ్బు తీసుకునే సగటు మగవాడి ధోరణికి ప్రతీకగా మాట్లాడాడు ఉదయ్‌.

‘నీ పిచ్చి కబుర్లు. వాళ్ళకి ఉద్యోగాలు ఎలా కుదుర్తాయి. ఆ దేశం, ఈ దేశం తిరుగుతారు. రోజూ ఒకలాగే

ఉండదు. ఇద్దరూ ఊరేగితే పిల్లల్ని ఎవరు చూస్తారు?’

‘అరె! 18వ శతాబ్దంలో లాగా మాట్లాడుతున్నారే. సమయం, సందర్భంతో ఆలోచించగలిగిన చదువుకున్న వాళ్ళే కదా! ఏదో ఒకరకమైన సామాజిక భాగస్వామ్యం ఉండాలి కదా!’ కొంచెం ఆవేశంగా అంటున్న ఉజ్వలని ఆపింది శాంతమ్మ.

‘వాళ్ళగురించి మనకెందుకు? అయినా మా తరం వాళ్ళలా ఇంటిపట్టునే ఉండమంటే ఎలా? మీ నాన్న పోయాక నేనెంత ఇబ్బంది పడ్డాను. వాళ్ళ గురించి మనకి వాదనెందుకు’ అని ఉదయ్‌తో అంది శాంతమ్మ.

‘అసలు అంతా నీ వల్లే. తండ్రి లేడు. తండ్రి లేడని బి.టెక్‌లో చేరిన దగ్గర్నుండీ ఉద్యోగపు గోలే. అలాగనే నువ్వు, మావయ్య కలిసి నన్ను టెలికాంలో జూనియర్‌ ఇంజనీర్‌గా తోసేశారు గవర్నమెంటు ఉద్యోగమని. గొర్రె తోక బెత్తెడన్నట్లు ఇంక్రిమెంట్లు. ఛీ, ఛీ.. చెత్త ఉద్యోగం’ అన్నాడు విసుగ్గా.

‘నీకేం తక్కువరా! చ్కగా చదువుకున్న భార్య. బుద్ధిమంతురాలు. ఏరికోరి ప్రేమించానని, చలాకీ అయినదని చెప్పే చేసుకున్నావు. పోనీ నేను ఎంచిన పిల్ల కాదు. ఇద్దరూ కలిసి సంపాదించుకుంటున్నారు. చుక్కల్లాంటి పిల్లలు….’

‘చాల్లే, సాఫ్ట్‌వేర్‌ సైడ్‌ అయితే భార్య ఉద్యోగమే చేయాల్సిన అవసరం లేదు’ అని విసుగ్గా లోపలికెళ్ళాడు.

ద్రవ్యాశ అనే పురుగు ఉదయ్‌ బుద్ధిని తొలిచేస్తోంది. అది తెలియని శాంతమ్మ వీడికీ మధ్య ఆఫీసులో పని ఎక్కువయిందేమో… విసుగు ఎక్కువయింది అనుకొంది.

……….

రెండు నెలలపాటు ఉదయ్‌ ఊపిరి ఆడనంత బిజీగా ఉన్నాడు. ఏవేవో లోన్లు పెట్టాడు. బిజినెస్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఖచ్చితమైన అతని నిర్ణయానికి భయపడుతూనే ఉజ్వల, తల్లి శాంతమ్మ ఒప్పుకున్నారు. ఆరు నెలలు చూసి బిజినెస్‌ బాగోలేకపోతే మళ్ళీ ఉద్యోగంలో చేరతానన్నాడు. ‘తుషార చిట్‌ ఫండ్స్‌’ అని కంపెనీ పెట్టాడు. చాలా పెద్ద ఇల్లు తీసుకున్నాడు. ముందు ఆఫీసు, వెనకాల ఇల్లు. మొదటి ఆరునెలలు బిజినెస్‌ బాగుంది. చాలామంది డిపాజిట్లు చేశారు. ఆ డబ్బు చూస్తే ఉక్కిరి బిక్కిరి అయ్యేంత ఆనందంగా ఉంది. పిల్లల కోసం కూడా హాయిగా ఖర్చు పెడుతున్నాడు. ఉదయ్‌కి చాలామంది కొత్త స్నేహితులు వచ్చారు. అతన్ని క్షణం కూడా వదిలిపెట్టరు. వాళ్ళ మాటలతో ఒక పోరంబోకు స్థలం కొన్నాడు. అది ఫ్లాట్స్‌ వేసి అమ్మితే క్షణాల్లో కోటీశ్వరుడ్ని అయిపోతాననుకున్నాడు. బిజినెస్‌ లావాదేవీలకి కొద్దిగా తాగక తప్పదనుకున్నాడు. చిన్న చిన్న పార్టీలు ఇస్తున్నాడు. మూడు సంవత్సరాలు చాలా ఆనందంగా గడిచింది. డిపాజిట్‌ చేసినవాళ్ళకి వడ్డీతో ఇవ్వాలి. కొద్దిమందికి ఇచ్చాడు. వచ్చిన డబ్బు వచ్చినట్లు వాడుకుంటున్నారు. కొన్న రెండు స్థలాలు లీగల్‌గా చెల్లక హక్కుదారులు కోర్టుకెళ్ళారు. మిగిలిన డబ్బు చాలా తక్కువ. ఆలోచిస్తే తను కష్టాల్లో పడ్డాడని స్పష్టమవుతోంది. కానీ ఆ నిజాన్ని గ్రహించడానికి భయపడి తాత్కాలికంగా తప్పించుకోవడానికి తాగుడు ఎక్కువ చేశాడు. మళ్ళీ ఉద్యోగంలో చేరితే ఏదో ఒక లోన్‌ పెట్టి అప్పులు తీర్చవచ్చు అనుకొంది ఉజ్వల. కానీ బాస్‌ ఆరు నెలలు సెలవు ఇవ్వనన్నాడని ఉద్యోగానికే రాజీనామా చేశాడు ఉదయ్‌. ఆ విషయం తెలిసిన ఉజ్వల వణికిపోయింది. హైదరాబాద్‌ వెళ్ళి వారంలో వస్తానని వెళ్ళాడు ఉదయ్‌.

ఇంట్లో ఉంటే భయం. ఫోన్‌ మోగితే గుబులు. ”ఏమ్మా కార్లో తిరిగినప్పుడు లేదా? మా సొమ్మంతా వాడుకుని సోకు చేశావు. పైసా పైసా కూడబెట్టి మీ దగ్గర బెడితే మమ్మల్ని ఇలా ముంచేస్తారా? ఏం బాగు పడతావు…” ఆ తిట్లే చెవుల్లో మారు మోగుతున్నాయి. ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తోంది.

అప్పుడే ఇంటి ఓనర్‌ వచ్చాడు. గజగజలాడింది మనసు. మూడు నెలలైనా అద్దె ఇవ్వలేదు. ఎల్లుండి 30న ఖాళీ చేసేయాలి అని కాస్త అధికారికంగా అన్నాడు.

‘నాలుగు నెలల అడ్వాన్స్‌ ఉంది కదండీ’

‘కరెంటు బిల్లు అవీ మీ ఆయన ఇచ్చేస్తాడా! చూడు కోర్టులకెళ్ళడం అవీ నాకు తెలీదు. పదిమందితో వచ్చి గిన్నె, ముంతా రోడ్డున పడేయడమే నాకు తెలుసు. నాకు 15 ఇళ్ళున్నాయి. ఈ అద్దెలే నాకు ఆధారం. ఎక్కువ మాట్లాడడం దండగ’ అని గబగబా వెళ్ళిపోయాడు. రెండు రోజులలో  దూరంగా ఉన్న చిన్న ఇంటికి మారిపోయింది.

……….

నెలా పది రోజులు ఒక్కతే గడిపింది. జీతం సగానికి పైగా లోన్లకే పోతోంది. రెండు మూడేళ్లు కష్టపడితే మళ్ళీ జీవితం మామూలుగా ఉంటుందనుకుని ఏదో ఆశ కూడగట్టుకొంది. అప్పుడే క్రెడిట్‌ కార్డు  బిల్‌ వచ్చింది. 72,380 రూపాయలు. గుండె ఆగిపోయినట్లయింది. తన దగ్గర ఉన్న మాస్టర్‌ కార్డు తను వాడదు. కానీ సబ్‌ కార్డ్‌ తన భర్త పేరున ఉంది. హైదరాబాద్‌ వెళ్ళి పిల్లలతో హాయిగా తిరిగి దర్జాగా ఖర్చు పెట్టాడు. తండ్రి అంటే పిల్లలకి ఇష్టం. పొద్దున్నుండీ ఆలోచించింది. ఆఖరికి కార్డు రద్దు చేసి మధ్యాహ్నం ఊపిరి పీల్చుకుంది. రాత్రి ఫోన్‌ చేసి గందరగోళం చేసేశాడు ఉదయ్‌. ఎప్పుడో ఒకసారి భర్తే కదా అని ఆలోచించకుండా దోసెలు పోస్తూ ష్యూరిటీ సంతకాలు పెట్టినందుకు జీతం అటాచ్‌ అయింది. పిచ్చి పట్టినట్లయింది. ఉదయ్‌ చేసిన గందరగోళం కన్నా ఎక్కువే చేసింది ఉజ్వల. తిట్టి తిట్టి అలసిపోయింది.

……….

అంతా గుర్తుకొచ్చి కారుతున్న కన్నీళ్ళను తుడుచుకుని క్రెడిట్‌ కార్డు, డబ్బులు దండిగా ఇవ్వకపోతే భర్తగా ఉండడం దండగ అనుకొన్నాడు. అందుకా విడాకులు….

ఐదు సంవత్సరాలు పట్టుదలగా ట్యూషన్స్‌, ఉద్యోగంతో పిల్లలిద్దర్నీ ఇంజనీరింగ్‌ చదివించింది. వారికి క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఉద్యోగాలు వచ్చాక హమ్మయ్య.. అని ఊపిరి పీల్చుకుంది ఉజ్వల. ఆ రోజే పిల్లలిద్దరూ… ఒకరు పూణె, ఒకరు బెంగళూరు వెళ్ళిపోయారు.

చాలా రోజుల తర్వాత ఏదో బరువు తగ్గినట్లుగా, ఊపిరి ఆడినట్లుగా, జీవితంలో గెలిచినట్లుగా అనిపించి మంచి టీ పెట్టుకుని బాల్కనీలో కూర్చుని మబ్బులతో దోబూచులాడుతున్న కొండని చూస్తుండగా కాలింగ్‌ బెల్‌ మోగింది. పోస్ట్‌ వచ్చిందని వాచ్‌మేన్‌ ఒక కవరును చేతిలో పెట్టాడు. మెయిల్స్‌ తప్ప ఉత్తరాలు మరచిపోయామే… ఎవరు.. అని గబుక్కున కవరు చింపింది.

”చి||సౌ|| ఉజ్వలకి,

ఆశీస్సులు. పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయని తెలిసి సంతోషించాం. అయితే అనుకోకుండా  బస్టాండ్‌లో అనాధలా పడి ఉన్న నా పెద్ద కొడుకు ఉదయ్‌ని చూశాం. ఇంటికి తీసుకువచ్చాం. పది రోజులయింది. వాడికి బి.పి. బాగా పెరిగింది. హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాం. తాగుడు మానడు. ఎల్లుండి కృష్ణ దుబాయ్‌ వెళ్ళిపోతున్నాడు. నీ తోడికోడలు ఎట్టి పరిస్థితులలోను ఉదయ్‌ ఇంట్లో ఉండకూడదనుకుంటోంది. కన్న పేగుకి ఏమి చేయాలో తెలియక కన్నీళ్ళతో నీకు రాస్తున్నా….”

రెపరెపలాడుతున్న ఉత్తరం చేతిలో….

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో