మహిళా సృజనకారుల ఉత్తరాంధ్ర పర్యటన

ఘంటశాల నిర్మల
వివిధ సాహితీ ప్రక్రియల్లో, వుద్యమాల్లో, సాంఘిక న్యాయపోరాటాల్లో కృషిచేస్తున్న మొత్తం నలభైరెండు మందిమి అక్టోబర్‌ పద్దెనిమిది నుంచి ఇరవై వరకు మూడురోజులపాటు ఒక విలక్షణ యాత్రలో పాల్గొన్నాం. ‘భూమిక’ స్త్రీవాద పత్రిక గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మాదిరిగానే యీ ఏడాది రూపొందించిన ప్రణాళికలో యీసారి ఆహ్లాద వినోదాలతో పాటు, కొంత సామాజిక బాధ్యతన అందరం పంచుకోవాలనే వుద్దేశ్యంతో – అరకు లోయ, దేశవ్యాప్తంగా కలవరాన్ని సృష్టించిన గంగవరం-దిబ్బపాలెం పోర్టు వ్యతిరేక పోరాటకర్తలు, వాకపల్లి గిరిజన మహిళా బాధితులతో ముఖాముఖి, విశాఖ కేంద్ర కారాగారంలోని మహిళా ఖైదీలు, శృంగవరపు కోట వద్ద జిందాల్‌ కంపెనీ తలపెట్టిన బాక్సైట్‌ తవ్వకాల్ని వ్యతిరేకిస్తున్న వారితో సంభాషించడం – ముఖ్యాంశాలుగా రూపొందించారు. మాలో రచయితలు, కవులు, గీతరచయితలు, సామాజిక వుద్యమ కారులు, అనువాదకులు, ప్రచురణ కర్తలు, పాత్రికేయులువంటి సామీప్యం వున్న విభిన్న రకాలైన ప్రొఫెషనల్స్‌ వుండడం వల్ల మూడురోజుల పర్యటన ఆద్యంతం ఒక వుల్లాసాల వెల్లువగా, భావోద్వేగాల ప్రభంజ నంగా సాగింది.
పోర్టు నిర్మాణం ధ్యేయంగా ప్రభుత్వం తీరప్రాంతవాసుల్ని తరిమి కొట్టడంలో భాగంగా సాగిస్తున్న దౌర్జన్యాన్ని, దమనకాండను, హక్కుల అణచివేతను బలంగా ప్రతిఘటిస్తున్న నాలుగైదు గ్రామాలకు కేంద్రం గంగవరం. ఆ చుట్టు పక్కల దిబ్బపాలెం, జాలారిపల్లె పాలెం, చినపల్లెపాలెం, పెదపల్లెపాలెం వంటి కుగ్రామాలన్నిటి జనాభా కలిపి పదిహేను వేలు.” ఇప్పటికే ఒకసారి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం సందర్భంగా మమ్మల్ని తరిమికొట్టారు. ఈ సముద్రం, యీ కొండలే వకు జీవనాధారాలు. కుంటలు, చెరువులు, చెట్టుపుట్టలు వకు ఆదాయన్నిచ్చే అమ్మతల్లులు. ఈ గంగవరం పోర్టు వల్ల గోచీతో తొవ్వెంట నిలబడాల…” అని ఆవేదన వెళ్ళగక్కుత ఉమ్మడి మరిణమ్మ, నకాలు, శాంతి వంటి మహిళలు తమ పోర్టు నిర్మాణ వ్యతిరేక సమితి పోరాటక్రవన్ని వివరించారు. వేధింపులకు వెరసి వికృత రాజ్యహింసకు వెరవని ఆ పల్లీయ పోరాటకర్తలు ఆ క్రమంలో చట్టాల పరిజ్ఞానాన్నీ సంపా దించారు. భారత ఓడరేవులు – ఉపాధి చట్టాన్ని మార్చి, నష్టపరిహారానికి సంబంధించిన అంశాల్ని సవరించమని పట్టుపడుతున్నారు. ప్రభుత్వ నౌకరేవుకు పనిలేదని మూసివేసిన రాజ్యం ప్రయివేటు పోర్టుకు ఎలా అనుమతి యిస్తుంది, అసలు తమకు పురిటివూయల అయిన సముద్రానికి – తమకు మధ్య గోడ ఎలా కడతారని నిలదీస్తోంది. ప్రశ్నలకు ప్రతీకలుగా నిలిచిన వాళ్ళందరికీ మా సంఘీభావాన్ని తెలిపి, ఆ పక్కనే ఉన్న మరో పోర్టు బాధిత గ్రామం దిబ్బపాలెం వెళ్ళాం. అది ఒక కూల్చివేతలకు శిథిలమవుతూ ప్రాణాలతో వున్న బెస్తపల్లె! మొత్తం విధ్వంసం!! గంగవరంలో వలె కాక, యిక్కడ రాజ్యాధిపత్యానికి లొంగిపోయిన పల్లెవాళ్ళు కనిపించారు. ఇక్కడ అందరూ ప్రభుత్వ ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ”కుటుంబానికి యింత చొప్పున భూమి, యిళ్ళు, రోడ్డు సౌకర్యం, వుపాధి కట్టిస్తు న్నాం” అని స్పెషల్‌ డిప్యూటీ కార్యాలయ అధికారులు నిక్కచ్చిగా చెబుతుంటే, ”మరేటి సెయ్యగలము? మమ్మల్ని యిడగొట్టి, కొందరితో సంతకాలు పెట్టించుకున్నారు. ఇంతకు ముందు కమిటీలు అవిప్పిస్తాం, యివిప్పిస్తామని ఖాళీ చేసాయి. కాపోళ్ళకి శ్రీనగర్‌లో, బెస్తలకు యాతపాలెంలో ఇళ్ళిస్తామంటే ఒప్పుకున్నవారం” అన్నది అక్కడి వరాలమ్మ. విభజించి పాలించడమనే కుత్సితపు నేర్పు ఆశ్రమాల ప్రజల సాంఘిక, ఆర్థిక, జీవన, భావోద్వేగపరమైన ప్రత్యేకతల్ని ఎలా హుళక్కి చేస్తోందో ప్రత్యక్షంగా చూసాక భారమైన హృదయలతో బస్సెక్కాం.
పంతొమ్మిది ఉదయం ఆరున్నరకు వాకపల్లి బయలుదేరాం. మొత్తం కొండ, రాళ్ళు, ఎగుడుదిగుళ్ళలో ప్రయసపడుతూ, అడపాదడపా ఒకరిద్దరు జారిపడుతూ మొకాళ్ళు కొట్టుకుపోతూ ఒక గంటన్నరకి మేమంతా చేరడం ఒక ఎత్తు – డెబ్బయ్యవ పడిలో వున్న అబ్బూరి ఛాయదేవి, వయసు క్రమంలో ఆ తర్వాత వున్న శాంతసుందరి, రత్నమాల, సుజాతమూర్తి వంటివారు శ్రమను లెక్కపెట్టకుండా సాటి బాధిత మహిళల కోసం నడచి రావడం అందరికీ గొప్ప స్పూర్తిని యిచ్చింది. బాధిత గిరిజన మహిళలకు మద్దతునిస్తూ, న్యాయంకోసం వారు చేస్తున్న పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచిన రామారావు దొర అనే వుద్యమ కార్యకర్త ఆ మారుమూల గ్రామంలో 2007 ఆగస్టు 21న పోలీసులనుంచి జరిగిన అత్యాచార ఘటనా నేపథ్యాన్ని, అనంతర న్యాయపోరాటక్రమాన్ని మాకు ముందే వివరించారు. ఆ తర్వాత గంటన్నరపాటు పాంగి చిత్తాయమ్మ, కూర్ర చిలకమ్మ కన్నీళ్ళతో వెక్కిపడుతూ మాట్లాడిన మాటలు మా అందరినీ నిర్ఘాంతపరిచాయి. వార్త తెలుసు, వివరాలు తెలుసు, అనంతర పరిణామాలు తెలుసు. కోర్టుతీర్పులూ ఎరిగే వున్నాం. అవమానితుల హృదయఘోషను వార్తాపత్రికా కథనాల పంక్తుల మధ్య అనుభూతించిన వాళ్ళమే అందరం. అయినా, ”మేమేం చేసామని మాకిలా చేసారు? మాకు చదువు లేదు, సామి లేదు – కూలినాలి చేసుకుంటాం. ఎప్పుడూ జిల్లా దాటివెళ్ళని వాళ్ళం. మాకు న్యాయం జరగాలని, తప్పు చేసిన వాళ్ళకి శిక్షపడాలని విశాఖపట్నం వెళ్ళాం అయిదంరాబాదెళ్ళాం. మంత్రి కాళ్ళు పట్టుకున్నాం. చూద్దామన్నాడు” అని ఒకరు, ”ఇదివరకు మా వూరే రాని వాళ్ళు, ఇప్పుడు వచ్చి లక్షలిస్తాం, భూమి యిస్తామంటారు. మాకెందుకు? మా సిగ్గుపోయింది. డబ్బులొద్దు, గింజలొద్దు. మా భర్తలు ఏ తప్పు చేసినా, చెయ్యకపోయినా కుక్కపిల్లల్లా కాల్చి చంపేస్తారు. మరి వాళ్ళు తప్పు చేస్తే ఎందుకు శిక్ష వెయ్యరు?” అని కుమిలిపోతంటే రాటకి కట్టిన మేకపిల్లల్లా యవన్మందిమీ అవాక్కే అయ్యం. ”తప్పు చేసిన వారికి శిక్ష పడనంతకాలం మా పుట్టినిళ్ళకు వెళ్ళకూడదు. అమ్మానాన్నల్ని చూసి ఎన్నాళ్ళాయె…” అంటూ విల పించింది మరొక మహిళ. కళ్ళనీళ్ళతోనే వాళ్ళను చూస్తూ, ఓదార్పుగా స్పర్శిస్తూ, వాళ్ళ పోరు దీక్షకు జోహారు చెబుతూ, మాటలు కూడదీసుకుంటూ మా సహానుభూతిని, సంఘీభావాన్ని వెల్లడించి మూగబోయిన హృదయలతో వెనక్కి బయలుదేరాం. అప్పటికి సాయంత్రం నాలుగవుతున్నా తిండి లేదన్న స్పృహే లేకపోయింది మాకెవ్వరికీ.
అరవిచ్చిన ఆ అందాల ప్రకృతి మధ్య వి. ప్రతిమ కథాసంపుటి ‘ఖండిత’ను పి. సత్యవతి ఆవిష్కరించి, రచయిత్రి భావ పరిణామాన్ని వివరించారు. అప్పటి కప్పుడు సద్యఃస్పూర్తితో (వీథి) నాటకాలు బస్సులోనే వేస్తూ ముందుకు వెళ్ళాం. ”సాయంత్రం బాక్సైట్‌ తవ్వకాల బాధితులతో ఇంటరాక్షన్‌, ఆ తర్వాత విజయనగరంలో సాహిత్యసభ, వీలైతే కోట, గురజాడగారి యిల్లు సందర్శన మన జాబితాలో వున్నాయి కనుక – బొర్రాగుహల్లో తాదాత్మ్యంతో వుండి పోయేవారి కోసం బస్సు వేచి వుండదు” అంటూ సత్యవతి ఒక కఠిన ప్రకటన చేయడంతో నాబోటివాళ్ళు అప్రమత్త మయ్యం . సరిగ్గా అరగంటే సమయం యిచ్చారు. దానికి తోడు, టికెట్లు తీసుకోగానే మాకోసమే కాచుకున్నట్లుగా చినుకులతో మొదలైన వాన పెద్దదై, మాలో ఎందరు జారిపడతారా అని తమాషా చూస్తోంది. అంతటి విరబసిన హరిత దృశ్యాల మధ్య వానజల్లు మరో సందర్భంలోనైతే పరవశింప చేసేదేమొ కానీ, పడి కాళ్ళు విరగ్గొట్టుకుంటే బస్సు వేచి వుండదన్న భయంతో ఎవరికి వాళ్ళం బొర్రాగుహలు చూసాం అనిపించు కుని వాహనమెక్కాం. జిందాల్‌ (బాక్సైట్‌ తవ్వకాల) వ్యతిరేక పోరాట కమిటీ సభ్యుల్ని చేరేసరికి రెండు దాటింది. ఉద్యమ కార్యకర్త, వృత్తిరీత్యా న్యాయవాది లక్ష్మి (గంగవరం, దిబ్బపాలెంలలో కూడా బాధితులకు యీమె అందిస్తున్న మద్దతు, న్యాయసహాయం, ఆయా వుద్యమాల పూర్వాపరాలు వివరాలన్నీ అనర్గళంగా ఆమె చెబుతున్న తీరు రచయిత్రులందరినీ ముగ్ధుల్ని చేసాయి.) స్వాగతం చెబుతూ సరాసరి కమిటీ కన్వీనర్‌ కాకి దేముడమ్మ అనే మరో అద్భుత స్త్రీమూర్తి ముందు మమ్మల్ని కూలవేసారు. చెప్పినది రాయడానికీ, సముద్రమంత శక్తివంతమైన ఆమె వ్యక్తిత్వాన్ని వివరించేందుకు యీ వ్యాసానికి రెట్టింపు పరిమాణంలో మరో ప్రత్యేక వ్యాసాన్ని రాయవలసి వుంటుంది. గంగవరం, దిబ్బపాలెం, వాకపల్లిలో పోరాడుతున్న మహిళలందరి శక్తిసామ ర్ధ్యాలూ, తెలివితేటలూ, నిర్భీతీ కలబోసుకుని రూపెత్తిన సంగ్రామశౌర్యం కాకి దేముడమ్మ. పాయింట్‌కి పాయింట్‌ తియ్యడంలో తమ హక్కుల్ని తాను నొక్కి వక్కాణించడంలో, చాటుగా తనకు యివ్వజూపిన ప్రలోభాల మూటను తిరస్కరించడంలో ఆమె చూపిన ధీరోదాత్తత – ఆమెకు మమ్మల్ని మొకరిల్ల జేసాయి. ఎంతో పోరాటం తర్వాత, తమ వాళ్ళ లొసుగులు, బలహీనతలతో రాజ్యం ఎలా ఆడుకుంటోందో అర్థమవుతండగా, స్వయంగా తన యింట్లోనే, తన భర్తను గుప్పిట్లో పెట్టుకుని తనను బెదరగొట్ట చూస్తున్న అధికారుల కుయుక్తులు చూసాక కూడా ఆమె జంకలేదు! నిస్పృహ చెందలేదు. ‘మా భూమికి మాకు బి-ఫారాలున్నాయి, మేమివ్వం’ అని తెగేసి చెప్పింది. ఉద్యోగా లిస్తామని ఆశజూపితే, తమకు చదువులేదు కనుక లాభం లేదన్నది. లక్షాపాతికవేల నుంచి రెండు లక్షలకు పెంచిన నష్టపరిహారమూ, యిల్లు బదులు యిల్లు అని ప్రలోభాన్ని కాదని, గుడి కడతామంటూ జిందాల్‌ ప్రతినిధులు చేయబోయిన ఆధ్యాత్మిక మొసాన్ని అడ్డుకుని, కేసుల మీద కేసులు బనాయిస్తున్నా చలించకుండా నిలబడింది. ఉద్యమానికి నాయకత్వం వహించి, ”మా భూమి మీకు యిచ్చి డబ్బు తీసుకుంటే, సొమ్ము కరిగిపోతుంది. మీరు వుద్యోగం (ఒకవేళ) యిచ్చినా మావరకే! మా పిల్లలకు దారేది? భూమి తీసుకుని భూమి మరోచోట యిస్తామంటారు – మరి మాలో నేల లేనివాళ్ళ గతేమిటి?” అని నిలదీసింది. బాధితులందరినీ ముందుకు నడిపి, జిందాల్‌ అధికారులతో ‘మీ భూమిలోకి మేమెప్పుడూ రాము’ అని పత్రాలు రాయించింది. బాక్సైట్‌ తవ్వకాలే మొదలైతే తమ భూములే కాదు, పుష్కలంగా, పరిశుభ్రంగా ప్రవహించే గోస్తనీ నీరు విషతుల్యమవుతుంది అన్న ఎరుకనూ కనబరచింది. తన పరోక్షంలో పోలీసు అధికారి తిట్టాడని తెలిసి ఫోన్‌ చేసి మరీ నిలదీసింది. దేముడమ్మ కేసుల్లోనో, పోలీసుల అదుపుల్లోనో వున్నప్పుడు, (ఒకసారి భర్త నిర్బంధం వల్ల సభకు హాజరు కాలేక పోయినప్పుడు) పార్వతి సభను, వుద్యమాన్నీ నడుపుతుంది. పార్వతి, ఆమె భర్త మల్లేశం తాము చేస్తున్న పోరాటం పట్ల పూర్తి అవగాహనతో వున్నారు. తిరుగు ప్రయణంలో మాతోపాటు తమ భూముల వద్దకు ప్రయణించి వచ్చిన ఆ మహిళ లిద్దరూ, అక్కడ ఆ నేల తమదని చాటుతూ పాతిన పక్కా బోర్డును చూపినప్పుడు మేమందరం కేరింతలే కొట్టాం. చప్పట్లు, యీలలతో మా అబ్బురపాటును తెలుపుతూ శెలవు తీసుకున్నాం.
మూడురోజులు మూడు నిముషాల్లా సాగిన మా యత్రలో చివరి మజిలీ విజయనగరంలో చాగంటి తులసి అధ్యక్షతన హుషారుగా సాగిన సభ. సాహిత్యాభిమానం పుష్కలంగా వున్న గురజాడవారి వూరులో ఆ వేదిక మీద స్త్రీవాద రచయిత్రుల రచనల నుంచి ఎంపిక చేసిన కథలు, కవితల హిందీ అనువాద సంకలనాలు – అప్నా సంఘర్ష్‌, అక్షర్‌ హవరా అస్తిత్వ్‌ – ఆవిష్కరణ అపురపంగా జరిగింది. అనువదించిన శాంతసుందరిని అందరం అభినందిస్తూ, మూడురోజుల మా యత్ర అనుభవాల్ని క్లుప్తంగా తెలియజేసి, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ అందుకోవాలన్న తొందర కారణంగా అక్కడ భోజనాలు చెయ్యలేం కనుక, నిర్వాహకులు వేడివేడిగా అందించిన రోటీప్యాకెట్లు తీసుకుని, టాటా చెప్పేసాం. ఆ రైలు విజయ నగరంలో రెండు నిముషాలే ఆగుతుందని ఒకరినొకరం హెచ్చరించు కుంటూ స్టేషన్‌ చేరాం.
తీరా రిజర్వేషన్‌తో నిమిత్తం లేకుండా వచ్చి పడుతున్న ప్రయణికుల్ని అటకాయిస్తూ, తింటూ, నవ్వుతూ, చర్చిస్తూ ఏ అర్ధరాత్రికో పడక వేసాం. మర్నాడు ఉదయం పదకొండుకు దిగేవరకు ‘మై ఫ్యూడల్‌ వార్‌’ వంటి యిటీవల చదివిన పుస్తకాల గురించి గలగలా మాట్లాడుత పాటల పేరిట గొంతులు చించుకుంటూ, ఊరు రాగానే బెంగగా వీడ్కోలు తీసుకుంటూ మామూలు జీవితాల్లోకి వచ్చిపడ్డాం.
గంగవరం, వాకపల్లి, శృంగవరపు కోట బాధిత/పోరు మహిళల్ని చూసాక, కొండంత వాళ్ళ ధైర్యం, నిజం మీద నమ్మకం, భూమి మీద ప్రేమ, వాళ్ళలోని నిర్భీతి, పోరాటపటిమ, ఏ కష్టాలనైనా ఎదుర్కొని తమను తాము, తమ కుటుంబాల్ని కాపాడుకోవాలన్న ఆ తపన, సహజజీవనం, సమన్యాయం హక్కు అని గుర్తించిన వాళ్ళ ధీరోదాత్తత ముందు భద్రవనితలుగా భావించబడేవాళ్ళ వ్యక్తిత్వాలన్నీ పింజలు పింజలుగా విచ్చిపోతాయనిపించింది. మన సాంఘిక భద్రత, నైతిక విశ్వాసాలు, వ్యావృత్తుల ఎంత బోలువో కొట్టవచ్చినట్టు తెలిసివచ్చింది. ఆ మహిళలందరికీ వెన్ను దన్నుగా చట్టపరమైన నేపథ్యాన్నీ, శక్తి యుక్తుల్నీ అందిస్తున్న హక్కుల సంఘాలు, సేవా కార్యకర్తల తెగువ, దీక్ష, ఓర్పునేర్పుల్ని చూసాక మనం అసలు మనుషులుగా ఎంత మిగిలివున్నాం అన్న ప్రశ్న ఒక్కటే మాకు మిగిలింది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో