ఎర్రజెండా రెపరెపల్లో మెరిసిన విద్యుల్లత మల్లు స్వరాజ్యం – వేములపల్లి సత్యవతి

యుద్ధభూమిలో అరివీర భయంకరులై శత్రువులతో పోరాడి అసువులు బాసినవారిని వీరులని, వీర మరణం పొందారని అంటాము. జాతి స్వేచ్ఛ, దేశ స్వాతంత్య్రాల కొరకు కంకణం కట్టుకుని ఉద్యమాలను స్థాపించి ధన, మాన, ప్రాణాలను ఫణంగా పెట్టి సమిధలైన వారిని త్యాగధనులని, లబ్దప్రతిష్టులని, నిష్కళంక దేశభక్తులని కొనియాడతాం. పైన పేర్కొన్న ఇరు వర్గాలకు చెందినవారు, మన దేశ స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములే. ప్రథమ భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆంగ్లేయ సేనలనెదిరించి టిప్పు సుల్తాన్‌, తాంత్యాతోపే, ఝాన్సీరాణి లక్ష్మీభాయి, హజరత్‌ బేగం మొదలైనవారు అసమాన ధైర్యసాహసాలతో పరాక్రమశాలురై పోరాడి వీర మరణం పొందారు. రవి అస్తమించని ఆంగ్ల సామ్రాజ్య ఆధిపత్యాన్నుండి మాతృదేశపు దాస్య శృంఖలాలను బద్దలు కొట్టడానికి విప్లవ వీర కిశోరాలు భగత్‌సింగ్‌, ఖుదీరాం బోస్‌, అష్పాఖుల్లా ఖాన్‌ మొదలగు యువకులు ఉరితాళ్ళను పూలదండల వలే మెడలకు తగిలించుకుని చిరు మందహాసంతో ఉరికంబాలకెక్కారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయ పాలకుల కంటిమీద కునుకు లేకుండా ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించాడు. ఆ మన్యం వీరుని గుండె తుపాకీ గుళ్ళకు గురైంది. గాంధీజీ నాయకత్వాన జరిగిన పోరాటాలలో దేశ ప్రజలు జాతి, మత, కుల, వర్ణ, లింగ, ప్రాంత బేధాలు లేకుండా  ఏకత్రాటిపైన నడిచారు. మహిళలు సాంఘిక కట్టుబాట్లను తెగత్రెంచుకుని ఉద్యమాలలో కురికారు. ఒంటిమీదున్న బంగారాన్ని నిలువు దోపిడిగా గాంథీజీకి సమర్పించారు. కాపురాలను  కాలదన్నుకున్నారు. కొంతమంది దేశభక్తుల జీవితాలు అండమాను జైళ్ళలోనే అంతమయ్యాయి. చివరకు బ్రిటిష్‌వారి వలస పాలన నుంచి ఆగస్టు 15, 1947లో మన దేశం స్వతంత్రమైంది. స్వతంత్రమయ్యే నాటికి దేశంలో పెద్దా, చిన్నా, చితకా అన్నీ కలిపి 625 సంస్థానాలు ఉన్నాయని లెక్క తేలింది. వాటన్నింటినీ భారత యూనియన్‌లో విలీనం చేయటం జరిగింది.

సంస్థానాలలో అన్నింటికంటే హైద్రాబాద్‌ సంస్థానం పెద్దది. సంస్థానాధీశుడు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ముల్‌ముల్క్‌. తాను యూనియన్‌లో విలీనం చేయనని, స్వతంత్రంగానే ఉంటానని భీష్మించుకుని కూర్చున్నాడు. ఆనాటి సంస్థాన ప్రజల జీవన పరిస్థితులను తెలుసుకోవలసిన అవసరముంది. సంస్థానం లోపల జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, బడా బడా భూస్వాములు ఉండేవారు. వారు నివసించే గడీలు కొన్ని ఎకరాల స్థలంలో కట్టబడ్డాయి. వారి ఆధీనంలో కొన్ని గ్రామాలు, వేల ఎకరాల భూములుండేవి. వారు ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేసి ధనార్జన చేసి నవాబుకు నజరానాలు సమర్పించేవారు. ప్రజలు వీరి దౌర్జన్యాలకు, దోపిడీకి, హింసకు, అత్యాచారాలకు గురయ్యేవారు. అణగారిన, అణగద్రొక్కబడిన వారి నోటి నుంచి ‘నీ బాంచను (బానిస) దొరా, నీకాల్మొక్కుత దొరా’ అనే మాటలు తప్ప వేరే మాటలు వారి నోటినుండి వెలువడేది కాదు. ఆడా, మగ తేడా లేకుండా పటేల్‌-పట్వారీల దగ్గర నుండి జాగీర్దార్లకు, దేశ్‌ముఖ్‌లకు, ప్రభుత్వ ఉద్యోగులకు వెట్టిచాకిరీ చేయవలసిందే. కంటికి కనబడిన కన్నెపిల్ల దొరల గడీలకు రవాణా చేయబడేది. లేకపోతే వారి గుండాల చేతుల్లో నరక యాతనలకు గురయ్యేవారు. గుండాలు బలవంతంగా  లాక్కెళ్ళేవారు. ఎర్ర టోపీల వాళ్ళను (పోలీసులను) చూస్తే దళిత జనుల బట్టలు తడిసేవి. భయం నీడలో నిత్యం వారి బతుకులు తెల్లవారేవి. గ్రామాల్లో వారి ఇండ్లలో దారిద్రం  తాండవించేది. కడుపు నిండా తినడానికి తిండి లేకపోగా తాగడానికి మూడు పూటలా గంజి నీళ్ళు కూడా ఉండేవి కావు. గ్రామాల్లో విద్య, వైద్మం రెండూ ఉండేవి కావు. ఉన్న ప్రభుత్వ-ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు  జంట నగరాల్లోనే ఉండేవి.  జిల్లా కేంద్రంలో మగపిల్లలకు మాత్రమే ఒకే ఒక్క స్కూల్‌ ఉండేది. విద్యాబోధన ఉర్దూలో ఉండేది. ప్రజలేమో నూటికి 80 శాతం తెలుగులోనే మాట్లాడేవారు.

బ్రిటీష్‌ ఇండియాలో జరిగిన స్వాతంత్ర పోరాటాల ప్రభావం సంస్థానంలో చదువుకున్న యువకులమీద, విద్యార్థుల మీద పడింది. అంతకు ముందే సంస్థానంలో ఆంధ్రమహాసభ ఏర్పడి ఉంది. అతివాద భావాలు కల యువకులు ఆంధ్ర మహాసభను వేదికగా చేసుకుని దేశ్‌ముఖ్‌ల, జాగీర్దార్ల, నిజాం సర్కారు నిరంకుశ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించారు. రావి నారాయణరెడ్డి, రాజబహదూర్‌, మఖ్దుం మొహియుద్దీన్‌, దేవులపల్లి వెంకటేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల సోదరులు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, చిర్రావూరి లక్ష్మినరసయ్యగారు, సర్వదేవభట్ల రామనాదం మొదలైన త్యాగధనులు, లబ్ద ప్రతిష్టులైన నాయకులు ఉద్యమాలకు లభించారు. వారితోపాటు ఆరుద్ర కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి మహిళా  నేతల అశేష త్యాగాలతో తెలంగాణా ప్రజా పోరాటం దినదిన ప్రవర్ధమానంగా ఎదిగింది. ప్రజాకవులైన కాళోజీ, దాశరధి కృష్ణమాచార్యులు తమ రచనల ద్వారా ఉద్యమానికి ఊపిరందించారు. కుటుంబాలకు కుటుంబాలు ఆంధ్ర మహాసభలో చేరి తర్వాత కమ్యూనిస్టు పార్టీ వైపు అడుగులు వేశారు. అటువంటి కుటుంబాలలో ఆరుట్ల వారు, దేవులపల్లి వారు, భీమిరెడ్డి నర్శింహారెడ్డి వారు, కొండవీటి ఇందిరమ్మ మొదలగు కుటుంబాలతో పాటు అనేక కుటుంబాలు చేరాయి.

ఈ పోరాటాలకు గుండెకాయ వంటిదని, తలమానికంగా నిలిచిందని పేరు పొందినది నల్గొండ జిల్లా. ఆ జిల్లాలోని తుంగతుర్తి మండలంలోని కొత్తగూడెం గ్రామంలో 500-600 ఎకరాల భూస్వామి రామిరెడ్డి గారు. వారి భార్య చొక్కమ్మగారు. రాగి, వెండి కలవని బంగారాన్ని మేలిమి బంగారమని అంటారు. నిజంగా అటువంటి మేలిమి బంగారమే చొక్కమ్మ. భూస్వామి భార్యనన్న దర్పం ఏనాడూ ప్రదర్శించలేదు. పేదలంటే దయాదాక్షిణ్యాలు కలిగి
ఉండేది. ఆ దంపతులకు 1930-31 సంవత్సరంలో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్లే భవిష్యత్తులో అరుణతారై, తెలంగాణా  గెరిల్లా  యోధురాలిగా పేరు ప్రఖ్యాతులు గాంచింది. చొక్కమ్మ ఆ బిడ్డకు స్వరాజ్యం అని పేరు పెట్టుకున్నారు. అందుకు ఒక కారణముంది. ఆమె బంధువు, మేనల్లుడు అయిన దాయం రాజిరెడ్డి బ్రిటీష్‌ ఇండియాలో జరిగే జాతీయ కాంగ్రెస్‌ మహాసభలకు వెళ్ళి వచ్చేవారు. గాంథీగారిని గురించి, కాంగ్రెస్‌ను గురించిన సంగతులు వారి ద్వారా చొక్కమ్మ వినేవారు. ఆమె మదిలో దేశభక్తి దాగి వుంది. అందుకే తన కూతురికి స్వరాజ్యం అని తన ఇష్టప్రకారమే నామకరణం చేసింది. రామిరెడ్డిగారికి వేరే పేరు  పెట్టాలని ఉంది. స్వరాజ్యం గారికి ఎనిమిదవ యేట తండ్రి గతించారు. అంతకు పూర్వం ఒక పంతులుగారిని ఏర్పాటు చేసి పిల్లలందరికీ తెలుగు చదవడం, రాయడం నేర్పించారు. రామిరెడ్డిగారు ఆడపిల్లలకు కూడా గుర్రపుస్వారీ, ఈత మొదలగునవి నేర్పించారు. వారు గతించడంతో వాటితోపాటు చదువు కూడా  అటకెక్కింది. సంతానంలో పెద్దవాడైన భీమిరెడ్డి నరసింహారెడ్డి హైద్రాబాద్‌లో చదువుతుండేవారు. అప్పుడే వారు ఆంధ్ర మహాసభవైపు ఆకర్షితులయి కార్యక్రమాలలో పాల్గొంటుండేవారు. తండ్రిగారి మరణానంతరం ఇంటికి వచ్చి వ్యవసాయం పనులు చూసుకోసాగారు. కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే ఆంధ్ర మహాసభ కార్యక్రమాలను స్వంత ఊర్లోనే చేపట్టారు. వ్యవసాయ కూలీలను, రైతులను తమ ఇంటిలో  సమావేశపరచి వారిలో చైతన్యం కలిగించడం మొదలుపెట్టారు. ఒకరోజు రాత్రి వ్యవసాయ కూలీలను సమావేశపరిచి  కూలీ పెంచడానికి సమ్మె చేయాల్సిన అవసరం గురించి మాట్లాడుతున్నారు. వారి చిన్నాయనగారు పోలీసులకు ఉప్పందించారు. అరెస్టు చేయడానికి పోలీసులు ఆ రాత్రే వచ్చారు. ఆ నాటి నిజాం సర్కారు చట్టం ప్రకారం జనానా (ఆడవారు) ఉన్న ఇండ్లలో రాత్రివేళ పోలీసులు ప్రవేశించి సోదాలు చేయకూడదు. ఆ చట్టాన్ని గురించి తెలిసిన చొక్కమ్మ కిటికీ తలుపు తెరిచి సోదా చేయడానికి తెల్లవారిన తర్వాత రమ్మనమని పోలీసులకు చెప్పారు. విధిలేక పోలీసులు వెనుదిరిగారు. ఈలోగా నర్సింహారెడ్డి ఇంటి వెనుక నుంచి తప్పించుకున్నారు. అన్నగారికి దారిలో తిండికి ఇబ్బందవుతుందని తలచిన స్వరాజ్యం దిండు కవరు నిండా జొన్నలు పోసి అన్నగారికి అందించారు. చొక్కమ్మ పెద్ద కూతురు శశిరేఖ అరెస్టయి హైద్రాబాద్‌లోను, ఔరంగాబాద్‌, గుల్బర్గా జైళ్ళలో  మూడు సంవత్సరాలు జైలుశిక్ష అనుభవించారు. చుక్కమ్మ పెద్దల్లుడూ, శశిరేఖ భర్త అయిన రాజిరెడ్డి తప్పించుకున్నారు. చొక్కమ్మగారి మిగతా  బిడ్డలు కుశలవరెడ్డి, సరస్వతి ఇద్దరూ నిజాం వ్యతిరేక పోరాటాలలో పాల్గొని నిర్బంధాలను ఎదుర్కొన్నారు. భీమిరెడ్డి నర్సింహారెడ్డి తెలంగాణా సాయుధ పోరాటంలో పార్టీ ఆదేశాల మేరకు అయిష్టంగానే ఆయుధాన్ని కిందకు దించిన పోరాటవీరుడు, నేత. చొక్కమ్మ ఇల్లు ఆంధ్రమహాసభకు కేంద్రమైంది. వారి ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి. చొక్కమ్మను కూడా స్టేషన్‌లో నిర్బంధించారు. కానీ ఆమె విచారించలేదు. తన బిడ్డలు దొంగలు కాదు, దోపిడీలు చేయడంలేదు, పేదల కోసం పాటుపడుతున్నారని ఆమె ఏనాడూ అడ్డుచెప్పలేదు. బిడ్డలందరినీ పోరాటాలకు ఉసిగొల్పిన దేశభక్తిగల తల్లి. వీరమాత చొక్కమ్మగారు పేరుకు తగిన సార్థకత చేకూరింది.

ఎర్రజెండా రెపరెపల మధ్య మెరిసిన విద్యుల్లత స్వరాజ్యం. అన్నగారి వెంట, అక్కగారి వెంట నడచి పన్నెండవ యేట ఆంధ్ర మహాసభలో అడుగుపెట్టింది. ఆనాటి నుండి ఈనాటి వరకూ ఎప్పుడూ వెనుదిరిగి చూడకుండా ఉద్యమాలలో పయనించారు. ఒకసారి హైద్రాబాద్‌లో జరిగిన ఆంధ్ర మహాసభకు అన్నగారితో కలిసి వెళ్ళారు. ఆంధ్ర మహాసభతోపాటు ఆంధ్ర మహిళా సభ కూడా జరిగేది. ఆ మహిళా సభలో తానంతట తానే  ప్రేరేపితురాలై మాట్లాడింది. ఆటల్లో పాల్గొని బహుమతులను పొందేది. ఆనాడు తప్పించుకుని దొడ్డిదారిన వెళుతూ వెళుతూ నర్సింహారెడ్డి కూలీల సమ్మెను జరిపే బాధ్యతను స్వరాజ్యానికి అప్పజెప్పారు. తెల్లవారి కూలీలు పనికి వెళ్ళేవేళ కూడలి దగ్గర దారిలో అడ్డంగా పడుకుంది స్వరాజ్యం. కూలీకెళ్ళే స్త్రీలకు దొరబిడ్డను దాటి వెళ్ళడం సాధ్యం కాలేదు. వారికి స్వరాజ్యం ”అందరూ గుంపుగా వెళ్ళకుండా సందుగొందుల నుంచి ఒక్కొక్కరే ఇండ్లకు తిరిగి వెళ్ళ”మని సలహా ఇచ్చారు. వారంతా ఆ విధంగానే చేశారు. మర్నాడు భూస్వాములు కులపెద్దలను పిలిపించి పనికి రానందుకు పంచాయతీ పెట్టారు. ఈ సంగతి తెలుసుకున్న స్వరాజ్యం అక్కడ ప్రత్యక్షమయింది. భూస్వాములు నిశ్చేష్టులయ్యారు. స్వకులస్థుల పిల్ల, భూస్వాముల బిడ్డ కనుక ఏమీ అనలేదు. కూలీలను మందలించి పంపేశారు. మరునాడు స్వరాజ్యం కూలీల వద్దకు వెళ్ళి పనికి వెళ్ళవద్దని ప్రచారం చేశారు. ఎవరూ కూలీకి వెళ్ళలేదు. భూస్వాములు దిగివచ్చి కూలీ పెంచారు. అలా మొదటి పోరాటంలో విజయులయ్యారు. తెలంగాణా కమ్యూనిస్టు మహిళలకు ఆద్యురాలు ఆరుట్ల కమలాదేవి. ఆమె కమ్యూనిస్టు రాజకీయ క్లాసులు చెప్పేవారు. స్వరాజ్యం ఆ క్లాసులకు వెళ్ళింది. పార్టీ  విజయవాడలో మహిళలకు రాజకీయ పాఠశాల నడిపింది. కోస్తా జిల్లాల్లోని, తెలంగాణాలోని కమ్యూనిస్టు మహిళలు ఆ పాఠశాలకు హాజరయ్యారు. ఆ క్యాంపు నెలరోజులకొకటి నిర్వహింపబడేది. తెలంగాణా నుంచి రావి సీతాదేవి, స్వరాజ్యం, దేవులపల్లి శ్రీరంగమ్మ, శశిరేఖ, లలిత, ప్రియంవద, భీమిరెడ్డి సరోజిని ఇంకా తదితరులు ఆ క్యాంపులలో శిక్షణ కొరకు వెళ్ళేవారు.

1942లో ఖమ్మంలోని భువనగిరిలో జరిగిన పన్నెండవ ఆంధ్ర మహాసభకు బద్దం ఎల్లారెడ్డి అధ్యక్షునిగాను, రావి నారాయణరెడ్డి కార్యదర్శిగానూ ఎన్నికయ్యారు. అదే సందర్భంలో పోటీ ఆంధ్ర మహాసభ ఏర్పడింది. అప్పటివరకూ స్టేట్‌ కాంగ్రెస్‌ వారు, కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభను వేదికగా చేసుకుని పనిచేశారు. అతివాదులుగా, మితవాదులుగా ఏర్పడ్డారు. మితవాద పార్టీకి మందుముల నర్శింగరావు, పులిజాల రంగారావు మొదలగువారు శ్రీకారం చుట్టారు. పోటీ సంఘం ప్రజల్లోకి చొచ్చుకుపోలేక పోయింది. అతివాద యువకులు పోటీ సంఘం మీద పాట పాడేవారు.

”ఎందుకయా పోటీ సంఘం మందుములయ్యా, ఉన్న సంఘమే చాలు పులిజాల రంగయ్యా”

అతివాద సంఘం నాయకులు, కార్యకర్తలు గ్రామాలలోకెళ్ళి దొరల దోపిడీకి, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారు. భూస్వాముల, దేశ్‌ముఖ్‌ల, జాగీర్దార్ల, పటేల్‌, పట్వారీల పెత్తందారీతనానికి, అరాచకాలకు, అత్యాచారాలకు, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి సభలు, సమావేశాలు జరిపి వారిలో చైతన్యం కలుగచేశారు. పార్టీ అండదండలతో ప్రజలు సంఘటితమయ్యారు. పోరాటానికి నాంది పలికారు. పాత సూర్యాపేట, బాలెంల, పాలకుర్తి, మెండ్రాయి, కడివెండి, పులిగళ్ళ గ్రామాల ప్రజలు తిరగబడ్డారు. సర్కారు పులిగళ్ళలో పోలీసు శిబిరాన్ని పెట్టి వందలాదిమంది రైతులను జైళ్ళలో పెట్టింది. బాలెంల, పాత సూర్యాపేట రైతులు వడిశెలతో, రాళ్ళతో నిజాం పోలీసులను ఎదుర్కొన్నారు. వడిసెల పోరాటంలో స్వరాజ్యం పాల్గొంది. దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి ప్రజల వద్ద వుండి వారికి ధైర్యం నూరిపోశారు. 1946లోనే తాళ్ళవెల్లెం గ్రామాన్ని అర్థరాత్రి 400 మంది రిజర్వ్‌ పోలీసులు చుట్టుముట్టారు. అక్కడి నాయకులు కొండవీటి బుచ్చిరెడ్డి, యలమంద, మురహరిరావు కోసం ఇల్లిల్లూ గాలించారు. ప్రజల రాకపోకలను అడ్డుకున్నారు. పోలీసుల రాకను పసిగట్టిన నాయకులు అంతకుముందే తప్పించుకున్నారు. ప్రథమంగా ఈ ప్రజా పోరాటాలు నల్లగొండ జిల్లాలో ప్రారంభమయ్యాయి. అందుకే నల్లగొండ జిల్లా  తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటానికి, మిగతా పోరాటాలకు గుండెకాయ వంటిది. తలమానికంగా కూడా నిలిచింది. దీని అర్థం మిగతా జిల్లాలకు ప్రాధాన్యత లేదనికాదు. ఖమ్మం, వరంగల్‌ మొదలైన జిల్లాలకు ఉద్యమం వ్యాపించింది. విసునూరు దొర రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాడిన ధీరురాలు చాకలి ఐలమ్మ. ఆ పోరాటం చరిత్రాత్మకమైనది. విసునూరు దొరలాంటి కిరాతకుడు, క్రూరుడు, నరరూప రాక్షసుడు భూమ్మీద మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. అతనికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసిపడిన పోరాటానికి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహించింది. నాయకత్వం వహించిన భీమిరెడ్డి నర్శింహారెడ్డి తదితరులను విసునూరు పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. తాగడానికి నీళ్ళడిగితే మూత్రం ఇచ్చారు. తినడానికి మిరపకాయలిచ్చేవారు. అతని గూండాలు పచ్చి బాలింతలను సైతం పొలంలో పనిచేయడానికి బలవంతంగా గుంజుకెళ్ళేవారు. పసికూనలకు పాలివ్వడానికి కూడా వెళ్ళనిచ్చేవారు కాదు. పాలు సేపులకొచ్చి పాలిచ్చి వస్తామన్నా పంపకుండా మోదుగు ఆకుల దొప్పల్లో పాలు పిండించి పొలాల గట్లమీద పారపోయించేవారు. గుడిసెలో గుడ్డ ఉయ్యాలలోని పసికూనలు ఆకలితో గుక్కపట్టి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లేవారు. ఒకరిద్దరు పిల్లలు గొంతెండిపోయి చనిపోయారు కూడా.

ఆ సమయంలో దేవరప్పుల గ్రామంలో స్వరాజ్యం తన మేనత్త ఇంట్లో ఉంది. ఆ ఊరు విసునూరుకు దగ్గర. చుట్టాల ఇంటిలో ఉన్న స్వరాజ్యం ఊళ్ళోని ప్రజల వద్దకు వెళ్ళి పోరాటాన్ని గురించి చెబుతుండేది. అది ఆమె మేనత్త భర్తకు ఇష్టముండేది కాదు. ఆయన కాంగ్రెస్‌ వాది. అయినా స్వరాజ్యం వెనకడుగు వెయ్యలేదు. విసునూరు ఘటన విని స్వరాజ్యం హుటాహుటిన అక్కడికి చేరుకుంది. ప్రజలపై దొర దురాగతాలను విని, చూసి చలించిపో యింది. సందర్భం, సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. అప్పటికప్పుడు బతుకమ్మ పాట బాణీలో ఉయ్యాల పాట గేయ రచన చేసి పాడారు. తెలంగాణాలో అంతకు ముందు బతుకమ్మ పాట ఉన్నత కులాల మహిళలే పాడి పండుగ చేసుకునేవారు. ఉద్యమాలకు పాటలు ప్రాణవాయువులాంటివి. పాటల ద్వారా సమస్యలను ప్రజలు అవగాహన చేసుకుంటారు. స్వరాజ్యం ఉద్యమ ఆశయాలను ప్రజలకు తెలియజేయడానికి గేయ రచనను వాహకంగా వాడుకున్నారు. విసునూరు దొర దురాగతాల మీద రాసిన ఉయ్యాల పాట (గేయ రచన) వ్యవసాయ కూలీలు, హరిజన, గిరిజన మహిళల నృత్యంగా రూపుదిద్దుకుంది. ఇప్పటికీ స్వరాజ్యం ప్రతి మీటింగ్‌లోను ఈ పాట పాడుతుంది.

ఆ పాట చుట్టుప్రక్కల 30-40 గ్రామాలలో ప్రచారమ యింది. స్వరాజ్యానికి బతుకమ్మ పండగంటే బహు సంబరం. ఆ గ్రామాలలో ప్రచారానికి వెళ్ళినపుడు అన్ని కులాల మహిళలతో కలిసి విసునూరు దొరమీద రాసిన గేయాన్ని బతుకమ్మ ఆటలాగానే ఆడుతూ పాడుతూ ఉండేవారు. విసునూరు దొర తల్లి కరివెండి గ్రామంలోని గడీలో ఉండేది. ఆమె దురాగతాలలో కొడుకు రామచంద్రారెడ్డికన్నా ఏడాకులు ఎక్కువే చదివింది. మహా కర్కోటకురాలు. విసునూరులో పార్టీ చుట్టుపక్కల గ్రామాల ప్రజల తోడ్పాటుతో వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా, తర్వాత కరివెండిలో పెద్ద ప్రజా సమూహంలో ఊరేగింపు జరిగింది. ఆమె దుష్టత్వాన్ని నిరసిస్తూ ప్రజలు  దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తూ ఊరేగింపుతో ముందుకు సాగారు. గడీ ముందుకు రాగానే లోపలి నుండి గూండాలు కాల్పులు జరిపారు. దొడ్డి కొమరయ్య ఆ తుపాకీ గుళ్ళకు గురయి అమరుడయ్యాడు. ఓ భూకామందు బందగీ అనే ముస్లిం వ్యక్తి భూమిని స్వాధీనం చేసుకున్నాడు. బందగీ కోర్టులో కేసు వేశాడు. 12 సంవత్సరాల తర్వాత బందగీకి అనుకూలంగా తీర్పు వెలువడింది. అది సహించలేని ఆ భూస్వామి ఒంటరిగా వస్తున్న బందగీని గూండాలచేత దారిలోనే హత్య చేయించాడు. బందగీ ఆ విధంగా బలయ్యాడు. కొమరయ్య ఈ విధంగా నేలకొరిగాడు. కరివెండి పోరాటంలో స్వరాజ్యం పాల్గొన్నారు. ఉద్యమం ఖమ్మం, వరంగల్‌ మొదలగు జిల్లాలకు వ్యాపించింది. పేద ప్రజలు ప్రతిచోటా పార్టీకి ఘనస్వాగతం పలికారు. దినదిన ప్రవర్థమానమవుతున్న ఉద్యమ కార్యక్రమాలను అమలు చేయడానికి డబ్బు అవసరం కూడా ఏర్పడింది. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దుం, దేవులపల్లి, రాజబహదూర్‌ గౌర్‌ వంటి నేతలతోపాటు విరాళాల కోసం స్వరాజ్యాన్ని కోస్తా జిల్లాలకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు.

స్వరాజ్యం కోస్తా జిల్లాల్లో, విజయనగరం నుండి మద్రాసు వరకు సుడిగాలి పర్యటన చేసింది. అప్పటికి ఆమె వయసు 15-16 సంవత్సరాలు. గంగా ప్రవాహంలాగా ఉద్వేగపూరితమైన స్వరాజ్యం ఉపన్యాసాలు వినడానికి జనం తండోప తండాలుగా తరలి వచ్చేవారు. నిజాం నిరంకుశ పాలన, ప్రజల కడగండ్లను గురించి కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంటే ప్రజలు చలించిపోయేవారు. 15-16 సంవత్సరాల బాలిక ఉపన్యాసాలు విని విస్తుపోయేవారు. అప్పటికే ఆమె మంచి వక్తగా ఎదిగారు. ఉపన్యాసాల తర్వాత విరాళాల కోసం విజ్ఞప్తి చేసేవారు. ప్రజల నుంచి అంచనాలకు మించి విరాళాలు పోగయ్యేవి. ప్రజలిచ్చిన భూరి విరాళాలతో స్వరాజ్యం చీర చెంగు, ఒడి నిండిపోయేవి. ప్రజలు చూపిన ఆదరాభిమానాలకు స్వరాజ్యం ఆనందభరితులయ్యేవారు. ఆ సమయంలో స్వరాజ్యం ఉబ్బసంతో బాధపడుతుండేవారు. తలకు మఫ్లర్‌ చుట్టుకుని ఆయాసంతో రొప్పుతూ విజయవాడలోని ప్రజాశక్తి నగర్‌లోని పాకలలో చాపమీద పడుకున్న ఆమె రూపం ఇప్పటికీ నా కళ్ళల్లో కదలాడుతూ ఉంటుంది. నేడు ఉబ్బసానికి ఉన్న వైద్య సౌకర్యం ఆ రోజుల్లో లేదు. అలా బాధపడుతూనే సభలలో, సమావేశాలలో పాల్గొని ఉపన్యసించేది.

ఆంధ్రాలో కమ్యూనిస్టు పార్టీ మహిళా సంఘాన్ని స్థాపించినట్లుగా తెలంగాణా కమ్యూనిస్టు పార్టీ ప్రత్యేకించి మహిళా సంఘాన్ని  స్థాపించలేదు. కోస్తాంధ్ర బ్రిటీష్‌ ఇండియాలో ఉంది. అక్కడ ప్రజలకు విద్య, వైద్యం మొదలగు సౌకర్యాలుండేవి. తెలంగాణా ప్రజలు నిజాం నిరంకుశ పాలనలో అజ్ఞానాంధకారంలో చిక్కుకుపోయారు. ఇక్కడి గ్రామీణ స్త్రీ పురుషులందరి ముందు ఉన్న ప్రథమ సమస్య ఒక్కటే. కూడుకోసం, గూడు కోసం, గుడ్డ కోసం, భుక్తి కోసం, భూమి కోసం, దొరల, దేశ్‌ముఖ్‌ల, జాగీర్దార్ల దోపిడీ నుండి, దౌర్జన్యాల నుండి, వెట్టి చాకిరీల విముక్తి కోసం పోరాడటమే. అందుకే కమ్యూనిస్టు మహిళలు పురుషులకు ధీటుగా ఉద్యమాలలో పాల్గొని పోరాడేవారు. నిజాం రాజ్యంలో ఎవరి భూముల్లోనైతే తాడిచెట్లు, ఈతచెట్లు ఉండేవో వాటిమీద ఆ భూమి గలవానికి ఆ చెట్లమీద హక్కు ఉండేదికాదు. అవి  నిజాం సర్కారు సొత్తే. ”గీసే వాడివే చెట్లు. దున్నే వాడిదే భూమి” అనే నినాదాలతో పార్టీ పోరాటానికి పిలుపునిచ్చింది. గ్రామ రాజ్యాల నిర్వహణ కూడా చేపట్టింది. సూర్యాపేట తాలూకాలో దీని నిర్వహణ బాధ్యతను పార్టీ స్వరాజ్యానికి అప్పజెప్పింది. సూర్యాపేటను  కేంద్రంగా చేసుకుని తోటి కార్యకర్తలను కలుపుకుని గ్రామరాజ్యాలు, గ్రామ రక్షణ మహిళా దళాలు ఏర్పరచడం, గ్రామ పంచాయతీల కమిటీలను ఏర్పాటు చేయటం, ఆ కమిటీలలో ఇద్దరు మహిళలకు స్థానం కల్పించటం, తాళ్ళ పంపకం, భూ పంపకం, వాటి నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసి పంపకాలలో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడడం, బాల సంఘాల ఏర్పాట్లు మొదలైన పనులను స్వరాజ్యం కడు సమర్థతతో, బాధ్యతాయుతంగా, సక్రమంగా నిర్వహించేది. సూర్యాపేట తాలూకాలో ఎర్రపాడు అనే గ్రామం ఉంది. ఆ ఊరి దొరగారి కి వేలల్లో కాక లక్షల ఎకరాల భూములున్నాయి. వేల ఎకరాలలో మామిడి తోటలుండేవి. ఆ తోటల్లో దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన మామిడి పళ్ళు ఉండేవి. ఆ రోజుల్లో ఆ తోట మన దేశంలోనే ప్రసిద్ధి చెందినదిగా చెప్పుకునేవారు. అటువంటి దొరల భూములు, పేద ప్రజల నుంచి ఆక్రమించుకున్న భూ కబ్జాదారుల నుంచి దాదాపు పది లక్షల ఎకరాల భూమిని పార్టీ తరపున పేద ప్రజలకు పంచారు. సమాజంలో మహిళా సమస్యలపైనా స్వరాజ్యం గణనీయమైన కృషి చేశారు. అగ్ర కులాల, భూస్వామ్య కుటుంబాలలో కూడా తండ్రి ఆస్తిలోను, భర్త ఆస్తిలోను హక్కు ఉండేది కాదు. భర్త చనిపోయిన ఆడపిల్లలున్న మహిళలకు కూడా భర్త ఆస్తిలో భాగముండేది కాదు. అదే మగపిల్లలైతే మేజర్లయిన తర్వాత హక్కుదారులయ్యేవారు. భర్త వదిలిపెట్టిన మహిళల జీవితం కడు దుర్భరంగా ఉండేది. పుట్టినింటిలో తండ్రి ఆస్తిలో హక్కులేక, అత్తవారింటిలో ఉండే వీలులేక వారి జీవితాలు రెంటికి చెడిన రేవడిలాగా ఉండేవి. కొంతమంది భార్య బ్రతికుండగానే ఇద్దరిని, ముగ్గురిని పెండ్లి చేసుకునేవారు. అలా చేసుకోవడం మొదటి భార్యకు, రెండవ భార్యకు ఇష్టమున్నా లేకున్నా పడి ఉండాల్సిందే. అగ్ర కులాలలో కూడా మహిళలు భర్తల చేతుల్లో దెబ్బలు తినేవారు. అటువంటి బాధిత స్త్రీలు కొంతమంది స్వరాజ్యం దగ్గరికొచ్చి ఫిర్యాదు చేసినవారున్నారు.  స్వరాజ్యం వారి భర్తలతోను, కుటుంబ సభ్యులతోను మాట్లాడి, పోట్లాడి, నచ్చచెప్పి కొంత భూమిని అటువంటి బాధిత మహిళలకు ఇప్పించేవారు. కొంతమంది మహిళలు విడిపోయి పార్టీలోకొచ్చి పనిచేసేవారు. ఆ రోజుల్లో అగ్రకులాల్లో విడాకులు లేవు. అయినా విడిపోదలచిన మహిళలకు అటువంటి తీర్పు చెప్పడానికి సాహసం చేయవలసి వచ్చేది. అటువంటి సందర్భాలలో స్వరాజ్యం తాళిబొట్లను తెంపేదన్న అపవాదును కూడా భరించవలసి వచ్చేది. శ్రామిక మహిళలకు, నిమ్న కులాల మహిళలకు ఈ బాధలేదు. వారికి ఉన్నదీ లేదు, పోయేదీ లేదు. భర్త చనిపోయినా, వదిలిపెట్టినా పెండ్లిని పెద్దలే చేసేవారు. ఆ పద్ధతిని మారు మనువనేవారు.

వెట్టిచాకిరీని నిర్మూలించిన ఘనత పార్టీకే చెందుతుంది. పార్టీ ఆధ్వర్యంలో ప్రజారాజ్య పాలన 200-300 గ్రామాలలో నిరాఘంటంగా సాగింది. దొరలు గడీలు వదిలిపెట్టి పట్నం దారి పట్టారు. ఇదంతా గమనించిన నిజాం నవాబు తన నిరంకుశ పాలన సౌధం బీటలు వారుతోందని గ్రహించాడు. రజాకార్లకు ఆయుధాల నిచ్చి ఉసిగొల్పి ఊరుమీదికొదిలాడు రజాకార్ల నాయకుడు ఖాసింరజ్వీ. ‘ఇత్తేహద్ద ముసల్మాన్‌’ను స్థాపించాడు. ముస్లింలలో  మతద్వేషం పురిగొల్పడం ఆ సంస్థ చేసే పని. రజాకార్లు ఆయుధాలతో లారీలలో గ్రామాల మీద విరుచుకుపడి నానా భీభత్సం సృష్టించారు. కంటికి కనిపించిన ధనధాన్యాలను దోచుకుని లారీలలో తీసుకెళ్ళే వారు. ఇత్తడి, పుత్తడి, మహిళల మెడలోని పుస్తెలు, చెవుల గంటీలు, కాళ్ళ కడియాలు సమస్తమూ దోచుకుపోయారు. మహిళలపై సామూహిక అత్యాచారాలు చేశారు. బాలెంల, పాత సూర్యాపేట మొదలగు గ్రామాలలో ప్రజలను వరుసగా నిలబెట్టి పిట్టల్ని కాల్చినట్లు  కాల్చివేశారు. గ్రామాలను తగులబెట్టారు. పార్టీ కార్యకర్తలు ప్రజలను సంఘటితపరిచి దళాలు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లలో స్వరాజ్యం పాల్గొన్నారు. ప్రజలు తమ ఇళ్ళలో ఉన్న కర్రలతోను, కట్టెలతోను, కొడవళ్ళతోను, గొడ్డళ్ళతోను, రాళ్ళు, రప్పలతోను రజాకారు ముష్కరులను ఎదిరించి తరిమి తరిమి కొట్టారు. మహిళలంతా ఒకచోట చేరి వారి కళ్ళల్లో కారం చల్లి తప్పించుకున్నారు. నిజాం సర్కారు రైతులు పండించిన పంటనుండి నిర్భంద లెవీని వసూలు చేసేది. ఆకునూరు, మాచిరెడ్డిపల్లి గ్రామాలలో రజాకార్లు సకలం దోచుకున్నారు. ధాన్యాన్ని బండ్లకెత్తారు. మహిళలంతా ఏకమై బండ్లకెత్తిన ధాన్యాన్ని బండ్ల కాడలను ఎత్తి నేలమీద కుమ్మరించారు. ఆ గ్రామ వాసులు తీవ్రంగా ప్రతిఘటించారు. మహిళలు రజాకారు మూకల కళ్ళల్లో కారం చల్లి మూడు తుపాలకును స్వాధీనం చేసుకుని ధాన్యాన్ని కాపాడుకున్నారు. అలా మూడు రోజులపాటు ఆ గ్రామాల ప్రజలు పోరాడారు. రజాకార్లు మహిళలపై అత్యాచారాలు చేశారు. గ్రామాలను తగులబెట్టారు. చరిత్రలో చెంగిజ్‌ఖాన్‌, నాజీలను మించిపోయారు ముష్కరులు. ఆనాటి సంస్థాన పత్రికల సంపాదకులు కష్టనష్టాలను భరించి పత్రికలను నడిపి రజాకార్ల దురాగతాలను నిర్భయంగా ప్రచురించారు. ఆనాటి విలేఖరులు ప్రాణాలకు తెగించి గ్రామాలలో పర్యటించి వాస్తవ విషయాలను సేకరించారు. వారి దురాగతాలను ఖండిస్తూ వార్తలు ప్రచురించినందుకు రజాకార్లు షోయబ్‌ ఖాన్‌ అనే పత్రికా సంపాదకుడి తలను, చేతులను నరికి పళ్ళెంలో పెట్టి ఖాసిం రజ్వీకి కానుకగా సమర్పించారు. దేశం నలుమూలల నుండి వెలువడే వార్తా పత్రికలన్నీ సంస్థానంలో జరిగే భీభత్సాలను ప్రచురించేవి. బయటినుండి వచ్చే పత్రికలను నవాబు నిషేధించాడు. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌ పాలన ఉంది. ప్రభుత్వం నిజనిర్ధారణ కొరకు పద్మజానాయుడిని సంస్థానానికి పంపింది. ఆ సమయంలో స్వరాజ్యం ఆ గ్రామాలలోనే ఉంది. పద్మాజా నాయుడు మాచిరెడ్డిపల్లి, ఆకునూరు గ్రామాలను సందర్శించి ప్రజలతో మాట్లాడి వాస్తవ విషయాలు తెలుసుకున్నారు. ఒక నివేదిక తయారుచేసి కేంద్రానికి అందచేశారు. ప్రజలతో మాట్లాడే సందర్భంలో స్వరాజ్యం గురించి విన్నారు పద్మజా నాయుడు. ఆమె రాసిన ”హు ఈజ్‌ హు” అనే ఇంగ్లీష్‌ గ్రంథంలో స్వరాజ్యం పేరును ఉల్లేఖించారు.

పద్మజానాయుడి నివేదిక తర్వాత కేంద్ర ప్రభుత్వం హైద్రాబాద్‌ సంస్థానం మీద సైనిక చర్య తీసుకుంది. ఫలితంగా 1948 సెప్టెంబర్‌ 17న నిజాం నవాబు లొంగిపోయాడు. సంస్థానం యూనియన్‌లో విలీనం చేయబడింది. స్టేట్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడింది. దాంతో జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, దొరలు ఖాదీ ధరించి గాంధీ టోపీలు పెట్టుకుని కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుని కొత్త అవతారాలెత్తారు. గ్రామాలకు చేరుకుని దొరతనం మొదలుపెట్టారు. పార్టీ పేదలకు పంచిపెట్టిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టారు. మొదటిసారి నిజాంకు వ్యతిరేకంగా, రెండవసారి కాంగ్రెస్‌ పాలనతోనూ పార్టీ పోరాడవలసి వచ్చింది. ఈసారి అడవుల దారి పట్టారు. పార్టీ తెలంగాణా సాయుధ పోరాటానికి పిలుపు నిచ్చింది. ఆయుధాలు చేబూనారు. అడవుల్లో ఏరియా కమిటీలు ఏర్పడ్డాయి. ఉత్తర ఏరియా కమిటీలో స్వరాజ్యం, ఓంకార్‌, మల్లు నరసింహారెడ్డి, ముకుందరావు సభ్యులుగా ఉన్నారు. తర్వాత కమిటీ సెక్రటరీగా, రాజకీయ దళ కమాండరుగా స్వరాజ్యం నియమితుల య్యారు. రాజకీయ దళ కమాండర్‌ పదవి గెరిల్లా పోరాటాలలో అత్యంత బాధ్యతాయుతమైనది. తుపాకీ గురిపెట్టి పేల్చడంలో  నిష్ణాతులైన వారిని, ఈతలోను, పరుగులోను ఆరితేరిన వారినే పార్టీ ఆ పదవిలో నియమించేది. చిన్నతనంలో నేర్చుకున్న ఈత, గుర్రపు స్వారీ, కబడ్డీ ఆటలు ఆమెకు ఆ పదవి చేపట్టడంలో ఎంతగానో

ఉపయోగపడ్డాయి. గిరిజన మహిళలను సమీకరించి  గిరిజన దళాలను ఏర్పాటు చేసి వారికి తుపాకీ గురిపెట్టడం, గెరిల్లా పద్ధతుల్లో మిలటరీ క్యాంపులపై దాడిచేయడం, శత్రువు నుంచి తప్పించుకుని ఆత్మరక్షణ చేసుకోవడంలోను శిక్షణనిచ్చేవారు. స్వరాజ్యం ఆ పనిలో ఆరితేరి గెరిల్లా పోరాట యోధురాలిగా పేరుపొందారు. అడవుల్లో డా||రాందాసు వద్ద ప్రాథమిక చికిత్స నేర్చుకుని తండాలోని మహిళలకు కాన్పులు కూడా చేసింది స్వరాజ్యం. నిజాం సర్కారు ఆమెమీద పదివేల రూపాయల రిమాండ్‌ ప్రకటించింది కూడా. కానీ ఆమె పోలీసులకు చిక్కలేదు.

అనేక కారణాల వలన స్వరాజ్యం 1951లో పార్టీ సాయుధ పోరాటం విరమించుకుంది. దేశం స్వతంత్రమైన తర్వాత 1952లో సార్వత్రిక ఎన్నికలొచ్చాయి. జైళ్ళలో ఉన్నవారు విడుదల చేయబడ్డారు. కేసులున్నవారు, అజ్ఞాతంలో ఉన్నవారు అడవుల్లోనే ఉండిపోయారు. రహస్యంగా ఉండి హిట్‌లిస్ట్‌లో ఉన్నవారు దొరికినప్పుడు కాల్చివేయడం జరిగేది. ఎన్నికల సమయంలో ఆయుధాలు అప్పచెప్పి చర్చలకు రమ్మని విమానాల నుండి కరపత్రాలను వెదచల్లారు. పి.డి.ఎఫ్‌.పేరుతో ప్రజల అభిమానాన్ని చూరగొన్నవారిని ఆ ఎన్నికల్లో పోటీ చేయించాలని పార్టీ నిర్ణయించింది. అప్పటికీ అజ్ఞాతంలోనే ఉండి స్వరాజ్యం, ఓంకార్‌, వినయ్‌ లాంటి వారు వందలాదిమంది కార్యకర్తలను వెంట బెట్టుకుని పి.డి.ఎఫ్‌. అభ్యర్థులను గెలిపించవలసిందిగా ప్రజలలో ప్రచారం చేశారు. వారికి ప్రజల అండదండలు అపారంగా లభించాయి. పి.డి.ఎఫ్‌. అభ్యర్థులందరూ విజయభేరి మోగించారు. ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టారు. ఆ ఎన్నికల్లో రావి నారాయణరెడ్డికి నెహ్రుకంటే అత్యధిక ఓట్లు వచ్చాయి. డాక్టర్‌ జయసూర్య (సరోజినీ నాయుడు పెద్ద కుమారుడు) పి.డి.ఎఫ్‌. తరపున విశేషమైన కృషి చేశారు. పెద్దవెల్లి పట్టణంలో జరిగిన బ్రహ్మాండమైన సభలో డాక్టర్‌ జయసూర్య పి.డి.ఎఫ్‌.ను గెలిపించవలసిందిగా ఉత్తేజపూరిత ఉపన్యాసం చేశారు. ఆ సభకు స్వరాజ్యం రాజక్క అనే మారుపేరుతో (అజ్ఞాతంలో ఆమె పేరు) మారువేషంతో భుజాన స్టెన్‌గన్‌ తగిలించుకుని అది కనిపించకుండా నిండా గొంగళి కప్పుకుని ప్రజల్లో కూర్చున్నారు. ఆ సభకు ప్రజలను సమీకరించారు. స్వరాజ్యం వచ్చారన్న సంగతి జయసూర్యకు తెలిసింది. సభలో కామ్రేడ్స్‌ ఉన్నారని వారి త్యాగాలను ప్రశంసిస్తూ పోలీసులకు హెచ్చరిక చేశారు.

1954 నాటికి స్వరాజ్యం మీద నిజాం సర్కారు ప్రకటించిన పదివేల రూపాయల రివార్డును ప్రభు త్వం రద్దు చేసింది. అదే సంవత్సరం హైద్రాబాద్‌ పట్టణంలో విశాలాంధ్ర మహాసభ జరిగింది. వేలాదిమంది ప్రజలు సభకు వచ్చారు. ఏడు సంవ త్సరాలు అజ్ఞాతంలో ఉండి బయట కొచ్చి ఉపన్యసించడానికి వేదికనెక్కిన స్వరాజ్యాన్ని చూడగానే ప్రజల కరతాళ ధ్వనులు, జయజయ నినాదాలు మిన్నుముట్టాయి.

ఆమె ఉపన్యాసం విని ప్రజలు ఉర్రూతలూగిపోయారు.

ఉపన్యాసానంతరం అదేరోజు రాత్రి ఎమ్మెల్యే క్వార్టర్సులో బద్దం ఎల్లారెడ్డి, చంద్ర రాజేశ్వరరావుల సమక్షంలో మల్లు వెంకట నరసింహారెడ్డి (వీఎన్‌)తో స్వరాజ్యం వివాహం జరిగింది. అప్పుడు వీఎన్‌ అజ్ఞాతంలోనే ఉన్నారు. పూలదండల పెళ్ళే జరిగింది. వీఎన్‌ కూడా ఉద్యమాలలో, పార్టీలో ప్రధాన పాత్ర నిర్వహించారు. కేసుల వలన రహస్య జీవితంలోనే ఎక్కువ సమయం గడపవలసి వచ్చింది. పోరాట విరమణ తర్వాత కూడా కార్మికవర్గ దృక్పథంతోనే జీవితాన్ని గడిపారు. భూస్వామి బిడ్డయిన స్వరాజ్యం బీదరికాన్ని భరించలేక ఎప్పుడైనా నిరాశ, నిస్పృహలకు లోనైతే ఆమెకు ధైర్యం చెప్పి వెన్నుతట్టి ముందుకు నడిపించిన ఆదర్శనీయుడు వీఎన్‌.

వివాహానంతరం పిల్లలు పుట్టడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. తల్లిగారి నుండి వచ్చిన ఆస్తిలో రాయనగూడెంలో భూములు కొని వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. చెలకలు (మెట్ట భూములు) వర్షాధారంతో పంటలు పండే భూములు. సకాలంలో వర్షాలు లేక పంటలు పండక ఎన్నో కష్టాలు పడ్డారు. పస్తులున్నారు. కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తూనే వ్యవసాయం చూసుకుంటూనే వీలున్నపుడు సభలకు, సమావేశాలకు వెళ్ళి పాల్గొనేవారు. ఆమె మొదటి కాన్పుకు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దారిలోనే పురిటి నొప్పులొచ్చి ఒక చెట్టు కిందనే మగబిడ్డకు జన్మనిచ్చారు. బుద్ధుడు లుంబినీ వనంలో జన్మించినట్లుగానే తన కొడుకు చెట్టుకింద పుట్టాడు కాబట్టి ఆ బిడ్డకు గౌతమ్‌ అని పేరు పెట్టుకున్నారు. స్వరాజ్యం రాయనగూడెంలో ఒక గుడిసెలో

ఉండేవారు (అది నేటికీ ఉంది). ఆమె ముగ్గురు బిడ్డలను ఆ గుడిసెలోనే పెంచి పెద్దచేసి విద్యావంతులను చేశారు. గౌతమ్‌ డాక్టర్‌గానూ, నాగార్జున న్యాయవాదిగానూ పనిచేస్తున్నారు. కూతురు కరుణ బ్యాంక్‌

ఉద్యోగిగా పనిచేశారు

స్వరాజ్యం 1978-83 మధ్య  రెండుసార్లు తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హైద్రా బాద్‌లో రమోజాబీ, షకీలాబీలపై జరిగిన అత్యాచారం గురించి శాసనసభలో స్వరాజ్యం తన స్వరాన్ని వినిపించడంతో పార్టీలకు, రాజకీయాలకతీతంగా  మిగతా మహిళా ఎమ్మేల్యేలందరూ స్వరాజ్యంను బలపరిచారు. ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభ లోపల, బయట ఆమె ఎనలేని కృషి చేశారు.

ఆమె నియోజకవర్గంలో పేద ప్రజలకు పంచిపెట్టిన 900 ఎకరాల భూమిని దొరలు స్వాధీనం చేసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తహసీల్దారుతో మాట్లాడి భూమిని సర్వే చేయించి ఆ 900 ఎకరాలను తిరిగి వారికి స్వాధీనం చేయిం చారు. 1981 నుండి 2000 సంవత్సరం వరకు ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎన్నిక య్యారు. ఐద్వా తరపున వెలువడుతున్న ‘చైతన్య మానవి’ త్రైమాసిక పత్రికా సంపాదక వర్గంలో సభ్యురాలిగా నేటికీ కొనసాగుతున్నారు. ఆంధ్ర మహిళా సంఘంతో కలిసి మద్యం మహమ్మారికి వ్యతిరేకంగా ఆంధ్ర దేశమంతటా తిరిగి ప్రచారం చేశారు. సారా వ్యతిరేకోద్యమానికి శ్రీకారం చుట్టారు. నెల్లూరు నేలతల్లి బిడ్డ దూబగుంట (ఊరిపేరు) రోశమ్మ మహిళలందరినీ కూడగట్టుకుని ఆ ఊరుకొచ్చిన సారా ప్యాకెట్లను లారీ నుంచి బయట కుమ్మరించి నిప్పంటించి ధ్వంసం చేశారు. తెల్లవారేసరికి ఆ వార్త పత్రికల ద్వారా, మీడియా ద్వారా రాష్ట్రమంతటా వ్యాపించింది. హైద్రాబాద్‌లో గాంధీభవన్‌లో అన్ని మహిళా సంఘాలతో కలిసి 1993లో సంపూర్ణ మద్యనిషేధ ‘ఐక్యవేదిక’ ఏర్పడింది. సూర్యదేవర రాజ్యలక్ష్మి అధ్యక్షురాలిగా మల్లు స్వరాజ్యం ముఖ్యపాత్రలో ఎన్నుకోబడ్డారు. రాష్ట్ర ఉద్యమంగా తీర్చిదిద్దడంలో ముఖ్యపాత్ర పోషించారు. ఐక్యవేదికలో మోటూరు ఉదయం, చండ్ర రాజకుమారి, సంధ్య, వాసిరెడ్డి సీతాదేవి మొదలగువారు సభ్యులుగా ఎన్నికయ్యారు. 1994 అక్టోబరు 2న గాంథీ జయంతికి పూర్వమే ‘సంపూర్ణ మద్య నిషేధ చట్టం’ చేయాలని లేనిచో గాంధీ జయంతి రోజున ఆయన విగ్రహానికి దండలు కూడా వేయకుండా అడ్డుకుంటామని అందరూ ప్రతిన బూనారు. అనుకున్నట్లుగానే 1994లో గాంధీ జయంతినాడు  ఐక్యవేదిక నాయకత్వాన బ్రహ్మాండమైన ఊరేగింపు జరిగింది. ‘నభూతో నభవిష్యతే’ అన్న రీతిలో 20 వేలమంది మహిళలు యుద్ధ రంగంలో కదంతొక్కే వీర నారిల్లాగా,  నింగీ నేల ఏకమైనదా  అన్నట్లు, భూనభోంతరాలు దద్దరిల్లేలాగ నినాదాలు చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లోని గాంధీ విగ్రహం ముందు మహిళా సంఘ నాయకులు ధర్నా చేశారు. కార్యకర్తలు, మహిళలు అందరూ ఏకమై ముఖ్యమంత్రిని, తదితరులను అడ్డగించి ముట్టడించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి మహిళల మీద, నాయకుల మీద లాఠీఛార్జి చేసి చితకబాదారు. నాయకులతో పాటు మిగతావారిని చేతులు, జుట్టు పట్టుకుని దుర్భాషలాడుతూ ఈడ్చుకెళ్ళి లారీలు, వ్యానుల్లోనికి తోసివేశారు. ఈ తొక్కిసలాటలో కొంతమంది నేతల చీరలు చిరిగిపోయాయి. ప్రజాతంత్ర మహిళా సంఘ కార్యకర్తలందరికీ స్వరాజ్యం నాయకత్వం వహించి ఆ పోరాటంలో ముందు నిలిచారు. ఆ రోజు స్వతంత్ర భారత పోలీసులు మహిళల ఎడల ప్రవర్తించి నట్లుగా పరాయి పోలీసులు కూడా ఏనాడూ ప్రవర్తించలేదు.

ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఊరేగింపు  జరిపి అసెంబ్లీ ముందు గన్‌పార్క్‌ పక్కన సభను ఏర్పాటు చేసి ఎన్టీ రామారావును సభకు ఆహ్వానించి రప్పించారు. స్వరాజ్యం నాయకత్వంలో లక్షలాదిమందితో సంతకాలు చేయించిన పది డిమాండ్లతో కూడిన మెమొరాండంను రామారావు గారికి అందజేశారు.

1. తండ్రి ఆస్తిలో ఆడపిల్లకు సమాన హక్కు

2. వరకట్న వ్యతిరేక చట్టం

3. మహిళా శిశు సంక్షేమ ప్రాంగణాలు

4. జిల్లాకొక నర్సింగ్‌ శిక్షణా కేంద్రం

5. స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్లు

6. మహిళల పేరుతో భూ పంపకం

7. మరుగుదొడ్లు

8. వితంతు పింఛను

9. పేద మహిళలకు ప్రసూతి అలవెన్స్‌ మొదలైనవి.

స్వాతంత్య్రానంతరం మహిళల సమస్యలమీద స్పందించి అమలుకు పూనుకున్న ప్రథమ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావే. తండ్రి ఆస్తిలో ఆడపిల్లకు సమాన హక్కును కలిగించే చట్టం చేయడం రాష్ట్ర పరిధిలో లేదు. ఎన్‌టిఆర్‌ అసెంబ్లీలో దీనిని చర్చించడానికి ఒక కమిటీని వేశారు. దానిలో స్వరాజ్యం గారిని ఒక సభ్యురాలిగా నియమించారు. పట్టుదలతో కృషి చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాష్ట్ర అసెంబ్లీలో చట్టం పాస్‌ చేయించి తెలుగు ఆడపడుచులను తండ్రి ఆస్తిలో హక్కుదారులుగా చేసిన ఘనత ఎన్‌టిఆర్‌కే దక్కుతుంది. ఆ హక్కు కోసం అహర్నిశలు పాటుపడిన కీర్తి ఐద్వాకే దక్కుతుంది. దేశ స్వాతంత్య్రానికి పోరాడిన మొదటి తరానికి చెందిన దేశభక్తురాలు దువ్వూరి సుబ్బమ్మగారి పేరుతో స్వరాజ్యం గారికి 2000 సంవత్సరంలో అవార్డు ప్రదానం చేసి సన్మానించారు. స్వరాజ్యం గారితో పాటు ఆరుట్ల కమలాదేవి గారిని, ఉద్దంరాజు మాణిక్యాంబ మొదలైనవారిని ‘దువ్వూరి సుబ్బమ్మ’ గారి పేరిట అవార్డులను బహుకరించి సత్కరించారు. ఆనాటి కర్నాటక గవర్నర్‌ వి.ఎస్‌.రమాదేవి, సినారే, తెలుగు యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ ఎన్‌.గోపి, నాయని కృష్ణకుమారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో రాజ్యలక్ష్మి ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం  జరిగింది. స్వరాజ్యం గారు 2000 సంవత్సరంలో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు.

దోచుకునే భూస్వామ్య కుటుంబంలో పుట్టి, దోపిడీకి గురైనవారి పక్షాన నిలబడి పోరాడిన అసాధారణ కమ్యూనిస్టు మహిళా నేత మల్లు స్వరాజ్యం గారు. వర్గభేదం లేకుండా బాధిత మహిళల తరఫున నిలిచి పోరాడి, న్యాయం చేకూర్చిన మానవతావాది. అగ్రకులాల మహిళలు కూడా భర్తల చేతుల్లో చావుదెబ్బలు తినేవారు. గొడ్డును కర్రతో బాదినట్లుగా భార్యలను కొట్టడం తమ హక్కుగా భావించే దురాగతాన్ని మాన్పించడానికి ఆమె ఎంతో కృషి చేశారు. భూస్వామి బిడ్డననే భేషజం ఎన్నడూ ఆమె దరిదాపులకు కూడా రాలేదు. నీళ్ళలో చేపలాగా ప్రజల్లో కలిసిపోయేది. వారితోపాటు ముంతల్లో నీళ్ళు తాగి, వంచిన గంజినీళ్ళతో కడుపు నింపుకుని, జొన్న సంకటి తిని వారిచేత తమ మనిషిగా గుర్తింపు పొందింది. అటువంటి ఆమెను ప్రజలు తమ గుండెల్లో పదిలంగా దాచుకున్నారు. తమకు పుట్టిన ఆడబిడ్డలకు స్వరాజ్యం పేరుని పెట్టుకునేవారు. చొరవ, సమయస్ఫూర్తి, ఆత్మస్థైర్యం ఆమెలో పుష్కలం. పార్టీ కార్యక్రమాలను అమలు పరచడంలో దిట్ట. పార్టీని, ఉద్యమాలను, స్వరాజ్యం గారిని వేరుచేసి చూడలేం. వాటితో మమేకమైన జీవితం ఆమెది. 12వ ఏటనే ఉద్యమంలో అడుగిడిన స్వరాజ్యం గారు అష్టపదులు నిండిన వయసులో నేడు కూడా వెనక్కు తిరిగి చూడడం ఎరుగరు. మొదటినుండి చివరివరకూ పార్టీని వీడకుండా పనిచేసిన మహిళలను వేళ్ళమీద లెక్కించవచ్చు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాలవల్ల మధ్యలో మానుకున్నవారే ఎక్కువ. అవరోధాలను అధిగమించి మడమతిప్పని మేటి మహిళా యోధురాలు మల్లు స్వరాజ్యం గారు. విశాలాంధ్ర ముద్దుబిడ్డగా పిలువబడ్డారు. కమ్యూనిస్టు పార్టీ సంస్థాపకులు, పార్టీ రథసారధులు, యోధానుయోధులు పుచ్చలపల్లి సుందరయ్య గారు, రావి నారాయణరెడ్డి గారు, దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ‘తెలంగాణా పోరాటాల’ గురించి తాము రచించిన గ్రంథాలలో స్వరాజ్యంగారి పేరు ప్రత్యేకంగా ఉల్లేఖించారు. ఈ పోరాటంలో నాలుగు వేల మంది యోధులు నేలకొరిగారు. అశేష త్యాగాలతో దినదిన ప్రవర్థమైన ప్రజా ఉద్యమం ‘తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం’ చరిత్రలో అజరామరంగా నిలుస్తుంది. దాంతోపాటు మల్లు స్వరాజ్యం గారి జీవితం కూడా వేగుచుక్కలాగా వెలుగునిస్తుంది.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.