అత్తింటి పెనం మీంచి… షెల్టర్‌ హోమ్‌ పొయ్యిలోకి… కె. సత్యవతి & పి. ప్రశాంతి

ముప్ఫై సంవత్సరాలు… మూడు దశాబ్దాలుగా నేను స్త్రీల అంశాలమీద పనిచేస్తున్నాను. స్త్రీల మీద పెరుగుతున్న హింసని అతి సమీపంగా గమనిస్తున్నాను. మారుతున్న స్త్రీల సమస్యలు, ఆ సమస్యల కొత్త రూపాలు, ఆఖరికి టెక్నాలజీ సృష్టిస్తున్న అనేకానేక ఇబ్బందులు… వరకట్న మరణాలు, గృహ హింస, పనిచేసేచోట వేధింపులు, అత్యాచారాలు… సమస్యలు పరిష్కారం కాకుండానే కొత్త సమస్యలు. ప్రభుత్వం తాము చెయ్యాల్సిందంతా చేసేస్తున్నామని, బోలెడు చట్టాలు తెచ్చేశామని తెగ ప్రచారం చేసుకుంటోంది. అడిగిన చట్టం, అడగని చట్టం అన్నీ చేసేసి చేతులు దులిపేసుకుంది. అవి అమలవుతున్నాయా? ప్రచారం జరిగిందా? తమ రక్షణ కోసం సవాలక్ష చట్టాలున్నాయని బాధిత మహిళలకు తెలుసా? బడ్జెట్లు కేటాయించారా? సిబ్బంది వున్నారా? పర్యవేక్షణ వుందా? అన్నీ ప్రశ్నలే… ఒక్క ప్రశ్నకీ సమాధానం దొరకదు.

ముఖ్యంగా గృహహింస నిరోధక చట్టమొచ్చి దశాబ్దం గడిచిపోయింది. అద్భుతమైన చట్టంగా కీర్తి కిరీటాలు పొందిన ఆ చట్టం ఆచరణలో ఘోరంగా విఫలమైంది. విఫలమవడానికి కారణాలు అనేకం. చట్టం అమలు అతుకుల బొంతగా వుండి, పూర్తి స్థాయి రక్షణాధికారి లేక, జిల్లా మొత్తానికి అరకొరగా ఇద్దరు కౌన్సిలర్లను మాత్రమే నియమించి, వారికి ఎలాంటి శిక్షణ, సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల గృహ హింస నిరోధక చట్టం నీరుగారి పోయింది. బాధిత స్త్రీలకు చట్టంలో ఎన్నో వెసులుబాట్లను, పరిహారాలను కల్పించినా, న్యాయవ్యవస్థలోని జెండర్‌ ఇన్సెన్సిటివిటీ వల్ల చట్టం అందించిన ఫలితాలు బాధితులకు చేరడం లేదు. విపరీతమైన హింస జరుగుతోంది అంటూ బాధితురాలు మొత్తుకున్నా రక్షణ ఉత్తర్వులు రావడంలేదు. చట్టం అందుబాటులోకి తెచ్చిన నివాసపు హక్కు ఆర్డర్లు వెలువడడం లేదు. కట్టుబట్టలతో బయటకు నెట్టేసినా ”ఆ ఇంట్లో నీకూ హక్కుంది… అక్కడే వుండొచ్చు” అంటూ ఆర్డర్‌లు ఇచ్చిన కేసుల్ని వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. బాధిత మహిళలు, పిల్లలతో సహా రోడ్లమీదకి గెంటేయబడి పోలీస్‌ స్టేషన్‌ల చుట్టూ, కోర్టుల చుట్టూ, డి.వి. సెల్స్‌ (ప్రస్తుతం సఖి సెంటర్లు) చుట్టూ తిరుగుతున్న విషాద దృశ్యాలు పదేళ్ళ గృహ హింస నిరోధక చట్టం అమలులోని డొల్లతనాన్ని కళ్ళముందు ఆవిష్కరిస్తోంది.

2005లో గృహహింస నిరోధక చట్టం మొదటిసారిగా స్త్రీలకు నివాస హక్కు కల్పించిందని ఘనంగా చెప్పుకుంటున్నాం… ఆమె పుట్టి పెరిగిన ఇంటిలో ఆమెకు హక్కెందుకు లేకుండా పోయిందో… ఈ హక్కు లేకపోవడం వల్లనే ఆమె అత్తింటి హింసలోంచి బయటికి రాలేకపోతోంది, వచ్చినా పుట్టింటి గడప తొక్కే హక్కును హరించి వేయడంవల్ల ప్రభుత్వాలు అమలు చేసే ‘హోమ్‌’లలో తలదాచుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వాలు నిర్వహించే (ఎన్జీవోలు) హోమ్‌లు ఎలా వుంటాయో, అక్కడెలాంటి సౌకర్యాలుంటాయో ఊహించడం కష్టమేమీ కాదు. చాలాసార్లు బాధితులు ఇంటి పెనం మీంచి హోమ్‌ పొయ్యిలో పడినట్లవుతోంది. హింసవల్ల మానసికంగా కుంగిపోయి, ఇంటినుంచి నెట్టేయబడి, సర్వం కోల్పోయిన నిస్సహాయ స్థితిలో తన పుట్టింటికి వెళ్ళలేకపోవడాన్ని మించిన అమానుషం మరొకటి లేదనిపిస్తుంది. పెళ్ళి ముందు వరకు కంటికి రెప్పలా కాపాడుకుని ప్రేమించే తల్లిదండ్రులు పెళ్ళి పేరు చెప్పి, సంసారమనే సుడిగుండంలో బిడ్డ తల్లడిల్లిపోతుంటే గుండెల్లో పొదుపుకోవాల్సింది పోయి ”చావైనా బతుకైనా అక్కడే… పుట్టింట నీకు స్థానం లేదు” అని ఈసడించడం ఎలాంటి న్యాయమౌతుంది? పుట్టింట కొడుకుకి 365 రోజులూ హక్కులున్నప్పుడు, అదే ఇంట పుట్టిన కూతురుకెందుకు ఉండకూడదు? పుట్టెడు దు:ఖంలో వున్నపుడు ఆమెను ఇంటికి రానివ్వకుండా ప్రభుత్వ హోమ్‌ల పాల్జేసి, డిప్రెషన్‌లోకి జారిపోయి ఆత్మహత్య చేసుకునో, అత్తింటివాళ్ళ చేతుల్లో హత్యకు బలైతే గుండెలు బాదుకుని ఏడ్చే తల్లిదండ్రుల మీద ఎంత మాత్రమూ జాలి కలగదు. ఆమె చావుకు మొగుడెంత బాధ్యుడో, తల్లిదండ్రులూ అంతే బాధ్యత వహించాల్సి వుంటుంది. బతికున్నప్పుడు, ఆమెకు సహాయం అవసరమైనప్పుడు ఆదుకోవడానికి ముందుకు రాని తల్లిదండ్రులు ఆమె చనిపోయాక అరెస్టులు చేయమని, వస్తువుల్ని, కట్నాలని వెనక్కు ఇవ్వమని డిమాండ్‌లు చెయ్యడం మహా ఘోరం. చెట్టంత ఎదిగిన కూతురు కళ్ళముందే కాలి బూడిదైపోయినా సరే కట్నం సొమ్ములు ఇప్పించమని అడిగే తల్లిదండ్రుల నైచ్యం తీవ్ర కోపం తెప్పిస్తుంది.

ఆడపిల్లంటే అత్తింటికెళ్ళాలి… మగపిల్లాడంటే పుట్టింట్లోనే వుండాలి… ఆ అత్తింట ఆరళ్ళనే పళ్ళ బిగువున భరించాలి… వాళ్ళు పెడితే తినాలి… కొడితే పడాలి. ఇంట్లోంచి గెంటేస్తే బయటకు వెళ్ళిపోవాలి… చంపేస్తే చనిపోవాలి. ఈ చెత్త సంప్రదాయాలని ఇంకా ఎంతకాలం భరిద్దాం… ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు ఆడవాళ్ళ ప్రాణాలను హరిస్తుంటే కూడా మౌనంగా వుండడం… ముఖ్యంగా తల్లిదండ్రులు పట్టనట్లు వదిలేయడం… ఇవే ధోరణులు వ్యవస్థల్లో, పోలీసుల్లో, న్యాయస్థానాల్లో ఎదురవ్వడం వల్లనే ఈ రోజు హింసలు పెచ్చరిల్లిపోతున్నాయి. చట్టాలు వున్నప్పటికీ అమలు చేయాల్సిన వ్యవస్థల్లో పేరుకున్న పితృస్వామ్య భావజాలం బాధితులకు ఎలాంటి న్యాయాన్ని అందించడం లేదు.

జన్మనిచ్చిన తల్లిదండ్రులూ ఆదుకోక, రక్షణనివ్వాల్సిన చట్టాలూ అమలు కాక, హింసలో మగ్గుతున్న మహిళలు మరింత హింసకు గురవుతున్నారు తప్ప ఎక్కడా పరిష్కారాలు దొరకడం లేదు. పైగా కొందరు మరణాలవైపు నెట్టేయబడుతున్నారు.

తల్లిదండ్రులూ!!! ఆలోచించండి… పెళ్ళి చేసేస్తే మీ బాధ్యత తీరిపోయిందనుకోకండి. అసలు హింసల కథ అప్పుడే మొదలవుతుంది. పుట్టెడు దు:ఖంతో పుట్టింటికొస్తే నీ కక్కడి చోటులేదంటూ వెళ్ళగొట్టి వసతి గృహాల పాల్చేయకండి. కడుపున పుట్టిన గారాల పట్టిని మట్టి పాల్జేయకండి. కన్నవాళ్ళే కాదంటే… ఎక్కడికి పోతుంది????

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో