మనసు గీచిన బొమ్మలు ఈ సినిమాలు! – శివలక్ష్మి

”ఓ నాటికి ఈ భూమండలం నాగరికతా ముఖచిత్రాన్ని మార్చివేయగల శక్తివంతమైన నవ కల్పన సినిమా. తుపాకీ తూటా, విద్యుత్‌ శక్తి, నూతన ఖండాలు కనుగొనటం కన్నా ప్రధానమైన ఆవిష్కరణ సినిమా. ఈ భువిపై మానవాళి ఒకరి కొకరు తెలుసుకోవడానికి, ఒకరి కొకరు చేరువ కావడానికి, ఒకరి నొకరు ప్రేమించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది సినిమా. సినిమాకు సముచిత ప్రాధాన్యతనిద్దాం. ప్రేమిద్దాం! గౌరవిద్దాం!” అని అంటారు ముస్తఫా కమాల్‌ అటాటర్క్‌.

చలనచిత్రమంటే కదిలే బొమ్మలతో కథ చెప్పేది. తక్కువ మాటలు – ఎక్కువ దృశ్యాలు. సినిమా అంటే పురోగమనమని అర్థం. దాని సమానార్థకమే సినిమా! ప్రపంచ సమాజంలో వెల్లివిరిసిన భావ పరంపరల వ్యక్తీకరణ సాహిత్యమైతే దాని విస్తృత దృశ్యీకరణే సినిమా! దృశ్యీకరణ ద్వారా మనిషిని చిరంజీవిని చేసింది సినిమా!

దృశ్యమైతే జీవితాంతం మనసులో ముద్ర పడిపోతుంది. ఉదాహరణకి కన్యాశుల్కంలో సావిత్రి ఏడు నిమిషాలపాటు నవ్విన దృశ్యం. ఒకసారి చూసినవారు ఆ దృశ్యాన్ని మర్చిపోవడం అసంభవం. కొన్ని వందలు, వేలు, లక్షల మంది పుస్తకాలు చదివితే ఎన్నో కోట్ల మంది సినిమాలు చూస్తారు. ఏది సాధించాలన్నా ముందు ప్రజల ఆలోచనా విధానాల్లో మార్పు రావాలి. భావవ్యాప్తి లేకుండా ఏదీ సాధ్యం కాదు. మన రాష్ట్రం, మన దేశం అని కాకుండా రచయితలు ప్రపంచానికి చెందినవారనుకుంటే, మనం ఇప్పుడు ప్రపంచీకరణ వల్ల ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ ప్రపంచం వైపుకి దృష్టి సారిస్తే, ప్రతి విషాదాన్నీ మనకంటే ముందు ఎదుర్కొన్న వాళ్ళు ప్రపంచ సినిమాల్లో కనిపిస్తారు. కష్టంలో ఉన్న మనుషులకి గొప్ప దన్నూ, మనం ఒంటరి వాళ్ళం కాదు అనే భరోసా లభిస్తాయి. కనపడని సమాజం, వ్యవస్థలు మనుషుల రూపంలో చేస్తున్న ఆగడాలు తెలిసి వస్తాయి. ఎవరు చెప్పినా నమ్మం నుక మన నరనరాల్లో జీర్ణించుకు పోయిన ఆమానుషత్వం, అవినీతి, ఉదాసీనత, మూఢవిశ్వాసాలు, అసమర్థత, నిరక్షరాస్యతలను ఎదురుగా పెట్టి కళ్ళకు కట్టినట్లు మన జీవితాలను మనమే చూస్తున్నామా అన్నట్లు చూపిస్తాయి సినిమాలు.

ఏ వ్యక్తైనా అతని జీవితంలో వ్యక్తుల నుంచి, వ్యవస్థల నుంచి వచ్చిన ఒత్తిళ్ళను తట్టుకుని నిలబడి, ప్రశ్నించి, ప్రతిఘటించి, సామాజిక ఎజెండాను ఎదుర్కొని, ప్రజల ఆకాంక్షలను నిలబెట్టే ప్రయత్నంలో ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తూ చేసే ఏ పనైనా మానవజాతి పురోగమనానికి దోహదపడుతుంది. ప్రపంచంలోని ఎందరో ప్రతిభావంతులైన రచయితలు, కళాకారులు సినిమా మాధ్యమం ద్వారా మానవాళికి వినోదాన్నందిస్తూనే చైతన్యవంతం చేయడానికి తమ జీవితకాలమంతా శ్రమించి, పోరాడి, రహస్యంగా పనిచేసి, చివరికి ప్రాణత్యాగాలు కూడా చేసి చిరస్మరణీయమైన కృషి చేశారు.

సినిమా మేధావి చాప్లిన్‌ తన చిత్రాల్లో పాలక సమాజాన్ని తన వ్యాఖ్యానాలతో, విమర్శలతో చీల్చి చెండాడాడు.

రష్యాలో మార్క్స్‌ గతి తార్కిక భౌతికవాదాన్ని ”మాంటేజ్‌”కి అన్వయించి, అద్భుతమైన చిత్రాలు నిర్మించారు సెర్గాయ్‌ ఐజెన్‌ స్టీన్‌, వుడోవ్‌ కిన్‌ మొదలైన ప్రపంచ ప్రసిద్ధ ప్రముఖులు. ఫుడోవికిన్‌ గోర్కీ ”మదర్‌”ని చలనచిత్రంగా నిర్మిస్తే, ఐజెన్‌ స్టీన్‌ ”స్టైక్‌” లాంటి చిత్రాలను ”మాంటేజ్‌” విధానంలో రూపొందించారు.

లాటిన్‌ అమెరికా సినిమా రచయితలు – ”ప్రతీకారమో, ప్రాణత్యాగమో” అనే నినాదమిస్తూ జనంలో మమేకమై ”విప్లవానికి ప్రేలుడు పదార్థాల్లా ఉపయోగపడే చిత్రాలు తీస్తున్నాం” అంటూ గెరిల్లా సినిమాకు బాటలు పరిచారు.

జన్మనీ నుంచి పురుషాధిక్య ప్రపంచంలో నిలదొక్కుకున్న 56 మంది మహిళల్లో జుట్టా బ్రుకనీర్‌, మార్గరెట్‌ వాన్‌ ట్రోటా, డొరిస్‌ డెర్రీ, హెల్కే సాండర్స్‌ వంటి వారు ప్రపంచ ఉత్తమ దర్శకులుగా ఘనకీర్తి సాధించారు.

విదేశాల్లో అన్ని రకాల ఇజాల్లో సాహిత్యం వచ్చినట్లే, సినిమాలూ వచ్చాయి.

ఇటలీ నుంచి విట్టోరియా డిసికా తీసిన నియో రియలిస్ట్‌ సినిమా ‘బైసికిల్‌ థీఫ్‌’. ఈ సినిమా పూట గడవని మామూలు మనిషిని దోషిగా నిలబెడుతున్న కంటికి కనబడని అసలు దొంగ

ఫాసిజం అని తేల్చి చెప్తుంది. 1948లో వచ్చిన ఈ సినిమా మన సత్యజిత్‌ రే కి ప్రేరణనిచ్చి ”పథేర్‌ పాంచాలి” రూపంలో వాస్తవమైన అద్భుత సృష్టికి కారణమైంది.

మన దేశం విషయానికి వస్తే సత్యజిత్‌ రే, మృణాళ్‌ సేన్‌, రిత్విక్‌ ఘటక్‌, భూపేన్‌ హజారికా, శాంతారాం, బిమల్‌ రాయ్‌, గురుదత్‌, శ్యాం బెనగల్‌, గౌతం ఘోష్‌ మొదలైన ఎందరో ప్రతిభావంతులు మంచి సినిమాలతో అంతర్జాతీయ ఖ్యాతినార్జించారు. ఇక మన తెలుగు విషయానికొస్తే ”జాతీయోద్యమ చైతన్య దీపం చాలా చిన్నది” అని కె.వి.ఆర్‌. అన్నట్లు ఆ పరిమితుల్లోనే మన సినిమాలొచ్చాయి. జాతీయోద్యమ, సంస్కరణోద్యమ ప్రభావాలతో కొన్ని విలువల్ని ప్రతిబింబించే చిత్రాలు 50, 60 దశకాల్లో వచ్చాయి. ”సినిమా అన్నది చాలా శక్తివంతమైన సాంస్కృతిక మాధ్యమం. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోదగ్గ ప్రతిభావంతులు ఇంకా రావాల్సి

ఉంది” అన్నారు సినిమా రంగంలో ఎన్నో దశాబ్దాలు గడిపిన శ్రీశ్రీ. మహాకవి అన్నట్లే ఇప్పుడెదుర్కొంటున్న ప్రపంచీకరణ విపత్కర పరిస్థితులకు ఎదురు నిలిచే, చైతన్యాన్నిచ్చే చిత్రాలు మనకి లేవు.

ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా 1913లో ప్రపంచ సినిమా విశ్వవేదిక మీదికొచ్చింది. వెయ్యేళ్ళు గడిచాక ఇప్పుడొస్తున్న సినిమాలను పరిశీలిస్తే స్త్రీల జీవితాలు ఏ మాత్రం మెరుగుపడలేదనీ, వారు ఆత్మ గౌరవంతో జీవించే పరిస్థితులు ఏ దేశంలోనూ లేవనీ రుజువైంది. 1913 తర్వాత సరిగ్గా శతాబ్దం తర్వాత 2013లో వచ్చి నన్ను అమితంగా దు:ఖపెట్టి, కదిలించి, కలవరపెట్టి, మనసులో తిష్ట వేసిన రెండు సినిమా కథల గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను.

మొదటి సినిమా పేరు ”ఒసామా” (ూఝఎa)

ఇది ఆఫ్ఘనిస్తాన్‌ చిత్రం. దర్శకుడు బర్మెక్‌. 1996 నుండి ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వం చిత్ర నిర్మాణాలను పూర్తిగా నిషేధించింది. ఈ సినిమా ఆఫ్ఘనిస్తాన్‌, నెదర్లాండ్స్‌, జపాన్‌, ఐర్లాండ్‌, ఇరాన్‌ కంపెనీల మధ్య ఒక అంతర్జాతీయ సహ -ఉత్పత్తి వల్ల ప్రపంచం ముందుకొచ్చింది. ఈ సినిమా నిరాశ, భయంకరమైన లేమి, మరణం, విషాదం… అన్నీ కలగలిపిన ఒక గొప్ప షాక్‌! బాలికలు, మహిళలకు సంబంధించి ప్రపంచ దుస్థితినీ, వారి పట్ల వ్యవస్థలు అవలంబించే దుర్మార్గమైన పద్ధతులనూ అద్దంలో పెట్టి చూపించే చిత్రం.

ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల నియంతృత్వ పాలనలో ఉన్న సమయంలో ప్రజలపై ఎన్నో రకాల ఆంక్షలు, పెత్తనాలుండేవి. ముఖ్యంగా మహిళలపై అణచివేత మరీ దారుణంగా ఉండేది. వారికి సామాజిక జీవితం నిషేధించ బడింది. స్త్రీలు బురఖా ధరించి తీరాలని తాలిబన్లు నిర్బంధిస్తారు. వారిని ఎవరూ చూడకూడదనుకుంటారు. ఎందుకంటే మహిళల ముఖం చూడడం వల్ల సమాజంలోని అన్ని రకాల అథోగతులు చుట్టుకుంటాయని, సర్వనాశనమవుతుందని తాలిబన్ల బలమైన విశ్వాసం. పని హక్కు లేదు. అసలు స్త్రీలు భర్తతో తప్పించి బయట కనపడగూడదు. తప్పనిసరైతే బురఖాలో కాలికున్న చెప్పులు కూడా ఎవరికీ కంట బడకుండా ఒబ్బిడిగా వెళ్ళి, ఇంట్లోకొచ్చి పడాలి. యుద్ధాల వల్ల ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు తమ భర్తలు, తండ్రులు, కొడుకులను భారీ సంఖ్యలో కోల్పోయి అనాథలవుతారు.

ప్రారంభ సన్నివేశంలో ”క్షమించగలనేమో కానీ మర్చిపోలేను” అన్న నెల్సన్‌ మండేలా సూక్తితో సినిమా మొదలవుతుంది. మొదటి సీన్‌లోనే పై నుంచి కిందివరకూ ముఖాలు కూడా కనపడకుండా నీలి రంగు బురఖాలు ధరించిన మహిళలు గుంపులు గుంపులుగా కనిపిస్తారు.

‘ఆకలి మా ప్రాణాలను తోడేస్తోంది’

‘మేము వితంతువులం’

‘మాకు పని కావాలి’

‘మేము రాజకీయం చేయడం లేదు’ అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేస్తుంటారు.

చావుకి తెగించి మనుగడ కోసం పోరాటం చేస్తున్న మహిళలమీద తాలిబన్‌ సైనికులు నీటి గొట్టాలను వదలడం, గ్రెనేడ్‌ లాంచర్లు పేల్చడం లాంటి దృశ్యాలను ఒక పదమూడేళ్ళ బాలిక, మన కథానాయిక తలుపు సందుగుండా చూస్తుంది. ఇది చాలా శక్తివంతమైన దృశ్యం. తర్వాత సినిమా మొత్తం దీని కొనసాగింపుగా నడుస్తుంది.

ఈ దుర్భర పరిస్థితుల్లో ఒక ఇంట్లో మూడు తరాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మహిళలు బాలిక అమ్మమ్మ… అమ్మ… మనవరాలు… సంపాదించే పురుషుడు లేకుండా దిక్కులేని వాళ్ళవుతారు. బాలిక తండ్రి ఆఫ్ఘనిస్తాన్‌ యుద్ధంలో మరణిస్తే, బాలిక మేనమామ రష్యన్‌ యుద్ధంలో మరణిస్తాడు. ఆ ఇంట్లో పోషించే పురుషుడు ఉండడు. వృద్ధురాలైన తల్లినీ, బిడ్డనూ పోషించడం కోసం ఆ బాలిక తల్లి ఒక హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తుంటుంది. ఆ బాలిక కూడా అదే హాస్పిటల్‌లో చిన్న చిన్న పనులు చేస్తూ తన తల్లికి సహాయంగా ఉంటుంది. ఆ సమయంలో స్త్రీలు బయటికొచ్చి పనిచేయకూడదు అనే ఆంక్ష విధిస్తారు తాలిబన్లు. అంతేకాదు, అకస్మాత్తుగా వీళ్ళు పనిచేస్తున్న హాస్పిటల్‌కి నిధులు ఆపేస్తారు. ఆమెకు మూడు నెలల జీతం కూడా రావలసి ఉంటుంది. ఆమె ఎంత మొత్తుకున్నా వినిపించుకునే వారెవరూ ఉండరు. పైగా ఆ తల్లీ- కూతుళ్ళు ఎవరో పురుషుడి కాళ్ళావేళ్ళా పడి బతిమాలుకుని అతని భార్యా, బిడ్డలుగా బండిమీద వస్తుంటే ఆమె కాళ్ళు బయటికి కనిపిస్తున్నాయని పోలీసు ఆమె కాళ్ళమీద లాఠీతో కొడతాడు. నానా కష్టాలూ పడి ఆ పూటకి ఇల్లు చేరడమే గగమనవుతుంది.

ఆకలితో అలమటించి పోతామని భయపడిన ఆ తల్లీ, అమ్మమ్మలు రోజులు చాలా గడ్డుగా ఉన్నాయనీ, ఏదో ఒకటి చేయకపోతే ప్రాణాలు నిలుపుకోలేమనీ అనుకుంటారు. ఇంకో దారిలేని పరిస్థితుల్లో ఆ బాలికకు అబ్బాయిగా మారువేషం వేసి ఏదో ఒక పనికి పంపించాలని భావిస్తారు. బాలిక మాత్రం తాలిబన్లకు ఈ సంగతి తలిస్తే తనని చంపేస్తారని భీతిల్లిపోతుంది. నిస్సహా యంగా, భయం భయంగా, బేల చూపులు చూస్తూనే గత్యంతరం లేని పరిస్థితుల్లో అమ్మమ్మ, అమ్మ చెప్పినట్లే చేయడానికి సంసిద్ధమవుతుంది. అమ్మమ్మ తన మనవరాలి పొడవైన జుట్టంతా జడలుగా అల్లి కత్తిరించేస్తుంది. తల్లి ఇంట్లో ఉన్న ఆ బాలిక తండ్రి బట్టలు తెచ్చి వేస్తుంది. మొత్తానికి అందమైన సుకుమారమైన అమ్మాయి కాస్తా అచ్చం అబ్బాయిలా తయారవుతుంది. ఆ బాలిక తండ్రి స్నేహితుడ్ని బతిమాలి ఆ బాలికకు చిన్న టీ దుకాణంలో పని కుదుర్చు కుంటారు. అందరూ మారువేషంలో ఉన్న ఆ బాలికను అబ్బాయనే అనుకుంటారు కానీ తల్లితోపాటు హాస్పిటల్‌కు వెళ్లి వస్తున్నపుడు చూసిన ‘ఎస్పాండీ’ అనే బాలుడు మాత్రం ఈ రహస్యాన్ని పసిగట్టేస్తాడు. అతనే ఆ బాలికకు ”ఒసామా” అని పేరు పెడతాడు. ఒసామా బాలుడు కాదు బాలిక అని మిగిలిన పిల్లలకు అనుమానం వచ్చినపుడు ఎన్నోసార్లు ఎస్పాండీ ఆదుకుంటాడు. ”నాకు తెలుసు. అతను అబ్బాయే. పేరు ఒసామా” అని చెప్పి రక్షించడానికి ప్రయత్నిస్తాడు కానీ ఒక్కొక్కసారి అతని ప్రయత్నాలేవీ ఫలించవు.

ఇంత దయనీయమైన పరిస్థితుల్లో కనాకష్టంగా బతుకీడుస్తున్న వాళ్ళను విధి ఈ రకంగా కూడా బతకనివ్వదు. గ్రామంలోని బాలురనందరినీ తాలిబన్‌ శిబిరం నిర్వహించే ఒక మతపరమైన పాఠశాలకు తరలిస్తారు. ఒసామా కూడా తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది. ఈ పాఠశాలలో మత గురువులు పోరాడే పద్ధతులతో పాటు, భవిష్యత్తులో వివాహాల తర్వాత వారి వారి భార్యలతో ఎలా ప్రవర్తించాలో, భార్యలను కలిసిన తర్వాత స్నానంతో వారి శరీరాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలో కూడా నేర్పించే సన్నివేశమొకటి జుగుప్సతో, భయంతో వళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది. బాలిక తన రహస్యాన్ని తాలిబన్ల నుంచి కాపాడుకోవడానికి అవయవాలను శుభ్రం చేసుకునే సందర్భంలో తప్పించుకోవడానికి విఫల యత్నాలు చేస్తుంది. అయితే నరకయాతనలకు గురిచేసే తాలిబన్‌ ఉపాధ్యాయులు పెట్టే పరీక్షల సమయంలోనే ఆమె రజస్వల కూడా అవడంతో ఆమె కాళ్ళనుంచి రక్తం కారడం చూసి, ఆమె ఒక బాలిక అని వాళ్ళకు తెలిసిపోతుంది. హాస్పిటల్‌లో అరెస్ట్‌ చేసిన ఒక జర్నలిస్ట్‌నీ, ఒక విదేశీ వనితతో పాటు ఆ బాలికను కూడా జైలుకి పంపిస్తారు. పెద్ద పంచాయితీ పెట్టి మిగిలిన ఇద్దరికీ మరణశిక్ష విధిస్తారు. ఇంతలో ఒక ముసలి ముల్లా వచ్చి తాను ఆ బాలికను వివాహమాడతానంటాడు. ”నన్ను ఈ ముసలివానికివ్వొద్దు. నాకు మా అమ్మ కావాలి. నన్ను అమ్మ దగ్గరకు పంపించండి” అంటూ ఆ బాలిక దీనంగా, హృదయ విదారకంగా న్యాయ మూర్తిని వేడుకుంటుంది. అయినా ఆ న్యాయమూర్తి మనసు కరగదు. పదమూడేళ్ళ పసిపిల్ల పండు ముసలివానికి ఆఖరి భార్య కాక తప్పలేదు! అప్పటికే అతనికి ముగ్గురు భార్యలు, బోలెడంతమంది పిల్లలూ ఉంటారు. ఆ బాలికకు అది ఒక శిక్షగా భావిస్తూ ఆ ముదుసలికి అప్పగించేస్తారు. అతని కౄరత్వం గురించి, అతని వల్ల తమ జీవితాలెలా నాశనమయ్యాయన్న విషయం గురించి ఆ బాలికకు అతని భార్యలు వివరించి చెప్తారు. సహాయపడాలని ఉన్నా తామేమీ చేయలేని నిస్సహాయులమని చెప్తారు. తన ముగ్గురు భార్యలతో పాటు ఆ బాలికను కూడా తన ఇంటి పై భాగంలో బంధించి పెద్ద తాళం వేస్తాడు ఆ ముదుసలి. ప్రతిరోజూ ఆ ముదుసలి పెట్టే చిత్రహింసను చిన్నారి బాలిక భరిస్తుండడాన్ని ఈ సినిమాలో చెప్పకనే చెప్తారు.

ఒక వాస్తవిక కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఆఫ్ఘానీ మహిళల దుస్థితిని చాలా ఆర్ద్రతతో అధ్యయనం చేసిన రచయిత ”సిద్దిక్‌ బర్మెక్‌”. ఆయనే దర్శకుడు, ఎడిటర్‌, స్క్రిప్ట్‌ రైటర్‌ కూడా.

ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలకు ‘గౌరవం’ సంగతి అటుంచి ఆమానుష భౌతిక, మానసిక హింసలు జీవితకాలమంతా అమలవుతున్నాయి. ఒక మహిళను గొంతు వరకూ పాతిపెట్టి ఆ పైన రాళ్ళు రువ్వే దృశ్యం కూడా ఉంది ఈ సినిమాలో! ఆఫ్ఘానీ మహిళల జీవిత సమస్యలను అర్థం చేసుకుని విశ్లేషించడానికి ఎంతో గుండె నిబ్బరం ఉండాలి. అయినా సరే మొట్టమొదటగా ఇంత ధైర్యం చేసిన బర్మెక్‌ను ఎంత ప్రశంసించినా తక్కువే!

బూర్జువా ప్రపంచంలో బాల్యాన్నీ, యవ్వనాన్నీ, జీవితాన్నీ పోగొట్టుకున్న ఒక బాలిక ద్వారా మొత్తం దేశాన్ని తద్వారా తాలిబన్‌ ఇనుప పాలనను గొప్ప స్కోప్‌లో చూపించారు బర్మెక్‌.

రెండో సినిమా గురించి తర్వాత సంచికలో చెప్పుకుందాం…

(సారాంగ వెబ్‌ మ్యాగజైన్‌ నుండి…)

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.