చట్టవిరుద్ధంగా తవ్వకాలు – రమణిక గుప్తా అనువాదం: సి. వసంత

నేషనల్‌ కోల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ జాతీయకరణ తర్వాత నాన్‌-కోకింగ్‌ కోల్‌ మైన్స్‌ని ఆధీనం చేసుకుంది. తర్వాత ఈ కంపెనీ పేరు సి.ఎం.డి.సి. (కోల్‌ మైన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) గా మారింది. తర్వాత దీని పేరే కోల్‌ ఇండియా అయింది. బి.సి.సి.ఎల్‌., సి.సి.సి.ఎల్‌ మొదలైనవి సబ్సిడరీ కంపెనీలయ్యాయి. తక్కిన ప్రదేశాల్లో వేర్వేరు పేర్లతో కంపెనీలు తెరిచారు. హజారీబాగ్‌, రాంచి, గిరిడీహ్‌, పాలాము, సింగరోలీ మైన్స్‌ పేరును సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్‌ అని పెట్టారు. తర్వాత సింగరోలీని వేరు చేశారు. దీన్ని నార్త్‌ కోల్‌ ఫీల్డ్‌ అని పిలిచేవారు. కేదలా మైన్స్‌ సి.సి.ఎల్‌. కిందకు వస్తాయి. ఆధీనంలో ఉన్నా ఇండియా అన్ని గనులను నడిపేది కాదు. కొన్నింటిని ఎబండన్‌ చేశారు. ఆ రోజుల్లో పభుత్వ గనులకు చుట్టుపక్కల చాలా చోట్ల చట్టవిరుద్ధంగా తవ్వకాలు జరిగేవి. మూయబడిన గనులలో దొంగతనంగా పనులు జరిగేవి. బొగ్గుని బాహాటంగానే అమ్మేవారు. ఇంటక్‌ నేతలు, కాంగ్రెస్‌ లీడర్లు, అధికారులు, మిగతా పార్టీవాళ్ళు మాఫియాతో చేతులు కలిపి ఈ గనుల నుండి బాగా సంపాదించడం మొదలు పెట్టారు. పిండరా మైన్స్‌ ఇంటక్‌ యూనియన్‌ నేత బాబు అవధేష్‌ సింహ్‌ కూడా ఇందులో వుండేవారు. మాండూ లెజిస్లేటర్‌ శ్రీ వీరేంద్ర పాండే ఒకప్పుడు ఠేకేదార్ల తొత్తుగా ఉండేవారు. వీళ్ళకి బాహాటంగానే సహాయం చేసేవారు. బీహారు మంత్రి తాపేశ్వర్‌ దేవ్‌ తమ్ముడు నరేష్‌ దేవ్‌ కూడా చట్టవిరుద్ధమైన గనులలో పని జరిపించేవాడు. మైన్స్‌కి మాజీ యజమానులు, వాళ్ళ ఠేకేదార్లు (వీళ్ళ గనులని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది) కూడా బీహారులోని శ్రామిక వర్గాన్ని దోపిడీ చేసేవాళ్ళు. ముఖ్యంగా ఆదివాసీలను, దళితులను, వెనుకబడ్డ వర్గం వాళ్ళను ఎంతో కష్టపెట్టేవాళ్ళు. ఈ గనులు ప్రభుత్వం ఆధీనం అయితే కార్మికులందరికీ పర్మనెంట్‌ జాబ్స్‌ దొరుకుతాయని చెప్పి వాళ్ళల్లో ఆశలు రేకెత్తించి రిజిస్టర్లలో పేర్లు నమోదు చేస్తామని చెబుతూ వాళ్ళ భూములను తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఋణగ్రస్తులయ్యేవారు. వాళ్ళందరూ మూడో నెలలో పాత రిజిస్టర్లను చింపి పడేసేవాళ్ళు. ఈ విధంగా ఆ రోజుల్లో రిజిస్టర్లలో పేర్లు నమోదు చేయించుకోవ డానికి బీహారు నుండే కాదు బయటి రాష్ట్రాల నుండి హజారీబాగ్‌కి వచ్చేవారు. దళారుల సంపు తయారయింది. ఈ చట్టవిరుద్ధమైన బొగ్గు గనులలో పనికోసం రిజిస్టర్లలో పేర్లు నమోదు చేయడం, భవిష్యత్తులో ఉన్నత పదవుల కోసం డబ్బులు తీసుకుని అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం, జాలీ కంపెనీలు, సొసైటీలు ఏర్పాటు చేయడం ఒక పెద్ద వ్యాపారంగా మారింది. బీహారుకు చెందిన

ఉన్నత వర్గం వారు, ఉన్నత మధ్య తరగతి వాళ్ళు, ఛోటా నాగ్‌పూర్‌ స్థానీయులు దాని వెనుక ఉండేవారు. కొంతమంది ఆదివాసీల పేర్లపైన అనేక జాలీ సొసైటీలను పెట్టడం మొదలుపెట్టారు. వీళ్ళు పేదవాళ్ళను మోసగించి కార్లు, ట్రక్కులు తీసుకున్నారు. నేను కలుగచేసుకున్నాక జాలీ కంపెనీల యజమానులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ధన్‌బాద్‌ మాఫియా సూరజ్‌ సింహ్‌ నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. ఆయన కూడా తన బలగంతో రామ్‌గఢ్‌లోని చట్టవిరుద్ధమైన మైన్స్‌ మీద ఆధిపత్యం సంపాదించాలనుకున్నాడు. హైస్సాలింగ్‌, బుండూ, బన్‌వాడ్‌, జగేశ్వర్‌ మొదలైన గ్రామాలకు వచ్చి చట్టవిరుద్ధంగా తవ్వకాలు మొదలుపెట్టారు. ఆయన ఆరా సారూ బేడాలలో యూనియన్లను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. కానీ మేమందరం పట్టుదలతో ఎదిరించాం. ఆయన ఏమీ చేయలేకపోయారు. అటువైపు రైఫిళ్ళు, ఇటువైపు బాణాలు, గులేలులు, ప్రజల మనోబలం.. వాళ్ళు మా యూనియన్‌ను ఆధీనంలోకి తీసుకోలేకపోయారు. వెనక్కి వెళ్ళిపోయారు. చట్టవిరుద్ధమైన గనుల విషయంలో ఆఖరి క్షణం వరకు పోరాడారు. ధన్‌బాద్‌లో చట్టవిరుద్ధమైన తవ్వకాలు జరిపే ముఠాతో ఈయన కూడా చేతులు కలిపారు. చట్టవిరుద్ధమైన గనుల యజమాని ఒక ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. హజారీబాగ్‌ డెప్యూటీ కమిషనర్‌ కె.డి.సింహ్‌ కలుగచేసుకుని గనుల యజమానులను అరెస్ట్‌ చేయించే ఉద్యమం నడిపారు. చివరికి బాబు సూరజ్‌ దేవ్‌ సింహ్‌ హజారీబాగ్‌ వదిలేశారు.

విధాన పరిషత్‌లో మెంబర్‌ అయినపుడు నేను చట్టవిరు ద్ధంగా నడుస్తున్న గనులకు విరుద్ధంగా ప్రశ్నను లేవదీశాను. దీని విషయం చూడడానికి విధాన పరిషత్‌ ఒక కమిటీని వేసింది. స్థానిక స్థాయిలో కూడా నేను ఉద్యమం నడిపాను. ఆ రోజుల్లో నేను కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తూ హజారీబాగ్‌ జిల్లా 20 సూత్రాల కమిటీలో కూడా మెంబర్‌గా ఉండేదాన్ని. నేను శ్రీమతి ఇందిరా గాంధీకి, మైన్స్‌ మంత్రికి దీని గురించి వివరాలనిస్తూ ఎన్నోసార్లు లేఖలు రాశాను. మెమొరాండంలు ఇచ్చాను. కానీ ఏమీ లాభం లేకుండా పోయింది. కార్తీక్‌ ఉరాంల్‌ మైన్స్‌ మంత్రి అయ్యారు. నేను ఢిల్లీకి వెళ్ళి మెమొరాండం ఇచ్చాను, కానీ ఆయన చేయాలనుకున్నా ఏమీ చేయలేకపోయారు. నిజానికి కాంగ్రెస్‌ పార్టీలో ఎవరి తీరు వారిదే. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవే. ఇందిరాగాంధీ ఎంత ప్రయత్నించినా 20 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయనీయకుండా చేసే మహానుభావులు ఉన్నారు. ఈ మహానుభావుల ప్రభావం పార్టీకి నేతృత్వం వహించే వారిపై ఉండేది. కుమార మంగళమ్‌ గనులను జాతీయకరణ చేశారు. కానీ కాంగ్రెస్‌ పార్టీలో ఒక గ్రూపుకి ముఖ్యంగా బీహార్‌లో దీనిపై వ్యతిరేకత ఉండేది. ఇందిరా గాంధీ గారు బీహారు స్థితిగతుల గురించి నన్ను అడుగుతూ ఉండేవారు. నా రిపోర్టును విన్నాక ఆవిడ ‘అవును నాకు తెలుసు. 20 సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేయరు. అంతా గందరగోళంగా ఉంది. నేను చూస్తాను’ అన్నారు.

ఆవిడ జాతీయకరణ పక్షం వైపు ఉంటే క్యాబినెట్‌ మంత్రులందరూ దీనికి వ్యతిరేకంగా ఉండేవారు. ఎందుకంటే ఈ వ్యతిరేకించేవారందరూ స్వార్థపరులు, ఈ గనుల వలన లాభాలు పొందేవారే. కార్తీక్‌ ఉరాంవ్‌ నైతికపరమైన తీర్పును ఇవ్వలేకపోయారు. కానీ స్థానిక స్థాయిలో హజారీబాగ్‌ డి.సి. శ్రీ కె.పి.సింహ్‌ ధైర్యం చేశారు. రైడ్‌ చేసి చట్టవిరుద్ధంగా నడుస్తున్న గనులను మూసివేశారు. దురదృష్టం కొద్దీ బెంగాల్‌లో కోర్టులు ఠేకేదారుల చేతుల్లో ఉండేవి. చట్టవిరుద్ధంగా తవ్వకాలు జరిపే మాఫియా వెంటనే బెయిల్‌ (జమానత్‌) పైన బైటికి వచ్చేసింది. అంతేకాక ఇద్దరు ఠేకేదార్లు ఒకరితో ఒకరు కలిసి కలకత్తా కోర్టులో గనుల ఓనర్‌షిప్‌ కోసం జాలీ కేసులు వేసేవారు. వాళ్ళు కలకత్తా హైకోర్టులో పనిచేసేవారితో చేతులు కలిపి తమ డ్రైవర్లను, నమ్మకస్థులను రిసీవర్లుగా అపాయింట్‌ చేసేవారు. తీర్పు రానంతవరకు గనులపై వచ్చే ఆదాయం రిసీవర్‌ దగ్గర జమయ్యేది. ఈ విధంగా హజారీబాగ్‌ నుండి ధన్‌బాద్‌ వరకు చట్టవిరుద్ధమైన గనులలో ఉపాధి దొరకడం మొదలయింది.

కోల్‌ ఇండియా వీళ్ళందరికీ వ్యతిరేకంగా కేసు నడిపిం చింది. నేను ఇచ్చిన సాక్ష్యం గురించిన వార్తలు ప్రతిరోజూ వార్తా పత్రికల్లో వచ్చేవి. ప్రారంభంలో బిందేశ్వరి దూబే ఈ విషయంలో నాకు సహకారం అందించేవారు. కానీ ఒక్కసారిగా అంతా మారిపోయింది. బిందేశ్వరి దూబే గారికి శిష్యుడైన శ్రీ రుంగటా బేరమోలా ఇంజనీర్‌గా పనిచేసేవారు. ఆయన కూడా ఈ వ్యాపారం మొదలుపెట్టారు. బిందేశ్వరి దూబే గారి స్వభావంలో మార్పు వచ్చింది. అక్కడ సోషలిస్టు నేత, యూనియన్‌ లీడర్‌ అయిన కన్హయ్యా సింగ్‌ కో-ఆపరేటివ్‌ పేరున సి.సి.ఎల్‌.కు సంబంధించిన కొన్ని గనులను కాంట్రాక్టు తీసుకుని శ్రామిక వర్గాన్ని దోపిడీ చేయడం మొదలుపెట్టారు. దీంతోపాటు తవ్వకాల కోసం కాంట్రాక్టర్లను కూడా నియమించాడు. ఈ విధంగా చట్టవిరుద్ధంగానూ, చట్టబద్ధమైనవి గానూ ఉన్న గనుల కాంట్రాక్టర్లకి కాంట్రాక్టు ఇస్తామంటూ,

ఉద్యోగాలు ఇస్తామంటూ గ్రామీణ యువకులను, ఏ పనులూ దొరకని రైతులను, రైతు కూలీలను, గనులలో నిరుద్యోగులైన కార్మికులను మోసం చేయడం మొదలుపెట్టారు. కొంతమందికి కడుపు నింపే జీవనోపాధి దొరకకపోయినా కొంత ఆకలి దప్పులు తీరేంత కూలి లభించసాగింది. కానీ ఒక వర్గం వారు గూండాలుగా ప్రవర్తిస్తూ, మాఫియా బలంతో ధనం సంపాదించడం మొదలుపెట్టారు. నేను దీనికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వానికి, బీహారు ప్రభుత్వానికి లేఖలు రాశాను. చట్టవిరుద్ధమైన తవ్వకాలకు వ్యతిరేకంగా కోల్‌ ఇండియా వైపు నుండి సాక్ష్యం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్‌లో చాలామంది నేతలు గనులను ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇవ్వాలని, చట్టవిరుద్ధమైన గనులు బి.ఎం.డి.సి.కి ఇవ్వాలని అనేవారు. అంతేకాదు చాలామంది మాజీ యజమానులు ప్రభుత్వ గనులను కూడా బలవంతంగా ఆధీనం చేసుకోవాలని అనుకున్నారు.

ప్రభుత్వ గనులపైన మాజీ యజమానుల దాడి:

మణి ఛటర్జీ బన్‌వార్‌ గనులను స్వాధీనం చేసుకోవాలని ప్రణాళిక తయారు చేశారన్న సంగతి నాకు ఇప్పటికీ జ్ఞాపకముంది. పోలీసులతో చేతులు కలిపి నేషనలైజ్డ్‌ మైన్స్‌ని స్వాధీనం చేసుకోబోతు న్నారని, మమ్మల్నందరినీ రమ్మని పాట్నాలో ఉన్న సి.సి.ఎల్‌. డైరెక్టర్‌ బి.ఎల్‌.వడేరా నాకు ఒకరోజు రాత్రి ఫోన్‌ చేసి చెప్పారు. నేను బైజు బాబుని సంప్రదించి, నాకు వారితో మాట్లాడే ఏర్పాటు చేయమని కుజూకి చెందిన మా బ్రాంచి సెక్రటరీ అయిన పి.ఎన్‌. ఠాకూర్‌కి చెప్పాను. ఫోన్‌లోనే ఆ ఇద్దరి నేతలతో మాట్లాడి నేను రాత్రికి రాత్రే పాట్నా నుంచి కుజూకి వెళ్ళిపోయాను. ప్రొద్దున్న ఆరు గంటలకు పి.ఎన్‌.ఠాకూర్‌ దగ్గరికి వెళ్ళాను. అప్పటికే ప్రణాళిక ప్రకారం వాళ్ళందరూ మాతో పోరాటం చేయడానికి వాళ్ళ దళాలతో అక్కడికి చేరారు. నేను గనుల దగ్గరికి వెళ్ళగానే ఠేకేదార్ల గూండాలందరూ పారిపోయారు. మాండూ ఇన్‌స్పెక్టర్‌ ఠేకేదార్ల వైపు నుండి మా నేతలతో చర్చించడం మొదలుపెట్టాడు. నేను వెళ్ళగానే కొంత వెనక్కి తగ్గాడు. ఆయన మా అందరిపైనా కేసులు మోపాడు. కానీ అరెస్ట్‌లు మాత్రం చేయలేకపోయాడు. మా దగ్గర ఒక లైసెన్స్‌డ్‌ రైఫిల్‌ ఉంది. తక్కిన వాళ్ళు రాళ్ళు, రప్పలు, బాణాలతో సిద్ధంగా ఉన్నారు. ఠేకేదార్లు వాటిని తమ ఆధీనంలోకి తెచ్చుకోలేకపోయారు. శ్రామిక వర్గం అంతా ఒక్కటై ప్రభుత్వ గనులను రక్షించుకున్నారు.

సంజయ్‌గాంధీతో చర్చలు

కాంగ్రెస్‌ సభలను గౌహతిలో జరిపించాలని నిర్ణయించారు. నేను బీహార్‌ కాంగ్రెస్‌ కమిటీలో (బి.పి.సి.సి.) ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీలో (ఎ.ఐ.సి.సి.) సభ్యురాలిని. హజారీబాగ్‌ 20 సూత్రాల కార్యక్రమంలో కూడా సభ్యురాలిని. ఈ 20 సూత్రాల కార్యక్రమాన్ని కార్యాచరణలో పెట్టాలని నేను నడుంకట్టాను. మాండూ డి.సి. వీరేంద్ర పాండే చట్టవిరుద్ధమైన గనులను బి.ఎం.డి.సి. (బీహార్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ద్వారా ఠేకేదార్ల చేతికి ఇప్పించి నడిపించాలని సంజయ్‌ గాంధీకి లేనిపోనివి చెప్పి ఆయనను ఒప్పించడానికి ప్రయత్నం చేశారు. నాకు ఈ విషయం తెలియగానే నేను ఢిల్లీ వెళ్ళాను. నేను సంజయ్‌గాంధీ దగ్గర అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలని ప్రయత్నించాను. కానీ సంజయ్‌ గాంధీ పి.ఎ. వీరేంద్ర పాండేకి స్నేహితుడు. సంజయ్‌ గాంధీని కలవడానికి రమణిక గుప్తకి అపాయింట్‌మెంట్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదని అన్నారట. నా సోదరుడు రవివ్రత్‌ బేది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో చీఫ్‌ ఫోటోగ్రాఫర్‌గా పని చేసేవారు. తనకు మేనకాగాంధీ మోడలింగ్‌ చేసేటప్పటి నుంచి ఆమెతో పరిచయం ఉంది. ఆయన ఆవిడ ఫోటోలను తీసేవారు. బ్రిటన్‌ మహారాణి ఎలిజబెత్‌ కార్యక్రమాన్ని ఆయనే కవర్‌ చేసేవారు. అందువల్ల ఆయనకి సంజయ్‌ గాంధీతో కూడా పరిచయముండేది. తర్వాత హృద్రోగ సమస్య వచ్చినపుడు ఆయన సహాయంతో ఆస్ట్రేలియా వెళ్ళి ఆపరేషన్‌ చేయించు కోగలిగారు. ఆపరేషన్‌ ఖర్చంతా సంజయ్‌ గాంధీనే ఏర్పాటు చేశారు. నేను నా సోదరుడితో ‘నా పేరు చెబితే సంజయ్‌ గాంధీ దగ్గర అపాయింట్‌మెంట్‌ దొరకదు. అందువల్ల నీవు నీ కోసం అపాయింట్‌మెంట్‌ తీసుకునేలా చూడు. ఆయన సర్వీస్‌ ఫ్లైట్‌లో పాట్నా వెళ్తున్నారని తెలిసింది. నాకు ఆ ఫ్లైట్‌ నంబర్‌, వెళ్ళే తేదీ వివరాలు తెచ్చి ఇవ్వు. ఆయన పక్కన సీటును రిజర్వ్‌ చేయించు. నాకు దారిలో మాట్లాడే అవకాశం ఉంటుంది’ అన్నాను.

అలాగే జరిగింది. నేను ఫ్లైట్‌లో ఎకానమీ క్లాసులో ముందు సీటులో మేనక గాంధీ గారి పక్కన కూర్చున్నాను. కిటికీ దగ్గర సంజయ్‌ గాంధీ, మధ్యలో మేనక, తర్వాత నేను కూర్చున్నాము. నేను నా సోదరుడు రవి గురించి చెప్పాను. సంజయ్‌గాంధీ మాట్లాడుతూ ‘మీరు హజారీబాగ్‌ వాస్తవ్యులు కదూ! అక్కడ చాలా గనులు నడుస్తున్నాయి. వాటిలో చాలామంది ఆదివాసీలకు ఉపాధి దొరికింది. అయినా అక్కడి ముఖ్యమంత్రి వాటిని బి.ఎం.డి.సి.కి ఇచ్చివేయడానికి ఒప్పుకోవడంలేదు’ అన్నారు. ‘నేను కూడా ఈ విషయం మీతో మాట్లాడాలని అనుకున్నాను. అసలు వాస్తవమేమిటంటే ఆదివాసీలకు ఉపాధి లేదు. ఉపాధి ఇస్తామని చెప్పి వాళ్ళ భూములను లాక్కుంటున్నారు. వారిని ఋణగ్రస్తులను చేస్తున్నారు. చాలా తక్కువ కూలీ ఇచ్చి పని చేయించుకుంటున్నారు. వాళ్ళ పేర్లు రిజిస్టర్‌లో నమోదైతే మైన్స్‌ నేషనలైజ్డ్‌ అయినా వాళ్ళకి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుందని ఆశ చూపించి వాళ్ళని బుట్టలో వేసుకుంటున్నారు. ఆయా గనుల యజమానులు ప్రతి మూడు నెలలకు తమ తమ రిజిస్టర్లను మార్చేస్తారు. కొత్తవాళ్ళ దగ్గర్నుండి డబ్బులు తీసుకుని వాళ్ళ పేర్లు రాస్తారు. అక్కడంతా ఈ విధంగా కుట్ర జరుగుతోంది. దీంట్లో పెద్ద పెద్ద నేతల హస్తాలున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ వాళ్ళు ఉన్నారు, సోషలిస్టు పార్టీ వాళ్ళూ ఉన్నారు’ అని చెప్పాను.

ఇంతలో వెనక సీట్లో ఉండి దామోదర్‌ పాండే లేచి నిల్చున్నారు. సంజయ్‌ని సంబోధిస్తూ ‘నేనూ అక్కడి పార్లమెంటు సభ్యుడినే’ అన్నారు.

నా మాటను కాదనడానికి ఆయనకు ధైర్యం లేదు. ఆయన మధ్యలో మాట్లాడడంవల్ల నేతల పేర్లు చెప్పలేకపోయాను. సంజయ్‌ నాతో తర్కించడం మొదలుపెట్టారు. ‘ప్రపంచమంతా ప్రైవేటువాళ్ళే గనులను నడుపుతారు. భారతదేశంలో ప్రభుత్వం ఎందుకు గనులను ఆధీనంలోకి తీసుకోవాలి?’ అన్నారు. దానికి నేను సమాధానమిస్తూ -‘జాతీయకరణ చేయడం తప్పుకాదు. వాటిని నడిపేవాళ్ళది తప్పు. మనం దీన్ని బాగుపరచాలి. ఠేకేదార్లు ఇంతకుముందే కోట్ల రూపాయలను రాయల్టీగా తీసుకున్నారు. వాళ్ళు కార్మికులను దోపిడీ చేస్తున్నారు. శ్రామికుల డబ్బులు తీసుకుంటూ, దొంగతనంగా రాయల్టీని తీసుకుంటూ లాభాలు గడిస్తున్నారు. నిజానికి ఇది లాభం కాదుగా! మనకి బొగ్గును తక్కువ ధరలో అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే దేశంలో ధరలు పెరగకూడదు. దీనివల్ల కాగితాల మీదే నష్టం కనిపిస్తుంది. కానీ నిజానికి నష్టం కలగదు. ఏ విధంగా అయితే ధాన్యాన్ని రాయితీ ఇచ్చి తక్కువ ధరకు అమ్ముతారో బొగ్గు విషయంలోనూ అదే పరిస్థితి. మనం ఎంత లోతుగా తవ్విస్తే అంత ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. మరి లాభాల కోసమే బొగ్గుని తవ్వరు కదా! మనకి అవసరం కాబట్టి బొగ్గుని తయారు చేస్తారు’ అన్నాను.

నేను బెల్జియం బొగ్గు గనుల గురించి చెప్పాను. అక్కడ బొగ్గు గనులు ప్రైవేటువైనా, యజమానుల ఆధీనంలో

ఉన్నా వాటిని నడిపించడానికి బెల్జియం ప్రభుత్వం 95% ధనమిస్తుంది. కారణం బొగ్గు అవసరం ఉంది. బ్రిటన్‌, జర్మనీలలో ప్రైవేటు గనుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది అని చెప్పాను.

ఆయన అమెరికాని ఉదాహరణగా చూపిస్తూ ‘అమెరికాలో బొగ్గు గనులన్నీ లాభాలమీదే నడుస్తున్నాయి’ అన్నారు.

‘భారత్‌ అమెరికా కాదు. ఇక్కడ జనసంఖ్య అధికంగా ఉంది. వనరులు తక్కువగా ఉన్నాయి. అమెరికా జనసంఖ్య తక్కువ, వనరులు ఎక్కువ. భూమి కూడా పెద్దదే. వాళ్ళు ఓపెన్‌ కాస్టింగ్‌ మైనింగ్‌ని భరించగలుగుతున్నారు. అక్కడ భూభాగం ఎక్కువ. కానీ ఇక్కడ అలా కాదు. మన దగ్గర బొగ్గు ఇంధనాన్ని, విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల వీటిని ఉత్పత్తి చేయడానికి దాన్ని దాచిపెట్టాలి. వైజ్ఞానికమైన రీతిలో దీన్ని ఉత్పత్తి చేయాలి. ప్రైవేటు యజమానులు బొగ్గుని వైజ్ఞానికమైన రీతిలో ఉత్పత్తి చేయడంలేదు. ఇది మనకు అనుభవమే. అందువల్ల సార్వజనిక క్షేత్రంలో ఏదైనా లోపముంటే దాన్ని మనం సరిదిద్దుకోవాలి. దానిమీద ఆంక్షలు ఎక్కువ చేయాలి కానీ మూసివేయకూడదు. సార్వజనిక క్షేత్రంలో యంత్రాలకన్నా కూలీలకే ఎక్కువ ప్రాముఖ్యమివ్వాలి. దీనివల్ల నిరుద్యోగం ఉండదు. ఇప్పుడు ఈ క్షేత్రంలో మనుషులకు బదులు యంత్రాలకు ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ పాలసీలలో మార్పు రావాలి’ అన్నాను.

తర్వాత కొన్ని రోజుల్లోనే ఈ విషయం గురించి క్యాబినెట్‌ లో చర్చించారు. రూల్సుని కొంత సవరించారు. ఇంతకు ముందు ఎన్నో నెలలనుంచి కాని పని త్వరలోనే జరిగింది. నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. అసలు ఇంతకు ముందు దీనికి సంజయ్‌ గాంధీనే అడ్డుపడుతున్నాడన్న సంగతి నేనెలా తెలుసుకున్నానో అది వేరే కథ.

ప్రభుత్వ గనులలో పనిచేసే కార్మికులు, స్క్రీనింగ్‌లో తీసివేయబడ్డవాళ్ళు ఈ కొత్త చట్టవిరుద్ధమైన గనులలో తమ తమ బంధువులను తీసుకువచ్చి పనులు ఇప్పించేవాళ్ళు. ప్రభుత్వపు గనులలోని బ్లాస్టింగ్‌ సామగ్రి ఓవర్‌మెన్‌, మున్షీ,, తక్కిన అధికారుల ద్వారా ఈ ప్రైవేటు గనులకు చేరేది. కొందరు ప్రభుత్వ గనులలోని మాజీ అధికారులు, సిబ్బంది చట్టవిరుద్ధమైన గనులలో కూడా కాంట్రాక్ట్‌ తీసుకున్నారు. వీళ్ళు డ్యూటీ వదిలేసి అక్కడికి పనిచేయడానికి వెళ్ళే వాళ్ళు. టాటా కంపెనీ వెస్ట్‌ బొకారో కొలియారీ ఘాట్‌, ఎన్‌.సి.డి.సి. లాంటి ప్రభుత్వ గనులలో పనిచేసే పై కేటగిరీలోని కార్మికులు ఈ చట్టవిరుద్ధమైన గనులను ఠేకా తీసుకోవాలని పోటీపడేవారు. చుట్టుపక్కల చౌన్‌గడ్డా, బడ్‌గాంవ్‌, కర్‌మా, రత్‌వై, చితర్‌పురా, పత్‌రాతూ, తోపా, తోయరా, కుజు, పుండీ, హైస్సాగఢా, బోంగ్‌హారా, మాండూ, చరహీ, దున్నీ, సిర్‌కా, తాపిన్‌, చుంబా, కనకీ, హైస్సాలొంగ్‌, మాయీల్‌, గిధినియా తదితర గ్రామాలలోని ధనవంతులు కూడా చట్టవిరుద్ధమైన గనులలో తమకు తగ్గ పనులను వెతుక్కునేవారు, అలాగే ఠేకేదారీ కూడా చేసేవారు. ఈ విషయం గురించి నేను పై అధికారులతో చర్చించేదాన్ని. రిపోర్టులు ఇచ్చేదాన్ని. వీళ్ళు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తారని ఆశ. కానీ అలా జరగలేదు. పైగా వాళ్ళు నన్ను, దూబేగారిని సహాయం అడిగేవారు.

నేను జాతీయకరణ నియమాలలో కొంత మార్పు చేయాలని గనుల మంత్రి శ్రీ కె.సి.పంత్‌కి ఉత్తరం రాసాను. దీని ఒక ప్రతిని ఇందిరాగాంధీకి పంపించాను. ‘దేశంలో ఏ స్థానంలోనైనా సరే ప్రభుత్వ గనుల కంపెనీ వాళ్ళు తప్పితే మరెవరూ తవ్వకాలు చేయరాదు. అలా చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షవేయాలి’ అని రాసాను. దేశంలో ఆ సమయంలో చట్టం, చట్టవిరుద్ధమైన గనులలో సురక్ష శ్రమ చట్టం అమలు జరిగేది, కానీ శిక్ష ఉండేది కాదు. చట్టప్రకారం చట్టవిరుద్ధమైన తవ్వకాలు క్రిమినల్‌ కేసుల కిందికి రావు.

దేశంలో గనుల తవ్వకాలు కోల్‌ ఇండియా కంపెనీ ద్వారానే జరగాలి. ఈ విషయం చర్చించాలని నేను శ్రీ కె.సి.పంత్‌ని కలవడానికి వెళ్ళాను. కె.సి.పంత్‌కి నా పట్ల గౌరవం ఉంది. నేను ప్రభుత్వ గనుల అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతున్నానని ఆయనకు తెలుసు. బొగ్గు గనులలో ఏడు రోజులూ తవ్వకాలు జరగాలని మేనేజ్‌మెంట్‌కు ఒక షరతు పెట్టాను. దీనివల్ల అందరికీ బై-రొటేషన్‌ సెలవులు దొరుకుతాయి. దీంతోపాటు ఏడవ రోజున కొత్త కూలీలను పనిలో పెట్టుకోవాలని మరో షరతు పెట్టాను. దీనివల్ల ఉపాధి పెరుగుతుంది. ఆదివారం సెలవు రోజు కాదు. నా ఈ ఒప్పందాన్ని దామోదర్‌ పాండే, దాస్‌ గుప్తాలు వ్యతిరేకించారు. బిందేశ్వర్‌ దూబే నన్ను సమర్థించారు.

ఉద్యోవకాశాలు ఎక్కువ కావాలని నా అభిప్రాయం. నేను ఈ అగ్రిమెంట్‌ను ఎందుకు చేయించానంటే ఏడు రోజులూ పని జరిగితే ఏడవరోజు కొత్త కూలీలకు పని దొరుకుతుంది. ఓవర్‌ టైమ్‌ విషయంలో మిగిలిన యూనియన్ల అభిప్రాయానికి, నా అభిప్రాయానికి భేదముంది. ఓవర్‌ టైమ్‌ ఇచ్చే బదులు ఎక్కువ మందిని పనిలోకి తీసుకుంటే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. గ్రామీణులకు ఉద్యోగాలు దొరుకుతాయి. ఈ విషయంలో కూడా ఇంటక్‌తో సహా తక్కిన యూనియన్ల వాళ్ళు వ్యతిరేకించారు. ఈ బొగ్గు గనులలో ఓవర్‌ టైమ్‌ రాకెట్‌ ఒకటి బయలుదేరింది. కావాలని సమయానికి పని పూర్తి చేయకుండా ఓవర్‌ టైమ్‌ ఇచ్చి మంచి జీతాన్ని పొందుతున్న కార్మికులతో పని చేయించుకునేవాళ్ళు. మేనేజ్‌మెంట్‌ ఈ కార్మికులతో కలిసి ఓవర్‌టైమ్‌ డబ్బులను పరస్పరం పంచుకునేవాళ్ళు. ఈ రాకెట్‌లో ఎక్కువగా పై స్థాయిలో ఉన్న టైమ్‌ రేటెడ్‌ కార్మికులు ఉన్నారు. పీస్‌-రేటెడ్‌ కార్మికులు ఇందులో లేరు. వీళ్ళు ఎక్కువ పని చేయాలని, లేకపోతే కనీసం పని పూర్తి చేయాలని అనుకునేవారు. రాకెట్‌ నిర్వహించేవాళ్ళు వీళ్ళకి కావాలని పని దొరకకుండా చేసేవాళ్ళు. లంచాలు తీసుకునే వాళ్ళు. పూర్తి పని చేయడానికి పై కేటగిరీ ఆపరేటర్లు వాళ్ళ దగ్గరనుండి డబ్బులు తీసుకునే వాళ్ళు. అసలు నిజానికి గనులు ప్రభుత్వాధీనంలోకి వెళ్ళాయి. కార్మికులలో ఉత్సాహం ఉప్పొంగింది. కానీ ఠేకేదార్ల సమయంలో ఉన్న మేనేజర్లు, మున్షీలు ఇప్పుడు కూడా పనిచేసే వాళ్ళు. వాళ్ళు కార్మికుల మంచిని కోరుకునేవాళ్ళు కాదు. దోపిడీ చేసేవాళ్ళు. అందువల్ల ఎప్పుడైనా నేషనలైజ్డ్‌ గనులలో ఎన్‌.సి.డి.సి. అధికారులు ట్రాన్స్‌ఫర్‌ అయి వస్తే కార్మికులకు ఎంతో శాంతి కలిగేది. ఎందుకంటే వాళ్ళు సిక్‌ లీవ్‌, మెటర్నిటీ లీవ్‌ ఇచ్చేవారు. సమయాను సారంగా కార్మికులతో పని చేయించేవారు.

ఇన్ని కష్టాలు పడుతూ కూడా కార్మికులు ప్రభుత్వపు గనులను విజయవంతంగా నడపాలని ఎంతో ప్రయత్నించేవారు. మా యూనియన్‌ ఉద్దేశ్యం కూడా అదే. అందుకే మేము రాత్రిం బవళ్ళు ఈ లక్ష్యాన్ని పూర్తి చేయడానికే పనిచేసేవాళ్ళం.

నేను ఢిల్లీ వెళ్ళి మంత్రి కె.సి.పంత్‌ను కలిశాను. ‘నేను సవరణల గురించి పంపాను కదా! ఆ విషయం ఏమయింది?’ అని అడిగాను. దీనికి ఆయన సమాధానమిస్తూ ‘మీరు ఇందిరాగాంధీ గారితో కానీ, జగ్జీవన్‌ రామ్‌ గారితో కానీ, సంజయ్‌తో కానీ దీని గురించి చర్చించండి. క్యాబినెట్‌లో ఈ ఎమెండ్‌మెంట్‌ విషయంలో చాలామంది వ్యతిరేకిస్తున్నారు’ అన్నారు.

‘సంజయ్‌తో ఎందుకు మాట్లాడడం?’ అని నేనడిగాను. ఆయన నవ్వారు. ఏమీ మాట్లాడలేదు. నేను మర్నాడు తిన్నగా ప్రధానమంత్రి నివాసంలో ఇందిరాగాంధీ గారి దగ్గరకు వెళ్ళాను. అక్కడ అందరూ నన్ను గుర్తుపడతారు. శేషన్‌, ధవన్‌లు ఇద్దరూ నన్ను గుర్తు పడతారు. ఉదయం పూట ఆవిడ అందరినీ కలుస్తారు. నాకు తొందరగా కలిసే అవకాశం కలిగింది. ఆవిడకు నేను వ్యక్తిగతంగా కూడా తెలుసు. మా పిన్ని నిర్మల్‌ మల్హో త్రా ఢిల్లీలోని ఎన్‌.డి.ఎం.సి. పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసేది. అక్కడ ఆమెకు పరిచయమే. నిర్మల్‌ మల్హోత్రా ఇందిరా గాంధీని ‘ఇందిరా’ అని పిలిచేవారు. ఇందిర గారు ఆవిడను ‘దీదీ’ అని పిలిచేవారు. నేను ఇందిరాగాంధీ గారితో చట్టవిరుద్ధమైన గనులలో జరుగుతున్న అవకతవకలు, లంచాలు, దొంగతనాలు, కార్మికులను ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో అన్ని విషయాల గురించి చర్చించాను. నేను ‘యాక్ట్‌’లో చేయవలసిన ఒక ఎమెండ్‌మెంట్‌ కాపీని ఆవిడకు ఇచ్చాను. ఆవిడ ఒప్పుకున్నారు. నేను ఆవిడ వద్దకు ఎప్పుడు వెళ్ళినా బీహారు గురించి అడుగుతుండేవారు. ముఖ్యంగా మంత్రుల గురించి.

‘నాకు తెలుసు అంతా సవ్యంగా లేదని, కానీ ఈ అక్రమాలను ఎలా ఆపించాలో అర్థం కావడంలేదు. నీవు వెళ్ళి సంజయ్‌ని కలువు’ అన్నారు. నేను ఆశ్చర్యంగా ‘సంజయ్‌ని ఎందుకు? ఆయనకు ఈ గనులతో ఏం పని?’ అనగానే ఆవిడ వెంటనే ‘కాదు.. కాదు.. కె.సి.పంత్‌ని కలువు’ అన్నారు.

‘నేను కె.సి.పంత్‌ని కలిసే వస్తున్నాను. ఆయనే మీ దగ్గరికి పంపించారు. మీరు మళ్ళీ నన్ను ఆయన దగ్గరికే పంపిస్తున్నారు. క్యాబినెట్‌లో ఈ విషయం వచ్చింది, కానీ ఆ మంత్రులు ఎందుకు విరోధిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. జగ్జీవన్‌ బాబు గారు కూడా వద్దన్నారని విన్నాను. అందువలన మీరు ఈ విషయాన్ని ఎప్పటివరకైతే పట్టించుకోరో అప్పటిదాకా ఈ దొంగతనాలు ఆగవు. కార్మికులపై పీడన, ధనవంతుల దోపిడీ ఆగదు. ఏ కారణాల వల్ల అయితే మీరు గనులను జాతీయకరణ చేశారో అదంతా ఇప్పుడు వ్యర్థమవుతుంది’ అన్నాను. దీంతో ‘సరే! నీవు వెళ్ళి పంత్‌ని కలువు. నాతో మాట్లాడమని ఆయనకు చెప్పు’ అని ఇందిర అన్నారు.

నేను కొంత ఆశ, కొంత నిరాశ నిస్పృహలతో వెనక్కి వచ్చాను. పంత్‌ గారికి అంతా చెప్పాను. దీని తర్వాత సంజయ్‌ని కలవాలని గట్టిగా అనుకున్నాను. దీని గురించిన వివరణను మొదట్లోనే మీకు వివరించాను.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.