ఆనాటి పల్లెల్లో… ఏమి హాయిలే – పి. ప్రశాంతి

స్కూల్‌ రిక్షా గంట గణగణలాడించు కుంటూ వచ్చేస్తోంది. గేటు దగ్గరే నిలబడి ఎదురు చూస్తున్న అక్కాచెల్లెళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ ఇంట్లో కొచ్చారు. ఆదరాబాదరాగా పుస్తకాల బ్యాగ్‌లు తీసుకుంటూ ”అమ్మా! సాయంత్రం వచ్చేసరికి బట్టలు సర్దేసుంచు. నాన్నని త్వరగా వచ్చేయమని చెప్పు. ఇవ్వాళే అమ్మమ్మింటికి ఎల్లిపోవాలి” అని లోపలున్న అమ్మకి వినపడేలా కేకేసి చెప్పి పరుగున వెళ్ళి రిక్షా ఎక్కేశారు. పొద్దున్నుంచి ఇది ఏ పదిహేనోసారో అమ్మకి గుర్తు చేయడం.

క్రిస్టమస్‌కి నాలుగు రోజులు సెలవు లిస్తున్నారని తెలిసినప్పట్నుంచి అక్కా చెల్లెళ్ళిద్దరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. సంక్రాంతి పండక్కన్నా ముందు నాల్రోజులైనా అమ్మమ్మింటికి వెళ్ళొచ్చని, ఎంచక్కా గొబ్బెమ్మలు పెట్టొచ్చని, తెల్లవారే పొలాలమీద నుంచి వచ్చే మంచు తెరల్లో నడుచుకుంటూ వెళ్ళి చెరువుగట్టు మీంచి సూర్యోదయం చూడొచ్చని…

సాయంత్రం ఐదవుతుండగా అక్కా చెల్లెళ్ళిద్దరూ రిక్షా ఇంకా ఆగకముందే దూకేసి రిక్షా రాముకి బై చెప్పి ‘అమ్మా…!’ అంటూ పరిగెత్తుకొచ్చారు. వస్తూనే పుస్తకాల బ్యాగ్‌లు ర్యాక్‌లో సర్దేసి బీరువా పక్కనే పెట్టున్న బ్యాగ్‌ను చూసి ‘మా మంచి అమ్మ’ అంటూ అమ్మకి ముద్దులిచ్చి స్నానాలు చేసి రాడానికి తయారవుతుంటే ‘వేడిగా వామాకు బజ్జీలు వేస్తున్నా, త్వరగా వచ్చేయండం’టూ అమ్మ వంటింట్లోకెళ్ళింది. ఇద్దరూ తయారవుతుండగా ‘నాన్నకు క్యాంపుందంట… అమ్మమ్మింటికి మనం ముగ్గురం వెళ్తున్నాం. పిన్నాళ్ళిద్దరికీ కూడా కాలేజీకి సెలవులంట. ఇవ్వాళో, రేపో వాళ్ళు కూడా వస్తారు. ఇవ్వాళే ఉత్తరం వచ్చింది’ అన్న అమ్మ మాటలకి ‘హాయ్‌… సాయి పిన్నొస్తే బోళ్ళు గొబ్బెమ్మలు పెట్టొచ్చు’ అని అక్క అంటే ‘కోమల పిన్నితో

బోళ్ళు కథలు వినొచ్చు’ అని చెల్లి అంది. ఆరున్నరవుతుండగా వచ్చిన నాన్న ‘రిక్షాలో అయితే లేటయిపోతుంది, పదండి నేను బస్సెక్కించొస్తా’ అని యజ్దీ మీద ముగ్గుర్నీ ఎక్కించుకుని బస్టాండుకెళ్ళేసరికి బస్సు రెడీగా ఉంది. అమ్మమ్మా వాళ్ళూరికి అది లాస్ట్‌ బస్‌ అవడంతో అదెక్కడెళ్ళిపోతుందో, ఇవ్వాళ వెళ్ళలేకపోతే ‘ఒక తెల్లవారుజాము’ సంబరం పోతుందని గాభరాతో ఉన్న అక్క చెల్లెళ్ళిద్దరూ ఒక్కుదుటున బండిమీంచి దూకి పరిగెత్తుకుంటూ బస్సెక్కేశారు.

వీథిలో మనుషుల అలికిడవుతుంటే ఎవరో వచ్చారనుకుంటూ ఇంట్లోంచి బైటికొచ్చిన తాతగారు వీళ్ళ ముగ్గుర్నీ చూసి ఆశ్చర్యపోయి ‘హేయ్‌.. మీరా… రండి, రండి’ అంటూండగానే ‘తాతగారూ…’ అంటూ ఆయన్ను చుట్టేసి అంతలోనే గుమ్మం పక్కనున్న చెప్పుల్ని చూసి ‘అమ్మమ్మా… పిన్నీ…’ అంటూ లోపలికి పరిగెత్తారు. ‘చూడండి నాన్నగారూ వీళ్ళ హడావిడి, పొద్దున్నుంచీ కాలు ఒకచోట నిలవట్లేదు. తెల్లారే గొబ్బెమ్మలు పెట్టాలంట, ఇవ్వాళ రాలేకపోతే ఒకరోజు పోతుందేమో అని ఒకటే ఆత్రం, గాభరా’ అంటున్న అమ్మ మాట పూర్తయ్యేలోపు లోపల్నుంచి పిన్నిలిద్దర్తోపాటు గెంతుకుంటూ బైటకొచ్చారు అక్కచెల్లెళ్ళిద్దరు. వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే తెల్లారేదాకా నిద్ర కూడా పోరేమో అన్నట్లుంది.

అమ్మమ్మగారింట్లో… ఆ పెద్ద పెంకుటింట్లో శీతాకాలపు చలికి రగ్గులు ప్పుకు పడుకున్నా చల్లగా అనిపిస్తూనే ఉంది. అయినా స్వెట్టర్లు వేసుకోబుద్ధవ్వదు. ఐదయ్యేసరికి లేచి అప్పటికే పాలేరు తెచ్చిన ఆవుపేడ తులసికోట దగ్గర పెట్టుంటే పిల్లలంతా సాయి పిన్నితో కలిసి దాని చుట్టూ చేరిపోయారు. మంచులో కూర్చున్నా గోరువెచ్చగా ఉన్న ఆ పేడని చిన్న చిన్న ముద్దలుగా రెండు చేతుల్తో చేస్తుంటే చలే తెలీదు. ఒక అర్థ గజం స్థలాన్ని నలు చదరంగా అలికి గుండ్రంగా, నున్నగా చేసిన ఆ పేడ ముద్దల్ని వరసగా పేర్చారు. వాటిమీద తెల్లటి ముగ్గు పిండితో నిలువుగా, అడ్డంగా, మూలలకి గీతలువేసి, వాటి మధ్యలోకొచ్చేలా పసుపుని కూడా గీతలుగా వేసి, పైన కుంకుమ చల్లి, అరవిచ్చుకున్న ఎర్ర మందారాల్ని, గరుడ వర్థనాల్ని, ఎర్ర నూరు వరహాల గుత్తుల్ని, చిట్టి చేమంతి పువ్వుల్ని కోసుకొచ్చి, పైన మందారాల్ని, చుట్టూ ఏర్పడిన ముగ్గు, పసుపు గళ్ళల్లో తెలుపు, ఎరుపు, పసుపు రంగులు వరసగా వచ్చేలా మిగిలిన పువ్వుల్ని అలంకరించారు. బేసి సంఖ్యలో వచ్చేలా 21 గొబ్బెమ్మల్ని చేసి, వాటికి అగరుబత్తి ధూపమేసి, చివరగా బెల్లమ్ముక్క ఒక మందారాకులో గొబ్బెమ్మల ముందు పెట్టి దాన్ని చీమలు తింటాయా, పిచ్చుకలు తింటాయా, కాకులెత్తుకు పోతాయా అని చూస్తుంటారు. ఇంతలో బుడ్డాడు వాకిలంతా పేడకళ్ళాపి చల్లేస్తే, అమ్మమ్మ ముగ్గు గొట్టంతో వీధంతా పరుచు కున్నట్లు అందంగా సంక్రాంతి ముగ్గు పెట్టేసింది. ‘ఏఁవల్లా..అయ్యిందా..’ అని అమ్మమ్మ కేకేసే లోపు చేసేయాలని పోటీపడి గొబ్బెమ్మల్ని చేసేశారు. చిన్న గుమ్మడి పండంత తల్లి గొబ్బెమ్మకి చేర్చి పెద్ద నిమ్మపండంత పిల్ల గొబ్బెమ్మని పిన్ని పట్టుకెళ్ళి ముగ్గు మధ్యలో పెట్టారు. మిగతా వాటిని రెండు చేతుల్లో పట్టుకుని వాటిమీద సొట్టలు పడకుండా, వాటిపైనున్న అలంకరణ దెబ్బతినకుండా పట్టుకెళ్ళి వాకిట్లో ముగ్గులో ఎక్కడెక్కడ పెట్టాలో ఒకరితో ఒకరు చెప్పుకుంటూ సిమ్మెట్రిగ్గా అమర్చే సరికి వెలుగు రేఖలు పరుచుకుంటూ… మెల్లగా మంచు తెరలు కమ్మేస్తుంటే తర్వాతి ఘట్టానికి పరిగెత్తారు.

ఇంటికి తూర్పునున్న పెద్ద దొడ్డి దాటగానే చెరువు. చెరువవతలి వరిచేలమీంచి తెరలు తెరలుగా వచ్చే మంచుని చీల్చుకుంటూ వచ్చే ఎర్రటి సూర్యుడ్ని చూడ్డానికి, ఆ సూర్యకిరణాలకి విచ్చుకునే చిన్ని తెల్ల గడ్డి పువ్వుల్ని చూడ్డానికి, సన్నటి పచ్చిక మీద పేర్చినట్లుండే మంచు ముత్యాలు అరిపాదాలని జివ్వుమని పిస్తుంటే వెళ్ళి వేపచెట్టు కిందున్న చప్టామీద వరిగడ్డి మోపుని పరిచి మునగదీసుకుని కూర్చుని, నోట్లోంచి చల్లదనానికొచ్చే పొగని ఒదుల్తూ, ఎగురుతున్న పిట్టల్ని చూస్తూ, వాటి కమ్మటి పాటల్ని వింటూ… గాలివాటుకి ఎక్కడ్నుంచో హరిదాసు పాట లయబద్ధమైన తాళాల సవ్వడితో వినిపించగానే పరిగెత్తి ఇంట్లోకెళ్ళి బియ్యం, పప్పు, ఉప్పు, ఎండు మిరపకాయలు, చింతపండు, రెండు రకాల కూరగాయలు విడివిడిగా పొట్లాలు కట్టి రోజుకొకరికి స్వయంపాకం ఇవ్వడం ఎంతో మానవీయంగా ఉంటుంది.

‘ఆ పేడ పట్టుకుని ఈ చలిలో ఎంత సేపు కూర్చుంటావు మమ్మీ… ఛీఛీ.. కంపు…’ అంటున్న పిల్లల మాటలకి ఈ లోకంలోకొచ్చింది. హబ్బ, ఎంత అద్భుతమైన రోజులవి! అవన్నీ ఏమైపోయినై? ఆ స్వచ్ఛమైన వాతావరణం, సహజమైన పదార్థాలు, శాస్త్రీయతతో కూడుకున్న ఆచారాలు, మానవీయ కోణాలతో దానాలు, ఇచ్చిపుచ్చుకోడాలు, కలిసి భోంచేయడాలు, పనివారికి ధాన్యం కొలవడాలు, వలస పోయిన గంగిరెద్దుల కుటుంబాలు పండక్కి ఊర్లోకొస్తే వాళ్ళకోసం తీసిపెట్టిన బట్టలు, ధాన్యం పంచడం… ఎంత రమణీయంగా, రసమయంగా, మాన వీయంగా ఉండేది. సాటి జాతుల పట్ల విలువ, గౌరవం ఏమయ్యాయి? అసలు ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో సహజీవనం, ప్రకృతి వనరులతో, పశుపక్ష్యాదులతో సంబంధం… ఇవేమీ లేని నేటి జీవితాలకి కారణం పట్టణీకరణా? ప్రపంచీకరణా? వీటివలన మానవ సంబంధాలు విస్తృతమవుతున్నాయా? కుచించుకు పోతు న్నాయా? దీన్ని అభివృద్ధి అందామా? ఇదేనా మనం కోరుకుంటున్న అభివృద్ధి?

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>