నేల తల్లి…. గంగ తల్లి…. అడవి తల్లి

ఆర్‌.శాంతసుందరి
వైష్ణోదేవి… అమర్‌నాథ్‌… తిరుపతి… సింహాచలం… ఇలా ఎన్నో పుణ్య క్షేత్రాలు. అన్నీ కొండలపైనే. చేరుకోవటం కష్టం. ఎంతమంది భక్తులు కాలినడకన కొండెక్కి మొక్కు తీర్చుకుంటారు!
అక్కడ ఆలయాల్లో భద్రంగా, పూజారులు పర్యవేక్షణలో ‘వెలిసిన’ దేవుళ్లనీ, దేవతలనీ చూసి, ‘తరించి’ ఆనందంగా వెనక్కి వస్తారు. మేము కూడా కొండలెక్కాం. మొక్కుబడులు తీర్చుకోవటానికి మాత్రం కాదు. అక్కడి స్త్రీల ధైర్య సాహసాలకి మొకరిల్లి వెనక్కి వచ్చాం. ఆ విషయం చెపుతాను… కొంచెం ఆగండి.
‘భూమిక’ ప్రతి సంవత్సరం ఏర్పాటుచేసే మూడురోజుల ‘యాత్ర’ ఈసారి వినోద యాత్రలాగ, విహారయాత్రలాగ కాకుండా, విభిన్నంగా జరిగింది. ఆలోచనల్ని రేకెత్తించి, నాలో ఎన్నో ప్రశ్నల్ని లేపి, నన్ను నేను తెలుసు కునేలా, నా జీవితాన్నీ, నా అస్తిత్వాన్నీ కొత్తగా బేరీజు వేసుకునేలా ఈ యాత్రని ఏర్పాటు చేసిన సత్యవతికి ముందుగా మనస్ఫర్తిగా కృతజ్ఞతలు చెప్పాలి.
స్త్రీని ప్రకృతితో పోలుస్తారు… ప్రకృతి – పురుషుడు, అంటారుగా! ఆ ప్రకృతికి ప్రతిరూపమైన స్త్రీలని… ఎన్నో రకాలుగా గాయపడ్డవాళ్లని… చూశాను. వాళ్లగురించి వార్తాపత్రికల్లో ఇంతకుముందు చదివాను, టీవీలో చూశాను. కానీ వాళ్ల బాధనీ, కన్నీళ్లనీ, గాయపడ్డ వాళ్ల జీవితాలనీ, ఆత్మాభిమానాన్నీ, వాళ్ల పోరాటాన్నీ, ఆత్మస్థైర్యాన్నీ, సాహసాన్నీ ప్రత్యక్షంగా చూడటం నాకిదే మొదటిసారి… అందుకే విపరీతంగా చలించిపోయాను. సుఖంగా, భద్రంగా, దేనికీ లోటులేకుండా, వడ్డించిన విస్తరిలా ఉన్న నా జీవితాన్ని ఎవరో ఒక్కసారి పెద్దగా కుదిపేసినట్టయింది! కథల్లోనూ, టీవీలోనూ, సినిమాల్లోనూ పల్లె జీవితాన్ని ఎంత రొమా౦టిక్‌గా, ఎంత అవాస్తవికంగా చూపిస్తారో ఇంతకుముందే ఊహించి ఉన్నప్పటికీ మొహం మీద ఒక్క చరుపు చరిచి, ‘నిద్రలే! నిజాన్ని చూడు!’ అని ఎవరో అన్నట్టు అనిపించింది నాకు!
మా ప్రయణం దాదాపుగా కొండలమీదే సాగింది. కానీ ముందుగా మేము వెళ్లింది సముద్రతీరానికి – గంగవరానికి. అక్కడి సముద్రం ఎవరి కళ్లనీ కనబడకుండా పోర్టు నిర్మిస్తున్నవాళ్లు పన్నెండడుగుల గోడని కట్టేశారు. గోడకవతల సముద్రం… ఆ సముద్రాన్నే నమ్ముకుని ఎన్నో దశాబ్దాలుగా బతుకుతున్న మత్స్యకారులు గోడకి ఇవతల. వాళ్లు తమ గోడు వెళ్లబోసుకుంటే విన్నాం. మాటల కందని విషాదం వాళ్ల ముఖాల్లో కనబడింది. కన్న కొడుకుని, ఎదిరించాడన్న కారణం చేత, పోలీసులు తుపాకీతో కాల్చిపారేస్తూ ఒక తల్లి శూన్యంలోకి చూస్తూ మూర్తీభవించిన విషాదంలో కనిపించింది. ఆమె కళ్లల్లో గడుకట్టుకున్న విషాదం ఆమె, ఆమె తోటి స్త్రీల పోగొట్టుకున్న సముద్రం కన్నా లోతుగా ఉంది. ఆమె ముఖంలో కదలాడిన భావాలు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి!
ఆ తరవాత ఆ పక్కనే ‘పోర్టు సునామీ’ కి బలైన దిబ్బపాలెం వెళ్లాం. సునామీ, భూకంపం లాంటివి ప్రకృతి సిద్ధమైనవి. కానీ అలాంటివేమీ రాకుండానే నేలమట్టమైన ఇళ్లు, కూలిన బతుకులు, పాడుపడ్డ పల్లె! రాక్షసబల్లుల్లా దూరంగా తిరిగే పెద్దపెద్ద వాహనాలు!
మాటల్లోనే సముద్ర ఘోషనీ, కళ్లల్లో సముద్రపు లోతుల్నీ నింపుకున్న మత్స్యకారుల స్త్రీలని కలిసి, తినటానికి సరైన తిండీ, ఉండటానికి తమదంటూ ఒక గడ లేకుండా పోయినప్పటికీ ఉద్యమ స్పూర్తితో పోరాడుతున్న వారిని చూశాక, మా తరువాతి గమ్యం విశాఖ సెంట్రల్‌ జైలు. అక్కడ ముందు జైలు సిబ్బందితో కలిసి మధ్యాన్న భోజనం ముగించాక స్త్రీ ఖైదీలని కలిశాం.
ఇక్కడ వాతావరణం పూర్తిగా వేరుగా ఉంది. గంగవరంలోని స్త్రీలలాగ వీళ్లు ముందుకొచ్చి, మనసువిప్పి మాట్లాడలేదు. ఎలా మాట్లాడగలరు? గంగవరం స్త్రీలందరూ ఒకే వర్గానికీ, ఒకే రకమైన జీవన విధానానికీ చెందినవారు. వీళ్లు జైలుకొచ్చేదాకా ఒకరి ముఖం ఒకరు చూసి ఎరగరు. ఒక్కొక్కరిదీ ఒక్కో ధోరణి. సత్యవతీ, లక్ష్మీ, జైలు సపరింటెండెంటూ నెమ్మదిగా వాళ్లని మాటల్లోకి దించారు. అప్పుడు కొందరు తమ కథ చెప్పారు. జైలుకి ఎలా వచ్చారో, ఎందుకు వచ్చారో చెప్పారు. కొందరు ఏడ్చారు. కొందరు చిరునవ్వు ముఖంతో ఉన్నారు, అది విరక్తితో కూడిన నవ్వని మాకర్థమైంది. కొందరి ముఖాల్లో, కోపం, ఉద్రేకం కనిపించింది. కొద్దిమంది మాత్రం నిర్లిప్తంగా ఉండిపోయారు. వాళ్లు ఉన్నది మా ఎదురుగానే అయినా వాళ్ల మనసు ఇంకెక్కడో (బహుశా వాళ్ల ఇంట్లో దిక్కు లేకుండా ఉన్న పిల్లల దగ్గర అయి ఉంటుంది) ఉన్నట్టనిపించింది. ఆ స్త్రీ ఖైదీల్లో చాలా మంది జీవిత ఖైదీలున్నారు… అంటే హత్యకేసులన్నమాట! చాలా మట్టుకు అబద్ధపు కేసుల్లో ఇరికించబడ్డ వారే. వాళ్ల మొదటి నేరం స్త్రీలవటం, దానికి తోడు పేదవారవటం!
జైల్లో స్త్రీల కథలు విన్న మా గుండెలు భారమయ్యయి. అలాగే ఒక దయాగుణం గల వ్యక్తి, రాజుగారు, ఆ పిల్లల సంరక్షణ భారం తీసుకున్నారని తెలిసి మనసులోనే ఆయనకి నమస్కారం చేశాను.
ఇక నన్ను విపరీతంగా కదిలించిన అసలు యాత్ర… వాకపల్లి. వాకపల్లి గురించి చదివాం, విన్నాం, బాధపడ్డాం… మర్చిపోయా౦! ఎందుకంటే అది ‘అలాంటి’ వార్తల్లో ఒక వార్తగా మాత్రమే కాసేపు బాధపెట్టింది. సగటు మనిషిగా జీవితాన్ని గడుపుతున్న నాకు ఏవో అస్పష్టమైన ఆదర్శాలైతే ఉన్నాయి కాని, ఉద్యమకారుల్లా అనునిత్యం ఇటువంటివి చూడటం జరగదు.
కొండ ఎక్కేముందు మేము చూడ బోయే దాన్ని గురించీ, వినబోయే దాన్ని గురించీ, పూర్తిగా తెలీని పరిస్థితి నాది. పైగా చాలా గొప్పగా, ‘బాధల్లో ఉన్న వాళ్లని చూసి, కన్నీళ్లు కార్చి బాధపడకూడదు, జరిగిన అన్యాయానికి కోపం తెచ్చుకోవాలి!’ అంటూ కొండెక్కుతున్నప్పుడు ఒక ఉచిత సలహా కూడా ఇచ్చాను!
మా వెంట వచ్చిన గిరిజన యువ కుల, మా ‘గైడు’ రావరావు దొర, దారి చూపించగా ఎలాగైతేనేం కొండమీదికి చేరుకున్నాం. ఎక్కడ చోటు దొరికితే అక్కడ కూర్చున్నాం. కాసేపటికి గ్రేహౌండ్స్‌ దౌర్జన్యా నికి గురైన స్త్రీలు వచ్చి మా మధ్యన కూర్చున్నారు. అమాయకంగా, అడవిలో పెరిగే పిచ్చి పువ్వుల్లా ఉన్న బక్కపల్చని అమ్మా యిలు! కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు. (సత్యవతి ముందే, ‘మనమెవ్వరం వాళ్లని ప్రశ్నలు వెయ్యొద్దు. వాళ్లు ఏం చెపితే అది విందాం!’ అని మా అందర్నీ హెచ్చ రించింది.) ఆ తరవాత సత్యవతే నెమ్మదిగా, వాళ్లల్లో తెలుగు తెలిసిన అవ్మయెవరైనా ఉంటే ఆమెని మాట్లాడమని అడిగింది. ఒకమ్మాయి ముందుకొచ్చి దాదాపు 20-25 నిమిషాలు జరిగిన సంఘటన గురించి చెప్పింది. చాలా ధైర్యంగా, తాము పోలీసులకి భయపడ కుండా, వాళ్లు చూపే ప్రలోభాలకి గురికాకుండా ఎలా పోట్లాడు తున్నారో చెప్పింది. చివరికి ఆ జరిగిన సంఘటన మూలంగా తాము సొంత తల్లిదండ్రులకీ, అన్నదమ్ములకీ, ఎలా దూరమయ్యరో, ఊళ్లోకి స్వేచ్ఛగా వెళ్లి ఎప్పటిలా ఎలా పనిచేసుకోలేకపోతున్నారో చెప్పినప్పుడు ఆమె ఏడుపు ఆపుకోలేక పోయింది. అంటే దాదాపు సంవత్సరం పైగా ఆ 11 మంది స్త్రీలూ ‘ఖైదు’ లో ఉన్నట్టే. తప్పు ఎవరో చేసి, వాళ్లు హాయిగా, స్వేచ్ఛగా బతుకు తున్నారు, చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్న వాళ్లు మాత్రం ఈ అమాయక స్త్రీలు!
ఆ స్త్రీలు ఏడవటం చూసి, ‘భూమిక’ సభ్యులందరూ కంటతడి పెట్టారు. ‘కోపం తెచ్చుకోవాలి, కన్నీళ్లు కార్చకూడదు,’ అని నేనిచ్చిన ‘గొప్ప’ సలహా నాకే పనికి రాకుండా పోయింది. వాళ్లకి న్యాయం చెయ్యటం మాకు అలవికాదని తెలిసి, ఆ నిస్సహాయత లోంచి పుట్టిన దుఃఖం!
మేమూ కొండలెక్కాం… ఎక్కి దిగటానికి చాలా కష్టపడ్డాం. కానీ కొండ మీద మేము చూసింది రాతి దేవుళ్లని కాదు. రక్తమా౦సాలతో సజీవంగా ఉన్న స్త్రీలని. వాళ్లకి మేము పూజల, నైవేద్యాలు సమర్పించలేదు. మాకు చాతనైనంతలో ‘మీకు మేమున్నాం!’ అని ధైర్యం చెప్పటానికి ప్రయత్నించాం. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే, వాళ్లు సంవత్సరం పైగా పోరాటాన్ని సాగిస్తున్నారు, డబ్బుకీ, బెదిరింపు లకీ లొంగకుండా నిలబడి ధైర్యంగా పోరాడు తున్నారు, మరి మేము వాళ్లకి ధైర్యం చెప్పటమేమిటి? అనిపిస్తుంది. బహుశా మాకు మేమే ధైర్యం చెప్పుకునే ప్రయత్నం చేశామేమొ!
వాకపల్లినించి తిరుగు ప్రయాణం నామటుకు నాకు ఎంతో ప్రయాసతో కూడుకున్నట్టు అనిపించింది. కారణం, వెళ్లేప్పుడు లేని వాళ్ల దుఃఖం తాలూకు భారం వచ్చేప్పుడు అడుగులు దృఢంగా వెయ్య నియ్యలేదు. నా తలలో పూర్తి శూన్యం! ఏమీ మాట్లాడాలనిపించలేదు. పడ కుండా ఎలాగోలాగ బస్సుదాకా నడవ గలిగాను. బస్సెక్కి కళ్లు మూసుకుని నా చుట్టూ జరుగు తున్న విషయాలని పట్టించు కోకుండా ఒక సమాధిలాంటి స్థితిలోకి వెళ్లిపోయాను మధ్యాన్నం ఎవరూ భోజనాలు చెయ్యలేదు.
ఎస్‌.కోటలో బస్సు ఆగేదాకా అలాగే ఉన్నాను. ఎస్‌.కోటలో మేము చూసినది పోరాటంలో కొద్దో గొప్పో నెగ్గిన ఇద్దరు స్త్రీలని. వాళ్ల వయసు కూడా చాలా తక్కువే. అయినా వాళ్లకి ఉన్న సామాజిక బాధ్యతనీ, హక్కులపట్ల వాళ్లకున్న అవగాహననీ చూసి వాళ్లపట్ల ఎంతో గౌరవం కలిగింది. అందులో దేవుడమ్మ అనే యువతి వాళ్లకి లీడరు. ఆమెను చూసి స్పూర్తి పొందిన యువతి పార్వతి. పోలీసులచేత క్షమాపణ చెప్పించుకున్న ఆ ‘బాక్సైట్‌ వ్యతిరేక పోరాట వీరనారులని’ చూసి, పట్టణాల్లో ఉండి, పెద్ద చదువుల, సంపాదన ఉన్న స్త్రీలు, తమ కుటుంబ సమస్యలనీ, ఉద్యోగం చేసేచోట తలెత్తే సమస్యలనీ, ఈ మాత్రం ధైర్యంతో ఎదుర్కోలేకపోతున్నారెందుచేత? అనే ప్రశ్న నా మనసులో తలెత్తింది. వీళ్లని గురించి ‘భూమిక’ లో రాసిన వివరాలు (అందరూ రాస్తారు కదా!) చదివి కొందరైనా స్పూర్తిని పొందితే, మా ఈ ‘యాత్ర’ విజయ వంతమైనట్టే అని భావిస్తాను.
సత్యవతి ఈ ప్రయాణం గురించి రాయమన్నప్పుడు ఏం రాయలో, ఎలా రాయలో, ఎక్కడ మొదలు పెట్టాలో కూడా తెలీలేదు. తోటి స్త్రీగా గంగవరం, దిబ్బపాలెం, వాకపల్లి స్త్రీల బాధని పంచు కోవటం, వాళ్ల గురించి తెలియని వాళ్లకి చెప్పటం తప్ప, ఎన్ని వేల పేజీలు రాస్తే వాళ్ల ఒక్క కన్నీటి బొట్టుకి సరితూగ గలవు? వాళ్లకి న్యాయం జరిగేదాకా ఆ అన్యాయం నాకే జరిగినట్టు బాధపడుతూ ఉంటాను. ఆ అన్యాయం గురించి వీలైనంత మందికి చెపుతాను… అంతే!

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.