జ్యోతిబాకు సావిత్రి రాసిన సాటిలేని ప్రేమలేఖలు మరాఠీ నుండి అనువాదం, పరిచయం : సునీల్‌ సర్దార

సావిత్రిబాయి తన భర్త జ్యోతిరావుకు మరాఠీలో రాసిన మూడు లేఖల ఇంగ్లిష్‌ అనువాదాలను ఇక్కడ ఇస్తున్నాం. (ఇవి ఎం.జి.మారి సంపాదకత్వంలో వెలుబడిన సావిత్రీ బాయి సమగ్ర సాహిత్య గ్రంథం ‘సావిత్రీ బాయిఫూలే సంగ్రహ వాంగ్మయం’లోనివి). ఆమె ఈ లేఖలను దాదాపు 20 సంవత్సరాల కాల వ్యవధిలో రాసింది. ఈ లేఖలకు గొప్ప ప్రాధాన్యత ఏర్పడటానికి అనేక కారణాలున్నాయి. వీటినిండా ఒక భార్యకు భర్తమీదున్న అంతులేని ప్రేమ పొంగిపొరలుతూ ఉంది. ఐతే, అది మనకు తెలిసిన సాధారణ రీతిలోని ప్రేమకాదు. సావిత్రీ బాయికి భర్త మీదున్న అనురాగమూ, అట్టడుగు ప్రజల విముక్తి ఉద్యమం పట్ల ఆమెకున్న నిబద్ధతా ఎంతగా కలగలిసి పోయాయో తెలుసుకోటానికి గొప్ప సాక్ష్యాలు ఈ లేఖలు. అజ్ఞానమూ, అవిద్యా, బానిసత్వమూ, ఆకలీ లేని ఒక నూతన విముక్త సమాజాన్ని నిర్మించాలన్న ఒక ఉమ్మడి స్వప్నం ఆ జంటను ఒకటిగా కలిపింది. వ్యక్తిగత, సామాజిక జీవితాల మధ్యన అంతరాలను అధిగమించి ఒక గొప్ప లక్ష్యానికి అంకితమైన వ్యక్తులు వాళ్ళు. సామాజిక విప్లవకారుడైన తన భర్తకు సావిత్రి అందించిన

ఉద్వేగభరితమైన ప్రోత్సాహమూ, మద్దతూ ఎలాంటిదో తెలియ జేస్తాయీ లేఖలు. ఫూలే ప్రారంభించిన సామాజిక పునర్నిర్మాణోద్య మానికి పందొమ్మిదవ శతాబ్దపు మహారాష్ట్రలోని దాదాపు అన్ని ఆధిపత్య శక్తులూ వ్యతిరేకంగా తలపడిన సమయంలో ఆయన జీవన సహచరి అందించిన ప్రేమా, మద్దతూ సాటిలేనివి. పీడిత విముక్తి పోరాటంలో జ్యోతిబాఫూలేతో సమానస్థాయిలో పాలు పంచుకున్న సావిత్రీ బాయిని ఈ ఉత్తరాల్లో మనం చూస్తాం.

ఇందులోని మొదటి ఉత్తరాన్ని సావిత్రీబాయి 1856లో రాసింది. బ్రాహ్మణులు తరతరాలుగా విద్యా, విజ్ఞానాలపై గుత్తాధిపత్యం చెలాయిస్తూ పీడిత కులాలను అజ్ఞానంలోకి తోసివేసి, తద్వారా వాళ్ళపై అధికారం చేస్తున్నారని సావిత్రీ బాయి ఈ

ఉత్తరంలోరాసింది. పీడిత ప్రజలను బానిసత్వం నుండి విముక్తి చేసే సాధనంగా విద్య ఎంతగొప్ప పాత్రను నిర్వర్తించగలదో ఆమె ఇందులో వివరించింది. అనారోగ్యం వల్ల పుట్టింటికి వెళ్ళిన సావిత్రి, అక్కడ తనకూ, తన అన్నగారికీ జరిగిన సంభాషణను కూడా ప్రస్తావించింది. జ్యోతిబా, సావిత్రీ ఈ విధంగా కులధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించటం సరైందికాదనీ, ఇకనైనా వాళ్లిద్దరూ బ్రాహ్మణుల పట్ల విధేయతతో వ్యవహరించటం అవసరమని అన్నగారు సావిత్రితో వాదించాడు. తాను ఆయనతో తీవ్రంగా విభేదించారనీ, పూనేలో తాను బాలికలకూ, స్త్రీలకూ, మహర్‌లకూ విద్యాబోధన చెయ్యటం సామాజిక ప్రయోజనం కోసమేనని స్పష్టం చేశాననీ సావిత్రీ బాయి రాసింది. ”విద్యరాని మనిషి పశువుతో సమానం. బ్రాహ్మణులకు సమాజంలో ఉన్నతస్థానాన్ని కల్పించింది వాళ్ళకున్న విద్యా పరిజ్ఞానమే. చదువూ, విజ్ఞానమూ ఎంతో

ఉన్నతమైనవి. విద్యావంతులైన వ్యక్తులు తమ లోపాలన్నిటినీ అధిగమించి సాంఘిక గౌరవాన్ని పొందగలుగుతారు” అంటూ అన్నగారితో వాదించింది సావిత్రీ బాయి.

అక్టోబర్‌ 1856

సత్య స్వరూపులైన నా భర్త జ్యోతిబాకు,

సావిత్రి నమస్కారాలు!

ఎన్నో ఇబ్బందుల తర్వాత, ఇప్పటికి నా ఆరోగ్యం పూర్తిగా కుదుటబడింది. నేను జబ్బుతో ఉన్నన్నాళ్ళూ మా అన్నయ్య నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆయన చూపిన శ్రద్ధా, చేసిన సేవలూ చూస్తుంటే తనకు నా మీద ఎంత ప్రేమోకదా అన్పించింది! ఇంకాస్త ఓపిక చిక్కగానే పూనేకు వచ్చేస్తాను. నా గురించి మీరేమీ బెంగపడకండి. నేను అక్కడ లేకపోవటం వల్ల ఫాతిమా ఎంతో ఇబ్బంది పడి ఉంటుంది. ఐనా ఆమె అన్ని విషయాలనూ అర్థం చేసుకుంటుందని నాకు తెలుసు. ఓ రోజున అన్నయ్యా, నేనూ ఏదో మాట్లాడుకుంటూ ఉండగా. ” అంటరానివాళ్ళ (మహర్‌, మాంగ్‌లు) కోసం నువ్వు, నీ భర్తా చేస్తున్న సేవలకు మిమ్మల్ని ఇప్పటికే కులం నుంచి వెలివేశారు. ఆ తక్కువ జాతి మనుషులకు సాయం చెయ్యడానికని మీరు మన కుటుంబానికి మచ్చ తెస్తున్నారు. ఇప్పటికన్నా కుల ధర్మాన్ని తెలుసుకుని, బ్రాహ్మణులు చెప్పినట్టుగా నడుచుకుంటే బాగుంటుంది” అన్నాడు అన్నయ్య. ఆయన దురుసుతనానికి అమ్మ బాగా నొచ్చుకుంది. అన్నయ్య మంచివాడే అయినప్పటికీ, చాదస్తాలు ఎక్కువ. అందుకే అంత తీవ్రంగా మనల్ని విమర్శించగలిగాడు. అమ్మ కల్పించుకుని ఆయనకు సర్దిచెప్పింది. ”భగవంతుడు నీకు నాలుకనిచ్చింది దాన్ని ఇష్టమొచ్చినట్టు వాడడానిక్కాదు” అని అన్నయ్యను కోప్పడింది. నేను మాత్రం మనం చేస్తున్న పనుల్లోని మంచిని వివరించి చెప్పి, ఆయనకున్న అపార్థాలను పోగొట్టే ప్రయత్నం చేశాను. ”అన్నయ్యా, నీకసలే చాదస్తాలెక్కువ. బ్రాహ్మణుల మాటలు నిన్ను ఇంకాస్త చెడగొట్టాయి. మేకలు, ఆవులూ లాంటి జంతువలన్నిటినీ ప్రేమగా నిమురుతావు. వాటిపట్ల అంటరానితనమనే భావన లేదు. విషంగక్కే నాగుపాముకూ నాగులచవితినాడు పాలుపోస్తావు. కానీ, మన సాటి మనుషులైన మహర్‌లనూ, మాంగ్‌లనూ అంటరాని వాళ్ళంటూ దూరంగా

ఉంచుతావు. ఈ ఆచారంలో ఏమన్నా అర్థముందా చెప్పు? ఆ బ్రాహ్మణులు మడికట్టుకుని పూజలు చేసేటప్పుడు నిన్నూ అంటరాని వాడిగానే చూసి, దూరంగా ఉంచుతారు. నిన్ను ముట్టుకుంటేనే మైలపడిపోతుందంటారు. మహర్‌లకూ, నీకూ వాళ్ళ దృష్టిలో తేడా ఏమీ లేదు” అన్నాను.

నా మాటలు అన్నయ్య ముఖం ఎర్రబడింది. ”అ మహర్‌లకూ, మాంగ్‌లకూ చదువులు చెప్పకపోతేనేం? అలాంటి పనులు చేస్తున్నందుకు నిన్ను నలుగురూ నానామాటలూ అంటుంటే నాకు బాధగా ఉంటుంది. నువ్విట్లా తిట్లూ, అవమానాల పాలవటం నాకు నచ్చటం లేదు” అన్నాడు. ఇంగ్లిష్‌ నేర్చుకోవటం ఈ ప్రజలకు ఎంత మేలు చేస్తుందో ఆయనకు ఓపిగ్గా వివరించాను.

”విద్య లేనివాడు వింతపశువన్నారు కదా! ఆ బ్రాహ్మణులు అంత గొప్ప స్థానంలో ఉన్నారంటే దానిక్కారణం వాళ్ల చేతులో

ఉన్న విద్యే. చదువూ, విజ్ఞానమూ చాలా ఉన్నతమైనవి. విద్యావంతుడైన మనిషి తన లోపాలన్నిటినీ జయించి గొప్ప గౌరవాన్ని పొందుతాడు. నా భర్త దేవుడి వంటి మనిషి. ఆయనతో సాటిరాగల వాళ్ళు లోకంలో చాలా అరుదు. అంటరానివాళ్ళ విముక్తి చదువుతోనే సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయం. అంటరానివాళ్ళు కూడా ఇతరుల్లాగానే గౌరవంగా బతికేట్టు చెయ్యాలన్న పట్టుదలతోనే ఆయన వాళ్ళకు చదువు చెప్తున్నాడు. ఈ లక్ష్యం కోసం బ్రాహ్మణులనుఎదిరించి నిలబడుతున్నాడు. నేను కూడా అదే ఆశయంతో వాళ్ళకు చదువు నేర్పుతున్నాను. మేం చేస్తున్నది నేరమా? బాలికలకూ, మహిళలకు, మాంగ్‌ – మహార్లకూ మేం విద్య నేర్పుతున్నాం. వీళ్ళందరూ విద్యావంతులైతే తమకు ఎదురు తిరుగుతారన్న భయంతో బ్రాహ్మణులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ఇదంతా వాళ్ళ సంప్రదాయాలకు విరుద్ధమని మమ్మల్ని తిట్టిపోస్తున్నారు. మమ్మల్ని వెలివెయ్యడమేగాక, నీవంటి మంచి వాళ్ళ మనసుల్లోనూ విషం పోస్తున్నారు.

నా భర్త చేస్తున్న మంచి పనుల్ని గౌరవిస్తూ బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనకు సన్మానసభ ఏర్పాటు చేసిన సంగతి నీకు గుర్తుండే

ఉంటుంది. ఆయనకు అంత గౌరవం లభించడంతో వీళ్ళ కడుపు మండిపోతోంది. నా భర్త నీలాగా భగవంతుడి జపం చేస్తూ, తీర్థయాత్రలకు తిరగకపోవచ్చు. కానీ భగవంతుడి ఆదేశాలను అక్షరాలా అనుసరిస్తున్నాడాయన. ఆ పనిలో ఆయనకు నేను సహాయపడుతున్నాను. అందుకు నామనసు ఆనందంతో పొంగిపోతోంది. మానవులు ఎంత గొప్ప కార్యాలను సాధించగలరో చెప్పటానికి ఇంతకన్నా తార్కాణం అక్కరలేదు.”

నేను చెప్పిన మాటలను అమ్మా, అన్నయ్యా, శ్రద్ధగా విన్నారు. తన మాటలకు అన్నయ్య సిగ్గుపడి క్షమాపణ కోరాడు. ”సావిత్రీ, నీనోట భగవంతుడే ఈ మాటలు పలికించాడు. నీజ్ఞానంతో, ఉపదేశంతో మేము ధన్యులమయ్యాం” అంది అమ్మ. ఆమె మాటలకు నామనసు నిండిపోయింది. పూనేలో లాగానే ఇక్కడ కూడా కొందరు దుష్టులు ప్రజల మనసులను విషపూరితం చేస్తున్నారన్న సంగతి ఈ విషయాలతో మీకు అర్థమయ్యే ఉంటుంది. వాళ్ళు మనమీద దుష్ప్రచారం చేస్తున్నారు. అంతమాత్రాన మనం జడిసిపోయి, మన ఆదర్శాన్ని వదులుకోగలమా? చేపట్టిన పనిలో ముందుకు సాగటమే మన కర్తవ్యం. ఈ అడ్డంకులన్నిటినీ మనం అధిగమించగలమనీ, భవిష్యత్తు మనదేననీ నా విశ్వాసం.

ఇక విశేషాలేమున్నాయి రాయటానికి?

నమస్కారాలతో

మీ

సావిత్రి

సావిత్రీ బాయి రాసిన రెండోఉత్తరం ఇది. ఒక తీవ్రమైన సాంఘిక నిషేధాన్ని ఎదిరించిన యువతీ యువకుల గురించి ఆమె ఇందులో రాసింది. ఒక బ్రాహ్మణ యువకుడూ, అస్పృశ్యకులానికి చెందిన యువతీ ప్రేమించుకున్నందుకు గ్రామస్తులు వాళ్ళ మీద పగబట్టి వాళ్ళ ప్రాణాలు తియ్యటానికి పూనుకున్నారు. అప్పుడు సావిత్రీబాయి ముందుకొచ్చి ఆ ప్రేమికులను రక్షించి, క్షేమంగా గ్రామం నుంచి జ్యోతిరావు వద్దకు పంపివేసింది. కులాంతర ప్రేమికుల రక్షణకోసం సావిత్రీ బాయి ఎంత త్వరగా స్పందించిందో, ఎంత ధైర్యంగా సమస్యను పరిష్కరించిందో ఈ ఉత్తరం ద్వారా తెలస్తుంది. 1860లలో, అందులోనూ గ్రామీణ ప్రాంతంలో ఆమె ప్రదర్శించిన తెగువ ఈ నాటికీ ఎంతో విప్లవాత్మకమైనదే.

29 ఆగస్టు 1868

నయ్‌గాఁవ్‌, పేటఖండాలా

సతారా.

సత్యస్వరూపులైన నా భర్త జ్యోతిబాకు

సావిత్రి నమస్కారాలు!

మీ ఉత్తరం అందింది. ఇక్కడ మేమంతా క్షేమం. వచ్చేనెల ఐదవ తారీకున నేను అక్కడికి వచ్చేస్తాను. మీరు నాగురించి ఆందోళన పడకండి. అన్నట్టు ఈ మధ్య ఇక్కడొక చిత్రమైన

సంఘటన జరిగింది. ఈ గ్రామంలో గణేష్‌ అనే బ్రాహ్మణ యువకుడున్నాడు. చుట్టుపక్కల గ్రామాలు తిరిగి మతపరమైన విధులు నిర్వహించటమూ, జాతకాలు చెప్పటమూ అతని వృత్తి. మహర్‌ (అస్పృశ్యులు) కులానికి చెందిన షార్జా అనే అమ్మాయితో ఈ గణేష్‌ ప్రేమలో పడ్డాడు. వాళ్ళ ప్రేమ వ్యవహారం బయట పడేనాటికే ఆ అమ్మాయి ఆరు నెలల గర్భవతి. గ్రామస్థులు ఆగ్రహంతో వాళ్ళిద్దరినీ పట్టుకుని ఊరంతా ఊరేగించి, చంపి పారేస్తామని బెదిరించారు.

వాళ్లిద్దరినీ హత్య చెయ్యబోతున్నారన్న సంగతి నా చెవిన పడిన వెంటనే అక్కడికి పరిగెత్తాను. వాళ్ళను హ్యతచేస్తే బ్రిటిష్‌ ప్రభుత్వపు ఆగ్రహానికి గురికావలసి ఉంటుందని హెచ్చరించాను. దాంతో వాళ్ళా హత్యాప్రయత్నాన్ని విరమించుకున్నారు.

వాళ్ళిద్దరినీ గ్రామం నుండి వెళ్ళిపొమ్మని సాధూభావు ఆదేశించగా, ఆ జంట అంగీకరించింది. నేను కలగజేసుకోక పోతే తమ ప్రాణాలు దక్కేవి కావంటూ వాళ్ళు నా పాదాలపైపడి కన్నీళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళను ఓదార్చి ధైర్యం చెప్పాను. వాళ్ళిద్దరినీ ఇప్పుడే మీ వద్దకు పంపుతున్నాను. ఇంతకంటే ఏం రాయను?

మీ

సావిత్రి

సావిత్రీ బాయి రాసిన ఈ మూడవ లేఖ 1877 నాటిది. మహారాష్ట్రలో సంభవించిన తీవ్ర దుర్భిక్షాన్ని గురించి హృదయ విదారకమైన విషయాలను ఈ లేఖ వెల్లడిస్తుంది. మనుషుల, జంతువుల మరణాలు లెక్కకు అందటం లేదు. సావిత్రీ, ఇతర సత్యశోధక సమాజ కార్యకర్తలూ కరువు బాధితులకు ఎంతో సేవచేశారు. ఈ కరువు పరిస్థితులను తమ స్వప్రయోజనాలకు అనువుగా వాడుకుంటూ దోపిడీ చెయ్యటానికి కొందరు స్వార్ధపరులు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళను ఎదుర్కోటానికి సావిత్రి ఆధ్వర్యంలో సత్యశోధక కార్యకర్తల బృందం పూనుకున్నది. ఆమె ధైర్యంగా జిల్లా కలెక్టరును కలుసుకుని, తక్షణ సహాయం కోసం అభ్యర్థించింది. ఈ లేఖ చివరన సావిత్రీ బాయి, తన భర్త చేపట్టిన మానవీయ

ఉద్యమానికి తన పూర్తి నిబద్ధతను ప్రకటించింది. మానవ సేవే మాధవసేవన్న తన విశ్వాసాన్నీ, జ్యోతిబాకు ఉద్యమంలో కడదాకా కలసి నడవాలన్న దృఢనిశ్చయాన్నీ సావిత్రీబాయి ఈ లేఖలో వ్యక్తం చేసింది.

20 ఏప్రిల్‌ 1877

ఓతూర్‌, జున్నెర్‌

సత్యస్వరూపులైన నా భర్త జ్యోతిబాకు

సావిత్రి నమస్కారాలు!

1876వ సంవత్సరం గతించి పోయింది. కానీ కరువు రక్కసి మాత్రం పోలేదు – పైగా మరింత భయంకర రూపాన్ని దాల్చింది. ఎందరో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పశువుల కళేబరాలు గుట్టలుగా పడుతున్నాయి. మెతుకు దొరకటమే కష్టమైపోయింది. పశువులకు మేతలేదు. ఎంతో మంది తల్లిదండ్రులు పసిపాపలనూ, యుక్త వయస్సుకు వచ్చిన కూతుళ్ళనూ అమ్ముకుని గ్రామాలు వదిలిపోతున్నారు. నదులూ, కాలువలూ, చెరువులూ చుక్కనీరు లేకుండా అడుగంటిపోయాయి. చెట్లన్నీ ఎండి మోళ్ళయ్యాయి. నేల పగుళ్ళు వారింది. ఎండలు మండిపోతున్నాయి. తిండికీ, నీళ్ళకూ అలమటిస్తూ జనం ప్రాణాలొదులుతున్నారు. విషఫలాలను తింటున్న వాళ్ళూ, దాహానికి తాళలేక తమ మూత్రాన్నే తాగుతున్న వాళ్ళూ ఎందరో కనబడుతున్నారు. తిండికీ, నీళ్ళకూ కరువై నిస్సహాయంగా మరణిస్తున్నారు.

కరువు బారిన పడిన ప్రజలకు తిండీ, ఇతర కనీసా వసరాలూ సమకూర్చేందుకు మన సత్యశోధక కార్యకర్తలు కమిటీలుగా ఏర్పడి పనిచేస్తున్నారు. సహాయక బృందాలుగా ఏర్పడి ప్రజలకు సాయం చేస్తున్నారు.

కొండజ్‌ అన్నయ్యా, ఆయన భార్య ఉమాబాయీ నాకు భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. ఓతూరు శాస్త్రీ, గణపతి శకరాన్‌, దంబారే పాటిల్‌ మీ దగ్గరికి వచ్చి కలవాలనుకుంటున్నారు. మీరు సతారా నుండి ఓతూరుకు వచ్చి, అక్కడి నుండి అహ్మద్‌నగర్‌కు వెళ్తే బావుంటుందని నా అభిప్రాయం.

ఆర్‌.బి. కృష్ణాజీ పంత్‌, లక్ష్మణ్‌ శాస్త్రీ మీకు గుర్తున్నా రనుకుంటాను. వాళ్ళు నాతోబాటుగా కరువు ప్రాంతాలకు వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారు.

ఈ దుర్భర పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల దోపిడీ మరింత దారుణంగా తయారయింది. కరువు వల్ల ఎన్నో కొత్త సమస్యలు తలెత్తాయి. దోపిడీలు జరుగుతున్నాయి. కలెక్టరుగారు ఈ సమస్యలను అదుపుచెయ్యాలని ఆదేశించారు. ఆ పోలీసులు యాభైమంది సత్యశోధక కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. నేను కలెక్టరు వద్దకు వెళ్ళి, ప్రజలకు సేవ చేస్తున్న మన కార్యకర్తలపై తప్పుడు ఆరోపణలతో దాడులు చెయ్యటం అన్యాయమనీ, వాళ్ళను తక్షణమే విడుదల చెయ్యమనీ అడిగాను. కలెక్టరు నిష్పక్షపాతంగా వ్యవహరించే మంచి వ్యక్తి కనుక, పోలీసులను మందలించాడు. ‘ఈ రైతుల మీద దొంగతనం మోపటమేమిటి? వెంటనే వాళ్ళను వదిలి పెట్టండి’ అని ఆదేశించాడు. అంతేగాక, ఆయన తక్షణమే నాలుగు ఎడ్లబండ్లలో ప్రజలకోసం ధాన్యాన్ని పంపించాడు.

పేదలకూ, అభాగ్యులకూ సేవ చెయ్యటానికి మీరు ప్రయత్నాలను ప్రారంభించారు. ఆ బాధ్యతలో నేను కూడా భాగం పంచుకోవాలని నా ఆశ. ఎల్లప్పుడూ మీకు తోడుగా నిలుస్తానని మాట ఇస్తున్నాను. ఈ దైవ కార్యం మరింత మంది ప్రజలకు ప్రయోజనాన్ని చేకూర్చగలదని ఆశిస్తున్నాను.

ఇక రాయదిగిన విశేషాలేమీ లేవు.

మీ

సావిత్రి

(‘సామాజిక విప్లవకారిణి – సావిత్రిబాయి’ పుస్తకం నుంచి)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో