సత్యాన్వేషి – సావిత్రీబాయి – విక్టర్‌ పాల

అజ్ఞానాన్ని మించిన ఆనందం లేదనేది ఒక లోకోక్తి. నిజంగానే అజ్ఞానంలో ఆనందం ఉన్నదా? ఇదొక మోసపూరితమైన మాట కాదూ! అమాయక ప్రజలను అజ్ఞానంలోకి నడిపించేందుకు తెలివైన వాళ్ళు పన్నిన తిరోగమన ప్రణాళికగా అర్థమవటం లేదా?

ఒక వ్యక్తి అజ్ఞానంలో ఉండటం వల్ల మరొకరికి ఆనందం కలిగే సందర్భాలుండవచ్చు. ముఖ్యంగా భారతదేశంలోని సామాజిక, ఆత్మిక, సాంస్కృతిక విషయాల్లో ఇది వాస్తవంగా జరుగుతున్నదే. వివక్షాపూరితమైన బ్రాహ్మణీయ సామాజిక వ్యవస్థ ద్వారా మత ప్రాతిపదికన రూపొందిన కులవ్యవస్థలో ”అజ్ఞానాన్ని మించిన ఆనందం లేద” నే ఈ మోసపూరిత సిద్ధాంతం చెలామణి అవుతూ ఉంటుంది. నైతిక విలువలులేని మనుషులు నిస్సంకోచంగా తమ అధికార ప్రయోజనాల కోసం ఆలోచనలు సాగించటానికి అజ్ఞానమే ఆనందమనే ఈ సిద్ధాంతం బాగా ఉపయోగపడతుంది. తన పక్కనున్న మనుషులు అజ్ఞానంలో ఉన్నారని గ్రహించగానే వాళ్ళ జీవితాలనూ, జీవిత విధానాలనూ, లక్ష్యాలనూ తమ చేతుల్లోకి తీసుకుని నిర్దేశించేందుకు ఇతరులు తయారైపోతారు. దీని ఫలితంగా ఒకరి శ్రమ ఫలితాన్ని మరొకరు అనుభవించే అవకాశం ఏర్పడుతుంది.స్వార్ధపూరితుడైన ప్రతి వ్యక్తి హృదయంలోనూ పరులపై ఆధిపత్యం వహించాలనే కాంక్ష దాగి ఉంటుంది. ఆ కోరికకు ఈ సిద్ధాంతం మరింత బలాన్నిస్తుంది.

అజ్ఞానం ఎన్నటికీ ఆనంద దాయకం కాబోదు. కానీ దాని వల్ల ఏర్పడే ఒక నిర్మలత్వం వల్ల వెలుపలి నుండి వచ్చే బలమైన భావాలను స్వీకరించగల స్వభావం ఏర్పడడం చిత్రమైన సంగతే. అలా ఒక బలమున్న శక్తి ప్రభావానికి లోనైన మనుషులు గాఢమైన మత్తులోకి జారిపోయి మోసపూరితమైన సిద్ధాంతాలు, కథలు, వీరగాథలను పూర్తిగా నమ్మటంతో బాటుగా ఆ వాతావారణంలో తామెంతో భద్రంగా ఉంటామని నమ్మే స్థితికి చేరుకుంటారు. ఈ విధంగా ప్రజా సమూహాలను తీవ్రమైన మానసిక ప్రభావాలకు లోనుచేసే పరిణామాలు సమాజానికి హానికరమైనవి. ప్రజలు ఇలా స్తబ్ధతకు లోనవటమనేది స్వార్థపూరితులైన దురాక్రమణదారులకు ప్రయోజనకరంగా మారుతుంది. వాళ్ళు గొప్ప గొప్ప సిద్ధాంతాల ముసుగులో తమసామాజిక – రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకుంటూ ఉంటారు. మాకియవెల్లీ ప్రతిపాదించిన ఈ విధానాన్ని సవర్ణ బ్రాహ్మణ వాదులూ నిపుణులైన వారి అనుచరులూ శతాబ్దాలుగా అమలు చేస్తూనే ఉన్నారు. ఆధునిక భారతదేశంలో కూడా అదే ప్రక్రియ వివిధ రూపాల్లో కొనసాగుతూ ఉంది.

ఇందుకు ఉదాహరణగా భారతదేశంలోని బ్రిటిష్‌ పాలననూ, జాతీయోద్యమాన్నీ పరిశీలించవచ్చు. బ్రిటిష్‌ పాలనను గురించి జాతీయోద్యమ దృక్పథం నుండి వెలుబడిన బృహత్‌ గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. ఆ గ్రంథాల్లో చాలా వరకూ బ్రాహ్మణీయ దృక్పథంతో బ్రిటిష్‌ పాలనను అంచనా వేసినవే. బ్రిటిష్‌ వారిని అనాగరికులైన సామ్రాజ్యవాద దురాక్రమణదారులుగా ఆ గ్రంథాలు వర్ణిస్తాయి. భారతదేశాన్ని నిస్సహాయంగా బ్రిటీష్‌ ఆధిపత్యాన్ని భరిస్తున్న ఒక బాధిత దేశంగా ఈ రచయితలు చిత్రించారు. ఈవిధమైన వ్యాఖ్యానాలన్నీ శిష్టవర్గాలు చేసిన ఆధార రహితమైన భావనలేనని వేరుగా చెప్పనక్కర లేదు. జాతీయవాదం పేరిట చెలామణి అవుతున్న ఈ దృక్పథంలో సాధారణ ప్రజల భావనలకు ఏమాత్రమూ చోటులేదు.

ఏ జాతీయవాద ఉద్యమాన్ని పరిశీలించినా అవన్నీ విజేతలు, పరాజితులు అనే భావన పునాదిగా ప్రారంభమై సంక్లిష్టమైన వారసత్వాలను కేవలం నలుపు-తెలుపుల్లో చిత్రించటానికి పూనుకున్నవిగానే ఉంటాయి. భారత జాతీయ వాదం కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ప్రకాశమానమైన మనదేశ చారిత్రక, సామాజిక వారసత్వంలో బ్రిటిష్‌ పాలనాకాలాన్ని ఒక మాయని మచ్చగా వీరు అభివర్ణిస్తారు. నిజానికి తామందరమూ ఆ నాటి వలస దోపిడీలో భాగస్వాముల మేనన్న వాస్తవాన్ని మాత్రం ఈ జాతీయవాదులు తమ సౌకర్యార్థం దాటవేస్తారు. దేశంలోని అంతర్గత సమస్యల వల్ల ఏర్పడిన దుర్మార్గమైన పరిణామాలన్నిటినీ బ్రిటిష్‌ పాలనకు ఆపాదించి సాధారణ ప్రజలను మోసగించటమనే ధోరణి అప్పటి జాతీయవాద మేధావులందరిలోనూ వ్యక్తమయిందనటంలో అతిశయోక్తి లేదు. అప్పటి నుండి ఇప్పటి వరకూ జాతీయవాదం, దేశభక్తి పేరిట చెలామణీ అయ్యే శిష్ట వర్గాల ప్రయత్నాలన్నీ అధికారాన్ని హస్తగతం చేసుకునే వైపుగానే సాగటాన్ని చూస్తుంటే ప్రజల అజ్ఞానం వాళ్లకెంతటి ప్రయోజనకరమో చక్కగా అర్థమవుతుంది. ప్రసిద్ధ రచయిత టాల్‌స్టాయ్‌ ప్రజలధిక్కారం, అహింస అనే విషయాలపై ఒక రచనలో చర్చిస్తూ ఇలా అంటారు:

”దేశభక్తి పేరిట చెలామణి అయ్యే విధానాలను సూటిగా, స్పష్టంగా అర్థం చేసుకుంటే అవన్నీ పాలకుల ప్రయోజనాలను నెరవేర్చటానికీ, పాలిత ప్రజల్లో చైతన్యాన్నీ, హేతుబద్దతనూ, మానవ హోదానూ కుదించివేసి వాళ్ళను మరింత బానిసత్వంలోకి నెట్టడానికీ ఉపయోగపడుతున్నాయని తెలుస్తుంది” (మణి 2005; 343 నుండి)

టాల్‌స్టాయ్‌ చేసిన ఈ పరిశీలన గాంధీతో సహా ప్రముఖ భారత జాతీయోద్యమ నాయకులందరికీ వర్తిస్తుంది. వ్యవస్థీకృతమైన సామాజిక సూత్రాలనూ, పీడిత స్వభావంగల రాజ్యయంత్రాంగాలనూ ధిక్కరించి నూతన సమాజానికి దారులు తీసే నిబద్ధత గల స్త్రీ, పురుషులు మానవ చరిత్రలో అతి అరుదుగా కనబడతారు.

మార్గదర్శకులుగా ఫూలే దంపతులు

సంప్రదాయవాదుల అణిచివేతను ఎదిరించటమూ, స్వప్రయోజనపరులైన యథాతథ వాదులను ధిక్కరించటమూ అనే లక్ష్యాలకోసం తమ జీవితాలనూ, ఉద్యమాలనూ అంకితం చేసిన వ్యక్తులు జ్యోతిరావు, సావిత్రీ బాయి, మహనీయులైన ఈ దంపతులు మనకు అందించిన సందేశం ఈ నాటికీ పీడిత ప్రజల విముక్తి సాధనంగానే నిలిచి ఉన్నది. గత చరిత్రకు సంబంధించిన సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక భావజాలపు బంధనాల నుండి భారతదేశం విముక్తి చెందినప్పడే సావిత్రీ బాయి, జ్యోతిబాల సందేశాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగల శక్తి చేకూరుతుంది.

భారతదేశంలో పీడిత ప్రజల ప్రతినిధులైన జ్యోతిరావు, సావిత్రీ బాయిల కృషికి అగ్రవర్ణాలకు చెందిన జాతీయవాద నాయకత్వం తగిన స్థానాన్ని ఎప్పుడూ ఇవ్వలేదు. వారిరువురిని గురించీ మాట్లాడాలంటే బ్రిటిష్‌ పాలన వల్ల సాధారణ ప్రజల జీవితాల్లో కలిగిన ప్రయోజనకరమైన మార్పుల గురించి ప్రస్తావించాల్సి వస్తుందన్నదే ఇందుకు కారణం. నిమ్న కులాల ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తులవటం వల్లనే జ్యోతిబా, సావిత్రీ బాయిల మీద బ్రాహ్మణీయ ఆధిపత్య వర్గాలకు చిన్నచూపు ఏర్పడింది. బ్రిటిష్‌ ఇండియాలో బ్రాహ్మణీయ ఆధిపత్యం కొంత తగ్గుముఖం పట్టడం వలన ఫూలే దంపతులు ముందుకొచ్చి దిక్కులేని జనం తరఫున గొంతెత్తి మాట్లాడే వాతావరణం ఏర్పడింది. అందువల్లనే దళితులూ, ఇతర నిమ్నకులాల (శూద్రులూ, అతిశూద్రులూ) ప్రజలు విద్యను అభ్యసించి, స్వేచ్ఛను పొందగలిగారు.

ఒక శూద్ర కులంలో జన్మించిన ఫూలే తన జీవితంలో కులవివక్షను అనుభవించిన వ్యక్తి కనుకనే పీడిత ప్రజలందరికీ విముక్తి దాయకమైన విద్యను అందించాలన్న నిశ్చయానికి వచ్చాడు. ప్రజలు విముక్తి చెందాలంటే, వాళ్ళకు నూతన సామాజిక-నైతిక విలువలు గల విద్యను అందించాలని ఆయన పదే పదే నొక్కి చెపుతుండేవాడు. నిమ్న కులాల ప్రజలను ఒక పథకం ప్రకారమే విద్య నుండి బహిష్కరించటం జరుగుతోందని వివరిస్తూ తను రాసిన ఒక విజ్ఞాపన పత్రాన్ని విద్యారంగ సంస్కరణలకై ఏర్పడిన హంటర్‌ కమీషన్‌కు 1883లో ఫూలే సమర్పించాడు. జ్ఞానాన్ని బ్రాహ్మణీయ శక్తుల గుత్తసొమ్ముగా పరగణించే విధానాన్ని ప్రశ్నించిన తొలి తిరుగుబాటు దారుడు ఫూలే. సార్వత్రిక విద్యను అందించటం ద్వారా పీడిత ప్రజల విముక్తిని సాధించవచ్చునని భావప్రచారానికి పూనుకొన్నాడాయన.

ఫూలే, తన భార్య సావిత్రీ బాయిని విద్యావంతురాలిని చేసి ఎంతో ఆత్మాభిమానమూ, స్వశక్తీ గల మహిళగా ఆమెను తీర్చిదిద్దాడు. ఫూలే మార్గదర్శకత్వంలో ఆమె అన్ని సామాజిక దురాచారాలనూ, వివక్షలనూ ప్రశ్నించగల వ్యక్తిగా ఎదిగింది.

సమకాలీన భారతీయ సామాజికావరణాన్ని దాటి ఫీనిక్స్‌ పక్షుల్లా పైకి చేరగలిగారు ఫూలే దంపతులు. కులరహిత సమాజం కోసం నినదించిన వారి కంఠాలు ఈనాటికైనా ప్రాముఖ్యతను సంతరించుకుని వారి పోరాటాలు గుర్తింపు పొందాయి. భారతదేశమంతటా వారి గొంతులు ప్రతిధ్వనిస్తూ, దాదాపు మూడువేల సంవత్సరాలుగా ఈ దేశంలో పాతుకుపోయిన కులవివక్ష పునాదులనుకదిలిస్తున్నాయి. ఇంతకాలమూ వారి భావాలను

ఉద్దేశ్యపూర్వకంగానే మరుగుపరచటం జరిగిందని ఇప్పుడు ఆధారాలతో సహా నిరూపితమయ్యింది. ఇందుకు కారణం స్వాతంత్య్రోద్యమం పేరిట బ్రాహ్మణీయ శక్తులు చేసిన కుట్రలను పీడిత ప్రజలు గుర్తించకుండా చెయ్యాలన్న ఉద్దేశ్యమే.

ప్రత్యామ్నాయ-సాంస్క ృతిక సంప్రదాయం

నూతన భారతీయ సమాజాన్ని నిర్మించటానికి ఫూలే దంపతులు రూపొందించిన విప్లవోద్యమ ఎజెండాలోని సామాజిక – సాంస్క ృతిక నేపథ్యం ఎలాంటిది? చరిత్ర పూర్వయుగాలనాటి మౌఖిక సంప్రదాయాలను మినహాయించినప్పటికీ క్రీ.పూ. 16వ శతాబ్దంనాటి బౌద్ధ సామాజిక మత ఉద్యమాన్ని పరిశీలించితే అందులో ఫూలే దంపతుల ఉద్యమానికి మూలాలు లభిస్తాయి బౌద్ధానికి సామాన్య ప్రజల ఆమోదం సంపూర్ణంగా లభించటానికి కారణం – అది బాధ, వేదనలనే సార్వజనీనమైన మానవ సమస్యలను పట్టించుకోవటమే. వైదిక-బ్రాహ్మణీయ మత వ్యవస్థలో సాధారణ ప్రజల వేదనకు ఏ మాత్రమూ చోటుదొరకదు. పైగా అట్టడుగుస్థాయి స్త్రీ-పురుషులపై జరిగే పీడననూ, అణిచివేతనూ అది బలంగా

సమర్థిస్తుంది కూడా. బ్రాహ్మణీయ దృక్ఫథంలోని ఈ అణిచివేత స్వభావాన్ని ప్రతిఘటించే విముక్తి సిద్ధాంతాన్ని బుద్ధుడు ప్రతిపాదించి, విస్తృతంగా వ్యాప్తి చేశాడు. బౌద్ధంలోని సమానత్వ దృక్పథం కారణంగా సామాన్య ప్రజానీకం దాన్ని అదరించి, స్వంతం చేసుకున్నారు. ఆ తర్వాత అశోక చక్రవర్తి బౌద్ధాన్ని ఆదరించి, భారత ఉపఖండంలో విస్త ృతంగా ప్రచారం చేశాడు.

బౌద్ధంతోబాటు మరికొన్ని ప్రత్యామ్నాయ – సాంస్క ృతిక ఉద్యమాలు కూడా భారతదేశంలో ఆవిర్భవించాయి. వాటి ద్వారా వైదిక-బ్రాహ్మణీయ దృక్పథానికీ, అది రూపొందించే కులవ్యవస్థకూ వ్యతిరేకమైన ప్రాపంచిక దృక్పథం ఆవిర్భవించింది. జైనం, క్రైస్తవం, ఇస్లాం, సిక్కు మతం, భక్తి ఉద్యమాలకు చెందిన సాధువుల కవిత్వం – వీటన్నిటి మధ్యనా కొన్ని తేడాలున్నప్పటికీ కులవ్యవస్థ విషయంలో వీటన్నిటి దృక్పథమూ ఒక్కటే. కులంలో వివక్ష, అణిచివేత, అమానవీయత అనే దుర్గుణాలన్నీ ఉన్నాయి. కనుక దాన్ని తిరస్కరించాలని పై మతాల, ఉద్యమాల ప్రతినిధులందరూ బోధించారు.

ఏకేశ్వరోపాసన, సమానధర్మం అనే విలువల ప్రాతిపదికన రూపొంది బహుళోపాసకులైన ఆర్య-బ్రాహ్మణ మతబోధకులను తీవ్రంగా వ్యతిరేకించే ఒక నూతన సామాజిక – ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని భారతదేశంలో నెలకొల్పిన వారు ఫూలే దంపతులు. కుల ప్రాతిపదికన ఏర్పడిన ఆర్య బ్రాహ్మణీయ మతాన్ని ఏమాత్రమూ వ్యతిరేకించని నాటి ఇతర సంస్కర్తల నుండి పూలేదంపతులను ప్రత్యేకంగా నిలిపేది, వారి కులవ్యతిరేక దృక్పథమే. కులవ్యవస్థ మీదా, బ్రాహ్మణీయ పూజారివర్గపు ఆధిపత్యం మీదా ఫూలే దంపతులు ప్రకటించిన పోరాటాన్ని లోతుగా పరిశోధించవలసిన అవసరం

ఉన్నది.

ఫూలే దంపతులు-గాంధీ

భారతదేశంలో నిజమైన మహాత్ముడంటే జ్యోతిరావు ఫూలే మాత్రమేనని మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ ప్రకటించాడు. ఐతే, ఫూలే చేసిన ఉద్యమాలన్నిటిలోనూ ప్రధాన పాత్ర వహించిన ఆయన భార్య సావిత్రీబాయిని భారతదేశంలో ఆధునిక విద్యా ప్రదాయినిగా పిలుస్తారన్న విషయం అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు. ఒక సామాన్య మహిళగా ఉన్న ఆమెసాహస వంతురాలైన నాయకురాలిగా ఎదిగి, ప్రతికూల పరిస్థితుల నడుమనుండి విప్లవ పథాన్ని నిర్మించగలిగే స్థాయికి చేరడం వెనుక జ్యోతిరావు ఫూలే అందించిన ప్రేరణ విస్మరించరానిది.

భారతదేశానికి భగవంతుడందించిన వరప్రసాదంగా ప్రసిద్ధుడైన గాంధీకి – అటువంటి గుర్తింపు అందుకోని సావిత్రీబాయికీ మధ్యన ఎంతో అంతరం ఉన్నది. ఐతే వారిరువురి వ్యక్తిత్వాలనూ లోతుగా పరిశీలించి చూస్తే గాంధీని సంప్రదాయ దృక్పథంగల యథాతథవాదిగానూ, సావిత్రీ బాయిని వాస్తవిక దృక్పథంగల విప్లవశీలిగానూ గ్రహించగలుగుతాం. పరస్పర విరుద్ధమైన గాంధీ, సావిత్రీబాయిల దృక్పథాలను లోతుగా పరిశీలించినప్పుడు భారతదేశాన్ని గురించిన ఊహాత్మక-ఆచరణాత్మక దృక్పథాలనడుమ ఎంత అంతరం ఉంటుందో మనకు అర్థమ వుతుంది. సామాజిక న్యాయమూ, సత్యాన్వేషణా వంటి అంశాల్లో వారిద్దరూ ప్రదర్శించిన వైఖరులు ఎన్నో సామాజిక వాస్తవాలను వెలికితెచ్చాయి. ఐతే వీటి గురించి దేశంలో విస్త ృతమైన చర్చలు మాత్రం జరగలేదన్నది వాస్తవం ఈ విషయాలను గురించి, ”డీ బ్రాహ్మనైజింగ్‌ హిస్టరీ; డామినెన్స్‌ అండ్‌ రెసిస్టెన్స్‌ ఇన్‌ ఇండియన్‌ సొసైటీ” అనే తన గ్రంథంలో బ్రజ్‌రంజన్‌ మణి ఇలా రాశారు.

”గాంధీ వ్యక్తిత్వమూ, ఆయన జాతీయోద్యమ రాజకీయాల చుట్టూ ఎన్నో అభూత కల్పనలూ, అతిశయోక్తులూ అల్లుకుపోయాయి. వాస్తవం చెప్పాలంటే అధునిక భారత చరిత్ర రచన అనేదంతా గాంధీని, గాంధీవాదాన్ని కీర్తించటంతోనే నిండిపోయి ఉన్నది. జాతి ఐక్యత, దేశభక్తి అనే ఆకర్షణీయమైన నినాదాల వెనక గాంధీ నడిపిన రాజకీయాలన్నీ పూర్తిగా కాల్పనికమైనవి. అంతేకాదు, బ్రాహ్మణీయ వ్యవస్థనూ దానిలోని కుల, సామాజిక-సాంస్క ృతిక నిర్మాణాలనూ ఆయన స్పష్టంగానే సమర్థించారు”.

(2005; 347-48)

గాంధీని గురించి బహుళ ప్రచారంలోఉన్న అభిప్రాయాలకు భిన్నంగా ఆయన తన జీవితాంతమూ స్త్రీలనూ, అస్పృశ్యులనూ, జంతువులకన్నా హీనంగా జమకట్టిన బ్రాహ్మణీయ సంస్క ృతికి గట్టి సమర్థకుడుగా నిలిచాడు. బ్రాహ్మణేతరులందరూ విధ్యాభ్యాసానికి అనర్హులేనని బోధించిన మనుస్మ ృతి వంటి ధర్మశాస్త్రాలపై గాంధీ ఎనలేని గౌరవాన్ని ప్రదర్శించాడు. సామాజిక అంతరాలనేవి సహజమైనవీ, న్యాయమైనవీననీ గాంధీ నమ్మకం. ఆయన రాజకీయాలు యథాతథవాదాన్ని ప్రబోధించటం ద్వారా నిమ్న కులాలను రాజ్యాధికారానికీ, సామాజిక న్యాయానికీ దూరంగా

ఉంటాయి (అలోసియస్‌ 197, మణి 2005). గాంధీ ప్రబోధించిన అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలు ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి. ఐతే కులవ్యవస్థ బాధితులైన కోట్లాది మంది భారతీయుల ఆక్రందనల పట్ల ఆయన మౌనం వహించి ఊరుకున్నాడనిగానీ, తన జీవితాంతమూ కులవ్యవస్థకు రక్షకుడుగా నిలిచాడనిగానీ చాలా మందికి తెలియకపోవచ్చు.

కుల, బ్రాహ్మణీయ వ్యవస్థల అసలు స్వరూపాన్ని గురించిన అజ్ఞానంలో గాంధేయవాదులకు లభిస్తున్న ఆనందం సమాజానికి ప్రమాదకరమైనది. పైగా సత్యమూ, అహింసా ఒక జంటగా సమానార్థకాలుగా చెలామణీ అవుతున్నప్పుడు, అధికారికంగా అమలవుతున్న ఈ పరిణామాన్ని మార్చటానికి ప్రయత్నించేవాళ్ళు త్రీవమైన సమస్యలను ఎదుర్కోక తప్పదు. ప్రతికూల శక్తులు వీళ్ళమీద దాడులకు పూనుకుంటాయి. తాను సత్యానికి కట్టుబడి ఉంటానని గాంధీ ప్రకటించుకున్నాడు. అయితే ఆయన దృష్టిలోని సత్యం సవర్ణ బ్రాహ్మణీయ వ్యవస్థకు మాత్రమే అనుకూలమైనది. ఒక స్వార్థపర రాజకీయవాదికీ – ఒక సామాజిక విప్లవమూర్తికీ ఎంతో తేడా

ఉంటుంది. గాంధీకి, ఫూలేకూ ఉన్న భేదం అటువంటిదే. పరస్పర వ్యతిరేకమైన రెండు ప్రాపంచిక దృక్పథాలకు అచ్చమైన ప్రతినిధులు గాంధీ, ఫూలేలు.

సావిత్రీబాయి జీవితంలో ఎదురైన ఒక అనుభవాన్ని పరిశీలించటం ద్వారా గాంధీ వంటి జాతీయవాదులకు ఆమె ఎందుకు దూరంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఒక దళితుడికి మద్దతు పలికేందుకు తన జీవితాన్ని పణం పెట్టటమనే సాహసానికి గాంధీ ఎప్పుడైనా పూనుకోగలడా అన్నది సందేహాస్పదమే. ఆయన తన జీవితమంతా, దళితుడైన అంబేడ్కర్‌కు దక్కిన ప్రతి అవకాశానికీ అవరోధాలు కల్పిస్తూనే ఉన్నాడు. కానీ సావిత్రీబాయి ప్రవర్తన ఇందుకు భిన్నమైనది. ఒక బ్రాహ్మణుడు తప్పుగా ప్రవర్తించిన సంఘటనలో ఆమె స్పష్టంగా తన వ్యతిరేకతను తెలియజేసింది. బ్రాహ్మణవర్గమంతా తనకు విరోధులుగా మారినా ఆమె లెక్క చెయ్యలేదు.

1868లో సావిత్రీబాయికి అనారోగ్యంగా ఉండటంతో తల్లిగారింట్లో విశ్రాంతి తీసుకుందామని పూనే నుండి ఖండాలా ప్రాంతంలోని నయ్‌గాఁవ్‌ కు వెళ్ళింది. ఆ గ్రామంలోని గణేష్‌ అనే ఒక బ్రాహ్మణ యువకుడు షార్జా అనే మహర్‌ కులానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇది ధర్మ విరుద్ధమైన చర్యకిందే లెక్క. ఎంతో మంది బ్రాహ్మణులు దళిత యువతులతో చాటుమాటుగా లైంగిక సంబంధాలను ఏర్పరుచుకోవటం సర్వసాధారణమే. కానీ ఈ రెండు కులాల మధ్యన ప్రేమపూరిత సంబంధాలు ఏర్పడటమనేది అసాధారణం. దాంతో గ్రామంలో గగ్గోలు పుట్టింది. కులపెద్దలందరూ ఆగ్రహోదగ్రులై ఆ ప్రేమికులను చంపి పారేస్తేనే ఇకముందు ఇలాంటి వైపరీత్యాలు తలెత్తకుండా ఉంటాయని నిర్ణయించుకున్నారు. హత్యకు పథకం కూడా సిద్ధమైపోయింది.

ఈ విషయాన్ని విన్న సావిత్రీ బాయి గ్రామచావిడి దగ్గరికి పరిగెత్తి వెళ్ళింది. నిస్సహాయంగా నిలబడిన ప్రేమికులను అక్కడ చుట్టుముట్టి బంధించి ఉంచారు. ఆ జంట ముఖాల్లో మృత్యుభయం తాండవిస్తోంది. రక్త దాహంతో వాళ్ళపై హత్యకు సిద్ధపడుతున్న గ్రామస్థులను సావిత్రీ బాయి ధైర్యంగా అడ్డుకున్నది. వాళ్ళీ ప్రయత్నాన్ని విరమించుకోకపోతే హత్యానేరం కింద బ్రిటిష్‌ ప్రభుత్వం విధించే కఠిన శిక్షలకు సిద్ధపడాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించింది. గ్రామస్థులు భయపడి వెనక్కు తగ్గారు. కొంతసేపటి తర్వాత ప్రేమికుల జంటనూ, సావిత్రీ బాయినీ వదిలిపెట్టి వాళ్ళందరూ జారుకున్నారు. ఆమె వాళ్ళిద్దరినీ పూనేలో ఉన్న తన భర్త జ్యోతిరావు దగ్గరికి పంపింది. వాళ్ళు ఈ గ్రామంలో ఉండటం ప్రమాదకరం కనుక పూనేలో వాళ్ళిద్దరికీ ఆశ్రయం కల్పించమనీ, ఏదయినా జీవనోపాధి కూడా ఏర్పాటు చెయ్యమనీ జ్యోతిబాకు

ఉత్తరం రాసి ఇచ్చింది.

ఈ విధంగా ఆమె చూసిన సాహసమూ, నిబద్ధతా, నిష్పక్షపాత వైఖరీ రెండు ప్రాణాలను రక్షించాయి. ఆమె సామాజిక నిబద్ధతకూ, సమగ్ర వ్యక్తిత్వానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఆమెకు కులవివక్ష ఉండి ఉంటే కేవలం మహర్‌ యువతిని మాత్రమే రక్షించి, బ్రాహ్మణ యువకుడిని గ్రామస్థుల క్రూరత్వానికి అప్పగించి ఉండేది. కానీ ఆమె వారిద్దరికీ ప్రాణదాతగా నిలబడి సత్యాన్నీ, ధర్మాన్నీ పరిరక్షించింది.

సావిత్రీబాయి ఉన్నత వ్యక్తిత్వానికీ, సామాజిక నిబద్ధతకూ అద్దంపట్టే మరొక సంఘటనను కూడా గుర్తు చేసుకుందాం. 1875-76 సంవత్సరాల్లో పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతమంతటా తీవ్రదుర్భిక్షం వ్యాపించింది. మనుషులూ, పశువులూ కూడా తిండికీ, నీళ్ళకూ అలమటించే పరిస్థితులేర్పడ్డాయి. ఈ సంక్షోభానికి తోడుగా దూరాశాపరులైన వడ్డీ వ్యాపారులు బయల్దేరి, రైతుల కనీసావసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. సావిత్రీ బాయి నాయకత్వంలో సత్యశోధక సమాజ కార్యకర్తలు కరువు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల ప్రాణాలనూ, ఆస్థులనూ రక్షించటానికి ముందుకొచ్చారు. వీళ్ళవల్ల తమ దోపిడీకి అవరోధం ఏర్పడుతున్నదని వ్యాపారస్తులకు ఆగ్రహం కలిగింది. సత్యశోధన సమాజ కార్యకర్తలు దోపిడీలకు పాల్పడుతున్నారంటూ తప్పుడు ఫిర్యాదులు చేసి వాళ్ళను అరెస్టు చేయించారు. సావిత్రీ బాయి వెంటనే కలెక్టరును కలిసి, పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారని, వడ్డీ వ్యాపారులతో చేతులు కలిపి అమాయకులను వేధిస్తున్నారనీ వివరించింది. ఆమె నిర్భయత్వానికి మెచ్చిన కలెక్టరు పోలీసులను మందలించి సత్యశోధన కార్యకర్తలను వదిలిపెట్టాడు. ఆమె ధైర్యాన్నీ, నిబద్ధతనూ గౌరవించి కరువు సహాయక కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొని అవసరమైన సహాయాన్ని అందించాడు.

వెలుగులీనే ఉద్యమ వారసత్వం

సావిత్రీ బాయి జీవించిన కాలానికి సంబంధించిన చారిత్రక అవగాహనా, సామాజిక – సాంస్క ృతిక సందర్భ స్పృహా లేనిదే ఆమె చేసిన కృషిని సరిగా అంచనా వెయ్యటం సాధ్యపడదు. ఆనాటి సామాజిక నియమాలు, మత విశ్వాసాలూ, సాంప్రదాయిక విధానాలకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో అర్థమవాలంటే ముందుగా అప్పటి సామాజిక – సాంస్క ృతిక వాతావరణాన్ని గురించి తెలిసి ఉండాలి. తనకు ఎదురైన వ్యక్తిగత అవమానాలనూ సాంఘిక బహిష్కరణనూ, సామాజిక వ్యతిరేకతనూ ఎంతో ధైర్యంగా ఆమె ఎదిరించగలిగింది. ఆమె అచ్చమైన సత్యశోధకురాలు కాబట్టే ఇది సాధ్యపడింది.

సావిత్రీ బాయి ఏర్పరచిన ప్రకాశమానమైన ఉద్యమ అస్తిత్వాన్ని దేశంలోని కొందరు ప్రముఖుల కీర్తి ప్రతిష్టలు కప్పివేసి, మరుగుపరిచాయి. అజ్ఞానాన్ని బానిసత్వంగా గుర్తించి దాన్ని రూపుమాపేందుకు నిరంతర పోరాటాన్ని నడిపిన సావిత్రీ బాయి తన సత్యదీక్షతో అసత్య వాదులందరినీ అధిగమించింది. ఇవాళ మనజాతికి ఎంతో ఆలస్యంగానే ఐనప్పటికీ భారతదేశపు ప్రత్యామ్నాయ చరిత్రను గురించి సానుకూల దృక్పథం అందుబాటు లోకి వచ్చింది. ఐతే అందుకు కారకులైన మహనీయులను మాత్రం ఇప్పటికీ ప్రధాన స్రవంతి జాతీయ జీవనానికి దూరంగానే ఉంచటం నిజంగా విచారకరం.

(‘సామాజిక విప్లవకారిణి – సావిత్రిబాయి’ పుస్తకం నుంచి)

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.