వర్తమాన లేఖ – శిలాలోలిత

ప్రియమైన గౌరీ, ఎలా ఉన్నావ్‌? జాజులంత సుకుమారమైంది నీ మనసు. ఎంతటి కష్టాలనయినా ఎదుర్కొనే ధైర్యం నీ మేధస్సుది. అందుకే నువ్వు జాజుల గౌరివి. నీ గురించి మొదటిసారి ‘జయధీర్‌ తిరుమలరావు’ గారి దగ్గర విన్నాను. ఆయన మాకు ఎం.ఫిల్‌ లో గైడ్‌. చాలా స్ట్రగులవుతున్నా, అద్భుతమైన రచన చేస్తున్న రచయిత్రి అన్నారు. ఆ తర్వాత నీ ‘మన్నుబువ్వ’ దొరికింది. ఆకలై ఆత్రుతగా తినే ఆ ‘మట్టిరుచి’ని పఠితులందరికీ చూపించావ్‌. నాకు బాగా నచ్చిన కన్నీళ్ళొలికించిన కథ అది. ఒక్కొక్కళ్ళకి ఒక్కో పేరు ముద్రపడిపోతుంటుంది. ‘తాయమ్మ’ కరుణలా నీక్కూడా ఏ గౌరి అంటే ‘మన్నుబువ్వ’ గౌరి అని సాహిత్య రంగంలో స్థిరపడిపోయింది.

గౌరీ, నీ ప్రత్యేకత ఏంటో చెప్పనా? అందరివీ పత్రికలో వచ్చిన తర్వాత పుస్తకాలుగా మారుతాయి. నీవి పుస్తకంలో వచ్చిన తర్వాత వాటి గొప్పతనాన్ని చూసే, మళ్ళీ పత్రికల్లో ప్రచురించారు. జీవితంలో చదువు ఎక్కువగా ఉన్నప్పుడే సమాజంలో గుర్తింపూ, గౌరవం లభిస్తాయనే, మానసిక ఎదుగుదలక్కూడా ఉపయోగపడ్తుందనే ఆకాంక్షతో నీ చదువనే పర్వతాన్ని తలకెత్తుకున్నావ్‌. మనిద్దరికీ ఇక్కడ పోలికుంది. బి.సి.జె., యం.సీ.జె., లా పూర్తి చేశావ్‌. కూలీగా, రకరకాల

ఉద్యోగాలు చేస్తూ, ఎన్నో జీవనానుభవాల్ని నీలో నింపుకున్నావ్‌. మారిన భాషను, వేషధారణను అంగీకరించని, ఈసడిస్తున్న సమాజాన్ని చూసి ధిక్కార స్వరంతో

‘ఉతికి ఆరేస్తా’ కవితను ’97 లోనే రాశావు గుర్తుందా? గ్రూప్‌ ఒన్‌లో కూడా దగ్గర వరకూ వెళ్ళి నిరాశపడ్డాను నీలాగే దిగులు గుండె నెక్కి చాన్నాళ్ళు. నువ్వు మనసుతో రాస్తావు గౌరీ, నీకు అనుభవంలోకి రానిదేదీ నువ్వు రాయలేదు. నీ బతుకే నీతో రాయించింది. మండిన నీ నెత్తుటి జాడలన్నీ అక్షరాలై సాహిత్య పథంలో ప్రయాణం చేశాయి. నీ విజయం నీ జీవితం. నీ రచనలు తిరిగొచ్చిన వన్నీ ఎం.ఏ లో పాఠ్యాంశాలుగా మారాయి. ’97, ’98 ఆ ప్రాంతాల్లో అనుకుంటా ‘ఒయినం’ నవలపై రిసెర్చ్‌ మొదలు పెట్టారు. కాష్టం, కవితా సంకలనం, ‘భూమి’ – నవల, భూమి బిడ్డ’, అబ్బో బంగారు సాయిబో, లలన కథా సంకలనాలు, నీవేకదా! ఎనిమిదో తరగతిలోనే పెళ్ళయి బాధ్యతలన్నీ మీదపడి, ఆర్థిక సమస్యలతోపాటు, సామాజిక వివక్షను ఎదుర్కొంటూ, అన్నమ్మ టీచర్‌ లాంటి వాళ్ళ దగ్గర మానవత్వాన్ని చూసి అందరూ ఒక్క తీరుండరనే జ్ఞానంతో అనేక ఆటు పోట్లను ఎదుర్కొన్నావు. పాటల వల్ల కవిత్వం వైపు ఆకర్షింపబడ్డానన్నావ్‌. కాల్తున్న కడుపు, విపరీతమైన మానసిక ఒత్తిడి, ఊసరవెల్లి సమాజపు తీరూ, లేదు లేదంటూనే రాకాసిలా ఉన్న కుల వివక్ష, స్త్రీలపైనున్న అణచివేత, బానిసకు బానిసగానే ఇంకా గుర్తింపబడుతున్న స్త్రీ స్థితీ ఇవన్నీ నీ కలంలో నిండిపోయి, కవితలుగా, కథలుగా, ఆ నవలలుగా రూపాన్ని ధరించాయి. ‘నువ్వొక ఇంటర్వ్యూలో అన్నావు గుర్తుందా గౌరీ! శివసాగర్‌గారు, నాగప్పగారి సుందర్రాజు గారు లేకుంటే రచయిత్రిగా నేను లేను’ అని. అలా చెప్పడం నీ నిజాయితీకి నిదర్శనం. తెలుగు దళిత సాహిత్యంలో పరిచయం అక్కర్లేని పేరుగా స్థిరపడి పోయావు. వివక్ష నుంచి ఆత్మగౌరవాన్ని, చదువుతోనే ఆత్మవిశ్వాసాన్ని సాధించుకున్నావు. నిరుపేద దళితుల ఆకలికి అద్దం పట్టిన రచన ‘మన్నుబవ్వ’. చదువుల కోసంపడ్డ ఆరాటాన్ని తెలిపే కథ ‘సదువు’, దళిత మహిళ భూమి కోసం పోరాడిన తీరు ‘వొయినం’ నవల. గౌరీ నిన్నుగన్న ఈ సికింద్రాబాద్‌ ‘లోతుకుంట’ సింబాలిక్‌ గా ఉంది. బతుకులను తరిచి చూసిన దానివీ, నిన్ను కులపు కుంటలో కూరడానికి ప్రయత్నించిన సమాజానికి రచనా పరంగా జవాబు చెప్పిన బుద్దిజీవివి నువ్వు. అందుకే నువ్వంటే నాకు ప్రేమ. చీకటి పూసిన వెలుతురు పువ్వువు నువ్వు. అందుకే అవార్డుల రూపంలో పలు రకాలుగా నీకొస్తున్న గుర్తింపును చూసి మనసు సంతోషపడ్తుంది. కళ్ళు సరస్సుల్ని వెతుక్కుంటాయి. మనకు తెలియని రాజకీయాలేమున్నాయి చెప్పు? ఒక స్త్రీగా, ఒక రచయిత్రిగా, ఒక మానవతా వాదిగా, ఒక లాయర్‌గా, సామాజిక వివక్షను ఎదుర్కొంటూ నువ్వు చేస్తున్న యుద్ధంలో నేను సైతం తోడున్నాను. ఇవి ఇంకేవో ఆశించి అంటున్న మాటలు కావు. మనస్ఫూర్తిగా నీ పట్ల మిత్ర వాత్సల్యంతో అంటున్నవే ఇవి. గౌరీ నువ్వెన్నో రచనలు చేయాలని, నువ్వెళ్ళిపోయిన తర్వాత కూడా నీ అక్షరాలు వెలుగులుజిమ్ముతూనే మిగలాలనే ఆకాంక్షతో…

నీ శిలాలోలిత

 

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

One Response to వర్తమాన లేఖ – శిలాలోలిత

  1. Padmapv says:

    Bhagunai..Anni.Abvandhanllu.

    Madam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>