కొత్త ఉదాహరణలు

పి.సత్యవతి
శతాబ్దాలు గడిచినా పాఠ్య పుస్తకాలల్లో పాత ఉదాహరణలే పురావృతం అవుతుంటాయి. పాత పాఠాలు చదివేసి పాత ప్రశ్నలకే సమాధానాలు రాసేసి పాస్తై పోయి చదువు పూర్తై పోయిందని సంబర పడి పోతాం. మనం, మన పిల్లలు, వాళ్ల పిల్లలు, .. ఒక రుద్రమ దేవి, ఒక ఝన్సీలక్ష్మి, ఒక సరోజినీ నాయుడు, ఒక ఇందిరా గాంధీ, ఒక ఫారెన్స్‌ నైటింగేల్‌, ఒక హెలెన్‌ కెల్లర్‌, మదర్‌ తెెరిసా, ఇలా అదే లిష్టు..కొత్త ఉదాహరణలు కావాలి మనకి..ఇప్పుడు
నాన్న కష్టపడి డబ్బు తెస్తాడు, అమ్మ వండి వారుస్తుంది, అన్న ఫుట్‌ బాల్‌ ఆడతాడు, చెల్లి బొమ్మల పెళ్ళిచేస్తుంది..ఎన్నాళ్లు చదివాం ఈ పాఠాలు? ఇంకా చదువుతూనే వున్నాం…
దృశ్యం మారిందని తెలీదా? నాన్న సంపాదించి ఆయన తాగుడికి ముప్పాతిక, ఇంటికి పాతిక. అమ్మ అచ్చంగా వండి వార్చడం లేదు. పనికి పోతోంది.. వండుతోంది పొదుపు చేస్తోంది..
బిడ్డ ఇంటికొచ్చే పాటికి కాస్త తిండి ఉండేలా తాపత్రయ పడుతోంది.. అమ్మ చేతిలోంచి పని పోతే ఏమౌతుంది? అమ్మ ఇంటికి అతుక్కుపోతే ఏమౌతుంది?
అమ్మ పొలం పని చేస్తుంది. చేపలు అమ్ము కొస్తుంది… అమ్మ చేతుల్లో నాలుగు పైసల్లో ఒక పైస ఏ కుండలోనో దాచి బిడ్డ ఆకలి తీరుస్తుంది. అమ్మ అలవాటైన పని పోతే అమ్మ వీధిన పడితే, ఆ కుటుంబం ఆ జాతి, ఆ వాడ మొత్తానికి భవిష్యత్తు లేదు. అందుకే వృత్తులకోసం, తమ భూముల కోసం, రాజీ లేని పోరాటాలు సాగిస్తున్నది స్త్రీలే.. వాళ్లకి తమ బిడ్డ భవిష్యత్తు తమ జాతి భవిష్యత్తు తమ సంస్కృతి తమ జీవన వనరుల గురించి బెంగ. అందుకే వాళ్ళు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ప్రయివేటు పోర్టుల మీద, సెజ్లమీద, ఆధునీకరణ, ప్రయివేటీకరణ, కళ్ళు చెదిరే మాల్స్‌ మల్టిప్లెక్స్‌లు, నగల దుకాణాలు, రవ్వల వజ్రాల దుకాణాలు ఒక చిన్న ప్రపంచానికి, పెరుగుతున్న ధరల తరిగిపోతున్న వనరుల, వృత్తులు, పెద్ద ప్రపంచానికీ మధ్య పెరుగుతున్న అంతరం, స్త్రీలకే ఎక్కువ ఆవేదన కలిగిస్తోందనడానికి, కేరళలో ఆదివాసీ సంక్షేమం కోసం నిరంతర పోరాటం చేస్తున్న సి.కె.జాను, గంగవరం శాంతి, శృంగవరపు కోట దేవుడమ్మ, వీళ్ళ ఉదాహరణలిప్పుడు కావాలి మనకి.. వీళ్ళ గురించి తెలియాలి మనకి, పిల్లలకి… తమకి అనుచానంగా వస్తున్న వృత్తులకోసం, తమ జీవన శైలులకోసం స్త్రీలు పడుతున్న ఆరాటం, వెనుక, వారి జీవితానుభవాలున్నాయి. నష్టపరిహారం పేరుతో చేతిలో పడే కాస్త డబ్బు పలామూలై పోతేకుటుంబం వీధిన పడుతుందని తెలుసు. వలసలై, అలవాటు లేని పనులు వెతుక్కోవడం, అలవాటు లేనిపరిసరాల్లో సద్దుకుని, సద్దుకుని జీవించడం ఎంతదుర్భరమొ స్త్రీలే ఊహించగలరు..సముద్రంలో చేపలు, కొండమీంచి పుల్లలు, అవి వారి జీవితంతో ముడిపడ్డ జీవన వనరులు. గంగవరంలో ఉమ్మడి మరిడమ్మ అనే ఆమె అక్కడ జరిగిన పోలీస్‌ చర్య గురించి చెబుతూ, చాలా సార్లు ”మా సముద్రంపోయింది” అని ఆవేదన పడింది. ఈ బెస్తవారిని స్లీట్‌ ప్లాంటప్పుడొకసారి, ఇప్పుడు మళ్లీ ఇంకొకసారి స్థాన భ్రంశం చేశారు. సముద్రానికి, బెస్తవారికీ మధ్య అభేద్యమైన గోడ కట్టేశారు. మగవాళ్ళు ఉద్యోగాలడుగుతున్నారు. స్త్రీలకి సంపాదనావకాశాలు లేకుండా పోతున్నాయి. పుల్లలేరుకునే పని, చేపలమ్ముకునే పని ఆఖరైపోతోందన్నది వాళ్ళ ఆవేదన.
ఆదివాసీలని అడవుల్లోనించీ వెళ్ళకొట్టి కాలనీల్లోకి తరలిస్తే, సి.కె.జాను ఇలా అంటుంది’ మా జీవనవిధానం, మా ఆచారాలు, మా మనుగడ అన్నీ భూమితో ముడిపడి వున్నాయి. ఈ బంధానికి అతీతంగా ఏ పధకాలు రచించినా మా వాళ్ళు నష్టపోతారు”అని. గంగవరం సమీప గ్రామ బెస్తవాడ లైనా అంతే. వాళ్ళ జీవితాలు సముద్రంతో ముడిపడి వున్నాయి. వాళ్ళ సముద్రం పోయింది. సముద్రంతో పాటు వారి రాబోయే తరాల భవిష్యత్తు పోతోందని ఆ స్త్రీల ఆవేదన. ప్రభుత్వాలు, ప్రయివేటు కంపెనీలు తమ మగవాళ్ళని ప్రలోభ పెట్టడానికి ఎట్లా ప్రయత్నిస్తున్నాయె తెలుసు. అందుకే ఇక్కడ పోరాటాల్లో స్త్రీల భాగస్వామ్యమే ఎక్కువగా ఉంది.
శ్రుంగవరపు కోట దగ్గర జిందాల్‌ కంపెనీ బాక్సైట్‌ తవ్వకాల వ్యతిరక పోరాట సమితి నాయకురాలు కాకి దేవుడమ్మకి కూడా జరగబోయేంతా తెలుసు..అందుకే ఆమె తన భర్త సహకారం లేకపోయినా అలుపెరగని పోరాటం చేస్తోంది. భూమి పోతే జీవితం పోయినట్లేనని తెలుసు. తన కోసమే కాక తన వాళ్ళందరికోసం ఆమె పోరాడుతోంది. ఆమెకి ఇప్పుడు అన్ని విషయాలు తెలుసు. అధికారులుపెట్టే ప్రలోభాలు తెలుసు. బాక్సైట్‌ తవ్వకాల వల్ల జరగబోయే వాతావరణకాలుష్యం సంగతి తెలుసు. నష్ట పరిహారాలు, ఉద్యోగాలిస్తామనే వుట్టుట్టి వాగ్దానాలగురించి తెలుసు. ఆమె వాగ్ధాటి, ఆమె తర్కం, ఆమె ధైర్యం, ఆత్మగౌరవం,..చూస్తే ” ఎస్‌,షికెన్‌” అనిపిస్తుంది…తనపొలం దగ్గర ఆమె ”ఈ నేలనాది”అని బోర్డ్‌ పెట్టింది…దేవుడమ్మ మాట్లాడేటప్పుడు, ఎవరి సానుభూతినీ ఆశించడంకాని..దైన్యం కానీ మచ్చుకైనా కనిపించవు,..పోరాట స్పూర్తి తప్ప.. ఆత్మవిశ్వాసం తప్ప..జీవన్మరణ సమస్యల్లాంటి ఇంత పెద్ద సమస్యల్ని , ఎటువంటి చదువులు లేని ఈ సామాన్య స్త్రీలుఎదురుక్కొంటున్న తీరు చూసి, భద్ర మహిళలు నేర్చుకోవలసింది ఎంతో వుంది. అక్షరాలు రాని జాను కేరళ ఆదివాసీలకోసం చేసిన పోరాటం, ఇప్పుడు గంగవరం శాంతి, కాకి దేవుడమ్మల పోరాటం, వీళ్ళు కావాలి మనకిప్పుడు ఉదాహరణలు..మనం పట్టించుకోవాల్సిన విషయాలనిగురించిన ఎరుక కావాలి మనకి.. బస్‌లో ముందు సీట్లో కూచోడానికి పోరాడిన రోజాపార్క్స్‌ ఒక పెద్ద ఉద్యమానికి దారి వేసింది. .. ఉద్యమాలు ఊరికే పోవు. పోరాటాలు ఆగవు..మార్పులుతప్పవు. ఎప్పుడు నిరాశ ఆవరించినా దిగులు మేఘాలు కమ్మినా, దేవుడిని కాదు, దేవుడమ్మని తలుచుకోవాలి, మనం…

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

One Response to కొత్త ఉదాహరణలు

  1. pasupuleti geetha says:

    కొత్త ఉదాహ ర ణ లు కొత్త కోణాలను ఆవిష్క్రి0చి0ది. వ్యాస0 చాలా బావు0ది.
    – పసుపులేటి గీత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో