ముస్లిం మైనారిటీవాద కవిత్వం – స్త్రీ అణచివేత – షేక్‌ ఇబ్రహీం

కులం, మతం, వర్గం, జాతులు, ప్రాంతాలు అని భేదం లేకుండా స్త్రీలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, లైంగికంగా, కుటుంబపరంగా… ఒక మన భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా నేటికీ పురుషాధిపత్యం చేతిలో అణచివేయబడుతున్నారు. సమాజంలో మిగతా వర్గాల స్త్రీల కన్నా ముస్లిం స్త్రీలపై ఎక్కువగా మత ఆచారాలు, పురుషాధిపత్యం విధించిన ఆచారాలు, ఆంక్షల వల్ల వారు అణచివేతకు, నిర్భందానికీ గురవుతున్నారు.

ముస్లిం మైనారిటీ స్త్రీవాద కవితా ఉద్యమం ఒక గొప్ప సామాజిక చైతన్య అవసరం నుంచి పుట్టింది. ఆవేదనతో కూడిన ఆవేశం, చైతన్యవంతమైన స్పృహ దీనికి తోడైంది. ముస్లిం మైనారిటీ స్త్రీవాద కవితా ఉద్యమం అంటే ముస్లిం స్త్రీల అణచివేతలకు కారణాలు వెలికితీసి వాటిని రూపుమాపి వారిని చైతన్యవంతమైన దారిలో పయనింపజేయడం.

”మిగతా సమాజం కన్నా, మిగతా మతాల కన్నా ముస్లిం సమాజంలో ఇస్లాం మతంలో స్త్రీల పరిస్థితి భిన్నమైంది. మతాలన్నీ స్త్రీని రెండవ జాతి వ్యక్తిగానే పరిగణిస్తున్నప్పటికీ, ఇస్లాం మతం మరికొంత ముందుకు వెళ్ళి స్త్రీని పరదా చాటుకు నెట్టింది. పురుషుల కంటపడటమే పెద్ద నేరంగా కట్టడి చేసింది. ముస్లిం స్త్రీల చుట్టూ అల్లుకున్న పరదా, వాళ్ళ ఆశల్ని, కలల్ని నల్లటి చీకటి ముసుగు కింద తొక్కిపెట్టింది. ఈ పరిస్థితిని ధిక్కరిస్తూ మత ఆంక్షలను నిలదీస్తూ ముస్లిం స్త్రీవాద కవిత్వం ముందుకొచ్చింది” అని వినోదిని గారు ముస్లిం స్త్రీవాద కవిత్వాన్ని గురించి వివరణ ఇచ్చారు.

ప్రపంచంలో ఏ మతమైనా అందులోని స్త్రీ పాత్ర నామమాత్రంగా ఉంటూ పురుషునికన్నా తక్కువ స్థాయిలో ఉంచుతూ, పురుషునికి లోబడి ఉండేలా చూస్తోంది. అయితే ఇంకా ఆధునిక ప్రపంచ ప్రభావం పెద్దగా పడని, ముస్లిం సమాజంలో స్త్రీ స్థానం మరింత దుర్భరంగా అణచివేయబడుతోంది. దీనికి ప్రధాన కారణం రాజకీయ, ఆర్థిక, సామాజిక అవిద్య అనే చెప్పవచ్చు. ‘ముస్లిం స్త్రీలు అభివృద్ధి చెందకుండా ముస్లిం సమాజం అభివృద్ధి చెందదు. ముస్లిం సమాజం అభివృద్ధి చెందకుండా మన భారతీయ అభివృద్ధి సంపూర్ణం కాజాలదు. కావున సాహిత్యకారులు, విమర్శకులు, విద్యావేత్తలు చేయూతనందించి ముస్లిం స్త్రీలను, సమాజాన్ని ప్రగతివైపు నడిపించాల్సిన బాధ్యత సమాజ శ్రేయస్సును కోరే ప్రతి ఒక్కరిపైనా

ఉందనే అభిప్రాయాన్ని ముస్లిం మైనారిటీవాద సాహిత్యకారులు గుర్తించారు.

”ముస్లిం వాదం బాహ్య పోరాటమే కాదు అంతర్గత పోరాటం కూడా చేస్తున్నది. స్వమతంలోని దురాచారాలను, సంప్రదాయాలను తీవ్రంగా ఖండించారు ముస్లింవాద కవులు. ముఖ్యంగా ముస్లిం సమాజంలో స్త్రీలపైన అమలవుతున్న అనేక అన్యాయాలను వీరు ఎత్తి చూపారు. ముందుగా పురుషులే ఈ కోణంలో కవిత్వం రాశారు. తర్వాత స్త్రీలు తమ స్వంత సమస్యల గురించి రాశారు” అని షాజహానా ముస్లిం మైనారిటీ వాదం గురించి విశదీకరించారు.

ముస్లిం స్త్రీ వాదం మొదట పురుష గొంతు నుంచే వెలువడింది. మత ఛాందసవాదుల వలన ముస్లిం సమాజంలోని స్త్రీలు వంటింటికి, పడగ్గదికి పరిమితమై, బానిస బతుకులు బతుకుతూ, మతం విధించిన ముసుగులో అణిచివేయబడ్డారు. ముస్లిం స్త్రీలలో దాగి ఉన్న మనోవేదనను అక్షర రూపంలో మొదట చిత్రించినది ఖాజా.

”బతకడాన్ని బంధాల మధ్యనుంచి తప్ప / కళ్ళమీంచి జారిన నల్ల కఫన్‌లోంచి తప్ప

కలలో, కథల్లో తప్ప రుచి చూడని వాళ్ళం కదా! / మేమెంత నిండు పౌర్ణిమలై ఉదయించినా

మీ మేఘాల మగహస్తాలు కప్పి మమ్మల్ని వికారుల్ని చేయండి

కట్టుబాట్ల వఁసకచ్చడాల్ని నిలువుగా ధరించిన వాళ్ళం కదా!”

………… ……….. ………

ఏ ఐదారేండ్ల కోసారో తోబుట్టువు నిఖాకో, వలీమా విందుకో బయల్దేరితే

మీ అహంకారపు గోతాముల్ని కప్పి / మమ్మల్ని సైతానుల్ని చేసి తీసుకెళ్ళండి” (ఖాజా – ‘షరతు’)

ముస్లిం సమాజంలో దాగి ఉన్న స్త్రీల సమస్యల్ని తెలుగు సాహితీ ప్రపంచ పటంపై చిత్రించిన మొదటి కవిత. ఈ ‘షరతు’ కవిత 1994 ఆగస్టు ఆంధ్రప్రభ వారపత్రికలో అచ్చయింది. ముస్లిం సమాజంలోని స్త్రీలు పండుగలు-పబ్బాలు, నిఖా-వలీమా మరియు

ఉత్సవాలు జరిగేటప్పుడు కుటుంబ సమేతంగా కలిసి వచ్చే సమయంలో కూడా అంధకారంగా, మమ్మల్నొక దెయ్యాలుగా చేసి

తీసుకెళ్తున్నారు అని మనోవేదన చెందుతూ మా కాళ్ళపై కూడా నల్లటి గోతాముల్ని కప్పి మీరే మాకు దారి చూపించండి అని అసహనాన్ని ప్రకటిస్తున్న ముస్లిం స్త్రీల బాధను చిత్రించి ముస్లిం స్త్రీల సంఘ సంస్కర్తగా మెలిగాడు.

”హృదయానికి ఊపిరాడటం లేదు / ఈ ఉదయాల్లో నాకెందుకీ చీకటి వేషం

………… ……….. ………

నన్నో అస్పృశ్యను చేసి బుర్కాలో దాచేస్తే / నా ‘గుల్పోషీ’ తొడిగిన పూనవ్వులకీ

నా కలల ‘చాందినీ’కి / ఏ పవిత్ర గ్రంథం ప్రాణం పోస్తుంది

………… ……….. ………

నా ముఖానికి వేలాడేసిన నఖాచ్‌ / ఎత్తి చూశావా ఎన్నడైనా” (స్కైబాబా – ‘హిజాచ్‌ ‘)

స్కైబాబా రాసిన ఈ కవిత అచ్చం ముస్లిం స్త్రీ రాసినట్లుంది. పరదా చాటున దాగి ఉన్న బడబాగ్నిని, అణచివేతకు, ఛిద్రమవుతున్న జీవితాల్ని ముస్లిం స్త్రీ గొంతుకకు ప్రాతినిధ్యంగా చిత్రించడం మెచ్చుకోదగిన విషయం. మొదట్లో ఖాజా, స్కైబాబా, హానీఫ్‌ మొదలైన కవుల నుంచి వెలువడిన కవితలు ముస్లిం స్త్రీవాద కవిత్వానికి దశను, దిశను నిర్దేశించడమే కాక ముస్లిం స్త్రీవాద కవిత్వానికి, ముస్లిం స్త్రీ చైతన్యానికి, ప్రగతికి పునాది వేసారు. ఇదే రీతిలో షుకూర్‌-బూబమ్మ, షేక్‌ మహహ్మద్‌ రఫీ – ఎంత ఏకినా తెగని రాగం మొదలగు కవితల్లో ముస్లిం స్త్రీ గొంతుక మొదట పురుష గొంతులోంచే వెలువడ్డాయి.

ముస్లిం స్త్రీ అణచివేతకు బురఖాతోపాటు విడాకులు కూడా కారణమవుతున్నాయి. ఈ విడాకులు రెండు రకాలుగా తీసుకుంటారు. అందులో ఒకటి తలాఖ్‌, రెండు ఖులా. భర్త భార్యకు ఇచ్చే విడాకులను ‘తలాఖ్‌’ అంటారు. స్త్రీ భర్తకు ఇచ్చే విడాకులను ‘ఖులా’ అంటారు. ఇస్లాం మతంలో ‘నిఖా (వివాహం)’ అనేది స్త్రీ, పురుషులిద్దరూ ఆత్మీయ చిరకాల బంధంగా కలిసి జీవించడానికి ఒక అంగీకార ఒప్పందం. ఇది ఇద్దరి ఆమోదంతో జరుగుతుంది. ఇందులో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా ‘నిఖా’ జరగదు. వీరిద్దరి వివాహ జీవితం సరిగ్గా లేనప్పుడు పురుషుడు ‘తలాఖ్‌’ ద్వారా, స్త్రీ ‘ఖులా’ ద్వారా వివాహ బంధాన్ని రద్దు చేసుకోవచ్చు.

పురుషుడు ‘తలాఖ్‌’ చెప్పినంత సులువుగా, స్త్రీ ‘ఖులా’ చెప్పలేదు. దీనికి కారణం స్త్రీలు ఆర్థికంగా తమ కాళ్ళమీద తాము నిలవలేకపోవడమే. దీనికి వారి అవిద్య, బురఖా, పురుషాహంకారం కారణాలుగా చెప్పవచ్చు. పుట్టినప్పటి నుంచి స్త్రీని తల్లిదండ్రుల సమక్షంలో, బురఖా చాటున, మదరసా (మత) విద్యకే పరిమితం చేయడంవల్ల, స్త్రీ బయటికి వెళ్ళడం అవమానంగా భావించడం వల్ల, ఆమె పెళ్ళికి ముందు తల్లిదండ్రుల సంరక్షణలో, పెళ్ళి తర్వాత భర్త సంరక్షణలో, వృద్ధాప్యంలో కొడుకుల సంరక్షణలో జీవితం సాగించాల్సి రావడం వల్ల ఆమె ఆర్థికంగా బలపడే అవకాశం లేకుండా పోతోంది. అందుకే పురుషుడు ‘తలాఖ్‌’ చెప్పినంత సులువుగా, స్త్రీలు ‘ఖులా’ ఇవ్వలేరు. ఒకవేళ ‘ఖులా’ ఇచ్చినా సమాజం పెట్టే సూటిపోటి మాటల హింసను భరించలేదు. ఈ హింసకంటే భర్త పెట్టే హింసే నయమని ఆలోచిస్తుంది. అసలు చాలామంది ముస్లిం స్త్రీలకు ‘ఖులా’ ఆలోచనే రాదు. స్త్రీ ఆర్థికంగా ఎదిగితే కానీ ‘ఖులా’ చెప్పలేదు. జీవితాన్ని విడదీయడం ఎవరికీ ఇష్టముండదు. కానీ వారి కష్టాలను ఎదుర్కోవడానికి స్త్రీలకు ‘ఖులా’ అనేది ఒక ఆయుధం అని చెప్పగలం.

‘తలాఖ్‌’ వలన స్త్రీలే ఎక్కువగా నష్టపోతున్నారనే వాస్తవిక ధృక్కోణంతో హనీఫ్‌ ‘వందేళ్ళ కాపురాలు కావాలి’ అంటున్నాడు.

”తలాఖ్‌… తలాఖ్‌… తలాఖ్‌… / మీ నోట్లో వేల సంవత్సరాల పాచి వాసన

ఔరత్‌ అంటే / పడగ్గదుల్లో / కాలిపోతున్న అగరొత్తులేనా?

………… ……….. ………

వాళ్ళేం వస్తువులు కాదు / మధ్యలో నచ్చకపోతే గిరాటు వేయడానికి

ఒక పూటలో వాడిపోయే పూలు కాదు / ఫ్లవర్‌ వాజుల్లో పూలలా మార్చుకోవడానికి

వందేళ్ళ కాపురాలు కావాలి” (హనీఫ్‌ – ‘వందేళ్ళ కాపురాలు కావాలి ‘)

మగతనపు ధీమా ‘తలాఖ్‌’ అని మూడుసార్లు చెప్పినంత మాత్రానా భార్యతో వివాహబంధం పూర్తిగా తెగతెంపులై పోతుంది. జంతువును బలిచ్చే ముందు నీళ్ళు తాగించి ఏ విధంగా బలిస్తారో ఆ విధంగా నిఖా పేరుతో వివాహ బంధంలో అడుగుపెట్టిన స్త్రీల రసాన్ని పీల్చుకుని తలాఖ్‌ చెప్పే అధికార మూర్ఖులకు, అవివేకులకు చిత్తశుద్ధితో హనీఫ్‌ దుఃఖభారంతో హితబోధ చేస్తున్న విషయాన్ని గమనించవచ్చు. తలాఖ్‌ వలన స్త్రీ ఆర్థికంగా, మానసికంగా కుంచించుకుపోతుందనే వాస్తవాన్ని కవి తెలియచేశాడు. వందేళ్ళ సంసార జీవితాలకు ప్రతిబింబం హనీఫ్‌ ‘వందేళ్ళ కాపురాలు కావాలి’. ముస్లిం మైనారిటీవాద కవిత్వానికి స్వచ్ఛతను, పరిపూర్ణతను చేకూర్చింది ముస్లిం స్త్రీ వాద కవిత్వం.

”ముస్లిం స్త్రీ వాద కవిత్వమంటే ముస్లిం స్త్రీలు రాసిందే అవుతుంది. ఇక్కడ సానుభూతికి తావులేదు. ముస్లిం స్త్రీ పుట్టుక ముస్లిం ఉనికిని నిర్ధారిస్తుంది. ఏ వర్గపు స్త్రీనైనా రెండు శక్తులు దారుణంగా కట్టడి చేస్తాయి. ఒకటి మతం, రెండు పురుషాధిపత్యం. అణచివేత

విషయంలో ఒక నిజం గుర్తించాలి. దళిత, హిందూ స్త్రీలకంటే ముస్లిం స్త్రీ ఎక్కువ నిర్బంధాలకూ, బాధలకు గురవుతున్నది” – ఈ అంశాన్ని ముస్లిం మైనారిటీ స్త్రీవాద కవయిత్రులు బలంగా కవిత్వీకరించారు.

ముస్లిం స్త్రీ వాదులు ఇస్లాం మతంలోని ఛాందస సంప్రదాయాలను, మత పెద్దల వెనుకబాటు ఆలోచనలను, ముఖ్యంగా స్త్రీల సమస్యలైన బురఖా, వంటిల్లు, పడగ్గది, విద్య, షరియత్‌, ముస్లిం పర్సనల్‌ లా మొదలైన వాటిపై కొరడా ఝళిపించి ముస్లిం స్త్రీ అభివృద్ధికి తార్కాణంగా కవితలు రాస్తున్నారు. ‘ఆధునిక తెలుగు సాహిత్యానికి అస్తిత్వ ఉద్యమాలు దిక్సూచిగా ఉంటే, ముస్లిం మైనారిటీ వాద కవిత్వానికి ముస్లిం స్త్రీవాద కవిత్వం దిక్సూచిగా ఉంది”.

ముందుగా ముస్లిం స్త్రీ వాద కవిత్వాన్ని గురించి మాట్లాడేటప్పుడు 1992 డిసెంబర్‌ 25న ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో వచ్చిన శ్రీమతి యస్‌.రజియా బేగంగారి ‘అలాగే అన్నారు’ కవితను గురించి చర్చించక తప్పదు.

”బాల్యంలో / చిన్నపిల్లవి నీకేం తెల్సు కూర్చో! అన్నారు / యవ్వనంలో / ఉడుకు రక్తం మంచీ చెడూ తెలీదు కూర్చో అన్నారు

వృద్ధాప్యంలో / ముసిల్దానివి ఇంకేం చేస్తావ్‌ కూర్చో అన్నారు / అవకాశం రానందుకు కోపంగా లేదు నాకు

కూర్చొని కూర్చొని బద్ధకం వచ్చినందుకే బాధగా ఉంది”

పురుషాధిపత్య భావజాలం, అధికార దాహం సమాజంలో స్త్రీని బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఏ రీతిలో బందీగా కట్టడి చేసి, బయటి ప్రపంచంలో సంబంధం లేకుండా అణగద్రొక్కుతున్న విధానాన్ని అక్షర రూపంలో చిత్రించిన తీరు అద్భుతమైనది. 8 పాదాలైన ఈ కవిత ఎంతో విశాలమైన అర్థాన్నిచ్చి, తెలుగు సాహిత్య స్త్రీవాదానికి, ముస్లిం స్త్రీవాదానికి నిలువెత్తు తార్కాణంగా నిలిచింది. ఈ కవిత్వం భూమిమీద ఉన్న ప్రతి స్త్రీకి వర్తిస్తుంది. రజియా బేగం గారు ఈ కవిత రాసేనాటికి ముస్లిం స్త్రీ అయినా, ముస్లిం స్త్రీ వాద ఐడెంటిటీతో రాయలేదు. ఒక స్త్రీ వాదిగా రాసి అందరి మన్నన పొందింది.

ముస్లిం మైనారిటీ స్త్రీ వాద కవిత్వానికి ధిక్కార గొంతుక షాజహానా. ఈమె రాకతో ముస్లిం స్త్రీలు సమాజంలో పడుతున్న అణచివేత, అమానుషత్వం, వెట్టిచాకిరీ, ఇంటి నిర్బంధం, అవిద్య మొదలైన వాస్తవాల ముసుగుల్ని బట్టబయలు చేసింది. షాజహానా ప్రవేశంతో ముస్లిం స్త్రీ వాద కవిత్వానికి వన్నె చేకూరింది. ముస్లిం స్త్రీ జీవిత బాధల సుడిగుండాల్ని గాఢంగా తెలుగు సాహితీ చిత్రపటంలో అభివర్ణించింది. అందువల్ల ముస్లిం స్త్రీవాద కవిత్వానికి షాజహానాను ప్రతినిధిగా సాహితీలోకం గుర్తించింది.

”ఊహ తెలియని వయసులో / గుమ్మానికి పరదా కడితే

రంగు రంగుల కుచ్చులు చూసి మురిసిపోయేదాన్ని! / అప్పుడే స్వేచ్ఛకి మొదటి బేడీ అని తెలుసుకోలేని పసిదాన్ని!

గుమ్మానికి కట్టినట్టే అమ్మ ముఖానికి నఖాచ్‌ కడితే / స్వప్నం లాంటి జిందగీకి శాపమని అప్పట్లో తెలియనిదాన్ని!

………… ……….. ………

ఎవరెస్ట్‌ లేంటి? చంద్రుడ్ని సైతం తాకొస్తున్న స్త్రీలను చూస్తూ / సంసారాలేనేంటి? ఇంగ్లీష్‌ ఛానల్‌ని ఈదుతున్న

ఈ తరం స్త్రీలను చూస్తూ / ఇంకా ఇంకా మౌనంగా ఉండడం నావల్ల కాదు” (షాజహానా – ‘పర్దా హఠాకే దేఖో’)

ప్రపంచంలో ఏ మతాన్ని గమనించినా స్త్రీల దగ్గరికొచ్చేసరికి పురుషాధిపత్యం వివిధ ఆంక్షలు విధించి కట్టడి చేస్తున్నాయి. భారతీయ సమాజంలో దళిత స్త్రీల కన్నా, హిందూ స్త్రీల కన్నా ముస్లిం స్త్రీలు మరింత వెనుకబడి ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ప్రత్యక్షంగా మతపెద్దలు విధించిన కట్టుబాట్లు అయితే, పరోక్షంగా పురుషాధిపత్యం విధించిన షరతులు ముస్లిం స్త్రీల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నాయి. ఇస్లాం అరబ్‌ దేశాలలోనే ముస్లిం స్త్రీలు ఎవరెస్ట్‌ శిఖరాలు, ఇంగ్లీష్‌ ఛానెళ్ళు, అంతరాక్షాన్ని సైతం అధిరోహిస్తూ, ప్రపంచ టెక్నాలజీని అరచేతిలో వీక్షిస్తున్నారు. కానీ అక్కడ లేని ఆంక్షలు భారతదేశ ముస్లిం స్త్రీలకు ఎందుకు అని మతాధిపతులను షాజహానా నిలదీస్తున్న వైనాన్ని గమనించవచ్చు.

”1500 సంవత్సరాలకు పూర్వం అరేబియా దేశంలో స్త్రీకి గౌరవప్రదమైన స్థానం లేదు. కొందరు ఆడపిల్ల పుడుతూనే భూస్థాపితం చేసేవారు. ఒక ఆడదాని కోసం ఎందరో పురుషులు కత్తులు దూసుకునేవారు. ఓడిన తెగల స్త్రీలను, గెలిచిన తెగల పురుషులు వావివరసల్లేకుండా అనుభవించేవారు. అలాంటి పరిస్థితుల్లో మహమ్మద్‌ ప్రవక్త స్త్రీ స్థితిగతులను గణనీయంగా మెరుగుపరిచారు. స్త్రీల లిఖితపూర్వక సమ్మతితోనే వివాహం జరిగేలా చేశారు. వివాహ బంధపు రద్దు అధికారం స్త్రీ పురుషులిద్దరికీ కల్పించారు” అని రహంతుల్లా గారు ఒక వాస్తవాన్ని తెలియజేశారు. ప్రస్తుత సమాజంలో ఇవి సరిగ్గా ఆచరణలో లేవు. కాబట్టి ముస్లిం స్త్రీల అణచివేత గురించి అంత గాఢంగా, నిక్కచ్చిగా ముస్లిం మైనారిటీవాద కవితల్లో ముస్లిం స్త్రీ వాదం చోటుచేసుకుంది.

”అమ్మా! / నువ్వు రంగు రంగుల చీరలు కట్టుకుని షాదీ సంబరానికెళితే చూడాలనుందే

ఎర్రెర్రటి పచ్చ పచ్చటి చెమ్కీ చీరల్లో / నాగుల్‌మీరా మొగలాలి జెండాల్ల నడుస్తుంటే చూడాలనుందమ్మా

………… ……….. ………

నీ చుట్టూ ముళ్ళ కంచెలు పాతిన మా అజ్ఞానాన్నంతటినీ

చిత్తు కాగితాల వాడికి అమ్మేయాలనుంది” (ఖాజా – ‘మా’)

అమ్మను బయటి ప్రపంచంలో బురఖాలో చూడడం తప్ప, అమ్మ అందంగా చెమ్కీ షాదీ సంబరానికి వచ్చే సమయాలలో కూడా అమ్మ స్వేచ్ఛను చూడలేకపోతున్నాను అని కవి ప్రేమగా చెప్పిన తీరు బాధాకరం. కానీ షాదీ సంబరాలలో దాదాపు అందరూ బంధువులే ఉంటారు. అటువంటి సమయంలో కూడా అమ్మ రంగురంగుల చెమ్కీ చీరలు ధరించి వచ్చినా, మతం విధించిన ‘బురఖా’ అడ్డుపడుతుంది. ఇలా షాదీ సంబరాల్లో కూడా అమ్మ స్వేచ్ఛ హరించి వేస్తోంది పురుషాధిపత్యం. షాదీలో సొంత కుటుంబీకుల నడుమ కూడా ‘బురఖా’ అమ్మను హరించివేయడం కవికి నచ్చలేదు. మతం ముసుగులో పురుషాధిపత్యం విధించిన కట్టుబాట్లను చిత్తుచిత్తుగా చిత్తుకాగితంలా వాడికి అమ్మేయాలని కవి దు:ఖభరితంగా చెప్పిన విధానం బాధాకరం.

”అయిదు నెలలకే నాలుగు నెలల కడుపుతో / కట్టుకున్నోడొదిలేసినా

………… ……….. ………

తలాఖ్‌ ఇవ్వగానే ఏ బంధాలతో / సంబంధం లేదనే మగతనపు ధీమా

మరోసారి సెహరా కట్టుకుంది / తన అబ్బా ముఖం ఎరుగని నా మాసూమ్‌ బచ్చీని

నా ముందో ప్రశ్నగా నిలబెట్టి / పొట్టమీది పెద్దాపరేషన్‌ కత్తిగాట్లతో

వడలిపోయిన సెహరా జ్ఞాపకంగా నన్ను మిగిల్చి / వాడు నలుగుర్నైనా నిఖా కట్టుకోవచ్చని చెప్తున్న

నా షరియత్‌ను నిలదియ్యకుండా ఎలా ఉండను? / మూడు నెలల ఇద్దత్‌ కాలానికే మనోవర్తి చెల్లించాలనే

నా ‘పర్సనల్‌ లా’ను ప్రశ్నించడానికి/నేనే మౌనపోరాటానికైనా సిద్ధమే” (షంషాద్‌ బేగం-‘పర్సనల్‌ లా’)

మత ఛాందస్స ఆచార సంప్రదాయాలు స్త్రీల జీవితాన్ని ఎలా దుర్భర స్థితిలోకి నెట్టుతున్నాయనే తరుణాన్ని కవయిత్రి విశ్లేషించింది. నెట్టిన తర్వాత ముస్లిం స్త్రీలు సమాజంలో పడుతున్న బాధను, నష్టాన్ని తెలియజేస్తూ మతాన్ని సంస్మరణ చేయడానికి నేను ఏ పోరాటానికైనా సిద్ధమేనని షంషాద్‌ బేగం గారు చెప్పిన తీరు అద్వితీయం.

మత బంధనాలు ముస్లిం స్త్రీల స్వేచ్ఛను ఏ విధంగా కట్టడి చేశాయో జవేరియా ”ముస్లిం వనిత” కవితలో ”వెంటాడే నీడలు / వెక్కిరించే మనుషులని చూశాక / నవ్వడం ఏడ్వడం

పూర్తిగా మరిచిపోయాను నేను / మాట్లాడుతున్న / స్వరం నాదికాదు

కళ్ళున్నా / చూస్తున్నది నిజం కాదు / జీవితపు ఆటుపోట్ల నడుమ

అలసిన అలని / కరిగిపోయిన / పగటి కలని

మేటి భారతావనిలో / నేటి సగటు / ముస్లిం వనితని” (జమేరియా – ‘ముస్లిం వనిత’)

భారతదేశంలో సగటు ముస్లిం స్త్రీల అణచివేత జీవితాలను అక్షరరూపంలో జవేరియా చిత్రించిన విధానం ఆలోచించదగినది. ముస్లిం పురుషాధిపత్యం స్త్రీలను ‘మతఛాందసం’ అనే సంప్రదాయ తెర వెనుకనే ఉంచడం వల్ల వారికంటూ ఒక సొంత వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోలేకపోతున్నారు. సొంత వ్యక్తిత్వం లేని కారణంగా పురుషుని చేతిలో జీవమున్న ఆటబొమ్మలుగా మారుతున్నారు. తన వెనుకబాటును వెనుకబాటుగా కూడా గుర్తించలేని స్థితిలో ముస్లిం స్త్రీలు అణచివేయబడ్డారు. ‘పురుషాధిపత్య అహంకార’ తెరను ముస్లిం స్త్రీ సమాజం ఛేదించగలిగితే తాను నేటి సమాజ వాస్తవస్థితిని గ్రహించగలుగుతుంది. ప్రస్తుత కాలంలో ముస్లిం మైనారిటీవాదులు హేతువాద, మార్క్సిస్టు దృక్పథాలతో కలం ఝళిపించి పోరాటం చేస్తే కానీ ముస్లిం సమాజం, స్త్రీలు అభివృద్ధి చెందరనే విషయాన్ని గ్రహించారు.

‘బాల్యంలో నిఖా చేసి / దూరం చేశారు నీ బాల్య మధురస్మృతిని

కట్టుబాట్ల పేరుతో నీ అభివృద్ధిని సఫా చేసి / తెచ్చారు నిన్ను హీనస్థితికి

మతం ఆచారాల పేరిట మార్చారు / నిన్ను కేవలం సంతానం కనే యంత్రంగా

ఆస్తి హక్కు లేకుండా / ఆర్థిక అసమానతలతో చేశారు నిన్ను అనాథను / పర్దా చాటున ఉంచి

………… ……….. ………

నిన్ను సమాధి చేస్తున్నారు / ఒహెనా! కాస్త ఆలోచించు” (వాజిదా ఖాతూన్‌ – ‘పర్దా ‘)

ముస్లిం సమాజంలో అక్కడక్కడ ఆడపిల్లలకు చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసి వారి మధుర జ్ఞాపకాలను దూరం చేస్తోంది పురుషాధిపత్యం. స్నేహితురాళ్ళతో ఆడిపాడి సంతోషంగా ఉండవలసిన వయస్సులో మత పెద్దలు విధించిన సంప్రదాయ ముసుగు ముస్లిం ఆడపిల్లల స్వేచ్ఛను సమాధి చేసి, అంధకారమనే తెర తెరిచి అందులో వారిని నెడుతోంది పురుషాహంకారం. ముస్లిం పిల్లలు కేవలం పిల్లలను కనే యంత్రంగా కట్టుబాట్ల నడుమ బంధించబడుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా స్త్రీ, పురుషులిద్దరికీ సమాన హోదా లేదు. ఆస్తి హక్కులో కూడా కాలం మారుతున్నకొద్దీ ముస్లిం స్త్రీల హక్కులను సమాధి చేయడమే కాకుండా, ముస్లిం మత పెద్దలు పురుషస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా వాటిని సవరించుకుని స్త్రీల హక్కుల్ని కాలరాస్తున్నారు. వాజిదా ఖాతూన్‌ గారు చివరి 2 పాదాల్లో వర్ణించిన తీరు ప్రతి ముస్లిం స్త్రీ ఆలోచించదగినది. ‘చెల్లెల్లారా! పరదా చాటున మిమ్మల్ని కట్టడి చేసి, మీ అభివృద్ధికి అడ్డుకట్ట వేసి మిమ్మల్ని బానిసలుగా చేస్తున్నారు. ముస్లిం మత ఛాందస అంధకార పురుషాధిపత్యాన్ని సమాధి చేస్తే తప్ప మీ జీవితాలకు వెలుగుబాట రాదు’ అని కవయిత్రి మేల్కొలుపుతోంది.

”పరదా వెనుకనున్న ఆవేదనని / వెన్నలాంటి మనస్సు గానీ / మేధోశక్తిని గానీ

అమాయకత్వాన్ని గానీ / గుండెల్లో దాగి ఉన్న బాధని ఎప్పుడైనా గుర్తించారా?

పరదాలో దాగి ఉన్న కళ్ళల్లోంచి / ఎన్ని అశ్రుబిందువులు నేలరాలాయో

ఏనాడైనా లెక్కగట్టారా…? / మత కట్టుబాట్లు / ఇంటినే ఒక బందిఖానా గానూ

భర్తే… దైవాంశ సంభూతిడిగానూ / పిల్లలే… జీవిత గమ్యంగా చిత్రించి

శాశ్వతంగా స్వేచ్ఛను ఉరితీస్తున్నాయి” (షేక్‌ ఇబ్రహీం – ‘బందీ కా జిందగీ’)

తరతరాలుగా ముస్లిం స్త్రీ అణచివేతకు గురవుతూనే ఉంది. మత ఆచారాలు స్త్రీని ఒక భార్యగా, బానిసగా, ఇంట్లో వెట్టిచాకిరీ చేసే నౌకరుగా చూడడం తప్ప, తనలో దాగి ఉన్న సృజన్మాతక శక్తిని గానీ, సామర్థ్యాన్ని గానీ, ఆశల్ని గానీ, కోరికల్ని గానీ, స్వేచ్ఛను గానీ గుర్తించకుండా వికటాట్టహాసాన్ని పొందుతున్నది ముస్లిం మత ఛాందసత్వం. ఈ విధంగా ముస్లిం స్త్రీల ఆశయాన్ని కట్టడి చేసి నడిబజారుల్లో వారి స్వేచ్ఛను ఉరి తీస్తున్నాయనే కవి ఆవేదన అంతుచిక్కనది.

”ప్రతి కాన్పూ సిజేరియన్‌ కత్తుల కడుపు కోతైనప్పుడు

ప్రతి జననమూ మా రూపాయి మీద గుది బండయినప్పుడు

ఇద్దరు అనే పదం చుట్టూ సైన్స్‌ వృత్తం గీస్తున్నప్పుడు

అరె… బట్టేబాజ్‌ / నీ కళ్ళకు / పందిలా పదిమందిని కనేవాళ్ళలా కనబడ్తున్నాం?

దేశాన్ని మా నలుసులతో నింపేవాళ్ళంరా మేము” (షెహనాజ్‌ & ఆజం – ‘బట్టేబాజ్‌ ‘)

సాధారణంగా ముస్లిం స్త్రీ అనగానే చాలామందిలో అనేకమందికి జన్మనివ్వడానికి పుట్టిన స్త్రీ అనే అపోహ ఉంది. జన్మనిచ్చే ప్రతిసారీ కడుపు కత్తులకోత అవుతుంటే పదుల మందికి జన్మ ఎలా ఇవ్వగలను అని కవయిత్రి అసహనాన్ని, ఆవేదనను వ్యక్తం చేసింది.

ఆకాశంలో సగం / అసెంబ్లీలో సగం / ఆలోచనల్లో సగం / ఆదిశక్తి – మహాశక్తి

………… ……….. ………

పులిరాజుల విషకోరల్లో / నలిగే అభాగ్యదనం స్త్రీ / మగమహారాజుల ధనదాహార్తికి

కట్నం కొలిమిలో కాలేది స్త్రీ / పాతబస్తీ ముఖ్మల్‌ దుపట్టాలో / షేకుల సరదాకు ఆవిరయ్యేది స్త్రీ

………… ……….. ………

సమానత్వం… సమానత్వం / అన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలే

బానిసగా మలిచే యత్నాలే” (ఖాలిదా పర్వీన్‌-‘స్వేచ్ఛ ముసుగులో ‘)

పురుషస్వామ్య వ్యవస్థ శతాబ్దాలుగా అధికారాన్ని చెలాయిస్తూ స్త్రీలను సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, లైంగికంగా, అంతర్గతంగా – బాహ్యంగా నేటికీ అణచివేస్తున్నారు. కానీ పురుషాధిపత్య మాటల్లో, చేతల్లో స్త్రీని జీవితంలో సగం అని, అన్నింటిలో సమాన హోదా అని నమ్మింపజేసి మోసపుచ్చుతూనే ఉన్నారని కవయిత్రి చెప్పిన విధానం ఆలోచించదగినది.

ముస్లిం మైనారిటీ స్త్రీ వాద కవిత్వంలో పరదామీద ఒక కోణంలో వ్యతిరేకంగా వస్తే, మరో కోణంలో పరదాను సమర్థిస్తూ అనుకూలంగా రాసిన కవులు, కవయిత్రులు లేకపోలేదు.

”నిన్న విరబూసిన అందాలపై / ఎన్నో జతల కన్నులు వాలేవి

నన్ను స్పృశించాలని / మాంసం ముద్దల్ని తాకాలని / ఎన్నో చేతులు తారట్లాడేవి

………… ……….. ………

చిరుగులు పడిన బతుక్కి / రోజూ అతుకులు పడాల్సిందే

వెలిసిపోయిన రంగుల్ని / పోత పోసిన సొగసుల్ని / వాడీ వాడీ కుట్లూడిపోతున్న సల్వార్‌ కమీజుల్ని

దాయలేని అందం వాడిపోతూనే ఉంది” (షహనాజ్‌ – ‘ఇప్పుడు నేనొక్కత్తినే ‘)

ముస్లిం సమాజం ప్రధానంగా వెనుకబడుటకు ప్రత్యక్ష కారణం పేదరికమైతే, పరోక్ష కారణం మతంలోని కొన్ని మూఢ ఆచారాలు. కవయిత్రి పేదరికాన్ని, ఆకలిని, దుండగుల నుంచి రక్షణ పొందడానికి బురఖా ముస్లిం స్త్రీలకు రక్షణ కవచంలా ఉపయోగపడుతుందని చెప్పిన తీరులో వాస్తవం లేకపోలేదు. ముస్లిం మైనారిటీ వాదుల కవులు షహనాజ్‌ గారు చెప్పిన మాటలు వాస్తవమే అయినా ఆధునిక కాలంలో వాటి అవసరం ఎంతవరకు ఉండాలి అనేది ఆలోచించదగాలని చెప్పారు.

”ఓ అతివాదం / మా పర్దాలపై దాడి చేస్తూ

పర్దా ప్రగతికి ప్రతిబంధకం అంటూ / అబద్ధాల గోళ్ళతో మా దేహాల నిండా రక్కుతుంది

………… ……….. ………

సభ్యతల్ని, సంస్క ృతుల్ని విడిచి / మమ్మల్ని నల్లగబ్బిలాల మంటది / తారు డబ్బాల మంటది” (ఫరీదాబాను – ‘మేం బానిసలం కాము’)

కవయిత్రి దృష్టిలో ‘ఓ అతివాదం’ అంటే ముస్లిం స్త్రీవాద కవిత్వానికి మార్గదర్శకులైనవారు, ముస్లిం స్త్రీ వాదాన్ని రాసే కవయిత్రులు ఆచార సంప్రదాయాలైన ‘పర్దా’ను తక్కువ చూపుతో రాశారని, సంస్కృతుల్ని గౌరవించలేదని తక్కువ చూపుతో రాశారని ఆవేదనతో పలికిన కవిత్వాక్షరాలు. ఎవరి బాధను వారు చెబితేనే విశ్వసనీయతలో గాఢత ఉంటుంది.

ఆ బాధ పడినవారికే తెలుస్తుంది. ఫరీదాబాను చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదు. అలాగే ముస్లిం మైనారిటీ కవులు, కవయిత్రుల కవిత్వంలోను వాస్తవం లేకపోలేదు. అయితే మారుతున్న కాలానుగుణంగా ఏ మతంలోనైనా సంస్కరణలు

తప్పవు. సంస్కరణలు జరగని పక్షంలో ఆ మత సమాజాభివృద్ధి అక్కడితో ఆగిపోతుంది. కాలానుగుణంగా సమాజంలో మార్పులు వస్తేనే హిందూ మతమైనా, ఇస్లాం మతమైనా, క్రిస్టియన్‌ మతమైనా, బౌద్ధ మతమైనా, సిక్కు మతమైనా మనుగడలో ఉంటాయి. ఏది ఏమైనా భావితరాల విద్యావేత్తలు, సమాజం ఏది వాస్తవం, ఏది అవాస్తవమని గుర్తించగలిగే మేధస్సు వారికే ఉంది.

ముస్లిం మైనారిటీవాద కవిత్వంలో స్త్రీ అణచివేత గురించి విభిన్న రకాల వస్తువులను గమనించాం. పరదాకు వ్యతిరేకంగా, పరదాకు అనుకూలంగా వచ్చిన కవిత్వాన్ని చూశాం. కానీ పరదాకు మరో రూపం, బీదవారి పరదా అయిన ‘చద్దర్‌’పై వచ్చిన ఒకే ఒక కవిత మహమ్మద్‌ రఫీగారి ‘అమ్మీజాన్‌ చద్దర్‌’ ముస్లిం మైనారిటీవాద కవిత్వంలో చోటుచేసుకుంది. ఈ కవిత 2005లో ”సెల్యూట్‌ ది గ్రేట్‌” ప్రత్యేక సంచికలో వచ్చింది.

”చిన్నప్పుడు / అమ్మీజాన్‌ చద్దర్‌ బయటికి తీస్తే చాలు / ఎగిరి గంతులేసే వాడ్ని / కొత్త కొత్త ఆప్యాయతలేవో

మనసులో మెదిలేవి / మల్లెపూవు లాంటి చద్దర్‌ను తడిమి చూస్తే / అమ్మ ఒడిలా హాయిగా ఉండేది

ఆలోచనలు పెరిగేకొద్దీ / అమ్మీజాన్‌ తెల్లటి చద్దర్‌ వెనుక / నల్లటి నీడలేవో భయపెట్టేవి

………… ……….. ………

పరుగులెత్తే ప్రపంచం ముందు / పసిపాపల్లా మిగిలున్న / భాభీ… బెహన్‌… అమ్మీజాన్‌… ఆపాలను చూసి

ఘన సంప్రదాయ వారసులని / మీసాలు మెలేయనా…? / అంతా అల్లా దయ అని / అనంత కరుణామయుడ్ని బోనెక్కించనా”

”పరదా” కొనే స్థోమత లేని ప్రజలు ‘చద్దర్‌’ను కొని ధరిస్తారు. ఈ చద్దర్‌ మహా అయితే రెండు వందల రూపాయల లోపే ఉంటుంది. అందుకే సామాన్య ముస్లింలు, గ్రామీణ ప్రాంతాలలో ఉండే ముస్లింలు నేటికీ ఎక్కువగా వీటినే ధరిస్తున్నారు. అందుకే ఈ చద్దర్‌ను ‘గరీబు పరదా’, ‘గరీబు చద్దర్‌’ అని పిలుస్తారు. చిన్నతనంలో అమ్మ ఇంట్లోనుంచి ‘చద్దర్‌’ తీసిందంటే చాలు పిల్లల ఆనందానికి హద్దు అదుపులుండవు. అందుకే పిల్లలకు అమ్మీ చద్దర్‌ కూడా అమ్మ ఒడిలా కనిపిస్తుంది. పరదా కన్నా చద్దర్‌ను రెండు చేతులతో శరీరంపై నుంచి జారిపోకుండా ధరించాలంటే కష్టం. ఏదైనా లగేజీ పట్టుకున్నప్పుడు లేదా బస్సు ఎక్కే సమయంలో అమ్మీ చద్దర్‌తో పడుతున్న తిప్పలు, ఆ చద్దర్‌ చాటున వదిన, అక్క, చెల్లెల అణచివేత, వెనుకబాటుతనం… చివరికి దయామయుడైన అల్లాపై కూడా అసంతృప్తిని ప్రకటిస్తున్నాడు కవి.

ముస్లిం స్త్రీ అభివృద్ధి కాకపోతే ముస్లిం సమాజం అభివృద్ధి చెందదు. ముస్లిం సమాజం, ముస్లిం స్త్రీలు అభివృద్ధి చెందాలంటే:

్జ మతం విధించిన ఆచారాల్లో కొన్నింటిలో సంస్కరణలు జరగాలి

్జ పితృస్వామ్య వ్యవస్థలో మార్పులు రావాలి.

్జ స్త్రీలకు ఆధునిక విద్యపై అవగాహన కలిగించాలి.

్జ సమాజంలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు ఉండేలా చూడాలి.

ఈ విషయాలపై ముస్లిం సమాజం, ముస్లిం మైనారిటీవాద సాహిత్యం దృష్టి సారిస్తే ముస్లిం స్త్రీలు మెరుగుపడతారు.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో