లె మిజరాబ్‌ – ఉమా నూతక్కి

”ఈ లోకంలో అన్యాయం, అక్రమం, పేదరికం, దోపిడీ ఉన్నంతకాలం… అలకాపురులలోని కుబేరుల పక్కన నరక కూపాలలో నరులు నివసించినంత కాలం… అజ్ఞానాంధకారంలో మనుషులు దివాంతాల్లో కొట్టుమిట్టాడినంత కాలం ఇలాంటి పుస్తకాల అవసరం ఉంటుంది”.

ఇది విక్టర్‌ హ్యూగో లె మిజరాబ్‌కు రాసిన ముందు మాట. పదేళ్ళపాటు ఫ్రాన్స్‌ రాజకీయ, సాంఘిక, ఆర్థిక పరిస్థితుల్ని, వర్గ సంబంధాలను అధ్యయనం చేసి, తన పరిశోధనా ఫలితాన్ని ఒక మెలో డ్రమటిక్‌ కథగా మలచిన పుస్తకం లె మిజరాబ్‌ ఈ నెల మీకు పరిచయం చేస్తున్నాం.

విక్టర్‌ హ్యూగో!! 1848 నాటి విప్లవంతో రాజకీయ వ్యవస్థ తలకిందులైనప్పుడు ప్రభుత్వ వ్యతిరేక రచనలు చేయడం ద్వారా దేశ బహిష్కరణకు గురైన రచయిత. ఆయన ప్రవాసంలో

ఉన్నప్పుడు ఫ్రెంచ్‌ సమాజాన్ని దగ్గరగా పరిశీలించి, స్వయంగా అనుభవించి రాసిన పుస్తకం లె మిజరాబ్‌.

అప్పుడప్పుడే ఆవిర్భ విస్తున్న పెట్టుబడి దారీ వ్యవస్థ స్వభావాన్ని అధ్యయనం చేసిన హ్యూగో ఈ సమాజంలోని సమస్యలన్నింటికీ మూలం డబ్బే అంటాడు. ”పేదవాళ్ళకే ఎందుకిన్ని కష్టాలు? వాళ్ళ బతుకులింత నికృష్టంగా ఎందుకున్నాయి? ఎందుకింత మిజరీ? ఈ మిజరబుల్‌ జనజీవితం బాగుపడేదెప్పుడు?” లేమిజరాబ్‌ పుస్తకం అంతా ఇవే ప్రశ్నలు. దాదాపు 150 సంవత్సరాల క్రితం హ్యూగో లేవనెత్తిన ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు.

పేదవాళ్ళు మాత్రమే నేరాలు చేస్తారనడం ఎంతవరకు సబబు అంటారు హ్యూగో. ఏ వ్యక్తి అయినా స్వతహాగా నేరం చేయడు. పరిస్థితుల ప్రభావం వల్ల అతడు ఒకసారి నేరం చేస్తే ఆ వ్యక్తిని ఆఖరిదాకా ”దొంగ దొంగ” అని ఈ సమాజమూ, ప్రభుత్వమూ ఎలా తరిమి తరిమి కొడుతుందో హృదయ విదారకంగా చెప్తాడు హ్యూగో.

ఇక కథలోకి వస్తే జీన్‌ పాల్‌ జీన్‌ అతి సామాన్యమైన వ్యక్తి. తన సోదరి పిల్లల ఆకలి బాధ తీర్చడానికి ఒక చిన్న రొట్టె ముక్క దొంగతనం చేస్తే ఆ చిన్న నేరానికి గాను అతనిపై ఇంకా అనేక నేరాలు మోసి 19 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తుంది ప్రభుత్వం. జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చిన జీన్‌కు అతని చేతిలో ఉన్న శిక్షాపత్రం కారణంగా ఎవరూ ఆశ్రయమివ్వరు. అతి చిన్న నేరానికి అంత పెద్ద శిక్ష అనుభవించిన జీన్‌ సమాజం పట్ల విపరీతమైన ద్వేషం పెంచుకుంటాడు. ఆ ద్వేషం అతని నడవడికపై అతని రూపురేఖలపై కూడా పడడం వల్ల చూసే ఎవరికైనా అతనొక ప్రమాదకరమైన వ్యక్తిలా కనబడి, అందరి చేత నిరాదరణకు గురవుతాడు.

ఆకలికి అలమటిస్తున్న అతనిని ఒక మత గురువు ఆదరించి ఆకలి తీరుస్తాడు. అయితే దాదాపు ఇరవై సంవత్సరాలపాటు మనుషుల పట్ల అతను పెంచుకున్న తీవ్ర ద్వేషం, తనపై మత గురువు చూపించిన సహృదయత పట్ల ఏ మాత్రం మారదు. అందరూ నిద్రపోయాక అతని ఇంట్లో వెండి వస్తువులు దొంగిలించి పారిపోతాడు జీన్‌. ఊరి పొలిమేరల్లో అతనిని పట్టుకున్న పోలీసులు ఆ వస్తువులు మత గురువునిగా గుర్తించి, జీన్‌ను బంధించి తీసుకు వస్తారు. అయితే మత గురువు అతన్ని క్షమించి ఆ వెండి వస్తువును తీసుకెళ్ళమని, ఇక ఎన్నడూ దొంగతనం చేయవద్దనీ… అతని ఆత్మని ఆ వెండితో కొంటున్నాననీ, ఆనాటినుండి అతని మాలిన్యం కరిగిపోవాలనీ అనునయంగా అంటాడు.

దాంతో జీన్‌ పాల్‌ జీన్‌ హృదయం విపరీతమైన సంచలనానికి గురవుతుంది. పశ్చాత్తాపానికి గురైన జీన్‌ కొత్త జీవితం మొదలుపెడతాడు. మాడిలీన్‌గా పేరు మార్చుకుని మాంట్రీల్‌ అనే నగరం చేరుకుని ఒక కాస్ట్యూం జ్యువెలరీ ఫ్యాక్టరీ స్థాపించి అనేకమందికి ఉపాధి కల్పిస్తాడు. కాలక్రమంలో ఆ ఊరిలో పేద ప్రజలకి దేముడిగా మారతాడు. ఇదే సందర్భంలో అప్పటి ఫ్రాన్స్‌ పేదరికాన్ని గణాంకాలతో చిత్రిస్తాడు హ్యూగో. కొన్నాళ్ళకి ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన మాడిలీన్‌ (జీన్‌ పాల్‌ జీన్‌) ఆ ఊరి మేయర్‌గా ఎన్నికై అందరి మన్ననలు పొందుతాడు.

అయితే ఒక రోజు కథ కొత్త మలుపు తిరుగుతుంది. జీన్‌ పాల్‌ జీన్‌ అనే ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేస్తారు. అతనిపై పాత రోజుల్లో మన జీన్‌ చేసిన నేరాలు అన్నీ మోసి శిక్ష విధించడానికి విచారణ మొదలు పెడతారు. తట్టుకోలేకపోయిన మాండలీన్‌గా మారిన జీన్‌ కోర్టు ముందు హాజరై తానే ఆ జీన్‌ పాల్‌ జీన్‌ అని ఒప్పుకుని జైలుకు వెళ్తాడు.

పెంపుడు కూతురుకి దూరం కాలేక జైలు నుంచి తప్పించుకుని సముద్రంలో దూకుతాడు. అందరూ అతను మరణించాడని అనుకుంటారు. అయితే అక్కడినుంచి తప్పించుకున్న జీన్‌ మరోచోట రహస్యంగా తలదాచుకుంటాడు. అయితే అతను ఎంతగా మారినా గతంలో అతనిపై మోపిన నేరాలను చట్టం క్షమించదు. అతను ఎన్ని మంచి పనులు చేసి అప్పటిదాకా దేముడిగా కొలవబడినా.. ప్రజలు కూడా ఆ సమయంలో అతనిని నమ్మి సహాయం చేయరు.

జీన్‌ పాల్‌ జీన్‌ దురదృష్ట గాధ చెప్తూనే అంతర్లీనంగా ఆనాటి ఫ్రాన్స్‌ రాజకీయ, సాంఘిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చెప్తాడు హ్యూగో. అప్పటి సమాజంలో ఉన్న అలజడి, తిరుగుబాట్లు… అన్నీ కూలంకషంగా వివరిస్తాడు.

ఫ్రెంచ్‌ విప్లవం ప్రారంభమవుతుంది. పారిస్‌ నగరం అనేక ఆంక్షల నడుమ నలిగిపోతూ ఉంటుంది. విప్లవంలో పాల్గొనడం ద్వారా నిష్కృతి పొందాలనుకుంటాడు జీన్‌. పోరాటం తీవ్రతరం అవుతుంది. అదే సమయంలో అతని పెంపుడు కూతురు అయిన కాసెట్‌ ఒక విప్లవకారుడిని ప్రేమిస్తుంది. అయితే అతను మంచివాడు కాదనీ కోవర్టు అని జీన్‌ పాల్‌ జీన్‌కు తెలుస్తుంది. విప్లవకారులు కూడా అతని నిజ స్వరూపాన్ని తెలుసుకుని అతనికి మరణశిక్ష విధిస్తారు. తన పెంపుడు కూతురు కోసం అతనిని రక్షించి విప్లవకారుల చేతుల్లో చావు దెబ్బలు తింటాడు జీన్‌ పాల్‌ జీన్‌.

చివరకు అతనిని శిక్షించినందుకు విప్లవకారులు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కాసెట్‌ ప్రేమించిన వ్యక్తి కూడా మారతాడు. అయితే అప్పటికే జరగవలసిన ఘోరం జరిగిపోతుంది. జీన్‌ పాల్‌ జీన్‌ మరణశయ్య మీద ఉంటాడు.

ఎప్పుడో తెలిసీ తెలియక చేసిన పొరపాట్లకి… ఆ తరువాత ఎంతగా మారినా, సమాజానికి ఎంత మంచి చేసినా చట్టం దృష్టిలోనూ, అత్యధిక సమాజం దృష్టిలోనూ అతను ఎప్పటికీ నేరస్తుడే!! అయితే ఒక మనిషి మంచిగా మారితే ఎంత మహోన్నతుడు కాగలడో కూడా లే మిజరాబ్‌ పుస్తకం మనకు చెప్తుంది.

ఇదీ లె మిజరాబ్‌ కథ. ఒక సాధారణ పురుషుడు మహా పురుషుడిగా ఎలా ఎదగగలడో చెప్పే పుస్తకం ఇది. పూర్తి పుస్తకం చాలా పెద్దది. అది చదవడం కష్టమే. అయితే క్లుప్తీకరించిన ఎడిషన్స్‌ ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. తప్పక చదివి తీరాల్సిన పుస్తకం లె మిజరాబ్‌.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో