భిన్న భావాల సంఘర్షణ – గర్భధారణ డా.షమానారంగ్‌

గర్భవతులవడంతో స్త్రీలు ఎన్నో రకాల భయ సందేహాలకు, అనేక అనుమానాలు, సంతోషం, సంతృప్తి, ప్రేమ అన్నీ కలగలిసిపోయిన అనుభూతులకు లోనవుతారు. ఇకముందు తాము గడపబోయే జీవితంలో చాలా మార్పులు వస్తాయని కూడా అర్థమవుతుంది. ఈ భిన్న భావాల సంఘర్షణ మొదటిసారి గర్భవతి అయినప్పుడు, ముఖ్యంగా మొదటి కొద్ది నెలల్లో ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఎవరితోనన్నా ఈ భావాలు పంచుకోవడానికి ప్రయత్నించినా మొత్తానికి ఈ బాధ్యతను మోయాల్సింది మాత్రం తానేనన్న సంగతి అలాగే మిగిలిపోతుంది. కొన్నిసార్లు నిస్పృహకి దారితీసినా ఆశ్చర్యం లేదు. అందరి విషయాల్లోనూ ఇలాగే అవుతుందని కాకపోయినా కొందరి జీవితాల్లో ఇది నిజం. మొదటి గర్భం అయితే మిగతావాళ్ళ ప్రవర్తన ‘ఇదంతా మామూలే’ అనే పద్ధతిలో ఉంటుంది.

కొందరి విషయాల్లో ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత గర్భం రావచ్చు. కొందరి విషయంలో అనుకోకుండా రావచ్చు. కొందరికి గర్భం రావడానికి చికిత్స పొందే అవసరం ఉండచ్చు. కొందరికి గర్భం రావడానికి ఏ మాత్రం ఇష్టం లేకపోవచ్చు. అయితే, గర్భంలో పెరిగే పిండానికి మన భావాలతో పనిలేదు. మన శరీరంలో వచ్చే మార్పులకనుగుణంగా శరీరం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ మార్పులు నెల తప్పినప్పటి నుంచి ప్రారంభమవుతాయి. కొందరి విషయంలో ఒకటి రెండు వారాల తర్వాత మొదలవుతాయి. డాక్టర్‌ దగ్గరకు వెళ్ళి పరీక్ష చేయించుకుంటే మనలో చాలామందికి అనుమానాలు పోయి, ధైర్యం వస్తుంది. ఒక్కొక్కసారి మనల్ని డాక్టర్‌ దగ్గరికి వెళ్లకుండా ఆపడం కూడా జరుగుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళెవరయినా ‘మా చిన్నప్పుడు మేం డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎరుగుదుమా, మా పిల్లలు నిక్షేపంగా లేరూ?’ అంటూ అడ్డుపడవచ్చు. నిజమే. వెనుకటి రోజుల్లో అలాగే ఉండేది. నొప్పులు మొదలై ఒకటి, రెండు రోజులైతేనో, రక్తస్రావం మొదలైతేనో నాటు మంత్రసాని తనవల్ల కాదని చేతులెత్తేస్తేనో తప్ప డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం జరిగేది కాదు.

గర్భం రావడం ఒక జబ్బు కాదు. దానికి చికిత్స అవసరం లేదు. నిజమే. కానీ చాలామందికి వైద్య సలహా అవసరం కావచ్చు. ఈ వైద్య పరీక్షల్లో ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. ఉదా – కవలలున్నా, రక్తహీనత, రక్తపోటు లాంటి సమస్యల్ని డాక్టర్లు ముందుగానే తెలుసుకుంటారు. మొదటిసారి గర్భం వచ్చినప్పుడు లేదా చాలా చిన్న పిల్లలకి (17 సంవత్సరాల లోపు పిల్లలకు) గర్భం వచ్చినప్పుడు, మరీ పెద్దవారికి (35 సం||పైన) ప్రసవం కష్టం కావచ్చు. మన అమ్మమ్మల కాలంలో వైద్య సదుపాయాలు చాలా తక్కువగా ఉండేవి. గత 15-20 సంవత్సరాల్లో వైద్య విజ్ఞానం, సదుపాయాలూ బాగా వృద్ధి చెందాయి. వీటిని సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే వీటి ఆవశ్యకత ఉన్న వారికి ఎంతో మేలు జరుగుతుంది.

క్రమం తప్పకుండా ఆస్పత్రిలో చేయించుకునే పరీక్షలు గర్భంలో వచ్చే మార్పులు సక్రమంగానే ఉన్నాయని తెలుసుకోవడానికి, దాంతో మనస్సు కుదుటపడడానికి ఉపయోగపడతాయి. ఏదైనా సమస్య తలెత్తితే గమనించి దాన్ని వెంటనే చికిత్స చేయవచ్చు. ఆస్పత్రికి మొదటిసారి వెళ్ళినప్పుడు డాక్టర్లు యాంత్రికంగా ప్రశ్నించడం, పరీక్షించడం చేస్తారు. వారేం పరీక్ష చేస్తున్నదీ, ఎందుకు చేస్తున్నదీ చెప్పరు. ప్రైవేటు డాక్టర్లు కూడా అంతే.

డాక్టర్‌ను చూడడానికి వెళ్ళిన ప్రతిసారీ బరువు చూడడంతో పరీక్ష మొదలవుతుంది. గర్భం మొత్తం కాలంలో 8 నుంచి 12 కిలోల బరువు పెరగడం జరుగుతుంది. బరువు ఒక్కసారిగా పెరిగితే దానికి కారణం అతిగా తినడం వల్లనో, శరీరం నీరు పట్టడం వల్లనో కావచ్చు. బరువు పెరగకపోతే దానికి కారణం ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, వికారం, వాంతులవల్ల నీరు పోవడం లేదా శ్రమ ఎక్కువ కావడం. మొదటి మూడు నెలల్లో వేవిళ్ళ మూలంగా కొంతమంది స్వల్పంగా బరువు తగ్గవచ్చు.

డాక్టర్లు పరీక్ష చేస్తూనే ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. దీన్ని కేసు హిస్టరీ అంటారు. దీనిలో ఇంతకు పూర్వం వచ్చిన జబ్బులు, ఇదివరకు వచ్చిన గర్భాలు, ప్రసవాల గురించి, గర్భస్రావాలు జరిగితే దేనివల్ల జరిగిందీ తెలుసుకోవడం జరుగుతుంది. ఇన్ని ప్రశ్నలేసే డాక్టర్లు అరుదు, కానీ అడిగినపుడు అన్నీ గుర్తచేసుకుని చెప్పాల్సిన బాధ్యత మనమీద ఉంది. ఇంతకు ముందొచ్చిన సమస్యలు ఇప్పుడు మళ్ళీ తలెత్తే అవకాశముంది కాబట్టి, అన్నీ గుర్తుచేసుకుని చెప్పటం మంచింది.

గర్భిణీ స్త్రీ కుటుంబ చరిత్ర కూడా ముఖ్యమే. కుటుంబంలో ఎవరికైనా బి.పి. (రక్తపోటు) కానీ, డయాబెటిస్‌ (చక్కెర వ్యాధి) కానీ ఉన్నాయా, ఎవరికైనా కవల పిల్లలు కలిగారా అన్న విషయాలు తెలుసుకోవాలి. ఆమె కుటుంబంలో కానీ, భర్త కుటుంబంలో కానీ ఎవరికైనా కవల పిల్లలు పుట్టినట్లయితే కవల పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో పిల్లలు పుట్టడానికి మందులు తీసుకున్న సందర్భంలో కవల పిల్లలు పుట్టడం జరుగుతోంది.

పరీక్ష చేసిన ప్రతిసారీ బి.పి. చూడడం కూడా అవసరమే. గర్భధారణ కాలంలో బి.పి. పెరిగినట్లయితే ఒక్కొక్కపుడు కొన్ని మందులు ఇవ్వటం జరుగుతుంది. కానీ చివరి మూడు నెలల్లో పెరిగితే జాగ్రత్తగా ఉండటం అవసరం.

రక్తంలో 80-120 మి.గ్రా. మించి చక్కెర ఉన్నట్లయితే దాన్ని డయాబెటిస్‌ (చక్కెర వ్యాధి) అంటారు. గర్భధారణ సమయంలో ఇలాంటి వ్యాధులు అకస్మాత్తుగా రావచ్చు. (తల్లిదండ్రుల్లో ఎవరికైనా డయాబెటిస్‌ ఉన్నట్లయితే) గర్భధారణ సమయంలో శరీరం చాలా వత్తిడికి లోనవుతుంది. శరీరంలో చాలా పెద్ద మార్పులు వస్తాయి. అందువల్ల రక్తంలో చక్కెరపాలు మామూలుకన్నా ఎక్కువ కావచ్చు. ప్రసవం తర్వాత చాలావరకు మళ్ళీ మామూలు పరిస్థితి వస్తుంది.

రక్తంలో చక్కెర కనిపిస్తే, మొట్టమొదట వెంటనే చేయాల్సిన పని ఆహారంలో మార్పుతో చక్కెర స్థాయి తక్కువ అయ్యేలా చూడడం. ఏం చేయాలంటే – చక్కెర మానివేయాలి. పిండి పదార్థాలు (అన్నం, గోధుమలు లాంటి ఆహార ధాన్యాల్ని) తక్కువగా తీసుకోవాలి. నిమ్మ, నారింజ జాతికి చెందిన పళ్ళు తప్ప మిగతా పళ్ళు తినకూడదు. కారెట్‌, బీట్‌రూట్‌, ఆలుగడ్డ లాంటి దుంపలు మానివేయాలి. ఈ విధంగా ఆహార నియమాలు పాటిస్తే గర్భం, ప్రసవం అన్నీ సవ్యంగా జరగవచ్చు. రోజుకు మూడుసార్లు భోజనం చెయ్యటంకన్నా, ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం మంచిది.

డయాబెటిస్‌ వల్ల వచ్చే మొట్టమొదటి సమస్య గర్భధారణ కాకపోవచ్చు. గర్భధారణ జరిగాక పెరుగుతున్న పిండానికి రక్తంలో చక్కెర స్థాయి తట్టుకోలేక ఏదైనా అవకరం కలగవచ్చు. ప్రసవ సమయంలో బిడ్డ బయటకు రావడం కష్టమై ఆపరేషన్‌ చేయాల్సి రావచ్చు. రక్తంలో చక్కెరస్థాయి ఎక్కువ అవడంవల్ల (డయాబెటిస్‌ వల్ల) గర్భంలో బిడ్డ చనిపోవచ్చు కూడా.

రక్త పరీక్ష (బ్లడ్‌ గ్రూపింగ్‌)లో ఆర్‌.హెచ్‌. పరీక్ష ఒక భాగం. ఈ ఆర్‌.హెచ్‌. అనేది ఒక రకమైన పదార్థం. ఇది రక్తంలో ఎర్రకణాల్లో ఉంటుంది. ఈ పదార్థం ఉంటే, ఆ స్త్రీ రక్తం ఆర్‌.హెచ్‌. పాజిటివ్‌ అంటారు. ఈ పదార్థం లేకపోతే ఆ రక్తం ఆర్‌.హెచ్‌. నెగటివ్‌ అంటారు. నూటికి 85 మందికి ఆర్‌.హెచ్‌. పాజిటివ్‌ రక్తం ఉంటుంద. 15 మందికి మాత్రం ఆర్‌.హెచ్‌. నెగటివ్‌ రక్తం ఉంటుంది.

అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి వస్తే అదే గ్రూప్‌ రక్తం ఇవ్వాలి. తల్లి ఆర్‌.హెచ్‌. నెగటివ్‌ రక్తం కలదై, గర్భంలో శిశువు ఆర్‌.హెచ్‌. పాజిటివ్‌ అయితే, బిడ్డ రక్తం తల్లి రక్తంలో కలుస్తుంది. మొదటి గర్భంకన్నా, తర్వాత వచ్చే గర్భాల్లో ఇలా అయ్యే ప్రమాదం ఎక్కువ. ఏ కారణం చేతనైనా గర్భసంచీకి, ప్లాసెంటాకి మధ్య రక్తస్రావం జరిగితే తొలి చూలులో కూడా బిడ్డ రక్తం తల్లి రక్తంలో కలిసే ప్రమాదం జరగొచ్చు. ఇలా జరిగినప్పుడు, తల్లి రక్తంలో యాంటీజెన్‌లు అనే పదార్థాలు తయారై, అవి శిశువు రక్తంలో ప్రవేశించి, శిశువు రక్తంలో ఎర్రరక్త కణాల్ని నాశనం చేస్తాయి. ఇంకా పుట్టనైనా పుట్టని శిశువుకి రక్తహీనత ఏర్పడుతుంది. ఇప్పుడిప్పుడు ఇంకా సమస్యలు ఏర్పడకుండా ఉండేందుకు యాంటీ-డి అనే ఇంజక్షన్‌ను ప్రసవించిన 72 గంటల్లో తల్లికి ఇస్తున్నారు. ఈ ఇంజక్షన్‌ వల్ల తల్లి శరీరంలో యాంటీజెన్‌లు తయారు కాకండా ఆగిపోతాయి. అందువల్ల తర్వాత వచ్చే గర్భాల్లో ఎలాంటి ప్రమాదమూ జరగకుండా అవుతుంది.

రక్తపరీక్షలో గమనించే మరో విషయం రక్తహీనత. రక్తంలో ఎర్రరక్తకణాల ద్వారా శరీరానికి ప్రాణవాయువు లభిస్తుంది. మనం ఏ పని చేయాలన్నా, ఏ పనీ లేకుండా కూర్చున్నా కూడా ప్రాణ వాయువు చాలా అవసరం. రక్తహీనత వల్ల తల్లి చాలా బలహీనురాలైపోతుంది. గర్బంలోని శిశువుకు తగినంత ప్రాణవాయువు లభ్యం కాక పెరుగుదల తగ్గిపోతుంది. అందువల్ల తల్లికి రక్తహీనత కలిగితే పుట్టే బిడ్డ బలహీనంగానూ, చాలా చిన్నగానూ ఉంటుంది. మన దేశంలో గర్భిణీ స్త్రీలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతుంటారు. అందుకే సాధారణంగా అందరికీ ఐరన్‌ మాత్రల అవసరం ఉంటుంది. సాధ్యమైనంత వరకు హిమోగ్లోబిన్‌ శాతం 11 కంటే ఎక్కువ ఉండేలా చూసుకోవడం మంచిది. మూత్రంలో ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ ఉందేమో తెలుసుకోవడానికి మూత్ర పరీక్ష చేస్తారు. గర్భం మొదటి మూడు నెలల్లో గర్భసంచీ మూత్ర సంచీ మీద ఒత్తుకుంటుంది. అప్పుడు మూత్రంలో ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశముంటుంది. అప్పుడు మూత్రం పోస్తుంటే భరించరాని మంట, బాధ కలుగవచ్చు. ఎక్కువసార్లు మూత్రానికెళ్ళే అవసరం రావచ్చు. దీంతో అలసట కలుగుతుంది. మూత్ర పరీక్షలో ఇన్ఫెక్షన్‌ కనిపిస్తే, (అంటే రిపోర్టులో 15-20కి మించి చీముకణాలుంటే (పస్‌ సెల్స్‌) ఇన్‌ఫెక్షన్‌ ఉందని అర్థం) మూత్రం పోసేటపుడు కలిగే బాధ ఇందువల్లేనని నిర్థారించవచ్చు. యాంటీ బయాటిక్‌ మందులు ఇన్ఫెక్షన్‌ని పోగొడతాయి. రోజుకు 8 నుంచి 10 పెద్ద గ్లాసులు నీళ్ళు తాగుతూ ఉంటే మూత్ర సంచీ శుభ్రమై బాధ తగ్గుతుంది. ఇన్ఫెక్షన్‌ లేకపోయినా, నీరు ఎక్కువగా తీసుకుంటే మంచిది.

అల్ట్రాసౌండ్‌ పరీక్ష: గత 25 ఏళ్ళుగా దీని వాడుక ఎక్కువయింది. దీనివల్ల (మనకు తెలిసినంతవరకూ) ఏమీ దుష్ఫలితాలు కలగవు. 5 వారాల గర్భం నుంచీ (నెలతప్పిన తర్వాత వారం నుంచి) పిండంను చూడవచ్చు. తల్లికి ఎక్కువ గర్భస్రావాలు జరిగి వుంటే, సమస్యలు ఏర్పడితే సరిచేయడం ఈ పరీక్ష వల్ల తేలిక అవుతుంది. వైద్యులు ఈ పరీక్షను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

మొదటి మూడు నెలల్లోనూ, బిడ్డ సంచిని గమనించడానికి అల్ట్రాసౌండ్‌ పరీక్ష ఉపయోగపడుతుంది. నెల తప్పిన రెండు వారాల తర్వాత పిండం గుండె కూడా చూడవచ్చు. గర్భధారణ సరిగ్గా జరిగిందా, పిండం సరైన పరిస్థితిలో ఉందా లేదా మాయ సరిగ్గా ఉందా అనే విషయాలన్నీ ఈ పరీక్షలో తెలుస్తాయి. అండవాహికలో గర్భధారణ జరిగే సందర్భాలు కూడా ఉంటాయి. అది చాలా ప్రమాదకరం. ఈ ప్రమాదాల్ని గుర్తించే అవకాశం ఈ పరీక్ష కలిగిస్తుంది. కొన్నిసార్లు సరిగ్గా నిర్థారణ జరగకపోతే వారం తర్వాత మళ్ళీ పరీక్ష చేయాల్సుంటుంది.

ఈ రకరకాల పరీక్షలు చేస్తున్నప్పుడు తమ అనుమానాలను, భయాలను వెలిబుచ్చడానికి ఆడవాళ్ళు వెనకాడతారు. తమవల్ల అందరికీ ఇబ్బంది కలుగుతోందని సంకోచపడతారు. గర్భం రావడమంటేనే చాలా గొప్ప విషయం అనుకునే సమాజంలో మన భావాల్ని వ్యక్తం చేయడం మరింత సమస్య అవుతుంది. కానీ మనలో చాలా మందికి సంతోషం కాదుకదా సందేహాలే ఎక్కువవుతాయి. మనలో ఏదన్నా లోపం ఉందేమో అనుకునే ప్రమాదం లేకపోలేదు. కొందరికి అనుకోకుండా గర్భం రావచ్చు. (ముఖ్యంగా తొలిచూలులో) అందుకే ఇప్పటికీ సమయం మించిపోలేదు కాబట్టి, గర్భం వద్దనుకున్నా నిర్ణయించుకోవడానికి ఇంకా అవకాశం ఉంది కాబట్టి నిర్ణయం తీసుకోవచ్చు. మన మగవాళ్ళతో, కుటుంబంతో, మన ఆలోచనలతో మనం సతమతమవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టే టైం తీసుకుని నిర్ణయించుకోవాలి. కానీ ఎంత టైం తీసుకున్నా నెల తప్పిన నాలుగు వారాలలోపు నిర్ణయించుకుని గర్భస్రావానికి సిద్ధం కావాలి.

గర్భధారణ సమయంలో వాంతులు, వికారం చాలా కొద్దిగా ఉండొచ్చు. పొద్దుటి పూట ఉన్నా రోజు గడిచిన కొద్దీ తగ్గిపోవచ్చు. కొందరికి ఇవి విపరీతంగా ఉండి, రోజంతా బాధపెడతాయి. ఏది తిన్నా వాంతి అవుతూ ఉంటుంది. దీన్ని వేవిళ్ళు అంటారు. వేవిళ్ళు గర్భం వచ్చినప్పుడు సామాన్యంగా ఉండేవే కనుక సాధారణంగా ఎవరూ దీని గురించి డాక్టర్‌ దగ్గరికి వెళ్ళరు. పూర్వపు రోజుల్లో వేవిళ్ళు గర్భం వచ్చిందనడానికి గుర్తుగా భావించేవారు. అందువల్ల వేవిళ్ళు రావడం మనకి బాధాకరంగా ఉంటే అందరికీ సంతోషం కలిగించడం విచిత్రంగా ఉంటుంది.

వేవిళ్ళ బాధ ఎక్కువైతే తగ్గించడానికి మందులు ఉన్నాయి. వాంతులు విపరీతంగా అవుతూ, కడుపులో ఏమీ ఇమడకుండా

ఉంటే గర్భిణీ స్త్రీ నీరసించి పోతుంది. అప్పుడు ఐ.వి. ద్వారా ఆమె శరీరంలోకి ద్రవపదార్థాలు ఎక్కించాలి. ఇలా ఒకటి రెండు రోజులు ఇచ్చిన తర్వాత, వికారం తగ్గాక, కొద్దిగా ఆహారం తీసుకోవడం మొదలుపెట్టి, రోజు రోజు క్రమంగా ఆహారం ఎక్కువ చేయాలి. మొదటి మూడు నెలల్లో తినాలనిపించిన ఆహారం తినడంలో తప్పులేదు.

గర్భం మొదటి రోజుల్లో వచ్చే మరో సమస్య కొద్దికొద్దిగా రక్తస్రావం అవటం. అధిక రక్తస్రావం కూడా కావచ్చు. ఇది గర్భస్రావానికి గుర్తుగా భావించి భయపడిపోయే అవకాశం ఉంది. అల్ట్రాసౌండ్‌ పరీక్షలో శిశువు గుండె సరిగ్గా ఉన్నట్లు తెలిస్తే, ఎక్కడా రక్తం గూడు కట్టుకున్నట్లు కనపడకపోతే, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుంటే చాలు. కొందరు డాక్టర్లు ప్రొజెస్టరాన్‌ అనే హార్మోన్‌ ఇంజక్షన్‌ను వారం వారం తీసుకోమంటారు. ఈ హార్మోన్‌ వాడకం మంచిది కాదని కొందరి వాదన. కానీ ఇప్పుడున్న పరిజ్ఞానంలో గర్భస్రావం ఆపేందుకు ఇంతకన్నా మార్గం లేదు. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెప్తే, అది ఎంత కష్టమో ఇల్లు నిర్వహించే గృహిణికే తెలుస్తుంది. కానీ విశ్రాంతి అంటే కొన్ని పనులు చేయడం మానేయడమే. పెద్ద పెద్ద బరువులు ఎత్తడం మానేయాలి. విందుల్లో వడ్డించడం, అతిధుల్ని చూసుకోవడం, పెద్ద పెద్ద ప్రయాణాలు చెయ్యడం, సంభోగం – ఇవన్నీ మానేయాలి. వీటివల్ల గర్భస్రావం అయ్యే పరిస్థితులు ఎక్కువవుతాయి.

రక్తస్రావం ఎక్కువగా ఉండి, పరీక్ష చేసినప్పుడు పిండం సర్వైకల్‌ వాహికలో ఉన్నట్లు, సర్విక్స్‌ తెరుచుకుని ఉన్నట్లు కనిపిస్తే డి అండ్‌ సి చేసి పిండాన్ని తీసివేస్తారు.

మొదటి మూడు నెలల్లో ఎటువంటి మందులూ వాడకపోతే మంచిది. ఐరన్‌, కాల్షియం, విటమిన్‌లు, టానిక్కులు అవసరం లేదు. ఏదైనా సమస్య ఉండి దానికి చికిత్స అవసరమైతే తప్ప, మందులతో పనిలేదు. వాంతులు, వికారం ఎక్కువైతే మందులు తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. మొదటి మూడు నెలల్లో బిడ్డ శరీరాంగాలన్నీ రూపు దిద్దుకుంటాయి. ఇప్పటివరకూ శాస్త్రజ్ఞులెవరూ పెరిగే పిండం మీద మందులు ఏ విధంగా పనిచేస్తాయనే సంగతి చెప్పలేదు.

మామూలు ఆహారంతోపాటు రెండు గ్లాసుల పాలు రోజూ తీసుకోగలిగితే మంచిది. రోజూ తినే అన్నంకన్నా ఒక కప్పు ఎక్కువ కానీ ఒక చపాతీ కానీ తీసుకుంటే చాలు. మన దేశంలో స్త్రీలు ఎక్కువ పోషకాహార లోపం వల్ల బాధపడుతూ ఉంటారు. వీరు మామూలు కంటే ఎక్కువ కాలరీలు గల ఆహారం తీసుకోవాలి. లేకపోతే బిడ్డ బరువు తక్కువగా పుట్టవచ్చు. అలాంటి బిడ్డలు బలహీనంగా ఉండి త్వరగా జబ్బు పడతారు. ఒక్కసారే తినడం కష్టమైతే కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తినడానికి సిగ్గుపడకూడదు.

మనలో స్త్రీకి గర్భం రావడం ఒక ముఖ్య విషయం. సమాజం మొదటిసారి గర్భంతో ఉన్న స్త్రీలపై చూపించే శ్రద్ధ అపారం. స్త్రీలని ఈ సమయంలో ప్రత్యేకంగా చూస్తారందరూ. అందుకని సరైన ఆహారం తీసుకోవడానికి వీలవుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకుని పోషకాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డకు కూడా మంచి జరుగుతుంది. గర్భధారణ కాలం సవ్యంగా జరుగుతుంది.

(జనవరి-మార్చి 1994 భూమిక నుంచి…)

Share
This entry was posted in స్త్రీల ఆరోగ్యం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో