ఆదర్శాల ఐఎఎస్‌ అధికారి అనుపమ – కె. సత్యవతి

వస్తు వినిమయ సంస్కృతి వెర్రితలలు వేసి యువత బుర్రల్ని చెడగొట్టి, ఫక్తు మెటీరియలిస్ట్‌లుగా, ఎలాంటి ఆశయాలు, ఆదర్శాలు లేని మొనాటనస్‌ వ్యక్తులుగా రూపొందిస్తున్న ప్రస్తుత రోజుల్లో ఒక యువ ఐఏఎస్‌ అధికారి సాహసం, ధీరత్వం, ప్రజానుకూల ధోరణి గురించి తప్పకుండా చెప్పుకోవాల్సి ఉంది. కరెన్సీ కట్టల చుట్టూ పరిభ్రమిస్తూ, ఆ కరెన్సీ కట్టల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ, సమస్త వస్తువుల్ని కల్తీ మయం చేస్తున్న అక్రమ వ్యాపారుల ఆటకట్టించిన టి.వి. అనుపమ గురించి ఈ నెల ఆదర్శంలో తెలుసుకుందాం!

టి.వి. అనుపమ కేరళ ప్రభుత్వంలో పనిచేస్తోంది. 2010 ఐ.ఏ.ఎస్‌ బ్యాచ్‌కి చెందిన అనుపమ ప్రస్తుతం ఫుడ్‌ సెక్యూరిటీ కమీషనర్‌గా పనిచేస్తోంది. కేరళలో ఆమె పేరు వింటేనే అక్రమ, కల్తీ వ్యాపారుల వెన్నులోంచి ఒణుకు పుట్టుకొస్తోంది. ఎలాంటి ఒత్తిళ్ళను ఖాతరు చేయకుండా, రాజకీయ నాయకుల జోక్యాన్ని ధిక్కరిస్తూ పలు ప్రాంతాల్లో వ్యాపార సంస్థలపై దాడులు చేస్తూ అక్రమ వ్యాపారుల గుండెల్లో  రైఫిళ్ళు పేలుస్తోంది. 15 నెలల స్వల్పకాలంలో ఆరువేల కల్తీ ఆహార శాంపిళ్ళను సేకరించి కోర్టులో దాఖలు చేసింది. కల్తీకి పాల్పడిన 700 మందిమీద కేసులు వేయించింది. ఆమె కఠిన వైఖరికి జడిసి కల్తీ వ్యాపారులు తమ కల్తీ వ్యాపారాలను బంద్‌ చేసుకోవాల్సి వచ్చింది. ఎవ్వరినీ లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ఆమె చేసిన దాడులు దేశవ్యాప్తంగా ఆమె పేరు మారుమోగేలా చేశాయి. దేశంలో అత్యంత సమర్థవంతమైన, కఠిన వైఖరితో, ఎక్కడా రాజీపడకుండా పనిచేసే ఐ.ఏ.ఎస్‌ అధికారిగా పేరుపడ్డారు అనుపమ.

అనుపమ నిర్వహించిన అసంఖ్యాక దాడుల్లో దొరికిన కల్తీ ఆహార పదార్థాలన్నింటిలోను మోతాదుకు మించిన క్రిమి సంహారకాలు (300%) మిళితమై ఉన్నట్లు రుజువైంది. ఇంత ఎక్కువ స్థాయిలో కల్తీ చేసిన క్రిమిసంహారకాల వల్ల ప్రజారోగ్యం కుంటుపడడం ఖాయం. వీటన్నింటినీ పకడ్బందీగా అరికట్టి, దాడులు చేసి, కేసులు పెట్టి శిక్షలు పడేలా చేయడం ద్వారా అనుపమ కేరళ ప్రభుత్వంలోనే గుడ్‌ గవర్నెన్స్‌కు శ్రీకారం చుట్టింది. ప్రజల నుంచి అనూహ్య స్పందనతో పాటు ప్రభుత్వ వ్యవస్థల పట్ల వారిలో నమ్మకం పెరగడం విశేషం.

ప్రజలు తనకిస్తున్న ఆదరణని, సమ్మతిని ఆసరాగా తీసుకుని అనుపమ కొత్త కార్యక్రమానికి తెరతీసింది. మార్కెట్‌లో లభ్యమవుతున్న కల్తీ, రసాయన మిళిత కూరగాయలు, పండ్లకు ప్రత్యామ్నాయంగా తమ పెరళ్ళలో సాధ్యమైనంత వరకు తామే తమకవసరమైనవి పండించుకోవాలని పిలుపునిచ్చి, విపరీతంగా ప్రచారంలో పెట్టింది. ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కేరళ ప్రభుత్వం కూడా దీనికి సముచిత ప్రచారం కల్పించడంతో ప్రజలు ముందుకొచ్చి తమ పెరళ్ళను పచ్చదనంతో అలంకరించుకుంటూ కూరగాయల పెంపకం మొదలుపెట్టారు. అప్పటికే కేరళ అంతా రూఫ్‌ గార్డెనింగ్‌ చాలా ప్రాచుర్యంలో ఉంది. కేరళలో విడుదలైన ఒక సినిమా రూఫ్‌ గార్డెన్‌లను పెద్ద స్థాయిలో ప్రచారం చేయడంవల్ల ఎంతోమంది గృహిణులు రూఫ్‌ గార్డెనింగ్‌లో నిష్ణాతులై తమ తమ ఇళ్ళపైన మిద్దెల మీద పూలు, పండ్ల వనాలను పెంచుతున్నారు.

అనుపమ ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ కూరగాయలను తామే పండించుకోవడం వల్ల ఆదాయం, ఆరోగ్యం పొందడంతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుండి దిగుమతయ్యే 70 శాతం కూరగాయల దిగుమతి ఆగిపోయేలా చేశారు. అంటే పొరుగు రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన 70 శాతం కూరగాయలను కేరళ ప్రజలే తమ తమ ఇళ్ళల్లో పండిస్తున్నారు. అనుపమ కృషి ఏ స్థాయిలో ఉందో దీన్నిబట్టే మనం అర్థం చేసుకోవాలి.

ప్రజల రక్షణ కోసం, ప్రజలకు సేవ చేయడం కోసమే నియమితమయ్యే ప్రభుత్వాధికారులు ఎ.సి.గదుల్లో ఉంటూ, ఎ.సి. కార్లలో తిరుగుతూ ప్రజలకు అందుబాటులో లేకుండా అధికారిక దర్పం, మందీ మార్బలంతో ఊరేగే దేశంలో అనుపమలాంటి నిబద్ధత కలిగి, ప్రజలను ప్రేమించే అధికారులు రాష్ట్రానికి ఒక్కరున్నా చాలు. ప్రజలు వారిని గుదిబండల్లా కాకుండా గుండెల్లో పెట్టుకుని ప్రేమిస్తారు. ప్రజల నాడిని పట్టుకున్న ఆదర్శాల అనుపమకు జేజేలు చెప్పాల్సిందే.

Share
This entry was posted in ఆదర్శం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో