నవీన మహిళా అవార్డులు 2016-17 విజేతలు -నవీన బృందం

1. నెల్లూరు వెటరన్‌ అథ్లెట్లు

కేటగరీ: స్ఫూర్తి ప్రదాతలు

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఈ మహిళలు సాధారణ మహిళలు ఎంత మాత్రం కాదు. వెటరన్‌ మాస్టర్స్‌ అథ్లెట్‌ అసోసియేషన్‌ సభ్యులు. వయసుని వెనక్కి నెట్టి పేదరికాన్ని జయించారు. సాధారణ మహిళల్లాగా వృత్తి బాధ్యతలు నిర్వహిస్తూనే జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పతకాల పంట పండిస్తున్నారు. సత్తా ఉంటే క్రీడల్లో దూసుకెళ్ళొచ్చని నిరూపించారు కోటేశ్వరమ్మ, లావణ్య, వేలూరు రాజమ్మ, రాజేశ్వరి, జష్ట్ర.వెంకటరత్నమ్మ. ఏ ఆట అయినా సరే! అన్నింటికీ సై అంటున్నారీ నారీమణులు. ఉదయమే లేచి క్రీడా మైదానంలోకి అడుగుపెడతారు. అందరూ కలసికట్టుగా ఓ రెండు గంటలు కఠోర సాధన చేస్తారు. ఆర్థికంగా కొంతవరకు ఇబ్బంది పడుతున్నా రాష్ట్రాలను దాటి, దేశాన్ని సైతం దాటి పతకాలను తెస్తున్న ఘనత వీరిది.

టైలర్‌గా పనిచేస్తున్న ఈమె పేరు కోటేశ్వరమ్మ. వయసు 50 పైమాటే. 5 వేలు, 10 వేల మీటర్ల పరుగులో ఇప్పటివరకు 55 బంగారు పతకాలు సాధించింది. ప్రయాణ ఖర్చులకి 800 రూపాయలు లేక పోటీనుంచి వైదొలగాల్సిన పరిస్థితి నుండి ఈ రోజు దాతల సహకారంతో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది.

43 ఏళ్ళ లావణ్య టీచర్‌గా పనిచేస్తోంది. ఆరు సంవత్సరాల క్రితం క్రీడా మైదానంలోకి అడుగుపెట్టింది. లాంగ్‌ జంప్‌, ట్రిపుల్‌ జంప్‌, హర్డిల్స్‌, స్విమ్మింగ్‌లలో ఎక్స్‌పర్ట్‌గా ఎన్నో పతకాలు సాధించింది.

కూరగాయ బడ్డీ కొట్టు నడుపుతున్న ఈమె పేరు వేలూరు రాజమ్మ. వయసు 55 ఏళ్ళు. కానీ

ఉత్సాహంలో మాత్రం ఈమెకి ఎవరూ పోటీ రాలేదు. షార్ట్‌పుట్‌, డిస్‌కస్‌ త్రో, జావలిన్‌ త్రోలలో ఈమె నిష్ణాతురాలు. జాతీయ స్థాయిలో దాదాపు పది బంగారు పతకాలు సాధించింది రాజమ్మ.

40 ఏళ్ళ ఈమె పేరు రాజేశ్వరి. నిరుపేద కుటుంబంలో పుట్టినా, చిన్న చిల్లర కొట్టు నడిపిస్తున్నా, పరుగులో మాత్రం ఈమె చిరుత. ఎవరినైనా ఇట్టే ఓడించేస్తుంది. ఇంట్లో ఎవరు ఎంత ఒద్దన్నా సరే తన స్వంత ఖర్చులతో ఈ పోటీలో పాల్గొంది. ఇప్పటికి దాదాపు 50 బంగారు పతకాలు, పది వెండి పతకాలు, పది కాంస్య పతకాలు సాధించింది.

ఇక ఈవిడ అందరికంటే సీనియర్‌. సి.హెచ్‌. వెంకటరత్నమ్మకి పెద్దగా చదువు లేదు. వయసు 75 ఏళ్ళ పైమాటే. షార్ట్‌పుట్‌, డిస్‌కస్‌ త్రోలో తన సత్తా చాటింది. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సొంతం చేసుకుంది. పైగా 60 ఏళ్ళ వయసు తర్వాతే ఈ ఆటల్లోకి దిగి తన సత్తా చాటిన ప్రతిభాశాలి. క్రీడా స్ఫూర్తికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్న ఈ మహిళలంతా మనకి స్ఫూర్తి దాయకం. నవీన మహిళా కాంటెస్టులో స్ఫూర్తి ప్రదాత విభాగంలో అవార్డు అందుకున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన ఈ వెటరన్‌ అథ్లెట్స్‌.

2. పేరు: జాఫ్రీన్‌

కేటగరీ: ప్రత్యేక సామర్ధ్యం

ఈ అమ్మాయి పేరు జాఫ్రిన్‌. కర్నూలులోని కాలేజీలో బిఎ రెండో సంవత్సరం చదువుతోంది. పుట్టుకతో మూగ, బధిరత్వంతో బాధపడుతున్న కర్నూలు క్రీడాకారిణి జాఫ్రిన్‌ పెదాలతో కాదు… పతకాలతో మాట్లాడే టెన్నిస్‌ తార. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన తండ్రి టెన్నిస్‌ ఖరీదైన వ్యవహారం కావడంతో జాఫ్రిన్‌ చేతినుంచి రాకెట్‌ లాక్కుని ఆట ఆడొద్దని హుకుం జారీ చేశాడు. మూడు రోజులపాటు పస్తులుండి మరీ తండ్రిని ఒప్పించింది జాఫ్రిన్‌. అక్కడ్నుంచి మొదలైన ఆమె ప్రస్థానం ఆగలేదు. పదో క్లాసులో 99 శాతం ఉత్తీర్ణత సాధించి కలెక్టర్‌ చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం, 20 వేల నగదు

అందుకుంది. అండర్‌ 12, అండర్‌ 18 విభాగాలలో పతకాలు సొంతం చేసుకుంది. రాష్ట్రస్థాయి దాటి జాతీయ స్థాయికి దూసుకెళ్ళింది. ప్రొఫెషనల్‌ ట్రెయినింగ్‌ ఇస్తే మరిన్ని అద్భుతాలు సాధించగలదు జాఫ్రిన్‌. అయితే ఆ ట్రెయినింగ్‌కు ఎంతో ఖర్చవుతుంది. జాఫ్రిన్‌కు సంబంధించిన చిన్న వార్త చూసిన సానియా మీర్జా స్పందించింది. హైదరాబాద్‌లోని తన టెన్నిస్‌ కోచింగ్‌ అకాడమీలో మూడేళ్ళుగా జాఫ్రిన్‌కి ఉచిత శిక్షణనిస్తోంది. జాఫ్రిన్‌ స్వాలియన్‌ డెఫ్‌ టెన్నిస్‌ ఓపెన్‌ 2016లో స్త్రీల డబుల్స్‌లో స్వర్ణపతకం సాధించింది. 2015లో తైవాన్‌లో జరిగిన 8వ ఆసియా పసిఫిక్‌ బధిరుల ఆటల పోటీలలో రజత పతకం సొంతం చేసుకుంది. 2017 జూలైలో అంకారాలో జరగబోయే బధిరుల ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించాలన్న లక్ష్యం ఇప్పుడు జాఫ్రిన్‌ ముందుంది. ఒలింపిక్స్‌లో విజయ సాధనకు ప్రస్తుతం చైనాలో క్రోయేషియన్‌ కోచ్‌ దగ్గర కఠిన శిక్షణ తీసుకుంటోంది. వైకల్యం వైఫల్యం కారాదు అనే నినాదానికి నిజమైన ఆదర్శంగా నిలుస్తున్న జాఫ్రిన్‌ నవీన మహిళా కాంటెస్ట్‌లో ప్రత్యేక సామర్ధ్యం విభాగంలో అవార్డు అందుకుంది.

3. పేరు: దివ్య

కేటగరీ: యువ విజేత

ఈ అమ్మాయి దివ్య చెన్నమనేని. ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ వాస్తవ్యురాలు. హైదరాబాద్‌ జెఎన్‌టీయూలో ఎం.టెక్‌ ఫస్టియర్‌ చదువుతోంది. రోడ్లు, బస్సులు, రైళ్ళు ఏవీ మహిళకు సురక్షిత ప్రయాణ భరోసా అందించటం లేదు. ఆకతాయిల వేధింపులు, ప్రేమ పేరుతో దాడులు, అకృత్యాలు ఆమెను కదిలించాయి. వాటికి చెక్‌ పెట్టాలని సంకల్పించింది. ‘కెమెరా రక్ష’ అనే యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ హ్యాకథాన్‌ పోటీలో ఆరువేల మంది ఐఐటియన్లు, ఉద్యోగస్తులతో పోటీపడి, టాప్‌ 21 స్థానంలో నిలిచింది. ఈ యాప్‌ ప్రత్యేకతలు చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ఎన్నెన్నో… ఆకతాయిలు ఎక్కడ గొడవ చేస్తున్నా, లేదా మనమే ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నా, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా… ఎవరికీ తెలియకుండా వీడియో తీసి, పోలీసులకు పంపుతుంది ఈ యాప్‌. ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో పనిచేసే ఈ యాప్‌తో వీడియో రికార్డ్‌ చేస్తున్న దృశ్యాలు తెరపై కనిపించవు. తెర మామూలుగానే ఉంటుంది. కానీ దృశ్యాలన్నీ బ్యాక్‌గ్రౌండ్‌లో రికార్డవుతాయి. ఒకరకంగా స్పై కెమెరాలా పనిచేస్తుందన్నమాట.

మన వివరాలు గోప్యంగా ఉంచుతుంది. అంతేకాదు మనం పంపించిన దృశ్యాలను ఎవరూ ఎడిట్‌ కానీ, మార్ఫింగ్‌ కానీ చేసే అవకాశమే ఉండదు. అప్పటికప్పుడు విజువల్స్‌ చేరవేయాలంటే ఇంటర్నెట్‌ ఉండాలి. ఇంటర్నెట్‌ లేకున్నా వీడియోలు పంపించే విధానంపై ప్రస్తుతం దివ్య కసరత్తు చేస్తోంది. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఇంకా యాప్‌ అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వం చేయూతనందిస్తే నలుగురికీ ఉపయోగపడేలా యాప్‌ విడుదలకు సహకరిస్తానంటోంది దివ్య. మహిళా వేధింపులు… సమస్య పాతదే అయినా ఎదుర్కోవడానికి కొత్త టెక్నాలజీతో ముందుకొచ్చిన కొత్త తరం అమ్మాయి దివ్య యువ విజేత కేటగరీలో అవార్డు అందుకుంది.

4. పేరు: బాలదండు

కేటగరీ: సాంఘిక దురాచారానికి వ్యతిరేకం

ఈ ఏడుగురు బాలబాలికలు పెద్ద యజ్ఞమే చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మద్దూరు మండలం, పల్లెర్ల గ్రామంలో బాల్యవివాహాలు ఆపడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. మద్దూరు మండలంలో చాలా గ్రామాలే ఉన్నాయి. వీటిలో బాల్యవివాహాలను అరికట్టడానికి బాలదండు కృషి చేస్తోంది. గత సంవత్సరం జిల్లాలో 120కి పైగా వివాహాలు జరిగాయి. మెట్టెలతో ఆడపిల్లలు జడ్‌.పి.హైస్కూల్‌కి రావడం ఇక్కడ సర్వసాధారణం. అయితే దండుగా కదిలి ఈ బృందం బాల్యవివాహాలు ఆపే ప్రయత్నం చేస్తోంది. పోలీస్‌, రెవిన్యూ, గ్రామ సర్పంచ్‌, అంగన్‌వాడీ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ బృహత్తర యజ్ఞం చేపట్టారు. వీథి నాటకాలు నిర్వహించడం, ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రులకు కౌన్సిలింగ్‌ చేయడం, బాల్యవివాహాల ద్వారా ఎదురయ్యే సమస్యలపై అవగాహన పెంచడం, పెళ్ళి జరుగుతుంటే ఆపటం వంటి కార్యక్రమాలను ఈ బాలదండు చేస్తోంది. బాల్యవివాహ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాల్సిన పెద్దలే వివాహాలను ప్రోత్సహిస్తున్నచోట ఆ బాధ్యతను తమ చిట్టి భుజాలమీద మోస్తున్న ఈ చిన్నారులు సాంఘిక దురాచారానికి వ్యతిరేకం కేటగరీలో నవీన మహిళా అవార్డును గెలుచుకున్నారు.

5: పేరు: శైలజ

కేటగరీ: సాంఘిక దురాచారానికి వ్యతిరేకం

ఈ అమ్మాయి పేరు శైలజ. సంగారెడ్డి జిల్లా ఇస్మేల్‌ఖాన్‌ పేట్‌ గ్రామ పంచాయతీకి చెందిన శైలజ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తల్లి ప్రోత్సాహంతో, చదువంటే అమితాసక్తితో నాలుగు కిలోమీటర్లు నడిచి జడ్‌.పి.హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతోంది. సాధారణంగా నెలసరి సమయంలో జరిగే రుతుస్రావం గురించి మాట్లాడమంటే అందరూ ఛీ కొడతారు. శరీర అవయవాలు, భాగాల గురించి మాట్లాడమంటే బిడియపడతారు. కానీ శైలజ ప్రత్యేకం. మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ మేనేజ్‌మెంట్‌ ఛేంజ్‌మేకర్‌గా ఎంతో ధైర్యంగా నెలసరి సమయంలో ఎదుర్కొనే ఇబ్బందుల గురించి, పరిశుభ్రత గురించి అందరికీ వివరించి చెబుతుంది. SWARD NGO ప్రతినిధులు మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ మేనేజ్‌మెంట్‌పై మాట్లాడుతుంటే ముందు బిడియంతో, అయిష్టంగా వినేది. నాలుగు క్లాసుల శిక్షణ పూర్తయిన తర్వాత శైలజ నలుగురికీ సహాయపడాలని నిర్ణయించుకుంది. 8 నెలల శిక్షణ తర్వాత కోర్‌ టీం గర్ల్‌ అయింది శైలజ. ఇప్పుడామె 15 ఏళ్ళ వయసులో అవగాహనా కార్యక్రమాలు చేపడుతోంది. తోటి అమ్మాయిలకు మెన్‌స్ట్రువల్‌ హైజీన్‌ మేనేజ్‌మెంట్‌ గురించి చెప్తుంది. 387 మంది ఆశా వర్కర్లకు శిక్షణనిచ్చింది. నెలసరి సమయంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల వల్ల ఆడపిల్లలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ఇంటింటికీ తిరిగి వివరించగలుగుతుంది. ఆమె ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు మెచ్చుకున్నారు. నెలసరి పేరుతో స్త్రీలను కట్టడి చేయడం, రుతుస్రావం వంకతో మహిళలకి అపవిత్రత ఆపాదించడం.. ఇవన్నీ సాంఘిక దురాచారాలే. ముట్టు గురించి గుట్టుగా ఉంచొద్దని నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్న శైలజ సాంఘిక దురాచారానికి వ్యతిరేకం విభాగంలో నవీన అవార్డును అందుకుంది.

6. పేరు: రాగులపల్లి లక్ష్మి

కేటగరీ: హక్కుల కోసం పోరాటం

ఈమె రాగులపల్లి లక్ష్మి. సిద్ధిపేట వాస్తవ్యురాలు. 43 ఏళ్ళ ఒంటరి మహిళ. దాదాపు 20 ఏళ్ళుగా మహిళా సాధికారత కోసం, కష్టాల్లో ఉన్న మహిళల హక్కుల కోసం పనిచేస్తోంది. ఏపీ మహిళా సమతా సొసైటీలో పదేళ్ళు పనిచేసిన కాలంలో గ్రామీణ మహిళలను సంఘాలలో సభ్యులుగా చేర్పించడానికి తన వంతు కృషి చేసింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా ఉంటూ తొమ్మిదేళ్ళుగా కేరింగ్‌ సిటిజెన్స్‌ కలెక్టివ్‌ ఎన్జీఓతో కలిసి పనిచేస్తోంది లక్ష్మి. రైతు ఆత్మహత్యల కుటుంబాలలో ఒంటరిగా మిగిలిన మహిళలను ముందుగా గ్రామీణ స్థాయిలో సంఘంలో సభ్యులుగా చేర్పిస్తుంది. ఆ తర్వాత ప్రభుత్వం అందించే నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. దీనికి అవసరమైన 13 డాక్యుమెంట్లను ఎలా సిద్ధం చేయాలో చెప్తుంది. ఒంటరి మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, మానసికంగా వారిలో ధైర్యాన్ని నింపుతుంది. ఆ కుటుంబానికి నష్టపరిహారం వచ్చేదాకా వెన్నంటే ఉంటుంది లక్ష్మి. ఒక దీపం, మరొక దీపాన్ని వెలిగించగలదన్న చందాన ఒంటరి మహిళ అయిన లక్ష్మి మరెందరో ఒంటరి మహిళలకు ధైర్యాన్ని ఇస్తోంది. నిరంతరం ఒంటరి మహిళల హక్కులకోసం కృషి చేస్తోన్న రాగులపల్లి లక్ష్మి హక్కుల కోసం పోరాటం విభాగంలో నవీన మహిళగా అవార్డు అందుకుంది.

7. పేరు: లక్ష్మీదేవమ్మ

కేటగరీ: సాహసం

ఈమె భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం మహదేవపురం కోయ గిరిజన మహిళ. పేరు లక్ష్మీదేవమ్మ. నాట్వాన్‌ సంఘం సభ్యురాలు. గ్రామస్తులను చైతన్యపరచి అభివృద్ధికి బాటలు వేసింది. ఎనిమిదేళ్ళ క్రితం మహదేవపురంలో సాగునీటి సదుపాయం లేక కరవు తాండవమాడేది. వందరోజుల శ్రమదానం పనులకు సైతం ఊళ్ళో ఎవరూ ముందుకొచ్చేవారు కాదు. లక్ష్మీదేవమ్మ మాత్రం చూస్తూ ఊరుకోలేదు. అవకాశాన్ని చేజార్చనివ్వలేదు. ఊరి బాగుకు నడుం కట్టింది. తానే స్వయంగా పలుగు, పార పట్టింది. శ్రమదానంతో వలసలు ఆగుతాయని అందరినీ ఒప్పించింది. ఆమెపై నమ్మకంతో ఊరు ఊరంతా కదిలింది. ఆరు నెలల తర్వాత ఊరి ముఖచిత్రం మారడం మొదలుపెట్టింది. ూూణూ, నాబార్డ్‌, స్వచ్ఛంద సంస్థల శిక్షణతో నీటి సంరక్షణా పద్ధతులను చేపట్టారు. వాటర్‌ షెడ్‌ బృందాలుగా ఏర్పడ్డారు. నాలుగు చెక్‌డ్యాంలు, 45 చెరువులు నిర్మించుకున్నారు. ఒకప్పుడు ఏడు బస్తాల ధాన్యం పండే స్థానంలో ఇప్పుడు 25 బస్తాలు పండిస్తున్నారు. సేంద్రీయ పద్ధతుల్లో కూరగాయలు సాగు చేస్తున్నారు. గ్రామ సర్పంచ్‌గా లక్ష్మీదేవమ్మ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది. రాజకీయ నేతలను ఎదిరించి కాంట్రాక్ట్‌ పనులు ఊళ్ళోవారికే అందేలా చేసింది. 80 లక్షల విలువచేసే పనులను గ్రామానికి అందించింది. ఇప్పుడు గ్రామస్తులు సొంత బ్యాంక్‌ నడుపుతున్నారు. ప్రతినెలా సమావేశమై పనుల్ని సమీక్షించుకుంటూ ముందడుగు వేస్తున్నారు. నాబార్డ్‌, జిల్లా అధికారుల ప్రశంసలు పొందింది లక్ష్మీదేవమ్మ. సంఘటితంగా ఉంటే కరువునే కాదు ఎంతటి కష్టాన్నయినా జయించొచ్చు అన్నది అనుభవం ద్వారా గ్రామస్తులకు అర్థమయ్యేలా చేసింది లక్ష్మీదేవమ్మ. అక్షరజ్ఞానం లేని గిరిజన మహిళ సాధించిన ఈ విజయం అసాధారణం. అందుకే ‘సాహసం’ విభాగంలో నవీన మహిళా అవార్డును అందుకుంది.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో