రాణి ఝాఁశీ లక్ష్మీబాయి భండారు అచ్చమాంబ – సరళీకరణ: పి.ప్రశాంతి

భరత ఖండంలో శౌర్య మహిమ వల్ల ప్రఖ్యాతులైన యువతీ రత్నాలలో ఝాఁశీ లక్ష్మీబాయి అగ్రగణ్యురాలు. ఈమె శౌర్యాగ్ని 1857వ సంవత్సరం వరకు దాగి ఉండి ఆకస్మికంగా ప్రజ్వలించింది. ఈమె రాజ్యం ఉత్తర హిందుస్థాన్‌లోని బుందేల్‌ఖండ్‌ అనే ప్రదేశంలో ఒక భాగం. ఈ రాజ్యం లక్ష్మీబాయి గారి మామగారి అన్న అయిన రఘునాథరావుగారి ప్రతాపానికి మెచ్చి పూర్వం పూనా పేష్వాగారు ఇచ్చారు. ఆయనకు పుత్రులు లేనందున ఆయన తమ్ముడైన శివరాంభావు గారిని అభిషిక్తుడ్ని చేశారు. ఈ శివరాంభావు గారి కాలంలో పూనాపేష్వాల ప్రతాపం అడుగంటడం ప్రారంభమైనందు వలన, రెండవ బాజీరావుగారి రాజకార్య నిపుణత లేకపోవడం వలన ఈయన వారిని అతిక్రమించి స్వతంత్రుడయ్యాడు. కానీ ఇంతలో ఆంగ్లేయ ప్రభుత్వం అంతటా వ్యాపించినందున శివరాంభావుగారు ఆంగ్లేయులతో స్నేహం చేసి అనేక సమయాలలో ఇంగ్లీషు వారికి అనేక విధాలుగా తోడ్పడ్డాడు. శివరాంభావు గారికి కృష్ణారావు, రఘునాధరావు, గంగాధరరావు అనే ముగ్గురు పుత్రులున్నారు. వారిలో పెద్దవాడైన కృష్ణారావు తండ్రి బ్రతికున్న కాలంలోనే మృతి చెందినందున శివరాంభావు గారి అనంతరం ఆయన కుమారుడైన రామచంద్రరావు గారికి రాజ్యాధికారం వచ్చింది. ఈయన పరిపాలన కాలంలో పేష్వాల రాజ్యాధికారమంతా ఆంగ్లేయ ప్రభుత్వం వారి ఆధీనమయినందున ఝాఁశీ సంస్థానాధీశునితో ఆంగ్లేయ ప్రభుత్వం వారికి గొప్ప స్నేహభావం కలిగింది. ఈయన పుత్రహీనుడవటం వలన ఆయన తర్వాత ఆయన పినతండ్రి అయిన రఘునాధరావు, ఆయన అనంతరం ఆయన తమ్ముడైన గంగాధరరావు రాజ్యాన్ని పాలించారు. ఈ గంగాధరరావు కథానాయిక యొక్క భర్త.

మోరోపంతు తాంబే అనే కరాడే బ్రాహ్మణుడు పూనా నగరంలో నివసిస్తుండేవాడు. ఆయనపట్ల రెండో బాజీరావు సోదరుడైన చిమాజీ అప్పాగారికి ఎంతో విశ్వాసం, స్నేహం కలిగి ఉండేవాడు. 1818వ సంవత్సరంలో 8 లక్షల ఫించను తీసుకుని రాజ్యమంతటినీ ఇంగ్లీషువారికి ఇచ్చినట్లు పత్రం వ్రాసిచ్చి రెండవ బాజీరావు బ్రహ్మావర్తనంలో నివసించడానికి వెళ్ళాడు. ఆ సమయంలో ఆయన తమ్ముడైన అప్పాగారు కూడా తమకు దొరికే ఫించనును, సేవకులను తీసుకుని కాశీ క్షేత్రంలో నివసించాలని తలచి దొరతనంవారి అనుమతి పొంది కాశీకి వెళ్ళారు. ఆయన పరివారంలోని వారైనందున మోరోపంతు తాంబే కూడా అక్కడికే వెళ్ళాడు. ఇతనిని శ్రీమంతులైన అప్పాగారికి దివానుగా ఉంచి, అందుకుగాను నెలకు 50 రూపాయలు వేతనంగా ఇస్తుండేవారు. మోరోపంతుగారి భార్య అయిన భాగీరథీబాయి సద్గుణంలోను, సౌశీల్యంలోను మిక్కిలి ప్రఖ్యాతిని పొందింది. భార్య ఇటువంటిదవటం వలననే మోరోపంతుగారికి సంసార యాత్ర చాలా సుఖవంతంగా గడిచింది. ఆ భార్యాభర్తలిద్దరూ పరస్పరం అనురాగం కలవారై కాశీక్షేత్రంలో జీవిస్తున్న కొన్ని దినాలకు భాగీరధీబాయి గర్భం ధరించి 1835వ సంవత్సరం నవంబర్‌ 19వ తేదీన సుఖప్రసవమై స్త్రీ శిశువును కనింది. తాంబేగారి శూర వంశంలో కాశీ క్షేత్రంలో జన్మించిన కన్యారత్నమే లక్ష్మీబాయి. జాతకర్మ నామకరణ మహోత్సవాలు ఎంతో సంతోషంగా జరిపించి మోరో పంతుగారు ఆ చిన్నదాని పేరు ”మనూబాయి” అని పెట్టారు. ఈ బాలిక దినదిన ప్రవర్ధమానమవుతూ తన ముద్దు మాటలతోను, మనోహరమైన స్వరూపం వలన తల్లిదండ్రుల్ని, వారి పరివారాన్ని చాలా ఆనందపరుస్తుండేది. ఇలా ఈ బాలికా రత్నం సకల జనాహ్లాదకరంగా పెరుగుచుండగా ఆమె మూడు, నాలుగేళ్ళది అయ్యేసరికి ఆమె తల్లి అయిన భాగీరధీబాయి చనిపోయింది. ఈ సమయంలోనే అప్పారావుగారు కూడా మృతి చెందటం వలన మోరో పంతుగారు అక్కడినుంచి బ్రహ్మావర్తనంకి పోవటం జరిగింది. అక్కడ బాజీరావు ఈయనని ఎంతో ప్రేమగా కుటుంబ సంరక్షణ చేస్తుండేవాడు.

మనూబాయికి బాల్యంలోనే మాతృవియోగం ఎదురైనందువలన ఆమె తండ్రిగారి పోషణలోనే ఉంటూ, ఎప్పుడూ ఆయనని విడువక పురుషులలోనే తిరుగుతుండేది. తల్లిలేని పిల్ల అవటం వలన, సుస్వరూపి, మధురభాషిణి అవటం వలన శ్రీమంతుల వద్ద ఉండే వారందరూ మనూబాయిని ఎంతో గారాబం చేస్తుండేవారు. పేష్వాగారి దత్తపుత్రులైన నానాసాహెబ్‌, రావుసాహెబ్‌లు ఆ కాలంలో బాలురే కావటంతో ఈ చిన్నది వారితో ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటుండేది. నానాసాహెబ్‌ ఏది నేర్చుకున్నా మనూబాయి అది నేర్చుకుంటూ, వారిద్దరూ అన్నచెల్లెలి వరుసలతో పిలుచుకుంటుండేవారు. చదువు, అశ్వారోహణము (గుర్రపుస్వారీ), ఖడ్గం త్రిప్పటం మొదలైనవన్నీ మనూబాయి నానాసాహెబ్‌గారితోనే నేర్చుకుంది! ఈమె స్వభావం బాల్యంనుండే శౌర్యగుణ ప్రధానంగా ఉండేది. దీనికంతటికీ క్షత్రియ అగ్రగణ్య గుణాలు కలిగిన శూరుల సంసర్గమే కారణం. ఇందువలన, స్త్రీలు స్వభావంతోనే పిరికివారని, వారిని శౌర్యధైర్యములు ఎన్ని విధాలైనా పట్టుపడజాలవని వాదించే విద్వాంసులకు సంశయ నివృత్తి కాగలదు. స్త్రీలకు కూడా పురుషులలాగే బాల్యం నుండి ఎటువంటి సంస్కరణ జరుగుతుందో అటువంటి గుణాలే అబ్బుతాయని తెలుస్తుంది-

ఇలా ఉండగా ఒకరోజు ఆకస్మికంగా ఝాఁశీ సంస్థానంనందలి జ్యోతిష్యుడైన తాత్యాదీక్షితులు బాజీరావును సందర్శించడానికి వచ్చాడు. ఆ దీక్షితులతో సందర్భానుసారంగా మోరోపంతు గారు ఝాఁశీ వైపున మా చిన్నదానికి వరుడు దొరుకుతాడా అని అడిగాడు. అందుకాయన ”ఝాఁశీ సంస్థానాధీశుడైన గంగాధరరావు బాబాసాహెబ్‌ గారికి మొదటి భార్య అయిన రమాబాయి కాలధర్మం చెందింది. కాబట్టి నీ కుమార్తెకి ఆ సంబంధం అడుగు” అని చెప్పాడు. అనంతరం ఈ వివాహం గురించి బాజీరావు గంగాధరరావుకి తెలియచేయగా అతడు సమ్మతించాడు. లగ్నం నిశ్చయమైన తర్వాత కొందరు ఆప్తులతో మోరోపంతుగారు ఝాఁశీకి వెళ్ళారు. అక్కడే 1842వ సంవత్సరంలో మనూబాయి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. వివాహమైనాక దేశాచార ప్రకారం అత్తవారు ఆ చిన్నదానికి ”లక్ష్మీబాయి” అని పేరు పెట్టారు. మామగారైన మోరోపంతు తాంబేగారికి 300 రూపాయల వేతనమిచ్చి గంగాధరరావు గారు తమ ఆస్థానంలో ఒక సర్దారుగా

ఉంచినందున లక్ష్మీబాయి మరల బ్రహ్మావర్తనానికి వెళ్ళటం జరిగింది.

గంగాధరరావుగారి అన్నగారైన రఘునాధరావు గారి పరిపాలనలో రాజ్యం గొప్ప దుస్థితికి వచ్చినందువలన ఆ రాజ్యాధికారం మొత్తంగా దొరతనంవారే స్వాధీనపరచుకుని రాజ్యానికిగల ఋణాలను తీర్చుతుండేవారు. లక్ష్మీబాయి వివాహానంతరం గంగాధరరావు గారి యోగ్యతను తెలుసుకుని బుందేల్‌ఖండ్‌ పొలిటికల్‌ ఏజంట్‌ అయిన కర్నల్‌ స్లీమన్‌ దొరగారు సర్వరాజ్య పాలనని గంగాధరరావు గారికి స్వాధీనం చేసారు.

గంగాధరరావు తన ప్రజలు సుఖంగా ఉండాలని తలచి రాజ్యాన్ని బహునిపుణంగా పాలిస్తుండేవాడు. ఈయన కాలంలో ఋణాలన్నీ తీరి భాండాగారంలో ధనం దినదినాభివృద్ధి పొందుతోంది. ప్రజలు కూడా ఎంతో సుఖంగా ఉంటూ సదా రాజును, రాణిని దీవిస్తుండేవారు.

ఇలా కొన్ని రోజులు సౌఖ్యంతో గడచిన పిదప లక్ష్మీబాయిగారి దుఃఖానికి ప్రారంభం అయింది. ఆమెకొక పుత్రుడు పుట్టి మూడు మాసాలు జీవించి మృతి చెందాడు. గంగాధరరావు మహారాజుగారి మనస్సులో పుత్రశోకం అధికమైనందున ఆయన నానాటికీ క్షీణించి, వైద్యోపచారాలవల్ల మధ్య మధ్య కొంచెం స్వస్థపడుతుండేవాడు. ఇలా కొన్నిదినాలు గడచిన పిదప 1853వ సంవత్సరం అక్టోబర్‌ నెలనుండి అతని శరీరం మరింత క్షీణించసాగింది. అనేకమంది రాజవైద్యులు ఎప్పుడూ దగ్గరే ఉండి ఔషధోపచారాలు చేస్తుండేవారు. కానీ ఎంతమాత్రము గుణం కనబడకపోయింది. వికారచేష్టలనేకం కనపడసాగాయి. అందువలన సంస్థానపు మంత్రియైన నరసింహారాడు, మోరోపంతు తాంబేగారు కలిసి ముందు సంస్థాన వ్యవస్థను గురించి మహారాజుగారితో ముచ్చటించారు. వారి మాటలు విన్న తర్వాత తనకిప్పుడు ఏ రోగము అసాధ్యముగా లేదని, ముందుముందు అసాధ్యమయినట్లతే తమ వంశంలోని ఆనందరావుని తను దత్తపుత్రునిగా చేసి, తర్వాత ఆ చిన్నవాడు స్వరాజ్యభారశక్తుడయ్యేవరకు వాని పేరిట లక్ష్మీదేవియే రాజ్యాన్ని పాలించాలని చెప్పాడు. అంతట వారిద్దరూ ఆ క్షణాన్నే ముహూర్త నిశ్చయం చేసి త్వరలోనే శాస్త్రోక్తంగా దత్తత కార్యక్రమాన్ని జరిపారు. ఆ మహోత్సవానికి ఝాఁశీలోని అనేకమంది ప్రముఖులను పిలిచారు. వారితోపాటే బుందేల్‌ఖండ్‌ పొలిటికల్‌ అసిస్టెంట్‌ ఏజంటైన మేజర్‌ యేలీసు దొరగారిని, సేనాధిపతియైన క్యాప్టన్‌ మార్టిన్‌ దొరగారిని కూడా పిలిచారు. వీరందరి సమక్షంలోనే దత్తత విధానం జరిగి ఆనందరావు పేరు దామోదరరావని పెట్టారు.

ఇలా దత్తవిధానం అయిన తర్వాత గంగాధరరావు గారు దివానుగారితో వినతి పత్రాన్ని హిందూస్థానపు దొరతనం వారికి వ్రాయించి దానిపై తమ సంతకం చేసి దానిని తమ స్వహస్తాలతో పొలిటికల్‌ అసిస్టెంట్‌ గారికి ఇచ్చారు. అందులో పూర్వం ఇంగ్లీషువారు తన తండ్రిగారితో చేసిన కరారు ప్రకారం తమ వంశపారంపర్యంగా రాజ్యం దొరకాలని, తనకు సంతతి లేనందున ఒక దత్తపుత్రుడ్ని స్వీకరించానని, దొరతనమువారు ఆ దత్తవిధానానికి సమ్మతించి వానికి రాజ్యం ఇచ్చి వాడు పెద్దవాడయ్యేవరకు వానిపేర తన పత్నియైన లక్ష్మీబాయి పాలించునట్లు చేయమని వ్రాసారు. విజ్ఞాపన పత్రిక వ్రాసిన రోజునే గంగాధరరావు మరణించాడు. కులాచార ప్రకారం రాజుగారికి ప్రేతవిధులన్నీ జరపబడ్డాయి. తదనంతరం కొన్ని దినాలకు లక్ష్మీబాయి అందరి ఆలోచన మేరకు తన పుత్రునకు రాజ్యం ఇవ్వమని దొరతనం వారికి ఒక విజ్ఞాపన పత్రికను వ్రాసింది. కానీ ఆమె ఉద్దేశ్యము సిద్ధించలేదు.

ఆ విజ్ఞాపన ప్రకారం దొరతనం వారు తమ దత్తతను స్వీకరించి రాజ్యాన్ని ఇస్తారని ఝాఁశీ సంస్థానంలోని అందరూ కొండంత ఆశతో ఉండగా 1855వ సంవత్సరం మార్చి నెల 15వ తేదీన దత్తత విధానాన్ని దొరతనం వారు అంగీకరించక రాజ్యాన్ని వారే స్వాధీనపరచుకున్నారన్న సంగతి తెలిసింది. దీన్తో లక్ష్మీబాయికి పతి వియోగ దు:ఖానికి తోడు రాజ్యవియోగ దుఃఖం ప్రాప్తించింది. దొరతనం వారు ఆ రాజ్యాన్ని తాము స్వాధీనపరచుకుని పశ్చిమోత్తర పరగణా గవర్నరుగారికి అక్కడి రాజ్యాన్ని నడపమని ఆజ్ఞ ఇచ్చారు. వారు రాజ్యాన్ని స్వాధీనపరచుకుని రాజ్యానికి, రాజకుటుంబానికి ఇలా కట్టుబాట్లు చేసారు:

గ్రామమునందున్న రాజభవనం రాణిగారికి ఉండటానికి ఇచ్చి, ఖిల్లా వారు తీసుకున్నారు. రాణిగారికి నిల్వ ఉన్న ధనంలోనుంచి కొంత ఇచ్చి మిగిలిన సంస్థానంలోని నగలు మొదలైన ధనమంతా

దత్తపుత్రునికి మైనారిటీ తీరిన తర్వాత ఇవ్వడానికిగాను తమ వద్దనే దాచారు. రాణిగారు జీవించి

ఉన్నంతకాలం ఐదువేల (5000) రూపాయలు ఆమెకు వేతనంగా ఏర్పాటుచేసి అంతవరకు ఆమెపైన గానీ, ఆమె ఇతర భృత్యవర్గంపైన గాని (సన్నిహితులపైన గాని) తమ చట్టాలుకూడదని వ్రాసి ఇచ్చారు.

అందుకుగాను ముందున్న రాణిగారి సైనికులకు విశ్రాంతి కలుగచేసి వారికి బదులుగా తమ సేనని ఉంచారు.

రాణిగారికి ఐదువేల రూపాయల వేతనం ఇస్తామని దొరతనంవారు వ్రాసారేగాని తన రాజ్యం తనకు దక్కాలన్న గట్టి కోరికగల రాణిగారు ఆ అల్పమైన జీతాన్ని మరణించేవరకు కూడా స్వీకరించలేదు. అంతటితో ఊరుకోక లక్ష్మీబాయి సీమలో అప్పీలు చేయదలచి ఉమేశ్‌ చంద్ర బెనర్జీ అనే వంగదేశీయుడిని, మరొక ఆంగ్లేయ ప్లీడర్ని ఆరు లక్షల రూపాయిలిచ్చి ఇంగ్లండుకి పంపింది. కానీ వారు అక్కడికెళ్ళి ఏమి చేసారనేది, ఎక్కడ ఉన్నారనేది నేటివరకు తెలియదు. వారక్కడ అనేక ఉపాయాలు చేస్తారని వారి ప్రయత్నం వల్ల రాజ్యం మరల ప్రాప్తించునని రాణిగారికి చాలా నమ్మకముండేది.

1855వ సంవత్సరంలో దామోదరరావు గారికి ఉపనయనం చేయదలచి ఆ పిల్లాడి పేర దొరతనం వారు దాచి ఉంచిన ఆరు లక్షల రూపాయల్లో నుండి ఒక లక్ష రూపాయలు ఇవ్వండని రాణిగారు దొరతనం వారిని అడిగారు. అందుకు వారు నీవు దీనికొరకు ఎవరినైన జామీను ఉంచితేగాని ఇవ్వమనగా అదే ప్రకారం వారు కోరినవాని జామీనిచ్చి లక్ష రూపాయలు తీసుకుని, ఆ సంవత్సరం మాఘమాసమందు మహా వైభవంగా కుమారుని ఉపనయనం చేసారు. తన భర్త సొత్తు పుత్రుని ఉపనయనంకు తీసుకొనుటకుగాను పరుల జామీను కావలసి వచ్చినందుకు రాణిగారి మనస్సెంత ఖేదపడి ఉంటుందో చదువరులే ఊహించగలరు.

ఇలా రాణిగారు అత్యంత దుఃఖంతో కాలం గడుపుతుండగా 1857వ సంవత్సరంలో హిందూ పటాలం ఇంగ్లీషు వారిపై తిరగబడిన విప్లవకాలం ప్రాప్తించింది. ఈ యుద్ధం ఇతిహాసపిద్ధమే కనుక ఇతిహాసజ్ఞుకందరకు విదితమే.

పటాలములు తిరగబడిన ఈ వర్తమానం ఝాఁశీలోని హిందూ పటాలాలకు తెలిసి అంతవరకు అణగి ఉన్న ద్వేషాగ్ని ప్రజ్వలించడంతో జూన్‌ నెల 1వ తేదీన వారు కూడా స్వాతంత్య్ర సమరాన్ని ప్రారంభించారు. వారి సేనానాయకుడు వారిని ఆపడానికి ఎంత ప్రయత్నించినా వారు ఆగలేదు. అదిచూసి అతడు గ్రామంలోని ఆంగ్లేయులందరూ అత్యంత భద్రమైన ఖిల్లాలోనికి వెళ్ళమని రహస్యంగా తెలపగా వారా ప్రకారం అక్కడికెళ్ళి కోట ద్వారాలు మూసుకున్నారు. కానీ మరుసటి రోజునే ఆ తిరగబడిన పటాలంల వారు సేనలో మొనగాడ్ని చంపి ఉప్పొంగి ఖిల్లాను చుట్టుముట్టి ఎన్నో ప్రయత్నాలు చేసి అక్కడివారిని బయటకు తీసి వారందరినీ ఒకే క్షణంలో చంపేశారు. వారట్లా ఊర్లో ఒక్క ఆంగ్లేయ శిశువు సహితం లేకుండా చేసి ఝాఁశీ రాజ్యం మహారాణి లక్ష్మీబాయిగారిదని ధ్వజమెత్తారు. అప్పట్నుంచి రాణిగారు పటాలాలతో కలిసి స్వతంత్రించి సంస్థాసంలో తన రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నం చేయసాగారు. ఆ నాలుగురోజులైనా రాణిగారు రాజ్యపాలనను ఎంతో నిపుణతతో చేసారు. ఆమె ఈ నేర్పువలన ఏ ఏ పనులకు ఎవరెవరు యోగ్యులో ఆయా పనులకు వారివారిని నియమించారు. కానీ పూర్వపు ఉద్యోగస్థులను దొరతనంవారు అదివరకే తీసివేసినందున రాణిగారికి తగిన ఉద్యోగస్థులు ఆ సమమయంలో దొరకకపోయారు. అయినా ఆమె తనవల్ల అయినంతవరకు సిద్ధపరచి దుర్గ సంరక్షణ నిమిత్తం క్రొత్త సైన్యాన్ని సిద్ధపరిచింది.

ఝాఁశీ రాజ్యంను మహారాణి లక్ష్మీబాయిగారు పాలిస్తున్న సంగతి విని వారి వంశీకుడైన సదాశివనారాయణ అనేవాడు. ఝాఁశీ సమీపంలో ఉన్న కరేరాయనే దుర్గాన్ని వశపరచుకుని అక్కడ తాను ఝాఁశీ రాజ్యాభిషేకం చేసుకున్నాడు. అబలయైన రాణిగారి రాణినివాసంలో ఉంటుంది కనుక ఆమె తనకు లొంగుతుందని అనుకున్నాడు. కాని రాణిగారు సబలయై సైన్యాన్ని పంపి అతన్ని పట్టి తెప్పించి ఝాఁశీ ఖిల్లాలో బంధించి ఉంచారు.

ఇలా ఒక శత్రువుని పరిహరించేటంతలో రెండో శత్రువు తయారయ్యాడు. ఝాఁశీకి సమీపంలో ఉన్న ఓరచా సంస్థానపు దివాను, నధేఖా అనునతడు విశేషసైన్యంతో దాడికి వెళ్ళి రాణిగారికి ఇలా వర్తమానం పంపారు. – ”మీకిదివరకు ఆంగ్లేయ ప్రభువులిచ్చే జీతం మేమిస్తాం. కాబట్టి రాజ్యాన్ని మా స్వాధీనం చేయుడు.” ఈ వార్త విని ప్రధాన సామంతులందరూ భయభీతులై మనకు ఫించెను ఇచ్చిన యెడల సంగ్రామంతో పనిలేదని, వారితో యుద్ధం చేసి గెలుచుట సాధ్యం కాదని చెప్పారు. కాని అసామాన్య శౌర్యంగల రాణిగారు వారి మాటల్ని వినక ఆ శత్రువునకు ఇలా వర్తమానం పంపారు. ”ఆంగ్లేయులు సార్వభౌములు. వారు నిగ్రహానుగ్రహాలకు సమర్థులు. వారితో సమానంగా కావాలని తలచి ఆ జీతమిస్తానంటున్నావు. కానీ నీ వంటివారు ఇంకో పదిమంది వచ్చినా స్త్రీనైన నేను వారందరినీ పౌరుషహీనుల్ని చేయగలను కనుక నిన్ను లెక్కచేయడమెందుకు?” ఈ వార్త నదేఖాకు తెలిసిన వెంటనే పట్టరాని రోషం పుట్టగా అతి వేగంగా వాడు ఝాఁశీని చేరుకున్నాడు. లక్ష్మీబాయిగారు కూడా అలా వర్తమానం పంపి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడామె తాను పురుష వేషంతో సేనాపతిలా వ్యవహారించి ఘోర యుద్ధం చేసి నధేఖాను ఓడించి వానివద్దనుండి లక్షలకొద్దీ ధనం తీసుకుని వానితో సంధి చేసుకుంది.

మహారాణి లక్ష్మీబాయిగారి పరిపాలన స్వల్పకాలమే అయినా ప్రజలకు ఎంతో సుఖకరంగా ఉండేదట. కాబట్టి వారు కూడా రాణిగారి శుభాన్ని కోరుకుంటుండేవారు. లక్ష్మీబాయి గారికి పురుషవేషంతో దర్బారు చేయడం, అశ్వారోహణ చేయటం ఎంతో ఇష్టం. కనుక ఆమె అనేక సమయాల్లో పురుషవేషంతోనే ఉండేది. సాధారణ సమయాల్లో స్త్రీ వేషంలో ఉన్నా అలంకారాలేమీ చేసుకోక శ్వేతవస్త్రాన్నే కట్టుకుంటుండేది.

రాణిగారికి బీదలపై అధిక ప్రేమ ఉండేది. ఒకరోజు ఆమె మహాలక్ష్మీ దర్శనానికి పోయి వచ్చేటపుడు కొందరు పేదలు గుంపులుగా ఆమెని అడ్డగించారు. దానికి కారణం అడగగా వారు భరించలేని చలివలన బాధపడుతున్నందున వస్త్రదానం కోరి వచ్చారని రాణిగారికి తెలిసింది. దాన్తో ఆమె వారందరికీ టోపీలు, అంగీలు, గొంగళ్ళు మొదలైనవి ఇప్పించింది.

మధ్య హిందుస్థానమంతా ఇంచుమించుగా బందిపోటు సైన్యాల స్వాధీనం అయినందున అప్పటి హిందుస్థాన్‌ గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ క్యానింగ్‌ దొరగారు ఇంగ్లండు దొరతనం వారి అనుమతి తీసుకుని ఇంగ్లండులోని, హిందుస్థాన్‌లోని ప్రవీణులైన సేనా నాయకులను రప్పించి రాజభక్తిగల ఇతర సైన్యాలను, సహాయం కోసం వచ్చిన ఇతర భూపతుల సైన్యాలను వారి పరంచేసి ఆ ప్రచండ సేనను నడపడానికి యుద్ధకళా విశారదుడైన సర్‌ హ్యూరోజ్‌ దొరగారిని నియమించి ఆయనకు సర్వసేనాధిపత్యాన్ని ఇచ్చారు.

1857వ సంవత్సరం డిసెంబరు 17వ తేదీన సర్‌ హ్యూరోజ్‌ దొరగారు సేనా నాయకత్వాన్ని స్వీకరించారు. యుద్ధానికి పోవు మార్గాన్ని ఆలోచించి వేర్వేరు మార్గాలలో సైన్యాలను నడపవలసిన క్రమాన్ని తెలిపారు. క్రమక్రమంగా సర్‌ హ్యూరోజ్‌ దొరగారు తమ సంగ్రామ కౌశలాన్ని అందరూ కొనియాడుతుండగా బందిపోటు సైన్యాల పాలైన భూములు అనేకం గెలిచి, ఝాఁశీని గెలవాలన్న ఆలోచనతో అక్కడికి 14 మైళ్ళ దూరంలో తన సైన్యాన్ని నిలిపారు. వారక్కడినుండి ఝాఁశీ వార్తలను తెలుసుకుంటూ, 1858వ సంవత్సరం మార్చి 21వ తేదీన ఝాఁశీ పొలిమేరనందు ప్రవేశించి పుర మార్గాలను తెలుసుకుని తదనుసారంగా సైన్యాలను యుద్ధానికి సిద్ధం చేసారు.

అప్పుడు శౌర్యరాశియైన రాణిగారు ఆగ్రహించి ఇక ఇంగ్లీషువారితో పొసగదని తెల్సుకుని యుద్ధ సన్నాహం చేయసాగారు. నధేఖాతో యుద్ధం చేసినపుడు ఉంచిన విశేష సైన్యానికి అనేక స్థలాలనుండి వచ్చిన స్వాతంత్య్రవీరుల సైన్యాలు తోడయ్యాయి. రాణిగారి సైనికులలో శూరులైన ఠాకూరులు, విశ్వాసపాత్రులైన పఠాణులు ఎక్కువమందున్నారు. ఆ సేనాధిపత్యమంతా రాణిగారు తామే స్వీకరించి తగిన బందోబస్తు చేయసాగారు. ఝాఁశీ కోట ఎంతో విశాలమైనది, అభేద్యమైనదిగా ఉండేది. అక్కడ గొప్ప గొప్ప బురుజులుండేవి. ఆ ఖిల్లాలో అనేక రోజులనుండి నిరుపయోగంగా ఉన్న అనేక ఫిరంగులను రాణిగారు బాగుపరచి బురుజులపై ఎక్కించారు. ఒక్కొక్క ఫిరంగికి ఒక్కొక్క యుద్ధకళా నిపుణున్ని నియమించారు. ఇలా ఆమె తన నేర్పు ప్రకారం సైన్యాన్ని నడుపుతూ యుద్ధానికి సిద్ధమయ్యారు.

ఈ ప్రకారం ఉభయ సైన్యాలూ యుద్ధ సన్నద్ధులై 13వ తేదీన సంగ్రామాన్ని ప్రారంభించారు. ఆ రోజు శత్రువులు ఝాఁశీ ఖిల్లాను సమీపించ ప్రయత్నించారు. కానీ కోటలోని వారి అగ్నిబాణ పరంపర వారికి అసహ్యమైనందున చేరుకోలేకపోయారు. ఆ రాత్రి ఇంగ్లీషు సైనికులు కొందరు గ్రామం సమీపించి అక్కడ నాలుగు స్థలాలలో బురుజులు ఏర్పాటు చేసి వాటిపై ఫిరంగులు ఉంచారు. ఝాఁశీలోని వారు కూడా ఆ రాత్రి అంతా యుద్ధ ప్రయత్నమే చేస్తున్నారు. 14వ తేదీనాడు కూడా ఇంగ్లీషు సైన్యాలే దైన్యాన్ని పొందాయి. 15వ తేదీ ప్రాతఃకాలంలోనే ఇంగ్లీషు సైన్యాలనుండి ఖిల్లాపైన, పురముపైన అన్నివైపుల నుండి బాణాల వర్షం కురవసాగింది. ఆగోళం ఒకటొచ్చి శత్రు సైన్యంలో పడి పగిలి నలుగురైదుగుర్ని చంపి పదిమందిని గాయపరుస్తుండేది. ఆ రోజు ఆ పట్టణంలో ఎటు చూసినా హాహాకారాలే వినబడుతున్నాయి. ప్రజలు అన్నాహారాలకు కూడా తిరగలేకున్నారు. వారి దైన్యాన్ని చూసి రాణిగారు వారికోసం ఒక అన్న సత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆంగ్లేయ సైన్యం నుండి నారాయణాస్త్రతుల్యాలైన గోళాలవలన తన సైన్యం దీనముఖులవడం చూసి లక్ష్మీబాయి అంతటితో ధైర్యం వదల సైనికులకు ఉత్సాహం కలగచేసి ఆంగ్లేయ సైన్యాన్ని ఎదుర్కొంది. ఇలా ఈ ఉభయ సైన్యాలూ వెనుకంజ వేయకుండా మార్చి 30వ తేదీవరకు యుద్ధం చేస్తూ ఉన్నాయి. ప్రతిపక్షులైన ఆంగ్లేయ సైన్యానికి అనేకమంది సేనానాయకులుండి నడపటం వలన, సైనికులు అదివరకే యుద్ధానికి అనుకూలమైన శిక్షణ పొంది ఉండటంవలనను వారి సైన్యాలు చెదరక యుద్ధం చేసి గెలుపొందటం ఒక వింత కాదు. ఇక రాణిగారి సైన్యములంటే యుద్ధ శిక్షణ తెలియని స్వాతంత్య్ర వీరులతో కలిసి జనసంఖ్య ఎక్కువగా కనిపించినా వారందరూ ఒక పద్ధతిగా యుద్ధం చేయలేకపోయినందున ఎక్కువగా చెదురుతుండేవారు. అంత పెద్ద సైన్యానికంతటికీ రాణిగారే నాయకత్వం వహించి నడుపుట ఎంతో కష్టమైనదని అందరికీ తెలిసిందే. అయినా ఆ వీరవనిత తన బుద్ధి చాతుర్యం వలన, శౌర్య సంపద వలన ప్రఖ్యాతులైన ఆంగ్లేయ సేనా నాయకులతో ప్రతిఘటించి యుద్ధభూమిలో నిలిచి అనేక దినాలు యుద్ధం చేసి, వారితో ఈమెని గెలవటం దుర్లభం ”అనిపించటం గొప్ప వింతకదా?” (ఇంకా ఉంది…)

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.