స్త్రీలకు ఉపాధి అవసరం లేదా? – పి.దేవి

పనికి అప్పుడప్పుడూ పోతున్న… దొరికితే చేస్త. దొరకడం లేదమ్మా… దొరికినా సాన తక్కువ ఇస్తమంటరు. ఏం చేయాలే ఇగ ఇంట్లనే వుంటున్న” అంది నాగమయ్య కుంటలో ఉంటూ, రోజూ అడ్డా పనికి పోయే రాజమ్మ.

”నెలకి ఐదారు వేలుకంటే ఇవ్వటంలేదు. తొమ్మిదింటి నుండి సాయంత్రం ఏడు గంటలదాకా పాఠాలు చెప్పాలే. అదేమంటే బియిడి లేదు అంటున్నారు” అని వాపోయింది డిగ్రీ చదివిన పద్మ. ఇంట్లోనే వుండి పిల్లలూ, ఇంటి పని చూసుకుంటే నయం అనుకున్నారంట భార్యా భర్తలు. ఉద్యోగానికి పోవాలంటే పనిమనిషి కావాలి. ఆమెకో రెండు వేలు. పిల్లల్లో ఒకర్ని డే కేర్‌లో వుంచినా పెద్ద కొడుకు బడినుండి వస్తే నాలుగు గంటల నుండి ఎక్కడుండాలి. కాబట్టి పద్మ ఇంట్లో ఉంటే అన్నింటికీ పరిష్కారం.

”స్ట్రెస్‌ లెవెల్స్‌ బాగా పెరిగిపోయాయి. ఒకటే వత్తిడి జాబ్‌లో. ప్రాజెక్టు పూర్తయితేనే ఇంటికి. పైగా బాగా కాంపిటిషన్‌. పెళ్ళయింది. ఆయనకు బాగా వస్తుంది. ఎందుకులే మానెయ్యి అన్నారు మానేశా” అంది రాగిణి. ఇంజనీరింగ్‌ చదివి పెళ్ళికి ముందంతా ఒక ఐటి కంపెనీలో ఉద్యోగం చేసేది.

”ఎంబిఏలో క్లాసంతటికీ ప్రథమ స్థానంలో నిలిచినా, పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దే తల్లిగా

ఉండాలనుకుంటున్నాన”ని ప్రకటించిన ఓ యువతి ఆదర్శాన్ని అందరూ కొనియాడారని ఒక కథ. ”చదువుకున్న, అందమైన యువతి (వివరాలు), ఉద్యోగం చేయకూడదు… వధువు కావాలి” ఒక వివాహ ప్రకటన.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం మొత్తమ్మీద భారతదేశంలో ఉపాధిలో ఉంటున్న స్త్రీల సంఖ్య మూడేళ్ళలో 29 శాతం నుండి 21 శాతానికి పడిపోయింది. ఎందుకిలా జరుగుతోంది? విద్యారంగంలో కాస్త మెరుగుదల ఉంది. ప్రాథమిక, మాధ్యమిక స్థాయి బడి చదువుల్లో బాలబాలికల సంఖ్య దాదాపు సమానంగా ఉంటోంది. కానీ ఈనాటికీ పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్థాయికి చేరుతున్నవారి సంఖ్య ఏడు శాతానికి మించడంలేదు. ఆధునిక పరికరాల వాడకం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఆర్థిక అవసరాలు అంతకుమించి పెరిగాయి.

కానీ మహిళలు మాత్రం యింటికి పరిమితం కావాలనుకుంటున్నారా? లేక ఉపాధి నుండి, ఉద్యోగాల నుండి ఇంటి లోపలికి నెట్టివేయబడుతున్నారా? 1990ల నుండి ఉపాధిలో స్త్రీల భాగస్వామ్యం క్రమేణా తగ్గుతూ వస్తోంది (ఒక్క 2004-05 సంవత్సరాలు తప్ప). అలాగే ఇంట్లో పనులు, ఇంటికి అవసరమైన పనులకు పరిమితమవుతున్న స్త్రీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనికి కారణం ఆదాయం పెరగడమా? లేక ఇంటికి పరిమితం కావడం ఒక కొత్త సామాజిక హోదాగా మారిందా?

ఎందుకని ఉపాధి, ఉద్యోగాల్లో తగ్గిపోతూ స్త్రీలు ఇంటికి పరిమితమవుతున్నారనే చర్చ జరపకుండా స్త్రీల సామాజిక స్థాయి మెరుగుపరచడం గురించి, బాల్య వివాహాలు, వరకట్నం వంటి దురాచారాలు అరికట్టడం గురించి, ఆడశిశువు పిండాల హత్యలు, గృహ హింస, అత్యాచారాలు, లైంగిక దాడులు, పని ప్రదేశాల్లో లైంగిక హింస గురించి విడివిడిగా మాట్లాడడం సరయిన నిర్ధారణలకు దారితీయదు.

అసలు వేతన ఉపాధి రంగంలో స్త్రీలు చేసే పనిని, వేతనం లేకుండా స్త్రీలు చేసే పనిని విడివిడిగా అర్థం చేసుకోవటం సరైందేనా అనే ప్రశ్న కూడా మౌలికమైంది. వేతనం లేకుండా స్త్రీలు చేసే పనిని వంటపని, పిల్లలు, వృద్ధుల సంరక్షణ, ఇంటి నిర్వహణ (నీళ్ళు తేవడం, కట్టెలు వంటివి సమకూర్చడం, పశువుల పోషణ, ఆహార పదార్థాలు బాగుచేయడం, సరుకులు తేవడం వంటి ఇంటి బయట పనులు కాకుండా) వంటివి లేకుండా ఉంటే, పురుషులు ఉద్యోగం చేయడం ఎంతవరకూ సాధ్యం. వీటన్నింటినీ ఉద్యోగం ఇచ్చేవారే సమకూర్చాలంటే ఎంత ఖర్చవుతుంది? కాబట్టే పురుషుడు ఉద్యోగం చేస్తున్నపుడు ఇంట్లో పనిచేసే స్త్రీ వేతనం లేని శ్రమ కూడా కలిగి ఉంటుంది. అంటే పురుషుడికి లభించే వేతనం వాస్తవానికి అతను చేసే ఉద్యోగ శ్రమకూ, స్త్రీ చేసే ఇంటి పనికీ కలిపి లభించే వేతనం. పురుషుడికి ఎంత వేతనం చెల్లించినా స్త్రీల శ్రమను కారుచౌకగా కొనుక్కున్నట్టే లెక్క.

కాబట్టే వేతనం చెల్లించని స్త్రీల శ్రమకి విలువ కట్టాలని వెనుజులా ప్రభుత్వం భావించింది. అందరికంటే ముందు చొరవ చూపింది. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం కూడా వేతనం లేని శ్రమను సామాజికపరం చేయకుండా స్త్రీల ఉపాధిలో నాణ్యత పెంచడం సాధ్యం కాదంటోంది.

అసలు ఉపాధి రహిత అభివృద్ధిగా సాగుతున్న ప్రపంచీకరణ అంతులేకుండా పోగేసుకుంటున్న లాభాలు మరింత పెంచుకోవడానికి స్త్రీలను ఇంటికి పరిమితం చేయడం ఒక అవసరంగా మారిందా అనేది కీలకమైన ప్రశ్న. గత రెండు దశాబ్దాల్లో మొత్తం ఉత్పత్తి రంగంలో వేతనాల వాటా 12శాతానికి పడిపోయింది. కానీ లాభాల వాటా 20శాతం నుండి 50శాతానికి పెరిగింది. ఉపాధిరంగాన్నంతా క్యాజువల్‌, కాంట్రాక్టు, దినసరి కూలి, పీస్‌రేటు చెల్లింపులుగా మార్చడంతోనే ఇది సాధ్యమైంది. ఇలా లభించే నామమాత్రపు కూలి కంటే ఇంటిపని చేయటంలో కుటుంబానికి ఎక్కువ లాభం జరిగే పరిస్థితి ఏర్పడిందనుకోవచ్చునా? స్త్రీలు చేసే వేతనం లేని శ్రమ, వేతనం ఇచ్చే ఉపాధికి ప్రత్యామ్నాయంగా మారేంతగా సేవారంగం ఖరీదు పెరిగిపోయిందా అని కూడా ఆలోచించాలి.

90వ దశకం నుండి 2015 దాకా పరిశీలిస్తే గ్రామీణ స్త్రీల సంఖ్య ఉపాధి రంగంలో 42.5 నుండి 18 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 25.4 నుండి 13.4 శాతానికి పడిపోయింది. 80వ దశకం ప్రారంభంలో స్వీయ ఉపాధి లేక స్వంత కుటుంబ ఉత్పత్తిలో స్త్రీల సంఖ్య గ్రామాలలో 40 నుంచి 16 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 15 నుంచి ఆరు శాతానికి పడిపోయింది.

ఒకవేళ కుటుంబ ఆదాయం పెరగడం ఒక కారణంగా సానుకూలంగా పరిశీలిద్దాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం అతిపెద్ద ఆర్థిక ఆదాయ వనరుగా ఉన్నప్పుడు స్త్రీల శ్రమ అవసరం ఎక్కువగా ఉండేది. అలాగే దారిద్య్రం ఎక్కువగా ఉండడంవల్ల పట్టణ

పాంతాల్లో స్త్రీలు తప్పనిసరిగా కూలి చేసేవారు. అందుకని ఉపాధి రంగంలో ఆ కాలంలో స్త్రీల సంఖ్య ఎక్కువ ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది.

కాబట్టి వ్యవసాయం ప్రాధాన్యత తగ్గి, ఇతర రంగాలు అభివృద్ది చెందడంతో ఆదాయం పెరిగి స్త్రీలు ఉపాధి నుండి విరమించారనేది నిజమేనా? అలాగే ఈ కుటుంబ ఆదాయం పెరుగుదల వలన చదువుకుని, నైపుణ్యం ఉన్న స్త్రీలు ఆర్థికాభివృద్ధి జరగడంతో మళ్ళీ భారీగా ఉపాధిలోకి వస్తారనే సిద్ధాంతం… వాస్తవంగా ఆచరణలో నిరూపితమయిందా?

మొదటిది పురుషుల ”నిజ వేతనాలు” ఎలా పెరిగాయి? గ్రామీణ ప్రాంతంలో సగటున రూ.150 ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఇది రూ.491కు చేరింది. కానీ పెరుగుదల జరిగింది నిజానికి రూ.22, రూ.58 మేరకే. ఇది సగటు స్రీల కూలి కంటే చాలా తక్కువ. అంటే స్త్రీలు కూలికి వెళ్ళడం మానేసినా కానీ ఆ కుటుంబం నడిచే పరిస్థితి ఏర్పడేంతగా పురుషుల వేతనాలు పెరగలేదు. కాబట్టి పురుషుల వేతనాలు పెరగడం వలన స్త్రీలు ఉపాధి నుండి తప్పుకుంటున్నారనే వాదన చాలా బలహీనంగా ఉంది.

దీనికి పూర్తి భిన్నంగా బ్రెజిల్‌లో 2001-2009 మధ్య కాలంలో 170 లక్షల ఉద్యోగాలు కల్పించారు. దీంతో

ఉపాధిగల స్త్రీల సంఖ్య 58 శాతానికి చేరింది. అన్ని రకాల భద్రతలు గల ఉద్యోగాలు పొందుతున్న స్త్రీల సంఖ్య 35 శాతానికి పెరిగింది. కనీస వేతనం రెట్టింపు చేయటం, వేతన వ్యత్యాసాన్ని 38 నుండి 29 శాతానికి తగ్గించడం వల్ల ఇది జరిగింది. అయితే బ్రెజిల్‌లో పురుషుల వేతనాలు తగ్గడం వలన కాకుండా ఇద్దరి వేతనాలు పెంచడం ద్వారా వేతన వ్యత్యాసాన్ని తగ్గించడం విశేషం.

”అందరినీ దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ప్రభుత్వ ఆర్థిక విధానాలు ఎక్కువ ఉద్యోగాలు సృష్టించాయి. కార్మిక చట్టాల అమలు చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహంతో నిలకడగా ఉద్యోగ భద్రత ఏర్పడింది. దారిద్య్రం తగ్గేకొద్దీ అసమానత్వంలో 66 శాతం తగ్గుదల ఉంది” అని వెనుజులా ప్రభుత్వం నివేదించింది.

అంటే ఆదాయంలో పెరుగుదల ఉంటే స్త్రీలు ఉపాధిలోకి వచ్చే అవకాశాలు పెరుగుతాయి తప్ప తగ్గవు. కాబట్టి కుటుంబ ఆదాయం పెరగడం వలన స్త్రీలు పని చేయవలసిన అవసరం లేకుండా పోయిందనే వాదన నిలబడదు.

మన దేశంలో ప్రభుత్వ పథకాల్లో పనిచేసే వాళ్ళు (ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు వంటివారు) 50లక్షల మంది పైగా ఉంటారు. వీరందరికీ గౌరవ వేతనాలని పేరు పెట్టింది ప్రభుత్వం. ప్రభుత్వం నిర్ణయించిన చట్టపరమైన కనీస వేతనం కూడా ఈ స్కీం వర్కర్లకు లభించడంలేదు. కానీ ఏదో ఒక ఆదాయపు అవసరం కుటుంబాలకు ఎంత ఎక్కువగా ఉందంటే ఈ అతి తక్కువ అగౌరవ వేతన ఊపాధికి కూడా మంత్రుల సిఫార్సులు అవసరం అవుతున్నాయి.

రోజువారీ పనిలో కానీ, నెలవారీ పనిలో కానీ ఒకసారి పని మానేసిన స్త్రీలు తిరిగి పనిలోకి రావడం తక్కువ. పదవ తరగతి, ఇంటర్‌ లేదా డిగ్రీ చదివిన యువతులు పెళ్ళిదాకా ఏదో ఒక ఉపాధిలో ఉంటారు. పెళ్ళయిన వెంటనే లేదా పిల్లలు పుట్టగానే పని మానేస్తారు. స్త్రీలు పని చేయాలా వద్దా అనేది ఈనాటికీ మన పుణ్య భూమిలో భర్త, అత్త, మామలే నిర్ణయిస్తారు. ఈ తరహా యువతులకు లభించే వేతనం చాలా తక్కువగా ఉండడంవలన ఆ మేరకు ఇంటిపని, పిల్లల పెంపకం, వృద్ధుల సేవ చేయడం కలసి వస్తుందనుకుంటారు.

డిగ్రీ చదివిన యువతుల్లో పట్టణాలలో 53 శాతం మంది, పల్లెల్లో 41 శాతం మంది గత పదేళ్ళ కాలంలో ఉపాధి రంగం నుండి నిష్క్రమించారు. మొత్తంమీద ఇంటరు, డిగ్రీ చదివిన 80-90 శాతం మంది యువతులు ఇంటి పనులకే పరిమితమవుతున్నారు.

చిన్న వయసులో పనికి వెళ్ళకుండా చదువుకోవడం వలన మహిళా శ్రామికుల సంఖ్య తగ్గిందనే వాదన కూడా

ఉంది. అయితే ఉపాధి రంగంలోకి తిరిగిరాని 3.85 కోట్ల మంది మహిళల్లో ఇది కేవలం ఏడు శాతం మాత్రమే. ఈ స్త్రీలు 25 సంవత్సరాల లోపువారే. ఈనాటికీ డిగ్రీకంటే ఎక్కువ చదివే యువతుల సంఖ్య ఏడు శాతం దాటడంలేదు.

కాబట్టి మొత్తంగా చూసినపుడు 68 శాతం మహిళలకు ఉపాధి కల్పించే వ్యవసాయ రంగానికి ఇప్పుడా శక్తి లేదు. వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత వృత్తులు, స్వయం ఉపాధిలో మహిళల సంఖ్య భారీగా తగ్గిపోయింది. 2004-2010 మధ్యకాలంలో 2.5 కోట్ల ఉపాధులను వ్యవసాయ రంగంలో, మూడు కోట్లకు పైగా ఉద్యోగాలను ఉత్పత్తి రంగంలోనూ కోల్పోయారు. 2014కి సేవా రంగం వంటి ఇతర రంగాల్లో 38 లక్షల ఉద్యోగాలు ఏర్పడినా అవి ఏ మూలకీ సరిపోవు. పైగా ఆ మధ్యకాలంలో ఉపాధి రంగంలోకి కొత్తగా 2.15 లక్షల మంది మహిళలు ప్రవేశించారు. స్త్రీలకు ఉపాధి కల్పించే గృహ పరిశ్రమల్లో (బీడీలు, అగరవత్తులు, కుట్టుపని) మొత్తం స్త్రీల ఉపాధిలో 22 శాతం నుండి 9 శాతానికి పడిపోయింది.

గణాంకాల ప్రకారం చూస్తే ”నేను ఇంటి పని చేయడానికే ఇష్టపడతాను” అని ఎంపిక చేసుకున్న స్త్రీల శాతం గ్రామాల్లో 15.8, పట్టణాల్లో 14.2 మాత్రమే ఉంది. మతపరమయిన, సామాజికమైన కారణాల వల్ల ఇంటి పనికి పరిమితమయ్యామని వారు వివరించారు. ఇంటిపని చేయడానికి వేరెవరూ లేకపోవడంవల్ల ఈ పని చేస్తున్నామని 60.1 శాతం గ్రామీణ మహిళలు, 64.1 శాతం పట్టణ మహిళలు పేర్కొనడం గమనించాల్సిన విషయం. ఇంటి పని చేస్తున్న 15 సంవత్సరాలకు పైబడిన వారిలో 41.7 శాతం గ్రామీణ స్త్రీలు, 49.1 శాతం పట్టణ స్త్రీలు తమకు ఏదో ఒక ఉపాధి కావాలని కోరారు. వీరిలో ఐదు శాతం మంది మాత్రం అప్పుడప్పుడూ పనిచేస్తామంటే, మిగిలిన వారంతా మొత్తం సమయం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.

దీన్ని పరిశీలించాక మహిళలు ఇంటిపనికి పరిమితం కావడానికి కారణం వారికి అవకాశాలు లభించకపోవడం వల్లనే అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ప్రత్యుత్పత్తి హక్కులను, కనీస సదుపాయాలను కలుగచేయలేని అసమగ్రమయిన ఆర్థిక విధానాలు, ఉపాధి కల్పించని పారిశ్రామిక పద్ధతులు, వేతన వ్యత్యాసాలు స్త్రీలను ఇంటి పనిలోకి తరుముకొచ్చాయి.

ఫలితంగా కూలి చేయడంవలన లభించే ఆదాయం కోల్పోయిన మహిళలు ఇంటికి అవసరమైన పనుల్లో శ్రమను ధారపోసి కుటుంబం నిలబడేలా చేస్తున్నారు. ఒక పక్కన తలసరి ఆదాయం పెరుగుదల, ఏడు శాతం నుండి 11 శాతం ఆర్ధికాభివృద్ధి మహిళల జీవితాలకు చేరకపోగా ప్రతికూల పరిస్థితులను కల్పిస్తోందని నిర్ధారించవచ్చు.

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.