స్త్రీల వేతన శ్రమ – వేతనం లేని శ్రమ పి. దేవి

గృహ పరిశ్రమల్లో, కుటీర పరిశ్రమల్లో, రోజువారీ కూలీనో, లేదా నెలసరి వేతనంగానో స్త్రీలు సంపాదించి తెచ్చిన డబ్బును మాత్రమే వేతన శ్రమగా పరిగణిస్తారు. అయితే వ్యవసాయ కుటుంబాలలో, వివిధ వృత్తుల్లో స్త్రీలు చేసే శ్రమ కుటుంబ సంపాదనలో గణనీయ పాత్రను పోషించినా దానిని వేతన శ్రమగా లెక్కించరు.

ఆర్థిక శాస్త్రం స్త్రీల శ్రమను ఎక్కువ భాగం విస్మరించిందనే చెప్పాలి. ఆర్థిక రంగ నిపుణులుగా స్త్రీలు రాక పూర్వం స్త్రీల వేతనం లేని శ్రమను గుర్తించింది మార్క్స్‌ ఎంకెల్స్‌లే. అయితే తర్వాత ఇటీవలి కాలంలో ఫెమినిస్టు అధ్యయనాలు మొదలయ్యాక కానీ స్త్రీల వేతన శ్రమను గుర్తించడం, వేతనం లేని శ్రమ ఆర్థిక విలువను లెక్కించడంతో పాటు ఇంటి పనులకు సంబంధించిన జమా లెక్కలు పదే పదే చర్చకు వస్తున్నాయి.

స్త్రీల శ్రమ విలువను ఆర్థిక శాస్త్రం గుర్తించకపోవడానికి ప్రధాన కారణం శ్రమకు విలువను డబ్బుతో మాత్రమే గుణించే సంకుచిత నిర్వచనమే. ఈ డబ్బు విలువ దాదాపు దాని అమ్మకపు (మార్కెట్‌) విలువగా మాత్రమే ఉండడం. కానీ చాలా సరుకులు, పనులు, సేవలు అమ్మకానికి వెళ్ళవు. వాటి మారకపు విలువ డబ్బుతో, మార్కెట్‌తో ఉండదు కాబట్టి కుటుంబ వృత్తులు, సామాజిక పనులకు ఈ అర్థశాస్త్ర ప్రకారం విలువ ఉండదు. దాంతో మొత్తం సమాజపు ఉత్పత్తినే తక్కువగా విలువ కడతారు. కాబట్టి చాలామంది ప్రజలు ముఖ్యంగా స్త్రీలు చేసే శ్రమ గుర్తింపుకూ, విలువకూ నోచుకోదు.

ఈ నాటికీ స్త్రీల వేతనం లేని శ్రమ అంటే యింటి పని, వంట పని, పిల్లలు వృద్ధుల బాధ్యతలు చేయడంగానే చాలామంది భావిస్తారు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్యంగా మన దేశంలో ఇంటా, బయటా జరిగే ఉత్పత్తి కార్యక్రమాలనూ, ఇంట్లో జరిగే వాటిని విడదీయడం చాలా కష్టం.

ఉదాహరణకు వ్యవసాయంలో ముఖ్యంగా వరి పండించే ప్రాంతాల్లో ధనిక, మధ్య తరగతి రైతు కుటుంబాల స్త్రీలు పొలాలకు వెళ్ళకపోవచ్చును. కానీ పనులు ముమ్మరంగా సాగుతున్నపుడు పనివాళ్ళకు తిండి ఏర్పాట్లు, కూలీలకు అవసరమైన ఏర్పాట్లు, పనికి అవసరమైనవి సిద్ధం చేయడంతో మొదలయి ధాన్యం నిల్వ ఉంచే ఏర్పాట్లు, ఎండబెట్టడం, శుభ్రం చేయడం వంటి ఊపిరి తీసుకోలేనంతగా పనులు

ఉంటాయి. దానికి తోడు, పశువుల బాధ్యత ప్రధానంగా వారికే ఉంటుంది. మెట్ట ప్రాంతాల్లో మధ్య తరగతి రైతు స్త్రీలు కూడా పొలంలో నేరుగా పనిపాటలు చేస్తుంటారు. ఎక్కడయినా పేద రైతు స్త్రీలు, పిల్లలు అనివార్యంగా పొలం పనుల్లో దాదాపు సగం పైగా పని భారం మోయక తప్పదు. కానీ ఎక్కడయినా ”సేద్యగాళ్ళు” రైతులు అంతా పురుషులుగానే నమోదవుతుంది. మొత్తం గణాంకాల్లో ఈ స్త్రీలంతా కేవలం ఇంటికే పరిమితమై ”ఆర్థిక” విలువగల ఏ పనీ చేయని వారుగానే పరిగణింపబడతారు. ఈ ఏ పనీ చేయని వ్యవసాయదారులయిన మహిళలు 58% తమ వంటపని, ఇంటిపని కాకుండా అదనంగా పని చేస్తుంటారు.

13 పారిశ్రామిక దేశాల్లో ఒక అధ్యయనం జరిగింది. పారిశ్రామిక దేశాల్లో ఇంటిపని లేని శ్రమకు ఎక్కువభాగం ఆర్థికంగా విలువను లెక్కగడతారు. అటువంటి దేశాల్లోనే అది స్థూల జాతీయోత్పత్తిలో సగంకంటే ఎక్కువగా ఉంది. శ్రామిక ఉత్పత్తి విలువ మొత్తం 16 ట్రిలియన్లు అనుకుంటే దానిలో 11 ట్రిలియన్ల విలువగల ఉత్పత్తిని స్త్రీలు చేశారని అంచనా వేశారు.

స్త్రీల వేతనం లేని శ్రమని పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల మొత్తం ఆర్థిక వ్యవహారాల్లో స్త్రీలు అస్సలు కనిపించకుండా పోతున్నారు. అది ఆ స్త్రీ యాజమాన్యం కావచ్చు, బ్యాంకు లావాదేవీలు కావచ్చు. ఆదాయం తేగల సామర్ధ్యాన్ని బట్టి సామాజిక హోదా (విలువ)ను లెక్కించే సమాజంలో స్త్రీలు ఏ హోదా లేని వారుగా వారి శ్రమకు గుర్తింపు లేక ఆర్థిక విలువను పొందని వారిగా మిగిలిపోతున్నారు. ఈ దేశంలో పంట అంతా స్త్రీ పురుషుల ఉమ్మడి శ్రమ వలన ఉత్పత్తి అయ్యిందే, కానీ స్త్రీలు వ్యవసాయదార్లు, సాగుదార్లుగా గుర్తించబడరు. స్త్రీలు వ్యవసాయంలో లేకపోతే ఈ పంటే సాధ్యం కాదు.

ఇంటి పని, వంట పని కాకుండా స్త్రీలు చేసే పనికి ”డబ్బు ద్వారా విలువ” ఇవ్వడానికి నిరాకరించడం ఎంతో అన్యాయం. ఆ పనికి డబ్బు ద్వారా విలువ కడితే కానీ అసలు కుటుంబ పోషకులు, యజమానులు ఎవరు అనేది నికరంగా తేలదు. కుటుంబంలో భాగంగా కుటుంబం చేసే వృత్తిలో,

ఉత్పత్తిలో పాలుపంచుకునే స్త్రీల శ్రమకు విలువ కడితేనే కానీ ”స్త్రీలను పోషిస్తున్న భారం” నుండి పురుషులు విముక్తి పొందరు. స్త్రీలు ఆధారపడిన వాళ్ళ స్థానం నుండి సమాన హక్కుదార్ల స్థాయికి చేరరు.

కాబట్టి ఉత్పత్తిలో భాగంగానే స్త్రీలు చేసే వేతనం లేని శ్రమను పరిశీలిద్దాం. వ్యవసాయంలో గట్లు వేయడంతో మొదలుపెట్టి పంట మార్కెట్టుకు చేరేదాకా జరిగే రకరకాల పనులన్నింటిలోనూ… నారుకు వడ్లు సిద్ధం చేయడం, నీరు పెట్టడం, గింజలు సిద్ధం చేయడం (గతంలో గింజలు నిల్వలు చేయడం కూడా ఉండేది), పేడ ఎరువులు తయారుచేయడం, కూలీల అవసరాలు తీర్చడం వంటి వాటికి తోడు నాట్లు, కలుపులు, కోతల పనులు (యంత్రాలు అయితే వాళ్ళకి వండి వార్చడం), నూర్పులు, పరిగె ఏరడం, పంటలు శుభ్రం చేయడం, పశుగ్రాసం నిల్వ చేయడం, (వీటి తర్వాత ఆహార ధాన్యాలను తినడానికి అనువుగా మార్చడం ఓ సుదీర్ఘ ప్రక్రియ అయితే దాన్ని ఇంటి పనిగా లెక్కిస్తున్నారు) వీటన్నింటికీ విలువ కట్టాలి.

అలాగే రెండో పెద్ద రంగం నేత పని. నేరుగా మగ్గంలోకి వెళ్ళి నేయడం ద్వారా ‘సాగు’ తొందరగా దిగడానికి సహాయం చేయడం స్త్రీలు చేసే పనుల్లో ఒక పని మాత్రమే. దారం వడకడం, కండెలు చుట్టడం, అంచులు అతకడం, గంజి సిద్ధం చేయడం, దారం చుట్టడం వంటి అన్ని రకాల పనులు, మగ్గం మీద వస్త్రం నేతకు రావడానికి ముందు జరగాల్సిన పనుల్లో స్త్రీలే ప్రధానంగా పనిచేస్తుంటారు. ఇంట్లో కుటుంబ వృత్తులు, కుటీర పరిశ్రమ అన్నింటిలో ఒక్కటొక్కటిగా ఉదాహరణలు ఇవ్వొచ్చు.

80వ దశకం నుండి ఈ వేతనం లేని స్త్రీల శ్రమకు విలువ కట్టాలని ప్రారంభమైన సూచన ఇప్పుడు స్పష్టత సంతరించుకుని ప్రధాన డిమాండుగా మారింది. ఇటీవల చీూూూ సర్వేలో కొంత మేరకు ఈ ప్రయత్నం జరిగింది. అయితే అది చాలా అరకొరగా ఉంది. పురుషులు 60 శాతం ఆర్థిక కార్యకలాపాలు జరుపుతుంటే స్త్రీలు 40 శాతం మాత్రమే జరుపుతున్నట్లు వచ్చింది. అది స్త్రీల శ్రమను అత్యంత అసంపూర్తిగా లెక్కించిన పద్ధతి.

దీనిలో స్త్రీలు చేసే రకరకాల పనులతో పాటు వారు చేసే ఇంటి పనిని పరిగణనలోకి తీసుకోలేదు. ఇంటి నిర్వహణ, అవసరమైన వస్తువులు సమకూర్చుకోవడం అంటే ఇంధనం, రేషన్‌, నీరు వంటి ప్రాథమిక నిత్యావసరాల కోసం స్త్రీలు వెచ్చించే సమయం గుర్తించలేదు.

స్త్రీలు ఇంటిలో చేసే లక్ష రకాల పనులు, వాటికి తోడు పిల్లల పెంపకం, వృద్ధుల సంరక్షణ, రోగుల సేవ వంటివి పూర్తిగా ”ప్రేమగా”నే తీసుకునే ఏ మాత్రం గుర్తింపు లేని చాకిరీ. పైసా ఆదాయం రాని శ్రమ. మొదటగా పిల్లల పెంపకం కేవలం స్త్రీ వ్యక్తిగత బాధ్యతగా చేయటం ద్వారా సమాజం, ప్రభుత్వం బిడ్డల శారీరక, మానసిక అవసరాలు, ఆరోగ్యం నుండి పూర్తిగా చేతులు దులుపుకుంటుంది. బిడ్డలు సమాజపు / దేశపు సంపద. ఒక దేశపు భవిష్యత్తుకు బాలలు అవసరమని ఊకదంపుడు ఉపన్యాసాల్లో కాకుండా నిజంగా భావిస్తే వారి భౌతిక అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా బిడ్డల సంరక్షణ ఎంత బలహీనంగా అమలవుతోందో చెప్పడానికి 39 శాతం పౌష్టికాహార లోపంతో బాధపడే పిల్లల సంఖ్య చాలు. కాబట్టి నిజంగా బిడ్డల అవసరాలన్నింటినీ స్త్రీలపై పడేయడం ద్వారా బిడ్డలపై పెట్టాల్సిన ఖర్చంతా ప్రభుత్వానికి ఆదా అవుతోంది.

అలాగే వృద్ధులకు, అనారోగ్యంతో బాధపడే వ్యక్తులకు సేవ చేయడం స్త్రీల కనీస కర్తవ్యంగా చేయడం ద్వారా వృద్ధుల సంక్షేమం, పెన్షన్లు, ఇతర వైద్య అవసరాలు వంటివి ఇవ్వకుండా, ఒకవేళ ఇచ్చినా నెలకు వెయ్యి రూపాయల బిచ్చం వేయడం ద్వారా ఒక పెద్ద బాధ్యత నుండి వైదొలుగుతోంది. అంటే దేశ ఉత్పత్తికి జీవితాంతం చెమటా, రక్తం ధారపోసిన స్త్రీ పురుష శ్రామికులు వృద్ధాప్యంలో అనాధలవుతారు. కనీస అవసరాలకు కూడా కుటుంబంపై, ఇతరులపై ఆధారపడి ఛీత్కారాలు పొందుతారు లేదా ట్రాఫిక్‌ లైట్ల దగ్గర అడుక్కుంటారు. వీరంతా సాధారణంగా అసంఘటిత రంగం వారే. మళ్ళీ వీరి బరువును అసంఘటిత రంగంలోని వారి పిల్లలు… వారిలో కూడా స్త్రీలు భరించాలి. అంటే మరో అతి పెద్ద సామాజిక భద్రతను ప్రభుత్వం స్త్రీల వీపుపైన పడేస్తుంది.

ఇక ఇంటి చాకిరీ చూస్తే వేతన ఉపాధి రంగంలో స్త్రీలు బీడీ పనిని మాత్రమే ”పని”గా పరిగణించడం, వేతనం లేకుండా స్త్రీలు చేసే పనికి అసలు గుర్తింపూ, విలువా లేకుండా చేయటం, వీటిని భిన్నంగా అర్థం చేసుకోవాలనడం సరైనదేనా? వంటపని, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం లాంటి యింటికి అవసరమైన ఇతర పనులు… ఇవన్నీ అవసరమైన పనులే కదా మనిషి బతకడానికి. అటువంటప్పుడు ఇవి విలువ లేకుండా ఎలా ఉంటాయి? స్త్రీలు నీళ్ళు తేవడం, కట్టెలు సమకూర్చడం, పశువుల పోషణ, ఆహారం శుభ్రం చేయడం వంటి పనులన్నింటినీ సంబాళించకపోతే పురుషుడు ఎంతవరకు ఉద్యోగం / ఉపాధి చేయగలడు. వీటిలో చాలావాటికి అతను పనిచేసే ప్రదేశం బాధ్యత తీసుకుంటే (అంటే భోజనం వగైరాలు) ఎవరి దగ్గరయితే అతను పనిచేస్తాడో వాళ్ళు ఆ ఖర్చు భరించాలి. అంటే ప్రతి వ్యక్తికీ జీతభత్యం లేని వంట మనిషిగా భార్యను నియమించడం ద్వారా అతని శ్రమనే కాక అతని భార్య శ్రమను కూడా యజమాని దోపిడీ చేస్తున్నాడన్న మాట.

ఇంటిపని తేలికవడానికి నీరు లభించడం, వాషింగ్‌ మెషీన్లు, వాక్యూమ్‌ క్లీనర్లు వంటివి ఏర్పాటు చేయడం ద్వారా వ్యక్తిగత అవసరాలు తేలికవుతాయి. దీనికి ప్రభుత్వం అందరికీ మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. మెషీన్ల కొనుగోలు చేయగలిగే ఆదాయం కుటుంబాలు పొందాలి. ఇవన్నీ యజమానులు, ప్రభుత్వాలు చేయకపోవడం వలన, నిజానికి పనిగట్టుకుని చేయకపోవడంద్వారా స్త్రీల శరీరాలపై దాడిచేసి వారిని ఇంటికి కట్టు బానిసలుగా మారుస్తోంది. 80 శాతం మంది ఇంటి చాకిరీకి పరిమితమైన దేశం ఏ రకమైన పురోగతి సాధిస్తుంది? దీర్ఘకాలంలో ఇదే ఉత్పత్తికి గుదిబండగా మారుతుంది.

మన దేశంలో శ్రామిక స్త్రీలలో 93 శాతం మంది అసంఘటిత రంగంలో, గృహ పరిశ్రమల్లో, వ్యవసాయంలో, ఇతర వృత్తుల్లో స్వయం ఉపాధిలో ఉన్నారు. వీరంతా రోజుకి 15 నుండి 17 గంటలు ఇంటా, బయటా చాకిరీ చేస్తుంటారు. బయట చేసే చాకిరీకి తక్కువ వేతనం లభిస్తే ఇంటి చాకిరీకి ఏగుర్తింపూ ఉండదు. దాంతో ఒక శ్రామికుడు రోజుకి 8 గంటలో, 10 గంటలో నిర్దేశిత శ్రమ చేస్తే స్త్రీలు మాత్రం రెట్టింపు గంటలు పనిచేయాల్సి వస్తుంది. అంటే స్త్రీలు ఇంకా పరోక్షంగా 200 ఏళ్ళ నాటి 16-18 గంటల పనిదినాల్లోనే కొనసాగుతున్నారన్నమాట. దీనికి కుటుంబంలోని ఆధిపత్య సంబంధాలు తోడవడంతో పూర్తి అసమాన పని పంపకం జరుగుతోంది.

ఫలితంగా ఆహారం, ఆరోగ్యం, విద్య, వృత్తి నైపుణ్యాలలో స్త్రీలు వెనకబడతారు. తద్వారా కఠినమైన శారీరక శ్రమ అవసరమైన ఉపాధి మాత్రమే వారికి దిక్కవుతుంది. అంటే క్యాజువల్‌, కాంట్రాకు,్ట పీసురేటు పనుల్లో కుదేలైపోతారు. అతి తక్కువ వేతనాలకు పని చేయాల్సిన స్థితికి నెట్టబడతారు. ఇది వారి సామాజిక స్థాయిని బలహీనపరుస్తుంది. సాంస్కృతికంగా వెలికి గురవుతారు.

”ఇంటిపని మనసును వికానం చెందనీయని, నైపుణ్యం పెంచని, ఒంటరితనానికి గురిచేసే గానుగెద్దు చాకిరీ”గా లెనిన్‌ గుర్తిస్తారు. కాబట్టి ఇంటిపని స్త్రీలపై జరిగే పరోక్ష శ్రమ దోపిడీయే కాదు, వారిని ఏ మాత్రం ఎదగనీయని బండ పని కూడా. కాబట్టే వెనుజులా ప్రభుత్వం స్త్రీల ఇంటి పనిని స్థూల జాతీయోత్పత్తిలో భాగం చేయడానికి ఒక భారీ కసరత్తు ప్రారంభించింది. ఇంటి పనికి ఆర్థికంగా లెక్కల్లోకి వచ్చే విధంగా విలువ కట్టడం ప్రారంభించింది.

మన దేశంలో తామే స్వయంగా పిల్లల పెంపకం, వృద్ధుల సంరక్షణ, ఇంటి పని చేసే మహిళలు 61 శాతం, పిల్లల విషయంలో బంధువుల సహకారం పొందేవారు 22 శాతం, పెద్ద కూతురుకు చిన్నపిల్లలను సాకే బాధ్యత అప్పగించేవారు 18 శాతం, నర్సరీ సదుపాయం గలవారు 10 శాతం ఉన్నారు. పిల్లల కోసం మనుషుల్ని పెట్టుకునే వారు 13 శాతం ఉండగా భర్తలు పిల్లల పెంపకం చూసే కుటుంబాలు 0.2 శాతం ఉన్నాయి. (ఈ గణాంకాల్లో కొన్ని జవాబులు ఓవర్‌లోడ్‌ అవడంవల్ల శాతం తేడా ఉంటుంది.)

మొత్తం మీద వేతనం లేని స్త్రీల శ్రమ వాటా స్త్రీల శ్రమలో 85-92 శాతం ఉంటుందని ఒక అంచనా. ఇది స్థూల జాతీయోత్పత్తిలో 1/3 వంతు ఉత్పత్తి భాగంగా ఉంటుంది. నిజ వేతనాలు 20 శాతం కోతపడ్డాక కుటుంబ పోషణభారం తగ్గించుకోవడానికి స్త్రీలు చేస్తున్న వేతనం లేని శ్రమ గత దశాబ్దంగా బాగా పెరిగిపోయింది. ప్రభుత్వం సంక్షేమ పథకాలపై కోత విధిస్తోంది. రేషన్‌ సరుకులు, ఇతర పౌర సదుపాయాలపై కేటాయింపులు కుదించబడుతున్నాయి. ఇవి సామాన్యులపై ప్రత్యేకించి స్త్రీలపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. రేషన్‌పై కోత ద్వారా నష్టపోతున్న ఆదాయం పొదుపు చేయడానికి వారు మరింత కష్టపడతారు. ఉదా: కిరసనాయిలు లేదా గ్యాస్‌ సిలిండరు బదులు కట్టెలు, బొగ్గులు వాడుకోవడం. దీనికి కట్టెలు సమకూర్చాలంటే పట్టణాల్లో సాధ్యం కాదు. గ్రామాల్లో అటవీ చట్టాల వల్ల ఎండు పుల్లలు ఏరుకోవడానికి కూడా చాలా కష్టపడి దూరాలు తిరగాల్సిన పరిస్థితి. స్త్రీలను చేర్చుకున్న స్థానిక ”వనసంరక్షణా కమిటీ”ల్లో ఈ నిర్ణయాలు వేరుగా వుండడాన్ని మనం గమనించవచ్చు. ఒక పరిమిత పరిధిలో పుల్లలు ఏరుకోవడాన్ని, పశువుల మేత తీసుకోవడానికి అవి అనుమతినిస్తున్నాయి.

80 శాతం మంది పట్టణ స్త్రీలు, 62 శాతం మంది గ్రామీణ స్త్రీలు ఈ రకమైన ఇంటి పనుల్లో మునిగి తేలుతున్నారు. అంటే వీరు వేరే పనులేమీ చేయరని అర్థం కాదు. దాదాపు 60 శాతం మంది గ్రామీణ స్త్రీలు, 30 శాతం మంది పట్టణ స్త్రీలు ఊరికే లభించే ఇంధనం కోసం వెతుకులాటలో ఉంటున్నారు. ఆహార ధాన్యాలు బాగు చేయడం, దంచడం, విసరడం, శుభ్రం చేయడం, ఏరడం, ఎండబెట్టడం వంటివి అందరూ చేస్తున్నారు. ప్రత్యేకించి నాణ్యత లేని రేషన్‌ సరుకుల బాగులో 35 శాతం మహిళలు ఉంటున్నారు. కూరగాయలు పెంచడం, కోళ్ళు, పశువుల పని, పిడకలు చేయడం వంటివి గ్రామాలకే పరిమితమై లేవు. నాల్గవ వంతు పట్టణ స్త్రీలు కూడా ఈ పనులు చేస్తున్నారు. వీటన్నింటినీ అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక కార్యకలాపాలుగానే పరిగణిస్తున్నారు. ఎందుకంటే అవి స్త్రీలు చేయడంలేదు. కాంట్రాక్టు పనివారికి అప్పగించి చేయించడం వలన వాటి ఆర్థిక విలువ తెలిసివచ్చింది.

”ఇంటిలో అతి తక్కువ స్థాయిలో స్త్రీలు శ్రమ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడితేనే స్త్రీల విముక్తి సాధ్యమవుతుంద”ని ఎంగెల్సే అంటాడు. స్త్రీల శ్రమకి సామాజిక గుర్తింపు ఉండడం ఒక్కటే చాలదు. ఈ పనులు చేసినందుకు పరిహారం కూడా చెల్లించడం ద్వారానే దానికి విలువ ఏర్పడుతుంది. వేతన శ్రమ చేసేవారికి లభించే సదుపాయాలు పెన్షన్‌, ఇన్సూరెన్స్‌, కనీస ఆదాయం వంటివి వారికి కూడా ఉండాలి. ప్రస్తుత కాలంలో ఈ వేతనం లేని చాకిరీని తగ్గించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. కానీ ఆ పరికరాలు అందరికీ అందించాలి. అలాగే ప్రతి ఇంటికి తాగునీటి సరఫరా అందుబాటు స్త్రీలకు ఉన్న పనిగంటలు తగ్గిస్తుంది.

కానీ ఇంటి పనిభారం తగ్గించే వస్తువులు అసంఘటిత రంగ స్త్రీలదాకా చేరకపోవడం వలన వారి చాకిరీ తగ్గే అవకాశాలు కన్పించకపోగా వాతావరణ మార్పులు, వలసలు, సంక్షేమ పథకాల కోత, పడిపోతున్న ఉపాధి, తగ్గుతున్న నిజవేతనాలు, స్త్రీల కోణం పట్టించుకోని విధాన నిర్ణయాల వల్ల అసంఘటిత రంగపు స్త్రీల వేతనం లేని శ్రమ మరింతగా పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

ప్రపంచీకరణ నేపథ్యంలో స్త్రీల పరమవుతున్న దారిద్య్రం క్రమంగా ఆడపిల్లల భుజాల నెక్కడం కూడా కనబడుతోంది.

తల్లుల పనిభారం పెరిగేకొద్దీ దాన్ని పంచుకునే బాధ్యత ఆడపిల్లలదే. పాఠశాలల్లో బాలికల నమోదు పెరిగినప్పటికీ ఇంటి చాకిరీలో వేతనంలేని శ్రామికులుగా బాలికలు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇంటి వృత్తుల్లో 14ఏళ్ళ లోపువారు కూడా పని చేయవచ్చని బాలకార్మిక చట్టానికి సవరణ కూడా రావడంతో పరిస్థితి మరింత దుర్భరం కావచ్చు.

కాబట్టి మౌలిక వసతుల ఏర్పాటుపై కేటాయింపులు పెంచాలి. నీరు, పారిశుధ్యం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించాలి. రేషన్‌ కేటాయింపులు, ఇంధనం వంటి వాటిపై రాయితీలు పెంచాలి. పిల్లల సంరక్షణ, పెద్దల సేవ సామాజికం చేయాలి. నాణ్యమయిన సేవలు అందించాలి. పని ప్రదేశాలలో భోజన వసతులు వంటివి తప్పనిసరి చేయాలి. స్త్రీల వేతనం లేని ఉత్పత్తిలో భాగమయిన శ్రమను లెక్కించడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇంటి పనికి కూడా విలువ గట్టాలి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>