‘నీల్‌ బత్తే సన్నాట’ తమిళ్‌ ‘అమ్మా కరక్కు’ – వారాల ఆనంద్‌

నిల్‌ డివైడెడ్‌ బై సైలెన్స్‌ అంటే శూన్యాన్ని నిశ్శబ్దంతో భాగించడం. అంతేకాదు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎందుకూ పనికిరాని అనే అర్థం కూడా ఉంది. నిజానికి ఈ సినిమా మొదట హిందీలో ఆ తర్వాత తమిళంలో నిర్మించబడింది. రెండుచోట్లా విమర్శకుల చేత ప్రశంసలను, ఆర్థికంగా విజయాన్నీ అందుకుంది. హిందీలో చూసి తమిళ స్టార్‌ ధనుష్‌ ఈ సినిమాని తమిళంలో నిర్మించాడు. అమీర్‌ఖాన్‌, ధనుష్‌, ప్రకాష్‌రాజ్‌ వంటి ప్రముఖ స్టార్‌లు ముందుకువచ్చి అనేక మంచి చిత్రాలను నిర్మించడంతో పాటు కొన్నింటిని విడుదలయ్యేందుకు తోడ్పడుతున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఆ జ్ఞానం మన తెలుగు వాళ్ళకు ఎప్పుడు వస్తుందో చూడాలి.

కలల్ని కనాలి వాటిని నిజం చేసుకోవడానికి నిరంతరం కృషి చేయాలి అన్న అబ్దుల్‌ కలాం మాటల ప్రేరణతో నిర్మించినట్లుగా నీల్‌ బత్తే సన్నాట కనిపిస్తుంది. తన కూతురు భవిష్యత్తు గొప్పగా ఉండాలని కలలు గన్న ఒక తల్లి ఆ కలని సాకారం చేసుకునేందుకు పడ్డ కష్టం ఈ సినిమాకు మూలకథ. ఆ కలని దృశ్యీకరిస్తూనే తల్లీ కూతుళ్ళ మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం అంతర్లీనంగా కనిపిస్తుంది. సినిమా మొత్తం సాఫీగా సాగిపోయి ఫీల్‌ గుడ్‌ ఫిల్మ్‌గా ముగుస్తుంది.

అశ్వినీ అయ్యర్‌ తివారీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సమాజంలో ఎన్ని ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ ఎదగడానికి లక్ష్యం నిర్దేశం, అకుంఠిత దీక్ష కావాలని, అవి ఉన్నప్పుడు విజయం దాసోహమంటుందని ఈ సినిమా చెబుతుంది. చాలా అతి సాధారణంగా చిత్రీకరించబడి ఎలాంటి ఆడంబరాలు లేకుండా అశ్వినీ అయ్యర్‌ తీసిన ఈ సినిమాను పిల్లలు, తల్లిదండ్రులు తప్పక చూడాల్సిందే.

కథ విషయానికి వస్తే చందా తన కూతురు ఆపేక్ష (అప్పు) తో కలిసి ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. డాక్టర్‌ దివాన్‌ ఇంట్లో పనిచేయడంతోపాటు పలు అదనపు పనులు కూడా చేస్తుంది. అన్ని ఆశలూ కూతురిపైనే పెట్టుకున్న చందా కూతురు గొప్పగా చదువుకోవాలని, పెద్ద ఉద్యోగం సంపాదించుకుని సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలలని కోరుకుంటూ ఉంటుంది. అందుకోసం ఎంతయినా కష్టపడేందుకు సిద్ధంగా ఉంటుంది. డాక్టరో, ఇంజనీరో కావాలనుకుంటుంది. స్కూలు చదువును అర్థాంతరంగా మానేసిన చందా ఏమి చదివితే గొప్పవాళ్ళవుతారోనని ఆలోచిస్తూ తాను పనిచేసే డాక్టర్‌ దివాన్‌ను అడుగుతుంది. కానీ కూతురు అప్పు మాత్రం ఇలాంటి ఆలోచనలేవీ లేకుండా సరదాగా ఉండాలని, టీవీ చూడాలని, పెద్దయిన తర్వాత మహా అయితే మరో ఇంట్లో పనిమనిషిగా చేరాలని తలపోస్తూ చదువును నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంది. తల్లి మనసును అర్థం చేసుకోదు.

కూతురి ప్రవర్తన చూసి చందా దిగులుపడుతుంది. తన వేదననంతా డాక్టర్‌ దగ్గర వెళ్ళబోసుకుంటుంది. అప్పుడు దివాన్‌ ఆలోచించి చందాను కూడా స్కూల్‌లో చేరమని సలహా ఇస్తుంది. మొదట సంశయించినా డాక్టర్‌ సూచన మేరకు స్కూల్‌లో చేరడానికి చందా అంగీకరిస్తుంది. దివాన్‌ పలుకుబడితో అన్ని రూల్స్‌ను అధిగమించి చందాను పాఠశాలలో చేర్చుకుంటాడు హెడ్‌మాస్టర్‌. ఇక అక్కడినుంచి మొదలవుతుంది కథలో వేగం. తల్లి స్కూల్‌లో చేరడం అప్పుకు ఇష్టముండదు. గొడవ చేస్తుంది. తల్లిని స్కూల్‌ మానేయమంటుంది. చందా వినిపించుకోదు. క్లాసులో అప్పు తన కూతురు అన్న విషయం ఎవరికీ తెలియనట్లు ప్రవర్తిస్తుంది. తోటి విద్యార్థి సహకారంతో లెక్కలు, సైన్స్‌ వంటివన్నీ క్రమంగా నేర్చుకుంటుంది. మంచి మార్కులు రాని అప్పు ఇంట్లో తల్లితో గొడవపడుతుంది. ఇద్దరూ ఒప్పందం చేసుకుంటారు. కూతురు పరీక్షలో తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే తాను బడి మానేస్తానంటుంది. అప్పు బాగా కష్టపడి మంచి మార్కులు సాధించుకుంటుంది. కానీ తల్లి స్కూలు మానడానికే తాను కష్టపడి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నానని అనడంతో తల్లి నిర్ఘాంతపోతుంది. దాంతో తల్లి స్కూలు మానడానికి ఇష్టపడదు. కూతురుతో పోటీగా మరింత కష్టపడి ఎక్కువ సమయం చదువుకే కేటాయిస్తుంది. దాంతో తనకున్న చిన్న ఉద్యోగం కూడా పోగొట్టుకుంటుంది. డాక్టర్‌ దివాన్‌ ఆ ఊరు నుంచి బదిలీపై వెళ్ళిపోతారు. చందా హతాశురాలవుతుంది.

ఒకరోజు చందా కారు కింద పడబోతుంది. కిందికి దిగిన డ్రైవర్‌ ఆమెను మందలిస్తే కార్లోని వ్యక్తి కారు దిగి డ్రైవర్‌ను కోప్పడతాడు. అతన్ని చూసి కలెక్టర్‌ అని తెలుసుకున్న చందా అతని ఇంటికి వెళ్తుంది. బయట సెక్యూరిటీ గార్డులు లోపలికి అనుమతించరు. కానీ క్రమం తప్పకుండా ప్రయత్నించిన చందా ఒకరోజు కలెక్టర్‌ లోపలికి పిలవడంతో లోనికి వెళ్తుంది. ఏం సహాయం కావాలని కలెక్టర్‌ అడిగితే ఏమీ లేదు కలెక్టర్‌ కావడానికి ఏం చదవాలి, ఏ కాలేజీలో చేరాలని అడుగుతుంది. యూపీఎస్సీ పరీక్ష రాయాలని చెబుతాడు. ఇక తన కూతురు తప్పకుండా కలెక్టర్‌ కావాలని కోరుకుంటుంది. దాంతో చిన్న చిన్న పనులు చేయడం ప్రారంభిస్తుంది. తన చదువుకోసం జమ చేసిన డబ్బును అప్పు రహస్యంగా తీసుకుని తన స్నేహితులతో విందు వినోదాలకు ఖర్చు చేస్తుంది. అది తెలుసుకున్న తల్లి కూతురును నిలదీస్తే నువ్వు ఏ పని చేస్తున్నావో తెలుసు, ఎట్లా సంపాదిస్తున్నావో తెలుసు అని వాదనకు దిగుతుంది. దాంతో తల్లి ఖిన్నురాలవుతుంది. విషయం తెలుసుకున్న ఆమె సహ విద్యార్థి అప్పును తీసుకువెళ్ళి ఆమె తల్లి ఎలా కష్టపడుతోందో చూపిస్తాడు. ఆమె అప్పు తల్లి అన్న విషయం తామందరికీ తెలుసని చెబుతాడు. కేవలం తన మంచికోసం, తనను గొప్పగా చదివించడం కోసమే తల్లి కష్టపడుతోందని తెలుసుకున్న అప్పులో పశ్చాత్తాపం కలుగుతుంది. తన తప్పు తెలుసుకుంటుంది. కష్టపడి బాగా చదవాలని నిర్ణయించుకుంటుంది. తల్లితో ప్రేరణ పొందిన అప్పు బాగా చదివి యూపీఎస్సీ పరీక్షలకు హాజరవడంతో సినిమా ముగుస్తుంది.

ఇందులో చందా పాత్రలో తెలుగమ్మాయి స్వరభాస్కర్‌ అద్భుతంగా నటించింది. అప్పుగా రియా, ప్రిన్సిపాల్‌గా పంకజ్‌ త్రిపాఠి నటన సినిమాకు ఆయువుపట్టుగా నిలుస్తుంది. సరళంగా సాగిన స్క్రీన్‌ ప్లే, హృద్యంగా జరిగిన చిత్రీకరణ సినిమాను నిలబెట్టాయి.

బిడ్డకోసం తల్లి కన్న కలను సాకారం చేసేందుకు ఆమె చేసిన కృషి అద్భుతంగా ఆవిష్కృతమయిందీ సినిమాలో. తల్లిదండ్రులూ, పిల్లలూ తప్పక చూడాల్సిన సినిమా. హిందీలో ‘నీల్‌ బత్తే సన్నాట’ తమిళంలో ‘అమ్మా కరక్కు’.

 

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో