రాణి ఝాఁశీ లక్ష్మీబాయి – భండారు అచ్చమాంబ – సరళీకరణ: పి.ప్రశాంతి

(గత సంచిక తరువాయి…)

ఆ యుద్ధ సమయంలో రాణిగారు సైన్యమంతటిపైన తన దృష్టిని సారిస్తూ అక్కడున్న లోపాలను సరిచేస్తూ, సైనికులకు అనేక బహుమానాలిస్తూ, యుద్ధ ధర్మాలను తెలుపుతూ, వారిని యుద్ధానికి ఉరికొల్పి వారి మనసుల్లో వీరరసం ఉద్భవింపచేస్తుండేది. అప్పుడామె ఎంతో జాలితో వచ్చిన వారికి ఆమె సమక్షంలోనే చికిత్స చేయిస్తుండేది. అప్పుడామె అత్యంత జాలితో వారిపై నుండి తన హస్తాన్ని త్రిప్పగా ఆ సైనికులు అధికావేశ పరవశులై యుద్ధం చేయడానికి ఉరకలు వేసేవారు. ఇటువంటి స్త్రీ రత్నాలు జన్మించడం వలననే కదా స్త్రీలకు, పురుషుల్ని పోలిన ధైర్యసాహసాలు కలవని అందరికీ తెలిసింది.

ఇలా 30వ తేదీవరకు యుద్ధం జరిగినా ఆంగ్లేయుల బలగాలు రాణిగారి కోటను ఛేదించలేకపోయారు. ఈ యుద్ధంలో వారి యుద్ధ సామగ్రి అంతకంతకు తక్కువవటం వలన వారు విజయం పట్ల అంతగా నమ్మకంతో లేరు. ఇంతలో నానాసాహెబ్‌ (ఈయన రెండవ బాజీరావు దత్తపుత్రుడు. 1857వ సంవత్సరపు సిపాయి తిరుగుబాటుకు ఇతడే కర్త. ఇంగ్లీషు వారి దగ్గర్నుండి తన పూనా రాజ్యాన్ని మరల సంపాదించాలని ఇతని ప్రయత్నం) పేష్వా యొక్క సేనా నాయకుడైన తాత్యాటోపే అనే వీరుడు లెక్కకు మించిన సైన్యంతో రాణిగారికి తోడ్పడడానికి కాల్పీ నుండి వస్తున్నాడు. సైన్యం చాలా దూరంలో ఉండగానే ఆంగ్లేయ సేనా నాయకులు దూరదర్శక యంత్రంలో చూశారు. అంతట అగ్నిదేవుడికి వాయుదేవుడు తోడైనట్లు ఈ రాణిగారికి ఆ సైన్యం వచ్చి తోడైతే మనం గెలవటం అసాధ్యం అనుకున్నారు. సర్‌ హ్యురోజ్‌ దొర ఎంత మాత్రం జంకక ఇక్కడ రాణిగారితో పోరాడడానికి కొంత సైన్యాన్ని నియమించి కోటలోని వారికి తెలియకుండా కొంత సైన్యాన్ని కాల్పీవైపు పంపాడు. వారు వెళ్ళి ఆ దారిలో వస్తున్న సైన్యాలతో పోరాడి తమ యుద్ధ సామర్ధ్యంతో వారిని పారద్రోలారు. తాత్యాటోపే ఆంగ్లేయ సైన్యాల ధాటికి తట్టుకోలేక తమ యుద్ధ సాహిత్యాన్ని అక్కడే వదిలి పలాయనమయ్యారు. దానితో ఆ సాహిత్యం అనాయాసంగా దొరికినందున సర్‌ హ్యురోజ్‌ గారి బలగాలు మిక్కిలి ఉత్సాహవంతులయ్యారు. వారికి ఇదివరకు గల అధైర్యమంతా అడుగంటిపోగా శత్రువులపై అధికోత్సాహంతో తప్తగోల వర్షం కురిపించసాగారు.

ఏప్రియల్‌ 1వ తేదీ వరకు యుద్ధం చేసినా తాము పురప్రవేశం చేయలేకపోవడానికి చాలా చింతించి సర్‌ హ్యురోజ్‌ దొరగారు తమ బుద్ధిప్రావీణ్యంతో ఆ రోజే ఆ ఖిల్లాను చేరుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆయన తదనుసారంగా బలగాలను పంపగా వారు కూడా అత్యంత ఉత్సాహంతో శత్రుపక్షం నుండి వచ్చే బాణాలను తప్పించుకుని గ్రామ ద్వారాల నుండి, కోటగోడ నుండి పట్టణంలోకి జొరబడసాగారు. తాత్యాటోపే గారి పరాభవాన్ని విని రాణిగారి సైనికులు బాగా నిరుత్సాహులయ్యారు. అయినా యుద్ధంలో చనిపోగా మిగిలిన వారికి రాణిగారు తమ మాటలతో శౌర్యాన్ని పుట్టించి యుద్ధం నడుపుతున్నారు. 3వ తేదీన తమని ఎదిరించే వారు లేక హూణబలగాలు పురమంతట వ్యాపించాయి. 4వ తేదీన పట్టణమంతా వారి స్వాధీనం అయింది.

తాను ఇన్ని రోజులు చేసిన శ్రమ వృధా అయిపోయి శత్రువులు తన నగరాన్ని ఆక్రమించుకోవటం చూసి రాణిగారు చాలా విచారపడ్డారు. కానీ ఆమె అప్పుడు కూడా ధైర్యాన్ని విడవక కర్తవ్యాన్ని ఆలోచించి విజయోత్సాహంలో ఉన్న శత్రువులు ఇక తన ఖిల్లాను ఆక్రమించి తనను బంధిస్తారని చూసి ఆమె ఎలాగైనా యుద్ధంలో ప్రాణాలు విడవాలని నిశ్చయించుకుంది. అంతట ఆమె పురుష వేషంతో బయలుదేరడానికి నిశ్చయించుకుని తన దత్తపుత్రుడి పట్ల అధిక ప్రీతి గలది కాబట్టి ఆ చిన్నవాడిని తన వీపుకు కట్టుకుని గుఱ్ఱమెక్కి 4వ తేదీ రాత్రి కొద్దిమంది సైన్యంతో ఆంగ్లేయ సైన్యంతో పోరాడుతూ దానిని పాయగా చీల్చుకుని కాల్పీ మార్గానికి వెళ్ళింది.

రాణిగారు తమ సైన్యం నుండి కాల్పీ మార్గానికి వెళ్ళిన సంగతిని విని సర్‌ హ్యురోజ్‌ దొరగారు అత్యంత ఆశ్చర్య చకితులయ్యారు. ఆయన అంతటితో ఊరుకోక ఒక సేనా నాయకుని కొంత సైన్యంతో పాటు ఆమెను వెంబడించడానికి పంపారు. కానీ రాణిగారు వారికి కనబడకుండా తన గుర్రాన్ని అతి వేగంగా నడుపుతుండేది. పుట్టినప్పట్నుండి యుద్ధమనే మాట ఎరుగక సదా రాణివాసమందే నివశించిన బ్రాహ్మణ వితంతువు వీరులకు అభేద్యమైన హూణసైన్యాన్ని ఛేదించుకుని క్షణంలో అదృశ్యమవటంపై ఎవరు ఆశ్చర్యపడకుండా ఉంటారు?

మహారాణి లక్ష్మీబాయి గారు ఆ రాత్రి బయలుదేరి తనను పట్టుకోడానికి వచ్చిన వారికి కనపడకుండా సూర్యోదయ సమయానికి ఝాఁశీ సంస్థానానికి సరిహద్దైన భాండేర అను గ్రామంలో ప్రవేశించింది. అక్కడ ఆమె గుర్రం దిగి కొడుకుకి ఫలహారం పెట్టి మరల అశ్వాన్ని అధిరోహించింది. ఇంతలో ఆంగ్లేయ సైన్యాధిపతి కొంత సైన్యంతో తనని పట్టుకోడానికి వచ్చాడని వినింది. ఆ సమయంలో ఆమె వద్ద 15 మంది శూరులు తప్ప వేరే సైన్యం లేదు. అలా అయినా ఆ శూర శిఖామణి జంకకుండా తన ఖడ్గాన్ని ఒరనుండి తీసి యుద్ధానికి సన్నద్ధురాలై వెళ్తోంది. ఇంతలో ఆ సైనికులు ఆమెని ముట్టడించారు. కానీ ఆమె తన యుద్ధ నైపుణ్యంతో ఆ సైనికులను చీకాకుపరచి కొందర్ని యమలోకానికి పంపి క్షణంలో అదృశ్యమయింది. పెద్ద సైన్యంతో ఉన్న ఆంగ్లేయ సేనాధ్యక్షుడ్ని స్వల్ప సైనికులతో ఒక అబల ఓడించి పంపటం ఎంతో వింతగదా! అక్కడ్నుంచి బయలుదేరి ఆ రాత్రి ఆమె కాల్పీ నగరంలో నానాసాహెబ్‌ వద్దకు చేరింది. ఇలా నిద్రాహారాలు లేక ఆమె గుర్రంపై 108 మైళ్ళు ప్రయాణం చేసింది. దీనిని బట్టి చూడగా ఆమె ధైర్యము, గుర్రపు స్వారీ చేయగల శక్తి అందరికి అత్యద్భుతమని అనిపించక మానదు.

రాణి లక్ష్మీబాయి గారు కల్పీకి వచ్చిన సంగతి విని బందేవాలా నవాబు సైతం తన సైన్యంతో రావుసాహెబ్‌ పేష్వాగారికి తోడయ్యాడు. వీరందరు తమ సైన్యాలను యుద్ధ సన్నద్ధం చేయసాగారు. రాణిగారి శౌర్యం తెలిసి కూడా రావుసాహెబ్‌ పేష్వాగారు తనకు గల స్వాభిమానంవల్ల తన సర్వసేనాధిపత్యాన్ని ఒక స్త్రీకి ఇవ్వడానికి సమాధానపడలేకపోయాడు. దీనితో రాణిగారు కొంతవరకు యుద్ధంలో నిరుత్సాహురాలై ఉన్నారు.

సర్‌ హ్యురోజ్‌ దొరగారు ఝాఁశీ నుండి బయలుదేరి కాల్పీని గెలవడానికి సైన్య సమేతంగా రాత్రీపగళ్ళు ప్రయాణం చేస్తూ కాల్పీ సమీపంలోని కూచ అనే గ్రామం వద్ద పేష్వాగారి సైన్యాన్ని ఎదిరించి క్షణంలో ఓడించారు. కనుక పేష్వా, బందే సంస్థానపు నవాబు మొదలగువారితో రాణిగారు కాల్పీకి వెళ్ళవలసి వచ్చింది. ఆ సమయంలో ఆమె తన సైన్యం లేనందున పేష్వాగారు ఆమెను మన్నించనందువలన ఈ యుద్ధంనందు ఆమె ప్రతాపమేమీ తెలిసింది కాదు. కానీ కాల్పీకి వెళ్ళిన తర్వాత ఆమె సైన్యం బందోబస్తు గురించి తన అభిప్రాయం పేష్వాగారికి తెలిపింది. అప్పుడతడు లక్ష్మీబాయి గారి తెలివిని చూసి తాత్యాటోపేని, లక్ష్మీబాయిని సర్వసైన్యాధిపత్యానికి నియమించాడు. ఆపై వారిద్దరూ చక్కటి దక్షతతో సైనికులకు యుద్ధం నేర్పుతుండేవారు. ఇంతలో ఆంగ్లేయ సైన్యాలు కాల్పీ నగరాన్ని నాలుగు ప్రక్కలా ముట్టడించాయి. అప్పుడు రెండు వందల గుర్రపు బలగాన్నిచ్చి యమునానది వైపున యుద్ధం చేయడానికి రాణిగారిని పంపారు. ఆమె కూడా మిగిలిన సైన్యం అత్యంత జాగ్రత్తగా ఉండడం చూసి తన స్థానానికి వెళ్ళింది. కానీ యుద్ధమందు అసమాన ప్రజ్ఞగల హూణ సైన్యాలు అల్పకాలంలోనే పేష్వాగారి సైన్యాలను ఓడించారు. అది చూసి రావు సాహెబ్‌ పేష్వా మొదలైనవారు అత్యంత విచారంలో మునిగిపోగా రాణిగారు వారికి ధైర్యపు మాటలు చెప్పి తన స్వల్ప సైన్యంతో శత్రువులను చీకాకు పరచింది. కానీ వెనకనుండి వస్తున్న శత్రు సైన్యాల వలనను, తమ సైన్యంలోని ఇతర సేనాధిపతులు పారిపోవడం వలనను రాణిగారు యుద్ధం నుండి తప్పుకోవలసి వచ్చింది.

ఇలా కాల్పీయందు అపజయం పొందిన ఈ ప్రముఖులందరూ గ్వాలేరు (గ్వాలియర్‌) వైపున కల గోపాలపురం చేరి ముందు ముందు చేయాల్సిన దాని గురించి ఆలోచన చేస్తుండేవారు. వారెంత ఆలోచించినా సైన్యం అతి స్వల్పమవడంతో యుద్ధం చేయడానికి తోచేది కాదు. రాణిగారు కూడా వారితోనే ఉంది కాబట్టి ఆమె ఆ స్వల్ప సైన్యంతో గ్వాలేరుకి వెళ్ళి సిందేే గారిని తమకు తోడ్పడాల్సిందిగా వేడుకోవాలని, అందుకాయన ఒప్పుకోని యెడల యుద్ధం చేయాలని ఆలోచన చెప్పింది.

ఆమె చేసిన ఆలోచనకే పేష్వాగారు అంగీకరించి పగలు ప్రయాణం చేస్తూ 1858వ సంవత్సరం మే నెల 30వ తేదీన గ్వాలేరుకు సమీపంలో ఉన్న మురారిపురం వద్దకు చేరారు. అంతట వారంతా ఆలోచించి సిందే గారిని తమకు సహాయపడాలని వర్తమానం పంపారు.

ఆ వార్త సిందేగారి దర్బారుకి చేరగా అదివరకు తాత్యాటోపే బోధలవలన అతనికి వశులైన సర్దార్లందరూ పేష్వాగారికి సహాయం చేస్తామని చెప్పారు. కానీ ప్రభుభక్తి గల జయాజీరావు సిందేగారు, దివాను దినకరరావు గారు, వారి మాటలను లెక్కజేయక ఎంతో యుక్తితో మరుసటి రోజు పేష్వా సైన్యాలను పారద్రోలాలని నిశ్చయించుకున్నారు. కానీ రాత్రి దివాను గారు లేని సమయంలో ఎవరో మహారాజు గారిని యుద్ధానికి ఉసికొల్పారు. అంతట ఆయన తనకి అత్యంత విశ్వాసపాత్రులైన సైన్యాన్ని తీసుకుని సూర్యోదయ సమయానికి మురారికి ముందు రెండు మైళ్ళ దూరంలో గల బహదూర్‌పురం నందు తన దండుని నిలిపి యుద్ధం ప్రారంభించాడు. మొట్టమొదట పేష్వా సైన్యంపై పడే గుండ్లను చూసి సిందే పూర్వం పేష్వాల బంటు అవటం వలన తమకు అనుకూలంగా తమని ఎదుర్కోవడానికి వస్తున్నాడని తలచారు కానీ ఆ బాణ వృష్టి అంతకంతకు ఎక్కువ అవటం వలన పేష్వా మొదలైన పురుష శ్రేష్టులందరూ నిశ్చేష్టులై ఏమీ తోచకుండా ఉన్నారు. కాని వారు తాము చెప్పినట్లే సైన్యపు బందోబస్తు చేయకున్నా, కోపగించుకోక రాణీ లక్ష్మీబాయిగారు తగిన ఆలోచన చేసి యుద్ధం ప్రారంభించింది. అందువలన ఆ రెండు సైన్యాలూ కొంతవరకు సమానంగా పోరాడిన తర్వాత సిందే సైన్యాలకే గెలుపు దొరికేలా అయ్యింది. అది చూసి రాణిగారు ధైర్యంతో కొందరు అశ్వికులను తీసుకుని సిందే గారి ఫిరంగీలపై అకస్మాత్తుగా పడి మహా ఘోరంగా పోరాడటంతో సిందే సైనికులు పారిపోసాగారు. అది చూసిన తాత్యాటోపే సైనికులు మరింత ఉత్సాహవంతులై శత్రు సైన్యాలను అదలించసాగారు. కనుక సిందేగారి పరాక్రమమంతా వృధాపోగా అతడు, దివాన్‌ దినకరరావు మరికొందరు సర్దార్లతో తనకు సహాయులవ్వమని అడగడానికి గాను ఆగ్రా ఖిల్లాలో ఉన్న ఆంగ్లేయుల వద్దకు వెళ్ళాడు. పెద్ద సైన్యంగల ఒక యువకుడైన రాజుని అల్ప సైన్యంగల ఒక అబల తన శౌర్యంతో పారద్రోలింది. ఇందువలననే ఒక కవి ఇలా వ్రాశాడు:

‘క్రియాసిద్దిః సత్యే భవతి మహతాం నోపకరణే’

(గొప్పవారి కార్యసిద్ధి వారి పరాక్రమం వలననే అవుతుంది; కేవలం సామాగ్రి బలం వలన కాదు)

సిందే గారు నగరం విడిచి వెళ్ళిన తర్వాత అతని రాణివాసపు స్త్రీలందరూ ఆత్మసంరక్షణ కోసం నరవర అనే నగరానికెళ్ళారు. వీరందరు బయలుదేరి కొంతదూరం వెళ్ళిన తర్వాత సిందే శత్రువులచేత చిక్కాడని విని గజరా అనే ఒక స్త్రీ చేతిలో ఖడ్గం ధరించి రాజభవనానికి వచ్చి రాజు సురక్షితంగా వెళ్ళిన వార్త విని వెనుదిరిగి వెళ్ళింది. ఆహా ఈ స్త్రీ యొక్క ధైర్యం అసామాన్యం కదా?

రాజు పారిపోయిన తర్వాత సకల సైన్యాలు తమకు అనుకూలమయినందున పేష్వా గారికి నగరంలో ప్రవేశించడానికి ఎంత మాత్రం కష్టం కాలేదు. పేష్వా గారు అంతటితో తాము సార్వభౌములమయ్యామని తలచి పట్టాభిషేక మహోత్సవం కావించుకుని బ్రాహ్మణ సంతర్పణలు చేయసాగారు. లక్ష్మీబాయి ఇవన్నీ రాజ్యనాశన హేతువులని, ఈ ఆడంబరాలు వదిలి సైన్యపు బందోబస్తు చక్కగా చేసి యుద్ధసన్నద్ధులై ఉండాలని చెప్పింది. కానీ అవి స్త్రీ వాక్యాలని పేష్వాగారు, ఆయన సేనా నాయకుడైన తాత్యాటోపే గారు ఒప్పుకోక మహోత్సవములతోను, బ్రాహ్మణ సంతర్పణలలోను మునిగి ఉన్నారు.

జూన్‌ నెల 19వ తేదీన సర్‌ హ్యురోజ్‌గారు సైన్యంతో సహా బహద్దరు పట్టణానికి చేరారు. కానీ భోగపరాయణుడైన పేష్వాగారికి ఆ సంగతే తెలియలేదు. ఆంగ్లేయ సేనా నాయకులు అక్కడ్నుంచి మురారీకోట చేరుకున్నారని విని కూడా పేష్వాగారు ఆలోచన తప్పి పుణ్యకృత్యాలు చేస్తూనే ఉన్నారు. ఆయన ఆజ్ఞ తీసుకుని తాత్యాటోపే సైన్య వ్యవస్థ చేసే రీతి కనబడక లక్ష్మీబాయిగారిని వేడుకున్నాడు. జయం కలిగే ఆశ లేదని తెలుసుకుని రాణిగారు యుద్ధంలో మరణిించి స్వర్గం చూడాలని ఆశించి ఆయన మనవిని అంగీకరించింది. తదనంతరం ఆమె కొంత సైన్యాన్ని చక్కబరచి మిగతా ఇతర సేనానాయకులను చూడడానికి నియమించింది. ఆమె తన సేనని అనేక భాగాలుగా విభజించి ఎంతో జాగ్రత్తగా యుద్ధానికి సన్నద్ధురాలై నిలిచింది. ఇతర సైన్యాధిపతులు కూడా తమ తమ శక్త్యానుసారంగా వ్యూహాలు పన్ని నిలిచారు. రాణిగారు గ్వాలేరు తూర్పుదిక్కును సంరక్షిస్తానని తన సైన్యాన్ని అక్కడే మోహరించి నిలిచారు.

17వ తేదీన బ్రిగేడియర్‌ స్మిథ్‌ అను సైన్యాధిపతి గ్వాలేరు తూర్పుదిక్కున ఉన్న సైన్యాలపై బాణవృష్టి కురిపించసాగాడు. అది రాణిగారు బలగం అవటం వలన ఆ సైనికులు ఇంగ్లీషువారి బలగాలను ఆ రోజు ధైర్యంతో ఎదుర్కొని నిలిచారు. రెండోరోజు లక్ష్మీబాయిగారి వీరోత్సాహ వచనాలవలన ఆ సైన్యాలు శత్రు బలగాలను పొడిచి తాము కూడా మృతులవుతున్నారు. లక్ష్మీబాయిగారి శౌర్యం చూసి ఎంతో ఆశ్చర్యపడి ఆమెను ఓడింప నిశ్చయించుకున్నారు. ఇలా వారు నిశ్చయించి నలుదిక్కుల నుండి ఆమె సైన్యంపైన బాణపరంపరలు కురిపించడంతో ఆ సైన్యాలు నిలువలేక పారిపోసాగారు. ఇలా తన ముఖ్య సేవకులు కొందరు తప్ప అందరూ తనని విడిచినందున, అంతకుముందే ఇతర సేనాధిపతులు అపజయం పొంది పారిపోయినందున లక్ష్మీబాయి తన ఖడ్గబలంతో శత్రుసైన్యాలలోని అనేకమంది శూరులను పొడుస్తూ ఆవలకు పోతోంది. ఇలా ఆమె బహు దూరం వెళ్ళిన తర్వాత ఆమెతో పురుష వేషం ధరించి ఉన్న ‘ముందర’ అను దాసి యొక్క అంతిమ శబ్దం ఆమె చెవిన పడింది. అందువలన ఆమె వెనక్కి తిరిగి తన ప్రియ దాసిని చంపిన వానిని యమపురానికి పంపి ముందుకు సాగింది. ఇలా ముందు అతి త్వరగా

వెళ్తుండగా ఒక జలప్రవాహం అడ్డు వచ్చినందున, అనేక గాయాలతో క్షీణించి వున్న ఆమె గుర్రం ఆ ప్రవాహాన్ని దాటలేక నిలబడిపోయింది. లక్ష్మీబాయిగారు ఆ గుర్రాన్ని అవతలి ప్రక్కకు తీసుకునిపోడానికి ప్రయత్నించింది. కాని ఆ పని సిద్ధించలేదు. ఇంతలో శత్రుసైనికులు కొందరు ఆమెను చేరుకోబోగా ఆ యువతి గొప్ప శౌర్యంతో వారిలో అనేకమందిని మట్టుపెట్టింది. వారు అంతమంది, ఆమె ఒంటరి కావడంతో వారిలో ఒకడు ఆమె కత్తికి జంకక పక్కగా నిలిచి ఆమె తల కుడివైపుగా నరికాడు. బంధింపబడిన సింహాన్ని మత్తగజం ఆడినట్లు ఆ భటుడు చేసిన కత్తివేటు వలన ఆమె తల కుడివైపంతా తెగిపోయి రక్తం ప్రవహించసాగింది. ఇంతలో ఆ అశ్వికుడు తన ఖడ్గం రాణిగారి పొట్టలో గ్రుచ్చాడు. పురుషవేషంలో

ఉండటం వలన ఈమె రాణిగారని పగవారు గుర్తించలేకపోయినా, శత్రుపక్షంలో ఒకానొక సైన్యాధిపతి అయ్యుండొచ్చని వారికన్పించింది. ఈ దెబ్బతో రాణిగారు ఆపన్నస్థితిని పొందారు. కాని ఆ వీర యువతి అటువంటి సమయంలోనూ ధైర్యం వీడక తనని ఆ స్థితికి తెచ్చిన ఆ అశ్వికుని పరలోకానికి పంపింది!

ఇలా ఆమె వానిని చంపి బొత్తిగా శక్తిహీనమైపోయింది. అంతవరకూ ఆమెను విడవకుండా ఉన్న రామచంద్రరావు దేశ్‌ముఖ్‌ సగం ముఖం కోయబడిన రాణిగారిని శత్రువుల చేతిలో పడకుండా సమీపంలో ఉన్న పర్ణకుటీరం లోనికి తీసుకువెళ్ళాడు. ఆయన ఎంతో దుఃఖించి రాణిగారికి ఉపచారాలు చేయసాగాడు. కాని 1858వ సంవత్సరం జూన్‌ నెల 18వ తేదీన అద్వితీయ శౌర్యగుణ మండితురాలైన ఝాఁశీ మహారాణి లక్ష్మీబాయిగారు ఈ లోకాన్ని విడిచి శాశ్వత సుఖప్రదమైన లోకానికి వెళ్ళిపోయారు! రామచంద్రరావు దేశ్‌ముఖ్‌గారు రాణిగారి ఆజ్ఞ ప్రకారం ఆమె శరీరం శత్రువుల చేతిలో పడకుండా రహస్యంగా అగ్ని సంస్కారం చేశారు.

ఆ తర్వాత ఆ యుద్ధంలో విజయం పొంది ఆంగ్లేయ సేనాధిపతులు సిందే గారికి మరల రాజ్యాన్నిచ్చారు. తదనంతరం ఆ సేనా నాయకులు క్రమంగా బందిపోటు వారిని అణచి క్రమంగా తాత్యాటోపేను, ఇతర సైన్యాధీశులను ఉరితీయించారు. బందేవాలా, నవాబు శరణుజొచ్చి క్షమాభిక్షకు పాత్రుడయ్యాడు!

రాణిగారి దత్తపుత్రుడు తల్లి అనంతరం అనేక కష్టాలనుభవించి ప్రస్తుతం నెలకు యాభై రూపాయల జీవనంతో సామాన్య మానవునిలా ఇండోరు పట్టణంలో కాలం గడుపుతున్నాడు.

లక్ష్మీబాయి ఇంగ్లీషువారితో పోరాడినప్పటికీ అనేకమంది ఆంగ్లేయులు ఆమె శౌర్యాతి శయాలను అనేక రీతుల కొనియాడారు. వాటిలో కొన్నిటిని ఇక్కడ ఉదహరించుచున్నాను ః-

1) రాణిగారికి ప్రతిపక్షియై ఆమెను ఓడించిన సర్‌ హ్యురోజ్‌ సైన్యాధిపతే ‘గుణేగుణంతే’ అన్న న్యాయంతో రాణిగారి గురించి ఇలా వ్రాసాడు.

”రాణి లక్ష్మీబాయి యొక్క అత్యున్నతమైన కులీనత వలనను, ఆమె ఆశ్రిత జనుల విషయంలో మరియు సైనికుల విషయంలో చూపిన అపారమైన ఔదార్యం వలనను గొప్ప గొప్ప సంకట సమయాల్లో చలించని ధైర్యం కలిగినదైనందున, సైనికులలో ఆమెను గురించి పూజ్యభావం పెరిగి ఆమె పోరు మాకు భయంకరమయ్యింది”.

”గ్వాలేరులో జరిగిన యుద్ధం యొక్క గొప్ప పరిణామం ఝాఁశీ రాణి యొక్క మృత్యువు. ఆమె అబల అయినా మాతో తిరగబడిన వారిలో అతి శూరురాలు, అత్యుత్తమ సేనాధిపతి అయి ఉండింది”.

2) ”ఆ యుద్ధంలో అత్యంత దృఢనిశ్చయాన్ని, తేజాన్ని, జనానురాగాన్ని కలిగి ఉన్న సైన్యాధ్యక్షురాలయిన ఝాఁశీరాణి చంపబడింది” – డాక్టర్‌ లో.

3) ” లక్ష్మీబాయి యుక్తవయస్సులో (నడితారుణ్యంలో) ఉండినందున అత్యంత సుందరంగా ఉండేది. ఆమె మనసు

ఉత్సాహపూర్ణంగాను, శరీరం గొప్ప శక్తివంతంగా ఉండేది. ఆమెలో ప్రాణం పోయినా చింతలేదు కాని, మానహాని సహింపనన్న అభిమానం ఉండేది” – మార్టిన్‌ దొర

4) ”ఏ స్త్రీని రాజ్యతంత్రం నడపడానికి అసమర్ధురాలని యెంచి, మేము రాజ్యభ్రష్ఠనుగా చేసామో ఆ స్త్రీయే ప్రచండ సైన్యం యొక్క ఆధిపత్యాన్ని స్వీకరించడానికి సంపూర్ణంగా సమర్ధురాలని మాకు ఇప్పుడు తెలిసింది”. – ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌ దొర.

5) ”శత్రువులలో అత్యుత్తమ మనీషి ఝాఁశీ యొక్క మహారాణియే” – జస్టిస్‌ మ్యాకర్తి దొర.

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.