సుప్రీంకోర్టు నుండి స్టే-ఆర్డర్‌ రమణిక గుప్తా – (అనువాదం: సి. వసంత)

ఆ రోజుల్లో నా కూతురు షీబా సిబల్‌ ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీసు చేసేది. ఈ మధ్యన చండీగఢ్‌లో పేరున్న లాయర్‌, నాకు పాత మిత్రుడు అయిన హీరాలాల్‌ సిబల్‌తో ఆమెకు పరిచయమయింది.ఆయన కొడుకు కపిల్‌ సిబల్‌ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్‌ చేయడానికి అమెరికా నుండి భారతదేశానికి తిరిగివచ్చాడు. షీబా ఆయన దగ్గర జూనియర్‌గా పనిచేయాలని నిర్ణయించాము. నేను విస్థాపితులైన రైతులు, ఆదివాసీల విషయం చర్చించాను. వాళ్ళకి న్యాయం జరిపించడానికి సుప్రీంకోర్టులో కేసు నడిపించాలని సూచించాను. ఆయన స్వయంగా ఢిల్లీ వచ్చి నా కేసును ఎటువంటి ఫీజు లేకుండా వాదించాలని కపిల్‌ సిబల్‌తో చెప్పారు. కేవలం టైపింగ్‌కి, కోర్టు ఖర్చులకి మాత్రమే మేము ఖర్చు పెట్టాలి. వెనక్కి వచ్చాక తోపా తొయరా, తాపిన్‌, ఆరాల ఆదివాసీలు కర్‌మాలీ, మహతో, గంజా మొదలైన వారి చేత సంతకాలు పెట్టించి అప్లికేషన్‌ను 1980-81లో ఇచ్చాము. అందులో కోల్‌ ఇండియా, సి.సి.ఎల్‌.తో పాటు బీహారు ప్రభుత్వాన్ని కూడా పార్టీగా తీసుకున్నాము. ఆ రోజుల్లో భగవతీ గారు సుప్రీంకోర్టులో జడ్జిగా ఉండేవారు. నేను జైలు నుండి పంపిన అపీలు కూడా ఆయనకు అందింది.

కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసే సమయంలో వాళ్ళిచ్చిన ఆదేశాలను స్పష్టపరుస్తూ ఎక్కడైతే ప్రణాళికను అమలు చేస్తారో అక్కడి విస్థాపితులకు, ఆ గ్రామస్థులకు ఉపాధి కల్పిస్తామని చెప్పారని, ఈ విషయంలో న్యాయం చేకూర్చమని ఉద్యోగాలు, పునరావాసం ఏర్పాటు చేయాలని కోరుతూ నేను సుప్రీంకోర్టులో కేసు వేశాను. మేము కోల్‌ బేరింగ్‌ ఏరియా యాక్ట్‌ను ఛాలెంజ్‌ చేశాము. ప్రభుత్వం భూ సేకరణ కోసం పోలీసుల సహాయం తీసుకుని గ్రామస్థులను అక్కడినుంచి తొలగించే హక్కు కూడా ఉంది. ఈ నియమం ప్రకారం నియమితంగా నోటీసులు ఇవ్వడానికి, అభ్యంతరం చెప్పడానికి గ్రామస్థులకు ఎటువంటి హక్కూ లేదు. మేము ప్రభుత్వం ద్వారా నిర్ధారితమైన నష్ట పరిహారం లేదా భూముల నష్టపరిహారం రేట్లను కూడా ఛాలెంజ్‌ చేశాము. 1908లో సర్‌ సిప్టన్‌ హజారీబాగ్‌లో చేసిన సర్వే మీద ఇదంతా ఆధారపడి ఉంది. ఆ తర్వాత రేట్లు బాగా పెరిగాయి. మేము ఇళ్ళు, చెట్లు, సరిహద్దుల నష్టపరిహారం కోసం కూడా దావా వేశాము. దీంతోపాటు విస్థాపితులైన ఆదివాసీలు అడవులపై పోగొట్టుకున్న అధికారాలను తిరిగి మళ్ళీ పొందాలని కూడా దావా వేశాము. భూమికి బదులు భూమిని అడిగాము.

మా దావా ఈ ప్రకారంగా ఉంది – ఒకవైపు కోల్‌ ఇండియా అధికంగా ఉన్న కార్మికుల గురించి మాట్లాడుతోంది, ఖాళీలు లేవంటూ స్థానికులకు ఉద్యోగాలను ఇవ్వడంలేదు. మరోవైపు ఇప్పటికే అక్కడ పనిచేస్తున్న కార్మికుల కోసం వాలంటరీ రిటైర్మెంట్‌ స్కీమును నడిపిస్తూ వాళ్ళ ఉద్యోగాలు వంశపారంపర్యమైనవిగా చెబుతోంది. బొగ్గు గనులలో విస్థాపితులు, గ్రామస్థులు, కొత్తగా వచ్చే కార్మికుల కోసం ఖాళీలు ఏర్పడవు.ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు ఇటువంటి సదుపాయం ఉంటే అది ఘాతుకమే అవుతుంది. ఈ రిటైర్మెంట్‌ స్కీములో మహిళా ఉద్యోగులు తమ ఉద్యోగాలను ఎవరికైనా ఇవ్వవచ్చు. ఒకవేళ ఏ మహిళ అయినా తన కొడుకుకు కానీ, అల్లుడికి కానీ ఉద్యోగం ఇవ్వకూడదనుకుంటే ఆమె ఎవరిదగ్గరయినా డబ్బులు తీసుకుని తన ఉద్యోగాన్ని అమ్మేయవచ్చు. ఈ సదుపాయంతో ఒకరకంగా ఉద్యోగులు అమ్ముడు పోవడంతోపాటు మహిళలు శోషణకి గురయ్యే మాధ్యమంగా మారింది. దీనివల్ల బొగ్గు గనులలో పనిచేస్తున్న ఆదివాసీ, దళిత కూలీలకు నచ్చచెప్పి లంచాలిచ్చి బయటివాళ్ళు ఉద్యోగాలను కొనుక్కుంటున్నారని కూడా మేము మా అర్జీలో రాశాము. అలాగే అధికారులు, నేతలు, దళారుల సంపాదన చెప్పనక్కర్లేదని, దీనివల్ల గ్రామీణులకు ఎప్పుడూ ఉద్యోగాలు దొరకవని కూడా మేము అందులో రాశాము.

మేము, మూడెకరాల భూమికి బదులు ఉద్యోగం ఫార్ములా విషయంలో కూడా సుప్రీంకోర్టులో ఛాలెంజ్‌ చేశాము. మధ్యప్రదేశ్‌లో కోల్‌ ఇండియా సగం ఎకరం మీద కూడా ఉద్యోగాలిచ్చింది. అక్కడ రాష్ట్రప్రభుత్వం విస్థాపితుల విషయంలో కోల్‌ ఇండియా అధికారులతో కొంత కఠినంగా ప్రవర్తిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో పాలసీ వేరేగా ఉంది. ధన్‌బాద్‌లో బి.సి.సి.యల్‌.లో ఒక ఎకరంపైన ఉద్యోగాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎంతో పోరాటం జరిపాక ఇదంతా జరిగింది. ఈ కేసు దేవకీ మహతో, భారత ప్రభుత్వం పేరుమీద నమోదయింది. సుప్రీంకోర్టు వాలంటరీ రిటైర్మెంట్‌ స్కీంను వెంటనే నిలిపివేసింది. దీంతో నానా గోల అయింది. ఒక్క సారూబేడాలోనే బయటివాళ్ళవి మూడున్నర లక్షలు మునిగిపోయాయి. ఈ డబ్బంతా దళారులకు లంచం రూపంలో ఇచ్చారు. ఎంతో మంచి ఉద్యోగాలు వస్తుంటే రమణిక గుప్తా అన్నీ బంద్‌ చేయించిందని రాజకీయ పార్టీలన్నీ తిట్టడం మొదలుపెట్టాయి. మొదట్లో గ్రామస్థులు కూడా తప్పుగా అర్థం చేసుకున్నారు. వాళ్ళ ఉద్యోగాలు ఆరా, ఛపరా, బలియా, హజారీబాగ్‌, ధన్‌బాద్‌లలో ఉన్నత కులాల వాళ్ళ ద్వారా కొనుగోలు చేయబడుతున్నాయని తర్వాత తెలుసుకున్నారు. వడ్డీ వ్యాపారులు కార్మికుల అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ని తాకట్టు పెట్టుకుని అప్పులిచ్చేవారు. రుణం తీర్చకపోతే కార్మికులు వాలంటరీ రిటైర్మెంట్‌ ప్రణాళిక కింద తమ కొడుకుల పేరున (వడ్డీ వ్యాపారస్థులు, మహాజన్‌) తమ ఉద్యోగాలను ఇవ్వాలని బలవంతం పెట్టేవాళ్ళు. కొందరు ఈ కార్మికులకు అల్లుళ్ళయి ఉద్యోగాలు సంపాదించేవారు. వీళ్ళకు భార్యా బిడ్డలు ఉన్నా కానీ మరో పెళ్ళి చేసుకునేవారు. ఈ ప్రణాళిక తర్వాత కోల్‌ఫీల్డ్‌లో మాంఝీ తండ్రి తివారి గారు, సింహ్‌ గారు, మహతో గారు, శర్మాజీ, సాహాజీ కనిపించడం మొదలుపెట్టారు. యూనియన్‌ నేతలతో చేతులు కలిపి ఎంతోమంది అధికారులు తమ బంధువులకు ఉద్యోగాలను ఇప్పించేవారు. ఈ సమయంలో 1985లో మాండూ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయాను, అయినా నేను ఏ మాత్రం బాధపడలేదు.

మేము మరోసారి రిట్‌ పిటిషన్‌ వేశాము. మాండూ ఎమ్మెల్సిని కావడం వలన నేను మొదటి హక్కు దారినయ్యాను. నాతోపాటు ఎత్‌వా కర్‌మాలీ, బసంత మహతో, ఖుషీలాల్‌ మహతో, ఖీరు మహతో ఇంకా కొందరు హక్కుదారులు కలిసి ఈ పిటిషన్‌లో బసంత్‌పూర్‌, కేదలా, తాపిన్‌, లయియో, దున్నీ, ఆరా, సరాఝాబేడా, తోపా-తోయరా, కుజుతో పాటు మొత్తం మాండూ క్షేత్రమంతా బొగ్గు గనుల కోసం తీసుకోబడిన భూముల వివరాలను ఇచ్చాము. దీనికోసం హజారీ బాగ్‌కి చెందిన సంయుక్త సోషలిస్టు పార్టీ, గోపాల్‌ ప్రసాద్‌, స్వరూప్‌ చంద్‌ జైన్‌ అనే ఇద్దరు లాయర్ల సహాయం తీసుకున్నాను. మేము అప్లికేషన్లను ప్రింట్‌ చేయించాము. అందులో అర్జీదారుడి భూములకు సంబంధించిన పూర్తి వివరాల ఖాతా, స్థలం, సరిహద్దుల వివరాలతో పాటు మరికొన్ని వివరాలను రాయడానికి వీలుగా కాలమ్స్‌ ఉన్నాయి. సుప్రీంకోర్టుకి మొత్తం వివరాలను ఇచ్చేలా అన్ని కాలమ్‌లతో సహా వాటిని ప్రింట్‌ చేశాము. మేము మా పార్టీ లోక్‌దళ్‌కి చెందిన లాయర్‌ స్వరూప్‌ చంద్‌ జైన్‌, గోపాల్‌ బాబూలను వెంట తీసుకుని ప్రతి గ్రామానికీ వెళ్ళేవాళ్ళం. ప్రింటయిన ఫారాలను నింపించి, కావలసిన వాటి కాపీలతో కలిపి అప్లికేషన్లను తయారుచేసేవాళ్ళం. మా యూనియన్‌ క్యాడర్‌ అంతా ఈ పనిలో మునిగిపోయారు. ఈ కాగితాలను తయారు చేయడానికి చాలా సమయం పట్టింది. కార్మికులు, రైతుల కోసం చందాలను వసూలు చేసి లాయర్ల రాకపోకలకు, ఫారాలను ప్రింట్‌ చేయడానికి, ఫారాలను నింపిన వాళ్ళకి డబ్బులిచ్చేవారు. పిటిషన్‌ ఇచ్చేటపుడు పుండీ, వేల్‌ నగరాలు లేవు. తర్వాత వాళ్ళచేత కూడా విడిగా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయించాము. అప్పట్లో సుప్రీంకోర్టు జడ్జి ఇరవై సూత్రాల కార్యక్రమాన్ని అనుసరించి మా పిటిషన్‌ని స్వీకరించి కపిల్‌ సిబల్‌కి అందించి దాన్ని ఫీజులేకుండా పరిశీలించాలని చెప్పారు. నేను స్వయంగా ఆయనతో చర్చిద్దామనుకున్నాను. షీబా రాత్రింబవళ్ళు కష్టపడి ఆ అప్లికేషన్లను క్రమపద్దతిలో పెట్టి లెక్కలన్నీ వేసింది. గ్రామాలవాళ్ళు ప్రతిసారీ ఢిల్లీ వచ్చేవాళ్ళు. వాళ్ళు నా భర్తకి అలాట్‌ అయిన కర్జన్‌ రోడ్‌ ప్రభుత్వ క్వార్టర్‌లో ఉండేవారు. నా భర్త ప్రకాష్‌కి ఇష్టముండేది కాదు, కానీ నేను పట్టుబట్టడంతో ఆయన ఒప్పుకునేవారు. షీబా చాలా కష్టపడుతోంది. నన్ను కూడా తనతోపాటు కూర్చోబెట్టుకుని కపిల్‌ సిబల్‌ గారు స్వయంగా ఈ పిటిషన్‌ను తయారుచేశారు.

ఈ పిటిషన్‌లో మేము ముఖ్యంగా కోల్‌ బేరింగ్‌ ఏరియా యాక్ట్‌ 1957, 1994 బొగ్గు గనులలో ల్యాండ్‌ అక్విజిషన్‌ యాక్ట్‌ని కూడా ఛాలెంజ్‌ చేశాము. పునరావాసంతో పాటు మహిళలకు కూడా నష్టపరిహారం, ఉద్యోగాలు లభించాలని కూడా రాశాము. జల్‌-జంగల్‌-జమీన్‌, లాఠా-ఛావన్‌, జలావన్‌లకి చెందిన అధికారులకు కూడా నష్టపరిహారం కోసం మేము అపీల్‌ చేశాము. ఆంగ్లేయుల లాగా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే కోల్‌ ఇండియాకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాను. రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వేల కోసం తీసుకున్న భూములను తిరిగి రైతులకు ఇవ్వకుండా నేరుగా కోల్‌ ఇండియాకు ఇచ్చేసింది. ఇది చట్ట విరుద్ధం. మా అపీల్‌లో ఈ విషయాన్ని కూడా పొందుపరచాము. మా కేసుకి చాలా బలం ఉంది. ఈ రిట్‌ పిటిషన్‌కి సంబంధించిన గనుల విస్తరణ విషయంలో కూడా భగవతీగారు స్టే ఆర్డర్‌ ఇచ్చారు. ఎప్పటిదాకా అయితే కోల్‌ ఇండియా, బీహార్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పునరావాస ప్రణాళికను తయారుచేసి ఇవ్వరో అప్పటివరకు ల్యాండ్‌ ఎక్విజిషన్‌ను కూడా అపేయించారు. సర్వే చేయించి అన్ని వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు బీహారు ప్రభుత్వాన్ని అడిగింది. మాండూ క్షేత్రంలో ఎంతమంది విస్థాపితులవుతారో, ఎంత భూమి పోతుందో వివరాలు కూడా తెలుస్తాయని కోర్టు ఉద్దేశ్యం. ఆ సమయంలో మేము జైల్లో ఉన్నాము. 13 బొగ్గు గనుల కోసం సర్వే క్యాంప్‌ పెట్టారు. మేము జైలు నుండే కరపత్రాలు అచ్చు వేయించి యూనియన్‌ నెట్‌వర్క్‌ ద్వారా మాండూ క్షేత్రంలో పంచాము. వేలమంది కోర్టు ఎదురుగా సమావేశమయ్యారు. రాజస్వ విభాగం వివరాలన్నీ సేకరించి బీహారు ప్రభుత్వానికి పంపింది. బసంత్‌పూర్‌కు చుట్టుపక్కల ఉన్న 13 వేల మంది విస్థాపితులయ్యే పరిస్థితి ఏర్పడింది. యాజమాన్యం వారు 30 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ సమయంలోనే సుప్రీంకోర్టు నష్టపరిహారం రేటు ఏ విధంగా చెల్లించాలో నిర్ధారణ చేయాలని కోల్‌ ఇండియాను ఆదేశించింది. మేము దీనికి ఒప్పుకోలేదు.

మేము కమర్షియల్‌ రేటుపైన భూములకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశాము, కానీ వాళ్ళ వర్గీకరణ ఆధారంగా కాదు. ఎందుకంటే కోల్‌ ఇండియా భూములను కమర్షియల్‌ పనులకు తీసుకుంటోంది. ఈ క్యాంప్‌ కోర్టుల రిపోర్టుల ప్రకారం మాండు ప్రఖండ్‌కి చెందిన బసల్‌పూర్‌లో సి.సి.ఎల్‌. ద్వారా తీసుకోబడిన భూమి 3,342.48 ఎకరాలు. 2,575 కుటుంబాల భూమి ఇది. దాదాపు 11,030 మందిపై దీని ప్రభావం పడింది. ఈ ల్యాండ్‌ ఎక్విజిషన్‌ వలన 430 కుటుంబాలు భూములు కోల్పోగా, 77 మంది ఇళ్ళు కోల్పోయారు. 916 కుటుంబాలు ఇళ్ళు, భూములు రెండూ పోగొట్టుకున్నాయి. 11,030 మందిలో 6,315 మంది వయసు 16 సంవత్సరాలైతే 4,795 మంది వయసు 16 కంటే తక్కువ వయసు. వీళ్ళలో 1,552 మంది ఉద్యోగాల్లో ఉండగా 9,418 మందికి ఉపాధి లేదు. ఎక్విజిషన్‌ తర్వాత మిగిలిన 299 కుటుంబాలవాళ్ళకి ఒక ఎకరం కంటే తక్కువే ఉంది. ఈ సేకరణ తర్వాత బీహార్‌ ప్రభుత్వం ఒక ప్రణాళికను తయారు చేసి సుప్రీంకోర్టులో ఇచ్చింది. విధాన సభలో నా ప్రశ్నకు బదులుగా సంబంధిత శాఖా మంత్రి దాని కాపీని నాకు ఇచ్చారు. ఈ ప్రణాళికలో బీహార్‌ ప్రభుత్వం ఇలా రాసింది.”పునరావాసం కోసం భూముల లభ్యత లేనందున బొగ్గు కంపెనీలకు భూముల హద్దుల షరతులను పెట్టకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగమివ్వాలని” ఆదేశం. మాండూ క్షేత్రంలో బసత్‌పూర్‌, పుండీ, కేదలా, తోపా, సారూబేడా మొదలైన బొగ్గు గనుల కోసం తీసుకున్న భూములు, తీసుకోబడుతున్న భూముల కోసం ఈ ఆదేశం.

ఈ పోరాటం దీర్ఘంగా సాగింది. బేరమో క్షేత్రం నుండి లాల్‌చంద్‌ మహతో గారు, ఆయన క్షేత్రంలోని రైతుల తరఫు నుండి ఒక రిట్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో వేశాము. కోర్టులో దీనిపై మూడు కేసులు ఒకేసారి నడిచాయి. వాషరీపైన మేము స్టే ఆర్డర్‌ తెచ్చుకున్నాము. కానీ తర్వాత కోల్‌ ఇండియా విడిగా అప్లికేషన్‌ ఇచ్చి వాషరీపై ఉన్న స్టే ఆర్డర్‌ని తొలగించుకుంది. అయినా మేము వాషరీని వదల్లేదు. వాషరీకి రెండు పర్వతాల మధ్యగా వెళ్ళే రోడ్డుపైన సగం ఎకరం భూమి రైతులది. అదంతా లోయలు గుంటలమయం కావడంతో దానికి చుట్టుపక్కల రోడ్డు వేయలేదు. మేము గ్రామస్థులందరితో రోడ్డుకి ఆ భాగంలో దాదాపు ఒక నెలదాకా ధర్నా చేయించాము. సి.సి.ఎల్‌ వాళ్ళు విమానంలో వెళ్ళలేదు. అందువల్ల వాషరీ నిర్మాణం ప్రారంభం కాలేదు. సి.సి.ఎల్‌ వైపు నుండి బి.ఎమ్‌.పి. గ్రూపు అక్కడ ఎప్పుడూ ఉండేది. అయినా గ్రామస్థులు పట్టుదలగా ఉన్నారు. దాదాపు రెండు సంవత్సరాలపాటు ఈ కేసు నడిచింది. కానీ గ్రామస్థుల ఐకమత్యం, వ్యతిరేకత వల్ల సి.సి.ఎల్‌. బోర్డు వాషరీని మొదలుపెట్టలేకపోయింది. మేము ఉద్యమాల బలంపై బసల్‌పూర్‌ గ్రామాన్ని రక్షించాం, ఏ బస్తీని ఇవ్వలేదు. కేవలం బేబిరాగి భూమిని మాత్రం వాషరీ కోసం ఇవ్వవలసి వచ్చింది.

ఈ మధ్యలో బి.ఎం.పి.కి చెందిన ఒక హవల్దార్‌ హత్యకు గురయ్యాడు. అంతే ఇంకేముంది? పోలీసులు నాలుగు వైపుల నుండి బసత్‌పుర్‌ ఊరిని చుట్టుముట్టారు. ఊళ్ళోని మగవాళ్ళంతా పారిపోయారు, కేవలం మహిళలు మాత్రమే ఉండిపోయారు. సుషీలాల్‌ మహతో, రాజ్‌కుమార్‌ కర్‌మాలీ, బసంత్‌ మహతో తదితరులందరూ మా ఇంటికి వచ్చి దాక్కున్నారు. డి.ఎస్‌.పి. అయిన సువరణో ఆదివాసి, తర్వాత డి.ఐ.జి.గా పనిచేశారు. నేను హత్యాస్థలానికి వెళ్ళి చూశాను. హవల్దార్‌ మృతదేహం అడవిలో పడి ఉంది. అందరికీ ఉద్యమకారులపైనే సందేహం. బి.ఎం.పి జవాన్లు ఎస్‌.పి.ని ముట్టడించి హవల్దార్‌ను హత్య చేసిన వారిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. నేనే వాళ్ళని భయపెట్టడానికి ఉద్యమకారుల ద్వారా ఈ హత్య చేయించానని వాళ్ళకి సందేహం, కానీ ఇందులో లేశమాత్రం కూడా నిజం లేదు. ఈ పోలీసులు రాత్రి పూట మద్యం తీసుకోవడానికి గ్రామస్థుల ఇళ్ళకు వెళ్ళేవారు. అందువల్ల హవల్దార్‌ ఎవరినైనా వేళాకోళం చేశాడేమో, గ్రామస్థులు కోపమొచ్చి చంపేశారేమో! ఉద్యమానికి, దీనికి ఏ మాత్రం సంబంధం లేదు. బసత్‌పూర్‌ గ్రామంలో ఉండే ఒక మహిళ ఇంట్లో తాగడానికి వెళ్ళినపుడు చివరిసారిగా అతన్ని చూశారు. బి.ఎం.పి. వాళ్ళు నన్ను పోలీసులు అరెస్ట్‌ చేస్తే చూడాలనుకున్నారు. ఎస్‌.పి. నన్ను, నాతోటి వాళ్ళను పిలిచి నన్ను ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళనీయవద్దని, ముఖ్యంగా బి.ఎం.పి. క్యాంప్‌ ఎదురుగా అసలు వెళ్ళనీయవద్దని చెప్పారు. బి.ఎం.పి. వాళ్ళు కోపంకొద్దీ పిస్తోలు తీసి కాల్చేస్తారేమోనని వాళ్ళ భయం. మేము ఏడెనిమిది మంది బయలుదేరాము. మేము బసత్‌పుర్‌ వెళ్ళడానికి అడవిదారి పట్టాము. రౌతా నుండి ఈ దారి వెళ్తుంది. మేము దురుక్‌ సమార్‌ దారిని వదిలేశాం. మా డ్రైవర్‌ ఖాన్‌ చాలా తెలివైనవాడు. బసత్‌పుర్‌ ముఖ్య నేరస్థుడు మా దగ్గర దాక్కున్నాడు. మిగిలినవారిని మేము కోర్టుకు సరెండర్‌ చేశాము. డి.ఎస్‌.పి. సువరణో ఏ గ్రామస్థుడినీ కొట్టకూడదని పోలీసులకు ముందే ఆదేశాలు జారీ చేశారు. రాజ్‌కుమార్‌ కర్‌మాలి, ఖుషీలాల్‌, బసంత్‌లకి కోర్టులో హాజరు కాకుండానే బెయిల్‌ ఇప్పించాలని మా పట్టుదల, అలాగే చేశాం. తర్వాత అందరికీ బెయిల్‌ దొరికింది. కోర్ట్‌ అరెస్ట్‌ అయిన వారికి బెయిల్‌ ఇవ్వకపోతే పేరున్నవారికి బెయిల్‌ దొరకనే దొరకదు. మా ఉద్యమం ఆగిపోతుంది. ఈ సంఘటన వలన సి.సి.ఎల్‌.కి అవకాశం లభించింది. అందరూ పారిపోయిన తర్వాత వాషరీ దగ్గర వాషరీ తయారుచేసే సామాన్లను తీసుకువెళ్ళారు. ఊళ్ళో రెండు గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూప్‌ మేఘనాథ్‌ మహతో నేతృత్వంలో ఉంది. ఆయన ఎ.కె.రామ్‌తో పాటు ఉండేవారు. వీళ్ళు ఈ గ్రూప్‌ రాజకీయాల వలన ఈ ఉద్యమంలో పాల్గొనేవారు కాదు. అసలు వాళ్ళే కోరుకుంటే సి.సి.ఎల్‌. ని ఆ సంఘటనా స్థలం దాకా వెళ్ళనిచ్చేవాళ్ళే కాదు. నేను వాళ్ళ గ్రూప్‌ దగ్గరికి వెళ్ళి ఇది మనలో మనం పోట్లాడుకునే సమయం కాదని చెప్పాను. ముందు వీళ్ళతో తేల్చుకున్నాక మనం కూర్చుని నిర్ణయం తీసుకోవచ్చని చెప్పాను. నేను స్వయంగా వెళ్ళాను. చర్చలు పూర్తయ్యాక వాళ్ళు కూడా ఇందులో చేరడానికి ఒప్పుకున్నారు. అప్పుడు సి.సి.ఎల్‌. వాళ్ళకి అడ్డుపడగలిగాం. ఆ భూమిలో చిన్న భాగం ఈ గ్రూపు వాళ్ళదే.

హత్య విషయంలో ఇప్పటికీ ఇంకా అరెస్టులు చేస్తూనే ఉన్నారు. ఇంతలో మరో సంఘటన జరిగింది. ఒక ఆదివాసీ ఇంటిదగ్గర బి.ఎం.పి. ఫోర్స్‌కి చెందిన ఒక హవల్దార్‌ బాగా తాగి గొడవ చేశాడు. అతడిని హత్య చేశారు. ఆ హవల్దార్‌ ఆదివాసీ. ఈ హత్యవలన మాకు మాట్లాడడానికి కొంత బలం వచ్చింది. బి.ఎం.పి. వాళ్ళు ప్రజలపై స్వయంగా అత్యాచారాలు చేస్తారు. ఎవరో ఒకరు హత్య చేయబడినపుడు ప్రతీకారం తీర్చుకుంటారు. సి.సి.ఎల్‌లోని సెక్యూరిటీ విభాగానికి చెందిన డి.ఐ.జి. భూమిహార్‌ అధికారిగా ఉండేవారు. ఆయన హజారీబాగ్‌ ఎస్‌.పి.కి బంధువు కూడా. ఈ విషయంలో వాళ్ళు నన్ను అరెస్ట్‌ చేయాలనుకున్నారు. కానీ ఎస్‌.పి. అడ్డుపడ్డాడు. బీహార్‌ ప్రభుత్వానికి పంపిన నివేదికలో సి.సి.ఎల్‌.కి ఇచ్చివేయబడిన బి.ఎం.పి. గ్రూపు వలన శాంతి భద్రతల సమస్య వస్తోందని చెప్పారు. పోలీసు విభాగంలో పరస్పర గొడవలు నడుస్తూనే ఉంటాయి. ఆ రోజుల్లో నేను ఎమ్మెల్సీని. సత్తా-సంఘర్షణ… ఈ రెండు శక్తులమీద ఎంత చేయగలనో అంతా చేశాను. వాస్తవానికి నేను చాలా ఇబ్బందులు పడ్డాను. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్‌ వచ్చాక నాలుగు సంవత్సరాలపాటు వాషరీ చేయకుండా చూశాను. చివరికి ఒక జనరల్‌ మేనేజర్‌ సగం ఎకరానికి ఒక ఉద్యోగం అంటే 30కి బదులు కేవలం వాషరీ కోసం తీసుకున్న భూమిపై 101

ఉద్యోగాలూ, ఊళ్ళను తుడిచి పెట్టకూడదన్న నిర్ణయం తీసుకుని మాతో కోర్టు బయట అగ్రిమెంట్‌ రాయించి వాషరీని మొదలుపెట్టాడు.

లాల్‌చంద్‌ మహతో బేరమో, గోవిందపుర ప్రాజెక్ట్‌ కేంద్రంలో ఉంచుకుని మేము సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేయించి స్టే ఆర్డర్‌ను పొందాము. ఈ స్టే ఆర్డర్‌ టైమ్‌లో నా కూతురు షీబా మాట్లాడింది. ఎందుకంటే కపిల్‌ సిబల్‌ ఆ రోజు ఎక్కడికో వెళ్ళారు. అందులో మేము మహిళలకి కూడా సమానమైన నష్టపరిహారం, ఉద్యోగం, పునరావాసం కల్పించాలని చెప్పాము. కె.బి.సక్సేనాని, ఒక సామాజిక కార్యకర్తని వెంట తీసుకువెళ్ళి ఈ భూములను ఎవరు సాగు చేస్తున్నారో, ఏ కాగితాలు లేకపోయినా సరే దర్యాప్తు చేయాలని ఆదేశమిచ్చారు. ఆ క్షేత్రంలో సాగుచేయబడుతున్న ఎన్నో గ్రామాలున్నాయి. దాన్ననుసరించి ఎవరైనా సరే భూమిని సాగుచేసి సేద్యం చేసుకోవచ్చు. దాని రేటును నిర్ణయించేది ప్రభుత్వమే. రైతు అప్లికేషన్‌ ఇవ్వాలన్న రూల్‌ లేదు. సర్వే చేయకపోవడంవల్ల రైతులు రికార్డులు తయారుచేశారు. ఎవరైతే భూమిని సాగు చేస్తారో, వాళ్ళని సి.సి.ఎల్‌. ఒప్పుకోవడంలేదు. బసత్‌పుర్‌లో క్యాంప్‌ వేసినపుడు ఈ సమస్య రాలేదు. మేము మహతో, కర్‌మాలీ గంఝాలను పిలిచి సమావేశం పెట్టాము. తిరిగి ఇవ్వాల్సిన భూములలో కర్‌మాలీ గంఝాల పేర్లను జాబితాలో ఎక్కించాము. ఇదంతా గ్రామస్థుల సహాయంతో చేయగలిగాము. మహతో పొలాలలో పనిచేసే దళితులు, ఆదివాసీలకు కూడా ఉద్యోగ హక్కు ఉండాలని మా ఉద్దేశ్యం. ఈ హక్కు లేకపోతే వాళ్ళకి ఉద్యోగ అవకాశమే ఉండదు.

బి.ఎం.పి. హత్య కేసులో మొదటి అపరాధి రాజ్‌కుమార్‌ కర్‌మాలీ. అతను జబ్బుపడ్డాడు. నా దగ్గరికి తీసుకువెళ్ళమని బాగా పట్టుబట్టినా అతని కుటుంబసభ్యులు అతనికి భూతం పట్టిందని భూతవైద్యుడిని పిలిపించి భూత వైద్యం చేయించారు. అతనికి డిఫ్తీరియా వచ్చింది. దాంతో అతను మాట్లాడలేకపోయేవాడు, ఏడుస్తూనే ఉండేవాడు. అప్పుడప్పుడు నా దగ్గరికి హజారీబాగ్‌ తీసుకువెళ్ళమని సైగలు చేసేవాడని తెలిసి నాకు చాలా బాధ కలిగింది. అతడు తెలివైనవాడు. నేతృత్వం చేయగల శక్తిగలవాడు. ఇలా ఒక ధైర్యస్థుడిని మూఢనమ్మకాలకు బలిచేశారు. ఈనాటికీ నాకు అతని ముఖం గుర్తుంది. బాగా జ్ఞాపకమొచ్చి నా మనసంతా అశాంతిగా అనిపిస్తుంది.

రైల్వే భూమికోసం పిటిషన్‌

బసత్‌పుర్‌ పోరాటం దీర్ఘకాలం నడిచింది. నేను ఎమ్మెల్సీని కావడంవల్ల రైల్వేవాళ్ళు తమకున్న బస్తీలోని భూమిని రైతులకు అప్పగించాలని విధానసభలోని యుబికా (పిటిషన్‌) సమితికి అప్లికేషన్‌ ఇచ్చాను. చట్టప్రకారం 1926లో ఆంగ్లేయులు బొగ్గు గనుల కోసం ఏ ఏ భూములను తీసుకున్నారో వాటిని ఉపయోగించకపోవడం వల్ల రైతులకు వెనక్కి ఇచ్చేయాలి కానీ సి.సి.ఎల్‌. అధికారులు రైల్వే

ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ భూములను తమ పేరుమీద ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. ఇది చట్టవిరుద్ధం. బీహారు ప్రభుత్వం రాజస్వ ఆయుక్త్‌ పిటిషన్‌ సమితి సమక్షంలో భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని ఒప్పుకుంది. సి.సి.ఎల్‌.కి పన్ను చెల్లించవచ్చు, కానీ బీహార్‌ ప్రభుత్వం లాయర్లు కోల్‌ ఇండియా ప్రభావం వల్ల కేసు సుప్రీంకోర్టులో స్టే ఉందని, అందువల్ల సమితివాళ్ళు దీన్ని విచారించలేరని చెప్పి పట్టించుకోలేదు. మేము మా పిటిషన్‌లో రైల్వే భూములను కేవలం ఉదాహరణాలుగా చూపించామే తప్ప దావా వేయలేదు. ఈ తర్జన భర్జనలతో మరో ఐదేళ్ళు గడిచిపోయాయి. సుప్రీంకోర్టులో ఈ స్టే ఆర్డర్‌ వల్ల మాకు ఒక లాభం కలిగింది. స్టే ఆర్డర్‌ తర్వాత సి.సి.ఎల్‌. ఎప్పుడైనా సరే భూమిని తీసుకోవాలనుకుంటే రైతుల షరతులమీద ఉద్యోగమిచ్చి ల్యాండ్‌ ఎక్విజిషన్‌ చేసుకోవాలి. భూమికి బదులుగా ఉద్యోగాల విషయంలో మేము ఎప్పుడూ కల్పించుకుని వాళ్ళకి న్యాయం జరిగేలా చూసేవాళ్ళం. కోల్‌ ఇండియా వాళ్ళు పుండి గ్రామ సర్పంచ్‌తోపాటు కొంతమంది దళితులను మాకు వ్యతిరేకంగా నిల్చోబెట్టి హలఫ్‌నామాని పంపించారు. మళ్ళీ మరో హలఫ్‌నామా (ప్రతిజ్ఞాపత్రం)ను పంపించారు. పుండీ ప్రణాళికలో 1964లో భూమిని తీసుకున్నారు. నష్టపరిహారం 1981-82లో 1964 సంవత్సరంలోని రేటు చొప్పునే ఇస్తున్నారు. మేము రైతులకు నష్టపరిహారాన్ని కమర్షియల్‌ రేటు ప్రకారంగా ఇస్తేనే తీసుకోవాలని చెప్పాం. లేకపోతే భూమికి బదులుగా భూమి. రైతులను భూమినుండి తొలగించడం వలన వాళ్ళు కోల్పోయిన హక్కులకు బదులుగా ఉద్యోగాలను డిమాండ్‌ చేశాము. ఈ గ్రామంలో కొంతమంది దళారులు పుట్టుకొచ్చారు. అయినా ఈ విషయంలో బల్‌సగరా ఊరివాళ్ళందరూ పట్టుబట్టారు. బసత్‌పుర్‌ రైతులు చివరి వరకు ననష్టపరిహారం తీసుకోలేదు. కానీ నష్టపరిహారం విషయంలో పుండికి చెందిన వాళ్ళు అందరికన్నా ముందు నిరాశా నిస్పృహలతో బాధపడ్డారు.

ఏది ఏమైనా చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. రాజ్‌పుత్‌లు, మహంతో, సాహా మొదలైనవారు బోర్డు అధికారులతో చేతులు కలిపి మాంఝీ, ముండా, కర్‌మాలీల భూములకు బదులుగా ఉద్యోగాలు తెచ్చుకున్నారు. మేము అభ్యంతరం చెబుతూ అప్లికేషన్‌ ఇచ్చాము. నాకిప్పటికీ గుర్తుంది. తోపా బొగ్గు గనుల దుర్ఘటనలో ఇద్దరు కూలీలు చనిపోయారు. పుండీ ఊరి ఆదివాసీల టోలీలోకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఒక మాంఝీ అడిగాడు. -”నా దగ్గర 42 ఎకరాల భూమి ఉండేది. మాకు ఏడు ఉద్యోగాలు దొరికాయి. అందులో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. చిన్న ప్రేత వస్త్రం గతయ్యింది. మూడు ఎకరాలకు ఒక ఉద్యోగం ప్రకారం ఇంకా ఏడు ఉద్యోగాలు ఏమయ్యాయి?” నిజానికి అతను వేసిన ప్రశ్న సరైనదే. మా యూనియన్‌ నేత, ఆ బ్రాంచ్‌కి నేత అయిన ద్వారకా మహతో నాతో ఆ ఊరికి రాలేదు. మిగిలిన కుటుంబాలవాళ్ళు కూడా ప్రేత వస్త్రాలు చాలీచాలక ఉన్నాయని ఫిర్యాదు చేశారు. బోర్డు నుండి డబ్బులు తీసుకుని నేతలే ఈ ప్రేత వస్త్రాల పంపకాన్ని చేసేవాళ్ళు. నాతోపాటు మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. పుండీ గ్రామస్థులు కూడా ద్వారకా మహతోకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. నేను అక్కడినుండి మాండూ పోలీస్‌స్టేషన్‌కి వెళ్ళాను. ద్వారకా మహతో (ఆయన మా క్యాడర్‌లోనే ఉన్నారు)కు వ్యతిరేకంగా ప్రభుత్వ ధనం విషయంలో అవకతవకలు, చిన్న ప్రేత వస్త్రాలను కొనడం, ఆదివాసీల భూములపై వేరేవాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడానికి కుట్రలు, కుతంత్రాలు చేయడం మొదలైన నేరాలు మోపి ఫిర్యాదు రాయించాను. ద్వారకా మహతోని యూనియన్‌ నుండి తీసేశారు. అర్జీని బోర్డుకి ఇచ్చి కరపత్రాలను పంపించాము. మేము ఆదివాసీలను, వేరే గ్రామస్థులను తీసుకుని ఏడు ఉద్యోగాల విషయంలో విచారణ జరిపించాలంటూ బోర్డు కార్యాలయం ఎదురుగా ప్రదర్శన నిర్వహించాము. ఆ ఏడు

ఉద్యోగాలను కుజు, జి.ఎం. మేనల్లుడితో సహా యూనియన్‌ నేతలందరూ కలిసి జాలీ అల్లుడిగా, సోదరుడిగా చెప్పి కొందరికి ఉద్యోగాలు ఇప్పించారు.

అయితే మేము కల్పించుకోవడం వల్ల మోసం చేసినవాళ్ళని ఉద్యోగాల నుండి తీసేశారు. కానీ ఆ మాంఝీ కుటుంబానికి కంపెనీ ఉద్యోగాలను ఇవ్వలేదు. నాకు రెండు వైపుల నుంచి ఒత్తిడి మొదలయింది. తొలగింపబడినవారు యూనియన్‌ నుండి వెళ్ళిపోతామని భయపెట్టారు. వారి బంధువులు, యూనియన్‌ నేతలు కూడా బెదిరించసాగారు. పాపం భుత్తు మాంఝీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా అన్నీ సహిస్తూ నా ఎదురుగా వచ్చి నిల్చుండేవాడు. మా యూనియన్‌ క్యాడర్‌ వలనే ఇదంతా జరిగిందని నేను బాధపడేదాన్ని. ఒకసారి కాశీనాధ్‌ మహతో, కార్తీక మహతో, లాల్‌చంద్‌ గారికి చెప్పి ఒక సమావేశంలో నన్ను దీని గురించి అడుగుతూ ఒక సలహా ఇచ్చారు. ”ఈ కేసులో యూనియన్‌ వైపు నుండి ఒత్తిడి తేకూడదు. మోసగాళ్ళు మళ్ళీ ఉద్యోగాల్లో చేరగలరు” అన్నారు. నేను దానికి సమాధానంగా ”ఈ వ్యవహారంలో నాపై ఒత్తిడి తెచ్చారంటే నేను యూనియన్‌ సెక్రటరీ పదవికి రాజీనామా చేస్తాను. కానీ మాంఝీల (వీళ్ళని సంతాలీ అని కూడా అంటారు) ఉద్యోగాలు మాత్రం ఎవరికీ దక్కడానికి వీల్లేదు” అన్నాను. వాళ్ళు దానికి ఏమీ మాట్లాడకపోయినా లోలోపల మాత్రం నాకు ఎలా గుణపాఠం చెప్పాలా అని ఆలోచించి ఉంటారు. తర్వాత వచ్చిన ఎన్నికల్లో నన్ను ఓడించడానికి కుట్రలు పన్నారు. నేను ఓడిపోయినా ఎప్పుడూ బాధపడలేదు. మేము ఈ మోసపు ఉద్యోగాలు ఇచ్చేవారికి వ్యతిరేకంగా కుజు ప్రాంతంలో ధర్నాలు చేశాము కానీ దానివల్ల ఫలితమేమీ లభించలేదు. కోల్‌ ఇండియా ఫిర్యాదు చేసినపుడు మోసం చేసినవారిని ఉద్యోగాల నుంచి తీసేస్తుంది, కానీ అర్హత

ఉన్నవారికి మాత్రం ఉద్యోగాలివ్వదు. మేము తెలుసుకున్న వాస్తవం ఇది. అర్హత కలిగిన వారి కేసును ట్రిబ్యునల్‌లో వేయడానికి కూడా వీల్లేదు, ఎందుకంటే అతను అక్కడ కార్మికుడు కాదు. బయట కోర్టులో కేసు వేయాలంటే చాలా కష్టం, డబ్బు కూడా చాలా ఖర్చవుతుంది. యూనియన్‌ వల్ల, అర్జీ వేసేవారి వల్ల ఇది కాని పని. హక్కుదార్లందరూ ఒకటిగా సంఘటితమవరు. వాళ్ళ ఉద్యోగాలను చేజిక్కించుకున్న వారికి తెలిసో తెలియకో యూనియన్‌ సంఘటిత శక్తి చేయూతనిస్తుంది.

సింగరౌలీలో యూనియన్‌

1984లోనే సింగరౌలీలో మా యూనియన్‌ శాఖలు మొదలయ్యాయి. నేను ఎక్కువగా అక్కడే సమయం గడుపుతూ ఉండేదాన్ని. లాల్‌చంద్‌ మహతో తన యూనియన్‌లో మా యూనియన్‌ను విలీనం చేశారు. ఆయన మా కోల్‌ ఫీల్డ్‌ లేబర్‌ యూనియన్‌కి అధ్యక్షుడయ్యారు. ప్రణబ్‌ ఛటర్జీ మరణించిన తర్వాత మా యూనియన్‌ అధ్యక్ష పదవిలో ఆయన భార్య ఉండేవారు. తర్వాత జార్జ్‌ ఫెర్నాండెజ్‌ అధ్యక్షులయ్యారు. ఈ మధ్యలో మేము మా యూనియన్‌ను హింద్‌ మజ్దూర్‌ సభకు అనుసంధానం చేశాము. నేను హెచ్‌.ఎం.ఎస్‌. కేంద్ర కార్యకారిణి సభ్యురాలినయ్యాను. కొచ్చిన్‌లో హింద్‌ మజ్దూర్‌ పంచాయత్‌ (హెచ్‌.ఎం.పి.), హింద్‌ మజ్దూర్‌ సభ (హెచ్‌.ఎం.ఎస్‌.) కలిసిపోయాయి. మధు దండావతే సోదరుడు హెచ్‌.ఎం.ఎస్‌.కి అధ్యక్షుడయ్యారు. శాంతి పటేల్‌ జనరల్‌ సెక్రటరీ అయ్యారు. అప్పుడు మొదటిసారి అందరూ బొంబాయిలో కలిశారు. హెచ్‌.ఎం.ఎస్‌., బి.ఎమ్‌.ఎస్‌., సి.ఐ.టి.యు, ఇంటక్‌ దారా గ్రూప్‌ కూడా ఇందులో చేరింది. నేను హెచ్‌.ఎం.ఎస్‌. నుండి కొయలా ఫౌండేషన్‌ తరపున పాల్గొన్నాను. సంయుక్త్‌ మంచ్‌ సభలో మాట్లాడాను. ఆ రోజుల్లో జార్జ్‌ ఫుట్‌బాల్‌ యూనియన్‌, టెక్సీమెన్‌ యూనియన్‌లకు బొంబాయిలో మంచి పేరు ఉంది. నేను, జార్జ్‌ కలిసి ”అదర్‌సైడ్‌” అనే ఒక పత్రికను ప్రారంభించాము. నేను ఎడిటోరియల్‌ బోర్డులో సభ్యురాలిగా ఉన్నాను. గుజరాత్‌లో హోటల్‌మెన్‌ యూనియన్‌ సూరత్‌ దగ్గర కట్టనున్న వంతెనకి వ్యతిరేకంగా నేను, జార్జ్‌ ఢిల్లీనుండి కారులో ఉదయ్‌పూర్‌ మీదుగా అక్కడికి వెళ్ళాము. జార్జి నన్ను అక్కడ ఉండమన్నారు. నేను అక్కడ ఆదివాసీల విస్థాపన విషయంలో పెద్ద ఉద్యమాన్ని లేపాను. గుజరాత్‌ ప్రజలకు కచ్‌ ఉద్యమం నుండే నేను తెలుసు. ముఖ్యంగా అహ్మదాబాద్‌, కచ్‌, భుజ్‌, సుందర్‌నగర్‌, పాలీతానా, భావనగర్‌ ప్రజలకు నేను బాగా తెలుసు.

మా కోల్‌ ఫీల్డ్‌ లేబర్‌ యూనియన్‌ శాఖలు, బిలాస్‌పూర్‌, రాయగఢ్‌, అసమ్‌ వరకు విస్తరించాయి. మా దగ్గర క్యాడర్‌ తక్కువగా ఉండడంవల్ల హజారీబాగ్‌ నుండి వాళ్ళ ఆహ్వానంపై వెళ్ళాలంటే నాకు కష్టంగా ఉండేది.

పదవిలో లేనప్పుడు…

నేను ఎమ్మెల్సీకి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత రైల్వే భూముల కేసు విషయంలో నేను వేసిన పిటిషన్‌ రద్దయింది. సుప్రీంకోర్టు కేసు కూడా నడవలేదు. నేను ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కొంతమంది కులం పేరుతో టేక్‌లాల్‌ మహతో (ఆయన ఎమ్మెల్సీ అయ్యారు)తో పాటు వెళ్ళిపోయారు. నేను సి.పి.ఎం.లోకి వెళ్ళాలని ప్రకటించాను, కానీ మా యూనియన్‌ నుండి వేరై లాల్‌చంద్‌ గారితో కలిశారు. తర్వాత వాళ్ళందరూ సమతా పార్టీలోకి వెళ్ళిపోయారు. సుప్రీంకోర్టు కేసుల విచారణ అప్పుడు కూడా వీళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. మా కేసు చూస్తున్న కపిల్‌ సిబల్‌ని కూడా కలిసేవారు కాదు. నా కూతురు షీబా, కపిల్‌ సిబల్‌తో పాటు కేసులను ఉచితంగా చూస్తూ ఉండేది, తర్వాత కెనడా వెళ్ళిపోయింది. పాఠక్‌ అనే లాయర్‌ (అడ్వకేట్‌ ఆన్‌ రికార్డులో) కేసును చూడడం మొదలుపెట్టారు. ఆయన కేవలం విచారణ సమయంలో మాత్రమే కోర్టుకు వెళ్ళేవారు. కేసు వాదన సమయంలో కపిల్‌ సిబల్‌, షీబాలను పిలిపించేవారు. ఆయన పెద్ద పేరున్న అడ్వొకేట్‌ కూడా కాదు. నేను ఎమ్మెల్సీగా ఉన్నంతకాలం పాఠక్‌కు ఫీజు ఇచ్చేదాన్ని. తర్వాత ఎవరూ అంతగా ఆసక్తి చూపించలేదు. కోర్టు నుండి నోటీసులు వచ్చేవి కానీ గ్రామస్థులెవరూ అక్కడికి హాజరయ్యేవారు కాదు. వాళ్ళు ఆ తేదీ విషయం నాకు తెలపకపోవడమే కాక, అడ్వకేట్‌కి ఫీజు కూడా ఇవ్వలేదు. విస్థాపితుల కేసు సమయంలో హాజరు కాకపోవడంతో రిట్‌ పిటిషన్‌ డ్రాపయింది. మా అడ్వకేట్‌ పాఠక్‌ చనిపోయారు. ఆయన ఎవరికీ కోర్టుకు హాజరు కావలసిన తేదీని తెలియపరచేవారు కాదు, అందువల్ల సమయానికి ఎవరూ హాజరు కాలేకపోయేవారు.

1985లో ఎన్నికల్లో పోటీచేయడానికి నాకు జనతా పార్టీ టికెట్‌ ఇచ్చింది. చివరిరోజు చంద్రశేఖర్‌ (మాజీ ప్రధాన మంత్రి) ఢిల్లీలో నాకిచ్చిన గుర్తుని రద్దు చేయించి యశ్వంత్‌ సిన్హాకి ఇచ్చారు. జార్జ్‌ ఫెర్నాండెజ్‌ ఎంతో ప్రయత్నించారు కానీ ఒప్పుకోలేదు. అప్పుడు జార్జి భార్య లైలా కబీర్‌ ఆయనతోనే ఉండేది. ఆవిడ కూడా ఆయనపై ఒత్తిడి తెచ్చారు కానీ చంద్రశేఖర్‌ గారి ఎదుట ఏమీ చేయలేకపోయారు. సూరజ్‌ బాబు హత్య తర్వాత రాజ్‌పుత్‌ లాబీలో నేనంటే కోపం పెరిగిందని నాకు చెప్పారు. వీళ్ళల్లో చంద్రశేఖర్‌ కూడా ఒకరు. అప్పుడు నేను స్వతంత్ర అభ్యర్థిగా ”పడవ” చిహ్నంపై ఎన్నికలలో పోటీ చేశాను. ఛోటన్‌ సావ్‌, ఖీరో మహతో, ఖుషీలాల్‌ మహతో మరికొందరు మిత్రులు నన్ను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేయమని బలవంతం చేశారు, కానీ ఎన్నికల్లో పోటీ చేయడం నాకు ఇష్టంలేదు. జీవాధన్‌ మహతోకి స్వతంత్రంగా ఎన్నికల్లో నిల్చోవడం ఇష్టంలేదు, ఆయన నాకు అడ్డు చెప్పారు. చివరికి నేను, యశ్వంత్‌ సిన్హా ఇద్దరం ఓడిపోయాం.

చంద్రశేఖర్‌ గారితో పార్లమెంటు సెంట్రల్‌ హాలులో వాడిగా, వేడిగా చర్చలు జరిగాయి. నేను ఆయనను కుల ప్రాతిపదికపై నడిచే నేత అన్నాను. ”మీ దృష్టిలో కేవలం మీ కులం వాళ్ళే గొప్ప అయి ఉండవచ్చు. పై వాళ్ళే పనులు చేస్తారని మీ ఉద్దేశ్యం కావచ్చు. సూరజ్‌ బాబు హత్య ఎంతో బాధాకరమైన విషయమే కాదు, సిగ్గుపడాల్సిన సంఘటన కూడా. కానీ మీరు ఒక కులం పట్ల జరిగే అత్యాచారాల గురించి మాత్రమే చెప్తారు. నన్ను మాఫియా వాళ్ళు కొట్టారు. నిజానికి నేను సగం చచ్చిపోయాను. ఆ రోజుల్లోనే రామానంద తివారీని మిల్లు యజమానులు కొట్టించి చనిపోయాడనుకుని బయట పడేయించారు. కానీ మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇవాళ సూరజ్‌బాబు హత్య విషయంలో రమణ్‌ కమిషన్‌ రిపోర్టు చూసి కూడా మీరు నన్ను నేరస్థురాలినని అంటున్నారా? నా టిక్కెట్‌ వేరేవాళ్ళకు ఇస్తున్నారు. ఇదంతా కులవాదం కాకపోతే మరేమిటి?” అన్నాను. నాకు టిక్కెట్‌ ఇప్పించడంలో కపిల్‌దేవ్‌ బాబు, భానుగారు ఎంతో సహాయం చేశారు. నేను ఎన్నికలలో పోటీ చేయాలని భాను అనేవారు. ఆయన, కపిల్‌దేవ్‌ బాబు కలిసి బీహార్‌ పార్టీకి నా పేరు రికమెండ్‌ చేసి నా పేరును జనతా పార్టీ కేంద్రీయ ఎన్నికల బోర్డ్‌ పంపించారు. ఎన్నికలలో నిల్చోవడానికి కర్పూరీగారు నా పేరుని పార్లమెంటు నుండి సర్టిఫై చేసి పంపారు. కానీ విజయ్‌ మిశ్రా, మున్షీలాల్‌ రాయ్‌లు నాకు వ్యతిరేకంగా పోటీ చేశారు. క్యాడర్‌ మేము జనతా పార్టీలోనే ఉండాలని ఒత్తిడి చేసింది. కర్పూరీగారితో పనిచేయాలని నా కోరిక. అయితే చివరికి నేను క్యాడర్‌ మాట వినాల్సి వచ్చింది. తప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. సి.సి.ఎం వాళ్ళను కూడా కలవలేకపోయాను. ఒకవేళ ఆ సమయంలో పార్టీలో చేరడానికి అనుమతి ఇచ్చి ఉంటే తాత్కాలికంగా ఆ పార్టీలోకి వెళ్ళిపోయేదాన్ని, ఎన్నికల్లో నిల్చునేదాన్ని కాదు. నేను ఎన్నికలలో నిల్చోవడంవల్ల సి.పి.ఐ.కు చెందిన భువనేశ్వర్‌ బాబు ఓడిపోయారు. అలా కాకుండా ఉండాల్సింది. అంతా వ్యక్తిగత గౌరవ మర్యాదలను దృష్టిలో పెట్టుకుని జరిగింది. భావుకత కూడా దీనికి కారణం. కానీ ఇదంతా జరగకుండా ఉండాల్సింది.

నేను ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సిటు (సెంటర్‌ ఫర్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌) చీఫ్‌ సెక్రటరీ చండీ ప్రసాద్‌ నా దగ్గరికి వచ్చారు. మార్క్సిస్ట్‌ కమ్యూనిస్ట్‌ పార్టీలో చేరినట్లుగా నన్ను ప్రకటించమన్నారు. నేను విధానసభ అధ్యక్షుడికి అప్లికేషన్‌ ఇచ్చాను. విధాన సభ చివరి సెషన్‌లో నేను సి.పి.ఎం. సభ్యురాలిగా పాల్గొన్నాను. చాలామంది కర్పూరీగారి దగ్గరికి వెళ్ళి నాపై ఫిర్యాదు చేశారు. అప్పుడు ఆయన వారితో ”రమణికా గారు ఇంకా ఎదిగారు. కాంగ్రెస్‌ పార్టీలోకి అయితే వెళ్ళలేదు కదా. రూలింగ్‌ పార్టీలోకీ వెళ్ళలేదు. ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళారు. ఆ పార్టీవాళ్ళు మా పక్షమే కదా” అన్నారు.

నిజానికి నేను తప్పు చేశాననే భావన నాలో ఉండేది. అందుకే నేను ఆయనను కలవడానికి వెళ్ళలేదు. ఎన్నికల్లో దమ్‌కిపా నుండి కర్పూరీ గారు నన్ను సమర్ధించే ఒక ముస్లిం వ్యక్తిని నాకు వ్యతిరేకంగా పోటీకి నిలబెట్టారు. ఆయన అలా చేస్తారని నేను ఊహించలేదు. అయినా నేను కర్పూరీగారిని దోషిగా నిలబెట్టను. పార్టీ నేత కావడంవల్ల ఆయన అలా చేయవలసి వచ్చింది.

తర్వాత మేము యూనియన్‌ క్యాడర్‌ సమావేశాన్ని నిర్వహించాము. యూనియన్‌ క్యాడరే నాకు ఆధారం. సిటులోకి వెళ్ళే విషయంలో అభిప్రాయభేదాలు వచ్చాయి. సి.పి.ఎం.లోకి వెళ్ళాక అభిప్రాయ భేదాలు ఇంకా ఎక్కువయ్యాయి. మేము వేరయ్యాము. నేను సిటు సీపీఎంలోకి వెళ్ళిపోయాను. విడిపోయినా మా శాఖలు చాలాదూరం వరకు విస్తరించాయి. హజారీబాగ్‌, ధన్‌బాద్‌, కుజు, అర్‌గడా, రామ్‌గడ్‌, నార్త్‌ కర్ణ్‌పురా, సింగరేలీ, విలాస్‌పూర్‌, అస్సామ్‌లలో శాఖలు తెరవబడ్డాయి. మేము దాదాపు పదివేల మంది కలిసి సిటులో విలీనమయ్యాం.

ఇదంతా ఒక పెద్ద కథ. తర్వాత మార్క్సిస్ట్‌ కమ్యూనిస్ట్‌ పార్టీలో ఉండి పోరాడాము. ఆ పోరాటానికి చారిత్రక విలువ ఎంతో ఉంది. (ఇంకా ఉంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో