ఉద్యోగ రంగంలో స్త్రీ వివక్షతను చిత్రించిన కథలు – డా|| ఓరుగంటి సరస్వతి

సమాజంలో స్త్రీ పురుషులిద్దరూ సమాన భాగస్తులు. సృష్టికి ఇద్దరూ మూలస్తంభాల వంటివారు. మానవజాతి మనుగడ స్త్రీ పురుషుల సహకారం వల్ల, భాగస్వామ్యం, అన్యోన్యత వల్లే సాధ్యమౌతుంది. వేదకాలంలో స్త్రీలు గౌరవించబడ్డారు. కానీ పురాణకాలంలో అణచివేయబడ్డారు. ”నస్త్రీ స్వాతంత్య్రమర్హతి” అని మనుధర్మ శాస్త్రాలు చెప్తున్నాయి. బాల్య వివాహాలు, శాశ్వత వైధవ్యం, స్త్రీ విద్యను నిషేధించడం మొదలైన ఆంక్షలు ఆ రోజుల్లో ఉండేవి. స్త్రీలు కేవలం పురుషులపై ఆధారపడి బిడ్డలను కనే యంత్రాలుగా బతికేవారు.

సమాజంలో తరతరాలుగా స్త్రీల పట్ల సామాజిక మరియు అనేక రకాలుగా వివక్షత కొనసాగుతోంది. దీనికి కారణం పురుషాధిక్య ప్రపంచం, పుట్టినప్పుడు స్త్రీలను తక్కువ హోదా కలిగిన పుట్టుకగా భావిస్తారు. మనుధర్మ శాస్త్రంలో, ఇతర శాస్త్ర పురాణాల్లో, రామాయణాది ఇతిహాసాల్లో కూడా స్త్రీలకు పురుషుడికంటే దిగువస్థాయిన ఉంచే రెండవ శ్రేణి మానవులుగా వర్ణించారు.

”యత్ర నార్యేషు పూజ్యంతే రమంతే తత్రదేవతా” ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలందుకుంటారు. కానీ ఆధునిక కాలంగా చెప్పుకుంటున్న నేడు కూడా స్త్రీలు అనేక రకాల వివక్షతలకు, అణచివేతకు గురవుతూనే ఉన్నారన్నది నగ్నసత్యం. స్త్రీలు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నప్పటికీ వారిపై హింస రోజురోజుకూ కొత్తరూపాల్లో పెరిగిపోతూనే ఉంది. అందుకు నిదర్శనం దిల్లీ గ్యాంగ్‌ రేప్‌ ఘటన ఇంకా కళ్ళముందు కదలాడుతున్న దృశ్యం. ప్రేమ పేరుతో దాడులు, వరకట్నపు చావులు, ఆఫీసుల్లో వివక్షత, అణచివేత మొదలైన అరాచకాలకు స్త్రీలు బలవుతున్నారనడానికి ప్రతి నిత్యం మనం చదివే పత్రికలు, న్యూస్‌ ఛానళ్ళు మనకు సాక్షీభూతాలు. అన్నింటినీ భరిస్తూ, సహిస్తూ కూడా స్త్రీలు తమదైన సత్తాను చాటుతూనే ఉన్నారు.

స్త్రీలకు విద్యను నిరాకరించడం కూడా వివక్షతకు ఒక కారణమని చెప్పవచ్చును. సామాజికంగానే కాక ఆర్థికంగా, రాజకీయ మరియు ఉద్యోగ రంగాల్లో స్త్రీల పట్ల వివక్షత కొనసాగుతూనే ఉంది. స్త్రీ వాదం ఆవిర్భవించిన తర్వాత సాహిత్య రంగంలో అనేకమంది రచయితలు, కవయిత్రులు వివిధ ప్రక్రియల్లో అనగా నవల, కథ, కథానిక మొదలైన వాటిలో ఈ అంశాలను ప్రతిబింబించే రచనలు చేశారు. అంతేకాకుండా స్త్రీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పట్ల సానుభూతి, అనుభూతి, సహానుభూతితో రచనలు చేసినవారు తెలుగు సాహిత్య రంగంలో కోకొల్లలుగా ఉన్నారు. వారి సాహిత్య సృష్టి ద్వారా స్త్రీ తన అస్తిత్వాన్ని గుర్తించి తన ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని చర్చించారు. స్త్రీకి తానంటే ఏమిటి? తాను చైతన్యాన్ని పొందాల్సిన ఆవశ్యకత ఏమిటి? అన్న ఆలోచన కల్పించేలా రచనలు చేస్తున్నారు. స్త్రీలు హింసను, అణచివేతను, అవమానాలను భరించాల్సిన అవసరం లేదని ధైర్యంగా ముందుకు వెళ్ళాల్సిన తీరును కూడా రచయితలు, రచయిత్రులు వారి వారి కథల ద్వారా భిన్నకోణాల్లో చిత్రించారు. స్త్రీలలో రావాల్సిన చైతన్యాన్ని, ఆ దిశగా స్త్రీలు పయనించాల్సిన ఆవశ్యకతను వారి కథల్లో వివరించారు.

1. స్వచ్ఛందంగా గ్రామంలో సేవ చేయడానికి వచ్చిన డాక్టర్‌ శాంతి అనే అమ్మాయిగా గ్రామ పెద్దలు తమ ఆటలు సాగనివ్వడం లేదని, ఇబ్బంది పెట్టిన వైనాన్ని ఇల్లిందల సరస్వతీదేవి గారు ‘డాక్టర్‌ శాంతి’ కథలో చిత్రీకరించారు.

ఈ కథలో శాంతి పేదమ్మాయి. తండ్రి లేకపోయినా తల్లిని ఇబ్బంది పెట్టకుండా అక్షరాస్యతా కార్యక్రమంలో చేరి తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ, కష్టపడి బాగా చదివి మెడిసిన్‌లో సీటు సాధించి, అక్కడ ఓ ప్రొఫెసర్‌ సాయంతో పూర్తి చేస్తుంది. శాంతి తల్లి చనిపోతుంది. పల్లెలలో పనిచేయడానికి వెళ్తామన్న డాక్టర్లకు అనుమతినిస్తారు. శాంతి వైద్యం చేయడానికి పల్లెటూరు వెళ్తుంది. శాంతి వెళ్ళిన ఊళ్ళో ఒక రేకుల షెడ్డులో ఆస్పత్రి పెడ్తారు. ఆస్పత్రిపై నమ్మకం లేక రోగులు రాకపోతే శాంతే స్వయంగా ఇంటింటికీ వెళ్ళి వైద్యం చేస్తుంది. తన వెంట నర్సును, ఆయాను, కాంపౌండరును తీసుకువెళ్తుంది. డాక్టరు శాంతి మీద నమ్మకం కలిగిన కొద్దీ రోగులు ఆస్పత్రికి వచ్చేవారు.

ఆస్పత్రికి ఎదురుగా ఉన్న చెట్లకు పశువులను కట్టేస్తారు. అవి ఆ ఊరి పెద్ద దొరవని తెలిసినా ప్రభుత్వ భూమిలో కట్టడం తప్పనీ మరియు అపరిశుభ్రంగా ఉందని చెప్తుంది. ఆ స్థలంలో విద్యాశాఖ మంత్రి అనుమతితో పాఠశాల పెట్టిస్తుంది. ఆమె ప్రయత్నాలను ఓర్చుకోలేని ఊరి పెద్ద పాఠశాలను తగలబెడ్తాడు.

శాంతి ఆ ఊరికి రాకముందు ఆ ఊరి పెద్ద డాక్టర్లను చేతిలో పెట్టుకుని, మందులన్నీ స్వాహా చేసేవాడు. డాక్టర్‌గా శాంతి వచ్చాక, ఆ పెద్దమనిషి తన ఆటలు సాగడం లేదని ఒకరోజు రాత్రి ఆస్పత్రి తలుపులు పగలగొట్టి మందులన్నీ కాజేస్తాడు. ఊరిని బాగు చేద్దామని స్వచ్ఛందంగా ముందుకువచ్చిన శాంతిపై, ఆమె అజాగ్రత్త వల్ల ఒక గర్భిణీ స్త్రీ చనిపోయిందన్న అక్రమ కేసు పెట్టి జైలులో పెట్టిస్తారు. ఈ విషయం పేపర్లో చూసిన సర్జన్‌ సురేష్‌ శాంతిని నిర్దోషిగా విడుదల చేయిస్తారు. నిష్కల్మషంగా సేవాభావంతో పై స్థాయికి ఎదిగిన శాంతిలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నప్పటికీ ఆసరాగా నిలబడకపోగా, అడ్డుపడే నీచులు ఉన్నంతవరకు పేదలకు కనీస సౌకర్యాలు కూడా అందించలేమన్నది సత్యం.

2. ఇల్లిందల సరస్వతీదేవి గారి మరో కథ ”ఇది ఒకనాటి మాటకాదు” మహిళ ఉన్నత స్థాయిలో ఉంటే గౌరవించని సమాజ నైజాన్ని ఎండగట్టే కథ.

ఈ కథలో మందాకిని డి.ఇ.ఓ.గా బదిలీపై వస్తుంది. ఆమెకు ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి. ఆ ఊరిలో సుబ్బయ్య అనే నౌకరును పనికి కుదుర్చుకుంటుంది. ఇంటి పనులు మొత్తం అతడే చూసుకుంటాడు. ఆఫీసులో మొదటిరోజు ఆఫీసు సిబ్బంది అంతా బాగా మాట్లాడతారు. మందాకిని అక్కడికి బదిలీపై వెళ్ళినందుకు సంతోషపడుతుంది. కానీ కొద్ది రోజుల్లోనే సిబ్బంది నిర్లక్ష్య వైఖరి మందాకినికి నచ్చదు. పైగా మహిళ అన్న ధోరణితో వారు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు.

‘ఒక స్త్రీ అధికారిణిగా వస్తే స్టాఫ్‌ వాళ్ళలో వాళ్ళు ఆమె ముఖం చాటుకాగానే ఆమె జీవిత విశేషాలను గురించి పరిశోధన చేయడం మొదలుపెడతారు. అదే పురుషుడు అధికారిగా వస్తే ఇంత చెడు ఆలోచన, పరిశోధన ఉండదు’ అని మందాకిని అనుకుంటుంది.

ఆమె కోసం ఆఫీసుకి భోజనం తీసుకెళ్ళిన నౌకరు సుబ్బయ్యతో ఆఫీసు సిబ్బంది ‘ఆమెకు పెళ్ళయిందా? ఆయనెక్కడుంటారు? విడిచిపెట్టాడేమో? వేరే పెళ్ళి చేసుకున్నాడేమో?’ అని తీరిక సమయాల్లో అడిగేవారని తెలిసి మందాకిని బాధపడుతుంది. ”అయినా అసలు ఆమె ఎటువంటిది? ఆయన చచ్చిపోయాడేమో? ఈమె ఈ వయసులో డి.ఇ.వో. అయిందా? డైరెక్టు రిక్రూట్‌మెంటేనా? ఎవరైనా మెచ్చి చేశారేమో?” అని నీచమైన ప్రశ్నలు వేసుకునేవారు.

‘ఈ శతాబ్దం చివరికి వచ్చినా స్త్రీని గురించిన ఇటువంటి ప్రశ్నలు అంతరించవు. ఇలా సాగుతూనే ఉంటాయి’.

మందాకిని ఒకరోజు అర్జంటుగా ఫైల్‌ తీసుకురావాలన్నప్పుడు పై అధికారిణిగా మందాకిని చెప్పిన పనిని సిబ్బంది పెడచెవిన పెడ్తారు. వారి వైఖరికి కోపించిన మందాకిని పై అధికారికి లేఖ రాస్తుంది. ఆఫీస్‌ సిబ్బంది కూడా మందాకిని అనవసరంగా తమపై నేరాలు మోపుతోందని ఫిర్యాదు చేస్తారు. విచారణకు వచ్చిన అధికారులు సిబ్బందిని మందలిస్తారు. సిబ్బందిలో నలుగురికి ఇంక్రిమెంట్లు ఆగుతాయి. సిబ్బంది చేత నిలబెట్టి పనిచేయించే మరో డి.ఇ.ఓ. ఆ ఊరికి, మందాకిని మరో ఊరికి ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది.

3. ఆడపిల్లైనా ఆత్మవిశ్వాసంతో తన కాళ్ళపై తాను నిలబడిన యువతి, ఉద్యోగపరంగా విజయాన్ని సాధించినప్పటికీ, ఆ విజయాన్ని గౌరవించని పురుషాహంకార ఆధిపత్య భావజాలాన్ని మృదుల అనే యువతి ఎదుర్కొన్న తీరును రచయిత శ్రీ వంశీకృష్ణ గారు ‘ఎక్స్‌టెన్షన్‌’ అనే కథలో చిత్రించారు. మృదుల గ్రామీణ బ్యాంకు ఉద్యోగిని. ఆమె బ్రాంచి మేనేజర్‌గా

ఉసిరికాయపల్లికి బదిలీ చేయించుకోవాలనుకుంటుంది. అందరూ హేళనగా నవ్వుతారు. ”ఆడపిల్లవి హెడ్డాఫీసులో హాయిగా అకౌంట్స్‌ రీఫైన్స్‌ చూసుకోక” అనే మాటలకు ఆశ్చర్యపోతుంది. దానికి సమాధానంగా స్పందిస్తూ ”ఆడపిల్లని కాబట్టి వెళ్తాను, అక్కడికి వెళ్ళి పురుషుడు చేయలేని పనిని, పురుషుడు విజయం సాధించలేనిచోటే స్త్రీ విజయం సాధిస్తుందని నిరూపిస్తానని, అప్పుడే తనను స్త్రీ గా కాకుండా కనీసం మనిషిగానైనా గుర్తిస్తారని” అంటుంది.

ఉసిరికాయలపల్లి మేనేజర్‌గా చేరినప్పటినుంచి బయటకు వచ్చేంతవరకు క్షణం క్షణం పోరాటమే చేసింది మృదుల. తన సత్తాను నిరూపించుకోవడం కోసం తను స్త్రీ అన్నమాట… కాదు కాదు… మనిషి అన్నమాట మర్చిపోయి బ్యాంకు అభివృద్ధి కోసం గొడ్డులాగా కష్టపడుతుంది. పీకల్లోతు నష్టాల్లో ఉన్న బ్రాంచిని ప్రాఫిట్‌ మేకింగ్‌ బ్రాంచిగా తీర్చిదిద్దుతుంది. ఇంతటి విజయాన్ని సాధించిన స్త్రీని మెచ్చుకోకపోగా, అందాన్ని ఎరగా వేసి డిపాజిట్లను సేకరించిందని నీచంగా మాట్లాడతారు. ఒక్క ఛైర్మన్‌ మాత్రం అభినందించి ఒక పెద్ద అర్బన్‌ బ్యాంక్‌కి మేనేజర్‌గా పోస్ట్‌ చేస్తారు. అర్బన్‌ బ్రాంచి మేనేజర్‌గా ఆమె ఎంతోకాలం లేకుండా, వేరే గ్రామీణ బ్రాంచికి బదిలీ అయిపోతుంది. కారణం ఒక స్త్రీగా విజయం సాధించడం నచ్చని మనుషుల వైఖరి.

4. గర్భవతిగా ఉన్న స్త్రీని కుటుంబం, సమాజం అర్థం చేసుకుని స్పందించని స్థితిని మిడ్కో రేణుక గారు ”పురిటినొప్పులే నయం” కథలో చిత్రీకరించారు.

సుధ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుంది. సుధ గర్భవతి కావడంవల్ల సుధ అత్త, భర్త సంతోషిస్తారు. సుధను డాక్టర్‌ విశ్రాంతి తీసుకోమంటుంది. సుధ తను పనిచేసేచోట 15 రోజుల సెలవు అడగగా, అందుకు కళాశాల ప్రిన్సిపాల్‌ ఒప్పుకోకపోగా పర్మనెంట్‌గా సెలవు తీసుకోమంటాడు. కానీ ఉద్యోగం పోతే దొరకదని సుధ వెళ్తుంది.

చివరకు ఇంట్లో కూడా అలసటగా ఉండి నిద్రపోతే ”ఎక్కడా లేదు విడ్డూరం” అని అత్త, ”అమ్మకు పనిలో సహాయం చేయవచ్చుగా” అని భర్త అంటారు. గర్భవతని కాసింత విశ్రాంతి అవసరమని ఎవరూ అనరు. ఒకరోజు బస్సులో ప్రయాణిస్తూ సుధ వాంతి చేసుకుంటుంది. తోటి ప్రయాణికులు తిడతారే తప్ప అర్థం చేసుకోరు. వారి అమానవీయ పరిస్థితిని సుధ జీర్ణించుకోలేకపోతుంది. సుధకు మగపిల్లాడు పుట్టాక కొడుక్కి తండ్రి అయ్యానని భర్త, మనవడికి నాయనమ్మనయ్యానని అత్త సంతోషపడతారు. గర్భవతిగా ఉన్నప్పుడు తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలు వేవిళ్ళకంటే అసహ్యకరమైనవనీ, పురిటి నొప్పులకంటే బాధాకరమైనవని ఆలోచిస్తుంది. ”వీటన్నింటికంటే పురిటినొప్పులే నయం” అనుకుంటుంది.

5. భర్తతోపాటు సమానంగా ఉద్యోగం చేస్తూ కూడా ఆర్థిక స్వేచ్ఛను పొందలేని దుస్థితిని మరియు భర్త అహంకారానికి తలొగ్గని స్త్రీ తన ఆత్మాభిమానాన్ని చంపుకోలేక పోతుంది. భర్తను వదిలి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళిన రజనీ గాథను ముదిగంటి సుజాతారెడ్డిగారు ‘మోక్షం’ కథలో చిత్రీకరించారు.

శ్రీకాంత్‌, రజనీ భార్యాభర్తలు. ఇద్దరూ ఉద్యోగస్తులే. అయినా భర్త ఏదో ఒక రకంగా రజనీని వివక్షతగానే మాట్లాడతాడు. ఒకరోజు రజనీ తనకు నచ్చిన చీర కొనుక్కున్నందుకు ”నెలకెన్ని చీరలు తగిలేస్తావే? ఇట్లా డబ్బు దండగ చేసేందుకేనా నువ్వు ఉద్యోగం చేస్తున్నది” అని శ్రీకాంత్‌ రజనీని కసురుకుంటాడు. ఇంట్లో ఏ కొత్త ఖర్చు వచ్చినా తన జీతం నుంచి ఒక్క పైసా కూడా తీయడు. ఏ ఖర్చుకైనా రజనీ డబ్బే ఖర్చు చేయాలంటాడు. తన జీతం ఎందుకివ్వాలని రజనీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ”నేను నీ భర్తను, అందుకే ఇవ్వాలంటాను. మొగుణ్ణి, మగాడ్ని! ” అంటాడు. ”కేవలం మగాడైనంత మాత్రాన ఆడది బానిస అని అనుకోకండి” అని రజని కోపంతో అంటుంది. సంపాదిస్తున్నందుకు పొగరని రజనీని శ్రీకాంత్‌ తిడతాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరుగుతుంది. రజనీ ఇక భర్త మాటలు వినలేకపోతుంది. ”రోజూ నానా మాటలు వింటూ ఈ ఇంట్లో పడి ఉండి అతనికి వండిపెడ్తూ, భయపడ్తూ, చాకిరీ చేస్తూ ఎందుకుండాలి?” రజని మనస్సు ఎదురు తిరిగింది. ఆ తిరుగుబాటుతో పాటు ఆమెలో దుఃఖం ఉప్పొంగింది. పెద్దగా ఏడ్వాలనిపించింది. కానీ ఏడ్వలేకపోయింది. కన్నీళ్ళన్నీ ఇంకిపోయినట్లనిపించింది. ఆమె మనస్సు అతని చేతలతో, మాటలతో విసిగిపోయింది. ఓపిక నశించింది. దీన్నించి తనకు విముక్తి కావాలి. ఈ మానసిక హింస, స్నేహం, ప్రేమ లేని వాతావరణం నుంచి మోక్షం కావాలని నిర్ణయించుకుంది. భర్తతోపాటు సమానంగా ఉద్యోగం చేస్తే కూడా ఆర్థిక స్వేచ్ఛను పొందలేని స్థితిని, ఆ దిశగా చైతన్యం పొందాల్సిన ఆవశ్యకతను ఈ కథలో చిత్రీకరించారు. అన్ని రంగాల్లో కూడా స్త్రీలు వారి సత్తాను చాటుతున్నారు. ఎంత అభివృద్దిని సాధిస్తున్నప్పటికీ ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలు మహిళలుగానే కాకుండా ఉద్యోగాలు చేస్తూ కూడా వివక్షతకు గురవుతూనే ఉన్నారు.

స్త్రీలకు ఉద్యోగ, సంసార బాధ్యతలు రెండూ నెట్టుకు రావడం కత్తిమీద సామే. ఇంటి చాకిరీ, బయట పనితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉద్యోగం చేసే మహిళలపై లైంగిక దాడులు కూడా జరుగుతూనే ఉన్నాయి. అవి మితిమీరి ప్రాణం తీసేవరకూ వెళ్తున్నాయి. ఉద్యోగం చేసే మహిళలకు భద్రత లేదు. కొందరు సహోద్యోగులు, ఉన్నతాధికారులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. మహిళా ఉద్యోగినుల పట్ల పురుషుల ఆలోచనల్లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగం చేసే స్త్రీ భార్యగా రావాలని ఎక్కువమంది పురుషులు కోరుకుంటారు. పితృస్వామ్య భావజాలం నరనరాన జీర్ణించుకుపోయిన పురుషులున్నప్పటికీ సమాజ పోకడలను అర్థం చేసుకుని ఉద్యోగం చేస్తున్న భార్యలకు అండగా నిలబడి, చేయూతనివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భార్య జీతానికే కాదు మనోభావాలకూ గౌరవమివ్వాల్సిన అవసరం ఉంది.

పై అధికారుల ఓర్వలేనితనం, ఓ స్త్రీ పెద్ద అధికారి కావడం నచ్చనితనం ఇవన్నీ కారణాలుగా చెప్పవచ్చు. ఎన్నో రకాలుగా హింసలను, వివక్షతలను ధైర్యంగా ఎదుర్కొని స్త్రీలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న సందేశాన్ని ఈ కథలు అందించాయి. స్త్రీ అన్ని రకాలుగా తన బాధ్యతను విజయవంతంగా పోషిస్తుంది. ఆ దిశగా పయనాన్ని సాగించే స్త్రీకి అన్నిరకాలుగా చేయూతను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. ఈ అంశానికి సంబంధించి శ్రీ ఇల్లిందల సరస్వతీదేవి ‘డాక్టర్‌ శాంతి’ కథలో శాంతిలా, ‘ఇది ఒకనాటి మాటకాదు’ కథలో మందాకినిలా, శ్రీ ముదిగంటి సుజాతారెడ్డి ‘మోక్షం’ కథలో రజనిలా, వంశీకృష్ణగారి ‘ఎక్స్‌టెన్షన్‌’ కథలో మృదులలా, మిడ్కో రేణుక గారి ‘పురిటినొప్పులే నయం’ కథలో సుధలా చైతన్యం కలిగి, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలన్న సందేశాన్ని ఇవ్వడమే ఈ కథల ముఖ్య ఉద్దేశం.

 

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో